ఉత్తరఖండ్ వరదలు: స్వయంకృత మహా విధ్వంసం -ఫోటోలు
ఉత్తర ఖండ్
రాష్ట్రంలో వారం రోజుల క్రితం ఉన్న పళంగా ఊడిపడిన వరదల్లో మృతుల సంఖ్య రోజు
రోజుకీ పెరుగుతోంది. ఇప్పటిదాకా 556 మృత దేశాలను లెక్కించిన అధికారులు
వీరి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. సైన్యం రంగంలోకి దిగి
ఇప్పటివరకు 73,000 మందిని రక్షించినప్పటికీ వివిధ చోట్ల నీటి తటాకాల మధ్య,
రోడ్లు కూలిపోయినందు వల్లా ఇంకా 40,000 మంది ఎటువంటి సాయమూ అందక
ఇరుక్కొనిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యావరణ పరంగా అత్యంత
సున్నిత ప్రాంతమైన హిమాలయ పాదాల వద్ద అభివృద్ధి పేరుతో ఒక పద్ధతంటూ లేకుండా
విచ్చలవిడి నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ మహా విపత్తు సంభవించిందని
పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనీసం వర్షం, వరదల గురించి ముందస్తు
హెచ్చరికలు చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగినా ఇంతటి విపత్తు
సంభవించి ఉండేది కాదని వారు చెబుతున్నారు. ఉత్తర ఖండ్ వరదలు, ప్రాణ నష్టం,
ఆస్తి నష్టం అంతా మానవ స్వయంకృత మహా విధ్వంసం అని వీరు
వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రాణ నష్టం, ఆస్తి
నష్టం జరిగింది ప్రధానంగా భక్తులు సందర్శించే వివిధ పుణ్య స్ధలాలలోనే కావడం
గమనార్హం. పెద్ద సంఖ్యలో పుణ్య క్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు తీవ్రంగా
దెబ్బతినగా, వాటిని సందర్శించడానికి వస్తున్నవారు, సందర్శించి తిరిగి
వెళ్తున్నవారూ కొండల్లోనూ, లోయల్లోనూ రోడ్లు కూలి ఇరుక్కొనిపోయారు. కొన్ని
చోట్ల ఆలయాల ముందే శవాల గుట్టలు పడి ఉన్న ఫోటోలను పత్రికలు ప్రచురించాయి.
ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా భావించే కేదార్ నాధ్ ఆలయం చెక్కుచెదరలేదని
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది మళ్ళీ తెరుచుకోడానికి మరో
సంవత్సరం పడుతుందని ప్రకటించింది. బురద, వ్యర్ధాలు గుట్టలు గుట్టలుగా
పేరుకుపోవడంతో వీటిని తొలగించి, శుభ్రం చేసి, యాత్రీకులకు తిరిగి సందర్శనా
యోగ్యంగా మార్చాలంటే ఈ మాత్రం సమయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా
వేస్తోంది.
ఉత్తర ఖండ్ లోని వివిధ
పుణ్య క్షేత్రాలు కొండలపైనా, లోయల్లోనూ ఉండడంతో ఇవి సందర్శించడానికి
వెళ్ళిన భక్తులు, యాత్రీకులు అనేక చోట్ల దారుల్లోనే చిక్కుకున్నారు. వారం
రోజుల నుండి వీరికి తిండి, తిప్పలు లేక నీరసించి, జబ్బులు తెచ్చుకుని సహాయం
కోసం ఎదురు చూస్తున్నారు. పలుచోట్ల రోడ్లు కొట్టుకునిపోవడమో, కొండ చరియలు
విరిగిపోవడమో జరగడం వలన వీరు చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లు ఎందుకూ
పనికిరాకుండా పోయాయి.
కేదార్ నాధ్, గౌరీ
కుంద్ ల మధ్య ఇరుకు దారుల్లో, కొండ చరియల్లో నక్కుని వరదల నుండి రక్షణ
పొందగా తాము శనివారం ఉదయం 1000 మందిని కనుగొన్నామని సైన్యం ప్రకటించింది.
రుద్ర ప్రయాగ జిల్లాలో కేదార్ నాధ్ కు వెళ్ళేదారిలో రంబారా, జంగిల్ చట్టి
ప్రాంతాల మధ్య వీరు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కేదార్ నాధ్ ఆలయం వద్ద
పడి ఉన్న శవాలను లెక్కించడానికి అధికారిక బృందాలు పయనమై వెళ్ళాయని ది హిందూ
తెలిపింది. వీరిని లెక్కిస్తే మృతుల సంఖ్య 1000 దాటవచ్చని తెలుస్తోంది.
విసిరి వేయబడ్డట్లు పడి ఉన్న శవాలను గుర్తు పట్టడానికి ఫోటోలు తీసి తమ వెబ్
సైట్లలో ప్రచురిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వందలాది శవాలను ఇంకా
గుర్తుపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రెండు రోజుల క్రితం
చెప్పడం గమనార్హం.
సమయానికి సహాయం అందక
అనేకమంది ఆకలికి చనిపోతున్నట్లు బతికి బయటవడ్డవారి ద్వారా తెలుస్తోంది.
