Monday, 9 June 2014

వ‌ర్షా‌కాలం... హ‌ర్షోల్లా‌సం ...

    వర్షాన్ని ఎలా కొలుస్తారు?
        వర్షపాతాన్ని వర్షమానిక (రెయిన్‌ గేజ్‌)తో కొలుస్తారు. ఈ కొలతను ఒక చదరపు తలంపై సేకరించిన నీటి లోతుగా వ్యక్తీకరిస్తారు. 0.01 మి.మీ లేదా 0.01 అంగుళాల ఖచ్చితత్వంతో వర్షాన్ని కొలుస్తారు. వివిధ ప్రదేశాల్లోని వర్షమానికలను భూమినుండి ఒకే ఎత్తులో ఉంచుతారు. వర్షమానికలు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిలువ వర్షమానికలు, రికార్డింగు వర్షమానికలు. నిలువ వర్షమానికలను దినసరి వర్షపాతాన్ని లేదా నెల మొత్తం కురిసిన వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. రికార్డింగు వర్షమానికలను వర్షపాతం తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. రికార్డింగ్‌ వర్షమానికలో ఒక బకెట్‌లో నిర్దిష్ట ఘనపరిమాణంలో వర్షం నీరు చేరినప్పుడు ఆ బకెట్‌లోనుంచి నీరు ఒలికిపోతుంది. ఇలా బకెట్‌ నిండి, నీరు ఒలికిన ప్రతిసారీ ఒక విద్యుత్‌ స్విచ్‌ దానిని నమోదు చేస్తుంటుంది.
రుతువుల రాణీ వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచువృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లూ, బయళ్లూ, ఊళ్లూ, బీళ్లూ
ఏకం చేసే వర్షాకాలం,
స్వచ్ఛకౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలి వడికించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమిత్తమే
(శ్రీశ్రీ-శైశవగీతి)
         రుతువులు వస్తూ పోతూ మీ నిమిత్తమే దాగుడు మూతల క్రీడలాడుతాయని మహాకవి శ్రీశ్రీ బాలలతో అంటున్నాడు. నిజానికి రుతువులు ఆడే దాగుడుమూతల ఆట ఎవరికి ఇష్టం కాదు? వాటి ముందు పెద్దలు కూడా పిల్లలే అయిపోతారు. మనిషి తన జీవితంలో ఎన్ని వసంతాలు, ఎన్ని శరత్తులు, ఎన్ని హేమంతాలు, ఎన్ని వర్షాలు చూసినా ఏటా ప్రతిసారీ వాటిని కొత్తగా చూస్తూనే ఉంటాడు. రుతుభ్రమణంతోపాటే వాటిని అల్లుకున్న మనిషి జ్ఞాపకాలు, అనుభూతుల భ్రమణం కూడా ఏటేటా నూతనత్వాన్ని తెచ్చుకుంటూనే ఉంటుంది.
           వచ్చేది వర్షరుతువు. ఎందరికో హర్షరుతువు. విఫలమైతే విషాదరుతువు కూడా. రుతువులలో వర్షరుతువు దారే వేరు. ఎండాకాలం ఎర్రని ఎండ మాడ్చేస్తుంది. శీతాకాలం చలి ఒక్కోసారి ఎముకల్ని కొరికేస్తుంది. కన్యాశుల్కంలో చెప్పినట్టు ఇవి పోలీసు దెబ్బలు చేసే పైకి కనిపించని గాయాలలాంటివి. వర్షాకాలం అలా కాదు. చిరుజల్లుతో మొదలై, చిన్నా పెద్దా చినుకుగా మారి, కుంభవృష్టిగా పరిణమించి, వరదగా ముంచెత్తే వర్ష విజృంభణం మనకు ఒక్కోసారి మరింత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ అనుభవంలోకి వస్తూ ఉంటుంది.
                       గ్రీష్మతాపంతో వేగిపోయిన దేహంపై తొలకరి జల్లు కలిగించే పులకింతను మాటల్లో చెప్పడం కష్టం. అప్పుడు వేసే అదోరకం మట్టివాసన ఒక జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇంట్లో కూర్చున్నప్పుడు తాకే ఆ మట్టివాసన వర్షం పడుతోందన్న సంకేతాన్ని మన మెదడుకు అప్రయత్నంగా అందిస్తుంది. శ్రావణ, భాద్రపదాల దగ్గరికి వచ్చేసరికి ప్రియవర్షం కాస్తా వరదలు పోటెత్తించి భయవర్షంగా మారి చాలు బాబూ, ఈ వర్షాలు అని కూడా అనిపిస్తుంది, అయినాసరే, ఏటేటా నిత్యనూతనంగా మనిషి వర్షోల్లాసాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
              వర్షాలు మొదలవడం కవులకు ప్రతిసారీ కవిత్వోద్దీపకమే. ప్రముఖ కవి కె. శివారెడ్డి 'వర్షాలు మొదలయ్యాయి' అనే శీర్షికతో రాసిన ఓ కవితలో ఇలా అంటారు.

