Tuesday, 31 December 2013

ఇటు రుచి! అటు ఆరోగ్యం!



    పండగలకే కాదు మనం అప్పుడప్పుడు వండే పిండి వంటల్లో బెల్లం వాడకుండా ఉండలేం. ముఖ్యంగా మనం తయారుచేసుకునే పొంగలి, పూర్ణాలు, అరిసెలు, పాయసం, పల్లీపట్టీ వంటి తీపి పదార్థాల్లో బెల్లాన్ని ఉపయోగిస్తాం. తీపిపదార్థాల్లోనే కాకుండా బెల్లాన్ని విడిగా తిన్నా ఆరోగ్యమే. అనేక అనారోగ్య సమస్యల నివారిణిగా బెల్లం విశిష్ట ఫలితాల్ని ఇస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో తెలియ జేశారు. బెల్లంలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉన్న బెల్లం మన దేశంలోనే కాక, అనేక ఆసియా దేశాల్లోనూ ప్రాచుర్యంలో ఉంది.
  బంగారు రంగులోనూ, ముదురు గోధుమ రంగులోనూ, నలుపు రంగులోనూ ఉండే బెల్లం 1631లో మెట్టమొదటిసారిగా తయారు చేయబడింది. బెల్లం సహజ పద్ధతిలో చెరకు నుంచి, కర్జూర పండ్ల నుంచి తయారు చేస్తారనే అందరికీ తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే కొబ్బరి నుంచీ బెల్లాన్ని తయారుచేస్తారనే విషయం. ఇది ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌, దక్షిణ భారతదేశం, బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ల్లో ఇది ప్రాచుర్యంలో ఉంది.
మనదేశంలో మహారాష్ట్ర బెల్లాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేయడమే కాదు వాడటంలోనూ ముందంజలోనే ఉంది. మహారాష్ట్ర ప్రజలు చేసుకునే కూరలలోను, పప్పుల్లోను, తీపి పదార్థాలలోను ఇలా ప్రతి ఒక్క వంటకంలోనూ బెల్లాన్ని విరివిగా వినియోగిస్తారు. మహారాష్ట్రలో అందరికీ తెలిసిన స్వీట్‌ పురన్‌ పోలీని బెల్లంతోనే తయారుచేస్తారు. గుజరాత్‌లో తయారుచేసే ప్రత్యేకమైన లడ్డూల్లోనూ గోధుమపిండితో పాటు బెల్లాన్ని ఉపయోగిస్తారు. అంతేగాక గుజరాత్‌ ప్రాచుర్యంలో ఉన్న తలన్‌ లడ్డు, తాల్‌ సంకల్‌, గోల్‌దానా వంటి తీపిపదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. రాజస్థాన్‌ సాంప్రదాయక వంటకమైన గుర్‌ కె చావల్‌లోనూ బెల్లాన్ని ఉపయోగిస్తారు.
   మన రాష్ట్రంలో ప్రతి పండుగ సమయంలో పిండి వంటకాల్లో బెల్లాన్ని వినియోగిస్తారు. ముఖ్యంగా నోరూరించే పదార్థాలన్నీ బెల్లం తయారీవే. వేయించిన పల్లీ (వేరుశనగ)లతో, చిన్న బెల్లం ముక్క తినే అలవాటు నేటికీ ఉంది. ఇలా తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. పని నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క, గ్లాసు మంచి నీళ్ళు తాగడం మహారాష్ట్ర, కర్ణాటకల్లోని గ్రామీణుల్లో కనిపిస్తుంది. ఇది శారీరక నీరసాన్ని తగ్గిస్తుందని వారి నమ్మకం. అంతేకాక అందరం తాగే టీలో చెంచా పంచదారకు బదులు చెంచా బెల్లం పౌడర్‌ను వేసుకుని తాగితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
   బెల్లం పోషకాల గని కదా! రక్తపోటును తగ్గించడానికి, మూత్రపిండాలలో వచ్చే రాళ్ళ సమస్యను తగ్గించడానికి కావాలసిన పొటాషియం నిల్వలు బెల్లంలో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక ఒత్తిడిని తగ్గించి, మంచిగా నిద్ర పట్టడానికి బెల్లంలోని పొటాషియం ఎంతో ఉపయోగకరం. పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి ఉపయోగపడే కాల్షియం పుష్కలంగా ఉన్న పదార్థం ఇది. రక్తహీనతతో బాధపడేవారు చక్కెరకు బదులు బెల్లాన్ని తీసుకుంటే రక్తవృద్ధికి తోడ్పడు తుంది. ఎందుకంటే కొత్త రక్తం తయారవడానికి కావలసిన ఇనుము(ఐరన్‌) బెల్లంలో అత్యధికంగా ఉండటమే కారణం.
   మంచి పని తలపెట్టే ముందు, ఏదైనా మంచి వార్తను విన్నప్పుడు, నోరు తీపి చేయండి అంటుంటారు. అలా అన్నప్పుడు అందరికీ బెల్లం ముక్కనే ఇస్తాం. ఉపవాసం ఉండేవారూ దాన్ని విరమించే ముందు బెల్లం ముక్కను కొద్దిగా తింటారు.

Courtesy  with: PRAJA SEKTHY DAILY

Thursday, 26 December 2013

వాటర్‌ ఫిల్టర్‌ల 'మాయా'జలం



     నిత్య జీవితంలో నీటి వినియోగం ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరు కూడా చాలా తక్కువగా అందుతుంది. ఆ వచ్చే నీరు కూడా కలుషిత నీరు ఎక్కువగా సరఫరా అవుతుంది. వీటి వినియోగం వలన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నీటిని శుద్ధి చేసుకోవడానికి వాటర్‌ఫిల్టర్‌లను ఆశ్రయిస్తున్నాం. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువు ఏదైనా ఉంది అంటే అది వాటర్‌ఫిల్టర్‌ మాత్రమేనని కచ్చితంగా చెప్పవచ్చు. వాటర్‌ ఫిల్టర్‌ ద్వారా శుద్ధయిన నీటిని వినియోగించడం వలన ఇంట్లో అందరి ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగకుండా ఉండాలని మనం కోరుకుంటాం. కాని ఇప్పుడు మార్కెట్‌లో పలురకాల వాటర్‌ ఫిల్టర్‌లు లభిస్తున్నాయి. వాటిలో తయారు చేసేందుకు వాడే సాంకేతికతలో మార్పుండవచ్చు, వాడే విధానంలో మార్పుండవచ్చు అలా ఉన్న వాటర్‌ ఫిల్టర్‌లలో మాములుగా ఉండే వాటర్‌ ఫిల్టర్స్‌, అతినీలలోహిత కిరణాలతో పనిచేసేవి, క్లోరిన్‌ వాటర్‌ ఫిల్టర్స్‌, ఆర్‌.ఓ (రివర్స్‌ ఆస్‌మోసిస్‌) లాంటి అనేక రకాల వాటర్‌ ఫిల్టర్స్‌ ఉన్నాయి. కాని వాటి లక్ష్యం మాత్రం నీటిని శుద్ధి చేయడం. కాని ఈ ప్యూరిఫై చేయడంలోనే ఉంది అసలు కిటుకంతా. ఇలా వాటర్‌ ఫిల్టర్స్‌ను దీర్ఘకాలంపాటు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా.
ఆర్‌.ఓ వాటర్‌ ఫిల్టర్‌: ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఇదే. ఆర్‌.ఓ (రివర్స్‌ ఆస్‌మోసిస్‌) వాటర్‌ ఫిల్టర్‌ ద్వారా 4,5 లీటర్ల నీటిని శుద్ధి చేయడం ద్వారా ఇక లీటర్‌ నీరు ఉత్పత్తి అవుతుంది. అంటే 60 శాతం పైగా నీళ్ళు వృధా అవుతున్నాయన్న మాట. అసలే నీళ్ళు లేక చచ్చిపోతుంటే ఇక వాటర్‌ను వేస్ట్‌ చేసే శుద్ధి యంత్రాన్ని వాడటం అవసరమా? దీని సాంకేతికత సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మంచినీరుగా మలచడానికి తయారుచేశారు. ఈ ఆర్‌.ఓ సాంకేతికతను కార్పోరేట్‌ వ్యవస్థ ఇంట్లో వాడుకునే వాటర్‌ఫిల్టర్‌ల తయారీలో ఉపయోగించింది. దీనివలన ఇంట్లో వాడే నీళ్ళు వృధా అవుతున్నాయి. కాని ఎక్కువ మంది భారతీయులు ఈ నీటి శుద్ధి యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే కనుక నీటిలోని బాక్టీరియా ద్వారా వచ్చే జబ్బులే కారణమని తెలుస్తుంది. అనారోగ్య కారకాలు చుట్టుముట్టకుండా ఉండేందుకే ఈ ఆర్‌.ఓ వాటర్‌ ఫిల్టర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాని ఆర్‌.ఓ యంత్రం వలన నీరు పూర్తిగా శుద్ధి అవుతుందనే దానికి ఎలాంటి ఆధారం లేదు. వాణిజ్య ప్రకటనల్లో వచ్చే వాటిని చూసి మాత్రమే ప్రజలు ఇలాంటి అపోహాలకు పోతున్నారని చెప్పవచ్చు. దీని వలన నీరు వృధా తప్ప ఎలాంటి లాభం లేదు.
యు.వి కిరణాల ద్వారా నీటిని శుద్ధి చేయడం: అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన నీటిని శుభ్రపరిచే యంత్రం ద్వారా నీటిని శుద్ధిచేయడం వలన అనారోగ్యకారక బాక్టీరియాలను నాశనం చేస్తుంది. కాని యు.వి కిరణాల ద్వారా శుద్ధియైన నీటిని ఎక్కువ సమయం నిల్వ ఉంచితే నాశనమైన బాక్టీరియా తిరిగి పునర్జీవనం పొందుతుంది. ఇక నీరు శుద్ధిచేసి ఏం లాభం. కరెంట్‌ దండగ తప్ప.
క్లోరిన్‌ వాటర్‌ ఫిల్టర్స్‌: మార్కెట్‌లో ప్రముఖంగా ఉన్న మరొక వాటర్‌ ఫిల్టర్‌ క్టోరిన్‌ ద్వారా నీటిని శుద్ధి చేయడం. ఎలాంటి విద్యుత్‌ అవసరం లేకుండా క్టోరిన్‌ను ఉపయోగించి నీటిలోని సూక్ష్మజీవులను నశింపజేసి, క్లోరిన్‌ ద్వారా నీటిని శుద్ధి చేయడం. క్టోరిన్‌ను ఉపయోగించి ప్రతిచర్య జరపడం ద్వారా నీటిలో క్లోరిన్‌ శాతం పెరుగుతుంది. దీనివలన ప్రమాదకర మైన సంకలిత పదార్థం ఏర్పడుతుంది. ఇది మానవ శరీరంపై దుష్ఫప్రభావాన్ని కలిగిస్తుందని ప్రపంచంలోని అనేక మంది శాన్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. క్లోరినేటేడ్‌ నీటిని దీర్ఘకాలం పాటు వాడటం వలన క్యాన్సర్‌ బారిన పడటంతో పాటు, అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
సిల్వర్‌ నానో టెక్నాలజీ వాటర్‌ ఫిల్టర్‌: ప్రముఖ బ్రాండ్‌ల ద్వారా ఉత్పత్తి అవుతున్న మరొక ముఖ్యమైనది సిల్వర్‌ నానో టెక్నాలజీ వాటర్‌ ఫిల్టర్‌. తక్కువ ఖర్చుతో ఎలాంటి విద్యుత్‌ వినియోగం లేకుండా నీటిలోని సూక్ష్మజీవులను చంపడంలో అత్యంత ప్రభావవంతమైన వాటర్‌ ఫిల్టర్‌ ఇది. అయినా దీనిని ఎక్కువ కాలం ఉపయోగించడం వలన మానవ జీవితంపై ఎలాంటి దుష్పభావాన్ని చూపదనే గ్యారంటీ లేదు. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్న నానో టెక్నాలజీ కాబట్టి ఇది ఎలా ఉంటుందనే దాని మీద ఇంకా ఎలాంటి పరిశోధనలూ లేవు. కాని సాంప్రదాయకంగా వాడే సిల్వర్‌ లాగా ఉంటుందనేది కూడా చెప్పడం కష్టం.
