ప్రపంచంలో అధిక మరణాలకు కారణం గుండెజబ్బులు. ఎక్కువ ఉష్ణోగ్రతలవల్ల కలిగే మరణాలు రెండో కారణం. అంటే, అధిక ఉష్ణోగ్రతవల్ల కలిగే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అందువల్ల ఈకాలంలో ఎండబారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసుంటే ప్రమాదాలను చాలావరకు నివారించొచ్చు. నీరు తరచుగా తీసుకోవడం, ప్రయాణాలు చేస్తున్నపుడు ఇంటినుండి నీరు తీసుకెళ్లడం చాలా ఉపయోగపడుతుంది.
కాలానికి తగ్గట్లు నూలు దుస్తులు వేసుకోకపోవడం వడదెబ్బకు మరో కారణం. నైలాన్, పాలిస్టర్ దుస్తులు ఎండాకాలంలో గాలి సోకనివ్వవు. శరీరానికి చెమట పట్టనివ్వవు. ఆ కారణంగా ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
వేసవిలో వ్యక్తిగత శుభ్రత లోపించినపుడు చెమటకాయలు, దురదలు రావచ్చు. మామూలుగా ఎండ ఎక్కువగా ఉన్నపుడు 'ఇబ్బంది'గా , అసౌకర్యంగా అందరికీ అనిపిస్తుంది. అంతేకాకుండా చికాకు, చెమట, నోరు ఎండిపోవడం, తల తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది. సరైన సమయంలో నీళ్లు తాగనపుడు పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. ఒక్కోసారి తల తిరగడం, స్పృహ తప్పడం, కిందపడిపోవడం వంటివి ఆ వ్యక్తికి అపాయకరంగా మారతాయి. అలాంటి సమయంలో వైద్యుని వద్ద చికిత్స అవసరం.
పెద్దవాళ్లకంటే పిల్లలకు చెమటలు తక్కువ. ఇదికాక వాతావరణంలోని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆటల మూలంగా పిల్లల శరీరంలో వేడి ఎక్కువగా పుడుతుంది. అలాగే పొలంపనులు చేసేవారికి, వంటగదిలో ఎక్కువసేపు ఉండే మహిళలకు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుంది.
డా. శ్యామలాంబ, శిశు వైద్య నిపుణులు (వచ్చేవారం తరువాయి భాగం...)
No comments:
Post a Comment