Wednesday, 28 November 2012

సునీతా విలియవమ్స్‌ అంతరిక్ష పరిశోధనలు

 
 
            ఇప్పటి పరిస్థితుల్లో అంతరిక్షంలో దీర్ఘకాలం వుండి, పరిశోధనలు కొనసాగించడం ఎంతో రిస్క్‌, ప్రమాదంతో కూడుకున్నవి. వీటికి ఎంతో ఆధునిక, వైవిధ్యభరితమైన విజ్ఞానం, ధైర్యసాహసాలు వుండాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ సాంకేతిక విజ్ఞానంతో పాటు వాతావరణం, జీవ, భౌతిక రసాయన విజ్ఞానశాస్త్రాలు, ఖగోళశాస్త్రం, ఆరోగ్య విజ్ఞానం తదితర శాస్త్రాలలో ఉన్నత నైపుణ్య స్థాయి వుండాలి. వీటన్నింటితో పాటు శరీర దారుఢ్యం, మనోనిబ్బరం, సమయోచిత నిర్ణయశక్తి కావాలి. వీటన్నింటి మేలుకలయికతోనే అంతరిక్షంలో దీర్ఘకాలం వుంటూ పరిశోధనలు చేయగలం. ఇలా అత్యధికకాలం పరిశోధనలు చేసిన మహిళల్లో మొదటి మహిళ సునీతా విలియమ్స్‌. ఈమె 2007-12 మధ్య రెండు దఫాలుగా (318 రోజులు) అంతరిక్షంలో వున్నారు. ఈ కాలంలో ఏడుసార్లు (మొత్తం 50 గంటల 40 నిమిషాలు) అంతరిక్షంలో నడిచి (స్పేస్‌ వాక్‌) ఖ్యాతి పొందారు. ఈమె భారత సంతతికి (గుజరాత్‌) చెందిన వ్యక్తని తెలుసుకుంటే మనం ఒకింత గర్వపడతాం. ఈమె అమెరికా పౌరురాలు. అక్కడే పుట్టి, పెరిగి, చదివారు. మొదట భౌతికశాస్త్రాలలో పట్టభద్రురాలు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. నేవీలో, ఆ తర్వాత నాసాలో పనిచేశారు. ఇటీవల నవంబరు 19న రెండవ ప్రయాణాన్ని (123 రోజులు) పూర్తిచేసుకుని భూమిపై దిగారు. ఈ సందర్భంలో అంతరిక్షంలో ఆమె చేసిన పరిశోధనలు ఎంతో ఆసక్తిగా వున్నాయి. వీటిని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

అంతరిక్షంలో దీర్ఘకాలం వుండి పరిశోధనలు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉపయోగపడుతుంది. సునీతా విలియమ్స్‌, ఇతర అంతరిక్ష పరిశోధకులతో కలిసి దీనిలోనే దీర్ఘకాలం పరిశోధనల్లో పాల్గొన్నారు.

అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం..
ఇది భూమిపై సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమితో పాటు నిరంతరం తిరుగుతుంది. ఇప్పటికి 12 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. దీనిలో వాతావరణ నియంత్రణ, ఆహార సరఫరా వ్యవస్థ, పరిశుభ్రత, విద్యుత్‌, ఉష్ణోగ్రత నియంత్రణ, సమాచార ప్రసారాలు, కంప్యూటర్‌ వ్యవస్థలు ప్రధానంగా పనిచేస్తాయి. అంతరిక్షంలో శాశ్వతంగా వలస ప్రాంతాల్ని ఏర్పర్చుకోవటానికి వీలుంటుందా? దీర్ఘకాలం అంతరిక్షంలో ఎగరగలమా? అనేవి నిర్ధారించుకొనే ప్రధాన లక్ష్యాలతో దీని పరిశోధనలు ప్రారంభ మయ్యాయి. దీనిని రష్యా, అమెరికా, జపాన్‌, యూరోపియన్‌ యూని యన్‌, కెనడా దేశాల అంతరిక్ష పరిశోధనా విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ప్రధాన నియంత్రణ కేంద్రం రష్యాలోని బైక నూర్‌ వద్ద వుంది. దీని బరువు దాదాపు 450 టన్నులు. పొడవు 72.8 మీటర్లు. వెడల్పు 108.5 మీటర్లు. ఎత్తు సుమారు 20 మీటర్లు. అయితే దీనిలో వాతావరణ పీడనం దాదాపు భూ వాతావరణంతో సమానంగా వుంటుంది.
మానవ శరీరంలో కండరాల వాపు, ఎముకల నష్టం, ద్రవాలలో జరిగే మార్పులలో దీని పరిశోధనలు కొనసాగాయి. 2006 నాటికి వచ్చిన ఫలితాల్నిబట్టి దీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణం చేయవచ్చనీ, ఇతర గ్రహాలకు చేరే అంతరిక్ష ప్రయాణం (ఆరునెలల మేర) చేపట్టే అవకాశాలున్నాయనీ నిర్ధారించింది. దీనిలో ఎప్పుడూ దాదాపు బరువులేని వాతావరణస్థితి కొనసాగుతుంది. దీనిలో జీవశాస్త్రం, మానవ శరీరనిర్మాణశాస్త్రం, భౌతికశాస్త్రం, అంతరిక్షం, వాతావరణం, రసాయనిక సంబంధిత శాస్త్రాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనం భూమిపై చేయలేని ప్రయోగాలు ఈ కేంద్రంలో చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వస్తువుల్ని, పదార్థాల్ని తయారుచేయడానికి వీలవుతుంది.

పరిశోధనాంశాలు..
సునీతా విలియమ్స్‌ ఆమె సహచరులూ కలిసి 30 అంశాలపై 240 ప్రయోగాల్ని చేశారు. వీటిలో ప్రధానమైనవి: అంతరిక్ష పరిశోధనలు..
గాలి, నీరు, ఉపరితల పరిశీలనకు జపాన్‌ రూపొందించిన ఒక రోబోటిక్‌ చేయిని అంచనా వేస్తారు. వైద్య రంగంలో ఎముకలు, కండరాల వాపు / క్షీణత లపై భారరహిత స్థితిలో చేపలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. వీటిపై రేడియేషన్‌ ప్రభావాల్ని అంచనా వేస్తారు. అంతర గ్రహ సమాచార ప్రసారవ్యవస్థలో జరుగు తున్న ఆలస్యానికి గల కారణాలను పరిశోధిస్తారు. తద్వార బుధ, ఇతర గ్రహాల నుండి వచ్చే సంకేతాల ఆలస్యాలను లోతుగా అర్థంచేసుకునే వీలుకలుగుతుంది.

అంతరిక్షంలో మానవులు..
స్ఫటికాలు రూపొందడాన్ని అర్థంచేసుకోవడానికి, ఆహారం ఇతర పదార్థాలలో వాటి నిల్వ కాలపరిమితులను తెలుసుకోడానికి తోడ్పడుతుంది. అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన ఆహారాన్ని తయారుచేయడంలో ఈ పరిశోధనలు తోడ్పడతాయి. అంతరిక్షంలో మానవులు దీర్ఘకాలం వున్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల్ని అర్థంచేసుకోవడానికీ ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఈ కాలంలో నిద్రాభంగ పరిస్థితుల్ని, రక్త ప్రసరణ స్థితిగతులను అర్థంచేసుకోవడానికి ఈ పరిశోధనలు ఉద్దేశించబడ్డాయి.

ఆరోగ్యం..
కెనడా రూపొందించిన లేజర్‌ పరికరాల ద్వారా జీవకణాలను విశ్లేషించడానికి, వర్గీకరించడానికి ఉపయోగపడే పరిశోధనలను, మాంసకృత్తులలో ప్రవేశపెట్టగల మార్పుల్ని అర్థంచేసుకోడానికి ఈ పరిశోధనలు తోడ్పడతాయి. ముఖ్యంగా రోగాల్ని ముందుగానే తెలుసుకుని గుర్తించడానికి పరిశోధనలు జరిగాయి. సాల్మొనెల్లా బాక్టీరియా ఆహారాన్ని నిల్వలో విషంగా మారుస్తుంది. దీన్ని ఎదుర్కొనడానికి వ్యాక్సిన్‌ తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆహారం తినడంవల్ల పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు.

నానో సాంకేతికాలు..
భారరహిత స్థితి (జీరో గ్రావిటీ) లో జంతుజాల కణ సమూహాలపై నానో స్థాయిలో జరిగే మార్పుల్ని అర్థంచేసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి. తద్వారా అంతరిక్షంలో ఏవైనా జీవాలుంటే గుర్తించడానికి వీలవుతుంది.

భూగోళ శాస్త్రం..
ప్రకృతి వైపరీత్యాలను, పర్యావరణ పరిణామాలను, సంఘటనలను పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి ఉపయోగపడే సాంకేతికాలు పరీక్షింపబడుతున్నాయి. ఇవి భూగోళంలో నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి.

రసాయనిక శాస్త్రం..
భౌతిక - రసాయనిక మార్పుల్ని, ఎమల్షన్‌ బిందువుల (పెయింట్‌ బిందువు ల్లాంటివి) స్థిరత్వాన్ని తెలుసుకోడానికి కావాల్సిన పరిశోధనలు చేస్తున్నారు.