నిశ్శబ్దంగా
కూర్చున్న నా వళ్లో
నాలుగు చినుకులొచ్చి వాలాయి
చినుకులకు రెక్కలుంటాయని
కిరణంలా బద్దలయ్యే శక్తి వుంటుందని
నా కిదివరకు తెలియదు
కర్టెన్‌ ఎత్తి తొంగి చూస్తాయి
కిటికీ అవతల నుంచుని కాళ్లు లోనికి
దీర్ఘంగా చాపుతాయి,
చిన్నప్పుడెప్పుడో చీకట్లో
బల్ల కింద వస్తువుల్ని కాళ్లతో దేవులాడినట్టు
చినుకులకు వళ్లంతా కళ్లు
..........................
చినుకుల కేసీ చినుకుల్లో నానుతున్న చెట్ల కేసి
మనుషుల కేసీ, వస్తువుల కేసీ, వాహనాల కేసీ
అప్పుడే చూపొచ్చినట్టు చూడడం
మరుక్షణంలో కళ్లు పోతాయన్నట్టు
చూపులాగుతాయన్నట్టు, సాంద్రంగా
తదేకంగా, తన్మయంగా, తనివి తీరనట్టు చూడడం-

ఎవరో నా నెత్తిన వర్షం కొంగు కప్పారు
ఎదురుగ్గా ఉన్న
అయిదంతస్తుల పంజరంలో
రెండు చినుకులు కిచకిచమంటున్నాయి-
వర్షాలు మొదలయ్యాయి
                మిగతా రుతువులతో పోల్చితే వర్షరుతువుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, రుతువుల రాణీ వసంతమే కానీ, సాహిత్యానికి ఎక్కువ వస్తువును సమకూర్చింది మాత్రం వర్షమే. వర్షం అనగానే మనకు వెంటనే మేఘం గుర్తుకు రావలసిందే. కావడానికి ఆషాఢమేఘమే కావచ్చు కానీ, కాళిదాసు మేఘదూతం కావ్యంలో ప్రియుడికీ, ప్రియురాలికీ మధ్య మేఘమే వార్తాహరి అయింది. ఇక కావ్యాలలో వర్షరుతు వర్ణనలు సరేసరి. అయితే, ఆహ్లాదకత్వం వర్షానికి ఒక పార్శ్వం మాత్రమే, ఇంకో పార్శ్వాన్ని చూస్తే వర్షం ఏటేటా మనిషిలో పంటసిరుల ఆశలు మోసులెత్తించే జీవనధార కూడా. ఒక ఏడాది వర్షం కరుణించిందంటే ఆ ఏడాది రైతు ఇంట అన్నరాశికి లోటు లేనట్టే. ఆ ఏడాదంతా రైతు కంట ఆనందవర్షమే. కానీ ఒక్కో ఏడాది వర్షం మొహం చాటేస్తుంది. మబ్బులు తెల్లమొహం వేస్తాయి. ఇంకా అన్యాయంగా వరసగా రెండు మూడేళ్లపాటు అనావృష్టి కొనసాగుతుంది. ప్రభుత్వాల రైతు వ్యతిరేక అపసవ్య విధానాల పుణ్యమా అని రైతు బతుకు అప్పుల ఊబిగా మారి ఎండిన పొలాలు ఆత్మహత్యలనే పండిస్తూ ఉంటాయి. ఈ దేశంలో ఇప్పటికీ వర్షసమృద్ధే ఆ ఏడాది ఆర్థిక ఆరోగ్యానికి కొలమానం అవుతూనే ఉండడం వర్షాలతో ఈ దేశం బతుకు ఎలా పెనవేసుకుపోయిందో గ్రహించడానికి సాక్ష్యం.
