Wednesday, 6 November 2013

చంద్రశేఖర వేంకట రామన్ 125 వ జన్మదినము సందర్బముగా

                                         



                  సర్‌ సి.వి.రామన్‌ : తిరుచురాపల్లి సమీపంలో తేది: 07-11-1888వ సంవత్సరంలో జన్మించారు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.
 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి
 పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌
 ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే
 బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు
 కొనసాగించాడు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 28-02-1828న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు.
 ఈ అంశం పై నేచర్‌ పత్రికలో ఆయన ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో
 రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. ఆయన పరిశోధన
 ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే గా జరుపుకుంటున్నారు.
            భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి,
 భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి
 సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).  1888 నవంబరు 7 న తమిళనాడులోని తిరుచినాపల్లిలో
 జన్మించి, తన రామన్ ఎఫెక్టుతో ప్రపంచ ప్రసిద్దిగాంచిన సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల
 అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత 
కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట
 మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి
 ప్రధముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి
 వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి
 ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు
 వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న 
ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు
 ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి
 అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్
 కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను
కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే
 ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగిసాయంకాలం 
5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.
         అతని తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది.
 అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన
 పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు.
 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చా డు.
 అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు
 నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను
 కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు
రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి
 రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి
 ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అ ని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను
నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు
 చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు.
1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు
 నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం
ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు.
 ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన
ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.
             అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా
 వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.
ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు.
 అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని,
 అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని
 ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో
నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న'
 అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల
పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి
 వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను
నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్
 అభివృద్దికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబరు 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం
 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని
 సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
విద్యార్ధినీ, విద్యార్ధుల్లో ఆయన స్పూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న
 ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును
 జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
                 జననం నవంబర్ 7 1888(1888-11-07) తిరుచిరపల్లి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం మరణం
 నవంబర్ 21 1970 (వయసు: 82) బెంగళూరు, కర్నాటక, భారతదేశం జాతీయత భారతీయుడు రంగము
భౌతిక శాస్త్రము సంస్థ భారత ఆర్థిక విభాగము ఇండియన్ అసోసియేషన్ ఫార్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఇండియన్
 ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాతృ సంస్థ ప్రెసిడెన్సీ కాలేజి ప్రముఖ విద్యార్ధులు జి.ఎన్.రామచంద్రన్ ప్రాముఖ్యత
 రామన్ ఎఫెక్ట్ ముఖ్య పురస్కారాలు,  నోబెల్ పురస్కారం,  భారతరత్న, లెనిన్
 శాంతి పురస్కారం.

No comments:

Post a Comment