Wednesday, 7 November 2012

చేపల.. రొయ్యల పెంపకం.. ప్రయోజనాలు.. ప్రతిబంధకాలు



చేపలు, రొయ్యల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ముఖ్యమైంది. దీని వార్షిక సగటు అభివృద్ధి 10 శాతం పైగా వుంది. 1950-51లో కేవలం 7.5 లక్షల టన్నులుగా వున్న చేపల ఉత్పత్తి 2010-11 నాటికి 85 లక్షల టన్నులకు పైగా పెరిగింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 5.7%, ఎగుమతుల్లో 5.3% ఈ రంగం నుండే సమకూరుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల్లో వీటి విలువ 18 శాతం. జాతీయ వినియోగం వేగంగా పెరుగుతుంది. ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఎఓ), ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఈ శతాబ్ధంలో చేపల, రొయ్యల కొరత పెరుగుతుంది. చేపల పెంపకాన్ని వరిసేద్య సమన్వయంతో చేపట్టే పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఫలితాలు అనుకున్నట్లుగా అందుబాటులోకి తేగలిగితే మన ఆహారంలో చేపల వినియోగం ఎంతో మారిపోతుంది. అందువల్ల, ఈ రంగం పెరుగుదలకు మరెన్నో అవకాశాలు వున్నాయి. ఈ నెల 5-7 మధ్య విశాఖపట్టణంలో జరిగిన జాతీయ మత్స్యకారుల మహాసభల నేపథ్యంలో చేపల, రొయ్యల పెంపకంలో ఇమిడి వున్న కీలకాంశాలను మీ ముందుకు తెస్తుంది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.