తినడానికి ఏమీ లేక, తాగడానికి నీరు కూడా లేక ఇంకా అనేకమంది యాత్రీకులు
చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. గౌరి కుంద్, కేదార్ నాధ్ ల
మధ్య ఇరుక్కుపోయిన వారికి ఇప్పటికీ సాయం చేరలేదని అక్కడి నుండి
నడిచివచ్చినవారు చెప్పారని ది హిందూ తెలిపింది. చనిపోయినవారు పోగా ఇంకా
అనేకమంది గల్లంతయ్యారని, వారి కోసం సంబంధీకులు వెతుకుతున్నారని
తెలుస్తోంది. సహాయం చేరకపోవడంతో చనిపోయినవారి సంబంధీకులు కనీసం ఏడ్చే ఓపిక
కూడా లేని స్ధితిలో ఉన్నారని పత్రిక తెలిపింది. గౌరి కుంద్, భైరవ్ చట్టి,
జగిల్ చట్టి, గారూర్ చట్టి మొదలైన ప్రాంతాల్లో ఈ పరిస్ధితి ఉన్నట్లు
తెలుస్తోంది.
భారత సైన్యం, ఇండో
టిబెటన్ బోర్డర్ ఫోర్స్, జాతీయ విపత్తు సహాయ బలగాలు సోన్ గంగ, మందాకిని
సంగమ ప్రాంతంలో తాళ్ళతో బ్రిడ్జిలు నిర్మించి బాధితులను కాపాడే ప్రయత్నాలు
చేస్తున్నారు. కొండరాళ్ళు పదునుగా ఉండడంతో ప్రతి రెండు రౌండ్లకు ఒకసారి
తాళ్ళను మార్చవలసి వస్తోందని, దానితో సహాయ కార్యక్రమాలు మరింత ఆలస్యం
అవుతున్నాయని బలగాలు చెబుతున్నాయి. సోన్ ప్రయాగ్, కేదార్ నాధ్ తదితర
చోట్ల వరదలకు ముందు ఉన్న హోటళ్లు, షాపులు, లాడ్జిలు వరదలకు కొట్టుకుపోయి
టన్నుల కొద్దీ వ్యర్ధ శిధిలాలుగా మారిపోయాయని తెలుస్తోంది.
వివిధ చోట్ల
చిక్కుకుపోయిన యాత్రీకులను రక్షించడానికి ఇప్పటికే 56 హెలికాప్టర్లు పని
చేస్తున్నాయి. రాజస్ధాన్ ప్రభుత్వం మరో 2 హెలికాప్టర్లను, 30 బస్సులను
పంపించింది. తెలుగువారిని తిరిగి తేవడానికి రెండు అదనపు రైళ్లు
నడుస్తున్నాయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులనుండి చెబుతోంది.
గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలను తేవడానికి 140 మంది కూర్చోగల
విమానాలను పంపినట్లు తెలిపింది. శాంతి కుంజ్ వద్ద ఒక కంట్రోల్ రూమ్
నెలకొల్పామని ఉత్తర ఖండ్ ప్రభుత్వం తెలిపింది.
గంగ, యమున నదులతో పాటు
అనేక చిన్న పెద్ద ఉపనదులు, కాలవలు, ఏరులు ఉన్న పళంగా పొంగి పొర్లుతుండడంతో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు చేష్టలుడిగిపోయాయి. మూడు రోజుల పాటు
వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ స్ధాయిలో కాకపోయినా దాదాపు ఇదే
పరిస్ధితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
హిమాలయ పర్వత
సానువుల్లో ఉన్న ఉత్తర ఖండ్ రాష్ట్రం పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన
ప్రాంతం. ముఖ్యంగా కేదార్ నాధ్ చుట్టుపక్కల ప్రాంతాలను వరల్డ్ హెరిటేజ్
స్ధలంగా ప్రకటించి విచ్చలవిడి నిర్మాణాలు జరగకుండా నియంత్రించాలని
పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని
నదులపైన ఆనకట్టలు నిర్మించాలని, టూరిజం అభివృద్ధి చేయాలని ఉత్తర ఖండ్
ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచించింది. వీటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నట్లు
తెలుస్తోంది. వీటితో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా టూరిజం అభివృద్ధి పేరుతో
ఒక పద్ధతి లేకుండా నిర్మాణాలు చేపట్టగా దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి
అండదండలు అందిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని
విధంగా జల ప్రళయం ముంచెత్తడానికి కారణం ఈ ‘అభివృద్ధి కాని అభివృద్ధే’ అని
నిపుణులు ఘోష పెడుతున్నారు. వివిధ నిర్మాణాల వలన వరద నీరు సజావుగా
ప్రవహించడానికి ఆటంకాలు ఏర్పడి పట్టణాలు, ఊళ్లను ముంచెత్తాయని, ఈ క్రమంలో
రోడ్డు మార్గాలను కూడా వరద నీరు కోసివేసిందని వారు తెలిపారు. వారి ఘోష ఎంత
నిజమో కింది ఫోటోలు తెలియజేస్తున్నాయి. ది అట్లాంటిక్, ది హిందూ పత్రికలు ఈ
ఫొటోలు అందించాయి.Courtesy With: జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
No comments:
Post a Comment