Tuesday, 11 March 2014

కేవలం కొన్ని వందల నక్షత్రాలే వుండే గెలక్సీలూ వుంటాయా?



         మన విశ్వంలో సుమారు 10 వేల కోట్ల నక్షత్ర మండలాలు (గెలక్సీలు), ఒక్కో నక్షత్ర మండలంలోనూ సగటున 10 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అయితే ప్రతి గెలక్సీలోనూ అన్నేసి కోట్ల నక్షత్రాలు ఉండాలన్న నియమమేదీ లేదు.
సాధారణంగా ఒక నక్షత్ర మండలంలో కొన్ని వేల కోట్లు లేదా కొన్ని వందల కోట్ల నక్షత్రాలయినా వుంటాయి. మన సౌర మండలం ఉన్న పాలపుంతలో 20 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నట్లుగా అంచనా వేశారు. అయితే ఇలాంటి బ్రహ్మాండమైన నక్షత్ర మండలాల చుట్టూ పరిభ్రమించే కొన్ని చిన్న చిన్న నక్షత్ర మండలాలను కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. వీటికి శాటిలైట్‌ గెలక్సీలు (ఉపగ్రహ నక్షత్ర మండలాలు) అని పేరు పెట్టారు. ఇప్పటి దాకా, మన పాలపుంత చుట్టూ తిరుగుతూ వుండే ఇలాంటి 24 చిట్టి నక్షత్ర మండలాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
ఒక్కో శాటిలైట్‌ గెలక్సీలోనూ కొన్ని వందల నుండి కొన్ని లక్షల నక్షత్రాల దాకా ఉంటాయి. శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే కనుగొన్న సెగూ-1 అనే నక్షత్ర మండలంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే నక్షత్రాలు ఉన్నాయి. మన పాలపుంత కన్నా 100 కోట్ల రెట్లు తక్కువ కాంతివంతంగా వుండే ఈ నక్షత్రమండలంలో ఉన్నవి కొన్ని నక్షత్రాలే అయినా వాటి ద్రవ్యరాశి మాత్రం మనకు కనిపించే దానికన్నా 100 నుంచి 1000 రెట్లు దాకా ఎక్కువగా ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇందుకు కృష్ణ పదార్థమే (డార్క్‌ మేటర్‌) ప్రధాన కారణమని కూడా వారంటున్నారు.
ఇప్పటిదాకా మనం కనుగొన్న నక్షత్ర మండలాల్లో ఈ సెగూ-1 యే అత్యంత కాంతి హీనంగా ఉండటానికి ఈ కృష్ణ పదార్థమే కారణమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏదేమైనా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగిన ట్లుగా పాలపుంత (మిల్క్‌ వే) లాంటి పెద్ద పెద్ద నక్షత్ర మండలాల చుట్టూ మరికొన్ని చిన్న చిన్న నక్షత్ర మండలాలు తిరగడం అనేది చాలా అద్భుతంగా ఉంది కదా!

No comments:

Post a Comment