Saturday, 26 May 2012

ప్రాణాయామం


యోగాలో ప్రాణాయామానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని శరీరమంతా వ్యాపింపజేయడం. శ్వాసకు ప్రాణానికి, శ్వాసకు మనస్సుకు చాలా దగ్గర సంబంధముంది. శ్వాసను స్వాధీనపరచుకుంటే మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ప్రాణాయామాన్ని పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం, అర్ధపద్మాసనాలలో ఏదో ఒక ఆసనంలో ఉండి చెయ్యాలి. వెన్నుముక, తల నిటారుగా ఉండాలి. ఖాళీ కడుపుతో చెయ్యాలి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట, ఛాతి బాగాలు ముందుకు రావాలి. వదలినప్పుడు లోపలికి వెళ్లాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చెయ్యాలి. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు విశాలమై ఆక్సిజను శరీరంలోకి ఎక్కువగా చేరుతుంది. ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ ఆక్సిజన్‌ సరఫరా జరిగి బాగా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రాణాయామం చేయడానికి పద్మాసనం, వజ్రాసనం అత్యంత అనుకూలమైనవి. ఈ ఆసనాలలో ఎంత సేపు కదలకుండా కూర్చున్నా శరీరంలో ఎలాంటి నొప్పులూ రావు.
పద్మాసనం : కింద కూర్చుని రెండు కాళ్లను చాపాలి. మొదట కుడికాలును ఎడమ తొడపైన, ఆపై రెండవ కాలును చేతులతో పట్టుకుని కుడితొడపైన ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చిన్‌ముద్రలో ఉంచుకోవాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు జాగ్రత్తగా వెయ్యాలి. లేదా వారు అర్ధ పద్మాసనంలో వేయొచ్చు.
వజ్రాసనం : రెండు కాళ్లను వెనకకు ముడిచి, రెండు మడిమలు పిక్కలకు అంటి ఉండేటట్లు ఉంచి, కాలి బొటన వేళ్లు ఒకదానికొకటి దగ్గరగా కలిపి ఉంచాలి. తల, వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులు చిన్‌ముద్రలో ఉంచాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువగా ఉన్న వారు కొన్ని రోజుల వరకు వజ్రాసనం వెయ్యకూడదు.
- డాక్టర్‌ రాచమల్ల రంగనాథ్‌రెడ్డి
మిత్ర యోగ సెంటర్‌, కడప.
సెల్‌ : 9440074773

Wednesday, 23 May 2012

అబ్బా! వడదెబ్బ!

వేసవిలో తరచుగా వడదెబ్బ కారణంగా చనిపోయారనే వార్తలు వార్తాపత్రికల్లో ఎక్కువగా చదువుతుంటాం. వడదెబ్బ ప్రతి ఒక్కరినీ నిస్సత్తువకు గురిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీనిబారిన పడినపుడు కోలుకోవడానికి సమయం పడుతుంది. దీనంతటికీ వేసవిలో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతే కారణం. వాతావరణంలో ఉష్ణోగ్రత మన శరీరంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఈ మధ్య నలుగురు పిల్లలు కారెక్కి సరదాగా ఆడుకుంటూ తలుపులు మూసుకున్నారు. తరువాత వాటినెలా తెరవాలో అర్థంకాక, ఆ సమయంలో వారినెవరూ చూడకపోవడంతో మరణించారు. దీనికి కారణం వాహనంలో ఉండే అతి వేడి. ఆటోమొబైల్స్‌ వెహికల్స్‌లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి మన శరీరంలో ఉండే కణాలు దెబ్బతింటాయి. మన శరీరానికి లవణాలు, నీరు ఆ సమయంలో అందదు. ఇవి ప్రాణాంతకం. దీన్నిబట్టే తెలుసుకోవచ్చు వేడి ఎంత ప్రమాదకరమో!
ప్రపంచంలో అధిక మరణాలకు కారణం గుండెజబ్బులు. ఎక్కువ ఉష్ణోగ్రతలవల్ల కలిగే మరణాలు రెండో కారణం. అంటే, అధిక ఉష్ణోగ్రతవల్ల కలిగే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అందువల్ల ఈకాలంలో ఎండబారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసుంటే ప్రమాదాలను చాలావరకు నివారించొచ్చు. నీరు తరచుగా తీసుకోవడం, ప్రయాణాలు చేస్తున్నపుడు ఇంటినుండి నీరు తీసుకెళ్లడం చాలా ఉపయోగపడుతుంది.
కాలానికి తగ్గట్లు నూలు దుస్తులు వేసుకోకపోవడం వడదెబ్బకు మరో కారణం. నైలాన్‌, పాలిస్టర్‌ దుస్తులు ఎండాకాలంలో గాలి సోకనివ్వవు. శరీరానికి చెమట పట్టనివ్వవు. ఆ కారణంగా ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
వేసవిలో వ్యక్తిగత శుభ్రత లోపించినపుడు చెమటకాయలు, దురదలు రావచ్చు. మామూలుగా ఎండ ఎక్కువగా ఉన్నపుడు 'ఇబ్బంది'గా , అసౌకర్యంగా అందరికీ అనిపిస్తుంది. అంతేకాకుండా చికాకు, చెమట, నోరు ఎండిపోవడం, తల తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది. సరైన సమయంలో నీళ్లు తాగనపుడు పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. ఒక్కోసారి తల తిరగడం, స్పృహ తప్పడం, కిందపడిపోవడం వంటివి ఆ వ్యక్తికి అపాయకరంగా మారతాయి. అలాంటి సమయంలో వైద్యుని వద్ద చికిత్స అవసరం.
పెద్దవాళ్లకంటే పిల్లలకు చెమటలు తక్కువ. ఇదికాక వాతావరణంలోని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆటల మూలంగా పిల్లల శరీరంలో వేడి ఎక్కువగా పుడుతుంది. అలాగే పొలంపనులు చేసేవారికి, వంటగదిలో ఎక్కువసేపు ఉండే మహిళలకు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుంది.
డా. శ్యామలాంబ, శిశు వైద్య నిపుణులు (వచ్చేవారం తరువాయి భాగం...)

మన జీర్ణాశయం కూడా మాంసమే కదా! మరి అది జీర్ణమైపోదా?


ఇతర మాంసాహార జంతువుల్లాగే మనలో మాంసాహారులు మాంసాన్ని తింటారు. అది మన జీర్ణాశయంలో జీర్ణమవుతుంది. మరి మన జీర్ణాశయం కూడా మాంస పదార్థమే కదా! అదెందుకు జీర్ణం కాదు? - టి.అజరుకుమార్‌, 10వ తరగతి, మెదక్‌
మన జీర్ణవ్యవస్థ (Digestive System) అనే రహదారిలో నోరు, ఆహారవాహిక (oesophagus), జీర్ణా శయం (stomach) , ఉత్తరాంత్రం (duodenum), చిన్న ప్రేవులు (small intestine), పెద్దప్రేవులు (large intestine),మలద్వారం (anus) ప్రధానమైన మైలురాళ్లు. మనం బతకాలంటే శక్తికావాలి. యంత్రాలను విద్యుచ్ఛక్తి, ఇంధనాలు నడిపించినట్లే మనల్ని, ఇతర జీవజాతులన్నింటిని జీవంతో ఉండేలా నడిపించేది మనం తిన్న ఆహారం ద్వారా ఉత్పన్నమయిన జీవరసాయనాలలోని రసాయనికశక్తే (chemical energy). కేవలం సుమారు నాలుగు కేజీల బరువుతో శిశువుగా జన్మించిన మనల్ని వయస్సు పెరిగే కొద్దీ మన దేహాన్ని కండరాలతోను, ఎముకలతోను, ఇతర వివిధరకాల దేహ నిర్మాణాలతోను మన బరువును 50 కి.గ్రా. పైగా పెంచేది కేవలం మనం తిన్న ఆహార పదార్థాలలోని పాదార్థికాలే. మన శరీరంలో వివిధ పనులు నెరవేర్చడానికి హార్మోనులు, ఎంజైములు కావాలి. ఇంటి కట్టడంలో స్తంభాలు (pillers), శ్లాబులు ఎలాగో మన శరీరంలో అస్తిపంజరం (skeletal system) అలాంటిది. అయితే ఇంటిని చూడగానే మనకు శ్లాబులు, స్తంభాలు కనిపించవు. వాటిని ఆచ్ఛాదన చేస్తూ గోడలు, కిటికీలు, అందాలు సొబగిన ఎలివేషన్లు, ఆకర్షణీయమైన పైకప్పులు, నేలలు (flooring) తదితర నిర్మాణాలే. ఇవే మన శరీరంలో ప్రధాన కండర నిర్మాణాలు. కండరాలు, ఎంజైములు, చాలా హార్మోనులు ప్రోటీను నిర్మితాలు. ఈ ప్రోటీన్లు మనకు మనం తిన్న ఆహారంలో మాంసకృత్తుల ద్వారా లభ్యమవుతాయి. వ్యక్తులు మాంసాహారులైనా, శాకాహారులైన (vegetarians) తమ ఆహారంలో మాంసకృత్తులు (proteins) ఉండాల్సిందే! మాంసాహారులకు అది మాంసం, చేపలు, గ్రుడ్లు, పప్పుదినుసుల ద్వారా లభ్యంకాగా శాకాహారులకు పప్పుదినుసులు, గ్రుడ్లు (నేటి ఫారం గుడ్లలో జీవం ఉండదు కాబట్టి అవి కూడా శాకాహారమేనన్న దృక్పథంలో సేవించేవారి విషయంలో) సమకూర్తాయి. మనం నోటి ద్వారా ముద్దలుగా లేక చిన్న చిన్న శకలాలు (pices) గా ఆహారం భుజించే క్రమంలో ఆహారపు ముద్దల్లోని పిండిపదార్థాలు మన లాలాజలం (saliva) లో ఉండే టయలిన్‌ అనే ఎంజైము సమక్షంలో పాక్షికంగా జీర్ణమవుతాయి. అదే సమయంలో లాలాజలంలోని మ్యూకస్‌ వంటి జిగురు పదార్థం వల్ల ఆహారపు ముద్దలు సులభంగా ఆహారవాహిక ద్వారా మన జీర్ణాశయాన్ని చేరుతుంది. జీర్ణాశయం మన వంటింట్లో మిక్సీ లేదా రోలు-రోకలిలాంటిదన్న మాట. పదార్థాల్ని కలగాపులగంగా పిండి చేసి జీర్ణవ్యవస్థలో తర్వాతి భాగమైన ఉత్తరాంత్రానికి పంపడమే కాకుండా మాంసకృత్తుల్ని జీర్ణం చేస్తుంది. మాంసకృత్తులంటే అమైనో ఆమ్లాలనబడే పూసల దండ. అమైనో ఆమ్లమంటే ఓ చివర అమీన్‌ (-NH2) అనబడే క్షారధర్మ (basic character) భాగం, మరో చివర ఆమ్లధర్మ (acidic character) మున్న కార్బాక్సి(-COOH) అణువన్నమాట. ఉదా: గ్లైసీన్‌ అనే అమైనో ఆమ్లాన్నే తీసుకొందాం. దాని నిర్మాణం H2N-CH2-COOHగా ఉంటుంది. ఇలాంటి పూసలు రెండు కలిస్తే NH2 లోని H భాగం, -COOH లోని -OH భాగం కలిసి నీటి అణువుగా బయటికి వెళ్లి H2N-CH2-CO-NH-CH2-COOH లాంటి ద్విఅమైనో ఆమ్లపు ముక్కగా ఏర్పడింది. అంటే రెండు ఇనుపముక్కల్ని వెల్డింగ్‌ చేసినట్లుగా వేలాదిగా CO-NH అనే అమైడు బంధాలతో అమైనో ఆమ్లాలే విడివిడి పూసల్లాగా ప్రోటీను అనబడే దండ ఏర్పడుతుంది. జీర్ణప్రక్రియలో తిరిగి H2O అనే నీటి అణువును -OH,-H లాగా చీల్చి-CO-NH- లో CO- uó²>±“¿ì -OHను, -NH- భాగానికి H అతికించాలి. ఈ ప్రక్రియనే ప్రోటీన్ల జీర్ణక్రియ అంటాము. లేదా రసాయనికంగా ప్రోటీన్ల జల విశ్లేషణం (Protein Hydrolysis) అంటారు. కానీ సాధారణ రసాయనిక ప్రయోగశాలల్లో ఈ అమైడు బంధాల జల విశ్లేషణ జరగాలంటే మితిమీరిన ఉష్ణోగ్రత కావాలి. అమ్ల పరిస్థితులు కావాలి. మన శరీరంలో అలాంటి ఉష్ణోగ్రత ఉండదు. కాబట్టి ఎంజైములనబడే ఉత్ప్రేరకాల (catalysts) సమక్షంలో దేహ ఉష్ణోగ్రత వద్దే ఈ చర్య జరుగుతుంది. ఈ పని మన పొట్టలో జరుగుతుంది. పొట్ట గోడల్లో ఉదజహరికామ్లాన్ని (Hydrochloric acid-HCl) స్రవించే గ్రంథులెన్నో ఉంటాయి. అదే గోడల్లో మరోచోట పెప్సిన్‌ అనే ఎంజైము కూడా ఊరుతుంది. మన జీర్ణవ్యవస్థలోను, ఇతర జంతువుల జీర్ణవ్యవస్థలోను పొట్ట (దీన్నే తెలుగు అకాడమీ వారు జఠరకోశం అంటారు) నిర్మాణం చాలా పకడ్బందీగా ఉండడంవల్ల పొట్ట గోడల్లోని గ్రంథుల్లో ఉద్భవించిన HCL ఆమ్లము, పెప్సిన్‌ ఎంజైముల మిశ్రమం (జఠరరసం లేదా gastric juice) పొట్టలోని సంచి (sac) భాగంలోకి వస్తుంది తప్ప పొట్టగోడల వైపునకు కలిసి మిశ్ర మంగా వెళ్లదు. పైగా పొట్టగోడలి లోపలివైపున రసాయని కంగా జడత్వం కలిగిన పలుచటి పింగాణీ (ceramic పొరలాగా కవచ నిర్మాణం ఉంటుంది. అందువల్ల జీర్ణప్రక్రియలో పొట్ట జీర్ణం కాదు. జీర్ణప్రక్రియలో ప్రోటీన్ల దండ నుంచి పూసలు, పూసలుగా విడిపడ్డ అమైనో ఆమ్లాలు, ఉత్తరాంత్రం దాటుకొని, చిన్నప్రేవుల గోడల్లో ఉన్న విల్లై (villi) అనే చూషకాల (suckers) ద్వారా జల్లెడ పట్టినట్లుగా రక్తంలో కలుస్తాయి. జీర్ణంకాని చెత్తాచెదారం పెద్దపేవుల దగ్గర గట్టిపడి మలం (faeces) రూపంలో విసర్జించబడుతుంది. రక్తంలో చేరిన అమైనో ఆమ్లాల పూసల్ని మన శరీరధర్మశాస్త్రం (Physiology) వివిధ నిర్మాణాలకు ఉపకరించుకొంటుంది. పొట్ట గోడలకున్న పింగాణీ నిర్మాణం వల్ల పొట్టలో ఉన్న జఠర రసం పొట్టను జీర్ణం చేయలేదు. అడపా దడపా ఈ పింగాణీ పొరలో నెర్రెలు (gaps) ఏర్పడితే అపుడు ఆమ్లపు ప్రభావానికి మన పొట్టలో పుండ్లు (ulcers) వస్తాయి. వైద్యులను సంప్రదించి, చికిత్స చేసుకోవాలి.

ముద్రణ చెరిపేసే టెక్నిక్‌..!


ముద్రించిన కాగితాలపై నుండి ఇంకుని చెరిపివేసే ప్రక్రియను కనుగొన్నామని పరిశోధకులు అంటున్నారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలోని పరిశోధక బృందం కాగితంపై ముద్రించిన అక్షరాలను, బొమ్మలను లేజర్‌ కాంతితో తుడిపేసే పద్ధతిని కనుగొందట! లేజర్‌ కిరణాలు కాగితానికి నష్టం వాటిల్లకుండా టోనర్‌ ఇంకును ఆవిరి చేస్తుంది. అందువల్ల ఒక కాగితాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకునే వీలు కలుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి ఎనలేని లాభం కలుగుతుందని అంటున్నారు. ఇంతటి ఉపయుక్తమైన ఉపకరణం ప్రస్తుతం సుమారు 19,000 పౌండ్లు ఖర్చవుతుందట! కానీ, రాను రాను దీని ఖరీదు తగ్గిపోవచ్చట! మామూలు కంప్యూటర్‌ ప్రింటర్‌లలో, ఫొటో కాపీయర్‌లలో 'అన్ప్రింట్‌' అనే సౌకర్యం కూడా ఏర్పాటు చేసే వీలుంది. భలే బాగుంది కదా!
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

జ్ఞాపకశక్తిని తగ్గించే చక్కెర..!


అధికంగా స్వీట్లూ, కూల్‌డ్రింకులు తాగేవారికి హెచ్చరిక. అధిక ఫ్రక్టోజ్‌ ఉన్న ఆహారం తింటే కేవలం ఆరువారాలలో మెదడు పనితనం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తి గణనీయంగా తగ్గిపోతాయట. గతంలో అధిక ఫ్రక్టోజ్‌ వల్ల డయాబెటిస్‌, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిసిందే. కానీ, ఈ ప్రత్యేక చక్కెర పదార్థం మెదడు పనితనాన్నీ దెబ్బతీస్తుందని ఇప్పుడే తెలిసింది. సాఫ్ట్‌డ్రింకులు, స్వీట్లు, పసిపాపల ఆహారపదార్థాలలో కార్న్‌ సిరప్‌ అనే దాన్ని వాడతారు. అది మామూలు చెరుకు చక్కెర కన్నా ఆరు రెట్లు తీయదనం గలది. ఇవేకాక సహజంగా పండ్లలో కూడా ఫ్రక్టోజ్‌ ఉంటుంది. కానీ, అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ అతి తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం ఎన్నో విధాల శ్రేయస్కరం అని అంటున్నారు. మరిక తీపి అలవాట్లు కాస్తంత నియంత్రించుకోవల్సిందేనండోరు..!

అందరికీ ఆరోగ్యం ఎలా?


అందరికీ కావలసింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్ధతతో, ఉల్లాసంగా పనిచేయగలుగుతాం. అభివృద్ధికి దోహదపడతాం. ఆరోగ్యం మందులతో వచ్చేది కాదు. అనారోగ్యంగా మారిన తర్వాత మాత్రమే వైద్య చికిత్స అవసరమవుతుంది. అప్పుడే వైద్యులు కావాలి. అందువల్ల ఏ సమాజమైనా తన పౌరులను ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప అనారోగ్యులయ్యాక మందులతో చికత్స చేయడానికి ప్రాధాన్యత ఇవ్వదు. అందువల్ల ఆరోగ్యాభివృద్ధికి 'సామాజిక ఆరోగ్య చిహ్నాలు (సోషల్‌ పారామీటర్స్‌)' ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ 'అందరికీ ఆరోగ్యం' సమస్యగానే కొనసాగుతుంది. పేదరికం, భౌతిక పర్యావరణ పరిస్థితులు అనారోగ్యానికి ప్రధానకారణం. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు జీవన ప్రమాణాలను పెంచినప్పటికీ 'అందరికీ ఆరోగ్యం' ఎండమావిగానే మిగిలిపోయింది. సంస్కరణల తర్వాత ఆరోగ్యంగా ఉంచడమంటే 'అందరికీ వైద్య సేవలను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అందించే కార్యక్రమం'గా మార్చబడింది. దీనికి ఇతర ప్రభుత్వ విధానాలు తోడై 'అందరికీ ఆరోగ్యం' అసంభవంగా మార్చి వేసింది. వైద్యం రోజురోజుకూ ప్రజలకు దూరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని 'డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి' నేతృత్వంలో ఏర్పరిచింది. ఈ కమిటీ 'అందరికీ వైద్యమే కాకుండా, అందరికీ ఆరోగ్యం అవసరమని వక్కాణించింది. దీన్ని ఎలా సుసాధ్యం చేయవచ్చో తెలుపుతూ పలు సూచనలు చేసింది. వీటిని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
అందరికీ ఆరోగ్యం 2000 సంవత్సరం నాటికి సాధించాలని 1978లోనే 'ఆల్మా అటా' సూచించింది. దీనిలో మన దేశం కూడా భాగస్వామి. తదనుగుణంగా 1983లోనే 'జాతీయ ఆరోగ్య విధానం' రూపొందింది. 2002 నాటికి ప్రజారోగ్య విషయంలో కొంత పురోగతి సాధించినా, చేయవలసింది చాలా మిగిలే ఉంది.
'అందరికీ ఆరోగ్యం' 2000 సంవత్సరంలో కూడా కలగానే మిగిలిపోయింది. ఆ తరువాత దశాబ్ధకాలానికి, అంటే 2010 నాటికి, 'అందరికీ ఆరోగ్యం' నుంచి ఒకడుగు వెనక్కి వేసి 'అందరికీ వైద్యసేవలు' అందించే సాధనంగా ప్రజారోగ్యం మార్చబడింది. 'వైద్యం' భరించలేనిదిగా, పేదరికం పెంచేదిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 'అందరికీ వైద్యం' అందించే విధి విధానాలను సూచించవలసిందిగా ప్రణాళికా సంఘం 'ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని (హై లెవల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూపు)' నియమించింది. దీనికి ప్రముఖ హృద్రోగ నిపుణులు, 'పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా' వ్యవస్థాపక అధ్యక్షులు డా|| శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ బృందం ప్రజారోగ్యంలో వివిధ దేశాల అనుభవాలను, మన దేశంలో వివిధ రాష్ట్రాల అనుభవాలను, నిపుణుల అభిప్రాయాలను పరిశీలించింది. 2011 నవంబరులో తన సూచనలను ప్రణాళికా సంఘానికి అందించింది. ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ప్రైవేటీకరణ వైపు శరవేగంగా పయనిస్తున్న మన ఆరోగ్యవ్యవస్థను ఈ నివేదిక ఒక్క కుదుపు కుదిపింది. జబ్బున పడిన మన దేశ ఆరోగ్యవ్యవస్థను, ప్రపంచబ్యాంకు శిక్షణ పొందిన నిపుణులు సూచించిన 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు', 'రాజీవ్‌ ఆరోగ్యశ్రీ' వంటి ఇన్సూరెన్సు పథకాలలోని లొసుగులను, బలహీనతలను ఈ నివేదిక ఎత్తి చూపింది. ప్రజల ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, వారిపై ఆర్థికభారం మోపకుండా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వమే అందరికీ ఆరోగ్యాన్ని, వైద్య సేవల్ని అందించాలని ఈ కమిటీ సూచించింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్య సూచనలు.
1. నిధుల కేటాయింపు..
ఆరోగ్యరంగంలో నిధుల కేటాయింపు 3 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని జరగాలి.ఇవి:
* అందరికీ అవసరమైన ఆరోగ్యసేవలు అందించడానికి తగినన్ని నిధుల కేటాయింపు.
* వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవకుండా, పేదరికంలోకి దిగజారకుండా ప్రజలకు ఆర్థిక రక్షణ ఏర్పాటు.
* ప్రజలందరికీ వైద్యసేవల లభ్యతకు హామీ ఇస్తూనే, దీర్ఘకాలం ఆరోగ్యఖర్చులు విపరీతంగా పెరిగిపోకుండా అదుపులో ఉండేలా తగిన ఆర్థిక విధానాలను రూపొందించాలి.
పై లక్ష్యాల సాధన కోసం ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 2017 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో 2.5 శాతానికి, 2022 నాటికి 3.0 శాతానికి పెంచాలి. ప్రస్తుతం ఇది 1.2 శాతంగానే ఉంది. దీనివల్ల వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమ జేబులో నుంచి ఖర్చు చేయవలసిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది.
రాజీవ్‌ ఆరోగ్యశ్రీలాంటి స్కీములు దీర్ఘకాలంలో సత్ఫలితాలను సాధించలేవు. అవి వైద్య ఖర్చులను విపరీతంగా పెంచి, ప్రభుత్వ ఖజానాపై అనవసర భారాలను మోపుతాయి. వైద్యవ్యవస్థల నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచే కేటాయించాలి. బ్రిటన్‌లో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుంది.
''ప్రజలకు అవసరమైన వైద్యసేవల పట్టిక''ను రూపొందించి, అందులో ఉన్న సేవలన్నింటినీ పేద, ధనిక వివక్ష లేకుండా అందరికీ పూర్తిగా, ఉచితంగా అందించాలి. ఆరోగ్యాన్ని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించి 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు'ను పౌరులందరికీ అందించాలి. దానిద్వారా ఎవరైనా తమకు కావలసిన ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం కల్పించాలి. ప్రజల వద్ద నుంచి యూజర్‌ఛార్జీలను వసూలు చేయరాదు. ఇవి వసూలు చేసిన చోట వైద్యసేవలు మెరగవలేదని దీర్ఘకాలిక అనుభవాలు తెలుపుతున్నాయి. కేంద్రం నిధులను విడుదల చేసిన సందర్భంలో ఆ నిధులను తమ స్థానిక అవసరాలకు అనువుగా ఖర్చు చేసుకొనే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలి. వైద్యంపై ప్రభుత్వం చేసే వ్యయంలో 'ప్రాథమిక ఆరోగ్య రక్షణ'కు 70% కేటాయించాలి. వ్యాధి నివారణ, సత్వర వ్యాధి నిర్ధారణ - చికిత్సల ద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యాధులను అరికడితే, ఖరీదైన వైద్య సేవల అవసరం క్రమేపీ తగ్గుతుంది. వివిధ పథకాల ద్వారా వివిధ మంత్రిత్వశాఖల ఆధీనంలో ఉన్న అన్నిరకాల వైద్య సేవలను 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు' ద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధీనంలోనికి బదలాయించాలి. దీనిద్వారా నిధుల కేటాయింపు, వ్యయాలను హేతుబద్ధంగా నియంత్రించవచ్చు.
2. ఔషధాలు.. టీకాలు..
'అవసరమైన మందుల జాబితా'ను హేతుబద్ధం చేసి, ఆ జాబితాలో ఉన్న మందులను ప్రజలందరికీ ఉచితంగా అందేలా చూడాలి. ఇపుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కలిపి జి.డి.పి.లో 0.1% నిధులను వెచ్చిస్తున్నది. దీనిని 0.5 శాతానికి పెంచినట్లైతే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలందరికీ అవరమైన మందులను ఉచితంగా ఇవ్వవచ్చు. మందుల రేట్లను ప్రైవేటు కంపెనీల ఇష్టానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. ఔషధాల నాణ్యతను పర్యవేక్షించే యంత్రాంగాన్ని పటిష్టం చేసి, నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించే కంపెనీలపై కఠినచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వరంగ మందుల మరియు టీకాల తయారీసంస్థలను పునరుద్ధరించి, బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రమే మన దేశ అవసరాలకు అనుగుణంగా ఎల్లవేళలా మందులు, టీకాలను గ్యారంటీ చేయవచ్చు. అంతర్జాతీయ పేటెంట్‌ చట్టాలు మన ప్రజలకు ఔషధాలు, టీకాలు అందించడానికి అడ్డురాకుండా ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాలి.
3. వైద్యులు, ఇతర సిబ్బంది..
మన దేశం అవసరాలకు తగినంత వైద్య సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు మొదలైనవారు.) లేరు. ఉన్న సిబ్బంది కూడా అసమానంగా పంపిణీ చేయబడి ఉన్నారు. మరికొన్ని రాష్ట్రాలు అవసరానికి మించి వైద్యులను ఉత్పత్తి చేస్తుంటే, కొన్ని రాష్ట్రాలలో వీరి కొరత తీవ్రంగా ఉంది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది ప్రజలకు 23 మంది వైద్య సిబ్బంది (కేవలం డాక్టర్లే కాదు) కావాలి.
* ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు ఎంబిబిఎస్‌ వైద్యులు, ఒక ఆయుష్‌ వైద్యుడు, ఒక దంత వైద్యుడు ఉండాలి. అక్కడ వైద్యులు పనిచేయడానికి అనువైన పరిస్థితులు కల్పించాలి. పరిపాలనా విధుల నుండి వైద్యులను తప్పించి, అందుకు అవసరమైన సిబ్బందిని వేరే నియమించాలి.
* గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ వాడల్లో వైద్యసేవలు అందించడానికి పూర్తిగా వైద్యులపై ఆధారపడడం అశాస్త్రీయం. అందుకు అవసరమైన ఇతర సిబ్బందిని శిక్షణ ఇచ్చి, నియమించి వారిని వైద్యుల పర్యవేక్షణలో పనిచేయించాలి.
* ఆరోగ్య ఉప కేంద్రాలలో (ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకంటే దిగువస్థాయిలో ఉంటాయి. ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ఉపకేంద్రం ఉండాలి.) వైద్యసేవలు అందించడానికి 'బ్యాచిలర్‌ ఆఫ్‌ రూరల్‌ హెల్త్‌ కేర్‌' అనే మూడేళ్ల కోర్సును ప్రవేశపెట్టి, నియమించాలి.
* గ్రామాలలో ఇపుడు ప్రతి వెయ్యి జనాభాకు ఒక స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త (ఆశా) ఉండాలి. కానీ, ప్రతి వెయ్యిమందికీ ఇద్దరు ఆశాలను నియమించి, వారికి ఫస్ట్‌ ఎయిడ్‌, ఆరోగ్య విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం వంటి అంశాలలో శిక్షణ ఇచ్చి, అంగన్‌వాడీలతో సమన్వయం చేసి విధులను కేటాయించాలి. వీరికి తగిన వేతనం నిర్ణయించి, సక్రమంగా చెల్లించాలి.
* పట్టణాలలో ప్రతి వెయ్యిమందికి ఒక పట్టణ ఆరోగ్యకార్యకర్తను నియమించాలి.
* నర్సింగ్‌ సిబ్బంది సంఖ్యను మన దేశ వైద్య అవసరాలకు అనువుగా పెంచాలి. సాధారణ నర్సింగ్‌ సేవలకు సరిపడా నర్సులను నియమించడం ద్వారా వైద్యులను క్లిష్లమైన వైద్య ప్రక్రియలపై కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. దేశంలో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది నర్సులు ఉన్నారని అంచనా. వీరి సంఖ్యను 2017 నాటికి 17 లక్షలకు, 2022 నాటికి 27 లక్షలకు పెంచాలి.
* దేశ ఆరోగ్య అవసరాలకు అనువుగా వైద్య విద్యా బోధనను సంస్కరించాలి. కొత్త వైద్య కళాశాలలు అవసరమైన ప్రాంతాలలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను టీచింగ్‌ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. వైద్య విద్యలో వ్యాపారధోరణిని నియంత్రించాలి.
* వైద్య సిబ్బంది తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకొనేలా నిరంతర వైద్యవిద్యను అందించాలి. సిబ్బంది పదోన్నతులలో దీనినీ పరిగణించాలి.
4. ఆరోగ్య సేవల విధి విధానాలు..
* గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వివిధ స్థాయిలలో ప్రజలకు ఉచితంగా అందించే అవసర వైద్యసేవల జాబితా రూపొందించి 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు' ద్వారా ఆ సేవలు అందుకొనే హక్కును ప్రజలందరికీ కల్పించాలి.
* ఈ జాబితాలో లేని ఐచ్ఛిక సేవలను (ఉదా: కాస్మెటిక్‌ సర్జరీ, ఊబకాయం తగ్గించుకొనే బేరియాట్రిక్‌ సర్జరీ మొదలైనవి) ప్రజలు డబ్బు చెల్లించి పొందవలసి ఉంటుంది.
* ప్రజలందరికీ చికిత్స అందించడం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో సాధ్యం కాదు, కనుక అవసరమైన సందర్భాలలో, ప్రభుత్వ సేవలకు అనుబంధంగా ప్రైవేటురంగం నుంచి సేవలను 'కాంట్రాక్ట్‌ ఇన్‌ పద్ధతి' ద్వారా వినియోగించుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగం పాత్ర ప్రభుత్వరంగ వైద్య సేవలకు అనుబంధంగా ఉండాలే తప్ప సమాంతర వ్యవస్థగా ఉండరాదు. ఈ సందర్భాలలో చేసుకొనే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పి.పి.పి.) ఒప్పందాలన్నీ పారదర్శకంగా, సమాచార హక్కు చట్టానికి లోబడి ఉండాలి.
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ కోసం వైద్య సేవలు అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తగిన ప్రమాణాలు పాటించేలా అక్రిడిటేషన్‌ బోర్డు పర్యవేక్షించాలి.
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ సేవలు ప్రధానంగా వైద్యంపై కేంద్రీకరించాలి.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేద ప్రజలందరికి కావలసిన చికిత్సలు లభించేలా పటిష్టమైన పాలనా చర్యలు చేపట్టాలి.
5. ప్రజారోగ్యంలో ప్రజల భాగస్వామ్యం..
* ఆరోగ్య సేవల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో అన్నిస్థాయిలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్య అసమానతలను తగ్గిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేస్తుంది.
* ప్రజారోగ్య మండళ్లను ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయి నుండి వీటిని మండలాలు, పట్టణాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఏర్పాటు చేయాలి. వీటిలో ఎన్‌జివోలు, ప్రజాసంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, వైద్య సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించాలి.
* ఈ మండళ్లు తమ పరిధిలోని ఆరోగ్య కార్యక్రమాల రూపకల్పనను, సేవల లభ్యతను, ప్రమాణాల పర్యవేక్షణను, నిధుల వినియోగాన్ని, ఆరోగ్య సూచీలలో మెరుగుదల వంటి అంశాలను పర్యవేక్షించాలి.
* ఈ మండళ్లు సమర్థవంతంగా పనిచేయడానికి కావలసిన నిధులను ప్రభుత్వమే కేటాయించాలి.
* ఈ మండళ్లు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వార్షిక ఆరోగ్య అసెంబ్లీలను నిర్వహించి అన్ని ఆరోగ్య సంబంధ అంశాలను చర్చించి, ప్రభుత్వానికి తగిన సూచనలు అందించాలి.
* స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ మండళ్లలో భాగస్వాములుగా ఉండాలి. స్థానిక సంస్థలకు ఇవి జవాబుదారీగా ఉండాలి.
* ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తగిన యంత్రాంగాన్ని నియమించాలి.
6. యాజమాన్య, వ్యవస్థాగత సంస్కరణలు..
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ సేవలు సమర్థవంతంగా అందించేలా ప్రభుత్వ అసుపత్రులను సంసిద్ధం చేయడానికి అవసరమైన యాజమాన్య, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి.
* జాతీయ మరియు రాష్ట్రాల స్థాయిలో 'పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కాడర్‌'ను ప్రవేశపెట్టాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన బహుళరంగ నైపుణ్యంతో ఆరోగ్య రక్షణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించేందుకు ఈ తరహా సిబ్బంది అవసరం.
* తగిన శిక్షణ పొందిన హాస్పిటల్‌ మేనేజర్స్‌ను ఆసుపత్రులలో నియమించి, పరిపాలనా బాధ్యతలను వారికి అప్పజెప్పాలి.
*ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి సహేతుకమైన వేతనాలను, ఇతర అలవెన్సులను అందిస్తూ, వారికి తగిన పారితోషకాలు, పదోన్నతులు కల్పించాలి. బాగా పనిచేసేవారిని గుర్తించి, ప్రోత్సహించాలి. విధులను నిర్లక్ష్యం చేసే వారిపై పాలనాపరమైన చర్యలు తీసుకోవాలి.
'ప్రజారోగ్యం'.. నిర్వచనం..,
''ఆర్థిక, సామాజిక, లింగ, కుల, మత వివక్ష / విచక్షణ లేకుండా దేశంలోని పౌరులందరికీ నాణ్యమైన, వారి అవసరాలకు తగిన విధంగా, వారికి జవాబుదారీగా ఉండే సమగ్రమైన ఆరోగ్య సేవలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. విస్తృతస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 'ప్రజారోగ్య సంబంధమైన సేవలకు హామీ ఇస్తుంది. ఈ సేవలన్నింటినీ ప్రభుత్వమే స్వయంగా అందించకపోయినా, అవి అందరికీ అందేలా హామీ ఇచ్చి అమలుచేస్తుంది.'' అని ప్రజారోగ్యం, వైద్యం ఎలా వుండాలో దిశా నిర్దేశంగా కమిటీ నిర్వచించింది.
సార్వత్రిక ఆరోగ్య రక్షణ అంటే..
* ఆరోగ్య సేవలలో సమన్యాయం.
* వైద్య ఖర్చుల నుంచి ప్రజలందరికీ రక్షణ.
* ఆరోగ్యవంతమైన ప్రజలు.
* 40 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు.
* పారదర్శకమైన, సమర్థవంతంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ వైద్యవ్యవస్థ.
* ప్రజల ఉత్పాదక సామర్థ్యంలో పెరుగుదల.
* పేదరికం తగ్గుదల.

