Wednesday, 22 February 2012

'కల్కి' విష్ణమూర్తి అవతారమా?

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 10 Mar 2010, IST  
  • విశ్వాసాలు.. వాస్తవాలు...
'మాష్టారూ! కల్కి భగవాన్‌ దేవుడేనా?' పటేల్‌ హైస్కూల్‌లో 'దేశభక్తి- శాస్త్రీయ అవగాహన'పై క్లాసు తీసుకోవడానికి వెళ్లినపుడు శశికాంత్‌ అనే విద్యార్థి అడిగిన ప్రశ్న ఇది. 'శశికాంత్‌! నీవు అడిగింది 'కల్కి భగవాన్‌'ని అని ప్రకటించుకున్న విజయకుమార్‌ అనే వ్యక్తి గురించేనా?' అని నేను అడిగాను. 'అవును మాష్టారూ! ఆయనకు లక్షలమంది భక్తులున్నారు. ఆయన కాళ్ళు కడగాలంటే లక్ష రూపాయలు ఆయనకివ్వాలట.' అన్నాడు శశికాంత్‌. ''ఇంతకీ ఆయన తనను గూర్చి ఏమని ప్రకటించుకున్నాడో తెలుసా?' 'తెలుసు మాష్టారూ! తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన 'కల్కి'నని ఆయన ప్రకటించుకున్నాడు' అని క్లాసులోనే ఉన్న నిర్మలా టీచర్‌ బదులిచ్చింది. 'ఏ సంవత్సరంలో?' '1989లో మాష్టారూ!' మరో టీచర్‌ సుజాత జవాబిచ్చారు. 'ఇది 2010. అంటే ఆయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమని ప్రకటించుకొని ఇప్పటికి 21 ఏళ్ళయింది. ఇన్నేళ్ళలో దేశంలోని ఏ ఒక్క పండితుడుగానీ, పురాణాల పారాయణులుగానీ ఆయనను, ఆయన అవతారాన్ని ప్రశ్నించలేదు. ఇది విచిత్రం కాదా? దేశ దౌర్భాగ్యం కాదా?' అని ప్రశ్నించాను. 'దేశ దౌర్భాగ్యం ఎందుకని మాష్టారూ?' అడిగాడు జోగీందర్‌సింగ్‌.
'అది చెప్పబోయే ముందు మీకో విషయం చెబుతాను. ఈ సంవత్సరం డిసెంబరులో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాదు వచ్చి ఒక పెద్ద సైన్సు మహాసభలో పాల్గొంటాడని అన్ని పత్రికల్లో వార్త వచ్చిందనుకోండి.

మీరందరూ ఆ వార్త చదివారనుకోండి. అయినా, ఈ నెలలో అంటే మార్చినెలలోనే ఒకరోజు నేను మీ ఏరియాలోని ఒక ఇంట్లో కూర్చొని మైకులో ''నేను 'భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను రండి! నాకు నమస్కారాలు చేయండి! నేనిచ్చే మంత్రజలం తీసుకోండి!' అని మైకులో చెబుతున్నాననుకోండి. అప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చి నమస్కారాలు చేస్తారా? మంత్రజలం కోసం క్యూలు కడతారా?'
'చెయ్యం మాష్టారూ!' జవాబిచ్చాడు జహంగీర్‌. 'ఎందుకు చెయ్యరు?' 'ఎందుకంటే - మొదటి కారణం భారత ప్రధాని డిసెంబరులో వస్తానన్నారు కాబట్టి మార్చిలోనే వచ్చిన వ్యక్తిని ప్రధాని అని మేమెట్లా నమ్ముతాం. రెండవది, భారత ప్రధాని విమానంలో వస్తాడుగానీ మీలాగా స్కూటీ మీద రాడు కాబట్టి. మూడవ విషయం ఆయన సైన్సు మహాసభకు వస్తారనే వార్త వచ్చిందిగానీ మంత్రజలం ఇవ్వడానికని వార్తల్లో లేదుగా? మంత్రజలం ఇవ్వడమనేది సైన్సుకు విరుద్ధం కదా? అందుకని, మీరు వార్తల్లో ప్రకటించిన టైముకంటే ముందు వచ్చి భారత ప్రధానినని ప్రకటించుకున్నా మేం నమ్మం' దృఢంగా బదులిచ్చాడు జహంగీర్‌. 'దురదృష్టకరమైన విషయమేమంటే మనదేశంలో లక్షలాదిమంది విద్యాధికులకు యీమాత్రం శాస్త్రీయ విశ్లేషణా జ్ఞానం కొరవడింది. వారి ఆలోచనలు మొద్దుబారాయి. ఎలాగంటే మన పురాణాలు భాగవ తం, భవిష్య పురాణాల ప్రకారం విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి కలియుగాంతంలో జన్మించి, గుర్రం మీద ఎక్కి వస్తాడనీ, కత్తితో పాపులను సంహరిస్తాడనీ చెప్పబడింది.
అందుకే పూజల సందర్భంగా బ్రాహ్మణులు 'కలియుగే, ప్రథమపాదే' అని చదువుతారు. అంటే కలియుగాన్ని నాల్గుభాగాలుగా విభజిస్తే, అందులో మొదటిభాగంలోనే మనం ఉన్నామని అర్థం. శాస్త్రీయంగా ఆలోచించేవారు, ఇప్పటికి నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత, అంటే రాకెట్లూ, ఎకె47 వంటివి అభివృద్ధి చెంది, ఇంకా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో గుర్రంమీద వచ్చిన వ్యక్తి, కత్తులతో శత్రువులను చంపగలడంటే అంగీకరించరనుకోండి. అయినా, పురాణాలను నమ్మేవారు కల్కి భగవానుడవతరిస్తాడని నమ్ముతున్నారు. ఎప్పుడు? ఇంకా నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత. దేనిమీద? గుర్రం మీద. పాపులను దేంతో సంహరిస్తాడు? కత్తితో. మరి కలియుగం మొదట్లోనే ఒక వ్యక్తి వచ్చి నేనే విష్ణుమూర్తి పడవ అవతారాన్ని, కల్కిని. అని ప్రకటించుకోగానే ఈ పురాణాలు నమ్మేవారు ఆయన్ని కల్కిగా ఎలా అంగీకరిస్తున్నారు? ఈయన అసలు పేరు విజయకుమార్‌. ఆయన్ని తెలిసిన వారు చెప్పిన దాన్నిబట్టి స్కూల్లో చదువులో సగటు విద్యార్థిగా ఉండేవాడు. ఎల్‌ఐసిలో క్లర్క్‌గా పనిచేశాడని, డబ్బు సరిపోక ప్రభుత్వేతర సంస్థను ఒకదాన్ని స్థాపించాడట. అందులో కూడా డబ్బు సంపాదించలేక భగవంతుని పేరు మీద కల్కి అనే అవతారం ఎత్తాడు. భక్తులకిచ్చే ప్రసాదంలో మత్తు పదార్థాలు ఇచ్చాడు. దీనివల్ల వారు తమ కష్టాలను తాత్కాలికంగా మర్చిపోయేవారు. తన భార్యను 'అమ్మా భగవతి' అని పూజించాలని ఆదేశించాడు. పూజలకు వేలు, లక్షల రూపాయలను నిర్ణయించేవాడు.

వేల ఎకరాలను ఆర్జించాడు. నిజంగా అతను ఆధ్యాత్మిక స్వరూపమైతే ఈ ఆస్తులు ఏం చేసుకుంటాడు? ఇది ప్రజల్ని మోసగించడం కాక మరేంటి? దేవుడి పేరుమీద ఎవరినైనా, ఎలాంటివారినైనా మోసం చేయొచ్చనే దాన్ని ఎవరూ ఖండించడం లేదు. ఆయనకు గుర్రం స్వారీ కాదుగదా, గుర్రం జీను పట్టుకోవడమే రాదు. ఆయన ఆశ్రమంలోనూ, ఆశ్రమ ప్రాంతంలోనూ అనేకమంది చంపబడుతున్నారుగాని వాళ్లు పాపులుగాదు; ఆయన భక్తులు. అలా తమ నమ్మకాలకు విరుద్ధమైన వ్యక్తిని కల్కి అవతారంగా లక్షలాది మంది విద్యాధికులు ఎలా భావిస్తున్నారో అర్థంకాకుండా ఉంది. వారిలో ఇలాంటి అశాస్త్రీయ నమ్మకాలు పోవాలంటే ఏం కావాలో చెప్పండి' క్లాసును ఉద్దేశించి ప్రశ్నించాను.
'వారిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి మాష్టారూ!' సాయిలక్ష్మి బదులిచ్చింది. ఆ జవాబుకు అంగీకార సూచకంగా విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కరతాళధ్వనులు చేశారు.
(వచ్చేవారం మరొకటి)
కె.ఎల్‌.కాంతారావు
జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment