సోడా సోడా.. ఆంధ్రా సోడా!
దాదాపు నలభై అయిదేళ్ళ క్రితం వచ్చిన 'లక్ష్మీ నివాసం' అనే సినిమాలో
హాస్యనటుడు పద్మనాభం నాటకాల మీద విచ్చలవిడిగా ఖర్చుపెట్టేసి చేతిలో
చిల్లిగవ్వలేని పరిస్థితికి వస్తాడు. అతనికి ఇష్టమైన మరో వ్యాపకం అస్తమానం
సోడా తాగుతూ ఉండడం. చివరకు సోడాల బండి తిప్పుకుంటూ కాలక్షేపం చేయాల్సి
వస్తుంది. అప్పుడు ఆరుద్ర రాసిన 'సోడా...సోడా...ఆంధ్రా సోడా' పాట అతని మీద
చిత్రీకరించారు. జనసామాన్యానికి గోళీసోడాగా బాగా పరిచయమైన సోడా మీద వచ్చిన ఆ
పాట, సోడా పాపులారిటీ ఎలాంటిదో చెబుతుంది. ఇటీవల కూడా '' నువ్వు
విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ...'' అని ఓ సినీ కవి ఆంధ్రుల అభిమాన సోడాను ఓ
పాటలో జ్ఞాపకం చేశాడు. బహుళజాతి కంపెనీల ఉత్పత్తులతో సహా రకరకాల
శీతలపానీయాలు మార్కెట్‌ను ముంచెత్తిన రోజుల్లో అందరికీ ఇష్టమైనదేకాక, చవకగా
లభిస్తూ వచ్చిన పానీయం ఇది. ఎంతోమందికి ఉపాధి కల్పించిన గోళీసోడా ఇప్పుడు
దాదాపు నిన్నటి జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది. గోళీసోడా అంటే తెలియనివారే నేడు
ఎక్కువ మంది.
ఇటీవలివరకూ మండుటెండలో కాలినడకన వెళ్ళే వారు దాహం తీర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది గోళీసోడాకే. తక్కువ ధరకే లభించే ఈ పసందైన పానీయం అనేక రంగుల్లో, రుచులలో దాహార్తిని తీర్చేది. కొన్ని దశాబ్దాలుగా గొంతుకలో హిమాలయం చల్లదనం నింపుతూ వచ్చిన ఈ గోళీసోడా గురించే కాని, దీని సృష్టికర్త గురించి తెలుసుకోవడం తక్కువ. సౌత్‌ఈస్ట్ లండన్‌కు చెందిన హీరమ్ కాడ్ అనే వ్యాపారి గోళీసోడాను 1872వ సంవత్సరంలో తయారు చేశాడు. ఆయన గోళీ సోడా పేటెంట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మందమైన గాజుతో, మూత భాగంలో రబ్బరు వాషరును అమర్చి, మధ్య భాగంలో రెండువైపులా నొక్కినట్లు ఈ సీసాను రూపొందించారు. సోడా తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రంలో ఒకేసారి మూడు సోడాలను సిద్ధం చేయవచ్చు. ఆ యంత్రానికి కార్బన్‌డయాక్సైడ్ సిలెండర్ అమర్చబడి ఉంటుంది. శుభ్రం చేసిన సీసాలలో మనం కోరుకునే ద్రవాన్ని, రుచికోసం ఉపయోగించే వాటిని కలిపి యంత్రంలో అమర్చుతారు. తర్వాత యంత్రానికి ఉండే పిడి(హేండిల్)ని ముందుకు వెనక్కి మూడు, నాలుగుసార్లు తిప్పుతారు. అలా తిప్పడంతో కార్బన్‌డయాక్సైడ్ ఒత్తిడికి గోళీ రబ్బరువాషరు దగ్గర స్థిరంగా బిగుసుకుపోతుంది. అంటే సోడాకు గోళీ ఒక మూతలా ఉపయోగపడుతుంది. అలా కార్బన్‌డయాక్సైడ్‌తో నిండిన సోడాను కొన్ని రోజలుపాటు నిలవ ఉంచవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన సాంకేతికతగా గుర్తింపుపొందింది.
బహుళ జాతి పానీయాల దెబ్బ
నేడు మార్కెట్‌లో రకరకాల శీతలపానీయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ గోళీసోడాను ఇష్టపడేవారు నేటికీ ఉన్నారు. మంగళూరు వంటి ప్రాంతాలలో వీటికి ఆదరణ తగ్గలేదు. దాహార్తిని తీర్చడానికి మంచి సాధనంగా ఇక్కడి ప్రజలు గోళీసోడాను భావిస్తారు. పిల్లలు, యువకులు సోడా లో ఉండే గోళీని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సీసా లోపలకు గోళీ ఎలా వెళ్ళిందో తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సీసా పగలకుండా గోళీని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసేవారు. కానీ వారి ప్రయత్నం వృధా అయ్యేది. గోళీసోడా దుకాణాల్లో మాత్రమే కాదు, వీధుల్లోనూ దొరికేది. చెక్కతో అరలు అరలుగా చేసిన తోపుడు బండిలో ఒక్కొక్క అరలో ఒక్కో సీసాను ఉంచి అమ్మేవారు. ఇప్పుడు ఆ దృశ్యం అదృశ్యమైందన్నా ఆశ్చర్యంలేదు.
సోడా కొట్టినవాడే వీరుడు!
