Sunday, 30 December 2012

సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు?
- ఎం.ఫాతిమా, మునిసిపల్‌ కార్పొరేషన్‌ శ్రీనగర్‌ బాలికోన్నత పాఠశాల, కాకినాడ
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడనే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని భూ పరిభ్రమణ వృత్తం (ECLIPTIC)అంటారు. ఈ వృత్తోపరితలానికి సుమారు 23 డిగ్రీల కోణంలో (900 కాకుండా) వంగిన అక్షం చుట్టూ భ్రమిస్తూ భూమి ఈ వృత్తోపరితల పరిధి (ecliptical perifery) లో పరిభ్రమి స్తోంది. భ్రమణాక్షం (spinning axis) భూమికున్న ఉత్తర దక్షిణ దిశల్లో ఉంది. మనం ఈ భూమి నుంచి దూరంగా వెళ్లి సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే ఎక్లిప్టిక్‌ కక్షను చూస్తు న్నట్లు ఊహించుకొందాం. మనం చూస్తున్నపుడు భూమధ్య రేఖకు పైభాగాన ఉత్తర అమెరికా, రష్యా, గ్రీన్‌లాండ్‌ భాగాలు మనకు కనిపించేలా మనం నిల్చున్నట్లు భావిద్దాం. అపుడు భూమి తన చుట్టూ తాను మన పరిశీలన ప్రకారం ఎడమ నుంచి కుడివైపునకు భ్రమిస్తున్నట్లు ఉంటుంది. అంటే కుడి భాగం సూర్యుడివైపునకు తిరుగుతున్నట్లు, ఎడమభాగం సూర్యుడివైపు పోవడానికి సిద్ధపడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మనం ఆకాశంలో ఎక్లిప్టిక్‌ వైపు చూస్తున్నపుడు మనకు కుడివైపున సూర్యుడు, ఎడమవైపున భూమి ఉండే విధంగా మన స్థావరాన్ని ఊహించుకోవాలి సుమా!
మనకు పైభాగాన ఉత్తరం, కింది భాగాన దక్షిణం ఉండేలా భూమిని చూస్తున్నాం కాబట్టి కుడివైపున ఉన్న భాగాన్ని తూర్పు అనీ, ఎడమవైపు భాగాన్ని పశ్చిమం (పడమర) అనీ పేర్లు పెట్టకొన్నాం కదా! కుడివైపునకు సూర్యుడి కాంతి పెరిగేలా తిరుగుతున్నందున సూర్యోదయం కుడివైపున (తూర్పున) సంభవిస్తున్నట్లు, ఎడమవైపు (పశ్చిమాన) సూర్యాస్తమయం జరుగుతున్నట్టు ద్యోతకమవుతుంది. నిజానికి ఉత్తర, దక్షిణ ధృవాలకు అర్థం ఉందిగానీ, గణితం ప్రకారం తూర్పు పడమరకు పరమార్థం (absolute meaning) లేదు. కేవలం సాపేక్షం (relative) గా మాత్రమే అర్థం ఉంది. శుక్ర గ్రహం భ్రమణం భూభ్రమణానికి వ్యతిరేకదిశలో ఉన్నందున అక్కడ పశ్చిమాన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఉంటాయి.


ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment