Wednesday, 9 January 2013

అచ్చుపోయి ఆన్‌లైన్‌ వచ్చె ...

  • ముద్రణాయుగం ముగిసిందా !
ఏ క్షణానికాక్షణం టీవీలు, ఇంటర్నెట్‌, రేడియోలలో వార్తలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో దినపత్రికల అవసరం ప్రశ్నార్ధకంగా మారుతున్న రోజులివి. అలాంటపుడు వారానికి ఒక రోజు వెలువడుతూ వార్తా విశేషాలు అందించే వారపత్రికలకు భవిష్యత్‌ ఉందని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా?
తెల్లని కాగితంపై నలుపు లేక ఇతర రంగులతోనో ముద్రించి మన ముందుకు తెచ్చే వాటిని ఇప్పటి వరకు మనం పత్రికలు అంటున్నాం. అవి వార, పక్ష, మాస, దిన పత్రికలు ఏవైనా కావచ్చు. రోజులు మారిపోతున్నాయి. విండోస్‌ అంటే ఏ గది కిటికీలు అని ఎవరైనా అంటే పాతకాలపు మనుషుల్లా చూసే రోజులివి. రాబోయే రోజుల్లో ముద్రణా యంత్రం ఉన్నా దానికి పని ఉండదు. కనుక కాగితంతో పనిలేదు, అలాంటపుడు దుకాణంలో కొనుక్కొనేందుకు పత్రికలు ఎక్కడుంటాయి? ఉదయాన్నే తలుపు కొట్టి మనల్ని లేపే పేపర్‌ కుర్రాళ్లూ ఉండరు. అయినా మన చేతిలో ఠంచనుగా పత్రికలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోబోయే ముందు అసలు వాటిని ఏమని పిలవాలి? పత్రికలని అనాలా? మరొక పేరు పెట్టాలా? భాషా పండితులు చెప్పాలి.
ఇంతకీ సందర్భం ఏమంటే అమెరికా నుంచి వెలువడే న్యూస్‌వీక్‌ ప్రపంచంలో అత్యధిక కాపీలు అమ్ముడయ్యే వారపత్రికల్లో ఒకటి. జనవరి ఒకటి నుంచి దాన్ని అచ్చు వేయకుండానే పాఠకులకు అందించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. మీడియాలో పనిచేసే వారికి ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదుగాని సామాన్యులకు ఎలా అనిపించటం సహజం. అందుకే ఈ కథనం.

తాను కనుగొన్న అచ్చు యంత్రాన్ని భవిష్యత్‌ తరాలు మరింతగా మెరుగు పరుస్తాయని జాన్‌ గూటెన్‌బర్గ్‌ ఆశించి ఉంటాడేమోగాని, అసలు యంత్రంతో పనిలేకుండా పత్రికలు, పుస్తకాలు వెలువడతాయని ఊహించి ఉండడు. కొన్ని సంవత్సరాలు పోతే ఎవరి చేతుల్లో అయినా ముద్రించిన వారపత్రిక కనిపిస్తే 'అబ్బో! ఈయనెంతటి ధనవంతుడు కాకపోతే అంత డబ్బు పోసి అచ్చేసిన పత్రికను కొని చదువుతాడు!' అని ఆశ్చర్యపోయే స్థితి రావచ్చేమో? అలా అంటారా లేక 'అంత డబ్బు తగలేసి పాత చింతకాయ పచ్చడి వంటి పత్రికలనే ఇంకా పట్టుకు తిరుగుతున్నాడు!' అని ఈసడించుకుంటారా? ఏమో లోకో భిన్నరుచి. ఇంతకీ ముద్రణ లేని పత్రికలు ఎలా?
'డైమండ్‌ సూత్ర' అనే తొలి పుస్తకాన్ని క్రీస్తు శకం 868లో చైనాలో ప్రచురించినట్లు చరిత్ర చెబుతోంది (అంతకంటే ముందే ప్రచురణ జరిగిందని చెప్పే వాదనలు కూడా ఉన్నాయి). అయితే జర్మనీకి చెందిన జాన్‌ గూటెన్‌ బర్గ్‌ 1436-40 మధ్య రూపొందించి చేతితో నడిపించిన అచ్చు యంత్రం ముద్రణా ప్రపంచ రూపు రేఖలనే మార్చి వేసింది. ఆరువందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏలిన ముద్రణ యంత్రం కొన్ని అవసరాలకు తప్ప భవిష్యత్‌లో చరిత్రగా మారనుందా? అవునని ఇప్పటికిప్పుడు చెప్పలేంగాని కాదని కూడా చెప్పలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతోంది.
తెలిసిన వారికి తెలిసినా తెలియని వారికి తెలిపేందుకు క్లుప్తంగా కొన్ని మాటలు. టాబ్లెట్‌ పీసి.. మొబైల్‌కు ఎక్కువ కంప్యూటర్‌కి తక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో చిన్న కంప్యూటర్‌. కంప్యూటర్ల వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని మరింత సౌకర్యంగా వినియోగించేందుకు (కొంత మంది టాయిలెట్‌కు వెళ్లినపుడు కూడా వినియోగిస్తున్నారు.) ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, టాబ్లెట్‌ పీసి, పాకెట్‌ పీసి వంటి చిన్న పరికరాలను రూపొందించారు. వాటిలో టాబ్లెట్‌ పీసి పేరుకు తగ్గట్టే పల్చగా ఒక చిన్న పుస్తక పరిమాణంలో ఉంటుంది. పుస్తకంమీద పెన్నుతో ఎలా రాస్తామో టాబ్లెట్‌ పిసి తెరపై డిజిటల్‌ పెన్‌ సహాయంతో అదే విధంగా రాయవచ్చు. కాస్త పెద్ద జేబుల్లో పెట్టుకొని లేదా చిన్న చేతి సంచిలో వీటిని తీసుకు వెళ్లవచ్చు. టైపుతో పనిలేకుండా డిజిటల్‌ పెన్నుతో రాసే రాతల్ని అక్షరాలుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి రాబోతోంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ప్రోసెసర్‌ తక్కువ వేడికి గురవుతుంది. విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు అనేక థర్డ్‌పార్టీ అప్లికేషన్లు లభిస్తున్నాయి. టాబ్లెట్‌ పిసితో పాటు అందించబడే పెన్‌ని ఉపయోగించి ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని, అప్లికేషన్లలోని మెనూలను యాక్సెస్‌ చేయవచ్చు. టాబ్లెట్‌ పిసిలో కీబోర్డును సైతం కనెక్ట్‌ చేసుకోగలిగే మోడళ్ళూ ఉన్నాయి. ఈ టాబ్లెట్లను ఒకందుకు రూపొందిస్తే తాడిని తన్నేవాడుంటే తలదన్నేవాడుంటాడన్నట్లు వాటిని చదువుకొనేందుకు ఎందుకు ఉపయోగించకూడదన్న ఆలోచన రావటమే తడవు ఉపయోగంలో పెట్టేశారు. ఇవి రానున్న రోజుల్లో మరో విప్లవానికి సాధనాలుగా మారనున్నాయి. పుస్తకాలు, పత్రికలు చదువుకోవటానికి మన చేతుల్లోకి ఇప్పటికే వచ్చేశాయి.
అత్యధిక సర్క్యులేషన్‌- మన స్థానం
వికీపీడియా తాజా సమాచారం ప్రకారం సర్క్యులేషన్‌ అంతర్జాతీయ ఆడిట్‌ బ్యూరో 2011 వివరాల మేరకు ప్రపంచంలో అత్యధికంగా ముద్రించే తొలి వంద దినపత్రికల్లో మన దేశంలోనే 17 ఉన్నాయి. ఇవన్నీ పదిలక్షలకు మించినవే. ఆంగ్లంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రపంచంలో మూడో స్థానంలో మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రాంతీయ భాషా పత్రికల్లో మన దేశంలో మొదటి స్థానంలో ఉన్న దైనిక్‌ జాగరణ్‌ ప్రపంచంలో ఏడవది. మన రాష్ట్రంలోని ఈనాడు పత్రిక మొదటి స్థానంలో ఉండగా దేశంలో ఐదవ, ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న వందలో కేవలం 35 పత్రికల సర్క్యులేషనే 2008 నుంచి వరుసగా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. మిగిలినవన్నీ తగ్గాయి. దీనికి ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దెబ్బ ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే కొన్ని పత్రికలు తమ సమాచారాన్ని ఇవ్వలేదని, కొన్ని తప్పుడు సమాచారాన్ని ముఖ్యంగా జపనీస్‌ పత్రికలు ఇచ్చినట్లు పేర్కొన్నది.

