Wednesday, 22 February 2012

కళ్లు అదరడం-అశాస్త్రీయం

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
ఆడవాళ్లకు ఎడమకన్ను, మగవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిదని, అందుకు భిన్నంగా అదిరితే దురదృష్టమని అంటారు. నాకు కూడా అనుభవంలో అలాగే జరిగింది. ఇది వాస్తవమేనా?
- బి. మల్లీశ్వరి, దాచేపల్లి, గుంటూరుజిల్లా.
ఎడమ, కుడి, కళ్లు అదరడం, ఆడ, మగ ఇవన్నీ వాస్తవాలు. అదృష్టం, దురదృష్టం మిథ్యా పదాలు. వాటికి అర్థంపర్థం లేదు. కష్టం, లాభం, సామాజికపుటంశాలు. సంబంధం, సహేతుకం, అస్తిత్వంపరంగా వైవిధ్యం ఉండే పలు అంశాల్ని ఒకే గాటనగట్టి కలగాపులగంగా కలపడం అవివేకం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ధూమకేతువు (తోకచుక్క(comet)) కనిపిస్తే అది గ్రామానికో, దేశానికో అశుభ సూచకం అని నమ్మేరోజులు పాతకాలంలోవి. అయినా తోకచుక్కలకు, అర్థంపర్థంలేని అశుభం, శుభాలకు లంకె పెట్టే మూఢనమ్మకం నేటికీ ప్రజల్లో కొనసాగుతోంది. అలాగే ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరం (కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కి.మీ. వేగంతో వెళితే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని ఓ కాంతి సంవత్సరం, light year, అంటారు.) లో ఉన్న నక్షత్రరాశుల భంగిమకు, ఇక్కడ భూమ్మీద ఉన్న మనుషుల కష్టనష్టాలకు, ఉద్యోగసద్యోగాలకు, పెళ్లిళ్లు పెటాకులకు, విదేశీ ప్రయాణాలకు లింకుపెట్టే జ్యోతిష్యశ్శాస్త్రము ఓ కుహనా శాస్త్రమే అయినా ప్రజల్లో చాలామంది వేలం వెర్రిగా రాశిఫలాలను నమ్ముతున్నారు. ఎందరో మేధో సోమరులు ఆ మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంతకన్నా ఘోరమైన విషయం ఈ ఎడమకన్ను, కుడి కన్ను అదరడాలను ఆడామగా లైంగికత్వపు లక్షణాలతో కలగలిపి, వాస్తవదూరాలైనా అదృష్ట, దురదృష్ట మసాలాలను దట్టించి, ప్రజల కష్టాలనెత్తిన పులమడం.

బాగా నిద్రపోయి, సరైన విశ్రాంతి తీసుకుంటే కన్ను అదరడాలు ఉండవు. పరీక్షల మూలానో, ఇంట్లో కార్యక్రమాల వల్లనో, మరేదైనా వృత్తిపరమైన వత్తిళ్ల వల్లనో అడపదడపా మనకు సరిపడా నిద్ర లభించకపోవచ్చు. అంటే కంటి రెప్పల్ని అదే పనిగా తెరిచే ఉంచాల్సిన అగత్యం లేదా కంటికి విశ్రాంతినివ్వకుండా కనురెప్పల్ని పదేపదే ఆర్పాల్సిన అవసరం పరిమితిని మించిన స్థితి తటస్థ పడిందన్నమాట. లేదా పరీక్షల కోసం అదేపనిగా చదువుతుండడం వల్లనో, కంప్యూటర్‌ మానిటర్‌ దగ్గర ఎక్కువసేపు పనిచేయడం వల్లనో, సన్నని అక్షరాలను కష్టపడి చదవవలసిన పరిస్థితి రావడంవల్లనో కంటికి శ్రమ అధికం కావచ్చును. అటువంటి పరిస్థితుల్లో కంటి కదలికలను కలిగించే కండరాలను నియంత్రించే మెదడు భాగాలు బాగా అలసిపోయి ఇబ్బందిపడతాయి. దీన్నే ఫ్యాటిగ్‌ (fatigue) అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి కండరాలను నియంత్రించే మెదడు యంత్రాంగం కొద్దిగా గతి తప్పి, లయ తప్పిన సంకేతాల (arrtythematic impulses) ను కండరాలకు అందిస్తుంది. ఆ సమయంలో కంటి కండరాలు స్వల్పంగా అదరడం సంభవిస్తుంది. ఇది కేవలం అరుదైన, అసాధారణమైన విషయం కాబట్టి, ఏదో ఒక కన్ను కండరాలు మాత్రమే కదుల్తాయి. ఒకోసారి ఈ పరిస్థితి కుడికన్నుకు రావచ్చును. మరోసారి ఎడమకన్నుకు కలగవచ్చును. అలసిపోవడం, మెదడు పనిచేసే విధానం, కంటిచూపు యంత్రాం గం, కంటి కదలికల యంత్రాంగం లైంగిక భేదాలకు సంబంధించిన అంశం కాదు. కాబట్టి ఆడవారికైనా, మగవారికైనా కన్ను అదరడం మామూలే. ఒక్కోసారి నరాల బలహీనత ఉన్నవారికి, మెదడులో ఏదైనా సమస్యలు ఉన్నవారికి కూడా తరచూ కన్ను అదరడం సాధారణం.

