గడ్డకట్టిన సరస్సుల అడుగున జీవులు ఎలా జీవిస్తాయి?
Tue, 27 Nov 2012, IST
- వై. అనీల్, వరంగల్
ఇలాంటి ప్రశ్నకు గతంలో ఇదే శీర్షికలో జవాబు ఇచ్చినట్టు గుర్తు. ఏదేమైనా పాఠకుల సౌకర్యార్థం మరోసారి దీనికి క్లుప్తంగా జవాబిస్తాను. నీటికన్నా మంచుగడ్డ సాంద్రత (density) తక్కువ. అందువల్లే గట్టిగా ఉన్న ఐసుగడ్డ ద్రవరూపంలో వున్న సాధారణ నీటిపైన తేలి ఉంటుంది. ఇది నీటికి ఉన్న ప్రత్యేక అసంగతక (anamolous) లక్షణం. తద్వారానే సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వున్న ధృవప్రాంతాల్లో ఐసుగడ్డలు నీటిపైనే తేలియాడుతూ నీటి ద్రవ పరిమాణం క్రమానుగతిలో ఉండడం వల్ల భూమి మీద నేల ప్రాంతం కనీసం 25 శాతమైనా వుంది. అలా కాకుండా ఘనస్థితి (solid state) లో వున్న ఐసుగడ్డలు మిగిలిన పదార్థాల్లాగే నీటిలో మునిగేలా అధిక సాంద్రతతో ఉన్నట్లయితే ద్రవనీరు సముద్రాలలో పొంగి, తీర ప్రాంతాలు మొత్తం మునిగిపోయేవి. నేల ప్రాంతం మచ్చుకు 15 శాతం మాత్రమే భూతలం (earth’s surfaces) మీద ఉండేది. కాబట్టి నీటికున్న భౌతిక లక్షణాలు కూడా భూమ్మీద జీవం మనడానికి సహకరిస్తున్నాయి.
ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీరు మైనస్‌లో ఉన్నా అక్కడ పైభాగాన మంచుగడ్డల వత్తిడి (pressure) వల్ల నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. అంటే ఋణ ఉష్ణోగ్రత (subzero temperature) వున్నా కూడా నీరు తనమీద అధిక వత్తిడి (తేలియాడే మంచుగడ్డల బరువు వల్ల) ఉన్నప్పుడు గడ్డకట్టకుండా ద్రవస్థితిలోనే ఉండగలదు. అందువల్లే పైన ధృవప్రాంతాలు గట్టిగా ఉన్నా ఆ నేల కింద ద్రవస్థితిలో ఉన్న నీటిలో జలచరాలు మనగలుగుతున్నాయి. తగినంత ఆక్సిజన్ అక్కడక్కడా ఉన్న సందుల ద్వారా నీటిలో కరిగి ఉంటుంది. పైగా జంతుజీవాలతో పాటు వృక్ష జీవులైన నాచు, ఆల్గే వంటివి కూడా అక్కడ ఉండడం వల్ల, మంచుగడ్డల ద్వారా కూడా కాంతి పోగలగడం వల్ల, అక్కడజీవులు వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ఉండడం వల్ల, కావలసినంత నీరుకూడా ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ ((photosynthasis) జరిగి, తగు మోతాదులో ఆక్సిజన్ విడుదలవుతోంది. కాబట్టి జలచరాలు, తదితర జీవులు గడ్డకట్టిన సరస్సుల కింద, ధృవప్రాంతాల కింద జీవించగలుగుతున్నాయి.
ఈ భూమ్మీద జనాభా పెరిగిపోతోంది. భూమి దేని ఆధారం మీద నిలబడింది? ఇంత బరువుకు భూమి కుంగిపోకుండా ఎలా ఉండగలుగుతోంది?
- వై.సుధీర్‌కుమార్, వరంగల్.
భూమి, తదితర గ్రహాలు, వాటి ఉపగ్రహాలు మొదలైన ఖగోళ వస్తువులెన్నో సమతాస్థితి (equilibrium) లో ఉన్నాయి. దీనర్థం ఏమిటంటే భూమ్మీద పనిచేసే అన్నివిధాలైన బలాల నికరబలం సున్న. మిమ్మల్ని ఒకరు కుడివైపునకు, మరొకరు ఎడమవైపునకు ఇంకొకరు వెనక్కి, వేరొకరు ముందుకు లాగుతున్నా మీరు ఉన్నచోటే ఉన్నారనుకొందాం. దీనర్థం ఏమిటి? మీపైన బలాలేమీ లేవని కాదు కదా? కానీ ముందు బలాన్ని వెనక బలం సమం చేసి, ముందుకుగానీ వెనక్కిగానీ మిమ్మల్ని కదలకుండా చేసింది. అలాగే ఎడమ బలం, కుడి బలానికి సమం చేసి ఎడమ కుడిలో ఎటూ కదలకుండా చేసింది. అలాగే భూమి మీద బలాలు ఎన్ని వున్నా అన్నింటి నికరబలం శూన్యమైపోవడం వల్ల ఎటూ కృంగిపోవడం లేదు. భూమితోపాటే భూమి వున్న మనుషులు, జనాభా ఉన్నారు. ఈ జనాభా ఆకాశం నుంచి వూడిపడిన గంధర్వులో, దేవతా పురుషులో, గ్రహాంతరవాసులో కాదు. ఇక్కడున్న పదార్థాలే మార్పు చెంది, పదేపదే చక్రియంగా జీవులు ఏర్పడుతున్నాయి. రైలు పెట్టెలో బెర్తు కింద వున్న మీ సూట్‌కేసును తీసేసి అందులో వున్న వస్తువుల్ని బోగీలో చెల్లాచెదరుగా విసిరేస్తే బోగీ కృంగిపోదు కదా? అలాగే ఇదీను.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
No comments:
Post a Comment