ఇక అసలు విషయానికి వస్తే చాలా సంవత్సరాల క్రితమే డాట్‌ కాం బూమ్‌లో అనేక ఎలక్ట్రానిక్‌ పత్రికలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు న్యూస్‌వీక్‌ చేయనున్నదేమంటే అచ్చంగా అచ్చులో మనకు కనిపించే మాదిరి పత్రికనే న్యూస్‌వీక్‌ గ్లోబల్‌ పేరుతో ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా మనకు అందించబోతోంది. సిడ్నీ హరమాన్‌ అనే వ్యాపారి 92 సంవత్సరాల వయస్సులో గతేడాది మరణించాడు. ఆడియో కంపెనీ యజమాని అయిన హర్‌మాన్‌ ప్రచురణ రంగం భవిష్యత్‌ ఎంత కాలం అన్న ప్రశ్న తలెత్తిన సమయంలో ఆ రంగంలోకి రావటం విశేషం. వాషింగ్టన్‌ పోస్టు కంపెనీ నుంచి న్యూస్‌ వీక్‌ను కేవలం ఒక డాలర్‌ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ప్రకటించుకున్నారు. 'వేనిటీ ఫెయిర్‌' పత్రిక మాజీ సంపాదకురాలు టీనా బ్రౌన్‌ను తన కంపెనీలోకి ఆహ్వానించాడు. అప్పటికే ఆమె బీస్ట్‌ అనే దినపత్రిక నడుపుతున్నారు. రెండింటినీ ఒకే యాజమాన్యం కింద విలీనం చేశారు. అయితే ఆకస్మికంగా బయటపడిన క్యాన్సర్‌తో హర్‌మాన్‌ కొంత కాలానికే మరణించాడు. న్యూస్‌వీక్‌ ప్రచురణ నిలిపివేత నిర్ణయాన్ని ఈ ఏడాది అక్టోబరులో టీనా బ్రౌన్‌ ప్రకటించారు. ప్రచురణ నిలిపివేత వలన ఏడాదికి 4కోట్ల డాలర్ల మేరకు నష్టం తగ్గుతుందని తెలిపారు.
టైమ్‌ మాగ్‌జైన్‌కు పోటీగా 1933లో ప్రారంభమైన న్యూస్‌వీక్‌ పాఠకుల మన్ననలు పొందింది. ఈ రెండు పత్రికల కోసం పాఠకులు ఎదురు చూసే వారు. అట్టమీది కథను వేరుగా ఇస్తాయా రెండూ ఒకటే ఇస్తాయా అన్న కుతూహలం ఉండేది. నష్టాలతో ఉన్న న్యూస్‌వీక్‌ను లాభాల బాటలో నడిపేందుకు దానికి మసాలా శృంగారాన్ని, రెచ్చగొట్టే శీర్షికలను జోడించి పాఠకులు, ప్రకటనదార్లను ఆకర్షించాలని చేసిన యత్నాల్లో భాగంగా నూతన యాజమాన్యం, సంపాదకురాలు టీనా చేసిన ప్రయోగం ఎదురుతన్నింది.
1991లో న్యూస్‌వీక్‌ పత్రిక గరిష్టంగా 33లక్షల కాపీలు అమ్ముడు పోయేది. ఈఏడాది జూన్‌కు అది 15లక్షలకు తగ్గింది. టైమ్‌కు ఉన్నన్ని వనరులు న్యూస్‌వీక్‌ పత్రికకు లేకపోవటంతో దానితో పోటీ పడలేకపోయింది. న్యూస్‌వీక్‌ పరిణామాలను చూసిన తరువాత వారపత్రికలు నడుపుతున్న అనేక మంది ఆలోచనలో పడ్డారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి అన్నదే ప్రశ్న. జపాన్‌, మెక్సికో, పాకిస్థాన్‌, పోలాండ్‌, దక్షిణ కొరియాలలో న్యూస్‌వీక్‌ ప్రచురణకు అనుమతి ఉంది. ఆసియాలో మరో రెండు కేంద్రాల నుంచి ప్రచురణకు సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ప్రచురణ నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టటానికి రెండు సంవత్సరాల క్రితం మాకు ధైర్యం కలగలేదు గాని డిజిటల్‌ పత్రికగా పాఠకుల వద్దకు వెళ్లగలమని, రానున్న రోజుల్లో ఈ క్రమం పెరగనుందని ఇప్పుడు విశ్వాసం కుదిరిందని పత్రిక సంపాదకురాలు టీనా బ్రౌన్‌ ముద్రణ మూసివేత ప్రకటనలో పేర్కొన్నారు.
గజెట్‌ స్వభావం మారెనే!
ప్రభుత్వ అధికారిక గజెట్‌ ప్రకటనలను ప్రచురించేందుకు ఉద్దేశించిన తొలి పత్రికలు నేడు వాటి స్వభావాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పత్రిక కూడా గజెట్‌లను ప్రచురించటం లేదంటే అతిశయోక్తి కాదు. తొలి పేజీలో వార్తలు ప్రచురించటం కూడా ఒకప్పడు అరుదైన అంశమే. మన దేశం విషయానికి వస్తే మొత్తం ఉపఖండాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటీష్‌ వారే ఇక్కడ పత్రికలను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రారంభించక ముందే ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ పోకడలను వ్యతిరేకించిన విలియం బోల్ట్‌ అనే సంపాదకుడు 1766లో నాటి బ్రిటీష్‌ వారి కేంద్ర స్థానమైన కొల్‌కతాలో ఆంగ్లేయుల కోసం ఒక పత్రికను ప్రచురించాడు. ఒక ప్రెస్‌ను కూడా ఏర్పాటు చేశాడు. రెండు సంవత్సరాల తరువాత ప్రభుత్వ వ్యతిరేక రాతల కారణంగా అతనిని స్వదేశానికి పంపివేశారు. బ్రిటన్‌ వెళ్లిన తరువాత ఈస్టిండియా కంపెనీల అవినీతి, అక్రమాలు, భారతీయుల కష్టనష్టాల గురించి ఐదువందల పేజీ పుస్తకాన్ని రాశాడు.ఆ తరువాతే 1780లో కొల్‌కతా సలహాదారు జేమ్స్‌ అగస్టస్‌ హిక్కే తొలి దినపత్రికగా పరిగణించబడే 'బెంగాల్‌ గజెట్‌'ను ప్రచురించాడు. 12 అంగుళాల పొడవు, ఎనిమిది అంగుళాల వెడల్పుతో నాలుగు పేజీల పత్రికను ప్రచురించాడు. అయితే అది కూడా కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండటం విశేషం. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం ఆ పత్రికకు అంతకు ముందు ఇచ్చిన పోస్టల్‌ అనుమతిని ఉపసంహరించింది. ఆ కారణంగానే హిక్కే తొలిసారిగా 20 మంది మనుషులను ఏర్పాటు చేసి పత్రికను పాఠకులకు అందించాడు. ఒక చర్చి మిషనరీ అక్రమాలకు వ్యతిరేకంగా వార్త రాయటమే ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అయినా పత్రిక ఆగక పోవటంతో పరువునష్టం దావా వేయించి ఐదు వందల రూపాయల జరిమానా, నాలుగు నెలల జైలుశిక్ష వేయించారు. దాంతో ఆ పత్రిక ఆగిపోయింది. హిక్కేకు వ్యతిరేకంగా ప్రభుత్వం 1781లో ఇండియా గజెట్‌ పేరుతో ఒక కొత్త పత్రికను ప్రారంభింపచేయించింది. భారత్‌ నుంచి వెలువడే పత్రికలు బ్రిటన్‌లోని రాజుగారి దగ్గర ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పాలకులు భయపడ్డారు. ఆ నాడు బ్రిటన్‌లో అచ్చయ్యే పత్రికలు మన దేశం రావాలంటే తొమ్మిది నెలలు పట్టేదట.

న్యూస్‌వీక్‌ యాజమాన్య చర్య వెనుక ఉన్న ప్రధాన కారణం పత్రికలో అందచేసే అంశాలు, వాటి నాణ్యత కాదు, అచ్చువేసి, పంపిణీ చేయటానికి అయ్యే ఖర్చు తగ్గింపు, దాని ఆదాయం పెంచటమే అసలైన సవాలు. యాజమాన్యం చేతులు మారినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అంకిత భావంతో పనిచేసిన సిబ్బంది వల్లనే దాని ప్రతిష్ట ఇప్పటికీ నిలిచింది. అమెరికాలోని మూడు ప్రధాన వార పత్రికల్లో 'యుఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్టు' 1933లో ప్రారంభమై 2010లో ప్రచురణ నిలిపివేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రమే వెలువడుతోంది. వచ్చే ఏడాదికి మిగిలేది టైమ్‌ ఒక్కటే. అయితే పాఠకులు ఇ-వారపత్రికలను ఆదరిస్తారా? న్యూస్‌వీక్‌ విషయాన్నే తీసుకుంటే ప్రస్తుతం అది ముద్రణ, మక్కీకి మక్కీ డిజిటల్‌ ఫార్మాట్‌లో కూడా వెలువడుతోంది. అయితే ముద్రించి అమ్ముడయ్యే కాపీలతో పోల్చితే డిజిటల్‌ సంచికను కేవలం 1.8 శాతం మాత్రమే తీసుకుంటున్నారని స్వయంగా వార్షిక ఆడిట్‌ రిపోర్టులో యాజమాన్యం పేర్కొన్నది. అయితే ప్రచురణ ఆగిపోయిన తరువాత డిజిటల్‌ చందాదార్లు పెరుగుతారని యాజమాన్యం ఆశిస్తోంది. అదే కంపెనీ వెలువరిస్తున్న బీస్ట్‌ దినపత్రికలో న్యూస్‌వీక్‌లోని కొంత సమాచారం ఇస్తున్నారు. ఈ కారణంగా ఒక నెలలో బీస్ట్‌ను నెట్‌లో చదివే పాఠకులు 1.5 కోట్లకు చేరారని, గతేడాది కాలంలో 70శాతం పెరుగుదల ఉందని చెబుతోంది. ఇదే న్యూస్‌ ముద్రణ నిలిపివేతకు ప్రేరణ కావచ్చు.
న్యూస్‌వీక్‌ మనుగడకోసం అనేకంటే దాని నుంచి లాభాలను పిండుకోవటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మసాలాలు జోడించటంతో పాటు సంపన్నుల పత్రికగా మార్చేందుకు అనేక సార్లు దాని తీరుతెన్నులను సవరించారు. 2009లో 'ఆలోచన-నాయకత్వం' అన్న ఇతివృత్తంతో కేవలం సంపన్నులను ఆకర్షించేందుకు కొన్ని మార్పులు చేశారు. దానిలో భాగంగానే తమ పత్రిక చందాల సంఖ్య 19లక్షల నుంచి 15లక్షలకు తగ్గుతుందని కూడా యాజమాన్యం ప్రకటనదార్లకు తెలిపింది. అంటే సంపన్నులకు తమ సమాచారం చేరాలంటే ప్రకటనలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తారని అది ఆశించింది. అయితే పదిశాతం పత్రికలు తగ్గుతాయనుకుంటే 34శాతం తగ్గినట్లు మరుసటి ఏడాది తేలింది.
న్యూస్‌వీక్‌ మూసివేత చర్చనీయాంశం కావటంతో వినియోగదారుల పత్రికలు ఆన్‌లైన్‌ ఆదరణ పొందుతున్నాయని ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో ఆర్థికంగా కూడా పరిపుష్టంగా ఉన్నాయని, న్యూస్‌ మాగజైన్లు అలాగే ఉంటాయని చెప్పలేమని ఎకనమిస్ట్‌ పత్రిక పేర్కొన్నది. అనేక సంస్థల నుంచి వెలువడుతున్న దినపత్రికలు ఒకవైపు ముద్రణ రూపంలో పాఠకులకు అందిస్తూనే వెబ్‌సైట్లను కూడా నిర్వహిస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని ప్రత్యేక స్టోరీలు లేదా సంక్షిప్త సమాచారంతో పాటు పత్రికల ఈ పేజీలను కూడా ఇస్తున్నాయి. ఎక్కువ భాగం ఉచితంగానే చదువుకోవచ్చు లేదా పరిమితంగా అందచేసేవి కూడా కొన్ని ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వంటి ఒకటి రెండు పత్రికలు మాత్రం ఆన్‌లైన్‌కు కూడా ముక్కుపిండి రుసుము వసూలు చేసున్నాయి. కొన్ని పత్రికలు ఇప్పటికే ముద్రణ విభాగాలను ఎత్తివేశాయి. నెదర్లాండ్స్‌లో 'డిఏజి', అమెరికాలో 'ది కాపిటల్‌ టైమ్స్‌' 2008లో, 2010లో ఆస్ట్రేలియన్‌ టైమ్స్‌ పత్రికలు ఆన్‌లైన్‌కు మారాయి. కొన్ని డిజిటల్‌ రూపంలో ఇస్తే మరికొన్ని పిడిఎఫ్‌ రూపంలో అందచేస్తున్నాయి. డిజిటల్‌ రూపంలో ఇస్తే ఎవరైనా సమాచారాన్ని తీసుకోవచ్చు. అదే పిడిఎఫ్‌లో ఇస్తే కేవలం చదువుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ అచ్చు పేజీలలో ఇచ్చే సమాచారాన్ని మొత్తంగా ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నది.
కొన్ని కేవలం ఆన్‌లైన్‌(ఇంటర్నెట్‌) పత్రికలుగానే ప్రారంభమయ్యాయి. టీవీలు, రేడియోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవటానికి ఆన్‌లైన్‌ పత్రికలు కూడా ఎప్పటి కప్పుడు సమాచారాన్ని వెబ్‌లో పెడుతున్నాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికల యాజమాన్యాలకు టీవీ, రేడియోలు ఉన్నందున వాటికోసం తయారు చేసిన సమాచారాన్ని పత్రికల వెబ్‌సైట్లలో కూడా వెంటనే పెడుతున్నాయి. మన దేశంలోని పత్రికలు భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నాయి. హిందూ వంటి ఆంగ్ల పత్రికలు రాత్రి పొద్దుపోయే వరకు వార్తా సంస్థలు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే తమ సైట్లలో పెడుతున్నాయి. తమ విలేకర్లు ఇచ్చే వార్తలు, విశ్లేషణలు, వ్యాసాలను అచ్చు పత్రిక వెలువడిన తరువాత పొద్దుపోయాక వెబ్‌లో పెడుతున్నాయి. కొల్‌కతా నుంచి వెలువడే 'ది టెలిగ్రాఫ్‌' వంటి పత్రికలు ఎంతో ముఖ్యమైన ఘటనలు జరిగితేనే ఎప్పటికప్పుడు వార్తలను వెబ్‌సైట్‌లో పెడుతున్నాయి. ఆన్‌లైన్‌ ఎడిషన్లతో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. అచ్చు అయిన వార్తలు, వ్యాఖ్యలపై కొన్ని చట్టపరమైన సమస్యలు ఉంటాయి. వాటిని తప్పించుకొనేందుకు, మరింత సమాచారాన్ని ఇచ్చేందుకు పత్రికల వెబ్‌సైట్లు బ్లాగులను ఏర్పాటు చేశాయి. వాటిలో రాసే అంశాలన్నీ పత్రికల్లో అచ్చుకావు. పత్రికల్లో రాసేవారే వాటికి కూడా రాస్తున్నప్పటికీ చట్టపరిధినుంచి తప్పించుకోవచ్చు. బ్రిటన్‌ వంటి ఒకటీ అరా దేశాల్లో తప్ప బ్లాగుల్లో వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించే చట్టాలు లేవు. ఇదంతా మీడియా, కమ్యూనికేషన్‌ రంగంలో వచ్చిన పోటీ నుంచి తట్టుకొని నిలబడేందుకు, ఖర్చులు తగ్గించుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. దీన్నే కన్వర్జెన్స్‌ అంటున్నారు. అంటే ముద్రణ, టీవీ, రేడియో, బ్లాగ్స్‌, వెబ్‌ సైట్లలో ఒక దగ్గర రూపొందించే సమాచారాన్ని అన్ని విభాగాలు ఉపయోగించుకోటం. దీనివలన ఖర్చు, సమయం కూడా ఎంతో తగ్గుతుంది. వాణిజ్య ప్రకటనలు కూడా ఇందుకు అనుగుణంగానే రూపొందుతున్నాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్లుగా అన్ని రకాల మీడియా విభాగాలున్న కంపెనీలు ప్రకటనదార్లకు పాకేజీలు ప్రకటిస్తున్నాయి. 2008లో ధనిక దేశాల్లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం మీడియాలో అనేక మార్పులకు నాంది పలికింది. సంప్రదాయ వ్యాపారాలు కుప్పకూలాయి. అమెరికాలో 'సియాటిల్‌ పోస్ట్‌-ఇంటిలిజెన్సర్‌' అనే పత్రిక 149 సంవత్సరాల ముద్రణా విభాగాన్ని 2009లో నిలిపివేసి ఆన్‌లైన్‌కు పరిమితమైంది. అనేక పత్రికలు ఇదే బాట పట్టాయి. కన్వర్జెన్స్‌ పెరిగింది.
ఆన్‌లైన్‌ పత్రికల్లో 1991లో ప్రారంభమైన 'వీకెండ్‌ సిటీ ప్రెస్‌ రివ్యూ' తొలి దినపత్రికల్లో ఒకటి. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. దాన్నుంచి సమాచారం పొందాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతకు ముందు 1974లోనే ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం 'న్యూస్‌ రిపోర్టు' పేరుతో ఒక ఆన్‌లైన్‌ పత్రికను ప్రారంభించిందిగాని అది అందరికీ అందుబాటులోకి రాలేదు. బ్రెజిల్‌లో 1987లో జర్నల్‌డోడియా అనే పత్రికను ఆన్‌లైన్‌లో పెట్టినప్పటికీ అది కూడా పరిమితమైనదే. 1991 తరువాతే అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
ఆన్‌లైన్‌లో చదువుకొని కళ్లను కష్ట పెట్టటం ఎందుకనుకొనేవారికోసం కొన్ని కంపెనీలు కన్వర్జెన్స్‌లో భాగంగా పాడ్‌ కాస్ట్‌ పేరుతో చదివి వినిపించే సేవను కూడా ప్రారంభించాయి. హిందూ దినపత్రిక తన సంపాదకీయాలను నాలుగు దక్షిణాది భాషల్లోకి తర్జుమా చేయించి ఉచితంగా వినిపిస్తోంది. బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక 2005లో అలాంటి ఉచిత సేవను ప్రారంభించింది. చెల్లించే రుసుమును బట్టి సెల్‌ఫోన్లకు సమాచారం, వార్తలను పంపే సేవలను కూడా మీడియా సంస్థలు అందిస్తున్నాయి.

గూటెన్‌ బర్గ్‌ ముద్రణా విశేషాలు
జాన్‌ గూటెన్‌ బర్గ్‌ అచ్చు యంత్రాన్ని కనుగొన్నప్పటికీ వెంటనే బహుళ ఉపయోగంలోకి రాలేదు. లభ్యమైన అసంపూర్ణ చరిత్రమేరకు క్రీస్తు శకం 200 సంవత్సరంలో చెక్కపై అక్షరాలను చెక్కి ముద్రించినట్లు చెబుతారు. తరువాత ఒక చోటి నుంచి మరోచోటికి కదలించే టైప్‌ 1040లో, ఆ తరువాత 1454లో గూటెన్‌బర్గ్‌ ముద్రణ యంత్రం, 1500 సంవత్సరంలో లోహాలపై యాసిడ్‌ పోసి బొమ్మలు, అక్షరాలు రూపొందించటం, 1642లో లోహపు రేకుపై బొమ్మల రూపం వచ్చేట్లుగా(హాఫ్‌టోన్‌) వేలాది చుక్కలను పెట్టటం, 1768లో లోహపు రేకుపై బొమ్మలు, అక్షరాల చుక్కలకు ఇంకు అద్ది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ముద్రించటం, 1796లో నిన్నమొన్నటి వరకు ఉపయోగంలో ఉన్న లిథోగ్రఫీ(నున్నటి రాయిపై అక్షరాలను రాసి వాటి ప్రతిరూపాన్ని కాగితం లేదా వస్త్రంపై ముద్రించే ప్రక్రియ) 1837లో ఒకటి కంటే ఎక్కువ రంగుల్లో లిథోగ్రఫీ పద్ధతిలో ముద్రించటం, 1843లో రోటరీ ప్రింటింగ్‌, 1875లో ఆఫ్‌సెట్‌, 1886లో లోహంతో అక్షరాల తయారీ, ముద్రణ, 1890లో స్టెన్సిల్‌ కటింగ్‌, 1907లో స్క్రీన్‌ ప్రింటింగ్‌, 1923లో డూప్లికేటింగ్‌ మిషన్‌, 1957లో కంప్యూటర్‌ ప్రింటర్‌, 1960 దశకంలో ఫొటోటైప్‌ సెట్టింగ్‌, 1964లో డాట్‌మాట్రిక్స్‌ ప్రింటర్‌, 1969లో లేజర్‌ ప్రింటర్‌, 1972లో థర్మల్‌ ప్రింటర్‌, 1976లో ఇంక్‌జెట్‌, 1986లో త్రీ డి ప్రింటింగ్‌, 1993లో డిజిటల్‌ ప్రెస్‌ ఉనికిలోకి వచ్చాయి. ఇప్పుడు టాబ్లెట్లు ఉనికిలోకి రావటంతో అసలు ముద్రణ, యంత్రాలతోనే అవసరం లేకుండా పోయింది.
చేతితో గంటకు జాన్‌ గూటెన్‌ బర్గ్‌ ఎన్ని పేజీలను ప్రచురించాడని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పటం కష్టం. లభ్యమైన సమాచారం ప్రకారం ఆయన అచ్చువేసింది బైబిల్‌. పేజీకి 42లైన్లు ఉన్నాయి. అడుగున్నర పొడవు, అడుగు వెడల్పు కాగితంపై ముద్రించారు. నిపుణుల అంచనా ప్రకారం ఒక్కొక్క పుస్తకంలో 42లైన్లున్న పేజీలు 1,272 ఉన్నాయి. రెండువందల కాపీలను ముద్రించటానికి కనీసం ఐదు సంవత్సరాలు పట్టి ఉంటుందని పేర్కొన్నారు. అంటే రోజుకు పన్నెండు గంటలు పనిచేసి ఉంటే 163 పేజీలను ప్రచురించి ఉంటారు. గంటకు పదమూడున్నర పేజీలని చెప్పవచ్చు. మరొక అంచనా ప్రకారం గంటకు 20-30 పేజీలు ముద్రించి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. గూటెన్‌బర్గ్‌ ప్రెస్‌ తరువాత నాలుగు వందల సంవత్సరాలకు 1880లో రూపొందించిన యంత్రంపై గంటకు 480 పేజీలు అచ్చు వేశారు. ఆ తరువాత 50 ఏళ్లకు గంటకు రెండున్నరవేలు అచ్చువేశారు. ఇప్పుడు గూటెన్‌ బర్గ్‌ పేజీలకు ఎనిమిది రెట్ల పెద్దవైన పేజీలను గంటకు లక్ష కాపీలవరకు ముద్రించగలుగుతున్నాము. అదీ ఒకేసారి రెండువైపులా అని గమనించాలి. 

Courtesy with: Prajashakthi Daily

Wednesday, 2 January 2013

మొక్కలు.. స్సందనలు..