ఆస్ప్రిన్‌ మాత్ర సురక్షితం


 
 
ఆస్ప్రిన్‌, వార్‌ఫరిన్‌ మాత్రలు గుండెపోటును నివారించడంలో సమర్థవంతగా పనిచేస్తాయని కొత్త అధ్యయనం తెలిపింది. ఆస్ప్రిన్‌ సురక్షితమైంది ఎందుకంటే కొద్ది మంది రోగులు మాత్రమే రక్తస్రావంతో బాధపడతారు. వీరిలో అధిక రక్తం పలుచన అయ్యే దుష్ఫ్రభావం ఉంటుంది. ఈ అధ్యయనాన్ని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ సమన్వయం చేసింది. చాలా మంది హార్ట్‌ ఫెయిల్యూర్‌ (గుండె సోలిపోవడం) రోగుల్లో క్రమరహితంగా గుండె కొట్టుకోవడం లేదా ధమనులు సన్నబడటం వంటి సమస్యలు లేనివారిలో ఆస్ప్రిన్‌ మాత్ర తీసుకోవడం ఉత్తమ ఎంపిక అని పేర్కొన్నది. వార్‌ఫరిన్‌ తీసుకోవడం కష్టం ఎందుకంటే, ఇది ఇతర మందులతో, కొన్ని ఆహారపదార్థాలతో పరస్పర చర్య జరుపుతుంది. దీన్ని వాడే వాళ్లు రక్తం సన్నబడుతుందా? చిక్కగా ఉందా? అని క్రమం తప్పకుండా రోగులు పరీక్షించుకుంటూ ఉండాలి. 60 ఏళ్ల వయసున్న 2305 మందిపై అధ్యయనం చేశారు. యాదృశ్ఛికంగా వార్‌ఫరిన్‌ లేదా 325 ఎంజి ఆస్ప్రిన్‌ను రోజూ తీసుకోవాలని సూచించారు. ఆరేళ్ల తర్వాత వీరిని అనుసరించారు. స్ట్రోక్‌, మెదడులో రక్తస్రావం, మరణించే రేటులో ఎలాంటి తేడా లేదని పరిశోధకులు కనుగొన్నారు.
అనారోగ్య సమస్యలా ...?
అయితే మాకు రాసి పంపండి. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో సమాధానాలిప్పిస్తాం. ప్రశ్నలు పంపే వారు వయస్సు, బరువు, జబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలి.
చిరునామా :
సంపాదకులు, రక్ష, ప్రజాశక్తి దినపత్రిక, ప్లాట్‌ నెం. 21/1,
ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర,
ఆజామాబాద్‌ ఇండిస్టియల్‌ ఏరియా, ముషీరాబాద్‌, హైదరాబాద్‌-20
గ మ ని క
    వైద్యులిచ్చే సలహాలు, సమాచారం కేవలం వ్యాధుల పట్ల మీ అవగాహన కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

ఆస్తమా పిల్లల్ని ఇబ్బందిపెట్టే పాసివ్‌ స్మోకింగ్‌


పాసివ్‌ స్మోకింగ్‌ (ధూమపానం చేసేవారు వదిలిన పొగను ఇంకొకరు పీల్చడం) ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడుతుందని కొత్త అధ్యయనం తెలిపింది. 53 శాతం మంది పిల్లలు పాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావానికి గురవుతున్నారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వీరు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వైద్యున్ని కలుస్తున్నారు లేదా గత ఏడాది పిల్లికూతలతో అత్యవసర విభాగంలో చేరుతున్నారు. ఒకటి లేదా వారంలో చాలా రాత్రులు పిల్లికూతల వల్ల నిద్రభంగంతో బాధపడ్డారు. 'ఆస్తమా రోగులు పాసివ్‌స్మోకింగ్‌ బారినపడకూడదని జాతీయ ఆస్తమా మార్గదర్శకాలు సలహా ఇస్తున్నాయి. కానీ వీటిని పాటిస్తున్నారనే దానిపై అస్పష్టత నెలకొన్నది' అని సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌ వైద్యాధికారి లారా జె. అకిన్‌బమి తెలిపారు. 53 శాతం మంది ఆస్తమా పిల్లలు పాసివ్‌ స్మోకింగ్‌ బారినపడ్డారని 2005 నుంచి 2010 వరకు జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

Saturday, 19 May 2012

దరిద్రులు ఎలా పెరుగుతున్నారు?-2


  • అశాస్త్రీయ ఆచారాలు8
'పిల్లలూ! దరిద్రం ఎలా పోతుందో ఒక ప్రఖ్యాత వైద్యుని జీవితం నుండి వివరిస్తాననని గత వారం చెప్పాను కదా!
ఆయన పేరు నార్మన్‌ బెత్యూన్‌. ఆయన కెనాడాలో పెద్ద డాక్టరు. బాగా డబ్బు సంపాదించాడు. ఇక మిగిలిన జీవితాన్ని పేదల సేవలో వినియోగిద్దామనుకొన్నాడు. ఒక పేదల కాలనీని ఎన్నుకున్నాడు. అక్కడ ఆసుపత్రి పెట్టాడు. ఆ కాలనీవాసులకు ఉచిత వైద్యం, వీలైనంత వరకూ ఉచిత మందులు ఇవ్వడం మొదలుపెట్టాడు. రెండేళ్లలో ఆ కాలనీలో రోగి అనేవాడు లేకుండా చేయాలని ఆయన ఆశయం. మూడునెలలు గడిచాయి. ఆరునెలలు; సంవత్సరం గడిచింది. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉందిగానీ తరగటం లేదు. ఇంకొక సంవత్సరంలో ఆ కాలనీలో రోగి అనేవాడు లేకుండా చేయాలనే డాక్టరుగారి ఆశయం నెరవేరేటట్లులేదు. ఆయన ఆ కాలనీలో రోగాలెందుకు తగ్గటం లేదో, పైపెచ్చు ఎందుకు పెరుగుతున్నారో కారణాలను తెలుసుకోదలచాడు. రోగులను ఇంటర్వ్యూ చేయసాగాడు.
ఒక రోగితో ఆయన ఇంటర్వ్యూ ఇలా సాగింది.
బెత్యూన్‌: నీకు రోగం తగ్గలేదు. నీవు నేను చెప్పిన మందులు వాడుతున్నావా?
రోగి: వాడుతున్నానండీ!
బెత్యూన్‌: నాలుగురోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాను. తీసుకున్నావా?
రోగి: మౌనం..
బెత్యూన్‌: పనిలోకి వెళ్లావా? సెలవుపెట్టి ఇంట్లో ఉండలేకపోయావా?
రోగి: మాకు సెలవులెక్కడివి సారూ! పనిలోకి వెళ్తేనే జీతం; జీతం వస్తేనే ఇంట్లో పిల్లలకు తిండి. అందుకని పనిలోకి వెళ్లాను సారూ!
బెత్యూన్‌: మీ యజమాని సెలవు ఇవ్వరా?
రోగి: ఇవ్వరు సారూ!
మరో రోగితో ఆయన సంభాషణ ఇలా జరిగింది....
బెత్యూన్‌: నీకు రోగం తగ్గలేదు. మందులు క్రమం తప్పకుండా వేసుకుంటున్నావా?
రోగి: వేసుకుంటున్నానండీ.
బెత్యూన్‌: పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నావా?
రోగి: తీసుకుంటున్నానండి.
బెత్యూన్‌: బలమైన ఆహారం అంటే పాలు, గుడ్లు, మాంసం తీసుకుంటున్నావా?
రోగి: మౌనం...
బెత్యూన్‌: ఎందుకు తీసుకోవడం లేదు? నీ రోగానికి బలమైన ఆహారం అవసరం అని చెప్పానుగదా?
రోగి: ఏం చెయ్యమంటారు డాక్టరుగారూ! నేను పనికిపోకపోతే నా భార్య తెచ్చే కూలీడబ్బుల్తో ఇల్లంతా తినాలి. ఇంకా నాకోసం పాలు, గుడ్లు ఎక్కడి నుండి తేగలదు?
డాక్టర్‌ బెత్యూన్‌ ఆలోచించసాగాడు. ఆ కాలనీలోని మనుషులందరూ బాగా కష్టపడి పనిచేస్తారు. కానీ వాళ్ళకు రోగమొస్తే విశ్రాంతిగానీ, మంచి ఆహారంగానీ దొరకదు. కానీ, వాళ్ళు పనిచేసే మిల్లు యజమాని కోట్లు కూడబెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్య కాలనీ ప్రజలు ఒళ్లొంచి పనిచేయకపోవడం కాదు. వాళ్ళ శ్రమశక్తి విలువ వాళ్ళకు కాకుండా యజమానికి దక్కడం. యజమాని వారి శ్రమకు తగిన ఫలితాన్ని వారికి ఇవ్వకపోవడం వలననే వారు దరిద్రులౌతున్నారు.
డాక్టరు బెత్యూన్‌కి ప్రజల దరిద్రానికి కారణం అర్థమైంది. వాళ్ళ దరిద్రం పోవాలంటే వాళ్ళ శ్రమకు తగిన ఫలితం వాళ్ళు పొందాలి. అలా పొందాలంటే శ్రామిక రాజ్యమే రావాలి. ఆ విషయం అర్థంచేసుకున్న ఆయన ఆ కాలనీవాసులందరినీ అలాంటి రాజ్యం ఏర్పాటు దిశగా సమీకరించి, అలా శ్రామిక రాజ్యాన్ని కోరే ఇతరులతో కలిసి ముందడుగు వేశాడు, వేయించాడు. చైనాలో శ్రామికరాజ్య స్థాపనలో ఉడతాభక్తిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి, అమరుడయ్యాడు.
'పిల్లలూ! ఇప్పుడర్థమైందా? దరిద్రానికి కారణమేంటో? దానికి పరిష్కారమేంటో?'
'అర్థమైంది మాష్టారూ! దరిద్రానికి కారణం పాపులూ, పాపాలూ కానేకాదు. కోట్లాదిమంది కష్టజీవుల శ్రమను కొద్దిమంది దోచుకోవటమే కారణం. ఇక దరిద్రానికి పరిష్కారం కష్టజీవుల రాజ్యస్థాపనయే' దృఢంగా అన్నాడు శ్రీను.
'మంచిది. మీరందరూ దరిద్రుల నిర్మూలనకు సరైన మార్గంలో ప్రయాణిస్తారని ఆశిస్తాను' అన్నాను.
'తప్పకుండా దరిద్రుల నిర్మూలన కోసం, కష్టజీవుల రాజ్యం కోసం ప్రయత్నిస్తాం మాష్టారూ!' అన్నారు పిల్లలంతా.
'సంతోషం' అన్నాను నేను.. నిజంగా చాలా సంతోషంగా.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

నూనెందుకు వంపుగా ప్రవహిస్తుంది?


డబ్బాల్లోంచి నూనెను, గ్లాసుల్లోంచి పళ్లరసాల్ని, కప్పుల్లోంచి టీని వంపేప్పుడు ఆయా ద్రవాలు నిలువుగా కాకుండా వంపుగా పాత్రల గోడ అంచుల మీద ప్రవహిస్తూ ఇబ్బంది పెడతాయెందుకు? - విద్యార్థులు, జనవిజ్ఞానవేదిక సృజనోత్సవ క్యాంపు, విజ్ఞాన్‌ హైస్కూల్‌, వరంగల్‌
వాయువులను, ద్రవాలను ప్రవాహకాలు(fluids) అంటారు. ద్రవాలకున్న ప్రవాహ లక్షణాల్లో ప్రవాహ వేగానికీ, ప్రవాహకాల అంతరంగిక పీడనాని(pressure) కి ఉన్న సంబంధం చాలా ముఖ్యమైంది. ప్రవాహవేగం పెరిగితే ఆ ప్రవాహకాల్లో పీడనం తగ్గుతుంది. ప్రవాహకాల వేగం తక్కువయితే ఆ ప్రవాహకాల్లో పీడనం ఎక్కువ ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ప్రవాహకాల వేగానికీ, ప్రవాహకాలు కలిగించే పీడనానికీ విలోమ (inverse) సంబంధముందన్న మాట. ఈ నియమాన్నే 'బెర్నౌలీ సూత్రం (Bernauli’s principle)µ అంటారు. ఇది వాయువులకు ద్రవాలకు రెంటికీ వర్తిస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే విమానాలు, పక్షులు, కీటకాలు, గాలిపటాలు గాల్లో ఎగరగలుగుతున్నాయి. ఈ సూత్రం ఆధారంగానే పీడనాన్ని తగ్గించేందుకు ఓవర్‌హెడ్డు నీటి ట్యాంకు నుంచి పైపుల ద్వారా నీటిని కిందికి పంపే పైపుల వ్యాసార్థాన్ని (radius of cross section) తగ్గించుకుంటూ వెళతారు. ఈ సూత్రం ఆధారంగానే లోతుగా ఉన్న సముద్రభాగంలో కన్నా తీరప్రాంతాల్లోనే అలల ఉధృతి ఎక్కువ ఉంటుంది.

ఇక ద్రవాల విషయానికొస్తే పైన పేర్కొన్న ' బెర్నౌలీ సూత్రం'తోపాటు వీటికి తలతన్యత (surface tension), స్నిగ్ధత (viscosity) అనే లక్షణాలు కూడా ఉంటాయి. స్నిగ్థతా గుణం వల్ల పాత్రలకు అంటుకున్న భాగాల కన్నా పాత్రల గోడల కు దూరంగా ఉన్న ద్రవ భాగాల వేగం ఎక్కువ ఉంటుంది. తలతన్యత గుణం వల్ల ద్రవాలు తమ ఆకృతిని గోళాకారం (spherical shape) లోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకే వాన చినుకులు, ఇతర ద్రవాల బిందువులు (droplets)ర) గుండ్రంగా ఉంటాయి. స్నిగ్ధతా గుణం, తలతన్యత, బెర్నౌలీ సూత్రం సంయుక్తంగా పనిచేయడం వల్లే కుళాయి తిప్పినప్పుడు ధారగా కిందపడే నీటిధార కుళాయి మూతి దగ్గర విస్తారంగాను, కిందికి వెళ్లే కొద్దీ సన్నబడుతూ ఆ తర్వాత బిందువులు (చుక్కలు) గా మారుతుంది. ఇపుడిక అసలు విషయానికి వద్దాము..

గ్లాసుల్లోనూ, మీరన్న ఇతర పాత్రల్లోను ఉన్న ద్రవాలు, ఆయా పాత్రలను వంచినపుడు న్యూటన్‌ గురుత్వాకర్షక బలసూత్రాల ప్రకారం నిట్టనిలువుగా కిందపడాలి. కానీ అవి పాత్రల అంచుల మీదగా ప్రవహిస్తూ మనం ఒక దగ్గర పోయాలనుకుంటే అవి మరోచోట పడి ఇబ్బంది, విసుగు కలిగిస్తాయి. ఇందుకు కారణం ద్రవాలకున్న తలతన్యత, స్నిగద్ధత, బెర్నౌలీ సూత్రాలే. మనం పాత్రను వంచినపుడు ఆ ద్రవం పాత్రల అంచునకు లోపలివైపు పొర అంటుకున్నందున అక్కడ వేగం ఎక్కువ ఉండదు. పైగా ఆ ద్రవం అంచుల వల్ల తలతన్యత గుణం వల్ల వంపు తిరుగుతుంది. అంటే పడుతున్న ద్రవపు పైపొర ఎక్కువదూరం ప్రయాణించేలా, లోతట్టు పొర తక్కువ దూరం ప్రవహించేలా రూపం ఏర్పడుతుంది. పర్యవసానంగా పాత్ర గోడలకు, ద్రవపు లోపలి అంచుకు మధ్య ఉన్న గాలిపొర పలుచగా అవుతుంది. అంటే అక్కడ గాలి పీడనం బాగా తక్కువ అవుతుంది. కానీ ధార ఆవలభాగంలో ఉన్న గాలి పీడనం యథారీతిలో ఉంటుంది.

మరోమాటలో చెప్పాలంటే ధారకు బయటివైపు గాలి పీడనం ఎక్కువగాను, లోపలి భాగం తక్కువగాను ఉంటుంది. అందువల్ల ధారమీద పాత్రవైపు నికరబలం (effective force from the pressure) పడుతుంది. అంటే ధారను పాత్రవైపున నెట్టేలా గాలి పీడనం పనిచేస్తుంది. అలా నెట్టబడ్డ ద్రవానికి, పాత్రగోడలకు మధ్య ఎంతోకొంత అనుబంధ బలాలు (వీటినే తెలుగు అకాడమీ వారు సంసంజన బలాలు లేదా (choesive forces అంటారు.) ఉండడం వల్ల పైన తెలిపిన పరిస్థితి పునరావృతం అవుతుంది. అందుకే ద్రవాలు పాత్రల గోడల మీదుగా వంపుగా ప్రయాణిస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టాలంటే ద్రవం మీద లోపల బయట వేర్వేరు వంపులు లేకుండా చూడాలి. అపుడు ద్రవం మీద పనిచేసే నికరబలం తక్కువ అవుతుంది. లేదా ద్రవానికి, పాత్ర గోడలకు అంచు (పాత్ర మూతి లేదా brim) దగ్గరే దూరం ఎక్కువ ఉండాలి. తర్వాత ఎంతో కొంత లోపలికి నెట్టబడుతున్నా పాత్ర గోడలకు అంటుకొనే అవకాశం ఉండదు. అందువల్లే పాత్రల మూతుల వద్ద పక్షి ముక్కులాగా వంపును రూపొందిస్తారు. ఇది ధార మందాన్ని తగ్గించి పీడన వ్యత్యాసాల్ని నివారించడమే కాకుండా ద్రవ ధారను, పాత్ర గోడకు దూరంగా ఉంచుతుంది.

Wednesday, 9 May 2012

పిడుగు ఎందుకు పడుతుంది?


పిడుగు ఎందుకు పడుతుంది? పడిన తర్వాత ఏమవుతుంది? దానివల్ల నష్టమా? లాభమా? - ఓ.నవ్య, ఇంటర్మీడియట్‌, విజయవాడ.
భూ వాతావరణం అద్భుతమైంది. అందువల్లే ఋతువులతో పాటూ భూమిపై జీవం ఆవిర్భవించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం కన్నా కొంచెం ముందు వచ్చే వేసవికాలంలో సూర్యరశ్మి తాకిడి వల్ల అరేబియా మహాసముద్రంలాంటి సముద్రాలలో నీరు బాగా ఆవిరవుతుంది. సముద్ర ఉపరితలాలపై ఉండే వాతావరణంలో తేడాలు వచ్చినప్పుడు కూడా అల్పపీడనాలు ఏర్పడి, నీరు విపరీతంగా ఆవిరవుతుంది. ఇలా ఋతుపవనాల సమయంలోగానీ, అల్పపీడనం ఏర్పడినప్పుడుగానీ అధిక మోతాదులో ఆవిరైన నీటిఆవిరిలోని నీటి అణువుల మధ్య హైడ్రోజన్‌ బంధాలు చాలా ఏర్పడతాయి. దీనివల్ల వందలాది అణువులు సమూహాలుగా ఏర్పడి, నీటి తుంపరలతో కూడిన మేఘాలుగా రూపొందుతాయి. అడపాదడపా ఈ నీటి తుంపరుల మధ్య దుమ్ము, ధూళి కణాలు కూడా చిక్కుకుపోతాయి.

మేఘాల పైభాగంలో సూర్యరశ్మి బాగా సోకడం వల్ల ఆ సౌరశక్తితో కొన్నిసార్లు విద్యుదావేశపరంగా తటస్థంగా ఉండాల్సిన మేఘాలలో రుణావేశిత ఎలక్ట్రానులు ఒకచోటి నుండి మరోచోటికి బదిలీ అవుతాయి. అంటే తటస్థత నుంచి ఎలక్ట్రాన్‌లను పోగొట్టుకున్న మేఘాలు ధనావేశితంగానూ, ఎలక్ట్రానులు గైకొన్న మేఘాలు రుణావేశితంగానూ మారిపోతాయి. ఇలాంటి మేఘాలు సముద్ర ఉపరితలం నుంచి గాలి సాంద్రతల్లో తేడాల వల్ల నేల భాగాలవైపు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలో యాధృ చ్ఛికంగాగానీ, విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణవల్లగానీ మేఘాలు పరస్పరం ఘర్షణకు లోనయ్యే అవకాశాలు ఏర్పడతాయి. అప్పుడు వాయువులలోనే విద్యుచ్ఛక్తి ప్రసరిస్తుంది. ఈ ప్రక్రియనే మనం విద్యుత్‌ నిరావేశం అంటాము. అంటే ఎలక్ట్రానులు అధికంగా ఉన్న రుణావేశిత మేఘాల నుంచి ఎలక్ట్రానులు తక్కువ ఉన్న ధనావేశిత మేఘాలలోకి అత్యంత వేగంగా దుమకడం వల్ల మేఘాలు తమ ఆవేశాలను రూపుమాపుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ స్థితిలో విద్యుత్‌ ప్రవాహం గాలిలో ఏర్పడటం వల్ల అధిక మోతాదులో వాయువులు వేడెక్కుతాయి.

ఎంతగా వేడెక్కుతాయంటే అవి శక్తిపరంగా అత్యంత తారస్థాయి కి చేరుకుని ఆ తరువాత పైకేసిన రాయి కింద పడ్డట్టుగా కాంతిని వెదజల్లుతూ తిరిగి యథాస్థితిలో అల్పస్థాయికి చేరుకుంటాయి. ఈ కాంతినే మనం 'మెరుపు' అంటాము. అదే సమయంలో ఆ వేడికి సంకోచ వ్యాకోచాలకు లోనైన గాలిలో శబ్ధాలు ఏర్పడతాయి. ఆ శబ్ధాలనే మనం 'ఉరుము'లు అంటాము. అంటే మెరుపు, ఉరుము ఒకే సమయంలో ఏర్పడతాయన్న మాట! మెరుపు కేవలం కాంతి స్వరూపం. అది విద్యుదయస్కాంత తరంగం. అది పదార్థ రూపమే అయినా దానికి గుర్రపునాడాల్లాగా, బండి చక్రాల కొక్కేల్లాగా ద్రవ్యరాశి ఉండదు. కాబట్టి, భూమ్యాకర్షణ వల్ల మెరుపు కింద పడదు. ఉరుము కేవలం శబ్ధరూపం. అది కేవలం గాలిలో జరిగే కంపనాల ప్రక్రియ. కాబట్టి ధ్వనికీ ద్రవ్యరాశి అంటూ ఏమీలేదు. అదీ భూమి మీదకి భూమ్యాకర్షణ శక్తి వలన పడదు. మెరుపు, ఉరుములు భూమిని చేరేందుకు వేరే యంత్రాంగం ఉంది.
మెరుపు, ఉరుము ఒకేసారి ఏర్పడ్డా మనం మెరుపును ముందు చూస్తాం. ఉరుమును తరువాత వింటాం. ఇందుకు కారణం ధ్వని వేగం కన్నా కాంతి వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉండటమే!

ద్రవ్యరాశి ఏమాత్రం లేని ఉరుములు, మెరుపులు పిడుగుల రూపంలో భూమివైపు ఎలా పడతాయి? ఇంతకుముందు చెప్పినట్లు ఉరుములైనా, మెరుపులైనా అవి గాలిలో జరిగే విద్యుత్‌ ఉత్సర్గం అని తెలుసుకున్నాం. మెరుపుల సమయంలో కొన్ని ఎలక్ట్రాన్ల సమూహాలు దొడ్డిదారిన గాలిలో ప్రయాణిస్తూ భూమివైపు చేరతాయి. ఇందుకు కారణం ఎలక్ట్రానులు ఎప్పుడూ తమ ప్రయాణానికి నిరోధాన్ని కలిగించే మార్గాలలోకన్నా ప్రయాణానికి అనువుగా ఉన్న మార్గాల్లోనే త్వరితంగా ప్రయాణి స్తాయి. విద్యుత్‌ శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే విద్యుత్‌ ఎల్లప్పుడూ తక్కువ విద్యున్నిరోధం ఉన్న మార్గాల్లో ప్రయాణిస్తుందన్న మాట! మేఘాల మధ్య ఉత్సర్గానికి పరిస్థితులు అనువుగా లేనప్పుడు భూమికి, మేఘాలకు మధ్య వర్షాకాల సమయంలో తేమ అధికంగా ఉండటం వలన విద్యున్నిరోధం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ విద్యుత్‌ ప్రసారాన్ని మనం పిడుగుపాటు అంటాం.

విశాలమైన పొలాల ప్రాంతంలో పిడుగుపాటు సంభ వించినప్పుడు అక్కడ మనుషులు నిల్చుని ఉన్నా, పచ్చ ని చెట్లున్నా లేక విసిరేసినట్లుగా అక్కడక్కడా ఇళ్లున్నా వాటిగుండా విద్యుత్‌ ప్రసారమై, వాటికి ప్రమాదం జరుగుతుంది. పిడుగుపాటు సమయంలో ఏర్పడే మెరుపుల్లో ఉష్ణోగ్రత కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడులు ఉంటుంది. ఇది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కన్నా కొన్నివేల రెట్లు ఎక్కువ. కాబట్టి పిడుగుపాటు వల్ల నష్టమేగానీ ప్రయోజనమంటూ ఏమీలేదు. అయితే మెరుపులు, ఉరుముల వల్ల వాతావరణంలో కొన్ని వాయువులు ధ్వంసం కావడం వల్ల వాతావరణ సమతుల్యం ఏర్పాటులో ఇవి కొంత కలిగి ఉన్నాయి.

మెరుపు అన్నా, ఉరుము అన్నా పదార్థం కాదని తెలిశాక కూడా ప్రజల్లో అధికభాగం 'పిడుగు' అంటే అది దేవతారథ చక్రాల చీల అని నమ్ముతున్నారు. మెరుపు మెరిశాక చాలాసేపటి తరువాత వచ్చే ఉరుము శబ్ధాన్ని విని 'అర్జునా ఫల్గుణా..' అంటూ పిడుగుపాటు నుండి రక్షించమని వేడుకుంటున్నారు. కానీ ఆపాటికే పిడుగు పడిపోయి ఉంటుంది. అసలు చీలలు ఊడిన రథాలు, రథచక్రాలు, సారథులు ఎందుకు కిందకు పడరు? కానీ వాటికంటే తక్కువ బరువుండే చీలలు మాత్రమే ఎందుకు పడతాయి? ప్రజలు వీటిని ప్రశ్నించడం లేదు. పిడుగుపాటు నుంచి రక్షించే మహత్యాలే వారికుంటే ఆ రథాల చీలలు ఊడకుండా చేయొచ్చుకదా! చక్రాలు తిరగాలంటే నేల లేదా గరుకు ప్రాంతం ఉండాలి.

ఆకాశంలో గరుకు ప్రాంతాలెక్కడున్నాయి? ఒకసారి చీల ఊడిన తర్వాత పడిపోతున్న చీలను అర్జునుడు ఏరకంగా ఆపగలడా? అని తార్కిక దృష్టితో ఆలోచిస్తే మెరుపులు, ఉరుములు, పిడుగుపాట్లు విద్యుత్‌ ప్రవాహమే అని తెలిసిపోతుంది. ఈ విషయాన్ని మొదటిసారిగా అమెరికా శాస్త్రవేత్త 'బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌' గాలిపటం ఎగరేయడం ద్వారా, ప్రాణాలకు కూడా తెగించి ప్రయోగపూర్వకంగా తేటతెల్లం చేశాడు. ఈ విజ్ఞానం తెలుసుకున్న తరువాత పెద్ద పెద్ద భవంతులు, కట్టడాలను పిడుగుపాటు నుంచి రక్షించుకునేందుకు మెరుపుకడ్డీలను అమర్చుతున్నారు.

చూపునిచ్చే బయానిక్‌ కన్ను!


గత పాతికేళ్ళ నుండీ అంధత్వంతో బాధపడుతున్న క్రిస్‌జేమ్స్‌ అనే వ్యక్తికి డాక్టర్లు అతని కంటి వెనక ఒక మైక్రోచిప్‌ అమర్చారు. ఇప్పుడు అతను ఆకారాలను చూడగలుగుతున్నాడు. బహుశా త్వరలో స్పష్టంగా చూడగలడేమో! అతనిలో అమర్చిన బయానిక్‌ కన్ను కాంతికి స్పందించి, ఒక ఎలక్ట్రానిక్‌ సంకేతాన్ని 'దృష్టి నాడి' ద్వారా మెదడుకు చేరవేస్తుంది. తద్వారా కంటిలో ఉండే కాంతి గ్రాహక కణాలు దెబ్బతిని, చూపు కోల్పోయిన వారిలో క్రమ క్రమంగా చూపు వచ్చే అవకా శాలు ఉంటాయి. రెటీనా ఇంప్లాంట్‌ అనే జర్మన్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ బయానిక్‌ కన్ను కంటి వెనుకభాగంలో ఉండే అతి సున్నితమైన రెటీనా పై అమర్చవలసి ఉంటుంది. ఆ చిప్‌కి కావలసిన విద్యుచ్ఛక్తి చెవి వెనుక అమర్చబడి ఉంటుంది. బయానిక్‌ కన్నులో రెటీనా విధులన్నీ ఇమడ్చబడి ఉంటాయి. దాదాపు 1500 కాంతి గ్రాహక డయోడ్లు, అనేక ఎలక్ట్రోడ్లు కలిసి చూపును కలిగిస్తాయి. అయితే కేవలం నలుపు తెలుపు చిత్రాలే, అదీ అరచెయ్యి వెడల్పులో మాత్రమే కనిపిస్తాయి. బహుశా రానున్న కాలంలో ఈ టెక్నాలజీ మెరుగుపడి, మరింత మంచి ఫలితాలను ఇస్తుందేమో చూడాలి.

మెరుపులు ... పిడుగులు...


వాతావరణంలో ఏర్పడిన అసమతుల్యత వల్ల ఈ వేసవిలో అకాలవర్షాలు పడుతున్నాయి. దీంతో మన రాష్ట్రంలో ఇటీవల కొన్ని జిల్లాల్లో పిడుగులు పడి జన, ఆస్థి నష్టాలు సంభవించాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం బ్రెజిల్‌లోని రియో నగరం నుండి ఫ్రాన్స్‌కు బయలుదేరిన విమానం అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. దీనికి కారణం మెరుపులే అన్న అనుమానాలున్నాయి. ఈ ప్రమాదంలో 228 మంది గల్లంతయ్యారు. అసలు ఈ మెరుపులు, పిడుగులు, ఉరుములు ఎలా సంభవిస్తాయి..? మేఘాల గురించిన సమాచారాన్ని సంక్షిప్తంగా తెలిపేందుకు మీ ముందుకొచ్చింది.... ఈ వారం 'విజ్ఞానవీచిక'.
పిడుగులు పడటం వల్ల ప్రతి ఏడాది ఏదోమేర నష్టం కలుగుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. చిన్నప్పుడు వీటికి భయపడనివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో?! ఆ సమయంలో అమ్మమ్మలు, తాతయ్యలు లేదా ఎవరో ఒకరు పెద్దవాళ్లు అక్కునచేర్చుకుని, భయాన్ని పోగొట్టడానికి ఓ కథ చెప్తుండేవారు. అదేం టంటే.. 'అర్జునుడు వేగంగా రథంమీద వెళుతున్నప్పుడు రథచక్రాలు రాళ్ళకు తాకినప్పు డల్లా కళ్ళు మిరమిట్లు కొలుపుతూ వచ్చే వెలుతురే (కాంతి) ఈ 'మెరుపు'లని, ఇలా వెళుతున్నప్పుడు వచ్చే ధ్వనే 'ఉరుము'లని. అందువల్ల ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు 'అర్జునా..! అర్జునా..' అని అనుకుంటే ఉరుములు, మెరుపుల వల్ల మనకేమీకాదనీ, భయపడాల్సిన అవసరం లేదనీ వాళ్లు చెప్పేవారు. విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో భయాల్ని పొగొట్టడానికి ఇలాంటి కథలు ఉపయోగపడ్డాయి. కానీ, విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎన్నో ప్రకృతి రహస్యాలను శాస్త్రీయంగా మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. ప్రమాదాల నుండి రక్షించుకోగలుగుతున్నాడు. ఇలా అర్థంచేసుకోగలిగిన ప్రకృతి రహస్యాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు ముఖ్యమైనవి. అందువల్ల నేడు ఉరుములు, మెరుపులు అర్జనుడి రథం వల్ల వస్తున్నాయని నమ్మడం అశాస్త్రీయం.. మూఢవిశ్వాసం.
మెరుపులు కలిగే తీరు..
ఆకాశంలో మబ్బులు వేగంగా కదులుతున్నప్పుడు విద్యుత్‌ విడుదలై 'మెరుపులు' కనిపిస్తాయి. మామూలుగా ఇవి ఉరుములతో కలిసి వస్తాయి. వాతావరణంలో కలిగే మార్పులే మెరుపులకు కారణమని శాస్త్రజ్ఞులు ప్రతిపా దించారు. వేగంగా వీచేగాలులు, నీటిఆవిరి, వీటి మధ్య రాపిడి మరియు వాయు పీడనం మేఘాలలో విద్యుత్‌ మార్పులను కలిగిస్తాయి. ఇవి మెరుపులకు దారితీస్తాయి.
మబ్బులలో ఉన్న చిన్న చిన్న మంచుకణాలు మెరుపుల్ని కలగజేయటంలో కీలకపాత్ర వహిస్తాయి. వీటి ఒత్తిడి వలన మబ్బులలో అంతర్గతంగా పాజిటివ్‌, నెగిటివ్‌ ఛార్జీలు వేరుపడతాయట! పాజిటివ్‌ ఛార్జీలు మబ్బుపైకి, నెగిటివ్‌ ఛార్జీలు మబ్బు కింది భాగానికి చేరతాయి. ఇలా విద్యుత్‌ ఛార్జీలు వేరుపడటం వల్ల మబ్బుల్లో 'విద్యుత్‌ పీడనం' (ఎలక్ట్రిక్‌ పొటెన్షియల్‌) ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ పీడనం ఒక స్థాయికి మించినప్పుడు, మబ్బుల్లో అదనంగా ఉన్న విద్యుచ్ఛక్తి మెరుపురూపంలో విడుదలవుతుందని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు.
భూగోళంలో 'కాంగో' దేశంలో మెరుపులు అత్యధికంగా వస్తున్నాయని గమనిం చారు. మామూలుగా మనంచూసే మెరుపులు మబ్బుల కిందిభాగం నుండి వచ్చే నెగి టివ్‌ విద్యుత్‌ ప్రసారంవల్ల వస్తున్నాయి. ఈ విద్యుచ్ఛక్తి సుమారుగా 30వేల ఆంపియర్స్‌కు సమానమని అంచనా. ఇది 1,20,000 ఆంపియర్స్‌ వరకూ పోవచ్చట!
విద్యుత్‌ పీడనం మూడు మిలియన్‌ ఓల్ట్‌లకు మించినప్పుడు మెరుపు వస్తుంది. కేవలం ఒకే ఒక మెరుపు వచ్చినప్పుడు వచ్చే విద్యుత్‌ పీడనం శక్తి వెయ్యి బిలియన్‌ వాట్ల వరకూ ఉంటుందట. ఇది చాలా శక్తివంతమైంది. కానీ, సెకండ్‌లో దాదాపు 33 వేల వంతుకు (30 మైక్రో సెకండ్లు) మాత్రమే ఉంటుందట. అయితే 'మెరుపు' ఒకేసారి కాక కనీసం నాలుగైదు సార్లు వస్తుందట. ఇలా ఎన్నో మెరుపులు రావచ్చు.
మెరుపు వచ్చినప్పుడు చుట్టూతా ఉన్న గాలి ఒకేసారి 20 వేల డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకూ వేడి విడుదలవుతుంది. ఇది సూర్యుని ఉపరితలం వేడికన్నా దాదాపు వేల రెట్లు అధికం. ఇంత వేడి ఒకేసారి రావటం వల్ల చుట్టూ ఉన్న గాలి ఒకేసారి సూపర్‌ సోనిక్‌ వేగంతో (శబ్ధానికి మించిన వేగంతో) వ్యాకోచిస్తుంది. ఈ సమయంలో వచ్చే శబ్ధాన్నే 'ఉరుము' రూపంలో వింటున్నాం. అంటే, మొదట మెరుపు కనపడి, ఆ తరువాతే శబ్ధం భూమ్మీదకు వినపడుతుంది. ఉరుమే ఎక్కువగా భయం కలిగిస్తుంది కాబట్టి జంటగా వచ్చే మెరుపు, ఉరుములను, 'ఉరుము, మెరుపు'లుగా తెలుగులో వ్యవహరిస్తున్నారు.
పిడుగులు..
ప్రకృతిలో మూడురకాల మెరుపుల్ని చూడగలం. ఒకటి మబ్బు లోపల మాత్రమే వచ్చే మెరుపులు. మబ్బుల మధ్య వచ్చే మెరుపులు రెండోరకం. ఇక మబ్బు-భూమి మధ్య వచ్చే మెరుపులు మూడోరకం. మబ్బు-భూమి మధ్య వచ్చే మెరుపు ప్రమాదమైంది. దీనిని మనం 'పిడుగు'గా పిలుస్తున్నాం. పిడుగుల వల్ల ఆస్థి, ప్రాణ నష్టం కలగవచ్చు. అందువల్ల, పిడుగులకు మనం భయపడతాం. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ, గాలి వేగంగా వీచేప్పుడు మెరుపు మెరిసిన వెంటనే పిడుగులు వచ్చే అవకాశం ఎక్కువని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. పిడుగుల ద్వారా విడుదలయ్యే విద్యుచ్ఛక్తి విడుదలైన కొన్ని సెకన్లకే పరిమితమవుతుంది. ఈ సమయంలో అత్యధిక వేడి విడుదలవుతుంది. ఇలా విడుదలయ్యే విద్యుత్‌, వేడి కూడా ఆస్థి, ప్రాణ నష్టాలను కలగజేస్తాయి.
అయితే, పిడుగు, మెరుపు దుష్ప్రభావం భూమి మీద ఒకేసారి కలుగుతాయి. కానీ, పిడుగు శబ్ధాన్ని మెరుపు తర్వాత కొంత సమయానికి వింటాం. అందువల్ల మెరిసినప్పుడు ఏమీ నష్టం కలగకపోతే, ఆ తరువాత వినిపించే శబ్ధం (పిడుగు శబ్ధం) ద్వారా ఏమీ నష్టం కలిగించదు. అందువల్ల మెరుపు దుష్ప్రభావాల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, పిడుగు శబ్ధం నుండి భయపడాల్సిన అవసరం లేదు.
మబ్బు-భూమి మధ్య విద్యుత్‌ పీడనం ఎక్కువవుతుంది. ఫలితంగా మబ్బుల నుండి అయాన్ల మార్గం ఉద్భవిస్తుంది. మబ్బుల నుండి వచ్చే మెరుపును రాగి లోహపు కడ్డీ విద్యుత్‌ తరంగాల ద్వారా ఆకర్షిస్తుంది. మొదటి విద్యుత్‌ విడుదల ద్వారా వెంట వెంటనే ఎన్నో విద్యుత్‌ తరంగాలు విడుదలై భూమికి చేరతాయి. వీటిని కూడా రాగి లోహపు కడ్డీ విద్యుత్‌ తరంగాల ద్వారా ఆకర్షిస్తుంది. భవనాలకు రక్షణ కలిగిస్తుంది.
రక్షణ ఎలా పొందవచ్చు..?
పిడుగు సమయంలో మెరుపు నుండి విడుదలయ్యే వేడి, విద్యుత్‌ ఆస్థి, ప్రాణ నష్టం కలిగిస్తాయి. బయటి ప్రదేశాల్లో ఈ పిడుగు ఎక్కడపడితే అక్కడ పడదు. సామా న్యంగా ఎత్తయిన చెట్లపై లేదా కొండల మీద, విశాల ప్రదేశాల్లో పడుతుంది. అందువల్ల ఉరుములు, మెరుపులప్పుడు మనం పెద్దచెట్ల కిందకు, కొండల దగ్గరకు, ఎత్తయిన ప్రదేశాల వద్ద ఉండకుండా జాగ్రత్తపడాలి. వర్షం వస్తున్నా పెద్దచెట్ల కింద రక్షణ తీసుకోకూడదన్నమాట. మనం అలవాటున గబుక్కున పెద్ద చెట్ల కిందకు వెళ్లిపోతాం. పిడుగుపాటుకు గురై చనిపోయినవారు ఎక్కువగా ఇలా చెట్లకింద నిలబడినవారే. ఈ సమయంలో పశువులను కూడా చెట్ల కింద ఉంచకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ఉరుములు, మెరుపుల సమయంలో టీవీ, రేడియోలను ఆపివేయాలి.
చిన్నగా ఎత్తు ఎక్కువలేని ఇళ్ళను పిడుగుల నుండి రక్షణ కల్పించటానికి చుట్టూ ఖాళీస్థలంలో ఎత్తుగా పెరిగే చెట్లను నాటాలి. అప్పుడు ఎత్తుగా పెరిగిన చెట్లమీద పిడుగు పడుతుందిగానీ ఇంటిమీద పడదు.
ఫ్యాక్టరీలకు, ఎత్తయిన భవనాలకు, టవర్లకు (టెలివిజన్‌ టవర్లకు), విలువైన చారిత్రక కట్టడాలకు మెరుపుల నుండి రక్షించడానికి ప్రత్యేక పరికరాలను బిగిస్తు న్నారు. వీటిని 'లైట్నింగ్‌ అరెస్టర్స్‌ (లేక) ప్రొటిక్టర్స్‌'గా పిలుస్తారు. వీటికోసం ఎత్తయిన ప్రాంతంలో టెలివిజన్‌ లేదా రేడియో యాంటీనాల్లాగా ఒక రాడ్‌ను బిగిస్తారు.
ఇలా పైన బిగించిన రాడ్‌ల నుండి విద్యుత్‌ ఆకర్షణ శక్తి అయాన్ల రూపంలో ఆకాశంలోకి విడుదలవుతుంది. మెరుపు ద్వారా వచ్చే విద్యుదయస్కాంత కిరణాలను ఆకర్షించి, సురక్షితంగా భూమిలోకి ప్రసరింపజేస్తాయి. ఈ విధంగా మెరుపులు వచ్చే సమయంలో విడుదలయ్యే విద్యుదయస్కాంత కిరణాలు ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా ఆపగలుగుతాయి.
'ఉరుము' ఆలస్యంగా ఎందుకు వినిపిస్తుంది..?
'మెరుపు' కాంతి వేగంతో ప్రసారమవుతుంది. ఇది సెకండుకు సుమారు 60 వేల మీటర్ల వేగంతో (గంటకు 2.20 లక్షల వేల కిలోమీటర్ల వేగంతో) ప్రసారమవుతుంది. అందువల్ల భూమిమీద మెరుపును వెంటనే చూడగలుగుతున్నాం. కానీ, ధ్వని కేవలం సెకన్‌కి 330 మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. అంటే కాంతికన్నా ఒక మిలియన్‌ రెట్లు తక్కువవేగంతో ధ్వని భూమిపైకి ప్రసారమవుతుంది. అందువల్ల, మెరుపు కనిపించిన కొద్దిసేపటికి మెరుపు వల్ల వచ్చిన 'ఉరుము'ను వినగలుగుతున్నాం.
ఎత్తు తక్కువ మేఘాలు (లో క్లవుడ్స్‌):
ఇవి వర్షిస్తాయి. సామాన్యంగా భూమి నుండి ఇవి 6,500 అడుగుల్లోపు ఉంటాయి. ఈ మేఘాలు స్ట్రేటస్‌, స్ట్రేటోక్యుమ్యులస్‌, క్యుమ్యులస్‌. వీటి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. వీటిని తేలిగ్గా గుర్తించవచ్చు.
స్ట్రేటస్‌ మేఘాలు: తుపాను సమయంలో మేఘాల కింద వేగంగా, గాలివాటంగా పోతుంటాయి. వీటి అడుగుభాగాన దట్టమైన నీటి బిందువులతో, ముదురు బూడిదరంగు కలిగి, నేలమీద నీడనిస్తాయి. ఈ మేఘాలను 'ఉష్ణమేఘాల'ని కూడా పిలుస్తున్నాం. ఇవి మామూలుగా వర్షించకపోతే 'మేఘమధనం' ద్వారా అదనంగా వర్షాన్ని కురిపించవచ్చు. మధ్యస్థ ఎత్తులో (6,500-2000 అడుగులలో) ఏర్పడే మేఘాలను 'ఆల్టో మేఘాలు' అంటారు. 'ఆల్టోస్ట్రేటస్‌ మేఘాలు' ఒక మోస్తరు సన్నని వర్షాన్ని కురిపిస్తాయి. 'ఆల్టో స్ట్రేటస్‌' భూమికి దాదాపు సమాంతరంగా ఉంటాయి. ఇవి సరిగ్గా వర్షించకపోతే 'మేఘమధనం' ద్వారా వీటిని వర్షింపజేయవచ్చు.
భూమిపై 20 వేల అడుగుల పైన ఎత్తుగా ఉండే మేఘాలను 'ఎత్తయిన మేఘాలు (హై క్లవుడ్స్‌)' అంటారు. వీటిలో 'సిర్రస్‌, సిర్రో స్ట్రేటస్‌, సిర్రో క్యుమ్యులస్‌' మేఘాలు ముఖ్యమైనవి. ఇవి అంతగా వర్షించడానికి ఉపయోగపడవు. కానీ ఇవి రాబోయే తుపాను వాతావరణాన్ని సూచిస్తాయి.
ఎలా వర్షిస్తాయి..?
భూమిపై నుంచి ఆకాశానికి వెళుతూ ఉంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి వంద మీటర్లకూ సుమారుగా ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ తగ్గుతుంది. భూమిపై గాలిలో ఎప్పుడూ నీటిఆవిరి ఉంటుంది. ఈ గాలి-ఆవిరి పైకి వెళ్ళి మేఘంగా మారుతుంది. వేడిగా ఉన్న గాలిలో తేమ అధికంగా నిలవగలదు. ఇదే గాలి పైకి పోయినప్పుడు చల్లబడుతుంది. గాలి చల్లబడ్డప్పుడు తక్కువ తేమను ఇముడ్చుకోగలుగుతుంది. చల్లబడిన మేఘంలో అధికంగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో గాలి నుండి సూక్ష్మ నీటిబిందువుల రూపంలో బయటపడుతుంది. ఇలా వచ్చిన బిందువులే మేఘాల్లో ఉంటాయి. పర్వతాలు అడ్డుగా రావడంవల్లగానీ లేక ఏ ఇతరకారణాల వల్లనైనా మేఘాలు పైకి పోవాల్సి వస్తుంది. ఈ మేఘాలు పైకిపోతున్న కొద్దీ చల్లని వాతావరణాన్ని ఎదుర్కొంటాయి. ఈ సమయంలో అధికంగా ఉన్న సూక్ష్మ నీటి బిందువులు వేర్వేరుగా ఉండక, ఒకదానికొకటి కలిసి పెద్ద నీటి బిందువులుగా మారిపోతాయి. ఈ నీటి బిందువులు భూమ్యాకర్షణకు లోనై వర్షంగా కురుస్తాయి. ఒకోసారి ఇలా పడేటప్పుడు వాతావరణంలో గాలి వేడిగా ఉన్నప్పుడు పెద్ద నీటి బిందువులు తిరిగి సూక్ష్మ నీటి బిందువులుగా మారిపోతాయి. ఇలా మారని నీరు పెద్ద బిందువుల రూపంలో వర్షంగా భూమ్మీద పడతాయి.
యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా?
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికోసం హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి, తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తుందని యజ్ఞం చేసేవారు చెబుతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లో యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి 'మేఘమధనా'న్ని చూపెడుతున్నారు. 'మేఘమధనం' ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెప్తున్నారు. 'ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా?' అని ఆలోచించాలి.

అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్య సమస్య ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి, వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గతంలోలా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు 'హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా?' అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్‌ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై, మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

హృద్రోగానికి మరో చికిత్స..!


మానవ హృదయాన్ని కుంచింపజేయడం ద్వారా హృద్రోగ నివారణలో మెరుగైన ఫలితాలు పొందవచ్చని బ్రిటిష్‌ పరిశోధ కులు అంటున్నారు. ఆ దిశలో ఎలుకలపై తొలి ప్రయోగాలు చేశారు. ఈ ఎలుకలు సుదీర్ఘ కాలం జీవించి ఉన్నాయి. రక్తాన్ని పంప్‌చేసే శక్తి బల హీనపడినప్పుడు గుండెలో అధికరక్తం నిలువ ఉండి కాల క్రమేణా గుండె విశాలమవు తుంది. అలా వెడల్పైన కొద్దీ సమస్యలూ జటిలమవుతాయి. ఆ పరిస్థితి నుండి కాపాడటానికి శాస్త్రవేత్తలు గుండె పరిమాణాన్ని చిన్నదిగా చేయడంపై దృష్టి సారించారు. పేస్‌మేకర్‌ వంటి ఒక పరికరాన్ని గుండెకు వెళ్ళే 'వేగస్‌' నాడికి అమర్చుతారు. దానిద్వారా విద్యుత్‌ను పంపితే అద్రినాలిన్‌ అనే హార్మోన్‌ ప్రభావం నుండి గుండెను రక్షించవచ్చట. గుండె కొట్టుకోవడంలో అంతరాయం కలిగినప్పుడు అద్రినాలిన్‌ వల్ల హృదయ స్పందన వేగవంతమవుతుంది. అటువంటి పరిస్థితిని అడ్డుకోవడం ద్వారా గుండెను కుంచింపజేయవచ్చనీ, గుండె వెడల్పు కాకుండా ఆపవచ్చనీ ఈ పరిశోధకులు అంటు న్నారు. ఈ ప్రభావాల్ని పూర్తిగా అర్థంచేసుకోవాలంటే మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.

రాకెట్ల నుండి మిస్సైల్స్‌ వరకు...

రాకెట్‌ అనే పదం ఇటాలియన్‌ భాషలో 'రోచెట్టా' అనే పదం నుండి వచ్చింది. దీనర్థం 'లిటిల్‌ ఫ్యూజ్‌'. ఈ పదం 1379 నుండి వాడుకలోకి వచ్చింది.
అన్నిరకాల రాకెట్‌ రూపకల్పనలో ఇమిడి వున్న మౌలిక భౌతికసూత్రం ఒకటే. అదే న్యూటన్‌ మూడవ గమన లేక చలనసూత్రం. ప్రతి చర్యకూ దాంతో సమానమైన ప్రతిచర్య వ్యతిరేక దిశలో ఉంటుందనేదే ఈ సూత్రం. ఈ సూత్రం 1687లో రూపొందింది.
తొమ్మిదవ శతాబ్ధంలో చైనా 'టాయిస్ట్‌' రసాయనిక శాస్త్రజ్ఞులు కనుగొన్న తుపాకి పేలుడు మందు రాకెట్‌ రూపకల్పనకు నాంది పలికింది. దీనితో ఘన ఇంధనం (ప్రొపెల్లెంట్‌) గల మొదటి రాకెట్‌ రూపొందింది. అయితే, మొదట రాకెట్‌ను ఎప్పుడు ప్రయోగించిందీ సరిగ్గా తెలియనప్పటికీ 1232లో చైనీయులు మంగోలీలపై చేసిన దాడిలో వీటిని మొదటగా వినియోగించినట్లు తెలుస్తుంది. మంగోలు చక్రవర్తి చెంగీజ్‌ఖాన్‌ యుద్ధ తంత్రంలో వినియోగించిన రాకెట్ల ద్వారా యూరోపియన్లు రాకెట్ల పరిజ్ఞానాన్ని తెలుసుకోగలిగారు.
అప్పటి మైసూర్‌ మహారాజు హైదర్‌ అలీ, టిప్పుసుల్తాన్‌లు ఇనుపగొట్టంలో మందు నింపిన రాకెట్లను 1792లో ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో ప్రయోగించారు. తద్వారా ఆంగ్లేయులు రాకెట్ల పరిజ్ఞానాన్ని తెలుసుకొని, అభివృద్ధిపరిచారు. క్రమంగా ఈ విజ్ఞానం అమెరికా, ఇతరదేశాలకు విస్తరించింది.
20వ శతాబ్ధంలో రాకెట్‌ పరిశోధనలు విస్తరించాయి. జూల్స్‌వెర్న్‌, హెచ్‌జి వెల్స్‌లు రచించిన కాల్పనిక విజ్ఞానశాస్త్ర సాహిత్యం (సైన్స్‌ ఫిక్షన్‌) రాకెట్‌ పరిశోధనలను విస్తరించడానికి దోహదపడింది. ద్రవ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను ఇంధనంగా వినియోగించిన రాకెట్లు ఈ దశాబ్ధ ప్రారంభంలో రష్యాలో రూపకల్పన చేయబడ్డాయి. ఆ తర్వాత రాకెట్‌ డిజైన్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక రాకెట్‌గా చెప్పదగింది (వి2 రాకెట్‌) 1943లో జర్మనీ రూపొందించింది. ఇది 300 కిలోమీటర్ల దూరం వరకూ వెయ్యి కిలోమీటర్ల బరువుగల బాంబులను తీసుకుపోయే శక్తి కలిగి ఉంది. ఇవి రెండవ ప్రపంచయుద్ధ సమయంలో విస్తారంగా వినియోగించబడ్డాయి. ఫలితంగా, ఒక్క ఇంగ్లండ్‌లోనే సుమారు పదివేల మంది చనిపోయారు లేదా గాయపడ్డారు. కానీ కేవలం వీటి తయారీలో జర్మనీలోనే 20వేల మందికి పైగా బానిస శ్రామికులు చనిపోయారు.
రాకెట్‌ బాంబులు విమానాలు, హెలికాఫ్టర్ల నుండి, జలాంతర్గాముల నుండి ప్రయోగించేలా తయారుచేయ బడుతున్నాయి. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఓడిపోయిన జర్మనీ సాంకేతిక నిపుణుల సహాయంతో రాకెట్‌ సాంకేతిక పరిశోధనలు వేగవంతం చేయబడ్డాయి.
వినియోగం.. వైవిధ్యం..
భూమి, నీరు, గాలి, భూమ్యాకర్షణ, అయస్కాంత, కాంతి శక్తులు లేనప్పుడు తమలోనే కలిగివున్న ఇంధనంతో రాకెట్లు పనిచేస్తాయి. అందువల్ల, ఆకాశం (అంతరిక్షం)లో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. వినోదం, యుద్ధతంత్రం, అంతరిక్షయానం, పరిశోధనలు, ప్రయోగాలు, అంతరిక్షంలో దిశా, నిర్దేశం నియంత్రణకు వివిధ రాకెట్లను ఉపయోగిస్తున్నారు.
వినోదం కోసం టపాసుల తయారీలో రాకెట్‌ విజ్ఞానం ఒక ముఖ్య భాగంగా కొనసాగుతుంది. యుద్ధ అవసరాల కోసం విస్తారంగా నేటికీ వినియోగించబడుతున్న రాకెట్‌ సాంకేతికం అంతరిక్ష పరిశోధనల ద్వారా విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికీ దోహదపడుతుంది. ముఖ్యంగా, రాకెట్లు, కృత్రిమ ఉపగ్రహాల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కృత్రిమ ఉపగ్రహాల ద్వారా సమాచార ప్రసారం - టీవీ, రేడియో, టెలిఫోన్‌ సౌకర్యం, ఎప్పటికప్పుడు వాతావరణమార్పుల అంచనా, భూగోళ వనరుల సర్వే, పంటల సేద్యం, దిగుబడి ఉత్పత్తుల అంచనాలలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందిందంటే అంతరిక్ష పర్యాటక సాధ్యాసాధ్యాలను గురించి మాట్లాడగలుగుతున్నాం. అక్కడ కాలనీలను ఏర్పాటు చేసి, దీర్ఘకాలం మనుషులు ఉండటాన్ని సుసాధ్యం చేయడానికి, కావాల్సిన ఆలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రష్యా కొద్దిమంది పర్యాటకుల్ని అంతరిక్షంలోకి తీసికెళ్లింది.
కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగించిన రాకెట్లను 'ప్రదేశీ యానాలు (లాంచ్‌ వెహికల్స్‌)' అంటున్నాం. పునర్వినియోగించగల రాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆయుధంగా ఉపయోగించడానికి బాంబులు లేదా ఇతర పేలుడు భాగాలను రాకెట్‌ చివర్లో (బొమ్మ-1లో చూపిన విధంగా) ఉంచుతారు. యుద్ధంలో వాడే రాకెట్లను క్షిపణులు (మిస్సైల్స్‌) అంటారు.
నియంత్రణ లేకుండా కేవలం 'జురు' మంటూ ఆకాశంలోకి ఎగిరి బాంబులు వేసే వ్యవస్థను రాకెట్‌గా వ్యవహరిస్తున్నాం. ఈ రాకెట్‌ చివరగల బాంబుల్ని నియంత్రించగల (గైడ్‌) వ్యవస్థ కలిగినప్పుడు మిస్సైల్‌గా వ్యవహరిస్తున్నాం. అంటే, మిస్సైల్‌లో రాకెట్‌ భాగంతోబాటు దాని చివరిలో దిశానిర్దేశంతో పేలగల బాంబులు కూడా ఉంటా యి. ఒకే రాకెట్‌ ద్వారా పలు లక్ష్యాలను చేధించగల మిస్సైల్స్‌ - 'మల్టిబుల్‌ వార్‌హెడ్స్‌' అందుబాటులోకి వచ్చాయి.
అంతరిక్షంలోకి ఒకటి లేక అంతకన్నా ఎక్కువగా ఉపగ్రహా లను ఒకేసారి ప్రవేశపెట్టే రాకెట్‌ లూ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ముందుగానే నిర్దేశించిన వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టగల రాకెట్‌ 'యానాలు (లాంచ్‌ వెహికిల్స్‌)' కూడా ఉన్నాయి.
నిర్మాణం..
రాకెట్‌లలో ఇంజన్‌ ప్రధానమైన భాగం. ఇది రాకెట్‌కు చోదకశక్తిని అందిస్తుంది. వీటిలో ఇంధనం ఘన లేక వాయు రూపంలో ఉంటుంది. ఏ రూపం లో వున్నా రాకెట్‌లో ఇంధనం పూర్తిగా నింపబడి ఉంటుంది. ద్రవరూపంలో కలిగిన ఇంధన రాకెట్లు దీర్ఘకాలం నిల్వ ఉండవు. అదే ఘన ఇంధనం కలిగిన రాకె ట్లు దీర్ఘకాలం నిల్వ ఉంటాయి.
ఇంధనంతో బాటు ద్రవ ఆక్సి జన్‌ కూడా ఉంటుంది. ఇంజన్‌లో ఇంధనం మండినప్పు డు వేడిగాలి విడుదలవుతుంది. ఈ వేడిగాలి త్వరగా వ్యాపించి, ఒక ప్రత్యేక నాజిల్‌ (సూక్ష్మరంధ్రం గల ట్యూబ్‌) ద్వారా ఒత్తిడితో వ్యాకో చించి, బయటకు శక్తితో వస్తుంది. దీనితో కిందిభాగంలో పైకి నెట్టే శక్తి ఏర్పడి రాకెట్‌ నింగిలోకి ఎగురుతుంది. రాకెట్‌ ఇంజన్‌ భాగాలు చిత్రం(1)లో చూడండి.
గమన విధానం..
పత్రీ రాకెట్టూ వాటిలో ఉంచిన ఇంధనాలు మండించడం వల్ల ఏర్పడిన వాయువుల విడుదల మీదే ఆధారపడతాయి. రాకెట్‌ యొక్క కదలికా బలం ఆ రాకెట్‌ యొక్క ఇంజన్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇంజనే ఇంధనాలను మండించడం ద్వారా వచ్చే వాయువులను అతి వేగంగా వెనుకవైపు నుండి వెలువరించడం ద్వారా రాకెట్‌ను ముందుకు నడిపిస్తుంది. అన్నివైపులా మూసి ఉన్న ఒక పాత్రలో ఉండే ఒత్తిడి అన్నివైపులా సమంగా ఉంటుంది. కానీ, ఆ పాత్రకి కిందివైపు ఒక రంధ్రం చేస్తే ఆ పక్క అసలు ఒత్తిడే ఉండదు. దీనితో మిగతా వైపుల ఉన్న ఒత్తిడి మొత్తం ఆ రంధ్రానికి వ్యతిరేకదిశలో పనిచేస్తుంది. లోపల ఇంధనం మండించగా వచ్చిన వాయువులు తప్పించుకోటానికి ఒక మార్గంగా ఈ రంధ్రం ఉపయోగపడుతుంది. ఈ రంధ్రానికి బదులు ఒక నాజిల్‌ (పద్ధతిగా మలచబడిన సన్నని గొట్టము)ను ఉంచితే ఆ పక్క వెలుపలికి వచ్చే వాయువుల వేగం కొన్ని రెట్లు ఎక్కువవుతుంది. న్యూట్రన్‌ మూడవ సిద్ధాంతం ప్రకారం ఇలా వేగంగా వెలుపలికి వచ్చే వాయువులు వాటి వ్యతిరేకదిశలో సమానమైన వత్తిడి కలిగిస్తాయి. ఈ వత్తిడే ఆ వస్తువును ఎంతో వేగంగా ముందుకు నడిపిస్తుంది.

ముఖ్య భాగాలు..

రాకెట్లో ప్రొపెల్లెంట్‌ ట్యాంక్‌, ఒకటి లేదా ఎక్కువ రాకెట్‌ ఇంజన్లు, నాజిల్స్‌, దిశను స్థిరపరిచే పరికరాలు, జెట్లు తదితరాలు ఉంటాయి. ఏరోడైనమిక్‌ సూత్రాల ఆధారంగా రాకెట్ల లక్ష్యాల్ని నియంత్రిస్తారు.


ఇది ఒక ఖండాంతర, వ్యూహాత్మక క్షిపణి. 2012, ఏప్రిల్‌ 19న పరీక్షించబడింది. దీనిలో ఘన ఇంధనం కలిగిన 3 దశల రాకెట్‌ ఇంజన్లు ఉన్నాయి. అధికార ప్రకటన ప్రకారం ఐదువేల కిలోమీటర్లు దూరంలోగల లక్ష్యాన్ని వెయ్యి కిలోల బరువు గల బాంబులతో దాడి చేయగలదు. ఒకే సమయంలో బహుళ లక్ష్యాల్ని స్వతంత్రంగా దాడి చేయగల సాంకేతిక సదుపాయం దీనిలో ఇమిడి ఉంది.

మనదేశంలో..

మొదట 1780లో టిప్పుసుల్తాన్‌ సైనికులు బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యంపై 'గుంటూరు పోరు'లో వివిధ రాకెట్‌ రకాల్ని ప్రయోగించి, విజయం సాధించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ఆయుధాల అభివృద్ధికి ఒక ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటైంది. ఇదే డిఫెన్స్‌ రీసెర్చి డెవలప్‌మెంట్‌ లాబరేటరీగా రూపాంతరం చెందింది. ఇది హైదరాబాద్‌లో ఉంది. 1970 దశకంలో ఫ్రాన్స్‌ లైసెన్స్‌తో ట్యాంకులను విధ్వంసం చేయగల క్షిపణులు తయారుచేయబడ్డాయి. 1983లో డాక్టర్‌ అబ్దుల్‌కలాం నేతృత్వంలో సమగ్ర గైడెడ్‌ క్షిపణుల అభివృద్ధిపథకం ప్రారంభించబడింది. ఒకేసారి ఐదురకాలైన క్షిపణులను రూపొందించే కార్యక్రమం చేపట్టబడింది. ఇవి త్రిశూల్‌ (షార్ట్‌రేంజ్‌ - సర్ఫేస్‌ టూ ఎయిర్‌), ఆకాశ్‌ (మీడియం రేంజ్‌-సర్ఫేస్‌ టూ ఎయిర్‌) నాగ్‌ (3వ తరం, ట్యాంకుల్ని విధ్వంసం చేయగల క్షిపణి), ఫృథ్వి (షార్ట్‌ రేంజ్‌ - సర్ఫేస్‌ టూ సర్ఫేస్‌), అగ్ని (ఇంటర్మీడియేట్‌ రేంజ్‌) తయారుచేయబడ్డాయి. సబ్‌మెరైన్‌ నుండి ప్రయోగించగల ఈ రకం క్షిపణలు తయారీలో ఉన్నట్లు సమాచారం. ఫృథ్వి అగ్నిక్షిపణులు అణుబాంబులను కూడా తీసుకెళ్లగలవు.

Wednesday, 2 May 2012

చీమ మనుషులు


  • నిర్వహణ: గోపాలం కెబి gopalvy@gmail.com
  • 23/04/2012
ఈ ఫ్రపంచంలో ఉండే జీవరాశులన్నింటినీ తెచ్చి ఒక చోట కుప్ప పోస్తే, అందులో పావు వంతు మనుషులు ఉంటారు. ఆశ్చర్యంగా మరోపావు వంతు చీమలుంటాయి. చీమలంత విజయవంతంగా బతికే జీవి మరొకటి లేదంటారు ప్రకృతి పరిశీలకులు. ఈ ప్రపంచంలో ఒక్క అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని చోట్లా చీమలున్నాయి. మనకు అప్పుడప్పుడు చీమలతో చికాకు కలుగుతుంది. కానీ, చీమలు లేని ప్రపంచం కూడా చిత్రంగా ఉంటుందేమో! ఎడ్వర్డ్ విల్సన్ అనే హార్వర్డ్ పరిశోధకుడు చీమల తీరు గురించి చాలా పరిశోధించాడు. వాటి విజయం వెనక దాగే లక్షణాల గురించి చెపుతూ విల్సన్ మనుషుల గురించి కూడా వ్యాఖ్యానించాడు. గతంలో పులిట్జర్ బహుమతి కూడా గెలిచిన ఈ పరిశోధకుడు ‘ద సోషల్ కాంక్వెస్ట్ ఆఫ్ ద ఎర్త్’ (్భమి మీద సాంఘిక విజయం) అనే శీర్షికతో తన 27వ పుస్తకాన్ని ఈ మధ్యనే వెలువరించాడు. చీమలయినా, మనుషులయినా కలిసి బతకడమనే పద్ధతి కారణంగానే ఇంత విజయం సాధించినట్లు విల్సన్ ఆ పుస్తకంలో వివరించాడు.
చీమలు తమ స్థావరాలను కాపాడుకునేందుకు, కలసికట్టుగా, ప్రాణాలకయినా తెగించి పోరాడతాయి. స్థావరం ఎంత పెద్దది, విస్తారమయినదీ అయితే వాటి రక్షణ వ్యవస్థ కూడా అంతే గట్టిగానూ ఉంటుందని పరిశోధనలో తెలిసింది. ఆఫ్రికా, ఆసియాలలోని భూమధ్య రేఖా ప్రాంతం అడవులలో వీవర్స్ (నేతగాళ్లు) అనే రకం చీమలుంటాయి. అవి తామున్న చోట చుట్టూ పట్టుతో ఆకులను కుట్టి గూళ్లు తయారుచేసుకుంటాయి. మరో ప్రాణి వచ్చిందంటే వాసనతోనే పసిగట్టి, ఫార్మిన్ ఆసిడ్‌ను వాటిమీదకు ఆయుధంగా చిమ్ముతాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాలమన్ దీవులలో సైనికులు శత్రు సైనికులకన్నా ఈ చీమలకు ఎక్కువ భయపడేవాడని విల్సన్ రాశాడు. ఈ రకంగా చీమలలో సంఘీభావం, రక్షణ పద్ధతి ఎంతో గట్టిదని చెపుతూ, మానవులది కూడా ఇదే తీరంటాడు ఈ పరిశోధక రచయిత. చీమలది చిన్న ప్రపంచం. మిగతా పురుగులు వాటికి శత్రువులు. మనుషులది పెద్ద ప్రపంచం. దానిమీద పూర్తిగా అధికారం సంపాదించి నియంత్రించేదాకా మానవులు రాగలిగారు. అటు చీమలకు, ఇటు మనుషులకు తమ ప్రపంచాలమీద ఇంతగా అధికారం రావటానికి సహకార గుణం, సంఘీభావం, స్వార్థాన్ని కొంతవరకైనా పక్కన పెట్టడం, నేను అన్న భావానికి దూరంగా అందరితో కలిసి అవకాశాలను అందిపుచ్చుకోవడం, మనమంతా ఒక్కటే అన్న భావం లాంటి లక్షణాలు స్తంభాలుగా నిలిచాయని విల్సన్ వర్ణించాడు.
ఈ ప్రపంచంలో గుంపులుగా బతికే జంతువులు చాలా ఉన్నాయి. వాటిలోనూ మంచి ‘గుంపు’ భావన ఉంది. కానీ, అంతకుమించిన సంఘీభావం మరొకటి ఉంది. అది కలిగిన గుంపులో తరతరాల జీవులు కలిసి ఉంటాయి. పనులను పంచుకుంటాయి. ఆత్మత్యాగానికి వెనకాడవు. గుంపు అవసరాల ముందు స్వంత అవసరాలు తక్కువగా కనిపిస్తాయి. ఈ రకం అతి సామాజికత అంత సులభం కాదు. మామూలుగా గమనిస్తే మనుషులకు కూడా ఎవరి యావ వారిదేనన్నట్టు ఉంటుంది. అయినా కలిసి బతకడం కారణంగా ఎన్నో లాభాలు కనబడుతున్నాయి. జీవపరిణామక్రమంలో ఈ అతి సామాజికత అన్నది చాలా ముఖ్యమయిన లక్షణం అంటాడు విల్సన్. నీటిలో నుంచి ప్రాణులు భూమి మీదకు రావటం, రెక్కల సాయంతో ఎగరడం, పువ్వులు, వాటివల్లజాతి కొనసాగటం లాంటి లక్షణాలతోబాటు ఈ సహజీవనాన్నికూడా లెక్కించవలసిన అవసరముందని ఆయన అభిప్రాయం. ‘జీవులెన్ని ఉన్నా, ఈ సామాజికత గలవి వాటి మధ్యలో సూపర్ జీవులయ్యాయి’ అంటాడాయన. ఈ సూపర్ జీవులలోని సంక్లిష్టత మిగతా రకాలకు వీలుకాలేదు. తమది అంటూ ఒక స్థావరం, ఎంత తిరిగినా తిరిగి అక్కడికే చేరాలన్న బలమయిన ఆకర్షణ ఈ సామాజికతకు కేంద్ర బిందువు. ఈ కేంద్ర బిందువునే తమ గూడుగా మలుచుకుని జీవులు దాన్ని అన్నిరకాలా రక్షించుకునే ప్రయత్నం చేశాయి. మానవుడు కూడా అదే మార్గాన నడిచాడు. ఒక పుట్ట, లేదా తేనె తెట్టె, అలాగే ఒక పల్లె, ఒక గుహ! అక్కడికి చెందనివారు ఎవరైనా వచ్చారంటే తరిమి కొట్టవలసిందే!
కోతి జాతులలో ఈ లక్షణం మొదలయింది మానవులతో మాత్రమే. సామాజికతను మానవులు మరింత ఎత్తులకు చేర్చారు. మిగతా కోతి రకాలకు ఇళ్లు, గూళ్లు లేవు. నియాండర్‌తాల్ మానవులు కూడా ఇల్లుకట్టుకునే ప్రయత్నం అంతగా చేయలేదు. ఇల్లు కట్టుకుని, ఊళ్లుగా వెలసిన ఆధునిక మానవుల ముందు.. అందుకే వారు నిలువలేకపోయారు. చీమల ముందు మిగతా పురుగులలాగే తల వంచి తప్పుకున్నారు. అయినా, మనిషి- చీమలు మిగతా సామాజిక జీవుల మాదిరి నడవలేదంటాడు విల్సన్.
మనిషి శరీరం తీరు, తెలివి, భావాలు, ఈ మార్గాన్ని మరో పక్కలు మలిపాయి. మనిషి భూమికి పరిమితమయ్యాడు. అవసరం కొద్దీ నిప్పును తయారుచేసి వాడుకున్నాడు. పాత పనిముట్లనుంచి కొత్తదానికి మళ్లాడు. భూమి మీద జంతువులు చాలామటుకు చిన్న శరీరం గలవి. మనిషి శరీరం వాటికంటే పెద్దది. అన్నిటికీ మించి మనిషి చేతులను గొప్పగా వాడుకున్నాడు. ఏ గిట్టలు, గోళ్లు చేయలేని పరిశీలన చేతుల కారణంగా వీలయింది. వేళ్లు ముడుచుకునే రకంగా ఉన్నాయి. బొటనవేలు వాటికి ఎదురుగా రాగలుగుతుంది. దేన్నయినాపట్టి, ఎత్తి, కంటిముందుకు తెచ్చి పరిశీలించడం వీలయింది. చేతులతో మరెన్నో చిత్ర విచిత్రమయిన పనులు వీలయ్యాయి.
మనిషిలో నాటి నుంచి నేటివరకు ఒక అవసరం కోసం అందరూ కలిసి పనిచేసే లక్షణం ఉంది. అయినా చిన్న కారణంతో యుద్ధాలు చేసే లక్షణం కూడా ఉంది. ఇక్కడ నిర్ణయం రకరకాల స్థాయల్లో జరుగుతుంది. మనవారికోసం ప్రాణాలకు తెగించడమూ ఉంది. చిన్న భావన పేరుతో ప్రాణం తీయడం కూడా ఉంది. సామాజికత గురించి, అడుగడుగునా గుర్తుచేయవలసిన అవసరం ఉంటున్నది. మనుషుల సామాజికతలో అన్నిటికన్నా మంచి లక్షణంతో పాటే, అధమ లక్షణం కూడా కనబడుతున్నది. మరి ఇది చీమలోని సామాజికతతో సమమయిన లక్షణం కానే కాదు. అందుకు కారణం ‘మన భావజాలం పాత రాతియుగం నాటిది, సాంకేతిక శక్తి మాత్రమే ఈ నాటిది కావడం’ అంటాడు విల్సన్. మనిషికి శత్రువు.. ఈ రకంగా మనిషే! ఇక్కడ సామాజికతకు అర్థం మారుతుంది!
మనం చీమలం కాము. చీమ మనుషులమైనా కాగలుగుతామా..?

