Wednesday, 22 May 2013

మానవ శరీరం

  • -ఎ.లక్ష్మీ సువర్చల

 
 
            మన శరీరం మీది చర్మాన్ని వొలిచి తూకం వేయగలిగితే మూడు కిలోల బరువు ఉంటుంది. ఇందులో సంవత్సరానికి ఒక కిలో చొప్పున రాలిపోతుంటే మరలా కొత్త చర్మం పుట్టుకొస్తుంది.
మన శిరస్సు మీద సుమారు ఒక లక్షా ఇరవైవేల వెంట్రుకలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అందించే సమాచారంలో మెదడు ఒక శాతం మాత్రమే జీర్ణించుకుంటుంది. మిగిలినవి సమసిపోతాయి.
శరీరంలో పది లక్షల కోట్ల జీవ కణాలు ఉన్నాయి. మన శరీరంలోని కండరాలన్నిటిలోకి గుండె చాలా దృఢమైనది. విశ్రాంతి తీసుకోకుండా ఏళ్ల తరబడి పనిచేస్తూనే ఉంటుంది. మన ఆయువు డెబ్భై సంవత్సరాలు నిండేసరికి ఐదు మిలియన్లపాటు గుండె కొట్టుకుంటుంది.
శరీరంలో ఎర్రరక్త కణాలు నాలుగు నెలల కాలం జీవిస్తాయి. ఈ నాలుగు మాసాలలో అవి పదిహేను వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. జీవితకాలంలో శరీరం సగటున నలభయి టన్నుల ఆహారాన్ని తీసుకుంటుంది. ఐదు లక్షల ఘనపుమీటర్ల గాలిని పీలుస్తుంది. నోటిలో పదివేల గాలన్ల లాలాజలం ఊరుతుంది.
మన ఉదరం పొడవు నిజంగా జానెడే ఉంటుంది. అంటే పది అంగుళాలు మాత్రమే. మన పొట్టలో జీర్ణప్రక్రియకు ఉపయోగపడే జఠర రసాలలో ఉదహరికామ్లం ఒకటి. దీనిని ఒక గొట్టంలో జాగ్రత్తగా బయటకు తీసి ఒక దుంగమీద వేస్తే అది కాలిపోతుంది. అందుకే జఠరాగ్ని అని పేరు వచ్చింది.
మన తెలివికీ, మెదడులో ఉన్న జీవకణాలకు అవినాభావ సంబంధం ఉంది. చిన్న కీటకం మెదడులో ఇరవై ఐదు కణాలు, చీమకు రెండు వందల యాభై, తేనెటీగకు వెయ్యి ఉంటే- మన మెదడులో పది బిలియన్ల జీవకణాలు ఉంటాయి.
మన చెవులకు అన్ని శబ్దాలు వినిపించవు. లేకుంటే గాలిలో తేలియాడే అణువులు ఒకదానికొకటి ఢీకొన్నపుడల్లా ఆ శబ్దానికి మెదడు ఛిద్రమవుతుంది. మెదడులో ఉన్న కణాల సంఖ్య పెరిగిన కొద్దీ ఆ వ్యక్తికి తెలివితేటలు అధికమయ్యే ఆస్కారం ఉంది. కానీ, మెదడులో ఉన్న కణాలు రోజుకు యాభై వేల చొప్పున నశించిపోతాయి. అంటే డెబ్బయి ఏళ్ల జీవితంలో 1.3 బిలియన్ల కణాలు తగ్గిపోతాయి. కనుక వయసు పెరిగే కొద్దీ తెలివితేటలు తగ్గాలి. అయినప్పటికీ వృద్ధులను తెలివైనవారిగానే పరిగణిసాం. ఎందుకో తెలుసా? పుట్టుకతో చూస్తే మెదడు సైజు పదవ వంతు తగ్గినా, అనుభవం ఎక్కడికి పోతుందని? అందుకే వృద్ధులను మనం గౌరవిస్తాం.

Courtesy with : ANDHRA BHUMI

No comments:

Post a Comment