కాబట్టి కన్ను అదరడం అన్న విషయం పూర్తిగా జీవ భౌతికచర్య (physiological action). కేవలం x, y క్రోమోజోముల ప్రభావంతో దేహంలో కలిగే లైంగిక అంశాలైన వక్షం, గడ్డం, మీసం, గొంతు ధ్వని, జననాంగాలు (genetalia), మొదలైనవాటిని మినహాయిస్తే మిగిలిన జీవప్రక్రియలన్నింటినీ (కన్ను అదరడంతో పాటు) స్త్రీపురుషులిరువురిలోనూ ఒకే విధమైన యంత్రాంగం నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా చూసినా కుడికన్ను మగవారికి, ఎడమకన్ను ఆడవారికి అదరడాన్ని లైంగికపుటంశంగా పరిగణించడం అశాస్త్రీయం. అసంబద్ధం. నిర్హేతుకం; కన్ను అదరడం ప్రమాదంలేని అవాంఛనీయమైన నాడీ ప్రక్రియ కాబట్టి లింగమేదైనా (ఆడైనా, మగైనా) అది కుడికన్నయినా, ఎడమకన్నయినా యంత్రాంగం ఒకటే. ఒకవేళ కన్ను అదరడం మంచిది కాదనుకుంటే అది ఏ కన్ను అదిరినా మంచిది కాదు. ఎడమ కన్ను అదిరితే ఆమోదయోగ్యంగానూ, కుడికన్ను అదిరితే ఆమోదరహితంగానూ లెక్కగట్టకూడదు. కన్ను అదరడం మంచిది కాదనుకుంటే ఆడవారికి అదిరినా, మగవారికి అదిరినా ఒకే విధమైన దృక్కోణంతో చూడాలి. శుభము, అశుభము, అదృష్టము, దురదృష్టము కేవలం కాల్పనిక మిథ్యార్థ (abstract) పదాలు. ఒకవేళ వాటిని మనం ఆనవాయితీగా కష్టంలేని పరిస్థితులను శుభం లేదా అదృష్టం అనీ, కష్టమైన పరిస్థితుల్ని అశుభం లేదా దురదృష్టము అని సర్దుకున్నా వాటికి సాపేక్షత (relative)ను ఆపాదించి చూస్తాము. కోట్లు దండుకొనే పెట్టుబడిదారుడికి ఓరోజు ఉన్నట్టుండి తాత్కాలికంగా ఓ లక్షరూపాయలు నష్టం కలిగితే అతనికి కష్టం వచ్చినట్లు, అతనికి అశుభం జరిగినట్లు వాళ్ల ఇంటిల్లిపాదీ భావిస్తారు.

'గరకునేలపై గురకలు వినరా' అంటూ ప్లాట్‌ఫారం మీద పడుకొని నిద్రించే పేదవాడి చితికిన బతుకుల్ని అదృష్టంగా చలామణీ చేసిన చాతుర్యం గల కవులకు ధనికుల ఇళ్లలో పరిమిత లాభాలే నష్టాలుగా కన్పిస్తాయి. 'కుడి కన్ను అదిరింది కుర్రోడా' అంటూ అశాస్త్రీయపుటంశాలను వల్లెవేస్తూ సామాజిక కర్తవ్యాలను విస్మరించే నేపథ్యరంగాల నేపథ్యంలో కళ్లు అదిరిపోయే కుళ్లు ఉంటుంది. ఇప్పటికీ భ్రూణ హత్యలు, గృహహింస, ఆర్థిక వివక్ష, విద్యా వివక్ష, పాలనా వివక్ష, సామాజిక వివక్ష, సాంస్కృతిక వివక్ష మొదలైన ఎన్నో వివక్షలకు లోనవుతున్న మహిళల కన్ను అదరడాల్లో కూడా మగవారితో సారూప్యత లేకుండా వివక్ష చూపుతున్నారు. ఆడవారికి కుడికన్ను అదిరితే అశుభమట. ఉత్తుత్తి అంశాల్లో కూడా ఆడవారికి తక్కువ హోదా (ఎడమవైపు) ఉంటేనే మంచిదట. ఎక్కువ హోదా (కుడివైపు) ఉన్నవన్నీ మగవారికే మంచివట. మీ కన్ను అదరడానికి, మీకు అనుభవంలోకి వచ్చిన శుభాఅశుభాలకు లంకె పెట్టడం పైవిధంగా చూస్తే అశాస్త్రీయం. నాకు జ్వరమొచ్చినప్పుడు రోడ్డు మీద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వ్యక్తి బస్సెక్కాడనుకుందాం. ఇక దానర్థం రోడ్డు మీద ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వాడు ఎక్కితే ఇంట్లో ఉన్న నాకు జ్వరమొచ్చిందని అనుకోవడం ఎంత అశాస్త్రీయమో మీ కన్ను అదరడానికీ మీకు కలిగిన శుభాఅశ భాలకు లింకు పెట్టడం కూడా అంతే అశాస్త్రీయం. ప్రజల కష్టనష్టాలకు కళ్లు అదరడానికి ఏమాత్రం శాస్త్రీయ ఆధారం లేదు. అలా ఉందనుకోడం పూర్తిగా అవాస్తవం.

No comments:

Post a Comment