సైన్సు.. ఆలోచనలు


  • నిర్వహణ: గోపాలం కెబి
  • 30/04/2012
ఆలోచనలున్నాయని తెలుసు. వాటిని మన పద్ధతిలో నడిపించవచ్చునని మాత్రం తెలియదు. సైన్సు ఉందని తెలుసు. దాన్ని గురించి ఆలోచించడం మాత్రం తెలియదు. అసలు ఆలోచనలన్నీ సైన్సు పద్ధతిలో నడవవచ్చునని మనకు అసలే తెలియదు. నిత్యం బతుకుదారిలో ప్రతి పనికీ కారణాలు, పద్ధతులు మనకు తెలియకుండానే వెదుకుతాం. ఆ తీరు వేరు, సైన్సు తీరు వేరు అనుకుంటాం. అందుకు కారణం మనం సైన్సు ఉందనీ, దానికి ఒక పద్ధతి ఉందని పట్టించుకోకుండానే బతకడం. సైంటిస్టుల బుర్రనిండా వారికి కావలసిన విషయాలకు సంబంధించిన ఆలోచనలు తిరుగుతుంటాయి. వాళ్లకు ప్రపంచమంతా సైన్సుగానే కనబడుతుంది. కానీ, ఆ ఆలోచనలు నడిచే దారికీ, మామూలు ఆలోచనల దారికీ తేడా లేదని ఎంతమందికి అర్థమయింది?
ప్రపంచంలో జరుగుతున్న చాలా సంగతులు మనకు వెంటనే అర్థం కావు. కొన్ని మరీ ఆశ్చర్యం కలిగించే రకంగా కూడా ఉంటాయి. అంతా మ్యాజిక్‌లాగ ఉంటుంది. మెజీషియన్స్ కొన్ని ట్రిక్కులు ఎలా చేశారో చెపుతారుకూడా. చెప్పనివాటి వెనుకనున్న రహస్యం అర్థం చేసుకోవాలని మనం ఎప్పుడయినా ప్రయత్నించవచ్చు. ప్రయత్నించిన వారందరూ సైన్సుపద్ధతి ఆలోచనలు కలిగినవారే. ఇంటి తలుపు తెరిస్తే కిటికీ దఢాలున మూసుకుటుంది. అంత వేగంగానూ తిరిగి తెరుచుకుంటుంది. కిటికీ రెక్కకు అడ్డుపెట్టలేదని అర్థమవుతుందిగానీ అది తెరుచుకోవడం, మూసుకోవడం ఎందుకు జరిగాయన్న ప్రశ్న తోచకపోవచ్చు. తోచినా పోనీలే?! అనిపించవచ్చు. కొంతమందికి మాత్రం తలుపును నాలుగుసార్లు తెరిచి, మూసి, కిటికీని పరిశీలించే ఆలోచన పుడుతుంది. చివరకు గదిలో గాలి ఒత్తిడి సంగతి కూడా తోచవచ్చు. ఆలోచిస్తే, చాలా సంగతుల వెనకనున్న రహస్యం బట్టబయలవుతుంది! ఈ సంగతులు ముందు.. అంత గొప్పవిగా తోచకపోవచ్చు. కానీ, ఈ ప్రపంచంలో జరిగే మామూలు విషయాల వెనుక కూడా ఆసక్తికరమైన సైన్సు ఉంటుంది. వాటిని గురించి తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి అర్థం కానివీ, కష్టమయినవీ మాత్రం కావు. సైంటిస్టులుకూడా తమ పరిశోధన పేరున ఈ పద్ధతులనే వాడుతుంటారు. అది మనిషి ప్రవర్తన గానీ, ప్రకృతిలోని అంశాలుగానీ, అర్థం కాదనిపించే ఆస్ట్రానమీ సంగతులు గానీ, అన్నింటిలోనూ ఒకటే పద్ధతి ఉంటుంది. నమ్మండి!
మనకు తెలిసీ తెలియక, మనమంతా సైన్సు పద్ధతిలో ఆలోచిస్తుంటాం. పనులు కూడా చేస్తుంటాం. మనం అట్లా చేస్తున్నామన్న ఆలోచన మాత్రం రాదు. అంతే తేడా!
గమనించిన అంశం గురించి ప్రశ్నిస్తాం
ఈ రోజు గుడ్డలు ఎందుకు త్వరగా ఆరలేదు? ఇవాళ చెమట ఎందుకు ఎక్కువగా పడుతున్నది? మొదలు నిత్యం తెలియకుండానే ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. చీమలకు వాటి చోటు ఎట్లా తెలుస్తుంది? దోమలకు మనం ఎట్లా దొరుకుతాం? ఇంకొంచెం ముందుకు వెళితే... అవి సైన్సు ప్రశ్నలవుతాయి. నాకు కోపం ఎందుకు వచ్చింది? ఆకలి ఎందుకు కాలేదు? అన్నా సైన్సు ప్రశ్నలే! నమ్మండి!
ప్రశ్న అడిగి ఊరుకుంటే జవాబు చెప్పేవారు ఎదురుగా ఉండకపోవచ్చు. కనుక మనమే ముందుకు సాగడానికి ప్రయత్నించాలి!
పరిశోధన సాగించండి
మీరు ఒక విషయాన్ని గమనించారు. దాన్ని గురించి ఆలోచించి ప్రశ్న అడిగారు. మరి ఆ అంశం గురించి ఇప్పటివరకు తెలిసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ప్రతిదినం వేసినట్లుగానే గుడ్డలుతికి ఆరవేశాం. ఎప్పటికీ వేసే చోటునే ఆరవేశాం కూడా. కానీ, అవి ఎక్కువయ్యి ఒకదానిమీద మరొకటి వేయవలసి వచ్చిందా? గాలి కదలకుండా మరేదయినా అడ్డుగా వచ్చిందా? లేక వాతావరణం తేమగా ఉందా? గుడ్డలు ఆరకపోవడానికి ఒక కారణం ఉండి తీరుతుంది. గుడ్డలు సరిగా పిండడం చేతకాలేదేమో?
అనుమానాలు రావాలి
అనుమానాలతో రకరకాల పరిస్థితుల గురించి మనకు ఆలోచనలు పుడతాయి.
స్వంత ఆలోచనలు కాస్త పక్కకు..
మనకు సాధారణంగా అలవాటుకొద్దీ, సమస్యకున్న ఒకరూపం మాత్రమే కనబడుతుంది. కొన్నిసంగతులను చూడలేకపోతాం. గుడ్డలు నిత్యం ఏ సమయానికి ఆరుతున్నాయని సంవత్సరమంతా గమనించి, వాతావరణంలో తేమ, వేడి గురించి కూడా తెలుసుకుని సంబంధాలను లెక్కవేస్తే, అది శాస్త్ర పరిశోధన అవుతుందని మనకు తోచదు. మరి చలికాలంలో కూడా బట్టలు త్వరగా ఆరతాయా?
మరింత సమాచారం, సాక్ష్యాలు వెదకాలి
వాతావరణంలో తేమ ఎప్పుడు ఎంత ఎక్కువ ఉంటుంది? చీమలకు, దోమలకు వాసనలు బాగా తెలుస్తాయని మనకు తెలుసా? ఇంటి తలుపు మూసి ఉన్నప్పుడు కిటికీ తెరిచి ఉన్నా గాలి అందులోనుంచి లోపలికి రాదు. తలుపు తెరవగానే అది తోసుకువస్తుంది. కిటికీ మూసుకుంటుంది. బలంగా తగిలినందుకు తిరిగి తెరుచుకుంటుంది.
అన్ని సంగతులనూ అర్థం చేసుకుని..
సాక్ష్యం, సమాచారాలను బట్టి మన ఆలోచనలు, నమ్మకాలు మారాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఒకేలా చెమట పట్టదు. తేమ పెరిగినా నాకు చెమట లేదుగనుక, తేమలేదు అనగలమా? ఈ విషయం గురించి ప్రపంచమంతటా ఉండే అనుభవాలుంటాయి. మన చుట్టుపక్కల చూచినా ఎన్నో వివరాలు తెలుస్తాయి.
ఇది కాదు.. అనే పద్ధతి
ఒక విషయానికి వంద కారణాలు కనబడతాయి. ఆలోచించి వాటిని.. ఇది కాదు, ఇది కాదు.. అంటూ సంఖ్య తగ్గిస్తూ పోవాలి. అనుభవం పాఠాలు చెపుతుంది. అందులో నుంచి మార్గాలు కనబడతాయి.
అయితే, సైన్సంతా ఇంతేనా అనేసి వెళ్లిపోకండి! కొన్ని ప్రశ్నలకు బుర్ర చించుకున్నా జవాబు తోచదు. అందుకు అవసరమైన సమాచారం, లెక్కలు బోలెడుంటాయి. ఆలోచన సాగితే, వేరే విషయాలు వంద తెలుస్తాయి కానీ, మొదటి ప్రశ్నకు జవాబు అందదు. నిజంగా ఇలా జరిగిందంటే, మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీరు శాస్ర్తియ పద్ధతిలో పడిపోయినట్లు లెక్క మరి! ముందుకు సాగితే ఆశ్చర్యాలకు, అద్భుతాలకు కూడా జవాబులు దొరుకుతాయి. శతాబ్దాల నుంచి మీలాగే ప్రశ్నలు అడిగి, ఎందరో సేకరించిన సమాచారం, మీ కొరకు ఎదురుచూస్తున్నది. తెలుసుకుంటే, బతుకు మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది. చుట్టూ చూడండి. పరిశీలించండి. ప్రశ్నలడగండి. సైన్సును స్వంతం చేసుకోండి!

Tuesday, 1 May 2012

ఆకాశంలో ఆకట్టుకున్న శుక్రుడు అత్యంత ప్రకాశవంతం కానున్న గ్రహం

వాషింగ్టన్, ఏప్రిల్ 30: ఈ వారంలో రాత్రి వేళ ఒకసారి బయటకు వెళ్లి ఆకాశం వైపు చూడండి! పశ్చిమం దిక్కున మిలమిల మెరిసే అనేక తారల మధ్య ప్రకాశవంతమైన చుక్క ఒకటి కనిపిస్తుంది. మనసును ఆహ్లాదపరిచే ఆ గ్రహమే శుక్రుడు! ఈ వారమంతా ఈ గ్రహం ఎన్నడూ లేనంతగా ప్రకాశిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే శుక్ర గ్రహం క్రమంగా సూర్యునికి, భూమికి దగ్గరగా వస్తుండటమే ఇందుకు కారణం.

ప్రస్తుతం ఇది అత్యంత ప్రకాశవంతంగా, పెద్దగా కనిపిస్తుందట! టెలిస్కోప్‌తో చూస్తే వీనస్ అద్భుతంగా కనిపిస్తుందని, కొన్ని వారాల పాటు ఇది భూమికి దగ్గరగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక జూన్ 6న సూర్యునికి, భూమికి మధ్యగా శక్రుడు వస్తాడని, దీంతో సూర్యునిలో శుక్రుడు ఒక నల్ల మచ్చగా కనిపిస్తాడని వెల్లడించారు. ఇది మళ్లీ 2117లోనే సంభవిస్తుందని చెప్పారు.