గోళీని లోపలికి నొక్కి సోడా తాగాలి. నొక్కడానికి అంటే సోడా కొట్టడానికి అనువుగా ఒక చెక్క వస్తువును ఉపయోగిస్తారు. అయితే సోడా కొట్టడం అందరికీ చేతనయ్యేదికాదు. అందుకే అవలీలగా సోడా కొట్టేవాణ్ణి ఆశ్చర్యంగా చూసేవారు. వాళ్ళుకూడా 'వీరు'ల్లా పోజిచ్చేవారు. పరికరం వాడకుండా వేలితో నొక్కి సోడా కొట్టినవాడు ఇంకా పెద్ద 'వీరుడు!'. సోడా కొట్టినప్పుడు కార్బన్‌డైఆక్సైడ్ బయటకు వస్తూ వినసొంపైన శబ్దం వచ్చేది. పిల్లల్ని ఈ శబ్దం బాగా ఆకట్టుకునేది. కొత్తవారు సోడా తాగేటప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. గోళీ అడ్డంపడి లోపలి నీరు రాకుండా చేస్తుంది. గోళీసోడా తాగేందుకు ఒక కిటుకు ఉంటుంది. సీసాలోపల గోళీ ఏటూ కదలకుండా ఉండేందుకు ఒక చోటు ఉంటుంది. అటువైపుగా తిప్పి తాగితే నీరు సులభంగా నోటికి అందుతుంది. అల్లంసోడా, ఆరెంజ్ సోడా, సుగంధీసోడా, చప్పని సోడా ఇలా గోళీసోడాలలో రకరకాలు అందుబాటులో ఉండేవి. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భోజనం తర్వాత సోడా తాగడం వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుందని చాలా మంది అనుకునేవారు.
నిలిచిపోయిన సీసాల తయారీ
మన రాష్ట్రంలో గోళీ సోడా సీసాలు తయారు చేసే కంపెనీలు కృష్ణా జిల్లా ఉయ్యూరులోనూ, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు సీసాల తయారీని నిలిపివేశాయి. ''కాలం మారిపోయింది. నేటి యువతకు గోళీసోడా రుచి తెలియదు. ఏటా వేసవి సమయంలో గోళీసోడాకు మంచి గిరాకీ ఉండేది. సీసాల తయారీ లాభదాయకంగా లేకపోవడంతో కొత్త సీసాలు రావడంలేదు. సోడా తాగేందుకు ప్రజలు పూర్తిగా ఆసక్తి చూపకపోవడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. ఇదే పరిస్థితి మరో రెండేళ్ళు కొనసాగితే ప్రజలకు ఈ అద్భుత పానీయం దూరమయినట్లే'' అంటూ ఇరవైయ్యేళ్ళుగా సోడాలు అమ్ముతున్న రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ పొందిన గోళీసోడాలు, అక్కడ కూడా వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పెద్ద వయసువారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు మినహా యువత వీటిని తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు...
''మా నాన్న గోళీసోడా అమ్మేవాడు. నేనూ అదే చేస్తున్నాను. అప్పట్లో గోళీసోడా మంచి వ్యాపార వ్యాపార వస్తువుగా ఉండేది. సినిమా థియేటర్లకు రోజుకు నాలుగుసార్లు తిరుగుతూ అందించేవాళ్ళం. సినిమా విరామ సమయంలో పోటీపడి సోడాలను తాగేవారు. దుకాణాలకు సోడాలను అందేంచేందుకు కూలీలను కూడా పెట్టుకునేవారు. దీన్నే జీవనోపాధిగా నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉండేవి. ఇప్పుడూ ఇదే వ్యాపారం చేస్తున్నాను. కానీ అప్పుడంత గిరాకీలేదు. ఓ చిన్న పాన్‌షాప్ పెట్టుకున్నాను. సైకిల్‌పైన తీసుకెడుతూ చిన్నచిన్న దుకాణాలకు వెళ్ళి రోజుకు ఇరవై, ముప్పై సోడాలను అందిస్తున్నాను'' అంటూ పశ్చిమగోదావరికి చెందిన రహీం బాషా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. చాలా మంది వ్యాపారులు ఒక్క గోళీసోడాలపైనే ఆధారపడకుండా ఇతర పానీయాల అమ్మకాలు కూడా జరుపుతున్నారు.
నేటి కంపెనీలకు ఒరవడి
మనదేశంలో బంటా బాటిల్, కంచా బాటిల్, గోలీ బాటిల్, సోడా బాటిల్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ప్రాచుర్యం పొందింది గోళీసోడా. సాధారణ నీటిలో కార్బన్‌డైయాక్సైడ్‌ను కలిపి తయారు చేసే ఈ పద్ధతినే పెద్దపెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి. నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మిగతా పానీయాల్లో కార్బన్‌డైయాక్సైడ్‌ను నింపి గోళీకి బదులుగా ఇనుప, ప్లాస్టిక్ మూతలు వినియోగిస్తున్నారు. కార్బానిక్ యాసిడ్‌గాస్, సోడియం బైకార్బనేట్ సొల్యూషన్ వాయువులను వీటిలోనూ ఉపయోగిస్తారు. జనాభిమానం పొందుతూ చాలా కాలం ఒక వెలుగు వెలిగిన గోళీసోడా, '' గోళీసోడానా? అదేమిటి, ఎలా ఉంటుంది'' అని అడిగే దశకువచ్చింది. కాలం మహిమ!
Courtesy with PRAJA SEKTHI DAILY
Posted on: Sun 29 Mar 20:48:19.339931 2015

No comments:
Post a Comment