పొద్దుతిరుగుడు మొక్కల్ని ఎప్పుడైనా పరిశీలించారా? లేకపోతే పరిశీలించండి. పేరుకు తగినట్లుగానే ఈ మొక్కల్లో పువ్వు, పుష్పించే కాండం పైభాగం రోజంతా సూర్యుని దిశలో తిరుగుతూనే వుంటాయి. దీన్ని సూర్యరశ్మి వచ్చే దిశకు ఈ మొక్కల స్పందనగా చెప్పుకోవచ్చు. మొక్కలు జంతుజీవాల్లాగా కదలలేవు. వేళ్లతో ఒకేచోట పాతుకునిపోయి పెరుగుతుంటాయి. అందువల్ల, చుట్టూ వున్న పరిసరాల్లో వచ్చిన, వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్ని మొక్కలూ స్పందించాల్సి వస్తుంది. తనంతతానే సర్దుకు పోవాల్సి వుంటుంది. ఇది సహజం. పరిసరాల్లో జరిగే రసాయనిక, గురుత్వాకర్షణ శక్తి, కాంతి, తేమ, అంటురోగ కారకాలు, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిణామాలు, పరాన్నభుక్కుల దాడి, భౌతికమార్పులు, స్పర్శ మార్పులను గ్రహించి తదనుగుణంగా మొక్కలు స్పందిస్తాయి. ఈ స్పందనలలో ఇమిడివున్న ప్రత్యక్ష కారకాలు, పద్ధతులపై పరిశోధనలు జరిగాయి. వీటి ఆధారంగా 'పరిసరాలను' మొక్కలకు అనుగుణంగా మార్చుకుంటూ వాటి పెరుగుదలను, దిగుబడులను పెంచుకునే పరిశోధనలు కొనసాగాయి. కొనసాగుతున్నాయి. వీటికి వృక్ష ధర్మశాస్త్రం (ప్లాంట్‌ ఫిజియాలజీ), పరిసరాల విజ్ఞానం, అణు జీవశాస్త్రాల అవగాహన అవసరం. వీటికి సంబంధించిన విజ్ఞానాన్ని ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
'అత్తిపత్తి (టచ్‌ మి నాట్‌)' ఆకుల్ని ఏదో భాగంలో తాకగానే మిగతా ఆకులన్నీ ముడుచుకుపోతాయి. ఇలా ముడుచుకుని పోవడం విద్యుత్‌ సంకేతాల ప్రసారాల మీద ఆధారపడి వుంటుంది. ఇదే విధంగా లేత తీగమొక్కలు పైకి పెరగడానికి 'ఆధారాన్ని (సపోర్టును)' గుర్తించగానే ఊతం కోసం మొక్కల నులి తీగలు చుట్టూ అల్లుకుపోయి గట్టిపడతాయి. ఆ తర్వాత ఎండి, పెరిగే మొక్కకు బలాన్ని చేకూరుస్తాయి. ఇలాంటి స్పందనల గుర్తింపు కణ స్థాయిలో జరుగుతుంది.
ఈ స్పందనలకు వీలుగా మొక్క తన పరిసరాల్లో వచ్చిన భౌతికమార్పుల్ని మొదట గుర్తిస్తుంది. కదలలేని స్థితిలో మొక్కలు వుండడంతో తదనుగుణంగానే అవి స్పందిస్తాయి. 'పాప్లర్‌' అనే చెట్లు వంగిపోతూ, పునర్దిశ మార్పులను గుర్తించగలుగుతాయి.
గాయపడిన టామాటా చెట్లు తేలికగా ఆవిరయ్యే 'మిథైల్‌ జాస్మొనేట్‌' అనే రసాయనాన్ని విడుదల చేసి, తమ ఇతర కొమ్మలను, చుట్టుపట్ల వున్న చెట్లకు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తాయి. తద్వారా రాబోయే కీటకాల దాడి నుండి రక్షించుకునే అవకాశాన్ని మొక్కలకు కలిగిస్తాయి. ప్రత్యామ్నాయంగా మిత్ర పురుగుల (ప్రెడేటర్స్‌) ను ఆకర్షించి, కీటక దాడి నుండి రక్షించుకుంటాయి.
చీకటి గదిలో మొక్కల్ని వుంచి, ఒక చిన్న రంధ్రం ద్వారా మాత్రమే వెలుగును ప్రసరింపజేస్తే ఆ మొక్క కాండం కాంతి వచ్చే దిశకు వంగి పెరుగుతుంది. దీనికోసం మొక్కలు కాంతినిచ్చే దిశను మొదట గుర్తించి, దాని పరిమాణాన్ని, రంగును (కాంతి తరంగదైర్ఘ్యం) గుర్తించి దానికనుగుణంగా స్పందించాల్సి వుంటుంది. ఉదాహరణకు ఒక ఆలుగడ్డ చీకట్లో పెరగాల్సి వస్తే మొలిచి పెరిగే కాండం, వేళ్లు మామూలుగా వుండవు. అనారోగ్యంగా కనిపిస్తాయి. చీకట్లో పెరగాల్సి వచ్చినందువల్ల ఇవి ఇలా సర్దుబాటు చేసుకుంటాయి. అయితే, ఇలా పెరిగిన కాండం, వేరుగల గడ్డను మామూలు వెలుతురుకు మార్చితే, కాండం, వేళ్లు సహజ రంగుల్లోకి మారి, మామూలుగా పెరుగుతాయి.
ఈ మార్పుల్లో 'ఫైటోక్రోం' అనే పిగ్మెంట్‌ (రంగునిచ్చే రసాయనం) కాంతిని గ్రహించి, మొక్కకు అందించడంలో తోడ్పడుతుంది. ఫలితంగా, మొక్క మామూలు పెరుగుదల పునరుద్ధరించబడుతుంది.
హార్మోన్ల గుర్తింపు..
బయట మార్పులకు స్పందనగా, మొక్కలు వంకరగా తిరిగి పెరగడాన్ని (బొమ్మలోలాగా) 'ట్రోపిజం' అని అంటారు. ఇది తరచుగా హార్మోన్ల (సూక్ష్మ పరిమాణంలో వుంటూ పెరుగుదలను నియంత్రించే ఒక విధమైన రసాయనాలు) వల్ల జరుగుతుంది. మొక్కల పెరుగుదల, పునరుత్పత్తులపై పరిసర ఒత్తిళ్ల (ఎన్విరాన్‌మెంటల్‌ స్ట్రెస్‌) ప్రభావం కలిగి వుంటాయి.
వేళ్ళు ఎల్లప్పుడు భూమ్యాకర్షణ శక్తికి అనుగుణంగా నేలలోకి చొచ్చుకునిపోయి పెరుగుతాయి. కాండం భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వెలుతురును వెతుక్కుంటూ పెరుగుతుంది.
వివిధ భాగాల వృద్ధిని సమన్వయంతో కొనసాగించుకునేందుకు హార్మోన్ల సంకేతాల్ని మొక్కలు ఒక పద్ధతి ప్రకారం వినియోగించుకుంటాయి. అయితే, జంతువుల నాడీవ్యవస్థలోలాగా, మొక్కల్లో కూడా 'ఎసిటైల్‌ కోలిన్‌ ఎస్టరేస్‌' వంటి ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. తద్వార జంతువుల్లోలాగా తమలో తాము చుట్టుపక్కల మొక్కలకు సమాచారాన్ని చేరవేస్తాయి.
విద్యుత్‌ ప్రేరణ..
పరిసరాల్లో వేగంగా వస్తున్న మార్పుల్ని 'విద్యుత్‌ ప్రేరణ' ద్వారా మొక్కల కణాలు గ్రహిస్తాయి. ఆ వెనువెంటనే ప్రతిస్పందిస్తాయి. ఈ స్పందనలు మరెన్నో రసాయనిక అణువుల రూపకల్పనను ప్రేరేపిస్తాయి. వీటి ద్వారా మొక్కలు పరిసరాల మార్పులకు అనుగుణమైన ప్రతిస్పందనలను అందిస్తాయి. దీనర్థం జంతువుల్లోలాగా మొక్కలు కూడా 'న్యూరాన్‌' కణాల ద్వారా సంకేతాల్ని పొందుతాయని కాదు. అభివృద్ధి చెందిన నాడీవ్యవస్థ జంతువుల్లోలాగా వృక్షాల్లో ఉండదు. కానీ, పరిసరాల మార్పులకు ప్రతిస్పందనగా కణాల్లోని జీవపదార్థం(సైటోప్లాస్మిక్‌), మొక్క భాగాలు, దెబ్బతిన్న ప్రాంతాలు, శ్వాస, కిరణజన్య సంయోగక్రియ, పుష్పించడం వంటి క్రియల రూపంలో ప్రతిస్పందనలు వెలువడతాయి. మొదటి ప్రతిస్పందనలను ఫైటోక్రోమ్‌, కైనిన్స్‌, హార్మోన్లు, రోగ నిరోధకశక్తి కలిగించని ఇతర రసాయనాల విడుదల, నీరు, రసాయనాల రవాణాలో మార్పులు, ఇతర పద్ధతుల ద్వారా తెలియజేస్తాయి. అయితే, ఇవి సాధారణంగా నెమ్మదిగా వుంటాయి. అయితే, కొన్ని సందర్భాలలో ఈ ప్రతిస్పందనలు అత్తిపత్తిలోలాగా వేగంగా కూడా వుండొచ్చు.
రోజూ 'పగటి సమయాని'కి స్పందిస్తూ మొక్కలు పుష్పించి, ఫలిస్తాయి. ఇవి కాంతి పరిమాణం ఆధారంగా ఏర్పడే రసాయనాల (హార్మోన్లు) ఉత్పత్తికి ప్రతిస్పందిస్తూ పుష్పించి, ఫలాల్ని అందిస్తాయి. అననుకూల పగటి సమయాన్ని ఎదుర్కొన్నపుడు మొక్కలు అసలు పుష్పించకపోవచ్చు. ఆయా ప్రాంతాలకు అననుకూల పంటలను, పంటల్లో రకాలను ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి వైఫల్యాలు బయటపడతాయి. కొన్నిరకాల మీద పగటి సమయం ప్రభావం అంతగా వుండదు. ఇలాంటి పంటల్ని 'దిన ప్రభావం లేని' (డే న్యూట్రల్‌) రకాలుగా గుర్తిస్తున్నారు. ఇవి అభిలషణీయమైనవి. స్థానిక వాతావరణ ఉష్ణోగ్రతలకు కూడా మొక్కలు ఇలానే స్పందిస్తాయి. అందువల్ల వేసే పంటలు, ఎంపిక చేసుకునే రకాలు, స్థానిక ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండాలి.
కీటక దాడిని ఎదుర్కోడానికి మొక్కలు ఎన్నో వ్యూహాలను అనుసరిస్తాయి. ఉదాహరణకు దాడి చేసే శత్రు కీటకాలను ఎదుర్కోడానికి విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని 'ఫైటో అలెక్సిన్‌' రసాయనాలుగా పిలుస్తారు. ఈ విషం శత్రు కీటకాల జీవకణాల్ని వేగంగా చంపుతాయి.
మాంసాహార మొక్కలు..
అందరికీ శాఖాహారాన్ని అందించే మొక్కల్లో కొన్ని కీటకా లను, జంతుజాలాల్ని తిని, అరాయించుకునే మొక్కలున్నా యంటే నమ్ముతారా? ఇది అక్షరాలా సత్యం. ఇవే మాంసా హార మొక్కలు.వీనస్‌ అనే మొక్క బొమ్మలో చూపిన విధంగా తన ఆకుల మీద ఏదైనా కీటకం, చిరుకప్ప వంటివి వాలితే వెంటనే ఆకులు ముడుచుకుపోయి వాటిని బంధిస్తాయి. ఇలా బంధించిన ఆకులోనే అవి చనిపోయి, జీర్ణమవుతాయి. ఇలా మరెన్నో ఇతర మొక్కల్ని కూడా గుర్తించారు. అయితే, ఈ ఆకుల స్పందన అకస్మాత్తుగా వుండి, కీటకాల్ని పట్టుకోవడానికి తోడ్పడుతుంది. ఇది ఒక విధమైన విద్యుత్‌ ప్రసార ప్రేరణ.