                          పడిన వర్షం మనపై పన్నీటి చిలకరింత ఎలా అవుతుందో, రాని వాన మనలో అలాగే కన్నీటి ఊట కూడా అవుతుంది. దేశంలో అనావృష్టి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో చినుకు పడడ మంటే కనకవర్షమే. వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతాల జనం ఆకాశం వైపు దృష్టిసారించి నేత్ర తపస్సు తపస్సు చేస్తూనే ఉంటారు. మన రాష్ట్రంలో అలాంటి ప్రాంతాలలో రాయలసీమ ఒకటి. అనావృష్టి సీమ రైతుల వెన్ను ఎలా విరుస్తుందో, వారి జీవితాల నిండా విషాదం ఎలా పరచుకుంటుందో చిత్రించిన సాహిత్యం అనంతం. పడని వర్షాలు సృష్టించిన కన్నీరు ఎన్నో కథలుగా మారి వేల పుటల మీదుగా ప్రవహించింది. రాయలసీమవాసి కాకపోయినా పర్యావరణకార్యకర్తగా ఆ ప్రాంతాలలో అనేకసార్లు పర్యటించిన ప్రముఖ కథకుడు తల్లావఝల పతంజలిశాస్త్రి సీమ ప్రజల బతుకుల్లోని వర్షాభావవిషాదానికి అద్దం పట్టే కథలు ఎన్నో రాశారు. ఎండిన పొలాలు, మోడువారిన చెట్టులానే వెలసిపోయి కళావిహీనంగా కనిపించే ఊరి మనుషుల ఊహల్లో వర్షం ఒక అందమైన కలగానూ, ఊహగానూ మారిపోతుంది. కాంతిలేని ఆ గాజు కళ్లముందు నిరంతరం విరగపండిన పొలాలు, ఆకుపచ్చని పరిసరాలు తిష్టవేసుకుని కూర్చుంటాయి. వారి జీవితమే ఒక స్వప్నసంచారాన్ని తలపిస్తుంది. చివరికి పిల్లల అంతశ్చేతనలో కూడా వర్షాభావం ఇంకిపోతుంది. పతంజలిశాస్త్రిగారి 'కతలవ్వ' కథలో వానలు పడని ఓ వానాకాలంలో ఆ రోజు మధ్యాహ్నమే ఒక రైతు పురుగు మందు తాగా కరువు బాధను తప్పించుకున్నాడు. రాత్రివేళ ఉన్నట్టుండి రావిచెట్టు గలగల మంది. గాలి గిర్రున తిరిగింది. వెంకట్రావు అనే కుర్రాడికి చెట్టుకింద తెల్లజుట్టు ముసలవ్వ మఠం వేసుకుని కూర్చుని కనిపించింది. ఆమె పక్కనే ఓ బుట్ట, దాని పక్కనే గుమ్మడికాయ తంబుర ఉన్నాయి. ఆమె ఆ అబ్బాయిని పిలిచి, కతలు చెబుతాను పిల్లల నందరినీ పిలుకు రమ్మని చెప్పింది. పిల్చుకొచ్చాడు. ఆమె బుట్టలోంచి దొంతర్లు దొంతర్లుగా మబ్బుల్ని తీసి పిల్లల మీద కప్పింది. ఆ స్పర్శ వాళ్లకు చల్లగా సిల్కులా తాకి హాయి గొలిపింది. అవ్వ వాళ్లకు ఓ కథ చెప్పింది. అదో రాక్షసుడి కథ. ఆకాశం భళ్లున బద్దలై కుండపోతగా వాన పడింది. వెండి దారాల మాదిరిగా ఉంది ఆ వర్షం. ఒకటే వర్షం. అలా నెలరోజులు కురిసింది. కానీ, చిత్రం, నేల మీద చుక్క నీరు లేదు. రాక్షసుడు తాగేశాడు. అప్పుడు మబ్బులన్నీ కలసి ఓ వీరుణ్ణి సృష్టించి రాక్షషుణ్ణి చంపించాయి. అతని దేహంలోంచి ఒకటే నీటిధార. ఎక్కడ చూసినా నీళ్లే. కరువు తీరేలా. పొలాలన్నీ నీటితో తళతళలాడుతున్నాయి. అనావృష్టికి అలవాటు పడిన చేతన ఊహల్లో జలపుష్కలత్వాన్ని ఎలా సృష్టించుకుంటుందో ఈ కథ చెబుతుంది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న వాన ఓ ఏడాది వంచించవచ్చు, కానీ కరుణించిన రోజులూ అంతకంటె ఎక్కువే ఉండవచ్చు. మనిషి నిరంతర ఆశాజీవి కదా. కనుక నిండు మనసుతో ఈ ఏడు కూడా వర్షాన్ని ఆహ్వానిద్దాం.
