Wednesday, 10 October 2012

మానవ మనుగడ కోసం జీవ వైవిధ్యం


మానవ జోక్యం, ప్రమేయం ప్రకృతి స్వభావాన్ని కొంత మేరకు మార్చే అవకాశం ఉన్నప్పటికీ, మానవులు తమ అవసరాల కోసం విడదీయలేనంతగా ఇప్పటికీ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. ఈ వైరుధ్యం గరిష్ట స్ధాయికి చేరితే అది వైవిధ్యం తిరుగులేని విధంగా అంతం కావడానికి దారితీయడమే కాకుండా మానవ నాగరికత ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. మనం వేగంగా ఆ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు సిబిడి గుర్తించింది.

ప్రపంచంలోని దేశాలను పేద, ధనిక దేశాలుగా మాత్రమే కాకుండా మరో రకంగా కూడా వర్గీకరించవచ్చు. జన్యుపరంగా లేదా జీవ వైవిధ్యపరంగా సుసంపన్నమైన దేశాలు, పేటెంట్‌పరంగా సంపన్న దేశాలుగా వాటిని వర్గీకరించ వచ్చు. భూమికి సంబంధించిన జీవ వైవిధ్యం వివిధ రకాలైన సహజసిద్ధమైన మొక్కలు, జంతువులు, సూక్ష్మ ప్రాణుల విషయాల్లో వ్యక్తమవుతుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాల్లో ఈ జీవ వైవిధ్యం ఎక్కువగా ద్యోతకమవుతుంది. యూరప్‌, ఉత్తర అమెరికా దేశాలు ఈ విషయంలో వెనకబడి ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న వివిధ జంతు, మొక్కల వనరులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
జీవ వైవిధ్యంపై ఒప్పందం
జీవ వైవిధ్యం విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఉన్న అంతరం జీవ వైవిధ్య ఒప్పంద(సిబిడి) చరిత్రను చాటిచెబుతోంది. ఈ ఒప్పందం 1992లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కుదిరి 1993లో అమలులోకి వచ్చింది. 193 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ తరువాత ధృవీకరించని బహుకొద్ది దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అంటే ఈ తీర్మానానికి అమెరికా కట్టుబడి ఉండదని అర్థం. దీన్ని ధృవీకరించక పోవడానికి అమెరికా తెలిపిన కారణాల్లో మేధోసంపత్తి హక్కుల్లో ఈ ఒప్పందం జోక్యం చేసుకునే అవకాశం ఉందనేది ఒకటి. తమ దేశ పౌరులు, సంస్థల హక్కుల్లో ఈ ఒప్పందం జోక్యం చేసుకుంటుందని అమెరికా వ్యాఖ్యానించింది. సిబిడిలో ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలున్నాయి. (ఎ) జీవ వనరుల పరిరక్షణ (బి) ఈ భూమిపై గల జీవ వనరులను స్థిరంగా, నిలకడగా ఉపయోగించుకోవడం, (సి) జీవ వనరులను సాంకేతికంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకోవడంలో సమానత్వం.
ఈ భూమి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా భావించారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఒక ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి కావడం ఈ ఒప్పందానికి ఉన్న మరో విశిష్టత. జీవ వైవిధ్యం ప్రపంచ దేశాల ఉమ్మడి సహజ సంపదగా గుర్తించారు. దానిని పరిరక్షించడం మానవాళి ఉమ్మడి బాధ్యత, సమస్యగా కూడా పరిగణించారు. ఈ భూమిపై జీవ వనరులు పరిమితంగా మాత్రమే ఉంటాయని, అవి వేగంగా అంతరించి పోతున్నాయనే అవగాహన ప్రాతిపదికగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. మొక్కలు, జంతువుల్లో వేగంగా అంతరించిపోతున్న ప్రతి ఒక్క రకం లక్షలాది సంవత్సరాల పరిణామ చరిత్రను కాలరాస్తుంది. మనం మన చుట్టూ ఉన్న విభిన్న రకాల మొక్కలు, జంతువులు ఈ భూమి మీద మొత్తం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి. మొక్కలు, జంతువులు మరణించిన కొద్దీ ఈ భూమి మీద పర్యావరణం మరింతగా దెబ్బతింటుంది. మొత్తం పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎంతగా సాంకేతికపరంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చెందినప్పటికీ కృత్రిమ మార్గాల ద్వారా జీవ వైవిధ్యాన్ని వృద్ధి చేసుకునే మార్గాలు అందుబాటులో లేవు. ఒక జాతి అంతరించిపోతే అది అంతరించిపోయినట్లే. దానిని పునరుజ్జీవింపజేసే అవకాశాలు లేవు.
మానవుడు, ప్రకృతి వైరుధ్యం
ఇతర మొక్కలు, జంతువుల మాదిరిగా మానవులు అందుబాటులోని వనరులను ఉపయోగించుకుని తమ అవసరాలను తీర్చుకోగలరు. ఈ భూమిపై ఉన్న ఇతర ప్రాణుల మాదిరిగా కాకుండా మానవులు ప్రకృతి నుంచి వనరులను సేకరించడంతోపాటు స్వభావాన్ని మార్చగల సామర్ధ్యం కలవారు. అందువల్ల ప్రకృతి, మానవుల మధ్య వైరుధ్యం చెలరేగుతోంది. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ ఈ ఘర్షణ ధోరణి కొనసాగుతూవస్తోంది. మానవ నాగరికత ఆవిర్భవించిన తొలి రోజుల్లో ఈ వైరుధ్యం ప్రభావం పరిమితంగానే ఉండేది. మానవ జోక్యాన్ని తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ఆ సమయంలో ప్రకృతి ఉండేది. అది జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించుకునే సామర్ధ్యాన్ని ప్రదర్శించేది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ హయాంలో సాధించిన అభివృద్ధి, వృద్ధితో ప్రకృతికున్న తన విస్తృత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోగల సామర్ధ్యం ప్రమాదంలో పడింది.
మానవ జోక్యం, ప్రమేయం ప్రకృతి స్వభావాన్ని కొంత మేరకు మార్చే అవకాశం ఉన్నప్పటికీ, మానవులు తమ అవసరాల కోసం విడదీయలేనంతగా ఇప్పటికీ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. ఈ వైరుధ్యం గరిష్ట స్ధాయికి చేరితే అది వైవిధ్యం తిరుగులేని విధంగా అంతం కావడానికి దారితీయడమే కాకుండా మానవ నాగరికత ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. మనం వేగంగా ఆ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు సిబిడి గుర్తించింది. మన ముందు ముప్పు పొంచి ఉన్నదనే విషయాన్ని మానవాళి ఇటీవలనే గుర్తించడం మాత్రమే కాదు, జీవ వైవిధ్యం అనే పదాన్ని ఇటీవలే కొత్తగా రూపొందించింది. 1980 దశకంలో ఇది వాడుకలోకి వచ్చింది. మనం ఎంత మేరకు జీవ వైవిధ్యాన్ని కోల్పోయామనే విషయమై మనకు పరిమితమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. గతంలో కూడా అనేకసార్లు పెద్ద ఎత్తున జాతులు అంతరించిపోయాయనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో జీవ పరిణామంలో భాగంగా కొన్ని జాతులు అంతరించి పోవడం సహజమే. దీనిని 'బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌' అదృశ్యం అని పిలుస్తారు. ఈ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో జాతులు అంతరించిపోతూ ఉంటే దానిని మూకుమ్మడిగా అంతరించి పోవడంగా వ్యవహ రిస్తారు. గత 60 కోట్ల సంవత్సరాల్లో మూకుమ్మడిగా జాతులు అంతరించిపోయే ప్రక్రియ కనీసం ఐదుసార్లు జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సహజసిద్ధంగా ప్రకృతిలో సంభవించే మార్పులు భూ పర్యావరణంలో సమూలమైన మార్పుకు దోహదం చేశాయి. ఉదాహరణకు, రాక్షస బల్లులు (డైనోసార్స్‌) ఈ విధంగానే మూకుమ్మడిగా అంతరించిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. మానవుల ఉనికి లక్ష సంవత్సరాల కంటే తక్కువ కాలం నుంచే కొనసాగుతుండగా ఈ డైనోసార్స్‌ అనేక లక్షల సంవత్సరాలపాటు ఈ భూమిపై మసలాయనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తీవ్ర విధ్వంసం సంభవించిన కారణంగానే ఇవి అంతరించిపోయాయని భావిస్తున్నారు. అతి పెద్ద గ్రహ శకలంతో భూమి ఢకొీనడంతో ఈ విధ్వంసం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోసారి మనం మరో పెద్ద విపత్తు దిశగా సాగుతున్నామనే ఆందోళన తలెత్తుతోంది. ప్రకృతి వనరులను మానవులు అడ్డూఅదుపూలేని రీతిలో దోచుకోవడం వల్ల ఈ పరిణామం సంభవించ వచ్చునన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజూ వందల కొద్దీ జాతులు అంతరించి పోయే పరిస్థితిని మనం చూడవచ్చునని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది పైన పేర్కొన్న బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌ కంటే లక్షలాది రెట్లు ఎక్కువగా జరుగుతుందని అంచనా.
జీవ వైవిధ్యం అంతరించడానికి, భూగోళ ఉష్ణోగ్రతల పెరుగుదల ఫలితంగా చోటుచేసుకునే వాతావరణ మార్పుకు మధ్య సంబంధం ఉంది. ఉదాహరణకు ఉష్ణ మండల వర్షపాత అడవులు(రెయిన్‌ ఫారెస్ట్‌లు) అంతరించిపోతే వేలాది తెగల జీవరాసులు అంతమవుతాయి. అంతేకాకుండా వాతావరణంలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను హరించి వేడిని తగ్గించే సింక్‌లు కూడా హరించుకుపోతాయి. మరోవైపు భూమి త్వరితగతిన వేడెక్కడం అనేక జంతు జాతుల ఉనికికి ముప్పుగా పరిణమిస్తోంది. తద్వారా అవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రకృతి వనరుల దోపిడీ
మానవులు నిరంతరం భూమికి చెందిన జీవ వనరులపై ఆధారపడతారనే సిద్ధాంతాన్ని జీవ వైవిధ్య ఒప్పందం ప్రాతిపదికగా తీసుకుంటుంది. అందుకోసం నిలకడైన పద్ధతులను అనుసరించాలని వాదిస్తుంది. మానవ అవసరాలు, జీవ వైవిధ్యాన్ని స్థిరంగా పరిరక్షించుకోవాల్సిన అవసరాల మధ్య సమతుల్యత సాధించాలని అది పిలుపు నిచ్చింది. ఇటువంటి సమతుల్యత హేతుబద్ధమైనదే అయినప్పటికీ దానిని అమలు చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. ధనిక దేశాలు ఎక్కువ మొత్తాన్ని వినియోగిస్తుంటాయి. పేద దేశాలు జీవ వైవిధ్యానికి ప్రధాన నెలవులుగా ఉంటాయి. వాతావరణ మార్పుపై ప్రజల చర్చ కేంద్రీకృతమవుతున్న తరుణంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విషయంలో ధనిక, పేద దేశాల మధ్య పోరాటం జరుగుతోంది. ధనిక దేశాలు తమ వినియోగం తగ్గించుకోవడానికి సుముఖత చూపవు. పైపెచ్చు పరిరక్షణ భారాన్ని పేద దేశాలపై మోపాలని కోరుకుంటాయి. అటువంటి పరిరక్షణకుగాను తమకు ప్రతిఫలం చెల్లించాలని పేద దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తమకు ఆర్థికంగా మద్దతు అందించాలని, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ధనిక దేశాలు అందించాలని కోరుతున్నాయి.
ప్రయోజనాన్ని సమానంగా పంచుకోవడం-నగోయా ప్రొటోకాల్‌
అంతర్జాతీయ సంబంధాల్లో పేద, ధనిక దేశాల మధ్య అంతరం సిబిడిలో స్పష్టమవుతుంది. ఇది ప్రయోజనాలను సమంగా పంచుకోవాలని నిర్దేశిస్తోంది. పైన పేర్కొన్నట్లు ప్రపంచ జీవ వైవిధ్య వనరులు అధిక భాగం పేద దేశాల్లో ఉంటాయి. తమ విస్తరణ కోసం, లాభాలను పెంచుకునేందుకు ధనిక దేశాలు, వాటికి చెందిన బహుళ జాతి సంస్థలకు ఈ వనరులు అందుబాటులో ఉండటం అవసరం. కొత్త మందులకు అవసరమైన ముడిసరుకులను ఈ జీవ వనరులు అందిస్తాయి. అలాగే మెరుగైన వ్యవసాయోత్పత్తులను సాధించేందుకు, ఇంజనీరింగ్‌కు సంబంధించిన అనేక అప్లికేషన్స్‌కు ఇవి అవసరం. పేద దేశాల్లోని జీవ వనరులను దోపిడీ చెయ్యాలని ధనిక దేశాలకు చెందిన కార్పొరేట్లు నిరంతరం ప్రయత్నిస్తాయి. కొత్త ఉత్పత్తులను తయారుచేసేందుకు వీటిపైనే ఆ సంస్థలు ఎక్కువగా ఆధారపడతాయి. ఈ ఉత్పత్తులను గరిష్ట లాభాలకు అవి అమ్ముకుంటాయి. కోట్లాది డాలర్ల లాభాలను అవి సంపాదిస్తాయి. ఏ దేశాల నుంచి ఈ వనరులను సేకరిస్తున్నాయో వాటితో లాభాలు పంచుకునేందుకు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించవు. జీవ వనరుల చౌర్యం కేవలం వృక్ష, జంతు జాతులకు మాత్రమే పరిమితం కావు. స్థానిక ప్రజల పరిజ్ఞానానికి కూడా ఇది విస్తరిస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని అక్కడి ప్రజలు వేలాది సంవత్సరాలు కృషి చేసి సంపాదించుకున్నారు. అయితే దీనిని ధనిక దేశాలకు చెందిన సంస్థలు తమ ప్రయోజనాల కోసం, లాభాల కోసం దోపిడీ చేస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే సిబిడి లాభదాయకమైన పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక దేశంలో జీవ వనరుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను మరో దేశం లేదా సమాజంతో పంచుకోవాలని ఈ సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ఇది మొక్కలు, జంతువులకు మాత్రమే కాకుండా సూక్ష్మ జీవులకు (బాక్టీరియా, వైరస్‌లు) కూడా వర్తిస్తుంది. 2006లో అవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను ఇతర దేశాలతో పంచుకునేందుకు నిరాకరించడం ద్వారా ఇండోనేషియా అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో సంచలనం సృష్టించింది. తమ వైరస్‌ను ఉపయోగించుకునే వాక్సిన్‌ను తయారుచేసే సంస్థలు అందువల్ల వచ్చే లాభాల్లో తమకు వాటా ఇవ్వాలని ఇండోనేషియా డిమాండ్‌ చేసింది. ఇండోనేషియా వైఖరి దీర్ఘకాల ప్రతిష్టంభనకు దారితీసింది. ఆ తరువాత వైరస్‌ను పంచుకునే ఒప్పందం సూత్రప్రాయంగా కుదిరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఈ ఒప్పందం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జన్యు వనరుల అందుబాటు, వాటిని ఉపయోగించడంవల్ల కలిగే ప్రయోజనాన్ని సమాన ప్రాతిపదికన పంచుకునేందుకు నగోయా ప్రొటోకాల్‌ను ఉద్దేశించారు. సంబంధిత టెక్నాలజీల బదిలీకి కూడా ఈ ఒప్పందాన్ని నిర్దేశించారు. ఈ వనరులు, టెక్నాలజీలపై గల హక్కులను, నిధుల కేటాయింపును, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు దోహదం చేసే చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ ఒప్పందాన్ని రూపొందించారు. 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. కనీసం 50 దేశాలు ఆమోదించాల్సి ఉన్నందున ఈ ప్రొటోకాల్‌ ఇంకా అమలులోకి రాలేదు. ఇప్పటి వరకూ స్పల్ప సంఖ్యలో మాత్రమే దేశాలు ఈ ప్రొటోకాల్‌ను ఆమోదించాయి.
హైదరాబాద్‌లో జీవ వైవిధ్య సదస్సు
జీవ వైవిధ్య సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలను కొన్నింటిని స్థూలంగా ప్రస్తావించాం. జీవ వైవిధ్య ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల ప్రభుత్వాలతో (ప్రాంతీయ, ఆర్థిక సమన్వయ సంస్థల) కూడిన పాలక మండలి సమావేశం అనేక కీలకాంశాలను చర్చిస్తోంది. తీర్మానం అమలులో సాధించిన పురోగతిని సమీక్షించి కొత్త ప్రాధాన్యతలను గుర్తించి సభ్య దేశాలకు కొత్త కార్యాచరణను ఈ సమావేశం రూపొందిస్తుంది. జీవ భద్రతపై కార్టాజెనా ప్రొటోకాల్‌పై ఆరో రౌండ్‌ కాప్‌-మాప్‌-6 చర్చలు అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు జరగ్గా, కాప్‌-11 (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ పదకొండవ రౌండ్‌ చర్చలు) అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు జరుగుతున్నాయి.
-డాక్టర్‌ అమిత్‌ సేన్‌గుప్తా