చేపల, రొయ్యల పెంపకం విస్తరించడానికి మన దేశంలో ఎన్నో అవకాశాలు వున్నాయి. తీర ప్రాంతం 8,129 కి.మీ. పొడవునా వుంది. ఆక్వా కల్చర్‌కు నదుల సముద్ర సంగమ ప్రాంతం (ఎచ్యూరీస్‌) 39 లక్షల హెక్టార్లు, ఉప్పు భూములు 25.4 లక్షల హెక్టార్లు, మడ అడవులు ఐదు లక్షల హెక్టార్లు అనుకూలం. ఇదేకాక భూభాగం లో మరో 80 లక్షల హెక్టార్ల మేర ఆక్వా కల్చర్‌కు అనుకూలమైన ఉప్పు భూములు న్నాయి. వీటిలో జీవవైవిధ్యం ఎక్కువగా వుంది. ఇంత విస్తారంగా సముద్ర తీరప్రాం తం వున్నప్పటికీ మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల వేట నుండి లభించేది 41% మాత్రమే. మిగతా చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచబడుతున్నాయి.
మన దేశంలో చేపల్ని ఆహారంగా తీసుకునేవారు 56% మాత్రమే. వీరి తలసరి వార్షిక వినియోగం తొమ్మిది కిలోలు. ప్రపంచ జనాభా వార్షిక తలసరి వినియోగం 12 కిలోలు. దేశ జనాభా తలసరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ అంతర్గతంగా చేపల గిరాకీ కూడా క్రమంగా పెరుగుతుంది. అందువల్ల వ్యవసాయోత్పత్తిలో చేపల రంగం ప్రాధాన్యత క్రమంగా పెరుగుతుంది.
గరిష్ట చేపల వేట..
సాంప్రదాయ పద్ధతిలో మత్స్యకారులు సముద్రంలో వేటాడిన కొద్దీ దొరికే చేపలు పెరిగేవి. ఈ దశలో సముద్రంలో వేటాడే చేపల కన్నా చేపల పునరుత్పత్తి చెందే సంఖ్య అధికంగా వుండేది. దీనివల్ల మత్స్యకార్మికులు చేపల సేకరణలో ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. ఈ చేపల సేకరణను పెంచేందుకు యాంత్రిక బోట్లను ప్రవేశపెట్టడంతో ప్రారంభంలో వీటి సేకరణ పెరిగింది. కానీ ఈ బోట్ల సంఖ్య బాగా పెరగడంతో చేపల పునరుత్పత్తిశక్తి సేకరణశక్తి కన్నా తక్కువస్థాయిలో ఉండటంవల్ల చేపల సేకరణ తగ్గింది. దీంతో సముద్ర చేపల ఉత్పత్తి అస్థిరంగా మారింది. ఇది భవిష్యత్తుకు ఒక ప్రమాద ఘంటిక.
సముద్ర చేపల పునరుత్పత్తి పెరుగుదలను సముద్రనీటి ప్రవాహం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ పొరలు, జీవావరణం, పర్యావరణాల తుల్యత ప్రభావితం చేస్తున్నాయి. అత్యంత సమర్ధవంతమైన సాంకేతికాలతో మానవుడు జోక్యం చేసుకోవడంతో (యాం త్రిక బోట్లు, ఇతర సాంకేతికాలు) చేపల సేకరణ సుస్థిర స్థాయికన్నా బాగా పడిపో యింది. కానీ, చేపల, ఇతర సముద్ర ఉత్పత్తులకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో సముద్ర కాలుష్యం చేపల పునరుత్పత్తిని దెబ్బతీస్తుంది. దీనికి ప్రధా నంగా పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య విషపదార్థాలు, మలమూత్రాల విడుదల కారకా లుగా వున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్రంలో జీవవైవి ధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ లోటును పూడ్చుకొని, పెరుగుతున్న గిరాకీని తీర్చడానికి చేపల, రొయ్యల పెంపకానికి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పెంపుకు మన దేశంలో విస్తారమైన అవకాశాలున్నాయి. దీనికోసం మామూలుగా సేద్యానికి పనికిరాని భూముల్నే వినియోగిస్తున్నాం. చేపల పెంపకానికి అనువైన భూముల్లో కేవలం 15% వరకూ మాత్రమే ఇప్పుడు ఆక్వా కల్చర్‌కు ఉపయోగిస్తున్నాం. అంటే, ఆక్వా కల్చర్‌ను ఇంకా విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయి.
పెరుగుతున్న అవసరాలు..
ఇప్పటికన్నా (2010-11) రొయ్యల తలసరి వినియోగం 2020 నాటికి 0.3 కిలోలు, అధిక విలువగల చేపల తలసరి వినియోగం 1.2 కిలోల మేర పెరుగుతుం దని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఇవి వరుసగా 0.5 నుండి 0.6 కిలోల వరకూ 1.5 కిలోల స్థాయికి పెరగవచ్చంటున్నారు. చేపల వినియోగం సంవత్సరం పొడుగుతూ ఒకే స్థాయిలో వుంటుంది. కానీ, లభ్యత ఒకే విధంగా వుండదు. హెచ్చు తగ్గులలో వుంటుంది. ముఖ్యంగా, సముద్రంలో వేట నిషేధకాలంలో చేపల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఉత్పత్తి, డిమాండ్‌ మధ్య తేడా ల్ని తట్టుకోడానికి బఫర్‌ నిల్వలు, వీటికి అవసరమైన కోల్డ్‌ స్టోరేజి గోడౌన్లు అవసరం.
ఆటంకాలు..
రొయ్యల ఉత్పత్తి పరిమాణంలో తక్కువగా వున్నప్పుటికీ ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఎగుమతుల్లో వీటి పరిమాణం కేవలం 20 శాతమే అయినప్పటికీ వీటివల్ల వచ్చే ఆదాయం 40 శాతం. దీనికి విరుద్ధంగా చేపల ఎగుమతి 40 శాతం వున్న ప్పటికీ వచ్చే ఆదాయం 20 శాతం మాత్రమే. కానీ, రొయ్యలకు వస్తున్న జబ్బులు, ముఖ్యంగా 'వైట్‌స్పాట్‌ సిండ్రోమ్‌ (తెల్లమచ్చల వైరస్‌)' రొయ్యల పెంపకాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి రాగల అవకాశం 49 శాతం మేర వుంది. ''లూమినియస్‌ బ్యాక్టీరియల్‌'' వ్యాధుల వల్ల కూడా నష్టాలు అధికంగా వున్నాయి. ఇదే సమయంలో తగ్గిపోతున్న ధరలు 'టైగర్‌ రొయ్యల' పెంపకందార్లను నష్టపరిచాయి. ఫలితంగా వీటి పెంపకం మన రాష్ట్రంలో 60 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిలిపేయడం జరిగింది. దీనికి బదులుగా కొత్తరకం 'వెన్నామి' రొయ్యల్ని ప్రవేశపెట్టారు. ఇపుడు ఈ రకం రొయ్యలను దాదాపు 34 వేల హెక్టార్లలో పెంచుతున్నారు.
రొయ్యల పెంపకంలో మేత ఖర్చు అధికంగా వుంటుంది. దీనిలో 'ఫిష్‌మీల్‌ (చేపల తో తయారయ్యే రొయ్యల మేత)' ఖరీదైంది. ఫిష్‌మీల్‌కు బదులు వృక్ష సంబంధమైన మాంసకృత్తులు వాడి ఆమేర ఖర్చును తగ్గిస్తున్నారు. చేపల, రొయ్యల ఎగుమతి కోసం ఒక రకం మీదే ఆధార పడకుండా కొత్తరకాల్ని ప్రవేశపెడుతూ ఇబ్బందుల్ని అధిగమిస్తున్నారు. ఇలా వచ్చిందే 'వెన్నామి' రొయ్య రకం. దీనితో పాటు పీతల్నీ, 'ఫిన్‌ఫిష్‌', 'సీబాస్‌'లను పెంచుతున్నారు. వీటి గుడ్లను, పిల్లలను నియంత్రిత వాతావరణంలో తేలిగ్గా ఉత్పత్తి చేయవచ్చు.
మానవ వనరులు.. ఆదాయం..
ఆక్వా కల్చర్‌ 90% చిన్నకమతాల్లోనే అవుతోంది. దీనిమీదే దాదాపు మూడుకోట్ల మంది జీవిస్తున్నారు. వీరు పేదలు. వీరు పెట్టుబడి, ఉత్పత్తికి, మార్కెటింగ్‌కి ఇబ్బం దులుపడుతున్నారు. వీటిని అధిగమించడానికి సామూహిక పెంపకాన్ని (గ్రూపు ఫామింగ్‌) ప్రోత్సహిస్తున్నారు. వీళ్లకు అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు, ఉత్పత్తి అమ్మకాలకు సమిష్టి సౌకర్యాల్ని కలగజేస్తున్నారు. ఈ విధమైన పెంపకాన్ని తమిళ నాడు, కేరళ, మన రాష్ట్రంలోనూ ఎన్‌బిడిఎఫ్‌ (నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఫిషరీ డెవలప్‌ మెంట్‌) సమన్వయం చేస్తుంది. ఉత్పత్తిని శుద్ధి చేయడానికి, అమ్మకానికి, కావల్సిన మౌలిక సౌకర్యాల్ని ఏర్పర్చడానికి ఈ బోర్డు సహాయం చేస్తుంది. ఇటీవల వినిమయ దారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారుల వాటా క్రమంగా పెరుగుతుంది. ఇది సానుకూలాంశం.
చేపల ఉత్పత్తిలో కంటే శుద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. కేవలం రొయ్యల పెంపకంలో 14 లక్షల కుటుంబాలకి ఉపాధి లభిస్తుంది. ఈ చేపల, రొయ్యల పెంపకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ, మత్స్యకారుల జీవన స్థాయిలో మాత్రం ఎటువంటి మార్పూ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ మత్స్యకారుల దగ్గర నైపుణ్యం పెరగకపోవడమే. పైగా వీరి వద్ద అవసరమైన వనరులు, ఉత్పత్తి సాధనాలు కూడా లేవు. మత్స్యకార సంఘాలు ఏర్పర్చినప్పటికీ ఇవి స్వార్థపరశక్తుల ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. ఫలితంగా, చేపల వల్ల వచ్చే ఆదాయంలో మత్స్యకారులకు రావాల్సిన న్యాయమైన వాటా రావడం లేదు.