సూర్య వర్షపాతం ఎన్నిరకాలు?
                 సముద్రాలనుంచి నీరు ఆవిరైపోయి, ఆ తేమ ఆకాశంలో ద్రవీభవించి, బుడగలలాగా ఏర్పడి మేఘాలను సృష్టిస్తుంది. మేఘాలనుంచి వర్షం కురుస్తుంది. ఈ వర్షం తిరిగి సముద్రానికి చేరుతుంది. ఇలా ఒక జల చక్రం తిరుగుతుంటుంది. వర్షాన్ని అవపాత పరిమాణం, అవపాతానికి కారణం అనే రెండు అంశాలతో వర్గీకరిస్తారు. అవపాత పరిమాణం ప్రకారం వర్షాన్ని మళ్లీ ఈ కింది విధాలుగా వర్గీకరిస్తారు.
1) అతి తేలికపాటి వర్షం - అవపాతం (నీరు కురవడం) గంటకు 1 మి.మీ కంటే తక్కువ ఉంటే అతి తేలికపాటి వర్షమంటారు.
2) తేలికపాటి వర్షం - అవపాతం గంటకు 1 మి.మీ. నుంచి 2 మి.మీ. మధ్య ఉంటే తేలికపాటి వర్షం
3) ఒక మోస్తరు వర్షం - అవపాతం గంటకు 2 మి.మీ.నుండి 5 మి.మీ. మధ్య ఉంటుంది.
4) భారీ వర్షం - అవపాతం గంటకు 5 మి.మీ.నుంచి 10 మి.మీ. మధ్య ఉంటుంది.
5) అతి భారీ వర్షం - అవపాతం గంటకు 10 మి.మీ.నుండి 20 మి.మీ మధ్య ఉంటుంది.
6) కుండపోత వర్షం - దీనిని అత్యంత భారీ వర్షంగా గుర్తిస్తారు. దీనిలో అవపాతం 20 మి.మీ కంటే ఎక్కువ ఉంటుంది.
       అంతా భూమికి చేరదు
ఆకాశంనుంచి కురిసే మొత్తం వర్షం భూమి మీదకు చేరదు. కొంతశాతం వర్షం పొడి గాలి ద్వారా కిందపడుతున్న సమయంలో గాలిలోనే ఆవిరైపోతుంది. ఇలా వర్షం భూమికి చేరకుండా గాలిలో ఆవిరైపోవడాన్ని విర్గా అంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ, వాతావరణంలో తేమ తక్కువగా లేదా వాతావరణం పొడిగా ఉండే ప్రాంతాల్లోనూ వర్షం పూర్తిగా భూమిపైకి చేరకుండా గాలిలోనే ఆవిరైపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎల్‌ నినో అంటే?
                భారత దేశ వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఎల్‌ నినో వాతావరణ సంబంధమైన పరిస్థితి. దీనిలో ఫసిఫిక్‌ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత వేడెక్కుతాయి. ఇది గాలి వీచే విధానాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వరదలు లేదా కరువు కాటకాలు సంభవిస్తాయి.
                  ఎల్‌ నినో అనేది స్పానిష్‌ పదం. ఈ పదానికి 'పసి బాలుడు' అని అర్థం. వాతావరణంలో ఈ పరిస్థితి ప్రతి మూడు నుంచి ఐదేళ్లకు ఒకసారి వస్తుంది. ఎల్‌ నినో ఏర్పడితే అది ఒక సంవత్సరకాలం పాటు కొనసాగుతుంది.
                   భారతదేశంలో 18 71నుంచి ఇప్పటి వరకూ సంభవించిన అతి పెద్ద కరువుకాటకాల్లో ఆరు ఎల్‌ నినో సంబంధమైనవిగా వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 2002, 2009నాటి కరువు పరిస్థితులకు ఎల్‌ నినో ప్రధాన కారణం.
                అయితే ఎల్‌ నినో ఏర్పడిన ప్రతిసారీ తప్పనిసరిగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 1997-98 సంవత్సరం అతి తీవ్రమైన ఎల్‌ నినో ఏర్పడినప్పటికీ భారతదేశంలో కరువు ఏర్పడలేదు. 2002లో ఒక మాదిరి ఎల్‌ నినో ఏర్పడగా, భారత్‌ తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొంది.
భారతదేశ వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో ప్రభావం చాలా అధికంగా ఉంటుంది.
