Monday, 23 December 2013

ఉపగ్రహాలకు పూజలా!




 -నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ వెంకటరామన్‌ రామకృష్ణన్‌
 -ప్రపంచాన్ని పరిశీలించండి విద్యార్థులకు పిలుపు
 -శాస్త్రవేత్తలు సైన్స్‌ను మతానికి దూరంగా ఉంచాలి 
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారానే మంచి శాస్త్రవేత్తలు రూపొందుతారని నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ వెంకటరామన్‌ రామకృష్ణన్‌ అన్నారు. విద్యార్థులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచాన్ని, సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు. మతం వ్యక్తిగమైన అంశమని, దానిని సైన్స్‌కు దూరంగా ఉంచాలని శాస్త్రవేత్తలకు సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'విజ్ఞానశాస్త్రం-సమాజం' అనే అంశంపై జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంటకుపైగా పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ నోబెల్‌ బహుమతికి అంత ప్రాధాన్యత లేదని అన్నారు. కీలక పరిశోధనలు చేసిన పలువురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి రాకపోవడాన్ని ప్రస్తావించారు. తాము కనుగొన్న అంశాలు సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడతాయన్న అంశంపైనే శాస్త్రవేత్తల దృష్టి ఉంటుందని ఆయన చెప్పారు. శాస్త్రీయ ఆలోచన లోపించినందువల్లే సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు పుట్టుకతో శాస్త్రవేత్తలే అని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నపిల్లల్లో వివిధ అంశాలపై ఎన్నో ప్రశ్నలు వేసే అలవాటును గుర్తుచేశారు. కొంత ఎదిగిన తరువాత ప్రశ్నలు వేయడాన్ని మానుకోవడాన్నీ ఆయన ప్రస్తావించారు. దీనికి భిన్నంగా ఎదిగిన తరువాత కూడా ఎవరైతే వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి, జవాబులు రాబడతారో వారే మంచి శాస్త్రవేత్తలుగా రూపొందుతారని ఆయన అన్నారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రూపొందాలనుకునేవారు, ఔత్సాహిక శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. శాస్త్ర పరిశోధన రంగంలో మేధోహక్కులు విడదీయరాని భాగంగా మారాయన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు పెద్దఎత్తున శాస్త్ర పరిశోధనలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్ర: కీలకమైన శాస్త్ర పరిశోధన రంగంలో మేధోపరమైన హక్కులు ఉండటం ఎంతవరకు సమంజసం? దీనివల్ల ఔత్సాహిక శాస్త్రవేత్తలు నష్టపోవడం లేదా?
జ: ఇది వివాదాస్పదమైన అంశం. మేధోపరమైన హక్కులకు నిరాకరిస్తే కంపెనీలు ఆ రంగంలో పెట్టుబడులు లేవు. కంపెనీల నుండి వచ్చే పెట్టుబడులు లేకపోతే శాస్త్ర పరిశోధనలు జరిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. శాస్త్రవిజ్ఞాన ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదమూ ఉంది. దీనికి భిన్నమైన స్థితి కావాలంటే ప్రభుత్వాలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి. శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించాలి. ఔత్సాహికులకు అండగా నిలవాలి.
ప్ర: అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే సందర్భంలోనూ శాస్త్రవేత్తలు పూజలు చేస్తున్నారు. దీని ద్వారా సమాజానికి వారిస్తున్న సందేశమేంటి?
జ: అంగారక గృహాంపైకి ఉపగ్రహాన్ని పంపేముందు పూజలు చేశారన్న వార్తలు చదివి నేనూ ఆశ్చర్యపడ్డా. నిజానికి ఇలా జరిగి ఉండకూడదు. మతం వ్యక్తిగతమైనది. దీనిని సైన్స్‌కు దూరంగా ఉంచాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలదే! భారతదేశానికే చెందిన ప్రముఖ గణితశాస్త్రవేత్త రామానుజన్‌ సనాతన సంప్రదాయాలనే పాటించారు. అయితే, గణితశాస్త్రంలోకి ఆయన మతాన్ని ఎన్నడూ తీసుకురాలేదు. కొన్ని దేశాలు ఈ విషయంలో నిబంధనలను, సెక్యులర్‌ విలువలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. విస్తారంగా వినియోగిస్తున్న హోమియోపతి విధానానికి రసాయన ప్రాతిపదికేమి లేదు. నమ్మకం ఆధారంగానే ప్రజలు దానిని వాడుతున్నారు.
ప్ర: శాస్త్ర విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందినా సమాజంలో మూఢనమ్మకాలు ఎందుకున్నాయి?
జ: బలీయమైనే నమ్మకమే దీనికి కారణమని భావిస్తున్నా. సోవియట్‌ రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన తరువాత మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. అనేక దేశాల్లోనూ ఇదే స్థితి. అనివార్యమైన చావు, దాని చుట్టూ అల్లుకున్న బలమైన నమ్మకాలు ఈ మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణమని అనుకుంటున్నా
ప్ర: శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి, రాజకీయాలకు ఉన్న సంబంధం ఏమిటి? ( ఈ ప్రశ్నకు సిసిఎంబి వ్యవస్థాపక డైరక్టర్‌ డాక్టర్‌ పిఎం భార్గవ సమాధానం ఇచ్చారు)
జ: శాస్త్ర పరిశోధన రంగాలకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. రాజకీయ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి. శాస్త్రీయ ధృక్పధం ఉన్న ప్రభుత్వాలైతే ఈ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తాయి.
ప్ర: జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా కొన్ని విశ్వవిద్యాలయాలు గుర్తించాయి. అది సబబేనా?
జ: జ్యోతిష్యం శాస్త్రం కాదు. ఎటువంటి శాస్త్ర పరీక్షల ముందునిలవలేదు. అది కూడా ఒక నమ్మకమే. విశ్వ విద్యాలయాలు శాస్త్రంగా గుర్తించాయంటే వాటకి వేరే ప్రయోజనాలు ఉండవచ్చు.
ప్ర: బిటి ప్రయోగాలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: బహుళజాతి కంపెనీలు బిటి ప్రయోగాలు చేస్తుండటం వల్ల చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తోంది. ఆ కంపెనీలను నమ్మలేకే ఈ పరిస్థితి వస్తోందని భావిస్తున్నా! బిటి ఉత్పత్తుల వల్ల ప్రయోజనాలేమి లేవని నేను చెప్పను. తక్కువ ఎరువులు, క్రిమి సంహరకమందులు వాడటంతో పాటు, అధిక ఉత్పత్తికి ఇవి దోహదం చేస్తాయి. వ్యతిరేకతకు బహుళజాతి కంపెనీలే కారణమైతే ప్రభుత్వాలే ఆ ప్రయోగాలను చేపట్టాలి.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాజీ సలహాదారు కెఆర్‌ వేణుగోపాల్‌, సిసిఎంబి వ్యవస్థాపక డైరక్టర్‌ డాక్టర్‌ పిఎం భార్గవ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కె. సత్యప్రసాద్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ బిఎన్‌ రెడ్డి, ఉస్యానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కృష్టంరాజునాయుడు, చెకుముకి సంపాదకులు ప్రొఫెసర్‌ ఎ. రామచంద్రయ్య, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పి. రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment