ఆధునిక కాలం యువత ఎక్కువగా ఉపయోగిస్తున్న శక్తి పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌్) తక్షణ శక్తిని ఇస్తాయనేది వాస్తవం కాదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్.ఐ.ఎన్) శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా శక్తిపానీయాలపై పరిశోధన జరిగింది. ఎనర్జీ డ్రింక్స్ వాడకం పెరగడం, వాటి వలన యువతలో వస్తున్న మార్పులను వివరించడం కోసం, అలాగే ఉత్పత్తులను వినియోగించేవారు పెరగాలంటూ వ్యాపారవేత్తలు వాడుతున్న పదార్థాలను వివరించడం కోసం ఈ పరిశోధనకు పూనుకున్నామని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఐశ్వర్యా రవిచంద్రన్, జి.ఎమ్. సుబ్బారావు, వి. సుదర్శనరావులు చెబుతున్నారు. ఈ పరిశోధన ద్వారా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలను వారు తమ పరిశోధనా పత్రం ద్వారా హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ జాతీయ సెమినార్‌లో సమర్పించారు.
ఈ శక్తి పానీయాలను క్రమం తప్పకుండానూ, అప్పుడప్పుడూ వినియోగించే యువతను వారు ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. ఈ పరిశోధనా ఫలితాల ద్వారా శక్తి పానీయాలను ఎక్కువగా ఉపయోగించేవారిని ఒకసారి పరిశీలిస్తే విద్యార్థులు 47%), ఉద్యోగాలు చేసేవారు (14.5%), యువత (92%) ఉన్నారు. వీరిలో యౌవన దశలో ఉన్న యువత ఎక్కువగా శక్తిపానీయాలను ఉపయోగిస్తున్నారు. వీరి సామాజిక, ఆర్థిక వివరాలను పరిశీలిస్తే దిగువ తరగతి , మధ్యతరగతి వారి కన్నా ఎక్కువగా ఎగువ తరగతికి చెందిన యువత (71%) ఈ తక్షణ శక్తినిచ్చే శక్తి పానీయాలను వాడుతున్నారు.
ఇంతేకాక శక్తి పానీయాలను యువత ఎక్కువగా స్నేహితులతో (56.1%) ఉన్నప్పుడు, పార్టీలలో (43.3%), అలసటగా అనిపించి నప్పుడు (36.1%), ప్రదర్శనకు ముందు (28.8%) ఎక్కువగా వినియో గిస్తున్నారని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. శక్తి పానీయాలకు అలవాటు పడటానికి కారణాలను ఒకసారి పరిశీలిస్తే రుచి కోసం (64.4%), సువాసన కోసం (60.6%), తక్షణ శక్తి కోసం (57.2%) కోసం యువత ఎక్కువగా ఉపయోగిసున్నారని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
నోటికి రుచికరంగా ఉండడంతో అందరూ భ్రమపడే ఈ శక్తి పానీయాలలో కెఫీన్ ఎక్కువగా ఉండే విషయం ఎవ్వరికీ తెలియదని పరిశోధకులు అంటున్నారు. అందుకే యువత తక్షణ శక్తి కోసం ఈ డ్రింక్స్‌్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. గతంలో అమెరికా పరిశోధనలు కూడా ఇదే విఫయాన్ని ధ్రువీకరించాయి. ఈ శక్తి పానీయాల వల్ల రక్తపోటు పెరుగుతుందనీ, ఇవి గుండె జబ్బులకు కారణ మవుతున్నాయని పరిశోధకులు చెప్పారు. అందుకే మరి పైన పటారం లోన లొటారం లాంటి ఈ ఎనర్జీ డ్రింక్‌లకు దూరంగా ఉండండి.
Courtesy with: PRAJA SEKTHI
No comments:
Post a Comment