ఓ 'సూపు' చూడండి!
వర్షాకాలంలో సాయంత్రం చిరుజల్లు పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తాగాలని,
తినాలని అనిపిస్తుంది. అంతేకాదు, ఈ సీజన్‌లో కొన్ని చిరుజబ్బులు జలుబు,
గొంతు బొంగురు పోవడం, దగ్గు, ముక్కుదిబ్బడ మనల్ని చాలా ఇబ్బంది
పెట్టేస్తుంటాయి. వాటికి విరుగుడుగా తీసుకోవాల్సిన మాన్‌సూన్ సూప్స్
తయారీ ఎలాగో తెలుసుకుందాం.
టమోటో కోకోనట్ సూప్
మన భారతదేశ సంప్రదాయంలో భాగం టమోటో కోకోనట్ సూప్. ఈ టమోటో కోకోనట్
సూప్ రుచిగా ఉండటమే కాదు, ఇందులో మనకు ఉపయోగపడే కొవ్వు, పోషకాలు పుష్కలంగా
ఉంటాయి. అంతేకాదు, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటి నుండి
ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని
కాపాడుతుంది. వర్షకాలంలో వేడి వేడిగా ఈ సూప్ భలే మజా ఇస్తుంది. ఈ సూప్‌ను ఏ
వేళలో (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) అయినా సరే తీసుకోవచ్చు. పిల్లలు ,
పెద్దలు అమితంగా ఇష్టపడే ఈ టమోటో కోకోనట్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావల్సిన
పదార్థాలు: టమోటా ఫ్యూరీ-కప్పున్నర; కొబ్బరి-పావు చెక్క; ఆవాలు-1/2
స్పూన్; పంచదార-2 స్పూన్లు; పచ్చిమిర్చి-2;ఇంగువ- చిటికెడు; నూనె- 2
స్పూన్లు; కరివేపాకు- 2 రెబ్బలు, ఉప్పు- రుచికి తగినంత
తయారుచేసే
విధానం: ముందుగా పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, కాస్త కాగాక ఆవాలు వేసి,
చిటపటలాడించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు
వేయించి, చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే టమాటా ప్యూరీ,
అతి సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి, రెండు కప్పుల నీళ్లు వేసి, సన్నటి
సెగన, మూతపెట్టి మరగని వ్వాలి. మధ్యమధ్యలో కలపడం మరిచిపోవద్దు. మిశ్రమం
కొంచెం దగ్గర పడిన తరు వాత, మంట మీద నుంచి తీసి, బాగా చల్లారని వ్వాలి.
చల్లారిన తరువాత పంచ దార, ఉప్పు వేసి, బాగా గిలకొట్టాలి. ఆ తరువాత సన్నటి
సెగన కొద్దిసెకన్ల పాటు వేడిచేసి, సర్వ్ చేయాలి. అంతే టమోట కోకోనట్ సూప్
తయార్.
స్ట్రాబెర్రీ సూప్
స్ట్రాబెర్రీస్ ఒక మంచి మూడ్‌ను ఇచ్చేవి. ఈ ఫ్రూట్‌ను మీరు ఒక డిసెర్ట్‌గా
తీసుకొని ఎంజారు చేయవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. చాలా
సింపుల్‌గా, అతి తక్కువ వస్తువులతో, కొంచెం సేపటిలో దీన్ని తయారుచేయొచ్చు.
కావలసిన
పదార్థాలు: తాజా స్ట్రాబెర్రీస్ - 2 కప్పులు; తాజా క్రీమ్- 2 స్పూన్లు;
తాజా పెరుగు- కప్పు; పంచదార పొడి- స్పూన్; వెనీలా -స్పూన్; పుదీనా ఆకులు-
గార్నిష్ కోసం కొద్దిగా.
తయారుచేసే విధానం: ముందుగా స్ట్రాబెర్రీలను
శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత జ్యూసర్‌లో తాజాక్రీమ్, పంచదార,
పెరుగు వేసి మెత్తగా అయ్యే వరకూ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో
వెనీలా ఎక్సాక్ట్ వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. తర్వాత ఈ మొత్తం
మిశ్రమాన్ని సూప్ బౌల్లో పోయాలి. తర్వాత పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి.
అంతే స్ట్రాబెర్రీ సూప్ రెడీ.
క్యాబేజ్ పెప్పర్ సూప్
బరువు తగ్గించే, జీరో క్యాలరీ డిష్‌లను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం
ద్వారా మీ శరీరంలోని కొవ్వు కణాల్ని కరిగించుకోవచ్చు. అందుకు సూప్ డైట్
పాపులర్ డిష్. ఇది బరువు తగ్గించడంలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు:
క్యాబేజీ-4 కప్పులు (తురుము); క్యారెట్- 3 (చిన్న ముక్కలుగా
తరిగిపెట్టుకోవాలి); ఉల్లిపాయలు-2 (చిన్న ముక్కలుగా తరిగినవి); మొక్కజొన్న
పిండి-1/2 స్పూన్; నల్ల మిరియాల పొడి - చిటికెడు; ఉప్పు- రుచికి సరిపడా;
వెన్న- స్పూన్.
