Monday, 27 February 2012

జ్వరం మీటరుతో జర జాగ్రత్త


ఇది వరకు జ్వరం చూసుకోవాలంటే డాక్టరు దగ్గరికి పరుగెత్తాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఇంట్లోనే ధర్మామీటరు పెట్టుకుని జ్వర తీవ్రతను తెలుసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కాని ధర్మామీటరు పొరపాటున చేయిజారి కిందపడితేనే ఇబ్బంది. ఎందుకంటే ఇందులో ఉండే మెర్క్యురీ అంటే పాదరసం పర్యావరణంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా చేటు తెచ్చి పెడుతుంది అంటున్నారు నిపుణులు. ఒకవేళ పొరపాటున మీ చేతి నుంచి ధర్మామీటరు జారి కింద పడి పగిలిపోతే ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా చెప్తున్నారు వాళ్లు.

చేయకూడనివి... * చీపురు లేదా వాక్యూమ్ క్లీనర్‌లతో శుభ్రం చేయకూడదు. * పాదరసం పడిన నేలపై నడవకూడదు. ఒకవేళ కాలికి ఉన్న చెప్పులకు పాదరసం అంటుకుంటే ఆ చెప్పులు వెంటనే వదిలేయాలి. * పాదరసాన్ని డ్రైయినేజిలో పోయొద్దు. అలా పోస్తే డ్రెయిన్ మూసుకుపోతుంది. సెప్టిక్ ట్యాంక్ కలుషితమయిపోతుంది. * పాదరసం పడిన గదిలో ఎవరినీ ఉంచొద్దు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే వెంటనే గది బయటకు పంపి గది మూసేయాలి. పాదరసం అంటిన బట్టల్ని, వస్తువుల్ని ముట్టుకోవద్దు.

చేయాల్సినవి... మెర్క్యురీని శుభ్రం చేసే వస్తువులు కిట్‌లా లభిస్తాయి. ఒకవేళ అలా లభించకపోతే విడివిడిగా ఆ వస్తువులను మీరే కొనుక్కోవచ్చు. లాటెక్స్ గ్లౌజులు, ట్రాష్ బ్యాగ్‌లు, జిప్ లాక్ బ్యాగ్‌లు, పేపర్ టవల్, కార్డ్‌బోర్డ్, ఐడ్రాపర్, షేవింగ్ క్రీమ్, చిన్న బ్రష్, ఫ్లాష్ లైట్, సల్ఫర్ పొడి (ఇది అవసరమనుకుంటేనే) కొనండి.

శుభ్రం చేయడం ఇలా... పాదరసం పడిన వెంటనే కాకుండా పావుగంట తరువాత శుభ్రం చేయాలి. అలాగే ఆ గది తప్ప మిగతా గది తలుపులన్నీ మూసేయాలి. గాజు ముక్కల్ని గ్లౌజులు వేసుకున్న చేతులతో కాగితపు టవల్ మీదకి తీసుకోవాలి. ఈ టవల్‌ను వెంటనే జిప్ లాక్ బ్యాగ్‌లో పడేయాలి. తరువాత నేలపైన ఇంకా ముక్కలేవైనా ఉన్నాయేమో గమనించండి. ఒకవేళ కరెంటు బల్బు కాంతిలో కనిపించకపోతే గదిలో లైట్లు ఆపేసి ష్లాష్ లైట్ వెలుగులో చూడాలి. చిన్న చిన్న ముక్కలు కనిపిస్తే వాటిని ఐ డ్రాపర్‌తో తీసి తడి పేపర్ టవల్ మీద వేయాలి.

దాన్ని కూడా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచాలి. ఆ తరువాత కొద్దిగా షేవింగ్ క్రీమ్‌ను బ్రష్ మీద వేసి కంటికి కనిపించని చిన్న చిన్న గాజు ముక్కల్ని తీసేయాలి. శుభ్ర పరచడానికి వాడిన వస్తువులన్నిటినీ ట్రాష్‌బ్యాగ్‌లో వేయాలి. ఈ బ్యాగ్‌ను బయో హజార్డస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి లేదా మునిసిపాలిటీలో వ్యర్థాల వ్యవహారాలను చూసే విభాగంలో ఇవ్వాలి. గదిని శుభ్రం చేసిన తరువాత 24 గంటల పాటు గాలి వెలుతురు వచ్చేలా ఉంచాలి. ఆ తరువాతే వాడాలి.

ఇంత శుభ్రం ఎందుకంటే... పాదరసం విడుదలయిన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు విషమయం అవుతాయి. దృష్టిలోపం, శరీర కదలికల్లో ఇబ్బంది, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్కువ మోతాదులో పాదరసాన్ని పీల్చితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మెర్క్యురీ ధర్మామీటర్లు కాకుండా డిజిటల్ ధర్మామీటర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి ఈ మధ్య. వీలయితే వాటిని ఉపయోగించొచ్చు.

No comments:

Post a Comment