అననుకూల స్థితిలో..
నేలలో తేమ తగ్గి, బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతిస్పందనగా మొక్కలు బాష్పోత్సేకాన్ని (ట్రాన్సిపిరేషన్‌) తగ్గించుకుంటాయి. దీనికోసం ఆకుల కింది భాగంలో వున్న పత్రరంధ్రాలను మూసివేస్తాయి. ఆకులు దళసరిగా మారిపోతాయి. వేళ్ళు లోతుకు పెరిగి, మిగిలి వున్న తేమను మొక్కకు అందించే కృషి చేస్తాయి. ఇక, వరదల సమయంలో ప్రత్యేక ఎంజైమ్‌ల (రసాయనాల) ద్వారా మొక్కలోని కొన్ని కణాలు నాశనమవుతాయి. తద్వారా ఏర్పడిన ఖాళీల్లో ఆక్సిజన్‌ ట్యూబ్స్‌ రూపొందుతాయి. వీటిద్వారా మొక్కకు ఆక్సిజన్‌ అందిస్తూ బతకడానికి తోడ్పడతాయి. లవణాలు అధికంగా వుండే ఉప్పు నేలల్లో మొక్కలు దుష్ప్రభావాల్ని తగ్గించగల కొత్త లవణాలను ఏర్పడేలా ప్రతిస్పందిస్తాయి. తద్వార మొక్కల జీవనం కొనసాగేలా తోడ్పడతాయి.

జగదీష్‌ చంద్రబోస్‌..
మొక్కల్లో కూడా జంతువుల్లోలాగే నాడీ మండలం వంటి సమాచార వ్యవస్థ వుందని, దానికి ప్రేరణలకు ప్రతిస్పందించే గుణం వుందని ప్రపంచలోనే మొట్టమొదట గుర్తించిన శాస్త్రజ్ఞుడు 'సర్‌ జగదీష్‌ చంద్రబోస్‌'. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అంశాన్ని 20వ శతాబ్ధపు ప్రారంభంలోనే ఆయన గుర్తించాడు. జంతు నాడీ మండల ప్రతిస్పందన లకు, మొక్కల్లోని ఈ ప్రతిస్పందనలకు ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలున్నాయని, ప్రయోగాల ద్వారా నిరూపించాడు 'సర్‌ జగదీష్‌ చంద్రబోస్‌'. ఈ పరిశోధనలకు కావలసిన ముఖ్య పరికరాన్ని తానే స్వయంగా రూపొందించు కున్నాడు. అతికొద్ది మొక్కల ప్రతిస్పందనలను కొలవగలిగే ఈ పరికరమే 'క్రెస్కోగ్రాఫ్‌'.
'సర్‌ జగదీష్‌ చంద్రబోస్‌' అప్పటి బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని బిక్రమ్‌పూర్‌లో 1858, నవంబరు 30న జన్మించాడు. సుమారు 78 ఏళ్ల వయస్సులో చనిపోయాడు.
ఈయన జీవ భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, పురావస్తు శాస్త్రం, బెంగాలీ సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఈయన వైర్‌లెస్‌ సిగలింగ్‌ పరిశోధనలో కూడా అద్భుతమైన ఆవిష్కరణలను చేశాడు. అయితే, దీని గొప్పదనం వెంటనే గుర్తింపుకు నోచుకోలేదు.
క్రెస్కోగ్రాఫ్‌..
మొక్కల్లో కొద్దిపాటి స్పందనలను, పెరుగుదలను నిర్ధారించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. 20వ శతాబ్ధ ప్రారంభంలో 'సర్‌ జగదీష్‌ చంద్రబోస్‌' రూపొందించిన ఈ పరికరాన్ని మొక్కల్లో ప్రతిస్పందనల్ని అంచనా వేయడానికి వినియోగించాడు. ఇది 10 వేల రెట్లకు పెంచి, పెద్దదిగా చూపుతుంది. దీనిని ఉపయోగిస్తూ కొన్ని సెకన్లలోనే మొక్క పెరుగుదలను, స్పందనలను కొలవవచ్చు. ఇటీవల అభివృద్ధి చేసిన దీని నమూనాలు అందుబాటులోకి వచ్చాయి.

Courtesy: Prajaskthi Daily

కొత్త సంవత్సరం భావనకు శాస్త్రీయ ఆధారం ఉందా?

మీకు, ప్రజాశక్తి పాఠకులకు నూతన సంవ త్సర శుభాకాంక్షలు. ఇలా నూతన సంవత్సర శుభా కాంక్షలకు కారణమైన కొత్త సంవత్సరం భావనకు శాస్త్రీయ ఆధారం ఉందా?
- కె. రాజమౌళి, రీసెర్చి స్కాలర్‌, నిట్‌, వరంగల్‌
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రజాశక్తి సిబ్బందికి, పాఠక మిత్రులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇపుడిక ప్రశ్నలోని 'నూతనాని'కి వద్దాం.
శాస్త్రీయంగా (భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం, భౌగోళికశాస్త్రం మొదలైన శాస్త్రాల ప్రకారం) చెప్పాలంటే 'నూతన సంవత్సరం' అనే భావనకు ఆధారం, ఆస్కారం, నిర్వచనం లేవు. ఎందుకంటే క్యాలండర్‌లోని దినాలు మానవ సమాజం చేసుకున్న అనుకూల ఘటనలు. కానీ సాధారణ దినానికి (normal day) ఎంతో కొంత శాస్త్రీయ ఆధారం ఉంది. ఒకానొక భౌగోళిక ప్రాంతంలో ఉన్న బిందువు (location) దగ్గర వెలుతురు, చీకటి ఒకే విధంగా ఉండకుండా పదే పదే చక్రీయంగా (cyclically), హఠాత్మకం (periodically or harmonically) గా మారుతుంటాయి. భూమికున్న ఆత్మభ్రమణ (spin) యంత్రాంగంవల్ల సూర్యుడి వైపున్న భూతల ప్రాంతం మారుతూ ఉంటుంది. భూమి మన గడియారంలోని కాలమానాల ప్రకారం 24 గంటలు ఆవర్తన కాలం (period) ఉండేలా తనచుట్టూ తాను తిరుగుతోంది. అందువల్ల భారతదేశంలోని వరంగల్లు ప్రాంతంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుఝాము, మళ్లీ ఉదయం... ఇలా సూర్యునికాంతి తీవ్రతలు వరంగల్‌ ప్రాంతానికి, సూర్యుడికి మధ్య గీచిన ఊహా సరళరేఖ సుదూర నీలాకాశంలో ఏయే తారల్ని నక్షత్ర సమూహాల్ని తాకుతున్నదో అన్న ఖగోళ సాపేక్షతను బట్టి చక్రీయంగా తటస్థిస్తున్నాయి. అయితే అదే వరంగల్‌లో సూర్యుడు తూర్పున పొడుస్తుంటే వరంగల్‌కు పశ్చిమదిశలో ఉన్న నిజామాబాదులో సూర్యుడు ఇంకా పొడిచి ఉండడు. వరంగల్‌కు తూర్పున ఉన్న విజయ వాడలో ఆపాటికే సూర్యుడు పొడిచేసి ఉంటాడు. భారతదేశం లో భువనేశ్వర్‌లో సూర్యోదయం అయి సూర్యుడికాంతిలో చలి కాచుకుంటున్నా (గడియారం ప్రకారం ఉదయం 7 గంటలకు) ముంబయి, భావనగర్‌, రాజ్‌కోట్‌ వంటి నగరాలు ఇంకా చీక ట్లోనే ఉంటాయి. అంటే ఖగోళశాస్త్రం ప్రకారం భువనేశ్వర్‌, విశాఖపట్నం, నిజామాబాద్‌, అమలాపురం ప్రాంతాల్లో సూర్యో దయమైనా మనదేశంలోనే మరికొన్ని చోట్ల సూర్యుడింకా కని పించడు. కాబట్టి ఆ ప్రాంతాల్లో పగలు కాదు. అదేవిధంగా ముంబయి, గోవా, రాజ్‌కోట్‌లలో సూర్యాస్తమయం అవుతూ అక్కడ కొండల చాటుకో, సముద్రం నీటి తలంలోకో సూర్య బింబం ఇంకిపోతుండగా ఆపాటికే విశాఖపట్నం, భువనేశ్వర్‌ లలో సూర్యాస్తమయం జరిగి గంటసేపయి ఉంటుంది. అక్కడ అప్పటికే చీకట్లు వచ్చి ఉంటాయి. ఇలా ఒకే దేశంలోనే వరం గల్‌కు తూర్పుపడమర, ఉత్తరదక్షిణ ప్రాంతాలలో కూడా సూర్యోదయం, సూర్యాస్తమయాలు వరంగల్‌లో లాగానే (సెకన్లలో కూడా భాగాలు చేసి చూసినట్లయితే) ఉం డవు. ఇందుకు కారణం భూమికున్న గోళీయాకృతి (spherical shape). కానీ సౌలభ్యం కోసం ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే కాలమానం ఉండాలి కాబట్టి భారత కాలమానం (Indian Standard Time, IST) అంటూ అందరం మన గడియారాల్ని ఏక కాలికం (synchronisation) చేసుకున్నాం. మనకు ఇక్కడ మిట్ట మధ్యాహ్నం కాగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో దాదాపు అర్ధరాత్రి చీకటి ఉంటుంది. మనతో పోల్చుకుంటే, మన క్యాలెండర్‌ ప్రకారం మనకు ఇపుడు జనవరి 1 ఉదయం కాగా అక్కడ ఇంకా డిసెంబరు 31 సాయంత్రంగా ఉంటుంది. అంటే ఇక్కడ డిసెంబరు 31 అర్ధరాత్రి దాటి మనమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉబ లాటంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుం టుండగా పాకిస్తాన్‌ వాళ్లు మరో గంట, బ్రిటిష్‌వారు మరో ఐదున్నర గంటలు, ఆఫ్రికా వాసులు మరో ఏడెనిమిది గంటలు, అమెరికావాళ్లు దాదాపు మరో 12 గంటలు ఆగితేగానీ నూతన సంవత్సర శుభా కాంక్షలు చెప్పుకోలేరు. అక్కడ అమెరికాలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటుండగా మనం చెప్పేసుకొని అలసిపోయి జనవరి 1 మధ్యాహ్నం గడుపుతుంటాము.
కాబట్టి ఖగోళశాస్త్రం ప్రకారం భూమ్మీద ఎప్పుడైనా ఎక్కడైనా (any time any whereకి మరో రూపంలో) ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రాలు ఉంటాయి. మనం వరంగల్‌లో భావించే రోజువారీ, ఘటనలు మరోచోట మరో సమయంలో తటస్థిస్తుంటాయి. అంటే రోజులు, సమయాలు అన్నీ భౌగోళికంగా సాపేక్షం.
అలాగని ఋతువులు (seasons) కచ్ఛితం (absolute) అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచంలో అందరిదీ ఒకే విధమైన ఋతు భావన ఉండడంలేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న భ్రమణాక్షం (spinning axis), భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న పరిభ్రమణం కక్ష్యాతలా (orbital plane దీనినే elliptic plane అంటారు) నికి సుమారు 23 డిగ్రీల కోణంలో వంగి ఉన్నందువల్లే ఋతు వులు సంక్రమిస్తున్నాయని వినే ఉంటారు. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరం తగ్గడం వల్ల వేసవి అనీ, దూరం పెరిగినపుడు చలికాలం అనీ భావించినట్లయితే అది పూర్తిగా అశాస్త్రీయం. ఎందుకంటే వేసవి కాలంలోనే భూమి శీతాకాలంలో కన్నా సూర్యుడికి దూరంగా ఉంటుంది. అది వేరే విషయం. మే, జూన్‌ నెలల ప్రాంతంలో మనం భారతదేశం లోని దక్కన్‌ ప్రాంతాల్లో విపరీతమైన వేసవి వేడితో ఉండగా ఆస్ట్రేలియా వంటి దేశాలకు, అంటార్కిటికా ధృవప్రాంతానికి అపుడు విపరీతమైన చలి. డిసెంబరు, జనవరి వంటి నెలల్లో మనం చలిలో వణుకుతుండగా అదే ఆస్ట్రేలియాలో వేసవి ఉంటుంది. పోనీ ఇదే తంతు శాశ్వతమా అంటే కాదు. దాదాపు ప్రతి 20 వేల సంవత్సరాలకోమారు భూమి భ్రమణాక్షం శంఖాకార వర్తుల గమనం (precession) చేస్తుంది. తిరుగుతున్న బొంగరం తనచుట్టూ తాను తిరుగుతూనే (spinning) తన శిరోభాగం కూడా దిశను మార్చుకుంటూ తిరగడాన్ని (wobbling) గమనించండి. ఈ దిశాభ్రంశ wobbling చలనం భూమి అనే బొంగరానికి కూడా వర్తిస్తుంది. తద్వార ప్రతి 20 వేల సంవత్సరాలకో మారు ఋతువుల ఆవర్తనం (periodicity) ఒక ప్రాంతంలో మారుతూ ఉంటుంది. అంటే వరంగల్‌లో నేటి దశలో మన క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో మండటెండల వేసవి కాగా, నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు చలికాలం. కానీ మరో పదివేల సంవత్సరాల తర్వాత ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వరంగల్‌లో విపరీతమైన చలి ఉంటుంది. అదే నవంబరు, డిశంబరు, జనవరి నెలల ప్రాంతంలో మండుటెండలు కాస్తూ ఉక్కపోత పోసే వేసవి తటస్థిస్తుంది. ఆ దిశలో క్రమేపీ ఉన్నాం కాబట్టి ఇప్పటికే ఋతువుల భావనలో కొంచెం తేడాల్ని గమనిస్తూన్నాం. ఒకే ప్రాంతంలో చూసుకున్నా డిసెంబరు 1వ తేదీ నాడు భౌగోళికంగా ఓ ప్రాంతంలో గడియారం ఎలా మారుతుందో డిసెంబరు 31 నాడు కూడా అదేవిధంగా మారుతుంది. ఉగాది అంటూ తెలుగువారు తెలుగు సంవత్సరాదిని జనవరి 1 అంటూ గ్రెగరియన్‌ క్యాలెండర్‌తో నేటి సమస్త ప్రపంచ ప్రజానీకం నూతన సంవత్సరాన్ని (New Year Day) జరుపుకున్నా, రోజులన్నీ ఒకటే. ఇంత హడావిడికి కారణం కావాలసినంత మార్పు శాస్త్రీయంగా అక్కడ ఏమీ జరగలేదు.
అయినా నెలలు, వారాలు, సంవత్సరాలు, శలవులు, పండగలు వంటివన్నీ మానవ సమాజంలో సంస్కృతికి, నాగరి కతలకు సంబంధించిన అంశాలు. మనిషి లేనిదే సైన్సు లేదు. మనిషి నిర్మించుకొన్న సమాజ సంక్షేమానికే సైన్సు జవాబుదారీ అవుతుంది. కాబట్టి వారి వారి ఇష్టాలు, ఆచారాలు, విశ్వాసా లు, అనుభూతులు, క్యాలెండర్లు, మనోవాంఛల్ని బట్టి ఆయా దినాల్ని సంబంధించుకొన్నా, సంస్మరించుకున్నా సంశయించా ల్సిన అవసరం లేదు. ఎటొచ్చీ ఆ సంబరాలు వెర్రితలలు వేయకుండా, ఆ దినాలు సమాజ ప్రగతికి దుర్దినాలు కాకుండా, ఆ సంబరాలు ఛాందస పరదాల మాటున కాకుండా ఉంటే చాలు. అంతవరకైతేనే మేలు.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 

