క్రిమినాశకాలతో మెదడుకు చేటు!
Wed, 5 Dec 2012, IST
పాలల్లో చేపనూనెతో ఆరోగ్యం..!
పాలు, చేప నుండి వెలికి తీసిన నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని విదితమే! ఇప్పుడు ఆహార శాస్త్ర పరిశోధకులు పాలల్లో, పాల ఉత్పాదనల్లో, చేపల నుండి తీసిన ఒమేగా నూనెలను మిళితం చేస్తున్నారు. అటువంటి మిశ్రమనూనె వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందనీ, గుండె బలంగా ఉంటుందనీ వీరు భావిస్తున్నారు. పాలల్లో చేప నూనెను కలపడం వలన పాల వాసన, రుచిలో ఏమాత్రం తేడా లేదని తెలిసింది. పైగా, నూనె కలిపిన పాలు నిలువ కూడా ఉంటాయట! కేవలం చేప నూనెనే విడిగా తీసుకోవడం ఇబ్బంది అనుకునేవారికి ఇటువంటి పాలు, పాల పదార్థాలను తీసుకోవడం గొప్ప వెసులుబాటు కానున్నాయి.
మెర్క్యురీపై మంచు..!
ఇతర గ్రహాలపై జీవం, గ్రహాల ఆవిర్భావం వంటి అంశాల పరిశోధనలో నిరంతరం కొత్త విషయాలు వెలికి వస్తూనే వున్నాయి. తాజాగా, మెర్క్యురీ గ్రహంపై మంచు వుందని తెలిసింది. నాసా అంతరిక్ష వాహనం నుండి ఈ వివరాలు అందాయి. గ్రహాలపైన నీరు వుండటం అనేది వాటిపై జీవం వుండే అవకాశాల్ని సూచిస్తుంది. ఆ దిశగా జీవావిర్భావ ప్రక్రియలో ఏమైనా ఆధారం లభిస్తుందేమో అని శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. మెర్క్యురీ ధృవప్రాంతాలలో మంచు సుమారు రెండుమైళ్ళ మేర వ్యాపించి వున్నట్టు తెలిసింది. మరి దీనివలన మరిన్ని కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమో చూడాలి మరి!
మెదడు ముడతల్లోనే రహస్యం..!
జీనియస్‌గా పేరొందిన ఐన్‌స్టీన్ మెదడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ మేధావి 1955లో మరణించాడు. ఆ తరువాత ఆయన మెదడును 240 భాగాలుగా చేసి, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులకు అధ్యయనం నిమిత్తం పంపారు. వాటిలో చాలా వరకూ పోయాయి. చివరికి ఆయన మెదడుకు సంబంధించి, ఊహాగానాలే తప్ప, వాస్తవాలు బయటపడలేదు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఆ మెదడు 240 ముక్కలలో నుండి తీసిన రెండువేల సన్నని పొరల ఫొటోలను వాడి కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఐన్‌స్టీన్ మెదడు సాధారణ మెదడులాగే 1,230 గ్రాములుంది. కానీ, అసాధారణంగా,ఆ మెదడులో ముడతలు చాలా అధికంగా వున్నాయి. మరో 85 మెదడులను పోల్చి చూస్తే ఈ విషయం తెలిసింది. ముడతలు అధికంగా వుండటం అంటే నాడీ కణాలు అధికంగా వున్నట్టు. పైగా ఐన్‌స్టీన్ మెదడు ముడతలు మామూలుగా కాకుండా చాలా సంక్లిష్టంగా వున్నాయని తెలిసింది.
వేసవిలో పుడితే లెక్కల్లో వెనకా..?
వేసవికాలంలో పుట్టిన పిల్లలు లెక్కల్లో వెనకబడతారని ఇంగ్లాండులో జరిపిన పరిశోధనలు తెలిపాయి. సుమారు 50 వేల మంది పిల్లలపై జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. మే, ఆగస్టు నెలల మధ్యలో పుట్టిన పిల్లలకు లెక్కలలో కాస్త మందగింపు ఉంటుందని, వారికి ట్యూషన్ అవసరం వుంటుందని ఇప్పుడు భావిస్తున్నారు. పైగా, ఆ మాసాలలో పుట్టిన అబ్బాయిల్లో ఈ సమస్య అమ్మాయిల కంటే ఎక్కువని అంటున్నారు. అయితే, ఇటువంటి విచిత్ర ఫలితాలకి అసలు కారణం ఇంకా తెలియదు.
- డాక్టర్ కాకర్లమూడి
No comments:
Post a Comment