Sunday, 30 December 2012

పరపతి కోసం..!

  • వాస్తు.. వాస్తవాలు.. - 4
నా ఆప్తమిత్రుల్లో ఒకడైన ఆంజనేయులు (పేరు మార్చ బడింది) 30 ఏళ్ళపాటు ఉద్యోగం చేసి, రిటైరై, తన సొంత ఊరిలో స్థిరపడ్డాడు. అతని ఆహ్వానం మేరకు ఒకసారి వారి వూరు వెళ్ళాను. ఆంజనేయులు బస్టాండుకు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. మేం ఇంటికి వెళ్ళేటప్పటికి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వసారాలో కూర్చొని వున్నారు. మేం కనిపించ గానే వాళ్లు లేచి నిలబడ్డారు. ఆంజనేయులు వాళ్ళను కూర్చోమని చెప్పి, నన్ను లోనికి తీసికె ళ్ళాడు. మేము కాఫీ తాగి బయటకు వచ్చేవరకూ వాళ్ళు అతనికోసం వేచి వున్నారు. బయటకు వచ్చి కూర్చొని, ఆంజనేయులు 'ఏం నరసయ్యా! ఏంటి సంగతి?' అని అడిగాడు. 'కొత్త ఇల్లు కట్టుకుందామనుకుంటున్నాను సారూ! మీరు వచ్చి ముగ్గేసి, శంకుస్థాపన చేయాలి'' అన్నాడు నరసయ్య వినయంగా. ఆంజనేయులు పంచాంగం చూసి ''వచ్చే సోమవారం ఉదయం ఏడు గంటల 16 నిముషాలకు నేను శంకుస్థాపన చేస్తాను. నువ్వు ఉదయం ఆరు గంటలకే అక్కడ అన్నీ సిద్ధంచేసుకొని వుండు'' అని కావలసిన పదార్థాలు చెప్పి, అతన్ని పంపేశాడు. తరువాత పుల్లయ్యవైపు తిరిగి ''పుల్లయ్యా! నీవెందుకొచ్చావు?'' అని అడిగాడు. ''సారూ! మా అమ్మాయికి కొడుకు పుట్టాడు. మా అల్లుడు ఆ వివరాలు ఈ కాగితం మీద రాసిచ్చాడు. పిల్లవాడి జాతకం రాయండి సార్‌!'' అని ఓ కాగితం ఆంజనేయులుకిచ్చాడు. ఆంజనేయులు ఆ కాగితం తీసుకొని ''ఎల్లుండి రా! జాతకం తయారుచేసి పెడతా' అన్నాడు. పుల్లయ్య వెళ్ళిపోయాడు.
నేను కొంచెం ఆశ్చర్యంగా ''ఆంజనేయులూ! నీవు వాస్తు, జ్యోతిష్యాలు ఎప్పుడు చదివావు? వాస్తుకు సంబంధించి మయమతం, విశ్వకర్మ ప్రకాశిక, వశిష్ఠ సంహిత వంటి గ్రంథాలేమన్నా చదివావా? జ్యోతిష్యానికి సంబంధించి వరాహమిహిరుడి బృహ జ్ఞాతకం వంటి గ్రంథాలు చదివావా?'' అని అడిగాను. ఆంజనేయులు నవ్వుతూ ''కాంతారావ్‌! నేను చదివిన పుస్తకాలు రెండే. ఒకటి 'వాస్తుశాస్త్ర వాస్తవాలు'. రెండవది 'జాతకచక్రం వేయడం ఎలా?' అనే పుస్తకాలు. ఈ రెండు పుస్తకాల విజ్ఞానమే నన్ను ఈ వూళ్ళో వాస్తు, జ్యోతిష్య పండితుడుగా చలామణి చేస్తున్నాయి'' అన్నాడు. దానితో ఆంజనేయులుకున్న వాస్తు, జ్యోతిష్య విజ్ఞానమేమిటో అర్థమైంది. అందుకని మరో ప్రశ్న అడిగాను. ''ఉద్యోగం చేసే రోజుల్లో నీకు వీటిపై ఆసక్తి లేదు కదా? ఇప్పుడింత ఆసక్తి ఎందుకు కల్గింది?'' అని.
చిరునవ్వు నవ్వుతూ ఆంజనేయులు ఇలా అన్నాడు. ''కాంతారావ్‌! తప్పనిసరై పల్లెటూళ్ళో ఉండవలసి వచ్చింది. ఏ విద్యా చేతిలో లేకపోతే ఇక్కడ మనల్నెవరూ గౌరవించరు. అందుకని వాస్తు, జ్యోతిష్యాలు చదివి ఈ వూరి వాళ్ళకు చెబుతున్నా. అందువలన నా పరపతి ఎంతో పెరిగింది. ప్రతివారూ ఏదో ఒక అవసరం కోసం నా దగ్గరకు రావలసి ఉంటుందనుకొని నన్ను ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఏ పని అడిగినా మర్యాదగా చేసిపెడుతున్నారు. నీవు రాగానే చూశావుగదా! నరసయ్యా, పుల్లయ్య నాతో ఎంత వినయంగా మాట్లాడారో? నాకు వీటి వలన ఈ విశ్రాంత జీవితంలో డబ్బూ, గౌరవం రెండూ లభిస్తున్నాయి.
''అవునులే 'అర్ధార్జనే సహాయః' అని వరాహమిహిరుడు తన బృహజ్ఞాతకంలో అందుకే అన్నాడు'' అన్నాను నవ్వుతూ.
''అంటే ఏమిటి?'' అడిగాడు ఆంజనేయులు.
''అంటే జ్యోతిష్యం పురుషుడికి డబ్బు సంపాదించడానికి తోడ్పడుతుంది అని అర్థం.''
ఆంజనేయులు నవ్వి ఊరుకున్నాడు.

No comments:

Post a Comment