పోషక విలువలు..
చేపలు ఉత్తమపోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనో యాసిడ్లు లభిస్తాయి.
చేపల రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి.
సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు, ఎముకల పెరుగుదలకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, విని యోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా వినియోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌లు అధికంగా లభిస్తున్నాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.

ఆంధ్రప్రదేశ్‌లో..
మన రాష్ట్రం చేపల ఉత్పత్తిలో ప్రథమ లేక ద్వితీయ స్థాయిలో కొనసాగుతుంది. 2010-11లో దాదాపు 14.5 లక్షల టన్నుల చేపలు-రొయ్యల ఉత్పత్తి అయిందని అంచనా. డెల్టా ప్రాంతంలో సాంద్ర చేపల పెంపకం ఈ అధికోత్పత్తికి తోడ్పడింది. దాదాపు 20 లక్షల మంది మత్స్యకారులకు, కార్మికులకు చేపల పెంపకమే జీవనాధారం.
మంచినీటి చేపలు, రొయ్యలు పెంచడానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 2010 అంతానికి 64,545 ఎకరాల్లో చేపల పెంపకానికి రిజిష్టర్‌ చేయబడింది. చేపల సహకార సంఘాలకు సబ్సిడీతో చేప పిల్లల సరఫరా, ఇతర ప్రోత్సాహకాల ద్వారా అధికోత్పత్తి సాధ్యమైంది.
ఏప్రిల్‌-మే మాసాలలో సముద్ర చేపల పట్టడానికి నిషేధించిన సమయంలో ఉచిత ఆహార ధాన్యాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మహిళా మత్స్య మిత్ర గ్రూపుల్లో దాదాపు 18వేల మత్స్యకార్మిక మహిళలు సభ్యులుగా ఉన్నారు.

మీకు తెలుసా..?
- అతి తక్కువ ఆహారాన్ని వినియోగిస్తూ చేపలు పెరుగుతాయి. మురుగునీరు, బురదలో కూడా పెరుగుతాయి.
- ప్రతి కిలో బరువు పెరుగుదలకు చేప కేవలం 1.1 కిలోల ఆహారాన్ని తీసుకుంటుంది. ఇదే మాంసం ఉత్పత్తికి కోడి 2.5 కిలోల ఆహారం అవసరం.
- నీటిలో నిలిచి వుంటూ నీటి ఉష్ణోగ్రతకు దగ్గరగా శరీర ఉష్ణోగ్రత ఉండడంతో చేపలు తక్కువ ఆహారంతోటే పెరుగుతాయి. ఇదే కోళ్ల విషయంలో అవి నిలుచుని, తిరుగుతూ శరీర ఉష్ణోగ్రతను పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెరుగుదలకు ఎక్కువ ఆహారాన్ని కోళ్లు తీసుకుంటాయి.
- తీర ప్రాంత అభివృద్ధి మండళ్ల పేరుతో పరిశ్రమలకు, ఓడరేవుల నిర్మాణానికి అనుమతులిస్తున్నారు. ఇది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది. వీరు మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నెల్లూరు ప్రాంతంలో ఒకేచోట 27 థర్మల్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతిచ్చారు. వీటివలన ఈ ప్రాంత జీవావరణం దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిశ్రమలు వ్యర్థాలను, వేడి నీటిని సముద్రంలోకి వదులుతాయి. దీనివల్ల సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అంతిమంగా ఇవన్నీ కూడా చేపల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
- 'కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ'- ఇది తీరప్రాంతంలో చేపల పెంపకాన్ని నియంత్రిస్తుంది.
- 'ఎంపెడా'- సాధికార సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ).
- 'సీబా'- ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపక పరిశోధనా సంస్థ (సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ బ్రాకిష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌).

No comments:

Post a Comment