బార్క్‌ శాస్త్రవేత్తలు కూడా ఒక నీటి శుద్ధి యంత్రాన్ని తయారుచేస్తున్నారు. ఇదైనా సమర్ధవంతంగా నీటిని శుద్ధి చేస్తుందని భావిద్దాం. మనం ఎలాంటి వాటర్‌ ఫిల్టర్‌ను వాడినా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాడటం మాత్రం ఉత్తమం. ఇన్ని రకాల నీటిశుద్ధి యంత్రాలు ఉన్నా వాటిలో ఏది మంచిదో? ఏది చెడ్డదో చెప్పడం కష్టం. వీటిలో ఎన్ని సుగుణాలున్నా, వాటిలో ముఖ్యమైన లోపం కనబడుతోంది. ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యంకాదు కదా!. అందుకే వీటన్నింటికన్నా కాచి, చల్లార్చి, వడబోసుకున్న నీటిని తాగడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. కాదంటారా?! 

Courtsey with: PRAJA SEKTHY DAILY

Monday, 23 December 2013

ఉపగ్రహాలకు పూజలా!




 -నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ వెంకటరామన్‌ రామకృష్ణన్‌
 -ప్రపంచాన్ని పరిశీలించండి విద్యార్థులకు పిలుపు
 -శాస్త్రవేత్తలు సైన్స్‌ను మతానికి దూరంగా ఉంచాలి 
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారానే మంచి శాస్త్రవేత్తలు రూపొందుతారని నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ వెంకటరామన్‌ రామకృష్ణన్‌ అన్నారు. విద్యార్థులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచాన్ని, సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు. మతం వ్యక్తిగమైన అంశమని, దానిని సైన్స్‌కు దూరంగా ఉంచాలని శాస్త్రవేత్తలకు సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'విజ్ఞానశాస్త్రం-సమాజం' అనే అంశంపై జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంటకుపైగా పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ నోబెల్‌ బహుమతికి అంత ప్రాధాన్యత లేదని అన్నారు. కీలక పరిశోధనలు చేసిన పలువురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి రాకపోవడాన్ని ప్రస్తావించారు. తాము కనుగొన్న అంశాలు సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడతాయన్న అంశంపైనే శాస్త్రవేత్తల దృష్టి ఉంటుందని ఆయన చెప్పారు. శాస్త్రీయ ఆలోచన లోపించినందువల్లే సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు పుట్టుకతో శాస్త్రవేత్తలే అని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నపిల్లల్లో వివిధ అంశాలపై ఎన్నో ప్రశ్నలు వేసే అలవాటును గుర్తుచేశారు. కొంత ఎదిగిన తరువాత ప్రశ్నలు వేయడాన్ని మానుకోవడాన్నీ ఆయన ప్రస్తావించారు. దీనికి భిన్నంగా ఎదిగిన తరువాత కూడా ఎవరైతే వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి, జవాబులు రాబడతారో వారే మంచి శాస్త్రవేత్తలుగా రూపొందుతారని ఆయన అన్నారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రూపొందాలనుకునేవారు, ఔత్సాహిక శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. శాస్త్ర పరిశోధన రంగంలో మేధోహక్కులు విడదీయరాని భాగంగా మారాయన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు పెద్దఎత్తున శాస్త్ర పరిశోధనలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్ర: కీలకమైన శాస్త్ర పరిశోధన రంగంలో మేధోపరమైన హక్కులు ఉండటం ఎంతవరకు సమంజసం? దీనివల్ల ఔత్సాహిక శాస్త్రవేత్తలు నష్టపోవడం లేదా?
జ: ఇది వివాదాస్పదమైన అంశం. మేధోపరమైన హక్కులకు నిరాకరిస్తే కంపెనీలు ఆ రంగంలో పెట్టుబడులు లేవు. కంపెనీల నుండి వచ్చే పెట్టుబడులు లేకపోతే శాస్త్ర పరిశోధనలు జరిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. శాస్త్రవిజ్ఞాన ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదమూ ఉంది. దీనికి భిన్నమైన స్థితి కావాలంటే ప్రభుత్వాలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి. శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించాలి. ఔత్సాహికులకు అండగా నిలవాలి.
ప్ర: అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే సందర్భంలోనూ శాస్త్రవేత్తలు పూజలు చేస్తున్నారు. దీని ద్వారా సమాజానికి వారిస్తున్న సందేశమేంటి?
జ: అంగారక గృహాంపైకి ఉపగ్రహాన్ని పంపేముందు పూజలు చేశారన్న వార్తలు చదివి నేనూ ఆశ్చర్యపడ్డా. నిజానికి ఇలా జరిగి ఉండకూడదు. మతం వ్యక్తిగతమైనది. దీనిని సైన్స్‌కు దూరంగా ఉంచాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలదే! భారతదేశానికే చెందిన ప్రముఖ గణితశాస్త్రవేత్త రామానుజన్‌ సనాతన సంప్రదాయాలనే పాటించారు. అయితే, గణితశాస్త్రంలోకి ఆయన మతాన్ని ఎన్నడూ తీసుకురాలేదు. కొన్ని దేశాలు ఈ విషయంలో నిబంధనలను, సెక్యులర్‌ విలువలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. విస్తారంగా వినియోగిస్తున్న హోమియోపతి విధానానికి రసాయన ప్రాతిపదికేమి లేదు. నమ్మకం ఆధారంగానే ప్రజలు దానిని వాడుతున్నారు.
ప్ర: శాస్త్ర విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందినా సమాజంలో మూఢనమ్మకాలు ఎందుకున్నాయి?
జ: బలీయమైనే నమ్మకమే దీనికి కారణమని భావిస్తున్నా. సోవియట్‌ రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన తరువాత మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. అనేక దేశాల్లోనూ ఇదే స్థితి. అనివార్యమైన చావు, దాని చుట్టూ అల్లుకున్న బలమైన నమ్మకాలు ఈ మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణమని అనుకుంటున్నా
ప్ర: శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి, రాజకీయాలకు ఉన్న సంబంధం ఏమిటి? ( ఈ ప్రశ్నకు సిసిఎంబి వ్యవస్థాపక డైరక్టర్‌ డాక్టర్‌ పిఎం భార్గవ సమాధానం ఇచ్చారు)
జ: శాస్త్ర పరిశోధన రంగాలకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. రాజకీయ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి. శాస్త్రీయ ధృక్పధం ఉన్న ప్రభుత్వాలైతే ఈ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తాయి.
ప్ర: జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా కొన్ని విశ్వవిద్యాలయాలు గుర్తించాయి. అది సబబేనా?
జ: జ్యోతిష్యం శాస్త్రం కాదు. ఎటువంటి శాస్త్ర పరీక్షల ముందునిలవలేదు. అది కూడా ఒక నమ్మకమే. విశ్వ విద్యాలయాలు శాస్త్రంగా గుర్తించాయంటే వాటకి వేరే ప్రయోజనాలు ఉండవచ్చు.
ప్ర: బిటి ప్రయోగాలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: బహుళజాతి కంపెనీలు బిటి ప్రయోగాలు చేస్తుండటం వల్ల చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తోంది. ఆ కంపెనీలను నమ్మలేకే ఈ పరిస్థితి వస్తోందని భావిస్తున్నా! బిటి ఉత్పత్తుల వల్ల ప్రయోజనాలేమి లేవని నేను చెప్పను. తక్కువ ఎరువులు, క్రిమి సంహరకమందులు వాడటంతో పాటు, అధిక ఉత్పత్తికి ఇవి దోహదం చేస్తాయి. వ్యతిరేకతకు బహుళజాతి కంపెనీలే కారణమైతే ప్రభుత్వాలే ఆ ప్రయోగాలను చేపట్టాలి.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాజీ సలహాదారు కెఆర్‌ వేణుగోపాల్‌, సిసిఎంబి వ్యవస్థాపక డైరక్టర్‌ డాక్టర్‌ పిఎం భార్గవ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కె. సత్యప్రసాద్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ బిఎన్‌ రెడ్డి, ఉస్యానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కృష్టంరాజునాయుడు, చెకుముకి సంపాదకులు ప్రొఫెసర్‌ ఎ. రామచంద్రయ్య, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పి. రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy with: PRAJA SEKTHI DAILY

Saturday, 14 December 2013

విభిన్న భావాల విజ్ఞాన సర్వస్వం..పుస్తకం
Posted on: Fri 13 Dec 22:28:33.162806 2013
     పుస్తకం... కోటి ఆలోచనలు రేకెత్తిస్తుంది. కొంగ్రొత్త మార్గాలు చూపిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుతుంది. వినోదాన్ని పంచుతుంది.