ఈ సంవత్సరం (2014) కూడా ఎల్‌ నినో తన ప్రభావం చూపవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏప్రిల్‌ మాసాంతంనుంచి ఎల్‌ నినో ప్రభావం సూచీమాత్రంగా కనిపిస్తూ వస్తున్నది.
                ఎల్‌ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడినప్పటికీ, వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేసే భారత దేశం వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అలరించే ఇంద్ర ధనుస్సు
            వర్షాకాలంలో అందరినీ అలరించే సుందర దృశ్యం ఇంద్రధనుస్సు. ఎండ వేళ, సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పుడు ఆకాశంలో సప్తవర్ణాలతో అలరారుతూ కనిపించే ఇంద్రధనుస్సును చూసి ఆనందించని హృదయం ఉండదు. సూర్యుడి కిరణాలు వర్షపు నీటి బిందువుల్లో పడి వక్రీకరణం చెంది, పరావర్తనమవడం ద్వారా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు పూర్తి వర్తులాకారంలోనూ ఏర్పడుతుంది. కానీ, చూపరులకు సగమే కనిపిస్తుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడిన స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించి చెప్పడం కష్టం. ఇది వస్తు రూపంలో ఉండదు కనుక దీని దగ్గరకు చేరడం, చేతితో స్పృశించడమనేవి అసాధ్యాలే. ఇంద్రధనుస్సును కేవలం 42 డిగ్రీల కోణంలోనుంచే చూడగలుగుతాము.
 వర్షచ్ఛాయా ప్రాంతం
              సముద్రాలు, భూమి సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కడంలో ఉండే భేదాల వల్ల, ఎల్లవేళలా వీచే గాలి వల్ల సముద్రాల ఉపరితలంనుంచి భూమి మీదకు తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇలాంటి గాలి మార్గానికి అడ్డుగా ఎత్తయిన కొండలు లేదా పర్వతాల వంటివి ఉంటే తేమతో కూడిన గాలి పైకి ఎగుస్తుంది. గాలి పైకి వెళ్లే కొద్దీ వాయుపీడనం తగ్గి, అది వ్యాకోచిస్తుంది. ఫలితంగా దాని సాపేక్ష ఆర్ద్రత పెరిగి నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మేఘాలు ఉత్పన్నమవుతాయి. ఇలా పైకి వెళ్లిన గాలి ద్రవీభవన స్థాయిని (పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి ద్రవీభవనం సంభవించే ఎత్తును ద్రవీభవన స్థాయి అంటారు) చేరుకునే వరకూ సాపేక్ష ఆర్ద్రత మరింతగా పెరిగి గాలిని సంతృప్తం చేస్తుంది. తేలుతూ ఉన్న మేఘాలు బరువైనపుడు వర్షపాతం సంభవిస్తుంది. ఆ ప్రక్రియకు అడ్డంకిగా నిలిచిన భూస్వరూపం తాలూకు పవనాభిముఖ పార్శ్వంలో వర్షం కురుస్తుంది. ఈ భూస్వరూపానికి రెండవ వైపున ఆర్ద్రత కోల్పోయి పొడిగా ఉన్న గాలి కిందికి దిగుతూ సంకోచించి, మరింత వెచ్చగా మారుతుంది. కనుక రెండవ ఆవైపు వర్షం కురవదు. ఆ కారణంగా దానిని వర్షచ్ఛాయా ప్రాంతమని అంటారు.
క్యుములో నింబస్‌ మేఘాలు
                   ఎత్తుకు వెళ్లే కొద్దీ వాయుపీడనం తగ్గడం వల్ల గాలి వ్యాకోచిస్తుంది. దానివల్ల గాలి ఉష్ణోగ్రత తగ్గి సాపేక్ష ఆర్ద్రత (తేమ) పెరుగుతుంది. ఫలితంగా నీటి ఆవిరి బిందువులుగా ద్రవీభవించి పేరుకుపోతూ, క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతాయి. ఇవి బరువెక్కి వర్షాన్నిస్తాయి. దీనిని సంవహన వర్షపాతమని అంటారు. ఈ రకమైన వర్షపాతంలో కుంభవృష్టి కాని, వడగండ్ల వాన కానీ సంభవిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ సంవహన వర్షపాతం మధ్యాహ్న సమయంలో కాని, సాయంకాల సమయంలో కానీ సంభవిస్తుంది.

Courtesy with : PRAJA SEKTHI

No comments:

Post a Comment