Courtesy: Prajasekthi Daily

మహిమల బండారాల్ని బయటపెట్టిన కోవూర్‌

డాక్టర్‌ ఎ.టి. కోవూర్‌ గొప్ప సైన్సు వాది. సైన్స్‌ సూత్రాలే తప్ప, మహిమలనేవి ఏవీ లేవని తన జీవితకాలమంతా ప్రచారం చేశారు. అంతేకాదు. అలాటి మహిమలు ఎవరైనా నిరూపిస్తే వారికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానని 1960లలోనే ప్రకటించాడు. ఉదాహరణకు తాను దాచిపెట్టిన కరెన్సీ నోటు నంబరును ఎవరైనా చెప్పమని సవాలు చేశాడు. ఇలా చెప్పినవారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాననీ ప్రకటించారు. చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సి.డి.ఎడుసూరియా అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. తాను దైవపూజలు చేస్తాననీ, అందువలన తనకు మహిమలు చేసే శక్తి వచ్చిందనీ, అందువల్ల తాను కోవూర్‌ సవాలును స్వీకరిస్తానని ప్రకటించాడు. అపుడు కోవూరు స్పందించి తాను ఒక రూపాయి నోటును ''దావాసా'' అనే పత్రిక ఎడిటర్‌గారి ఆఫీసు సొరుగులో ఉంచానని, ఎడుసూరియన్‌ను ఆ నోటు నంబరును చెప్పమన్నాడు. ఎడు సూరియా అనేకరోజులు పూజలు చేసి చివరికి ఒకరోజును మంచిరోజుగా ప్రకటించి, ఆ రోజున నోటు నంబరు ఇదీ అని ఒక నంబరు ప్రకటించాడు. కానీ ఎడిటర్‌గారి సొరుగులోని నోటు నంబరుతో ఆ నంబరును పోల్చి చూస్తే అది పూర్తిగా తప్పని తేలిపోయింది!
అలాగే మరోసారి సెవెల్లీ డిసిల్వా అనే వ్యక్తి తనకు టెలీపతీ శక్తులున్నాయనీ, వాటిద్వారా ఎవరైనా దూరంగా వేరే గదిలో ఉండి తనను ప్రశ్నిస్తే వారికి సరియైన సమాధానాలు చెప్పగలననీ ఈ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధమేనా? అని డా|| కోవూర్‌ను 'టైమ్స్‌ ఆఫ్‌ సిలోన్‌'' అనే పత్రికలో ఒక లేఖ ద్వారా సవాల్‌ చేశాడు. కోవూర్‌ ఆ సవాలును స్వీకరించాడు. ఆయన మహిమలను పరీక్షించడానికి 1967 ఆగస్టు 15వ తేదీ నిర్ణయమైంది. ఆనాడు ఆ పత్రిక సంపాదకులు, సహ సంపాదకుల సమక్షంలో కోవూర్‌ అడిగిన 7 ప్రశ్నలకు డిసిల్వా ఇచ్చిన సమాధానాలను పరిశీలించడం జరిగింది. ప్చ్‌! ఏడు సమాధానాలూ తప్పేనని తేలిపోయింది. టెలిపతీ బండారం ఇంతేనని లోకానికి ఆ పత్రిక ద్వారా అర్థమైంది.

- కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక. 

Courtesy: Prajasekthi Daily

యాభైఏళ్ళలో మానవ క్లోన్లు..?!

వైద్యరంగంలో తాజాగా నోబెల్‌ పురస్కారం పొందిన 'సర్‌ జాన్‌ గార్డోన్‌' 50వ దశకంలో కప్పలపై క్లోనింగ్‌ పరిశోధనలు జరిపాడు. ఆ పరిశోధనల ఫలితంగా 1996లో 'డాలీ' పేరుతో ఓ గొర్రె సృష్టించబడింది. అయితే, త్వరలో మానవక్లోన్లను కూడా రూపొం దించవచ్చని ఆయన అప్పుడే సెలవిచ్చాడు. కానీ, ప్రస్తుతం జంతువుల క్లోనింగ్‌లో అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది అవలక్షణాలతో పుట్టే పిల్లలు. క్లోనింగ్‌ ఫలితాలు, ప్రత్యేకించి జంతువులలో అనుకున్నవిధంగా రావడం లేదు. అందువల్ల, మానవ క్లోనింగ్‌ వలన కలిగే పరిణామాల పరంగా అనేక భయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, మరో 50 సంవత్సరాల లోపలే మానవ క్లోనింగ్‌ కచ్ఛితంగా జరుగు తుందని జాన్‌ అంటున్నారు. కృత్రిమ ఫలదీకరణ ద్వారా సంతానం కలిగించే ప్రక్రియపై కూడా తొలిరోజులలో ఇటువంటి భయాలే ఉన్నా, ఇప్పుడు ఆ విధానం సర్వ సాధారణం అయిపోయింది. అదేవిధంగా మానవ క్లోనింగ్‌ కూడా ఆమోదయోగ్యం అవుతుందేమో? చూడాల్సిందే!!.

Courtesy: Prajasekthi Daily

అట్ట హెల్మెట్‌..!

ఒక భారతీయ పరిశోధకుడు సంపూర్ణంగా అట్టతో రూపొందించిన రీసైకిల్‌ హెల్మెట్‌ను రూపొందించాడు. 'అనిరుద్ధ సురభి' అనే రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ స్టూడెంట్‌ 'క్రేనియం' అనే పేరుతో ఈ హెల్మెట్‌ను తయారు చేశాడు. సాధారణ హెల్మెట్‌ల కన్నా ఈ అట్ట హెల్మెట్‌ 15% తేలికగా ఉంటుంది. కానీ, మామూలు వాటికంటే మూడింతలు ఒత్తిడిని తట్టుకోగలదు. సురభికి ఇటువంటి తేలికైన, పటిష్టమైన హెల్మెట్‌ చెయ్యాలనే ఆలోచన వడ్రంగి పిట్టను చూసిన తరువాత వచ్చిందట! వడ్రంగి పిట్టకి ముక్కులో ప్రత్యేకమైన నిర్మాణం ఉంది. ముక్కును కపాలం నుండి వేరు చేస్తుంది. 'క్రేనియం' హెల్మెట్‌ రీసైకిల్‌ చేసిన కాగితంతో రూపొందించడం మరొక విశేషం.

Courtesy: Prajasekthi Daily

రక్తకణాల జన్యువు..!

రక్తహీనత, మలేరియా వంటి వ్యాధులతో ఎర్రరక్త కణాలు తగ్గి, సమస్యలు కలిగిస్తాయి. అయితే అటువంటి సమస్యల నుండి ఊరట కలిగించే దిశలో ఇపుడు పరిశోధనా ఫలితాలు వస్తున్నాయి. సుమారు లక్షన్నరమంది జన్యు నమూనాల అధ్యయనం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి సంబంధించిన జన్యువుల గురించి తెలిసింది. దాదాపు 2.6 మిలియన్‌ల జన్యు వైవిధ్యాలను పరిశీలించాక ఎర్ర రక్తకణాల ఉత్పత్తికీ, వాటి లక్షణాలకు, వాటి సంఖ్యకు సంబంధం వున్న జన్యువులను కనిపెట్టారు. మానవ జీనోమ్‌లో అటువంటి 75 ప్రదేశాల్లో ఈ సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఆ ప్రదేశాలపై పరిశోధన జరుపుతున్నారు. మలేరియా వ్యాధిని కలిగించే క్రిములు శరీరంలో ప్రవేశించినపుడు అధికంగా ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయకుండా కొంతమందిలో రక్తహీనత ఎందుకు కలుగుతుందో అప్పుడు తెలుసుకునే వీలుంది అంటున్నారు.

Courtesy: Prajasekthi Daily

చేతులు పోట్లాట కోసమే..!

మనిషికి చేతులు అభివృద్ధి చెందింది ప్రాథమికంగా పోట్లాడుకోడానికే అంటున్నారు శాస్త్రజ్ఞులు. మహా వానరాలతో పోలిస్తే, మానవులకు కురచైన అరచేతులు, పొడవైన వేళ్ళు, బలమైన, వంగ గలిగే బొటనవేలూ ఉంటాయి. ఈ ప్రత్యేకమైనమార్పు లు మన ప్రాచీ నులు పరికరాలు తయారుచేసుకో వడానికి ఆవిర్భవిం చాయి అని ఇప్పటివరకూ అనుకునేవారు. కానీ అమెరికాలోని 'ఉతా' యూనివర్శిటీ పరిశోధనల ప్రకారం మానవుల చేతులు ముష్టి యుద్ధాలు చేయడానికే రూపొందాయట! మహావానరా ల్లో (మనతో సహా) ఆవేశాలు, కోపాలు ఎక్కువ. పోటీదారుడిని అడ్డుకుని, ఆహారం, తోడూ, గూడు సంపాదించాలంటే ముష్టి ఘాతాలు అవసరం అయ్యాయి. చేతివేళ్ళని ముడిచిపెడితే ఎదుటివారికి దెబ్బ గట్టిగా తగిలినా మన చేతికి ఎక్కువ నొప్పి తెలియదు. ఆ కారణంగా చేతులు రూపొందాయంటున్నారు.

Courtesy: Prajasekthi Daily

అతి శుద్ధమైనది సహజవాయువే!

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడే ముఖ్యమైన ఇంధన మూలం సహజవాయువు. సహజవాయువులో ప్రాథమికంగా 'మీథేన్‌' వాయువు ఉంటుంది. అది మండినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి ఉత్పత్తవుతాయి. ఆ రెండు పదార్థాలు కూడా వాతావరణానికి అతిగా హాని చేయవు. బొగ్గు, ఇతర ఇంధన తైలాలు వాడినపుడు అధిక మోతాదుల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ని, ఇతర కాలుష్య కారకాల్ని విడుదల చేస్తాయి. ఆ కారణంగా వీటి హరిత గృహ ప్రభావం అధికంగా ఉంటుంది. అనేక ఇంధనాలపై జరిపిన అనేకానేక పరిశోధనల తరువాత సహజ వాయువే ప్రస్తుతానికి అతి స్వచ్ఛమైన, సురక్షితమైన ఇంధనంగా తేల్చారు.

Courtesy: Prajasekthi Daily