‘గాంధీ’కి సౌర వెలుగులు
ప్రయోగాత్మకం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోలార్ విద్యుత్ వినియోగం అందుబాటులోకి తేవాలని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో తొలిసారి గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా ప్లాంటు నిర్మాణానికి అంగీకారం తెలిపింది. 500 కేవీ గ్రిడ్ కనెక్టడ్ రూప్‌టాప్ సోలార్ సిస్టం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.3.90 కోట్ల నిధులు కేటాయించింది.
గుజరాత్ లాతూర్‌కు చెందిన ఆదిత్య గ్రీన్ ఎనర్జీ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ఇక్కడి ప్లాంటు విజయవంతమైతే ఉస్మానియా, పేట్లబురుజు, నీలోఫర్ ఆస్పత్రుల్లో కూడా ఇదే తరహాలో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నెలకు సుమారు లక్ష యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖకు కోట్లలో బకాయి పడ్డారు. సరఫరాను నిలిపివేస్తామని విద్యుత్‌శాఖ హెచ్చరించడంతో ఇటీవలే కొంతమొత్తం బకాయిలు చెల్లించారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆస్పత్రికి విద్యుత్ సమస్య తీరిపోయినట్టే.
సోలార్ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను మల్టిపుల్ కనెక్టివిటీ ద్వారా సరఫరా చేస్తారు. ఎండలు అధికంగా ఉన్నప్పుడు సౌర విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వర్షాలు పడినా, ఆకాశం మబ్బుపట్టినా ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమయంలో విద్యుత్‌శాఖ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను వినియోగించుకుంటారు. సౌరవిద్యుత్ యూనిట్ ధరను రూ.5.50గా కేంద్రం నిర్ణయించింది. బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌పర్(బీఓటీ) పద్ధతిలో 25 ఏళ్లపాటు నిర్మాణ సంస్థ తీసుకుని తర్వాత ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందం కుదిరింది.
No comments:
Post a Comment