పుస్తకం ... విషాదాన్ని పుట్టిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. చైతన్యాన్ని రగిలిస్తుంది. విప్లవాన్ని సృష్టిస్తుంది.
పుస్తకం... ఆకర్షిస్తుంది. ఆకట్టుకుంటుంది. శోధిస్తుంది. సాధిస్తుంది.
పుస్తకం... ఆకాశానికెత్తేస్తుంది. అగాధంలోకి తొక్కేస్తుంది. నేస్తమై నిలుస్తుంది. ఆత్మ స్థయిర్యమై గెలిపిస్తుంది.
    నిరాశ మిమ్మల్ని ఆవహించినప్పుడు ఆశల హరివిల్లరు వికసిస్తుంది. 'నేను ఒంటరి'నని మీరు బాధపడుతున్నప్పుడు 'దిగులెందుక'ని ఒదారుస్తుంది. అవును అదో విజ్ఞాన సర్వస్వం. విభిన్న భావాల గని. భావ స్వేచ్ఛకు వేదిక. బహుళ ప్రయోజనాల దీపిక... అదే అందరినీ అలరింపజేసే పుస్తకం. మరలాంటి పుస్తకాన్ని, అంతగొప్ప వైజ్ఞానిక సర్వస్వాన్ని ఇష్టపడని వారెవరుంటారు?! ఆ జ్ఞానామృతాన్ని గ్రోలని వారెవరుంటారు?! అందుకే అన్నారు పెద్దలు. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... ఒక మంచి పుస్తకం కొనుక్కో' అని. ప్రభావితం చేయడంలో, ప్రభావితమవడంలో ప్రధాన సూత్రధారిగా విలసిల్లుతోంది పుస్తకం. ఆకాశమంత ఎదగడానికీ, అవాంతరాల్లో చిక్కుకోవడానికీ ప్రధాన పాత్రధారిగా భాసిల్లుతోంది పుస్తకం.
 ''పరవళ్లు తొక్కే ప్రకృతి అందాలు కళ్లముందు కనువిందు చేస్తున్నాయి. పూసే పూలూ, వీచేగాలీ, ఎగసే కెరటాలూ కళ్లముందు కదలాడుతున్నాయి. జలపాతాల ఝంకార నాదాలూ, మలయ మారుతాల శబ్ద విన్యాసాలూ కనువిందుగా, వినసొంపుగా అలరిస్తున్నాయి. మధురాను భూతిలో మైమరిపిస్తున్నాయి. మధుర భావనలతో మానస వీణాతంత్రులు మీటుతున్నాయి''.... ఇదో వర్ణనాత్మక కొటేషన్‌. ఇందులోని దృశ్యాలేవీ మీరు చూడట్లేదు. కానీ స్వయంగా చూస్తున్న అనుభూతి కలుగుతోంది కదూ!? అక్షరాలకూ, అక్షరాలు పొదిగిన పదాలకూ, పదబందాలు పెనవేసుకున్న వాక్యాలకూ ఇవన్నీ కలగలసి రూపుదిద్దుకున్న పుస్తకాలకూ ఉండే గొప్పత(ధ)నమది. అందుకే పుస్తకం చాలా శక్తిమంతమైనది. అది ఎవ్వరినైనా ఆకట్టుకుంటుంది. ఎలాంటి హృదయాన్నయినా స్పందింపజేస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది.
 సమస్యల సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యాన్నిచ్చే నేస్తమవుతుంది పుస్తకం. ఆత్మ స్థయిర్యాన్నిచ్చే అమ్మ అవువుతుంది పుస్తకం. శిలలాంటి వ్యక్తిత్వాన్ని శిల్పంగా చెక్కి మలుపు తిప్పుతుంది పుస్తకం. ఆటంకాలు ఎదురై వేధిస్తున్నప్పుడు, ఆపదలు అరుదెంచి జీవితంతో తలపడుతున్నప్పుడు ఏకవ్యక్తి సైన్యమై ఎలా ఎదుర్కోవాలో బోధిస్తుంది పుస్తకం. అంతేకాదు కలలై, కథలై, కావ్యాలై, కవితలై కదలిక తెస్తుంది పుస్తకం. వెన్నెలలోని హాయినీ, అమ్మలాలనలోనీ వాత్సల్యాన్నీ, కోయిలపాటలోని తీయందనాన్నీ రుచి చూపుతుంది పుస్తకం. ఆకుపచ్చని గుబుర్లలో అరవిరిసిన గులాబీ అందాలనూ, త్యాగాల మాగాణుల్లో విరబూసిన విప్లవ మందారాలనూ తనలో ఇముడ్చుకుంటుంది పుస్తకం. ఎంకి పాటల తెలుగు దనాన్నీ, చలం రాతల వలపు 'మైదా'నాన్నీ మరిపిస్తుంది పుస్తకం. విశ్వనాథ పలుకై, విరుల తేనె చినుకై, మనసును హత్తుకుంటుంది పుస్తకం. కృష్ణశాస్త్రి భావ కవితల కొలనులో అలల సవ్వడులై అలరిస్తుంది పుస్తకం. సినారె రచనల్లోని 'చీకటి రాత్రు'ల్లో 'చెక్కిలి పైని అగరు చుక్కల' వర్ణనల్లో వెలుగు పూలు పూయిస్తుంది పుస్తకం. శ్రీశ్రీ కవితల్లో ప్రభవించే చైతన్యమై, చెరబండరాజు రచనల్లోని తెగువై ప్రజ్వరిల్లుతుంది పుస్తకం.
  తరతరాల బానిసత్వాన్ని తరిమికొట్టిన చరిత్రను కళ్లకు కడుతుంది పుస్తకం. దోపిడీ పీడనల భావనలను దనుమాడిన ప్రజాపోరాట గాధలను వివరిస్తుంది పుస్తకం. 'బాంచన్‌ దొరా నీ కాల్మొక్త' అన్న వాళ్లను సైతం బందూకులు పట్టించిన బలమైన శక్తిగలది పుస్తకం. కలాల కవాతుల ప్రేరణలో దాని పాత్ర తక్కువేమి కాదు. గళాల గర్జనల వెల్లువలో దాని స్థానం చిన్నదేమీ కాదు. గదర్‌ వీరుల గళమై... జనం గుండె చప్పుడై... జజ్జనకరె జనారే యను జనం పాటల వెల్లువయి వెలుగొందుతుంది పుస్తకం. ఆనందమైనా, ఆవేశమైనా పుస్తకంలో ఒదిగిపోతుంది. ఆక్రోశమైనా, అవహేళన అయినా పుస్తకంలో పొదిగిపోతుంది. విమర్శ ఐనా, కువిమర్శ ఐనా పుస్తకంలో చోటు దక్కించుకుంటుంది. ఎందుకంటే. అదో సమాచార స్రవంతి. అదో వైజ్ఞానిక భాండాగారం. మంచీ-చెడూ, దిశా-దశా, కలగలసిన భావాల సర్వస్వం. గాలీ, నీరూ, ఆహారం ఎంతవసరమో సామాజిక అవగాహన కోసం పుస్తకం అంతే అవసరం. పుస్తకాలు చదవని వారెవ్వరూ రచయితలు కాలేరు. పుస్తకాలు చదవని వారెవ్వరూ కవులు కాలేరు. పుస్తకాలు చదవని వారెవ్వరూ జర్నలిస్టులుగా రాణించలేరు. అభ్యుదయ భావాల పరిమళ భరితంలో, సమూల మార్పుల సమాజ పరిణామాల్లో అసలు రహస్యం పుస్తకమే అనడంలో అతిశయోక్తి లేదు. అవాస్తవం అంతకన్నా కాదు. మంచి మార్గంలో నడ్పించడంలో పుస్తకాల పాత్ర ఎంతో ఉంటుంది.. సామాజిక స్పృహ కలిగిండంలో పుస్తకాల ప్రభావం ఎంతో తోడ్పడుతుంది. పుస్తకాల్లోనూ ఎన్నో రకాలుంటాయి. అనవసరపు భ్రమల్లో ముంచెత్తే రచనలూ వుంటాయి. వాస్తవాలను చాటిచెప్పే పుస్తకాలూ ఉంటాయి. విభిన్న భావనలు గల పుస్తకాల్లో ఏదోఒక దానిని చదివి, అదే సరైందని నిర్ణయించుకుంటే పొరపాటే. గుడ్డిగా చదవడమే కాదు. సమాజానికి మేలు చేసే పుస్తకాలను ఎంచుకోవాలి. అభ్యుదయ భావాలు వికసింపజేసే రచనలు ఏరుకోవాలి. చైతన్యం రగిలించే పుస్తకాలను కొనుక్కోవాలి. విప్లవ స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదివి తీరాలి. బలహీనతలనూ, భ్రమలనూ దూరం చేసే ఏ పుస్తకమైనా ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పుస్తకాలు జీవితాలకూ, పరిస్థితులకూ, సమాజానికీ ఎలా వర్తిస్తాయో, ఏ ఉద్దేశంతో అందులోని రచనలు రూపుదిద్దుకున్నాయో ఒక్కసారి ఆలోచించగలిగితే చాలు! ఏది వాస్తవం? అన్న ఒక్క ప్రశ్న మీలో ఉదయిస్తే చాలు!! అప్పుడు ఏది నిజమో, ఏది అబద్దమో, ఏది వాస్తవమో, ఏది భ్రమో మీరు తేల్చుకో గలుగుతారు. మంచి పుస్తకాలను ఎంచుకోగలుగుతారు.
  పుస్తకాల్లో వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ, చారిత్రక గ్రంథాలూ, సామాజిక- సాంస్కృతిక గ్రంథాలూ, సాంఘిక గ్రంథాలూ, భాషా గ్రంథాలూ ఎలా ఎన్నో ఉంటాయి. సైన్సూ, విజ్ఞానం, సాంకేతికం, సంగీతం, సాహిత్యం, కళలూ, కావ్యాలూ, నైసర్గిక పరిస్థితులూ, నవసమాజ నిర్మాణపు భావాలుగల పుస్తకాలూ, నవతరాన్ని అలరించే పుస్తకాలూ ఉంటాయి. ఇవేగాక ఇంకెన్నో రకాల సాహిత్యం నేడు మార్కెట్లో లభిస్తోంది. ప్రపంచమే ఒక కుగ్రామం అవుతున్న ఈరోజుల్లో ఎన్ని ఆధునిక ఒరవడులు తెరపైకి వచ్చినా, పుస్తకాలకున్న ప్రాధాన్యత ఏమాత్రమూ తగ్గలేదు. తగ్గుతుందని కూడా చెప్పలేం. మేధావుల్ని సృష్టించేవీ, విజ్ఞానాన్నీ పంచేవీ, వికాసాన్ని కలిగించేవీ పుస్తకాలే. చైతన్యాన్ని రగిలించేవీ, సమాజాన్ని మార్చేవీ పుస్తకాలే. మార్పుల్లో, తీర్పుల్లో, నడవడికల్లో, నైతికతల్లో, విజయాల్లో, పరాజయాల్లో, వికాసాల్లో, విప్లవాల్లో, ఆవేదనల్లో, ఆలోచనల్లో, ఆశయాల్లో, లక్ష్యాల్లో అన్నింటిలో అంతర్భాగమై నడిపిస్తున్నదీ పుస్తకాలే. విభిన్న భావనల విజ్ఞాన సర్వస్వాలుగా భాసిల్లుతున్నదీ పుస్తకాలే. అందుకే మంచి పుస్తకాలను చదవాలి. చదివించాలి. అందులోని అంతరార్థాన్ని గ్రహించాలి. విజ్ఞానాన్ని ఆస్వాదించాలి. వికాసం పొందాలి.

Courtesy with: PRAJA SEKTHI DAILY