Wed, 14 Nov 2012, IST అశాస్త్రీయ ఆచారాలు 24
''స్వప్రయోజనపరులైన కొందరు సర్వజనులను మూఢత్వమున ముంచినారు. సత్య విద్యలన్నియు మూలబడినవి. అందుచేత పర్వతములకు, నదులకు బిడ్డలు పుట్టుట వారికి గొప్ప సత్యం. కల్లు సముద్రములు, నేతి సముద్రములు వారి భూగోళశాస్త్రం. సూర్యచంద్రులను 'పెద్దపాము' మింగుట వారి ఖగోళశాస్త్రం. స్వకాయ కష్టము విడిచి, ఇట్టి 'సత్యము'లను బోధించి, జీవించుట వారి కులవృత్తి. ఇట్టి జ్ఞానవంతులు తామే సర్వజ్ఞులమనుకొని, ఉన్న నాలుగు శాస్త్రములను తామే అభ్యసించి, ఇతరులను చదువనీయక పోవుటచేత, వారికి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుటకుగానీ, వృద్ధి పొందించుటకుగానీ, జనులలో వ్యాపింప జేయుటకుగానీ అవకాశము లేకపోయినది'' (1894లో రాజమండ్రిలో చేసిన ఉపన్యాసము నుండి).
ఇది చదివి చంద్రమౌళి చెప్పడం కొనసాగించాడు. ''కాబట్టి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేయవలసినది, ప్రజలకు ఒక్కో అంశంలోని అశాస్త్రీయతను వివరిస్తూనే, వారిలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం. అదీ ముఖ్యంగా చిన్నపిల్లల మనస్సులలో. ఎందుకంటే వారు మొక్కల్లాంటి వారు, భావిభారత పౌరులు. ''మొక్కైవంగుతుందిగానీ మానై వంగుతుందా?'' అనే సామెత నీకు తెలుసుగదా?'' అన్నాడు చంద్రమౌళి.
''నిజమే చంద్రమౌళీ! ఒక్కో మూఢనమ్మకం వెనుక ఉన్న అశాస్త్రీయతను వివరిస్తూనే, ''రుజువుపర్చలేని విషయాలను నమ్మకూడదు; ప్రతి సమస్య వెనుక ఉన్న వాస్తవిక కారణాల్ని గ్రహించాలి'' అనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. అదే బాధ్యతగల ప్రతి పౌరుడి ముఖ్యకర్తవ్యం. ఈ విషయంలో నీవు చెప్పిన దానిని అంగీకరిస్తూనే ఒక చిన్న సవరణ చేస్తున్నాను'' అన్నాను.
''ఏమిటా సవరణ?'' ఆసక్తిగా అడిగాడు చంద్రమౌళి.
''నీవు మీ జన విజ్ఞాన వేదిక వాళ్లు చేయవలసినది ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం'' అన్నావు. 'మీ' కి బదులు 'మనం' అను. అర్థమైందా? 'నీవు', 'మేము' కలిసి 'మనం' ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిద్దాం. సరేనా?'' అన్నాను నవ్వుతూ.
''చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను'' అన్నాడు చంద్రమౌళి నవ్వుతూ.
''చాలా చాలా సంతోషం'' అన్నాను నేను కూడా నవ్వుతూ.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment