Wed, 7 Nov 2012, IST
-
ఎందుకని? - ఇందుకని!
ఓ మోస్తరు వేడిగా వున్న వస్తువుల విషయంలోనే మీరన్న తేడా కనిపిస్తుంది. కానీ బాగా వేడిగా ఆవిర్లు కమ్మే విధంగా ఉన్న ఆహారపదార్థాల్ని తిన్నప్పుడు నాలుక మీద పడితే విపరీతంగా కాలినట్లు అనిపించడం వల్ల వెంటనే ఊసేస్తాము. కానీ పొరపాటున ఊసేయకుండా మింగేస్తే గొంతు, ఆహారవాహిక (esophagus) దగ్గర కూడా ఆ వేడిగా ఉన్న భావన చల్లారదు.
ఓ మోస్తరు వేడిగా ఉన్న వస్తువును నోట్లో వేసుకున్నపుడు ఆ వేడికి నాలుకమీదున్న రుచి గుళికలు (taste buds) స్పర్శనాడులు (touch nerves) ప్రేరేపణకు గురవుతాయి. వెంటనే అవి మెదడుకు సంకేతాలు పంపడం వల్ల 'నోరు మండేలా వేడి ఉన్న' భావనను మెదడు నుండి పొందుతాము. మెదడులోని ఫలితాలే మన భావాలన్న విషయం మరవొద్దు. ఇలా వేడిగా ఉన్న వస్తువును అలాగే ఉంచుకోకుండా నోటిలో అటూయిటూ నాలుకతో నోటిలోనే కదిలిస్తాము. ఈ సందర్భంగా వేడి పదార్థాల్లో ఉన్న అధిక ఉష్ణం 'ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమం (zeroeth Law of Thermodynamics) ప్రకారం నోటిలోకి శోషించబడుతుంది. అంటే ఎంతో కొంతమేరకు నోటిలోని లాలాజలం (saliva), అంగిటి (palate), నాలుక, దవడలు, పళ్లు ఆ వేడిపదార్థాలలోని వేడిని గ్రహించి ఆ పదార్థాల వేడిని తగ్గించుతాయి. అటుపిమ్మట గొంతులోకి వెళ్లినపుడు ఆ పదార్థాలు అంత వేడిగా అనిపించవు. అంతేకాకుండా గొంతులోకి వెళ్లాక ఆహారపదార్థాలు అక్కడే కాసేపు నిలకడగా ఉండవు. వెనువెంటనే పెరిస్టాలిక్ కదలికల ద్వారా జఠరకోశం లేదా పొట్ట (stomach) లోకి చేరతాయి. కాబట్టి కొంతలో కొంత వేడిగానే ఉన్నా ఆ భావనను గ్రహించేంత సంధాన సమయం (interactive time) ఆహారవాహిక గోడల్లోని నాడులకు ఉండదు. పైగా నోటిలోను, చర్మం మీద ఉన్నంత అధికస్థాయిలో, సంఖ్యలో స్పర్శానాడులు ఆహారవాహికలో ఉండవు.
భూమి భ్రమణ, పరిభ్రమణాలు సాగిస్తుంది. విమానం భూమిని వదిలి పైకి ఎగిరినప్పుడు భూభ్రమణ, పరిభ్రమణాలు ఉంటాయి కదా? విమానయానం ఎలా సాగుతుంది?
కారులో కూర్చుంటేనే కారుతో పాటు మనం వెళ్తున్నట్లు, బర్రె మీద కూచున్న కాకి బర్రెతోపాటు వెళ్తున్నట్లు, బస్సుకు బయట మనముంటే బస్సే వెళ్తుందిగానీ మనం ఉన్నచోటే ఉంటాం కదా! అన్నట్లు అనుకున్నప్పుడే మీకొచ్చిన సందేహం ఓ ప్రశ్నలాగా మిగిలిపోతుంది. కేవలం ఓ వాహనంతో భౌతికస్పర్శ ఉంటేనే మనం వాహనంతోపాటు కదుల్తున్నట్టు భావించడం వాహనాల విషయంలో సబబేగానీ గాలిలో ఎగురుతున్న విమానం నేలవిడిచి సాము చేస్తున్నట్టు స్వతంత్రమైన వస్తువుగా భావించకూడదు. భౌతికంగా ఘనరూప నేలతో స్పర్శ లేకున్నా విమానం భూమి వాతావరణంతో స్పర్శలో ఉన్నట్టే. భూమ్మీద ఉన్న సముద్రాలలో ఉన్న ద్రవరూప నీటిమీద పడవ వెళ్తున్నప్పుడు భూమి భ్రమణ, పరిభ్రమణాలకూ సముద్రంలో నీటిమీద నావ ప్రయాణానికీ ఇదేవిధమైన సందేహం మీకు రాలేదు చూశారా. కేవలం కనిపించే వస్తువులతో వున్న పాదార్థిక బంధాన్నే మీరు పరిగణనలోకి తీసుకున్నారు. కనిపించని గాలి కూడా నేలలాగే, సముద్రపు నీరులాగే భూమికి సంబంధించిన పదార్థమని మరువకండి. గాలిని విడిచి విమానం సాము చేయలేదు. శూన్యం(vacuum) లో కేవలం రాకెట్లు వెళ్తాయిగానీ విమానాలు వెళ్లలేవు. విమానం కన్నా ముందు ఓ ఉదాహరణను తీసుకుందాం. మీరు సమవేగం (uniform velocity) తో వేగంగా వెళ్లే ఓ రైలు బోగీలో పై బెర్తుమీద ఉన్నారనుకుందాం. అపుడు ఉన్నట్టుండి మీ సెల్‌ఫోను జారిపడిందనుకుందాం. అపుడది కాసేపు గాల్లో ఉంది. రైలు మాత్రం ముందుకెళ్తూనే ఉంది. అంతమాత్రాన అది పక్కబోగీలో ఉన్న కింది బెర్తుమీద పడదు. మీ బోగీలోనే ఉన్న కింది బెర్తుమీద పడుతుంది. పొడవాటి తాటిచెట్టు మీద నుంచి ఉన్నఫళాన ఓ తాటికాయ ఊడిపడ్తుందనుకుందాం. కాసేపు అది భూమికి, చెట్టుకు సంబంధం లేకుండా గాల్లో ఉంది. ఈలోగా భూమి కొంత భ్రమణం, పరిభ్రమణం చేసింది. అంతమాత్రాన అది పక్కపొలంలో ఉన్న మామిడి చెట్టు కింద పడుకున్న మూలిగే నక్కపై పడదు. ఆ తాటిచెట్టు కిందే పడుతుంది. ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ భూమి కదలికతో పాటే ఉంటుంది. హెలికాప్టరు పైకి ఎగిరితే భూమ్యాకర్షణను అధిగమించడానికి మాత్రమే అది శక్తిని వినియోగించాలిగానీ అలాగే ఉంటే మరో ఊర్లోకి పోదు. భూమి ఆకర్షణ విమానం మీద, హెలికాప్టరు మీద, మీ సెల్లు ఫోనుమీద, తాటిపండు మీద లంబంగా పనిచేయడం వల్ల అవి గాల్లో ఉన్నా భూమితోపాటు అవీ కదుల్తూ ఉంటాయి. అలాకాకుండా విమానం మరోచోటికి వెళ్లాలంటే అదనపు శక్తిని వాడాలి.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
No comments:
Post a Comment