తయారుచేసే విధానం: క్యాబేజీనీ,
క్యారెట్‌ను తరగడానికి ముందే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత
ప్రెజర్ కుక్కర్‌లో నీరు పోసి వేడిచేయాలి. నీరు మరుగుతుండగా అందులో కట్
చేసి పెట్టుకొన్న క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఈ
పదార్థాలకు కొద్దిగా ఉప్పు జోడించి బాగా కలపాలి. ఆ తర్వాత ప్రెజర్
కుక్కర్‌లో 3-4 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 3, 4 విజిల్స్
వచ్చిన తర్వాత కిందికి దింపుకొని, పక్కకు తీసి, ఐదు నిమిషాలు అలాగే ఉంచి,
తర్వాత మూత తీయాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్‌లో కొద్దిగా వెన్న వేసి, కరిగిన
తర్వాత ముందుగా కుక్కర్‌లో ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్ సూప్ వేసి
మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే మిరియాలపొడి, ఉప్పు వేయాలి. ఈ రెండూ
కొద్దిగా కొద్దిగా చిక్కగా మారుతుండగా అందులో మొక్కజొన్న పిండి కూడా వేసి
బాగా మిక్స్ చేయాలి. అంతే పెప్పర్ - క్యాబేజ్ సూప్ రెడీ. దీన్ని వేడి
వేడిగా సర్వ్ చేయాలి. ఇది జలుబుతో పోరాడుతుంది. చల్లని వాతారవణంలో మీ
శరీరాన్ని వేడిగా ఉంచుతుంది కూడా.
కొత్తిమీర లెమన్ సూప్
దీనిని
చాలా త్వరగా, సులువుగా తయారుచేసుకోవచ్చు. అన్ని సూప్స్‌లో టమోటో సూప్
సాధారణమైనదైతే, కొత్తిమీర లెమన్ సూప్ ప్రత్యేకమైనది. ఇది చాలా టేస్టీ
కూడా. ఈ సూప్‌తో మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు:
సన్నగా తరిగిన కొత్తిమీర - కప్పు; ఉల్లిపాయ- 1 (చిన్నముక్కలుగా తరిగి
పెట్టుకోవాలి); స్ప్రింగ్ ఉల్లిపాయ (ఉల్లికాడలు)- 1 (సన్నగా తరగాలి);
అల్లం-అంగుళం (చిన్న ముక్కలుగా చేయాలి); వెల్లుల్లిపాయ రెబ్బలు- 10 (సన్నగా
కట్ చేయాలి); నిమ్మరసం- 1/4 కప్పు; వెజిటబుల్ స్టాక్ (కూరగాయలు
ఉడకబెట్టిన నీళ్లు) - కప్పు; మిరియాల పొడి- చిటికెడు; ఉప్పు- రుచికి
సరిపడా; వెన్న-స్పూన్.
తయారుచేసే విధానం: ఫ్రైయింగ్
పాన్‌లో వెన్న వేసి కరిగిన తర్వాత, అందులోఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి,
ఉల్లికాడ ముక్కలు అన్నీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. మొత్తం అన్నీ
మెత్తగా అయ్యే వరకూ ఐదు నిముషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కూరగాయ
ముక్కలు ఉడికించుకొన్న నీరు పోసి బాగా ఉడికించాలి . ఐదు నిముషాల తర్వాత
కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. సూప్ చిక్కగా
మారే సమయంలో స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. సర్వ్
చేసే ముందు కొద్దిగా వెన్నతో గార్నిష్ చేయాలి.
ఓట్స్ సూప్
రోజూ ఉదయం మనం తీసుకొనే అల్పాహారం చాలా ముఖ్యమైంది. అందులోనూ ఉదయం
తీసుకొనే అల్పాహారం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. అటువంటి ఆహారాల్లో
ఓట్స్‌తో తయారుచేసే ఆహారాలు బెస్ట్. అయితే సాదా ఓట్స్‌ను పాలలో కలిపి
తినడం కంటే కొంచెం వెరైటీగా, కొంచెం స్పైసీగా ఓట్స్ సూప్ తయారుచేసి
తీసుకోవచ్చు. వర్షాకాలంలో ఓట్స్ సూప్ ఎక్కువ పోషకాల్ని ఇవ్వడమే కాకుండా
కొంచెం తీసుకున్నా, కడుపు నిండినట్టునిపిస్తుంది.ఈ సూప్‌ను అన్ని వయస్సుల
వారూ తాగొచ్చు.
కావల్సిన పదార్థాలు: ఓట్స్- కప్పు;
ఉల్లిపాయ- 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చిమిర్చి- 1 (చిన్న
ముక్క లుగా కట్ చేసుకోవాలి); వెల్లుల్లి- 1; లవంగం పొడి-కొద్దిగా, మిరియాల
పొడి- చిటికెడు; పాలు-కప్పు, నీళ్ళు-కప్పు; ఆయిల్- 2 స్పూన్లు;
కొత్తిమీర-గార్నిష్ కోసం; ఉప్పు- రుచికి సరిపడా.
తయారు చేసే విధానం:
ముందుగా ఒక పాన్‌లో నూనె వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో తరిగి
పెట్టుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి లైట్‌గా
వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకూ
వేయించుకోవాలి. ఇప్పుడు వాటిలోనే ఓట్స్ కూడా వేసి, మరో రెండు నిము షాలు
వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేయాలి. మీడియం
మంట మీద ఈ మిశ్రమాన్నంతటినీ ఉడికించు కోవాలి. ఓట్స్ మెత్తగా ఉడకా యని
నిర్ధారించుకున్నాక, అందులో పాలు, మిరి యాలు, లవంగాల పొడి వేసి, మరో నిముషం
పాటు ఉడికించుకోవాలి. ఓట్స్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఈ
క్రీమీ ఓట్స్ సూప్‌ను కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా
సర్వ్ చేయాలి.
Courtesy with: PRAJA SEKTHI DAILY