Wed, 14 Nov 2012, IST
రొమ్ము
క్యాన్సర్‌లో జీవకణ ప్రవర్తన నియంత్రణకు సంకేతాలను పంపే ప్రొటీన్
(మాంసకృత్తులు) అణు మార్గాన్ని కనుగొన్న 'నితిన్ తుమ్మ'కు '2012-ఇంటెల్
సైన్స్ టాలెంట్ సెర్చ్' పోటీలో ప్రథమ గుర్తింపు లభించింది. ఇందుకుగాను
లక్ష డాలర్ల బహుమతిని ఆయన గెలుచుకున్నారు. ఈ పరిశోధనతో క్యాన్సర్ నియంత్రణ
మరింత పటిష్టంగా, అతికొద్ది నష్టాలతో చికిత్స సాధ్యమని భావిస్తున్నారు.
దీనితో క్యాన్సర్ కణ విభజనలోని వేగాన్ని, వేగ నిరోధకాన్ని వేర్వేరు
అంశాలుగా గుర్తించడం సాధ్యమవుతుందని 'యోగర్' అనే నిపుణుడు భావిస్తున్నారు.
క్యాన్సర్ కణ విభజన నియంత్రణకు ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని ఈయన
అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిశోధనల్ని యోగర్ స్వయంగా ఎంతో కాలంగా
కొనసాగిస్తున్నారు. నితిన్ ప్రయోగాలు చాలా ఉన్నతస్థాయికి చెందినవని ఆయన
అంచనా వేశారు. ఈ అవార్డు ప్రత్యేకతను అర్థంచేసుకోవాలంటే గతంలో ఈ పోటీలో
పాల్గొన్న ఆవిష్కరణలకు రెండు నోబుల్, 13 ఇతర ఉన్నత అవార్డులు లభించడమే
తార్కాణం. నితిన్ పరిశోధనకు సంబంధించిన విశేషాలను వృక్ష రోగనిర్ధాక
నిపుణులైన ఆయన తాతయ్య డాక్టర్ ఎం.సుగుణాకర్ రెడ్డి పై విధంగా వివరించారు.
ఇంతకుముందు 2011లో 'సైటోక్రోం' అనే జీవ రసాయనిక నియంత్రణ విధానంపై నితిన్
పరిశోధనలు చేశారు. వీటి ద్వారా మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే మందు
(మెట్‌ఫార్మిన్) కాలేయంలో జరిగే జీవప్రక్రియను అనుసరించి వుంటుందని
గుర్తించారు. దీంతో దీర్ఘకాల క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించ డం సాధ్యమని,
మెట్‌ఫార్మిన్‌లోని సూక్ష్మ ఆర్‌ఎన్‌ఎ మానవుల్లో కణిత ఏర్పడే జన్యువుల
ప్రభావాల్ని నియంత్రిస్తుందని ఆయన గమ నించారు. ఎలుకల కాలేయంలోని జీవకణాలపై
లేబరేటరీలో ఈయన చేసిన ప్రయోగాలలో దీన్ని గుర్తించారు. ఇంతకీ నితిన్ వయస్సు
కేవలం 17 ఏళ్లే. ఈ వయస్సులో ఇంత అమోఘమైన మౌలిక పరిశోధనలు చేయడం అబ్బురపడే
విషయం. పెద్దయ్యాక మరెన్నో మౌలిక పరిశోధనలు కొనసాగించడమే తన ఆకాంక్ష
అంటున్నాడు నితిన్. ఈయన మన సంతతివాడేనంటే మనమంతా ఒకింత గర్వపడాల్సిందే..!
No comments:
Post a Comment