Friday, 29 May 2015

నీరు - చెట్టు


- ప్ర‌తి నీటి బొట్టూ‌...ప‌చ్చ‌ని చెట్టు‌కి!
            నీరే మనిషికి జీవనాధారం, చెట్లు - ప్రగతికి మెట్లు, ప్రకృతి సమతౌల్యం ప్రపంచానికి హితం, మనిషి ఎవరితో స్నేహం చేయకపోయినా పరవాలేదు కానీ, పర్యావరణానికి మాత్రం మిత్రుడిగా ఉండి తీరాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఎకో ఫ్రెండ్లీ ఇల్లుతో తనవంతు బాధ్యతని నిర్వర్తిస్తున్నారు డాక్టర్‌ ఎస్‌.వి. రమణ. ఇంతకీ ఆయన ఏం చేశారు...
            తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఒకటే ఉరుకులు, పరుగులు. ఏం చేస్తున్నాం... ఎంత సంపాదిస్తున్నామన్నది తప్ప, ప్రకృతి ఏమౌతోంది, పర్యావరణం ఎంత ప్రమాదకరంగా మారుతున్నది అనే విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఆ వైద్యుడు మాత్రం అందరిలా కాకుండా పర్యావరణ హితంగా ఎకో ఫ్రెండ్లీ ఇల్లును కట్టారు. ఆ ఇంటితో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 
వాననీరు ఆదా, మొక్కల పెంపకాల్లో కొత్త పుంతలు తొక్కుతూ విశేషంగా కృషి చేస్తున్నారు. స్వచ్ఛమైన వర్షపునీటిని ఒడిసిపట్టి, దాంతో ఇంటిని పచ్చని నందనవనంగా మార్చేశారు. దాదాపు 3వేల మందికి మొక్కలు పంచి, వాటి ఆవశ్యకతను చాటిచెప్పారు. ఈ ప్రకృతి ప్రియుడు చెబుతున్న స్ఫూర్తిదాయకమైన ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
            నా పేరు డాక్టర్‌ ఎస్‌వి రమణ. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పిహెచ్‌సిలో వైద్యాధికారిగా పని చేస్తున్నాను. జిల్లా కేంద్రంలోని పిఎస్‌ఆర్‌ కాలనీలో ఉంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలన్నా... వాటిని పెంచడమన్నా చాలా ఇష్టం. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆ తరువాత అందరిలాగే నేనూ ఒక ఇల్లు కట్టాలనుకున్నాను. ఆ ఇంటితోనే ప్రస్తుత సమాజానికి, తోటి వారికి ఒక సందేశం ఇవ్వాలన్నది నా లక్ష్యం. ఎంతో మంది ఇంజనీర్లతో మాట్లాడాను. కానీ చివరిగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ విశ్వనాధ్‌ సలహాలతో ఆర్కిటెక్ట్‌ సహకారంతో ఇంటి నిర్మాణం ప్రారంభించాను. తొలుత ఇంటికి రెండు వైపులా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశాను. ఆ ప్రాంతంలో నేలమీద పడే ప్రతి వర్షపు చుక్కను నిల్వచేసేందుకు ఇది తోడ్పడుతుంది. దీంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా చేయొచ్చన్నది నా ఆశ. తరువాత ఎక్కడికి వెళ్లినా ఒక మొక్కను తెచ్చి ఇంట్లో నాటడం మొదలు పెట్టాను.
            అంతే... ఈ రోజు నా ఇల్లు ఎకోఫ్రెండ్లీ పరిరక్షణకు నాందిగా మారింది. నందనవనంలా తయారయ్యింది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం నా సొంతమైంది. దీని కోసం ఎంతో శ్రమించాను. ఖాళీగా ఉన్నప్పుడు నేనే ఒక తోటమాలిగా మారతాను. ఈ రోజు నేను లెక్కపెట్టలేనన్ని మొక్కలు నా ఇంట్లో ఉన్నాయి. 100 జాతులకు పైగా మొక్కలు పెంచుతున్నాను. నా పెరట్లోనే కాకుండా పడక గదిలోనూ మొక్కలు పెంచే పద్ధతులను అవలంభిస్తున్నాను. హుదూద్‌తో చాలా వరకు మొక్కలు దెబ్బతిన్నాయి. కానీ తక్కువ సమయంలోనే వాటిని తిరిగి బతికించాం. నాతో పాటు నా కారుడ్రైవరు, తోటమాలి ఎంతో కష్టబడ్డారు. నా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ మొక్కలను పెంచమని చెబుతుంటాను. నిజానికి నా ఇల్లే ఒక పెద్ద సందేశం.
గృహ ప్రవేశం సమయంలో 3వేల మొక్కలు పంపిణీ
ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత గృహ ప్రవేశానికి బంధువులను, స్నేహితులను పిలిచాను. వచ్చిన వారికి ఇతర బహుమతులు కాకుండా నూజువీడు నుంచి 3వేల మొక్కలను తీసుకొచ్చి అందరికీ అందజేశాను. ఈ రోజు ఎవరు కనిపించినా మీరిచ్చిన మొక్కలు బాగున్నాయని చెబుతున్నారు. అలా విన్నపుడు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను నాటినా...స్వఛ్చ భారత్‌, నీరు-చెట్టు లాంటి కార్యక్రమాల కంటే మంచి ఫలితాలను సునాయాసంగా సాధించవచ్చు.
ఇంట్లోనే కాయగూరలు
ఇంట్లోనే కుటుంబానికి సరిపడా ఆరోగ్యకరమైన కాయగూరలు పండిస్తున్నాను. ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండా సేంద్రీయ విధానంతోనే కూరగాయలు పండుతున్నాయి. వ్యవసాయాధికారులతో భూసార పరీక్షలు నిర్వహించి వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆనప, బీర, తోటకూర, పాలకూర, పచ్చిమిర్చి, కాకర వంటి ఎన్నో కూరగాయలను సీజన్లను బట్టి పండిస్తున్నాం.బంధువులకు, స్నేహితులకు కూరలు ఇచ్చి, మొక్కలు పెంచాలని చెబుతున్నాం.
నీరు-చెట్టూ ఆవశ్యకత అందరికీ తెలియాలి
ఇంటి నిర్మాణ ప్లాన్‌కి అనుమతి ఇచ్చేటప్పుడు ఇంకుడు గొయ్యి ఏర్పాటు నిబంధనని పాటించారా లేదా చూడాలి. కానీ ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ప్రతి గృహ ప్రవేశంలోనూ నీరు-చెట్టు ఆవశ్యకతపై చర్చ జరగాలి. మన వంతుగా మొక్కలు నాటడం సమాజం పట్ల మనకున్న బాధ్యత. పదండి... మనిషికొక మొక్కను నాటుదాం.
- వి.నాగరాజు, 
విజయనగరం, ప్రజాశక్తి ప్రతినిధి