Saturday, 4 October 2014

గుండె బాగుండాలంటే...

              మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. అది ఆరోగ్యంగా ఉండాలంటే దాని గురించిన అవగాహన ఉండాలి. గుండెకు సంబంధించిన వివిధ సమస్యలకు, గుండె జబ్బుకు తేడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొందరు గుండె దడగా ఉన్నా గుండె జబ్బేమోనని కంగారు పడుతుంటారు. సరైన అవగాహన ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నేడు యువకుల్లో కూడా గుండె జబ్బులు రావడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేటివల్ల గుండెకు ముప్పు ఉంటుందో వాటిని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొవ్వు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు ఆరోగ్యకరమైనక జీవన విధానం అలవర్చుకోవాలి. ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతున్నాయి.
లక్షణాలు
            కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఒక్కోసారి ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని కచ్చితంగా చెప్పలేం. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ధారణకు రావాలి.
రెగ్యులర్‌ చెకప్‌
           నలభయ్యేళ్లు దాటినవారు రెగ్యులర్‌గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు. ఇసిజి, 2 డి ఎకో, కొలెస్ట్రాల్‌, టిఎంటి పరీక్షల ద్వారా గుండె పనితీరు, జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బు ఉంటే
            పరీక్షల్లో గుండె జబ్బు ఉందని తేలినట్లయితే, అప్పుడు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కడుంది, ఎన్నిచోట్ల రక్త నాళాల్లో అడ్డంకులున్నాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ పరీక్ష అవసరం. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు, అంతకంటే ఎక్కువబ్లాక్‌లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసిఎ)లో సమస్య ఉన్నా బైపాస్‌ సర్జరీ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్లల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్‌లు వేసినా, బైపాస్‌ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్య తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్‌ జరిగింది కదా, ఇక ఏం పర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, డైట్‌ కంట్రోల్‌ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు.
జాగ్రత్తలు
         నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ అరగంటపాటు నడవడంవల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. దీంతోపాటు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.
- డా|| జి.సూర్య ప్రకాష్‌,
కార్డియాలజిస్టు, కేర్‌హాస్పటల్‌ ముషిరాబాద్‌, హైదరాబాద్‌
9866822286. 

Courtesy  with: PRAJA SEKTHY DAILY

No comments:

Post a Comment