ఎంతెత్తు నుండి భూమిని చూడగలం?
ఎటువంటి పరికరాల తోడ్పాటు లేకుండా అంతరిక్షంలో భూమిని ఎంత దూరం నుండి చూడగలం? అనేది శాస్త్రజ్ఞుల్ని వేధిస్తున్న ప్రశ్న. దూరం వెళ్లి చూస్తే భూమి సూర్యుని పక్కన వున్నట్లు కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్లి చూస్తే సూర్యుని నుంచి మిరిమిట్లుగొలుపుతూ వచ్చే కాంతి అసలు భూగోళాన్ని కనపడనీయకుండా చేస్తుంది. భూగోళానికి 300 కిలోమీటర్ల ఎత్తులో గల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి చూసినట్లయితే భూమి పైభాగం కనిపిస్తుంది. అక్కడ భూమి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అక్కడ నుంచి భూగోళంపైగల ఎత్తయిన పర్వతాలు, లోయలు, పెద్ద నదులు, పెద్ద పట్టణాల్లో విద్యుత్‌దీపాలు కనిపిస్తాయి. అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఇంటి బాల్కనీలో నుండి కిందకు చూచినట్లు వుందని సునీతా విలయమ్స్‌ తన తండ్రికి వర్ణించి చెప్పారు. అయితే ఆమె పై నుండి భారతదేశాన్ని మబ్బుల అసౌకర్యం వల్ల చూడలేకపోయారట!
అదే చంద్రలోకాన్ని దాటి 3.8 లక్షల కిలోమీటర్ల నుండి చూస్తే భూగోళం మనం చూస్తున్న చంద్రుని (వెలుగుతున్న బంతి) లాగా కనిపిస్తుంది. ఇంకా పైకి పోయి, బుధ, శుక్ర తదితర గ్రహాల్ని దాటి చూసినట్లయితే భూమి ఒక నక్షత్రంలాగా కనిపిస్తుంది. ఇలా 14 బిలియన్‌ కిలోమీటర్ల దూరం పోయి చూస్తే భూమి అస్సలు కనపడదు. ఒకవేళ అంతరిక్షంలో గ్రహాంతరవాసులు టెలిస్కోపు ద్వారా చూస్తే భూగోళాన్ని బహుశా ఇంకా దూరం నుండీ చూడగలుగుతారు.

సునీతా విలియమ్స్‌..
సునీతా విలియమ్స్‌ 45 ఏళ్ల అంత రిక్ష మహిళా పరిశోధకురాలు. అమెరికా పౌరురాలు. ఈమె తండ్రి దీపక్‌ పాండ్యా వైద్యులు, భారత సంతతి (గుజరాత్‌)కి చెందినవారు. తల్లి బోనీ పాండ్యా స్లోవేనియా దేశస్థురాలు. సునీతా రెండు దఫాలుగా అంతరిక్ష సాహస యాత్రలు చేశారు. మొదట 14, 15 సాహసయాత్రలలో 2006, డిసెంబరులో అంతర్జాతీయ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి వెళ్లారు. ఈ సమయం లో మూడుసార్లు అంత రిక్షంలో నడిచారు. 2012, జులై 15 నుం డి నవంబర్‌ 19 వరకూ ఆమె 32, 33 సాహస యాత్రల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన స్థానానికి కమాండర్‌గా సెప్టెంబర్‌ 15 నుండి యాత్రాంతం వరకూ పనిచేశారు. అంతరిక్షంలో మొట్టమొదటి వ్యక్తిగా ఈత, సైక్లింగ్‌, పరిగెత్తడం - ఈ మూడింటినీ వరుసగా పూర్తిచేశారు. పరిశోధనా స్థానంలోనే ఈమె 800 మీటర్ల వరకూ ఈతతో సమానమైన వ్యాయామాన్ని చేశారు. ఆ తర్వాత 29 కిలోమీటర్ల సైక్లింగ్‌ చేశారు. ట్రెడ్‌మిల్‌ పై 6.4 కిలోమీటర్లు పరిగెత్తారు. ఈ మొత్తాన్ని గంట 48 నిమిషాల 33 సెకన్ల లో పూర్తిచేశారు. 2007, సెప్టెంబర్‌లో మన దేశాన్ని సందర్శించారు. తన పూర్వీకుల గ్రామమైన ఝులాసన్‌, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈమెకి సర్దార్‌ వల్లభారుపటేల్‌ 'విశ్వప్రతిభ' అవార్డును ప్రపంచ గుజరాతీ సొసైటీ అందించింది. ఈమె అంతరిక్షంలో వున్న ప్పుడు రోజుకు 15-17 గంటలు పని చేసేవారు. మిగతా సమయంలో తప్పని సరిగా నిద్రపోవాలనే నియమం వుండేది. ఆ నియమానుసారం నిద్రపోయేవారు.

మీకు తెలుసా..?
ట స్పేస్‌ షటిల్‌: అంతరిక్షంలోకి వాహక నౌకలను పంపడానికి మాటిమాటికీ వినియోగించగల రాకెట్‌ను 'స్పేస్‌ షటిల్‌' అంటారు. దీనిని అమెరికాకు చెందిన 'నాసా' (నేషనల్‌ ఏరోనాటిక్‌ Ê స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) రూపొందించింది. దీనిలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. 1. రాకెట్‌ లాంచ్‌ వాహకం, 2. కక్ష్యలో ప్రవేశపెట్టడానికి అనువైన రాకెట్లు, 3. భూగోళ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాటు. స్పేస్‌ షటిల్‌లో కక్ష్య వాహకం, బయట వైపు ఇంధన ట్యాంకు, రెండు ఘన రాకెట్‌ బూస్టర్లు వుంటాయి.
ట ఇంతవరకు దీనిని 1981-2011 మధ్య కాలంలో 135 సార్లు ప్రయోగించారు.

No comments:

Post a Comment