Monday, 11 November 2013

పర్యావరణం

ముంచుకొస్తున్న ఉపద్రవం

           
                                 విద్యుత్ బల్బులు, కార్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, వంటకోసం కుకింగ్ ఓవెన్లు, చూలాలు, యంత్రాలు... మన జీవితంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క దానికీ పనిచేసేందుకు శక్తి కావాలి. జీవనం ఉన్న ప్రతీదీ, మొక్కలు, జంతువులు, మనుష్యులు-అన్నీ శక్తికోసం బయట వనరులపైన ఆధారపడతాయి. మొక్కలు సూర్యుడి వేడిమీద ఆధారపడతాయి. జంతువులు పెరిగేందుకు, పునరుత్పత్తికోసం పనిచేసేందుకు ఏదో ఒక రూపంలోని రసాయన శక్తిమీద ఆధారపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూగ్రహం మీద జీవితం సాధ్యం కావాలంటే శక్తి కావాల్సిందే.
                               శక్తినిత్యత్వ సూత్రం గురించి మీరు విన్నారు కదా? శక్తిని పుట్టించలేం. శక్తిని నాశనం చేయలేం. ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మార్చగలం. అయితే ఇక్కడా మనం గమనించాల్సింది ఒకటుంది. కొన్ని రూపాల్లో శక్తిని పునరుద్ధరించగలం. సూర్యుడి నుంచి, గాలి నుంచి, నీటినుంచి తయారయ్యే శక్తి ఈ విభాగం కిందకు వస్తుంది. చెత్తా చెదారం, చనిపోయిన చెట్లు, విరిగిపోయిన కొమ్మలు, పేడ, పంటల వ్యర్థాలు ఇలాంటి బయోమాస్‌నుంచి కూడా మనం శక్తిని తయారుచేస్తున్నాం.
                                ఇక రెండవ విభాగం. ఇది పునరుద్ధణకు వీలులేని ఇంధనాలు. అన్ని రకాల శిలాజ ఇంధనాలు-బొగ్గు, ఆయిల్, సహజ వాయువులాంటివి ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు మనం వాడుతున్న ఇంధనాలు 300 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం తయారైనవి. అంటే డైనోసార్లకంటే ముందు కాలం నాటివి. నిరంతరం వాడుతూ ఉండడంవల్ల ఇవి క్రమంగా తగ్గిపోతున్నాయి. మనదేశంలో ఆయిల్ నిల్వలు మరో 19 సంవత్సరాలకు సరిపోతాయి. గ్యాస్ మరో 28 సంవత్సరాలు, బొగ్గు 230 సంవత్సరాలకు సరిపోతుంది. ఇవి ఒకసారి అయితే ఇక అంతే! దురదృష్టవశాత్తు మనం మనతోపాటు ఈ భూమీద ఉంటున్న అందరూ ఎక్కువగా శిలాజ ఇంధనాలమీద ఆధారపడుతూ ఉన్నాం రెండు వందల ఏళ్ల క్రితం శక్తివిప్లవం పారిశ్రామిక యుగం మొదలవడానికి కారణమైంది.
                             బొగ్గు, పెట్రోలియం, సహజవాయువుల వంటి శిలాజ ఇంధనాలను పెద్దమొత్తంలో వాడడంలో సమస్య ఏమిటంటే, ఇవి కావాల్సినంత లేవు. పైగా వాటివల్ల మన ఆరోగ్యానికి పర్యావరణానికీ తీవ్రమైన ముప్పు పొంచివుంది.
                            ఇందుకు మూలంగా నిలిచింది ఎక్కువ శక్తవంతమైన హైడ్రో కార్బన్‌లను కలిగి వున్న మామూలు నల్ల బొగ్గు. ఇది కలప స్థానాన్ని ఆక్రమించి వేల సంవత్సరాలపాటు ప్రాధమికమైన ఇంధనంగా కొనసాగింది. బొగ్గులో దాగివున్న శక్తి పారిశ్రామికవేత్తల అవసరాలను తీర్చింది. స్టీలును ప్రాసెస్ చేయాలన్నా, ఆవిరి యంత్రాలను నడపాలన్నా, యంత్రాలకు శక్తిని ఇవ్వాలన్నా బొగ్గే వాళ్లకు వరమైంది. ఆ తర్వాత పెట్రోలియం, సహజ వాయువులు ఎక్కువ శక్తిని కలిగి ఉన్న ఇంధనాలుగా నిలిచాయి. ఆ తర్వాత శాస్తవ్రేత్తలు యురేనియంతో అణుశక్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు.
                          ఇక అప్పటి నుంచి పెరుగుతున్న శక్తి అవసరాలను తీర్చుకునేందుకు నాన్ రెన్యువబుల్ వనరులపైన ఆధారపడడం మొదలుపెట్టాం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను పెద్ద మొత్తంలో వాడడంలో మరికొన్ని సమస్యలున్నాయి. వీటి లభ్యత పరిమితంగా ఉండమే కాక మన ఆరోగ్యానికీ, పర్యావరణానికీ హాని కలిగిస్తున్నాయి.
శిలాజ ఇంధనాలతో భూగ్రహానికి చేటు
                           ఇదిఇలా జరుగుతుంది.... వాతావరణంలో కర్బనం రెండు ఆక్సిజన్ అణువులతో కలిసి కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్టు కారణంగా భూమి గడ్డగట్టుకుపోకుండా ఉంటుంది. కాని మన శక్తి అవసరాలు రోజురోజుకు పెరుగుతుండి ఎక్కువ మొత్తాల్లో కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వచ్చి కలుస్తోంది. ఇందుకు మళ్లా కారణం శిలాజ ఇంధనాలే. వీటి పొగల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ. వాతావరణంలో ఇప్పుడు సగటున మిలియన్‌కు 380 పార్ట్‌ల కార్బన్ డైఆక్సైడ్ ఉంది. పారిశ్రామిక విప్లవం మొదలుకావడానికి ముందు ఇది 280 పిపిఎం ఉండేది. అంటే ఇప్పుడు 36 శాతం ఎక్కువైంది. శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కాలుష్యాలను తగ్గించకపోతే 2100 సంవత్సరం నాటికి ఉష్ణోగ్రత 3నుండి 6 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని పేరుగాంచిన వాతావరణ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. భూమి మీద వేడి పెరిగితే మంచు ఖండాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. తీరాన వున్న ద్వీపాలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.
                           గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. మంచు ప్రాంతాలకీ, ఉష్ణోగ్రతలకీ మధ్య ఉండే సంబంధాల వల్ల భూమి మీద ఉండే నీటి పరిమాణం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. 20వ శతాబ్దంలో మంచు ప్రాంతాలు కరిగిపోతున్న కారణంగా సముద్ర మట్టంలో 30 శాతం మార్పు వచ్చింది. వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వానలు కొన్ని ప్రాంతాల్లో పెరిగి మరికొన్ని ప్రాంతాల్లో బాగా తగ్గిపోతాయి. తుపానులు తరచుగా వస్తాయి. వడగాలులు, కరవులు పెరుగుతాయి. ప్రకృతి విపత్తులు పెరిగిపోతాయి. భూకంపాల తీవ్రత పెరుగుతుంది. అలాస్కాలో కరుగుతున్న మంచు పర్వతాలు, సముద్రంలో మంచు, పర్మాఫ్రాస్ట్ వంటి వాటి కారణంగా సముద్ర లోటు సంవత్సరానికి 3 మిల్లీ మీటర్లు పెరుగుతోంది. సరైన చర్యలు తీసుకోకపోతే 2100 సంవత్సరంనాటికి సముద్ర మట్టం 18నుండి 59 సెంటీమీటర్ల వరకుపెరగవచ్చు. దీనితో చిన్న చిన్న దీవులు, లోతట్టులో ఉండే డెల్టా ప్రాంతాలు, అంటే బంగ్లాదేశ్, ఈజిప్టు వంటి ప్రాంతాలు పూర్తిగా కనుమరుగవుతాయి.
                          కనుక శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మన ముందు రెండు ముఖ్యాంశాలు నిలుస్తాయి. వీటిలో ఒకటి పరిమితంగా ఉన్న ఇంధన వనరులు. కాని వీటి వాడకం మానవజాతికి ఒక వ్యసనంలా మారిపోయింది.
శిలాజ ఇంధనాలు-మన ఆరోగ్యం
                          శిలాజ ఇంధనాలను వాడడంవల్ల కాలుష్యాలు పెరుగుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డై-ఆకైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, గాలిలో తేలాడే ధూళి కణాల వంటివి వీటిలో కొన్ని. ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపేవే. కంటి మంట, తలనొప్పి, తల తిరుగుడు వంటి చిన్నపాటి అనారోగ్యాలు మొదలు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, శ్యాసకోశ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్ వంటివి కూడా రావచ్చు.
ఇప్పటికే ఒక స్థాయికి మించి వీటిని మనం వాడేశాం. కనుక భూమి ఒక అతి పెద్ద శక్తి సంక్షోభ దిశలో పయనిస్తోంది. ఇక రెండవది మనం ఈ నేల మీద బతికి బట్టకట్టడానికి కారణం ప్రకృతి సహజంగా ఇక్కడ వాతావరణంలో సమతుల్యత ఉండడం. మనం శక్తి వనరులను విపరీతంగా వాడడంవల్ల ఈ సమతుల్యత తలకిందులవుతోంది. వాహనాల పొగలు, కర్మాగారాల్లో మండించే ఆయిల్స్ వల్ల ఈ భూగ్రహం ఇప్పుడు మరుగుతున్న కుండలా తయారైంది.
మరి ఏం చేద్దాం?
జీవంపోసే శక్తి ప్రాణం తీసేశక్తిగా మారకూడదంటే మనం ఏం చేయాలి?
తక్కువ వాడదాం: శక్తి పరిరక్షణకు మొదటగా చేయవలసింది శక్తిని ఆదా చేయడం. అవసరం లేనప్పుడు విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ఇందులో ఒకటి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎదురు చూస్తూ ఆగి ఉన్నప్పుడు వాహనం ఇంజన్‌ను ఆపివుంచడం మరొకటి. ఇలా వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇక ఆ తర్వాత చేయవలసింది శక్తిని మరింత సమర్ధవంతంగా వాడుకునే ఉత్పత్తులు, పరికరాలు, సేవలమీద పెట్టుబడులను పెంచడం. ఉదాహరణకు కాంపాక్స్ ఫ్లోరసెంట్ లాంప్‌ల వాడకాన్ని పెంచడం. ఇది మామూలు బల్బులకన్నా 40 శాతం తక్కువ శక్తిని వాడుకుంటాయి. అలాగే ఇంధన సామర్ధ్యం ఎక్కువ ఉన్న వాహనానలు వాడడం, కొత్త వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ అవసరం.
                            ప్రత్యామ్నాయాలను వెతకాలి: ఎక్కువ కాలం పాటు ఏ సమస్యా లేకుండా వాడుకునేందుకు వీలైన ప్రత్యామ్నాయాలను కనుగొనేంనుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. పెద్ద మొత్తంలో సరసమైన ధరలో సమర్ధవంతమైన ఇంధనాలను పొందే ప్రయత్నం చేయాలి. సూర్యుడి నుంచి, గాలినుంచి, బయోమాస్‌నుంచి శక్తిని తయారుచేసి వాడుకునే పద్ధతులకు ప్రోత్సాహం ఇవ్వాలి. శిలాజ ఇంధనాల స్థానంలో వీటిని వాడడంవల్ల తక్కువ కాలుష్యం వస్తుంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా శక్తిని పొందడం సాధ్యం అవుతుంది. మనదేశంలో ఈ మార్పు ప్రభావం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎందుకంటే శిలాజ ఇంధనాలు లేదా వాణిజ్య పరమయిన శక్తిని ఎక్కువగా ఉపయోగించేది వారే కాబట్టి మన దేశంలో పట్టణ జనాభా మొత్తం జనాభాలో 30 శాతం. కానీ వీళ్లు వాణిజ్యపరమైన శక్తిలో 80 శాతానికి మించి వాడతారు. మిగిలిన 70 శాతం మంది ఇప్పటికీ వాణిజ్యేతర శక్తి వనరులైన వంట చెరుకు, పేడ, వ్యవసాయ పంటల మిగులు వ్యర్థాల వంటి వాటితో వంట చేసుకుంటూ ఇళ్లలో వెలుగుకోసం వాడుతున్నారు.

Courtesy with: ANDHRA BHUMI DAILY

No comments:

Post a Comment