'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (4)
కె.ఎల్.కాంతారావు
Wed, 31 Oct 2012, IST
-
అశాస్త్రీయ ఆచారాలు
''................ శిరసి స్పర్శనేయది |
శిరస్థానే హేమ శల్యం నాసిక స్పర్శనే యది||
నాశికాయాం చైవ హస్తాచ్చందనం సప్తతాలకే|
గళే స్పర్శే హస్తిశల్యం స్యాత్ షట్తాల ప్రమాణతః||
అని 'వశిష్ట సంహిత' పేర్కొంటోంది. అంటే''గృహ నిర్మాత శిరస్సును స్పృశించి ప్రశ్నించినచో, అతని స్థలములో వాస్తు పురుషుని తల ఉన్న ప్రదేశంలో బంగారు కడ్డీ దొరుకును. ముక్కును తాకుచూ ప్రశ్నించిన ఎడల వాస్తు పురుషుని ముక్కు ఉన్న ప్రదేశమున ఏడు తాళముల ప్రమాణము లోతున చందనపు కట్టె ఉండును. కంఠమును స్పృశించుచూ ప్రశ్నించిన ఎడల వాస్తు పురుషుని గొంతు స్థానమున, స్థలములో ఆరు తాళముల లోతున ఏనుగు ఎముక లుండును అని అర్థం. ఇలాగే మిగిలిన అవయవాలను వేటిని తాకితే ఏ లోహం, లేక ఎముకలు దొరుకునో చెప్పబడింది'' అన్నాను.
''తాళము అంటే ఎంత?'' అని ప్రశ్నించాడు చంద్రమౌళి.
''తాళము అనగా 12 అంగుళములని భావము అని శ్రీదొగిపర్తి స్వామి గుప్త సిద్ధాంతి తన గుప్తవాస్తు గ్రంథంలో పేర్కొన్నారు'' అని సమాధానమిచ్చారు.
''అదిసరే! దురదకీ, గృహ నిర్మాత స్థలంలో ఉంటే ఎముకలకూ ఏదో సంబంధముందన్నావు. అది వివరించు'' అన్నాడు చంద్రమౌళి.
'దానిని గూర్చి విశ్వకర్మ ప్రకాశిక' ఇలా తెలియ జేస్తోంది.
శ్లో|| యదంగం సంస్పృతేత్కర్తా మస్తకంశల్య ముద్దరేత్|
అష్టతాళా దధస్తస్మిన్ తత్రశల్యం న సంశయః||
అంటే గృహనిర్మాత ఏ అవయవమును తాకునో, దానినిబట్టి కూడా శల్యములున్న స్థానమును నిర్ణయింపవలెను. గృహ నిర్మాత యొక్క శిరస్సున దురద కల్గినను, స్పృశించినను ఎనిమిది తాళముల లోతున ఎముకలుండును. అంతేకాదు..
శ్లో|| నాసికా స్పర్శనే కర్తు ర్వాస్తోశల్యం తదల్పకం|
స్థితం వినిశ్చతంబ్రూయాత్తల్లక్షణ మధోచ్యతే||
అంటే ''ముక్కునందు దురద కల్గినను, స్పృశించినను వాస్తు పురుషుని నాసికా స్థానమున్న ప్రదేశమున చిన్న ఎముక ఉండును' అని అర్థం. ఈ శల్యోద్ధార ప్రకరణంలో చివరగా 'విశ్వకర్మ ప్రకాశిక'లో ఇలా చెప్పబడింది.
'ఆసక్తోదృశ్యతే యస్మాద్దిశం శల్యం సమాదిసేత్''|
అంటే ''గృహ నిర్మాత ఆసక్తితో ఏవైపునకు చూచునో ఆ దిక్కునందు ఎముకలున్నవని తెలుసుకొనవలెను.''
''ఇది మరీ విచిత్రంగా ఉంది కాంతారావ్! 'ఓడు ఓడంటే కంచమంతా ఓడు' అనే సామెతలాగా, చేతితో తాకినా, గోక్కున్నా, చివరికి కంటితో ఒకవైపు చూసినా ఆ వైపున గృహ నిర్మాత స్థలంలో ఎముకలుంటాయని చెప్పడం అశాస్త్రీయతకు పరాకాష్ట. అందులోనూ ఎన్నో పరస్పర విరుద్ధ విషయాలున్నాయి. శిరస్సును తాకి ప్రశ్నించితే ఆ గృహ నిర్మాతకు బంగారుకడ్డీ దొరుకుతుందని వశిష్ఠుడు, ఎముకలు దొరుకుతాయని విశ్వకర్మ సెలవిచ్చారు. ఇలాంటి అసంబద్ధ, పరస్పర విరుద్ధ, అశాస్త్రీయ అంశాల మీద ఆధారపడిన విషయాన్ని 'శాస్త్రం' అని అంగీకరించలేకపోతున్నాను' చికాకుపడుతూ అన్నాడు చంద్రమౌళి.
''ఇంకా మరికొన్ని విశేషాలున్నాయి చంద్రమౌళీ! ఒకే గ్రంథంలో పరస్పర విరుద్ధఫలితాలు, రెండు గ్రంథాల్లో పరస్పర విరుద్ధఫలితాలు చెప్పబడినవి అనేకమున్నాయి. వాటినీ వివరిస్తా విను'' అన్నా.
''వివరించు'' అన్నాడు ఆసక్తిగా చంద్రమౌళి.
(ఆ వివరాలు వచ్చేవారం)
No comments:
Post a Comment