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (2)


  • అశాస్త్రీయ ఆచారాలు 20
'ఇక వాసన పరీక్ష విను. భూమిలోని మట్టిని తీసుకొని వాసన చూచినప్పుడు ఆ వాసనను బట్టి ఆ భూమి ఏ కులా నిదో చెప్పవచ్చట! 'విశ్వకర్మ ప్రకాశిక'లోని ఈ శ్లోకాల్ని విను.
శ్లో|| సుగంధా బ్రాహ్మణీ భూమిః రక్త గంధాతు క్షత్రియా |
మధుగంధా భవేద్వైశ్యా మద్యగంధాచ శూద్రిణీ ||
అంటే భూమి వాసన జాజి, మల్లె వంటి పుష్పముల సువాసన కలిగి వుంటే 'బ్రాహ్మణ భూమి' అని, రక్తము యొక్క వాసన కలిగి వుంటే 'క్షత్రియ భూమి' అని, తేనె వాసన కల్గినది 'వైశ్య భూమి' అనియు, కల్లు వాసన కల్గిన భూమి అయితే 'శూద్ర భూమి' అనియు నిర్ణయించాలట!
ఇక రుచిని బట్టి భూమి వర్ణాన్ని బట్టి...
శ్లో|| మధురా బ్రాహ్మణీ భూమిః కషాయా క్షత్రియా మతా
ఆమ్లా ద్వైశ్యాభవేద్భూమి స్తిక్తాశూద్రా ప్రకీర్తితా||
'భూమియందలి మట్టి తీపిగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, వగరుగా ఉన్నచో 'క్షత్రియ భూమి' అనియు, పులుపుగా ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, చేదుగా ఉన్న యెడల 'శూద్ర భూమి' అనియు గుర్తించవలెను' అని అర్థం. ఇక భూమి ఆకారాన్ని బట్టి..
శ్లో|| గంభీరా బ్రాహ్మణీ భూమిః నృపాణాం తుంగమాశ్రితా
వైశ్యాసా సమ భూమిశ్చ,శూద్రిణీ వికటాస్మృతా||
అనగా, గృహము నిర్మించనున్న స్థలము యొక్క ఆకార ము గంభీరముగా ఉన్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎత్తుగానున్నచో 'క్షత్రియ భూమి' అనియు, ఎత్తు పల్లములు లేకుండా సమతలం ఉన్న చో 'వైశ్య భూమి' అనియు, ఎత్తు పల్లముతో ఉన్నచో 'శూద్ర భూమి' అనియు తెలుసుకోవాలి.
ఇక భూమియందు పెరిగే చెట్లను బట్టి..
శ్లో|| బ్రాహ్మణీ భూః కుశోపేతా, క్షత్రియాస్యాచ్ఛరాకులా
కుశకాశాకులా వైశ్యా శూద్రా సర్వ తృణాకులా||
అనగా భూమియందు దర్భలు పెరుగుచున్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, కాకి వెదురు పెరుగుచున్నచో 'క్షత్రియ భూమి' అనియు, రెల్లు పెరుగుచున్న యెడల 'వైశ్య భూమి' అనియు, వివిధ గడ్డి రకాలున్నచో 'శూద్ర భూమి' అట! ఇక భూమిలోని పల్లాలను అనుసరించి..
శ్లో|| ఉదక్‌ ప్లవా బ్రాహ్మణీ స్యా త్ప్రాక్లవా క్షత్రియామతా
అవాక్‌ ప్లవాచ వైశ్యాస్యా చ్ఛూద్రిణీ పశ్చిమప్లవా||
అంటే ఉత్తరమున పల్లముగా ఉన్న భూమి 'బ్రాహ్మణ భూమి' అనియు, తూర్పున పల్లముగా ఉన్న భూమి 'క్షత్రియ భూమి' అనియు, దక్షిణము పల్లముగా ఉన్న భూమి 'వైశ్య భూమి' అనియు; పశ్చిమము పల్లముగా ఉన్న భూమి 'శూద్ర భూమి'. ఇక భూమి వర్ణాన్ని గూర్చి చివరగా ఇలా 'వాస్తు సర్వస్వం' లో చెప్పబడింది.
శ్లో|| బ్రాహ్మణీ సర్వసుఖదా, క్షత్రియా రాజ్యదా భవేత్‌
ధన ధాన్యకరీ వైశ్యా శూద్రాతు నిందితా స్మృతా||
అనగా 'బ్రాహ్మణ భూమి' సమస్త సుఖాలనిస్తుంది. 'క్షత్రియ భూమి' రాజ్యప్రసాదముగా ఉండును. 'వైశ్య భూమి' ధనధాన్యాలను ఇచ్చును. 'శూద్ర భూమి' నింద్యమైనది, అనగా ఇల్లు కట్టగూడనిది.
ఇప్పుడు చెప్పు చంద్రమౌళీ! రాళ్ళు రప్పలతో వున్న భూమికీ కులాలను ఆపాదించడం, అందులోనూ భూమిలోని ఒక్కో స్థలం ఒక్కో వర్ణానికి చెందిన భూమిగా అనడం అశాస్త్రీయం కాదా? భూమి వివిధ వాసనలతోనూ, అనేకరకాలైన రుచులూ కల్గి ఉంటుందనడం శాస్త్రీయమా? అందులోనూ మంచి వాసన, తీపి రుచీ ఉంటే అది 'బ్రాహ్మణ భూమి' అట! కల్లు లేక సారావాసన, చేదు రుచీ వుంటే 'శూద్రభూమి' అట! ఇది శూద్రులను అవమానించడం కాదా? భూమి గంభీరంగా ఉంటే బ్రాహ్మణ భూమి అట! ఎత్తు పల్లములుగా ఉన్న భూమి శూద్రభూమి అట! భూమి గంభీరంగా ఉండటమంటే ఏమిటి? ఏ వాస్తు పండితుడైనా వివరించగలడా? నల్లటిభూమి 'శూద్ర భూమి' అని ముందు చెప్పి ''కృష్ణ వర్ణో ధమాధ¸మం'' అంటే నల్లటిభూమి చెడ్డ వాటిలో చెడ్డదని తర్వాత చెప్పబడింది. ఇదీ శూద్రులను అవమానించడం కాదా? అంతేకాదు, పడమర పల్లంగానున్న భూమి 'శూద్రభూమి' అనీ, అది 'అధమాథమ భూమి' అనీ, అలాంటి భూమిలో ఇల్లు కట్టు కుంటే కష్టనష్టాలు కలుగుతాయనీ చెప్పబడింది. మన దేశంలో ముంబయి, కొచ్చిన్‌, మంగళూరులాంటి పట్టణా లూ, గోవా రాష్ట్ర పశ్చిమతీర ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రదే శాలలో భూమి పశ్చిమం పల్లంగా ఉంటోంది. మన దేశం లోని అత్యంత సంపన్నులు ఆ ప్రదేశాలలోనే ఉంటున్నారు. ఇది వాస్తు విరుద్ధమైన విషయం కాదా? అంతేకాదు. మరో ముఖ్యవిషయాన్ని ''వాస్తు ప్రదీపం'' ఇలా తెలియజేస్తోంది.
శ్లో|| స్వవర్ణ గంధ సురసా ధన ధాన్య సుఖా వహా|
వ్యత్యయే వ్యత్యయ ఫల మతః కార్యం పరీక్షణం||
అనగా 'తన వర్ణమునకు సరైన వర్ణము, వాసన, రుచి గల భూమి ధనధాన్య సుఖములనిచ్చును. అలాగాక తన వర్ణమునకు వ్యతిరేకమైన వర్ణము, వాసన, రుచిగల భూమి నష్టమును కలుగజేయును'' అని తెలియజేస్తోంది. అంటే శూద్రులు ఏదైతే వాస్తువాదులు అధమాధమ భూమిగా ప్రత్యేకించి పేర్కొన్నారో దానిపైనే నివసించాలనీ, అలా ఉంటేనే వారికి సుఖాలు కలుగుతాయనీ పేర్కొనడం అమానుషం కాదా? 'ఇలా అత్యంత అశాస్త్రీయంగా, అమా నుషంగా భూమిని విభజించిన 'వాస్తు' శాస్త్రం ఎలా అవుతుంది?' అన్నాను.
చంద్రమౌళి మౌనంగా ఉండిపోయాడు.
'వాస్తు గ్రంథాలలో, ఇల్లు కట్టవలసిన భూమికి సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(మరికొన్ని అంశాలు వచ్చేవారం)
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

మైక్రోవేవ్‌లతో సౌరశక్తి..!


ఆవేశపడి మైక్రోవేవ్‌ ఒవెన్‌ కొని, చివరికి మిగిలిపోయిన ఆహారాన్ని వేడిచేసుకోడానికే దాన్ని వాడటం చాలాచోట్ల చూస్తుంటాము. కానీ ఇప్పుడు మైక్రోవేవ్‌లతో మరో ఉపయోగం వుందని తెలిసింది. మైక్రోవేవ్‌ని ఉపయోగించే ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌తో తక్కువ ఖర్చులో కొన్ని పదార్థాలను తయారుచేయవచ్చని తెలిసింది. ఒరిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ఇంజనీర్లు మైక్రోవేవ్‌ని వాడి రాగి, జింక్‌ సల్ఫైడ్‌ తయారు చేశారు. ఆ పదార్థం తక్కువ విషపూరిత మైనదీ, తక్కువ ఖర్చుతో కూడుకు న్నదీ, మెరుగైనదీ అని వారు అంటు న్నారు. మైక్రోవేవ్‌ను వాడటం వల్ల తయారీ సమయం కేవలం సెకన్లలో ఉంటుంది. పైగా తయారీపద్ధతిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ పరిశో ధన సౌరశక్తి రంగానికి కొత్త ఊతం ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. మొత్తానికి మైక్రోవేవ్‌ ఒవెన్‌కు మరొక మంచిపని దొరికింది.

జీవ భద్రత .. జీవ వైవిధ్యం..


జీవరాశులకు పెద్దఎత్తున నష్టం జరగకుండా నివారించడమే 'జీవభద్రత'. జీవభద్రత ప్రధానంగా జీవావరణం (ఎకాలజీ), మానవారోగ్యంపై కేంద్రీకరిస్తుంది. జీవావరణంలోకి దిగుమతయ్యే జీవరాశులు, వ్యవసాయంలో బయటి నుండి వచ్చే వైరల్‌ లేక మార్పిడికి గురైన జన్యువులు జీవాల్లో అభద్రతను కలిగిస్తాయి. వైద్యరంగంలో ప్రియాన్స్‌గా పిలువబడుతూ పశువుల్లో చికిత్సలేని 'మాడ్‌ కౌ'లాంటి అంటురోగాల్ని కలిగిస్తున్నాయి. బ్యాక్టీరియాలతో కలుషితమైన ఆహారం, వైద్యరంగంలో జీవావరణం నుండి వచ్చిన అంగాలు, కణజాలాలు లేక జన్యు చికిత్స ఉత్పత్తులు, వైరస్‌లు అభద్రతను కలిగిస్తున్నాయి. రసాయనిక కోణంలో నైట్రేట్‌ నత్రజని జీవావరణంలో కలిసినపుడు, పునరుత్పత్తిని ప్రభావితం చేసే ఇతర కారకాలు, కాలుష్య కారకాలు కూడా అభద్రతను కలిగిస్తూ జీవభద్రత పరిధిలోకి వస్తాయి. గ్రహాంతర సూక్ష్మజీవులు ఉంటే అవి అంతరిక్ష శకలాలతో భూమికి చేరి తెలియని సమస్యలు సృష్టిస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఇవన్నీ విడివిడిగా లేక సంయుక్తంగా జీవవైవిధ్యంపై ప్రభావం కలిగి వున్నాయి. జన్యుమార్పిడి పంటలు, ఉత్పత్తులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జీవభద్రతను కొనసాగించడంలో జీవవైవిధ్యంపై ప్రభావాలను 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో క్లుప్తంగా తెలుపుతూ మీముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
జన్యుమార్పిడి సాంకేతికంతో జొప్పించే ఇతర జాతి జన్యువు చొప్పించాల్సిన జాతి జన్యువుల సమూహంలో ఎక్కడ స్థిరపడుతుందో తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ప్రక్రియ చీకటిగదిలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడో ఒక దగ్గర స్థిరపడ్డట్టుగా వుంటుంది. ఇలా ప్రవేశపెట్టబడ్డ జన్యువు ఆక్రమించిన స్థలాన్ని (క్రోమోజోముపై), పరిసరాల్లోని ఇతర జన్యువులను బట్టి బయటికి కనిపించే గుణగణాలు (జీన్‌ ఎక్స్‌ప్రెషన్‌) ఆధారపడి వుంటాయి. వీటన్నింటినీ ముందుగానే తెలుసుకోలేం. అందువల్ల, ఇలాంటి జన్యుమార్పిడి ద్వారా రాగల గుణగణాలను అన్నింటినీ ముందుగానే పరిగణనలోకి తీసు కోలేం. అందువల్ల, జన్యుమార్పిడి ఉత్పత్తుల నుండి జీవభద్రతను కలిగించడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
జన్యుమార్పిడి సాంకేతికం ద్వారా కొత్తగా సృష్టించబడుతున్న, సృష్టించబోయే జీవకణాలు, రాశులు మానవాళిని నష్టపర్చకుండా జీవభద్రత కోసం నియమ, నిబంధనల్ని రూపొందించుకోవాలి. దీనికోసం అంతర్జాతీయ చర్చలు కొనసాగుతున్నాయి. 'కార్టజినా ప్రొటోకాల్‌ (అంతర్జాతీయ ఒప్పందం)' ఈ చర్చల ఫలితమే.
జీవభద్రతపై 1993 నుండి అమల్లోకి వచ్చిన 'కార్టజినా ప్రొటోకాల్‌' భూగోళంలో జీవవైవిధ్య పరిరక్షణకు ఆధారంగా పనిచేస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిలో భాగంగా 1992 'ఎర్త్‌ సమ్మిట్‌'లో ముందుకొచ్చింది. జీవం కలిగిన జన్యుమార్పిడి జీవులను కొత్త జీవావరణంలో ప్రవేశపెట్టడం వలన రాగల దుష్ప్రరిణామాల్ని ముందుగానే తెలుసుకోలేం కాబట్టి, ముందుజాగ్రత్త చర్యలన్నీ తీసుకోవాలని కార్టజినా ప్రొటోకాల్‌ నిర్దేశిస్తుంది. ఒకవేళ ఇలా కొత్తగా దిగుమతువుతున్న జీవులు అభద్రత కలిగించే అవకాశం వుందని ఏ అభివృద్ధి చెందుతున్న దేశమైనా భావిస్తే అట్టి దిగుమతులను ఆపేసే అధికారాల్ని ఆ దేశం కలిగి వుంది. ఈ ముందుజాగ్రత్త సిద్ధాంతం అభివృద్ధి చెందిన దేశాలకు, ప్రజారోగ్యం, రాగల ఆర్థిక లాభాల మధ్య సమతుల్యత పాటించి, నిర్ణయాలను తీసుకోడానికి వీలు కలిగిస్తుంది. తద్వారా ప్రపంచంలోని జీవవైవిధ్య వనరులను వినియోగించుకోడానికి, జీవం కలిగిన జీవాల అంతర్జాతీయ మార్పిడికి వీలుకలిగిస్తుంది.
ఈ ముందుజాగ్రత్త సిద్ధాంతానికి అనుగుణంగా జన్యుమార్పిడి పంటల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను జీవావరణంలో ప్రవేశపెట్టినప్పుడు రాగల దుష్ప్రరిణామాల్ని కనిపెట్టడానికి క్షుణ్ణంగా పరిశోధన చేయాలి. ఇలా ఎగుమతయ్యే ప్యాకేజీలపై జన్యుమార్పిడి ఉత్పత్తుల లేబుల్‌ని తప్పనిసరిగా వుంచాలి. ఈ నియమాలు చాలా కఠినంగా వున్నాయని జీవ సాంకేతిక పరిశ్రమ భావిస్తుంది. వీటిని అధిగమించడానికే 'గణనీయమైన సమానత్వ' ప్రాతిపదికను ముందుకు తెచ్చింది.
గణనీయమైన సమానత్వ ప్రాతిపదిక..
'గణనీయమైన సమానత్వ ప్రాతిపదిక' మామూలుగా తినే ఆహారపదార్థాలలో కూడా నష్టం కలిగించే కొన్ని పదార్థాలు సహజంగానే వుండవచ్చని భావిస్తుంది. ఇంతకాలం వీటిని తీసుకుంటున్నప్పటికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అందువల్ల, జన్యుమార్పిడితో రూపొందించిన కొత్త పదార్థాలు ఇప్పటికే వినియోగంలో వున్న పదార్థాలతో ఎక్కువభాగం సారూప్యత కలిగి ఉన్నప్పుడు, అలా కంపెనీ నిర్ధారించినప్పుడు అట్టి పదార్థాల ప్రభావాలను అంచనా వేసేటప్పుడు అదనంగా రాగల దుష్ప్రభావాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ, జన్యుమార్పిడి ద్వారా రూపొందించిన పదార్థాల ప్రభావాలని తిరిగి పునరంచనా చేయాల్సిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిశ్రమ, దాని మద్దతుదారులు వాదించారు. ఈ వాదనతో అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి, అంగీకరింపజేశారు.
జీవ వైవిధ్యం..
జీవావరణలో జన్యుమార్పిడి పంటలు ఎన్నో మార్పుల్ని తెస్తాయి. అభద్రతను పెంచుతాయి. ముఖ్యంగా ఒకే పంటను, అదీ ఆ పంటలో ఒకటి లేక రెండు జన్యువులు మార్చిన పంటలను ప్రవేశపెట్టి, మాటిమాటికీ పండించడం ద్వారా జీవావరణంలో అస్థిరత్వం పెరుగుతుంది (గత వారం ఈ సమాచారం ఇదే పేజీలో ఇవ్వబడింది). ఇట్టి జీవావరణంలో ఏ చిన్న ఒడుదుడుకులొచ్చినా తట్టుకోలేవు. బయటి నుండి వచ్చే చీడపీడలనూ తట్టుకోలేవు. ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోగల రకాలు రూపొందినప్పుడు (పత్తిలో కాయతొలుచు పురుగు తట్టుకొనే రకం) రైతులు పంట మార్పిడి చేయకుండా అదే పంటను మాటిమాటికీ వేస్తుండడంతో జీవవైవిధ్యం హరించుకుపోతుంది. నేడు పత్తిలో మనం చూస్తున్నది అదే.
ఆరోగ్యంపై ప్రభావం...
బ్రిటిష్‌ శాస్త్రవేత్త 'మైకేల్‌ ఆంటోనియో' ప్రకారం జన్యుమార్పిడి ఆహారం నుండి మూడు, నాలుగురకాల రిస్క్‌లు తలెత్తవచ్చు.
* బయటి నుండి జన్యువును చొప్పించడం వల్ల - ఆ జన్యువు నేరుగా జీవవ్యవస్థలోకి ప్రవేశించవచ్చు. (అంతర్గత బిటి విషాహారంలో జరిగేది ఇదే)
* కొత్తగా ప్రవేశపెట్టిన జన్యు మొక్కల్లో జీవ రసాయనిక మార్పుల్ని తేవొచ్చు - కలుపు మందుల్ని తట్టుకునే రకాల్లో ఎంజైమ్‌ వ్యవస్థలు మారి, ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు.
* కలుపుమందును తట్టుకునే జన్యుమార్పిడి పంటలతో కలుపుమందుల వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది జీవావరణంపై దుష్ప్రభావాన్ని కలిగి వుంది.
* జన్యుమార్పిడి ప్రక్రియలు స్వతహాగా మొక్కల్లోని జీవరసాయనిక మార్పుల్ని తెచ్చి, జీవాల్లో కొత్త మార్పులకి దారితీయవచ్చు (మ్యూటాజెనిక్‌ ఎఫెక్ట్స్‌)
దుష్ప్రభావాలపై అధ్యయనం..
జీవ సాంకేతిక పరిశ్రమల వారు ఎక్కువభాగం ఎలుకలకు 90 రోజులు ఆహారాన్ని పెట్టి, ఆరోగ్యభద్రతపై స్వల్పకాల అధ్యయనాలు చేశారు. ఈ ప్రయోగాల్లో ఎక్కువభాగం 30 రోజులకే పరిమితం చేయబడ్డాయి. కలుపు మందును తట్టుకునే జన్యుమార్పిడి మొక్కజొన్నలు ఎలుకలకు పెట్టినప్పుడు వాటి పెరుగుదల తగ్గిపోయింది. ఒకరకం కొవ్వు శాతం పెరిగింది. వాటి కాలేయం, మూత్రపిండాల పని దెబ్బతింది. మరో ప్రయోగంలో బిటి విషాహారాన్ని 90 రోజుల వరకూ ఎలుకలు, కుందేళ్లు, మేకలకు పెట్టారు. అలాగే ఆవులు, కోళ్లు, చేపలకు 42-45 రోజుల వరకే పెట్టారు. ఈ కొద్ది కాలంలోనే బిటి విషాహారం ఈ జంతువుల్లో ఆహారాన్ని తీసుకోవడమే తగ్గించాయి. డయేరియా వచ్చింది, నీళ్లు ఎక్కువగా తీసుకున్నాయి. ఎలుకల్లో కాలేయం, శరీర బరువు తగ్గిపోయింది.
మొత్తం మీద ఈ అధ్యయనాలన్నీ జన్యుమార్పిడి పంటల విషాహారం దుష్ప్రభావాల్ని కలిగిస్తుందని ధృవపరుస్తున్నాయి. కానీ 'గణనీయమైన సమానత్వ సిద్ధాంతం' ఆధారంగా ఈ మార్పుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిశ్రమల వారు వాదిస్తున్నారు. ఈ మార్పులన్నీ జన్యుమార్పిడి ఉత్పత్తుల ఆరోగ్య ప్రభావాలపై దీర్ఘకాల అధ్యయన అవసరాన్ని సూచిస్తున్నాయి. మన దేశంలో దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడం లేదు.
స్వతంత్ర పరిశోధనా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఈ జన్యుమార్పిడి ఉత్పత్తుల ప్రభావాలపై అధ్యయనానికి అవకాశాలు దొరకడం లేదు. అయినా, వీరు చేసిన కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయాలు...
ష బిటి జన్యుమార్పిడి ఆహారాన్ని మూడుతరాలుగా ఎలుకలకు పెట్టినప్పుడు కాలేయం, మూత్రపిండాల్లో జీవకణాలు చనిపోయినట్లు గుర్తించారు. తర్వాత రక్తంలో కూడా మార్పులు వచ్చాయి.
*ఎలుకల్లో ఈ ఆహారం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు వచ్చాయి.
* సైటోకిన్‌ పనివిధానంలో మార్పు వచ్చింది.
* జీర్ణకోశాల్లో వున్న సూక్ష్మజీవుల్లో మార్పులొచ్చాయి. జన్యుమార్పిడి ఆహారం పెట్టినప్పుడు కోలిఫాం బ్యాక్టీరియా 23 శాతం అధికంగా వుంది.
* ఈ మార్పులన్నీ ఉద్దేశించకపోయినప్పటికీ వచ్చాయని, సంబంధిత పరిశోధకులు తెలిపారు
* జీవాల్లో కూడా ఇలాంటి పరిణామాలే కనిపించాయి. ముఖ్యంగా వీటిలో కాలేయం, పిత్తాశయం పనివిధానంలో మార్పులొచ్చాయి.
* జన్యుమార్పిడి పొందిన సోయా వల్ల కుందేళ్ల మూత్రపిండాలు, గుండెలోని ఎంజైమ్‌ పనివిధానంలో తేడాలొచ్చాయి.
జన్యుమార్పిడి పంటల వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలున్నప్పటికీ నిర్ధారించు కోకుండానే మన ఆహారవ్యవస్థలోకి ఈ పంట ఉత్పత్తులు వచ్చేశాయి. ముఖ్యంగా సోయా, మొక్కజొన్న, పత్తి గింజల నూనె, పత్తి చెక్కలో ప్రవేశించాయి. వీటివల్ల మరణాలు వెంటనే సంభవించకపోవచ్చు. కానీ, రాగల అనేక అనారోగ్య సమస్యల మాటేమిటి? ముఖ్యంగా ఎండోక్రైన్‌ గ్రంథులకు సంబంధించిన మధుమేహం వంటి ఆరోగ్యసమస్యల మాటేమిటి?
బిటి విషం..
బిటి విషం అనేది ఒక 'స్ఫటిక ప్రొటీన్‌'. ఇది సహజంగా భూమిలో వుండే బ్యాక్టీరియా (బాసిల్లస్‌ తురంజినిసిస్‌) లో ఉంటుంది. అయితే, వీటిలో కొన్ని రకాలు మాత్రమే విష ప్రభావం కలిగి వున్నాయి. వాటినే సస్యరక్షణ మందుగా వినియోగించారు. ప్రకృతిపరంగా, స్థానికంగా వుండే బిటి స్పటిక పదార్థం సస్యరక్షణకు ఉపయోగపడదు. కానీ, కొన్ని కీటకాల జీర్ణకోశంలో ఈ ప్రొటీన్‌ విడుదలవ్వగానే కొన్ని మార్పులొస్తాయి. ఇలా విడుదలైన ప్రొటీనే విష గుణం కలిగి వుంటుంది. ఇలా జీర్ణకోశంలో జరిగే మార్పు సీతాకోకచిలుక జాతిని నియంత్రించేలా చేస్తుంది. ఒకసారి బిటి విషం చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాక జీర్ణకోశ జీవకణాల్ని చంపుతుంది. ఇది కీటకాలు మరణించడానికి దారితీస్తుంది. అయితే, జన్యుమార్పిడి పంటల్లో బిటి విషం మొత్తం చురుగ్గా వుంటుంది. ఇది వేళ్లతో సహా మొక్క అన్ని భాగాల్లోనూ వ్యాపించి వుంటుంది. ఫలితంగా జన్యుమార్పిడి పంటల్లో వున్న బిటి విషం సస్యరక్షణ మందుగా వాడే బిటి విషం కన్నా భిన్నమైంది. క్షీరదాలలో బిటి విషం అలర్జీల్ని కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బిటి టాక్సిన్‌ క్రై 1ఎబి రకం మానవ జీవకణాలని అంటిపెట్టుకుని వుంటుందని ప్రయోగ పూర్వకంగా ఇటీవల నిరూపించారు. తద్వారా ఆ కణాలు చనిపోతాయి. అయితే, బిటి టాక్సిన్‌ మోతాదు ఎక్కువగా వున్నప్పుడే ఇలా జరుగుతుంది. గర్భిణీలలో బిటి విషం రక్తప్రసరణలో కలిసి పిండాన్ని చేరినట్లు వెల్లడైంది. మానవ జీర్ణవ్యవస్థలో బిటి విష అణువులు విచ్ఛిన్నం కావనీ, కొనసాగుతాయనీ ఇవన్నీ నిర్ధారిస్తున్నాయి. ఇప్పటిదాకా జీవ సాంకేతిక పరిశ్రమల వారు ఇది విచ్ఛిన్నం అవుతుందని చెప్పారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. (మైకేల్‌ ఆంటోనియో తదితరుల నుండి..)
మీకు తెలుసా..?
a జీవం కలిగిన జన్యుమార్పిడి జీవాలు అంటే పునరుజ్జీవం పొంది, పెరగగల శక్తిగలవి. జన్యుమార్పిడి జీవాలన్నీ ఈ శక్తిని కలిగి వుండాల్సిన అవరం లేదు. అంటే, అన్ని జీవం కలిగిన జన్యుమార్పిడి జీవాలు జన్యుమార్పిడి జీవాల్లో భాగం. కానీ, జన్యుమార్పిడి జీవాలన్నీ జీవం కలిగి వుండాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Wednesday, 3 October 2012

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (1)

  • అశాస్త్రీయ ఆచారాలు20
          కొద్దిరోజుల క్రితం మిత్రుడు చంద్రమౌళి మా ఇంటికి వచ్చాడు. అతనూ నాలాగే రిటైర్డ్‌ ఇంజనీర్‌. వస్తూనే నా చేతిలో ఉన్న 'గృహవాస్తు' అనే పుస్తకాన్ని చూశాడు. 'నీకు 'వాస్తు' శాస్త్రం కూడా తెలుసా?' అన్నాడు ఆశ్చర్యంతో.
'నాకు 'వాస్తు' శాస్త్రం కాదని తెలుసు' అన్నాను నవ్వుతూ.
'అదేమిటి? 'వాస్తు' శాస్త్ర గ్రంథాన్ని చదువుతూ 'వాస్తు'ను శాస్త్రం కాదంటావేమిటి?'
'అవును చంద్రమౌళీ! ఈ గ్రంథాన్నే కాదు. ఇంకా అనేక వాస్తు గ్రంథాలు చదివాను కాబట్టే 'వాస్తు'ను శాస్త్రం కాదంటున్నాను'.
'ఎలా చెప్పగలవు? కొంచెం వివరించు' అన్నాడు చంద్రమౌళి ఆసక్తిగా.
'చంద్రమౌళీ! నీకు నాలుగు రాళ్ళిస్తాను. ఆ నాలుగూ, నాలుగు కులాలకు చెందినవంటాను. అంగీకరిస్తావా?' ప్రశ్నించాను చంద్రమౌళిని.
'టెక్నాలజీలో ఒక డిగ్రీని సంపాదించి ఇంజనీరుగా అనేకేళ్లు పనిచేసిన నేను దీన్ని ఎలా అంగీకరిస్తాను? ఎదురుప్రశ్న వేశాడు చంద్రమౌళి.
'వెరీగుడ్‌. వాస్తువాదుల ప్రకారం ఈ భూమి నాలుగువర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందినదిగా వర్ణించబడింది. దానిని వివరిస్తా విను. రంగు, వాసన, రుచి, ఆకారం, దానిలో పెరిగే చెట్లు, ఎత్తుపల్లాలను బట్టి భూమి ఏ వర్ణానికి చెందినదో చెప్పవచ్చట! ముందు రంగుపరీక్షను గూర్చి విను. 'వాస్తు కల్పద్రుమం'లో ఇలా ఉంది.
శ్లో|| శుక్లమృత్స్నాచ యా భూమిర్బ్రాహ్మణా సా ప్రకీర్తితా
క్షత్రియా రక్తమృత్స్నాచ హరిద్వైశ్యా ఉదాహృతా
కృష్ణా భూమిర్భవేచ్ఛూద్రా చతుర్థాపరికీర్తితా||
అనగా, గృహము నిర్మించనున్న స్థలమందలి మృత్తిక లేక మన్ను తెల్లగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎరుపురంగుగానున్న యెడల 'క్షత్రియ భూమి' అనియు, పసుపు వర్ణముగా ఉన్న యెడల 'వైశ్య భూమి' అనియు, నలుపు వర్ణముగా ఉన్నచో 'శూద్ర భూమి' అనీ నిర్ణయించాలని ఆ శ్లోకం యొక్క అర్థం.
'ఇక వాసన పరీక్షకు సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(ఆ కొనసాగింపు వచ్చేవారం తెలుసుకుందాం..)
ఇక వాసన పరీక్ష విను. భూమి అందలి మట్టిని తీసుకొని వాసన చూచినప్పుడు ఆ వాసనను బట్టి ఆ భూమి ఏ కులానిదో చెప్పవచ్చట. 'విశ్వకర్మ ప్రకాశిక'లోని ఈ శ్లోకాన్ని విను.
శ్లో|| సుగంధా బ్రాహ్మణీ భూమిః రక్త గంధాతు క్షత్రియా |
మధుగంధా భవేద్వైశ్యా మద్యగంధాచ శూద్రిణీ ||
అంటే భూమి వాసన జాజి, మల్లె వంటి పుష్పముల సువాసన కలిగి వుంటే 'బ్రాహ్మణ భూమి' అని, రక్తము యొక్క వాసన కలిగి వుంటే 'క్షత్రియ భూమి' అని, తేనె వాసన కల్గినది 'వైశ్య భూమి' అనియు, కల్లు వాసన కల్గిన భూమి అయితే 'శూద్ర భూమి' అనియు నిర్ణయించాలట!
ఇక, రుచిని బట్టి భూమి వర్ణాన్ని నిర్ణయించడాన్ని తెలుసుకుందాం.
శ్లో|| మధురా బ్రాహ్మణీ భూమిః కషాయా క్షత్రియా మతా
ఆమ్లా ద్వైశ్యాభవేద్భూమి స్తిక్తాశూద్రా ప్రకీర్తితా|| (విశ్వకర్మ ప్రకాశిక)
'భూమియందలి మట్టి తీపిగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, వగరుగా ఉన్నచో 'క్షత్రియ భూమి' అనియు, పులుపుగా ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, చేదుగా ఉన్న యెడల 'శూద్ర భూమి' అనియు గుర్తించవలెను' అని అర్థం.
ఇక భూమి ఆకారాన్ని బట్టి దాని వర్ణాన్ని ఎలా నిర్ణయిస్తారో చెబుతాను విను.
శ్లో|| గంభీరా బ్రాహ్మణీ భూమిః నృపాణాం తుంగమాశ్రితా
వైశ్యాసా సమ భూమిశ్చ, శూద్రిణీ వికటాస్మృతా|| (విశ్వకర్మ ప్రకాశిక)
అనగా, గృహము నిర్మించనున్న స్థలము యొక్క ఆకారము గంభీరముగా ఉన్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎత్తుగానున్నచో 'క్షత్రియ భూమి' అనియు, ఎత్తు పల్లములు లేకుండా సమతలం ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, ఎత్తు పల్లముతో ఉన్నచో 'శూద్ర భూమి' అనియు తెలుసుకోవలయును.
భూమియందు పెరిగే చెట్లను బట్టి కూడా ఆ భూమి యొక్క వర్ణాన్ని నిర్ణయించవచ్చట. ఎలాగో విను.
శ్లో|| బ్రాహ్మణీ భూః కుశోపేతా, క్షత్రియాస్యాచ్ఛరాకులా
కుశకాశాకులా వైశ్యా శూద్రా సర్వ తృణాకులా| (విశ్వకర్మ ప్రకాశిక)
అనగా భూమియందు దర్భలు పెరుగుచున్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, కాకి వెదురు పెరుగుచున్నచో 'క్షత్రియ భూమి' అనియు, రెల్లు పెరుగుచున్న యెడల 'వైశ్య భూమి' అనియు, వివిధ గడ్డి రకాలున్న యెడల 'శూద్ర భూమి' అనియు తెలియవలెను.
అంతేకాదు. భూమియందలి పల్లములను అనుసరించి ఆ స్థలము యొక్క వర్ణమును తెలుసుకోగలమని 'వాస్తు సర్వస్వం' చెబుతోంది. దాన్ని విను.
శ్లో|| ఉదక్‌ ప్లవా బ్రాహ్మణీ స్యా త్ప్రాక్లవా క్షత్రియామతా
అవాక్‌ ప్లవాచ వైశ్యాస్యా చ్ఛూద్రిణీ పశ్చిమప్లవా||
అంటే ఉత్తరమున పల్లముగా ఉన్న భూమి 'బ్రాహ్మణ భూమి' అనియు, తూర్పున పల్లముగా ఉన్న భూమి 'క్షత్రియ భూమి' అనియు, దక్షిణము పల్లముగా ఉన్న భూమి 'వైశ్య భూమి' అనియు; పశ్చిమము పల్లముగా ఉన్న భూమి 'శూద్ర భూమి'.
భూమి వర్ణాన్ని గూర్చి చివరగా ఇలా 'వాస్తు సర్వస్వం'లో చెప్పబడింది.
శ్లో|| బ్రాహ్మణీ సర్వసుఖదా, క్షత్రియా రాజ్యదా భవేత్‌
ధన ధాన్యకరీ వైశ్యా శూద్రాతు నిందితా స్మృతా||
అనగా 'బ్రాహ్మణ భూమి' సమస్త సుఖములను ఇస్తుంది. 'క్షత్రియ భూమి' రాజ్య ప్రసాదముగా ఉండును. 'వైశ్య భూమి' ధనధాన్యాలను ఇచ్చును. 'శూద్ర భూమి' నింద్యమైనది, అనగా ఇల్లు కట్టగూడనిది.
ఇప్పుడు చెప్పు చంద్రమౌళీ! రాళ్ళు రప్పలతో వున్న భూమికి కూడా కులాలను ఆపాదించడం, అందులోనూ భూమిలోని ఒక్కో స్థలం ఒక్కో వర్ణానికి చెందిన భూమిగా అనడం అశాస్త్రీయం కాదా? భూమి వివిధ వాసనలతోనూ, అనేకరకాలైన రుచులూ కల్గి ఉంటుందనడం శాస్త్రీయమా? అందులోనూ మంచి వాసన, తీపి రుచీ ఉంటే అది 'బ్రాహ్మణ భూమి' అట! కల్లు లేక సారావాసన, చేదు రుచీ ఉంటే 'శూద్ర భూమి' అట! ఇది శూద్రులను అవమానించడం కాదా? భూమి గంభీరంగా ఉంటే బ్రాహ్మణ భూమి అట! ఎత్తు పల్లములుగా ఉన్న భూమి శూద్రభూమి అట! భూమి గంభీరంగా ఉండటమంటే ఏమిటి? ఏ వాస్తు పండితుడైనా వివరించగలడా? నల్లటి భూమి 'శూద్ర భూమి' అని ముందు చెప్పి ''కృష్ణ వర్ణో ధమాధ¸మం'' అంటే నల్లటి భూమి చెడ్డవాటిలో చెడ్డది అని తర్వాత చెప్పబడింది. ఇది కూడా శూద్రులను అవమానించడం కాదా? అంతేకాదు, పడమర పల్లంగా ఉన్న భూమి 'శూద్ర భూమి' అనీ, అది 'అధమాథమ భూమి' అనీ, అలాంటి భూమిలో ఇల్లు కట్టుకుంటే కష్టనష్టాలు కలుగుతాయనీ చెప్పబడింది. మనదేశంలో ముంబయి, కొచ్చిన్‌, మంగళూరులాంటి పట్టణాలూ, గోవా రాష్ట్రం పశ్చిమతీర ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రదేశాలలో భూమి పశ్చిమం పల్లంగా ఉంటోంది. మనదేశంలోని అత్యంత సంపన్నులు ఆ ప్రదేశాలలోనే ఉంటున్నారు. ఇది వాస్తు విరుద్ధమైన విషయం కాదా? అంతేకాదు. మరో ముఖ్య విషయాన్ని ''వాస్తు ప్రదీపం'' ఇలా తెలియజేస్తోంది.
శ్లో|| స్వవర్ణ గంధ సురసా ధన ధాన్య సుఖా వహా|
వ్యత్యయే వ్యత్యయ ఫల మతః కార్యం పరీక్షణం||
అనగా 'తన వర్ణమునకు సరైన వర్ణము, వాసన, రుచి గల భూమి ధనధాన్య సుఖములనిచ్చును. అట్లుగాక తన వర్ణమునకు వ్యతిరేకమైన వర్ణము, వాసన, రుచిగల భూమి నష్టమును కలుగజేయును'' అని తెలియజేస్తోంది. అంటే శూద్రులు ఏదైతే వాస్తువాదులు అధమాధమ భూమిగా ప్రత్యేకించి పేర్కొన్నారో దానిపైనే నివసించాలనీ, అలా ఉంటేనే వారికి సుఖములు కలుగుతాయనీ పేర్కొనడం అమానుషం కాదా?
'ఇలా అత్యంత అశాస్త్రీయంగా, అమానుషంగా భూమిని విభజించిన 'వాస్తు' శాస్త్రం ఎలా అవుతుంది?' అన్నాను.
చంద్రమౌళి మౌనంగా ఉండిపోయాడు.
'వాస్తు గ్రంథాలలో, ఇల్లు కట్టవలసిన భూమికి సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(మరికొన్ని అంశాలు వచ్చేవారం)
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

జీవవైవిధ్య సదస్సు ప్రాధాన్యతేమిటి?



          జీవవైవిధ్య పేరిట హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రస్తుతం జరుగుతోంది కదా! దాని ఉద్దేశ్యాలు ఏమిటి? జీవవైవిధ్యం అంటే ఏమిటి? సదస్సు అవసరమేమిటి? - జి.నమ్రత, హైదరాబాద్‌
మనం ఇదే శీర్షికలో చాలాసార్లు భూమి పుట్టుపూర్వో త్తరాలు గురించి, భూమ్మీద జీవావిర్భావం గురించి కొంచెం విశదంగానే తెలుసుకున్నాం. నిర్జీవ పదార్థాల నుంచే గతితార్కిక పద్ధతిలో భూమ్మీద నాడున్న భౌతిక పరిస్థితుల ప్రోత్సాహంతో జీవపదార్థం రూపొందింది. దాదాపు 550 కోట్ల సంవత్సరాల వయస్సున్న ఈ భూమ్మీద సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవాణువు (biomolecule) ఏర్పడ్డట్టు, ఆ జీవ రసాయనిక అణువులే (biochemicals) సంధానించుకొని జీవానికి ప్రమాణమైన (unit of life) జీవకణం (biological cell) ఏర్పడింది. మూలకాలు కేవలం 100 లోపే ఆరోజుల్లో ఉన్నా అవి సమన్వయంగా పరమాణు(atomic) రూపం నుంచి అణురూపంలోకి అమరే విధాలు గణితశాస్త్రం ప్రకారం లక్షలాది విధాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలు 26 మాత్రమే అయినా ప్రపంచంలో ఉన్న ఆంగ్ల వాఙ్మయం మొత్తం ఆ 26 లక్షరాల జిగిబిగి కలయికల ద్వారా వచ్చిన పదాల, వాక్యాల మేలు కలయిక (వ్యాకరణ బద్ధంగా) అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మరో ఉదాహరణగా పదంటే పదిగా ఉన్న అంకెల (0 నుండి 9 వరకు) తోనే అన్ని సంఖ్యలు ఏర్పడ్డాయి కదా!
ఒక లెక్క వేద్దాం. ఉదాహరణకు ప్రపంచంలో కేవలం A,L,O,P,T అనే 5 అక్షరాలే ఉన్నాయనుకుందాం.. అవి కేవలం 4 లక్షరాలకు మించి బంధం ఏర్పర్చుకోలేవని ఊహిద్దాం. అలాంటపుడు ఈ 5 అక్షరాల ద్వారా 4 అక్షరాలకు మించని పదాలు ఎన్నో తెలుసా! ఒక అక్షరం కూడా పదమే కావచ్చు కాబట్టి A,L,O,P,T = 5 పదాలు
రెండు అక్షరాలుగా ఉన్న పదాలు: AA, AL, AO, AP, AT, LA, OA, PA, TA, LL, LO, LP, LT, OL, PL, TL, OO, OP, OT, PO, TO, PP, PT, TP, TT = 25 మూడు అక్షరాలు ఉన్న పదాలు.. AAA, AAL, AAO, AAP, AAT, LAA, OAA, PAA, TAA, LLA, ALA, AOA, APA, ATA, ALL, AOO, APP, ATT, LAL.. TTT = 125 ఇక నాలుగక్షరాలు మాత్రమే ఉన్న పదాలు: AAAA, AAAA, AAAL, AAAO, AAAP, AAAT, LAAA, OAAA, PAAA, TAAA,…………. TTTT = 625
మొత్తం : 5+25+125+625 ొ 780. అంటే కేవలం 5 అక్షరాలతోనే 780 పదాలు ఏర్పడ్డా అన్ని పదాలకు అర్థంపర్థం లేకపోవచ్చును. ఉదాహరణకు ఏకాక్షర పదాలైన ఐదింటిలో కేవలం A,O లు మాత్రమే భాషలో చూస్తాము. అలాగే రెండు అక్షరాలుగా ఉన్న 25 పదాల్లో అర్థం ఉన్నవి కేవలం AT, LO, TO అనే మూడు పదాలే ఇంగ్లీషు నిఘం టువులో ఉన్నాయి. ఇదేవిధంగా మూడు అక్షరాలున్న పదా లు 125 ఉన్నా ALL, POT, TOP, OPT, PAT, TAP, LAP, TOO,TAT, LOT, PAL, వంటి కొన్నిపదాలు మాత్రమే అర్థవంతంగా ఉన్నాయి. మరి 26 అక్షరాలున్న మొత్తం ఆంగ్ల భాషలో సాధ్యముకాగల పదాల సంఖ్య కొన్నికోట్ల వరకు ఉంటాయి.
ఈ ప్రశ్నలో తలెత్తిన జీవ వైవిధ్యానికీ, ఈ ఆంగ్ల పదాలకు వున్న సంబంధమేమిటి అన్న కొత్త ప్రశ్న పాఠకులకు రాకముందే ఆ సంబంధ మేమిటో తెలుసుకుందాం. అర్థం ఉన్న పదాలే స్థిరమైన పదార్థాలనుకుందాం. ఆ అర్థవంతమైన పదాల్లో నామవాచ కాలు మాత్రమే జీవపదార్థాలనుకుందాం. అంటే భూమ్మీద అక్షరాలు అనబడే మూలక పర మాణువుల మిశ్రణం (admixture) సంభాప్యత (probabilistic) గా ఎన్నో విధాలుగా ఉన్నా ప్రకృతిలో స్థిరంగా ఉన్న పదార్థాలు అర్థవంతమైన పదాల్లాగా కొన్నే ఉంటాయి. ఇందులో ప్రత్యేక భంగిమలో ఏర్పడే జీవంగల ఆ పదాలే DNA సమ్మిళిత జీవకణాలు. అటువంటి జీవ కణాల్లో ఉన్న spellingఅస్త్రను మనం ఆయా క్రోమోజోముల్లో ఉన్న ణచీA శృంఖలంలో ఉన్న జన్యువైవిధ్యాని (gene diversity) కి సూచికగా భావిద్దాం. జీవకణంలో ఉన్న కేంద్రకం (cell nucleus లోని క్రోమోజోముల్లో ఉన్న DNA స్మృతే ఆయా జీవజాతి (species) ని నిర్దేశిస్తుంది. అంటే సుమారు 400 కోట్ల సంవత్సరాలుగా ఆ తొలిరోజుల్లో వేగవంతంగా, ఆ తర్వాత కొంత మందకొడిగా జరిగిన జీవకణవృద్ధి, జీవకణాల పరిణామం (biological cellular evolution) ద్వారా వేలాదిగా ఏకకణజీవులు రూపొందాయి. ప్రత్యేక జీవ లక్షణాలున్న పదార్థాలలో నిర్మితమైన జీవకణానికి మిగిలిన నిర్జీవ పదార్థాలకు లేని లక్షణాలు చేకూరాయి. ఏర్పడిన జాతులు ప్రకృతితో తలపడే క్రమంలో తనలో జరిగే గతి తార్కిక మార్పుల ద్వారా పలుజాతులుగా శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఈ వ్యవహారాన్నే మనం 'జీవ పరిణామం (Biological Evolution) లేదా 'ప్రకృతి వరణం ద్వారా జీవపరిణామం (Organic evolution by Natural Selection)µ అంటున్నాము. ప్రకృతికి అనువుగా ఉండేవి, పోరాడగలిగేవి నిలిచాయి. మిగిలినవి ఆదిలోనే అంతరిం చాయి. ప్రకృతికి అనుగుణంగా ఉన్న అన్నివిధాల జీవ జాతులు సమిష్టిగా ఈ భూమ్మీద గత 400 సంవత్స రాలుగా పలు దశల్లో ఉన్నాయి. దీన్నే Biodiversity అంటున్నాము. ఆ క్రమంలోనే కేవలం 20 లక్షల సంవత్సరాల క్రితమే మానవజాతి (human species : Homo sapiens) అనే మనం రూపొందాము. లక్షలాది రకాల మొక్క లు, వేలాది రకాల పురుగులు, వందలాది రకాల పిట్టలు, లక్షలాది రకాల క్రిములు, వందలాది రకాల చేపలు, కోట్లాది రకాల వృక్షజాతులు, సకశేరుకాలు (vertebrates)అకశేరుకాలు (invertebrates), గుడ్లు పెట్టేవి, గుడ్లు తినేవి, ముళ్ల, తీగ చెట్లు, కలబందలు, తుమ్మెదలు, గాడిదలు, నందులు, పందులు, కందులు, మెంతులు, చింతలు, పొటాటోలు, టమేటాలు, చీమలు, దోమలు, గొల్లభామలు, తాబేళ్లు, కుందేళ్లు, మేకలు, కాకులు, జలగలు, మునగలు, శనగలు, పీతలు, కోతులు, చెరకులు, చెదపురుగులు, గవ్వలు, గువ్వలు, రొయ్యలు, పెయ్యలు, ....... ఇలాంటి అనంత జీవకోటికి ఈ అవని ఆవాసాన్ని చ్చింది. ఈ భూమ్మీద ప్రతి మొక్క, ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి జంతువు మానవుడి కంటే ముందే పుట్టాయి. చెట్లు లేనిదే మనిషి లేడు. ఇతర ఏ జంతువులు మనలేవు. చెట్లు ఆహారంతోపాటు ఆక్సిజన్‌ను కూడా విడుదల చేస్తాయి. భూగోళ తాపాన్ని కల్గించే లక్షణ మున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. అలాగే రకరకాల పిట్టలు, బాక్టీరియాలు, జంతువులు మానవుడికీ వాటిలో వాటికీ ఉపకరి స్తున్నాయి. ఎంతో సౌష్టవంగా, పద్ధతి ప్రకారం నడుస్తున్న ఈ విశాల ప్రపంచంలో ఉన్న వివిధరకాల జీవజాతుల పరస్పరాధారిత మనుగడనే మనం 'జీవవైవిధ్యం' అంటున్నాము. అయితే కొందరు వ్యాపార వేత్తలు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు ప్రకృతి వనరుల్ని ఉన్నఫళాన లూటీ చేసుకుంటున్నందువల్ల అద్భుతమైన జీవవైవిధ్యానికి ప్రమాదం వాటిల్లుతోంది.
ఈ నెల ఒకటవ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వివిధ ఘట్టాలుగా, దశదశలుగా హైదరాబాదులో జరుగుతున్న చర్చలే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు (International Biodiversity Summit).µ ఇది కేవలం సదుద్దేశంతోనే, ప్రజా సంక్షేమమే పరమావధిగా జరుగుతున్నట్టు భావించలేము. కొందరు చేస్తున్న గజదొంగల దోపిడీని కప్పిపుచ్చి జీవవైవిధ్యానికి ఆపద కలిగిస్తున్నది తామే కాదు అందరూనూ అని తప్పు పక్కవాడి మీదకు నెట్టే ఉద్దేశమూ లేకపోలేదు. ప్రపంచంలో ఒకప్పుడున్న జీవుల్లో సుమారు ఒక శాతం మాత్రమే నేడున్నాయంటే ఆందోళన కలగక మానదు. '2011- 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవవైవిధ్య దశాబ్ధం (International Decade of Biodiversity)µ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జీవవైవిధ్యంలో ప్రపంచం మొత్తంలో 25 శాతం ఒక్క భారతదేశంలోనే ఉన్నట్టు పరిశోధనలు ఋజువు చేశాక అందరికళ్లు మనమీద పడ్డాయి. మన జీవజాతుల్ని, జీవసంపదను కాపాడుకోవాలి. అనవసర జన్యుమార్పిడి పద్ధతులు ఏమాత్రం అవసరం లేదని అందరం ఎలుగెత్తి చాటాలి.

అపెండిసైటిస్‌కి ఇక మందులతో చెక్‌!

                సాధారణంగా తీవ్రమైన అపెండిసైటిస్‌కి ఆపరేషన్‌ చేసి తొలగించడమే మార్గం! కానీ, తీవ్ర అపెండిసైటిస్‌తో బాధపడే వారిలో 80 శాతం మందికి సరైన యాంటీబయాటిక్‌లు వాడి సమస్యను తగ్గించవచ్చనీ, ఆపరేషన్‌ అవసరం లేకుండా నయం చేయవచ్చనీ స్వీడన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు. అయితే, యాంటీబయాటిక్‌లు వాడటం వలన సమస్య పూర్తిగా సమసిపోదనీ వీరు భావిస్తున్నారు. భవిష్యత్తులో, మళ్ళీ అపెండిసైటిస్‌ తలెత్తే ప్రమాదం ఉందట. కానీ, ఆపరేషన్‌ను తప్పించుకునేందుకు ఇదొక మార్గమని పరిశోధకులు భావిస్తున్నారు.

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

'యవ్వన గుళిక' దగ్గరలోనే ఉంది..!



             కండరాలు మళ్ళీ శక్తినీ, బలాన్నీ పుంజుకోవడం ఎలాగో తెలిసిన నేపథ్యంలో శాస్త్రజ్ఞులు యవ్వన గుళికను రూపొందించే దిశలో మరో ముందడుగు వేశారు. లండన్‌, హార్వార్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కండరాలలోని మూల కణాలపై అధ్యయనం చేస్తూ వయస్సుతోబాటు కండరాలలో పునరుత్పత్తి శక్తి ఎందుకు తగ్గిపోతోంది అన్న విషయంపై పరిశోధిస్తున్నారు. వయస్సుతోబాటు మూలకణాలు కూడా క్షీణించడాన్ని వీరు గమనించారు. అందుకు కారణమైన ఒక ప్రొటీన్‌ను గుర్తించారు. ఆ ప్రొటీన్‌ని గనక నియంత్రించగలిగితే వయస్సు మళ్ళినవారిలో కండరశక్తిని పెంపొందించవచ్చని వీరి అంచనా.

నిరంతరం నిలిచే చిప్‌..!

 


          అతి తీవ్ర ఉష్ణోగ్రతలను, ఇతర వాతావరణ పరిస్థితులను తట్టుకుని, సమర్ధవంతంగా పనిచేసే చిప్‌ను జపాను కంపెనీ 'హిటాచీ' రూపొందిం చింది. ప్రస్తుతం వాడుతున్న చిప్‌లు, హార్డ్‌డిస్క్‌లు అధిక ఉష్ణోగ్రతలో, నీటిలో పాడైపోయే ప్రమాదం ఉంది. హిటాచి రూపొందించిన ఈ కొత్త వాటర్‌ప్రూఫ్‌ చిప్‌ రేడియో తరంగాలు, రసాయనాల వల్లా దెబ్బతినదట! ఇదేగాక, ఈ చిప్‌ వెయ్యి డిగ్రీల సెల్సియస్‌లో వేడిచేసినా, నిప్పుల్లో ఓ రెండుగంటలపాటు కాల్చినా కూడా పాడుకాదట! అనూహ్యంగా పెరిగి, పేరుకుపోతున్న సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికీ, రానున్నతరాలకు అందించడానికీ, మనం కొత్తగా ఏమీ చేయలేదు. కొత్త చిప్‌ తరహా దుర్భేద్యమైన సమాచార నిక్షిప్తంచేసే పరికరం ఎంతైనా అవసరమే!

చంద్రుడి కన్నా కాంతిగల తోకచుక్క!



          వచ్చే సంవత్సరం అంతరిక్షంలో ఒక అద్భుతం జరగనుంది. చంద్రుడికంటే సుమారు పదిహేను రెట్ల కాంతివంతమైన తోకచుక్క (కామెట్‌) పట్టపగలే ఆకాశంలో కనిపించే అవకాశం ఉందని తెలిసింది. ఐసాన్‌ (×ూఉచీ) గా పేరు పెట్టబడిన ఈ కామెట్‌ ఉత్తరార్ధ గోళంలో రానున్న నవంబర్‌, డిసెంబర్‌ మాసాలలో దూసుకుపోనుంది. రష్యా అంతరిక్ష పరిశోధకులు కనిపెట్టిన ఈ ×ూఉచీ సూర్యుడివైపు కదులుతుందట! అది సూర్యుడికి రెండు మిలియన్‌ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఆ కామెట్‌ జూపిటర్‌కి సమీపంలో ఉంది.

పిల్లల్లో సరికొత్త సమస్య..!



           ఎక్కువసేపు ఎలక్ట్రానిక్‌ పరికరాలతో కాలంగడిపే పిల్లలకు 'ఇంటర్నెట్‌ యూజ్‌ డిజార్డర్‌' అనే సరికొత్త మానసికవ్యాధి సోకే ప్రమాదం అధికంగా ఉందని ఇటీవల గుర్తించారు. ఇంటర్నెట్‌, వీడియో గేమ్స్‌ వంటివి మత్తు మందుల మాదిరిగా అలవాటయ్యే అవకాశాలూ ఉన్నాయని తెలిసింది. నిర్లిప్తత, దేనిపైనా మనసును లగం చేయలేక పోవడంతో పాటు ఆ పరికరాలను దూరం చేయడంగానీ, మానిపించడంగానీ చేసినపుడు 'విత్‌ డ్రాయల్‌' లక్షణాలు ఎక్కువగా బాధిస్తాయట! ప్రస్తుతం లభిస్తున్న అనేకానేక ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల దీర్ఘకాలంలో దెబ్బతినేది పిల్లలే అని తేలింది. ఎస్‌ఎంఎస్‌లు, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ నెట్‌ వర్క్‌ల వలన పెద్దల జీవితాలలోనే విపరీతాలు జరగడం చూస్తు న్నాం. ఇక పిల్లల్లో ఏకంగా మానసిక దుష్పరిణామాలు వస్తాయంటే జాగ్రత్త వహించాల్సిందే. తల్లిదండ్రులూ! మరి మీ పిల్లల్ని ఓ కంట గమనించండి..!!

జన్యుమార్పిడి పంటలు ... జీవవైవిధ్యం ....


ప్రకృతిలో సహజంగానే పరాగ సంపర్కం లేక పర్యావరణ ఒత్తిళ్ల వల్ల, జాతుల్లో అంతర్గతశక్తుల వల్ల జన్యుమార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు జాతుల వైవిధ్యానికి మూలం. ఇది సహజప్రక్రియ. దీనిని నివారించలేం. కానీ, ప్రయోగశాలల్లో జన్యుమార్పుల సాంకేతికంతో రూపొందే పంటలు అలాంటివి కావు. ఈ కొత్త సాంకేతికం భిన్నజాతుల మధ్య జన్యుమార్పిడికి వీలు కలిగిస్తుంది. ఇలా కొత్తగా ప్రవేశపెట్టే జన్యువుల ప్రభావం జీవవైవిధ్యం, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పటి విజ్ఞానశాస్త్రం ఎదుర్కొంటున్న సమస్య. పూర్తిగా నియంత్రించిన వాతావరణంలో జరిగే జన్యుమార్పుల ప్రభావాల్ని గుర్తించి, నివారించవచ్చు. కానీ, నియంత్రించలేని బహిరంగ పర్యావరణ పరిస్థితుల్లో జరిగే జన్యుమార్పిడి ప్రభావాల్ని ఊహించి, నియంత్రించలేం. ఒకవిధంగా చెప్పాలంటే తుపాకీ పేలి, బులెట్‌ విడుదలయ్యేంతవరకే బులెట్‌పై నియంత్రణశక్తి మన చేతిలో ఉంటుంది. కానీ, ఒకసారి తుపాకి పేలి, బులెట్‌ విడుదలైన తర్వాత అది కలిగించే నష్టంపై మనకు ఏ నియంత్రణా వుండదూ. ఇలాంటదే 'జన్యుమార్పిడి సాంకేతికంతో రూపొందే పంట'. ఈ నేపథ్యంలో, విస్తారంగా సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటలు జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. లేకపోతే, రాగల దుష్ప్రభావాలను ఎదుర్కోలేం. ఈ ప్రభావాల్ని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
విజ్ఞానశాస్త్రం ఎల్లప్పుడూ వాస్తవాల ఆధారంగా అనుభవాల ప్రభావంతో అభివృద్ధి చెందుతుంది తప్ప, ఎవరి ప్రచారం వల్లా కాదు. కానీ, వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు విజ్ఞానశాస్త్రాన్ని స్వాధీనం చేసుకుంటే ఇలాగే జరుగుతుందనీ చెప్పలేం. శాస్త్రజ్ఞులు కూడా నిస్వార్థంగా ఉంటారనీ చెప్పలేం. జన్యుమార్పిడి సాంకేతికాలతో రూపొందే పంటల ప్రభావాలను అంచనా వేయ డంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. తక్షణ లాభాల్ని, వాణిజ్య ప్రయోజనాల్ని సమర్థించే శాస్త్రజ్ఞులు ఒక వర్గంగా, దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే శాస్త్రజ్ఞులు మరో వర్గంగా విభజనకు గురయ్యారు. అన్ని వనరులపై ఆధిపత్యంగల వ్యాపార, వాణిజ్య వర్గాలను సమర్థిస్తున్న శాస్త్రజ్ఞులు (ఇటువంటి వారిని నిజమైన శాస్త్రజ్ఞులుగా భావించకూడదు) ప్రజల్ని పూర్తి వాస్తవాల్ని తెలుసుకోనీయకుండా అయోమయంలో పడేస్తున్నారు. ఇలాంటి వారిని 'శాస్త్ర వ్యాపారులు'గా భావించాలి.
జన్యు సాంకేతికాల నేటి స్థితి..
సాంప్రదాయ ప్రజననం ద్వారా కొత్త రకాల్ని రూపొందించ డానికి భిన్నజాతుల్లోని అభిలషించే గుణగణాలను కావాల్సిన పంటల్లో చొప్పించి, కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. ఇది సాధ్యంకానప్పుడు జన్యుమార్పిడి సాంకేతికాల్ని ఉపయోగించి, విజాతిలో కావల్సిన గుణగణాన్ని కలిగించే జన్యువును గుర్తించి, అభివృద్ధిపర్చాల్సిన వంగడంలో జొప్పించి కొత్తరకాన్ని రూపొందిస్తారు.
ఈ రంగంలో పరిశోధనలు అత్యధికంగా ప్రైవేటు, బహుళజాతి కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అమెరికన్‌ బహుళజాతి కంపెనీలు మోన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇవి కేవలం, తక్షణ లాభాల కోసమే పనిచేస్తున్నాయి. వచ్చే దీర్ఘకాల నష్టాల్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి కంపెనీ (బయోటెక్‌ పరిశ్రమ) లు ఈ పంటలు కలిగించే పర్యావరణం, ఇతర ప్రభావాల్ని నిర్ద్వంద్వంగా నిరూపణ చేసుకోకుండానే వీటి సేద్యాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నాయి. దూరదృష్టిగల శాస్త్రజ్ఞుల పరిశోధనలకు ఎన్నో ఆటంకాల్ని కలిగిస్తున్నాయి. మనదేశంతో సహా, అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్న దిదే. ఈ కంపెనీ శక్తులు ఆయా ప్రభు త్వ శాస్త్ర, సాంకేతిక విధానాలను ప్రభావితం చేస్తూ జన్యుమార్పిడి పం టల రూపకల్పన, ఇతర అంశాలపై పరిశోధనలు జరగకుండా ఆటంకపరు స్తున్నాయి. మన దేశంలో ప్రభుత్వ సం స్థల పత్తి పరిశోధనలకు ఎదురవుతు న్న ఆటంకాలే దీనికి తాజాఉదాహరణ.
చైనాలాంటి దేశాలలో జన్యు మార్పిడి సాంకేతికాల్ని వినియోగిస్తూ అధికదిగుబడి వంగడాల్ని రూపొంది స్తుండగా, మనదేశంలో కేవలం హైబ్రిడ్‌ రకాలకే ఈ సాంకేతికాలు పరిమితం చేయబడుతున్నాయి. ఫలితంగా, రైతులు తమ సొంత విత్తనం వాడుకునే స్వేచ్ఛను కోల్పోయి, కంపెనీల నుండి అధికధరలకు కొనాల్సి వస్తుంది. పైగా, విత్తనోత్పత్తిలో వినియోగిస్తున్న సాంకేతికానికి విలువకట్టే అధికారం తమకే కలదనీ, ప్రభుత్వానికి లేదనీ ఈ కంపె నీలు కోర్టులో వాదిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు బిటి సాంకేతికంతో రూపొందిస్తున్న 'నర్సింV్‌ా, బికనేరి నర్మా' వంటి అధిక దిగుబడి వంగడాలు రైతులకందకుండా అడ్డుపడ్తు న్నాయి. కీలకస్థానంలోని కొంతమంది రాజకీయవేత్తలు, అధికారులు ఈ కంపెనీలకు సహాయపడుతున్నారు. ఈ విషయాల్ని బయో టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ గుర్తించి, తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్యంపై జన్యుమార్పిడి పంటలు చూపగల ప్రభావాల్ని అర్థంచేసుకోవాల్సి వుంటుంది.
జన్యుమార్పిడి పంటల స్థితి..
జన్యుమార్పిడి పంటల్ని 2011 నాటికి ప్రపంచంలో 395 మిలియన్‌ ఎకరాలలో సేద్యం చేస్తున్నారు. వీటిని 29 దేశాల్లో 17.7 మిలియన్‌ రైతులు సేద్యం చేస్తున్నారు. వీరిలో 90% మంది వనరులు పరిమితంగా గల చిన్నరైతులు.
సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటల్లో కలుపుమందును తట్టుకునే రకాలే గరిష్టంగా 78 % మేర వున్నాయి. వీటిలో కలుపు నియంత్రణకు అత్యంత శక్తివంతమైన గ్లైఫోసేట్‌ అనే మందును అధికంగా వాడుతున్నారు. ఇది పర్యావరణంపై, జీవవైవిధ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. దీని తర్వాత అంతర్గతంగా విషం తయారుచేస్తున్న (బిటి) పంటలు 17-18 % మేర సేద్యమవుతున్నాయి. ఇతర అన్ని ఉపయోగాలకు కలిపి 5 % కన్నా తక్కువ విస్తీర్ణంలో సేద్యమవుతున్నాయి.
సోయాబీన్‌, పత్తి, మొక్కజొన్న, కెనోలా (నూనె ఆవగింజల) నాలుగు బిటి రకాల పంటలు ప్రధానంగా సేద్యమవుతున్నాయి. ప్రపంచ సేద్య విస్తీర్ణంలో 75 శాతం సోయాబీన్‌లో, 82 శాతం పత్తిలో, 32 శాతం మొక్కజొన్నలో, 26 శాతం కెనోలాలో బిటి రకాలు సేద్యమవుతున్నాయి.
జీవవైవిధ్యంపై ప్రభావాలు...
ఒక్కమాటలో చెప్పాలంటే జన్యుమార్పిడి పంటలు పర్యావరణం, జీవవైవిధ్యంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల ద్వారా జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
బ్రిటన్‌లో కలుపుమందుల నిరోధకశక్తిగల పంటల వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతున్నట్లు గుర్తించారు. మామూలుగా పక్షులు కలుపు మొక్కల గింజల్ని తింటాయి. జన్యుమార్పిడి రకాలైన బీట్‌రూట్‌, నూనె ఆవగింజల సేద్యంలో కలుపు మొక్కల విత్తనాల ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. దీంతో పక్షులకు ఆహారం దొరకక వాటి సంఖ్య తగ్గిపోయింది.
ముఖ్యంగా జన్యుపంటల పుప్పొడి పక్కనే సేద్యమవుతున్న సాంప్రదాయ పంట మొక్కలపై పడినప్పుడు జన్యు కలుషితమవుతుంది. ఇలా ఈ పుప్పొడి ఎంతదూరం విస్తరిస్తుందనేది ఆయా పంటలు, చుట్టూ వున్న వాతావరణపరిస్థితులపై ఆధారపడి వుంటుంది. ఇలా ఒకే జాతి మొక్కల్లో జరిగే మార్పును 'సమాంతర జన్యు మార్పిడి (హారిజాంటల్‌ జీన్‌ ట్రాన్సఫర్‌)'గా వ్యవహరిస్తున్నారు. ఇతర జాతులకూ ఇలా బిటి రకాల పుప్పొడి విస్తరించవచ్చు. ఇలా విస్తరించడాన్ని 'భిన్నజాతుల జన్యుమార్పిడి (వర్టికల్‌ జీన్‌ ట్రాన్సఫర్‌)' గా వ్యవహరిస్తున్నారు. ఈ జన్యుమార్పిడి ఇలా జరగవచ్చు.
* పరాయి జన్యువు (ప్రొటీన్‌ అణువు)ను బాక్టీరియా నేరుగా తీసుకోవచ్చు.
* ప్రొటీన్‌ జీర్ణకోశంలోకి వెళ్లినప్పుడు అది ఆ జీవి కణజాలాల్లోకి ప్రవేశించవచ్చు.
* అగ్రో బ్యాక్టీరియం అనే బాక్టీరియా ద్వారా కూడా ఇతర జీవాల్లోకి ఈ జన్యువు వ్యాపించవచ్చు. ఈ బాక్టీరియాను కణతుల ద్వారా గుర్తించవచ్చు. జన్యుమార్పిడి పంటల తయారీలో జన్యుమార్పిడి కోసం ఈ బాక్టీరియాను వినియోగిస్తారు. ఈ బాక్టీరియా సహజంగా కూడా పర్యావరణంలో వుంటుంది.
* వైరస్‌ల ద్వారా కూడా జీవాల మధ్య జన్యువు మారవచ్చు.
అంతర్గత విష రకాల ప్రభావం..
విషానికి ఉద్దేశించిన కీటకాల్లో నిరోధకశక్తి పెరుగుతుంది. విష ప్రభావం వల్ల ఉద్దేశించిన కీటకాల సంఖ్య తగ్గినప్పటికీ, ఇతర కీటకాలు పుంజుకుంటాయి. ఉదా: బిటి పత్తిలో కాయతొలుచు పురుగు 90 రోజుల వరకూ తగ్గినప్పటికీ, రసంపీల్చు పురుగులు, ఇతర కీటకాలు ఉధృతమవుతున్నాయి. కొత్తరకం వైరస్‌ జబ్బులు (ముడత రోగం) వస్తున్నాయి. భూమిలో వుండే సూక్ష్మజీవులు (బాక్టీరియా, ఫంజి - బూజు) కూడా ప్రభావితమవుతున్నాయి. ఫలితంగా, నేలల్లో సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుంది.
పార్లమెంటుకమిటీ నిర్ధారణ..
జన్యుమార్పిడి పంట (బిటి పత్తి) ప్రవేశం, అపుడు చేపట్టిన అతి ప్రచారం రైతుల్ని సాంప్రదాయ రకాల నుండి మళ్లించింది. ఫలితంగా ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. సేద్యంలో లేవు. ఈ విత్తనాల్నీ ఎవరూ ఉత్పత్తి చేయడం లేదు. విదర్భ (మహారాష్ట్ర) పత్తి రైతుల్లో కొనసాగుతున్న దుస్థితి, ఆత్మహత్యల నేపథ్యంలో బిటి రకాల సేద్యాన్ని మానుకొని అనుకూలమైన సాంప్రదాయ అధికదిగుబడి రకాలను తిరిగి సేద్యం చేయడానికి ఎంత ప్రయత్నించినా విత్తనాలు దొరకలేదని బయో టెక్నాలజీపై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ స్వయంగా మార్చి, 2012లో గమనించింది. ఏకపంట (బిటి పత్తి) సేద్య దుష్ఫలితాలను ఈ కమిటీ స్వయంగా నిర్ధారించింది. జీవవైవిధ్యాన్ని సురక్షితంగా జన్యు బ్యాంకుల్లో పరిరక్షిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను పార్లమెంటు కమిటీ తప్పుపట్టింది. ఇది ప్రభుత్వానికి పురావస్తు భాండగారం (మ్యూజియం)లో ఉంచిన సంతోషాన్ని కలిగిస్తుందని కమిటీ విమర్శించింది. మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతితో సహజంగానే మరింత జీవవైవిధ్యం అవసరమని, ఇది ఆవిర్భవించడానికి జన్యుబ్యాంకులు తోడ్పడవని కమిటీ అభిప్రాయపడింది. 'నగోయా' ఒప్పందం ద్వారా పొందగలిగే ప్రయోజనాల్లో మనదేశ ప్రయోజనాలు పెద్దఎత్తున ఇమిడి వున్నందున ఎంతో సుసంపన్నమైన మన జీవ వైవిధ్యాన్ని నష్టపోకుండా కొనసాగించాలని కమిటీ నొక్కి చెప్పింది. అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని, భద్రతను సుస్థిరంగా కొనసాగించడానికి ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని, అస్థిరత్వంతో కూడిన జీవసాంకేతికాలపై ఆధారపడకూడదని కమిటీ నొక్కి చెప్పింది.
(జీవ సాంకేతికాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రిపోర్టు నివేదిక పేరాలు 8.114 నుండి 8.118 వరకు)
బిటిలో తేడా..!
మనదేశంలో బిటి పత్తి సేద్యం ప్రారంభమైనప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా, బిటి సేద్యా న్ని సమర్థిస్తూ విస్తరించడానికి మోన్‌శాంటో, దాని సమర్ధకులు ''ఇప్పుడు పెరుగు తున్న వ్యవసాయోత్పత్తి అవసరాలను తీర్చుకోడానికి బిటి ('బయో టెక్నాలజీ') తప్ప మరొకటి లేదని, ఇది అనివార్యమని, ప్రతి కొత్త సాంకేతికంలో ఏదో ఒక రిస్క్‌ వుం టుందని, వాటిని ఎదుర్కొనక తప్పదని'' ప్రచారం చేస్తున్నారు. తద్వారా బిటి పత్తి లోపాల్ని కప్పిపుచ్చుతున్నారు. పైగా, బలవంతంగా అమ్మే అగ్రిసివ్‌ సేల్స్‌ మెన్‌షిప్‌ను చేపట్టారు. ఈ సందర్భంలో 'బిటి' అనే పదాన్ని 'పత్తి' పంటకు, జీవ సాంకేతిక విజ్ఞానానికి ఒకే విధంగా స్ఫురించేలా వాడుతున్నారు. ఇంగ్లీషులో అయితే బిటి పత్తికి ద్‌ీని, జీవ సాంకేతిక విజ్ఞానానికి దీుని సంక్షిప్తంగా వాడతారు. అయోమయమేమీ ఉండదు. కానీ, తెలుగులో ఈ సౌలభ్యం లేదు. బిటి పత్తి అంటే 'బాసిల్లస్‌ తురింజినిసిస్‌' బ్యాక్టీరియా జన్యువును చొప్పించిన సాంకేతికం. దీనిలో బిటి విషం అంతర్గతంగా నిరంతరం చెట్టు పెరిగే కాలంలో తయారవుతుంది. అన్ని భాగాలకూ విస్తరిస్తుంది. ఈ సాంకేతికాన్ని 'అంతర్గత విష' సాంకేతికం (ఎండో టాక్సిన్‌ టెక్నాలజీ) గా వ్యవహరిస్తే ఇబ్బంది ఉండదు. 'బయో టెక్నాలజీ' అంటే జీవుల్లో మార్పులకు సంబంధించిన సాంకేతికం. ఆధునిక జీవ సాంకేతికాల్ని జన్యు మార్పిడి సాంకేతికాలకు సూచికగా వ్యవహరిస్తున్నాం. ద్‌ీ, దీులను తెలుగులో ఒకే పదం 'బిటి'గా వాడుతూ ఉద్దేశ్య పూర్వకంగా ఎందరినో అయోమయంలో పడేస్తున్నారు. దీన్ని నివారించాలంటే ద్‌ీ పత్తిని అంతర్గత విష పంటగా చెప్పాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Monday, 1 October 2012

ప్రణికోటి మూగవేదన

జీవం కోసం గ్రహాంతరాల్లో రాకెట్ల సాయంతో వెతుకుతున్నాం. అరుణ గ్రహంపైకి నాసా క్యూరియాసిటీని పంపితే మన ఆనందానికి హద్దుల్లేవు. అక్కడ జీవం ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంటే అబ్బురపడుతున్నాం. క్యూరియాసిటీ పంపిన పర్వత ఛాయల కలర్‌ ఫోటోలను వీక్షించి ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నాం. మన ఇస్రో అంగారక గ్రహ యాత్రకు సమాయత్తమవుతుంటే 'విజయీభవ' అంటూ ఆశీర్వదిస్తున్నాం. చంద్రయాన్‌ అంటే 'ఆహా' అంటున్నాం. మన చుట్టూ పరిసరాలను మాత్రం పట్టించుకోం. మన పర్వతాలను ఇష్టమొచ్చినట్లు తొలిచేస్తాం. విచ్చలవిడిగా అడవులను నరికేస్తాం. గనులను కొల్లగొడతాం. వృక్ష, జంతు జాతుల ఆవాసాలపై దాడులు చేసి తుదముట్టిస్తాం. కాలుష్య కారకాలతో హాని తలపెడతాం. 'విదేశీయులు' డబ్బు ఆశ పెడితే ఎంతటి పర్యావరణ క్షేత్రాలనైనా క్షణాల్లో ధ్వంసం చేస్తాం. అరుదైన వన్యప్రాణులనైనా వెంటబడి వేటాడతాం. కఠిన చట్టాలను సైతం ఉల్లంఘించి సునాయాసంగా తప్పించుకుంటాం. ఆహార భద్రతకు ముప్పు అన్నా తేలిగ్గా తీసుకుంటాం. మానవ అస్తిత్వానికి ప్రమాదం ఉన్నా ముందుకే అడుగులేస్తాం.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా జీవవైవిధ్యంపైనే చర్చ. ఆఫ్రికాలో అలా, అమెరికాలో ఇలా, ధ్రువ ప్రాంతంలో ఇంకోలా అంటూ జీవ మనుగడపై ఆలో'చించు'తున్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు మన దేశంలో అదీ మన హైదరాబాద్‌లో అక్టోబర్‌ 1 నుండి 19 మధ్య నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తెగ హడావిడి చేస్తోంది. నగరంలో భారీ డెకరేషన్లలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెడుతోంది. రాష్ట్రంలో అంతరిస్తున్న అడవులు, జీవ, వృక్ష జాతుల గురించి మాత్రం మచ్చుకైనా చర్చ లేదు. ఇక్కడి జీవవైవిధ్యం సంరక్షణపై ప్రణాళికే లేదు. అసలు జీవవైవిధ్యం అంటే... అన్ని రకాల మొక్కలు, జంతువులు, వాటి జాతులు, ప్రజాతులు, వాటి జన్యు సంపద, అవి నివశించే ఆవాసాలలో ఉండే వైవిధ్యాన్ని కలిపి జీవవైవిధ్యం అంటారు. ఖండాంతరాల్లో జీవవైవిధ్యం సంగతి సరే... మన ఆవాసాల్లో జీవవైవిధ్య పరిరక్షణ మాటేమిటన్నది ప్రశ్న. ఈ విశ్వంలో మనకు తెలిసి జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి. అది క్రమక్రమంగా పర్యావరణపరమైన ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అడవులు అంతరించడం, కాలుష్యం పెరగడం వంటి మానవ ప్రేరేపిత కారకాల వల్ల భూమి వేడెక్కడం (గ్లోబల్‌ వార్మింగ్‌), పర్యావరణ అసమతుల్యత (ఎకో ఇన్‌బ్యాలెన్స్‌), రుతుక్రమం మారటం (క్లయిమెట్‌ ఛేంజి) వల్ల ఆమ్ల వర్షాలు, ఓజోన్‌ పొరకు రంధ్రం వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
పెట్టని కోటలు తూర్పు కనుమలు
భారతదేశంలో కూడా పర్యావరణ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ప్రకృతి పరంగా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణ ద్వీపకల్పం చుట్టూ సముద్రాలు ఉండటమే కాకుండా తూర్పు- పడమర తీర ప్రాంతాల వెంబడి అత్యద్భుతమైన పశ్చిమ కనుమలు (సహ్యాద్రి పర్వత పంక్తులు), తూర్పు కనుమలు (మల్యాద్రి పర్వత పంక్తులు) విస్తరించి ఉన్నాయి. పెట్టని కోటల వంటి పర్వతాలు, కొండలు, గుట్టలే కాకుండా విస్తారమైన అడవులు, వైవిధ్యభరిత వృక్షాలు, ఔషధ మొక్కలు, వన్యజీవులు, గిరిజన జాతులు, నదీనదాలు, ఖనిజ సంపద పర్యావరణ పరంగా గొప్ప వరాలుగా ఉన్నాయి.
సగం మన రాష్ట్రంలోనే
ఎంతో విశిష్టత కలిగిన తూర్పు కనుమలు పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో కలిసి దాదాపు రెండు వేల కిలోమీటర్ల నిడివి కలిగి ఒక్కో చోట వంద నుండి 200 కిలోమీటర్ల వెడల్పుతో రెండున్నర లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఉత్తరాన మహానది, దక్షిణాన కావేరి నది మధ్యన బంగాళాఖాతం వెంబడి విస్తరించి ఉన్నాయి. ఒరిస్సాలో మయూర్‌బంజ్‌, పల్లంకిని, నిమగిరి, మహేంద్రగిరి, నంబారికొండ, ఆంధ్రప్రదేశ్‌లో యారాడ, అరకులోయ, పాపికొండలు, ఇంద్రకీలాద్రి, నల్లమల, ఎర్రమల, పాలకొండ, వెలికొండ, శేషాచలం, కంబక్కాం, తమిళనాడులో కొల్లమలై, పాచమలై, కల్‌రాయన్‌ హిల్స్‌, చిట్టేరి, పాలమలై, మెట్టూరు హిల్స్‌ ఇలా స్థానిక పేర్లతో తూర్పు కనుమలు పిలవబడుతున్నాయి. తూర్పు పర్వత పంక్తుల సరాసరి ఎత్తు 750 మీటర్లు కాగా గరిష్టంగా 1,600 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని నీలగిరి వద్ద తూర్పు కనుమల పర్వత శ్రేణి, పడమటి కనుమల పర్వత శ్రేణి మిళితం అవుతున్నాయి. తూర్పు కనుమల్లో అనేక ప్రధాన జీవ నదులు ప్రవహిస్తూ పర్వతాలను విభజిస్తున్నాయి. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి వంటి జీవ నదుల పరివాహక ప్రాంతం ఈ కనుమల్లోనే విస్తరించి ఉంది. నదుల పరివాహక ప్రాంతంలో నిర్మితమైన భారీ రిజర్వాయర్లు నాగార్జునసాగర్‌, శ్రీశైలం వ్యవసాయ, విద్యుత్‌ రంగాలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అదే విధంగా మాచ్‌ఖండ్‌, సీలేరు, కొండపల్లి హైడ్రో, థర్మల్‌ ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. తూర్పు కనుమల్లో ప్రధానంగా సింహాచలం, తిరుమల, శ్రీశైలం, కనకదుర్గాలయం, అన్నవరం, ద్వారక తిరుమల, మహానంది, భద్రాద్రి ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. తూర్పు కనుమల విస్తీర్ణం అత్యధికంగా 48 శాతం మన రాష్ట్రంలోనే ఉంది. సుమారు 980 కిలోమీటర్లు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు విస్తరించి ఉన్నాయి. ఒరిస్సా, తమిళనాడులో 25 శాతం చొప్పున, కర్నాటకలో రెండు శాతం విస్తరించి ఉన్నాయి.
గుర్తింపేది?
హిమాలయాలు, పశ్చిమ కనుమల కంటే ముందే తూర్పు కనుమలు ఏర్పడ్డాయని చారిత్రక, భౌగోళిక పరిశోధనలు చెబుతున్నాయి. మధ్య మధ్య అంతరాలతో ఏర్పడిన తూర్పు కనుమల పర్వత శ్రేణులు ఎన్నో అమూల్యమైన వృక్ష, జీవరాశులకు ఆలవాలంగా ఉన్నాయి. జీవవైవిధ్యానికి అద్దం పడుతున్నాయి. చెంచు, కోయ, సవర, జాతపు, కొండ దొర, గదబ, ఖోండు, మన్నె దొర, ముఖ దొర వంటి గిరిజన జాతులు తూర్పు కనుమలతో పెనవేసుకున్నాయి. తూర్పు కనుమల్లో కొన్ని వేల ఏళ్ల కిందటే బౌద్ధం భాసిల్లింది. నాగార్జునకొండ, అమరావతి, బావికొండ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ క్షేత్రాలు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ తూర్పు కనుమల పరిరక్షణపై శ్రద్ధ పెట్టలేదు. ఏవో నామమాత్రపు చర్యలకే పరిమితం. పశ్చిమ కనుమల పరిరక్షణకు మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ ప్రభుత్వాలు ఎంతో కృషి చేయగా తూర్పు కనుమల పరిరక్షణకు మన రాష్ట్రం పెద్దగా చేసిందేమీ లేదు. పడమటి కనుమలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించగా అంతకంటే పురాతనమైన, జీవవైవిధ్యానికి ఆలవాలమైన తూర్పు కనుమలు గుర్తింపునకు సైతం నోచుకోలేదు. ప్రపంచంలో భౌగోళికం, పర్యావరణం, జీవవైవిధ్యం పరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హాట్‌స్పాట్స్‌లో తూర్పు కనుమల్లేవు. బయోడైవర్శిటీ, హాట్‌స్పాట్స్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఇండియాలోని తూర్పు హిమాలయాలు, పడమటి కనుమలు కనబడుతున్నాయి మినహా తూర్పు కనుమలు అన్న మాటే లేదు. అంతరించే ముప్పు ఉన్న ఐదు ఎకొలాజికల్‌ హాట్‌ స్పాట్స్‌ను భారత ప్రభుత్వం ప్రకటించగా అందులో రెండు తూర్పు కనుమల్లోనే ఉన్నాయి. అయినా సర్కారుకు జీవవైవిధ్యాన్ని కాపాడటంపై చిత్తశుద్ధి లేదు. పడమటి కనుమలతో పోల్చితే తూర్పు కనుమల్లో పరిశోధనలు చాలా తక్కువ. కొత్త జంతు, జీవ జాతులను కనుగొనడం నామమాత్రం. మావోయిస్టుల వల్ల అధ్యయనం జరగలేదంటున్నారు శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు. ఆ వాదన అంతగా అతికేదికాదు. 'పెద్దల' సంపాదన యావ, ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టే ప్రభుత్వ విధానాల వల్లనే పర్వతాలకు బొర్రెలు పడుతున్నాయి. అడవులు, పర్యావరణం, వన్యప్రాణులు నాశనమవుతున్నాయి. జీవవైవిధ్యం విచ్ఛిన్నమవుతోంది. ఈ వాస్తవాలను కప్పెట్టేందుకు మనిషి చేష్టల వల్లనే జీవవైవిధ్యం దెబ్బతింటోందంటూ కుహన మేధావులు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జివొ) పల్లవి ఎత్తుకున్నాయి. ప్రకృతి వరాలైన పడమటి కనుమలు, తూర్పు కనుమల మధ్యనున్న దక్కన్‌ పీఠభూమి సైతం జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడి అడవులను, సహజ వనరులను, గనులను ప్రభుత్వమే అంగట్లో పెట్టి మరీ విక్రయిస్తోంది.
3,700 జీవ జాతులు గుర్తింపు
తూర్పు కనుమల్లో వైవిధ్యమైన 3,700 వృక్ష, జంతు జాతులను ఇప్పటి వరకు గుర్తించారు. బఠాణి రకాలు 380, అరుదైన పూల మొక్కల జాతులు 200 వీటిలో ఉన్నాయి. నాలుగొందల రకాల గడ్డి జాతులను కనుగొన్నారు. కనుగొన్న వృక్ష జాతుల్లో 1,400 ఔషధ మొక్కలే. అధ్యయనం జరిగితే మరిన్ని వృక్ష, జంతు జాతులు బయటపడే అవకాశం ఉంది. ఆసియాలో అతి పెద్ద పులుల అభయారణ్యం నల్లమలలో ఉంది. 'శ్రీశైలం-నాగార్జునసాగర్‌' టైగర్‌ రిజర్వ్‌గా పిలుస్తున్నారు. అంతరిస్తున్న పులి జాతిని సంరక్షించేందుకు 3,600 చదరపు కిలోమీటర్ల నల్లమల అటవీ ప్రాంతాన్ని రిజర్వ్‌ చేశారు. మనది రాయల్‌ బెంగాల్‌ పులుల జాతి అనంటున్నా నల్లమలలో పులులు బెంగాల్‌, ఒరిస్సాలో కంటే విభిన్నంగా, బలిష్టంగా ఉంటాయి. ఇక్కడ ఎన్ని పులులు ఉన్నాయన్న లెక్కలపై ఎన్నో సందేహాలు. పగ్‌ మార్కులు, డిజిటల్‌ కెమేరాల సాయంతో లెక్కిస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా ఆ పద్ధతి అంత శాస్త్రీయంగా లేదని మూడేళ్ల కింద కాగ్‌ తప్పుబట్టింది. జీవ జాతులపై పరిశోధనలకు శ్రీశైలంలో నెలకొల్పిన ల్యాబ్‌ నామమాత్రంగానే పని చేస్తోంది. ఇటీవలికాలంలో నల్లమలతోపాటు మొత్తం తూర్పు కనుమల్లో అడవుల నరికివేత విచ్చలవిడిగా సాగుతోంది. స్మగ్లర్లు వృక్ష, జంతు సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. జంతువుల ఆవాసాల విధ్వంసాన్ని చట్టాలు, ప్రభుత్వం, అధికారులు నిరోధింపలేకున్నాయి. ఎస్‌ఆర్‌బిసి సొరంగం, శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో రివర్స్‌బుల్‌ పంపింగ్‌కు సొరంగం తవ్వినప్పుడు రాతి శకలాలను వేరే ప్రాంతానికి డంపింగ్‌ చేయకుండా అక్కడే పడేయడంతో అభయారణ్యం కొంత వరకు మసకబారింది. గతంలో నల్లమల, శేషాచల అడవులు కలిసే ఉండేవి. ఏనుగులు తిరిగేవి. అడవులు అంతరించడంతో ఏనుగుల సంచారం నిలిచిపోయింది. ఏనుగులు శేషాచలానికి పరిమితమయ్యాయి. శేషాచలం కొండలు, గుండ్లబ్రహ్మేశ్వరం, కంబాలకొండ, కౌండిన్య, పాపికొండలు, పోచారం, రోళ్లపాడు, శ్రీ లంక మల్లేశ్వరం, శ్రీ పెనిన్సుల నరసింహ, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ క్షేత్రాలను కేంద్రం ప్రకటించింది. నల్లమల, విశాఖ, నెల్లూరు, శ్రీవెంకటేశ్వర, అరకు లోయ, నాగార్జునకొండ, మారేడుమల్లి, చిత్తూరు జిల్లాలతో పాటు మెదక్‌ను బయలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జీవావరణ కేంద్రాలుగా ప్రకటించింది. విలక్షణమైన 15 చిత్తడి నేలలను, 16 విభిన్న మడ అడవులను కేంద్రం గుర్తించింది. నేషనల్‌ బయోడైవర్శిటీ అథారిటీ 2002 బయోడైవర్శిటీ చట్టంలో భాగంగా ఏడు మేనేజింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒరిస్సా, ఎ.పి, బెంగాల్‌లో ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్టు 1992లో ప్రారంభమైంది. అడవుల పరిరక్షణలో తమిళనాడు ముందుంది. తూర్పు కనుమల పరిధిలో 22 శాతంగా ఉన్న అడవులను 27 శాతానికి ఆ రాష్ట్రం పెంచగా అత్యధిక కనుమలు ఉన్న మన రాష్ట్రంలో అడవులు 23 శాతం వద్దనే ఉన్నాయి. వాస్తవ లెక్కలు తీస్తే ఇంకా తగ్గుతుంది.
సర్కారే శత్రువు
విచ్చలవిడి మైనింగ్‌ వల్ల వృక్ష, జంతు జాలం నాశనమవుతోంది. అడవులపై ఆధారపడ్డ గిరిజన జాతుల మనుగడకు, సంస్కృతికి విఘాతం కలుగుతోంది. చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ ప్రభుత్వమే అడ్డదారుల్లో మైనింగ్‌కు అనుమతిస్తోంది. గిరిజనులు వద్దంటున్నా విశాఖ ఏజెన్సీలో బాక్సయిట్‌ తవ్వకాలకు 'ప్రైవేటు'తో ఒప్పందాలు చేసుకుంది. పోలవరం నిర్మిస్తే పాపికొండలు మునుగుతాయని, గిరిజన జాతుల బతుకు ఛిద్రమవుతుందని, జీవవైవిధ్యం అంతరిస్తుందని తెలిసినా ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మించేందుకు కంకణం కట్టుకుంది. నల్లమలలో వజ్రాలు వెలికితీత పేరు మీద చెంచులను అడవుల నుండి తరిమి వేసేందుకు సిద్ధమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు కోసం అక్కడి గిరిజనులను తరిమేస్తోంది. నెల్లూరులో విదేశీ పక్షుల విడిది కేంద్రం పులికాట్‌ సరస్సు ఎడారిగా మారుతోంది. పశ్చిమగోదావరి- కృష్ణాలో కొల్లేరు సరస్సు 'పెద్దల' చెరలో తన సహజత్వాన్ని కోల్పోయింది. శ్రీకాకుళంలో బీలపై 'థర్మల్‌' దాడి జరుగుతోంది. థర్మల్‌, యురేనియం ప్లాంట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. తీర ప్రాంతంలో మడ అడవులు ధ్వంసం కావడంతో సముద్ర జీవులెన్నో అంతరించిపోతున్నాయి. మడ అడవులుంటే సముద్రం ఉప్పొంగినప్పుడు నీటి ప్రవాహ తీవ్రతను కొంత వరకు ఆపుతుంది. తూర్పు కనుమల్లో మైనింగ్‌ వల్ల ఐదు ప్రధాన జంతు జాతులు పులులు, ఏనుగులు, గద్దలు, మొసళ్లు, పలు వృక్ష జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌కు ఒకప్పుడు విదేశీ పక్షులొచ్చేవి. ఇప్పుడా చెరువు మురికి కూపంగా మారింది. వ్యవసాయంలో విత్తనాలపై ప్రైవేటు ఆధిపత్యం వహిస్తోంది. ఆహార పంటలు తగ్గుతున్నాయి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు తరిగిపోతోంది. బీటి పత్తి విత్తనాలొచ్చి సంప్రదాయ పత్తి రకాల అడ్రస్‌ గల్లంతు చేశాయి. ప్రాణికోటికి జీవాధారం నీరు. చిన్న పెద్ద చెరువులు లక్ష వరకు ఉండగా వాటిని నిర్లక్ష్యం చేయడంతో పల్లె సీమల వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. మొక్కలు, జీవ మనుగడకు విఘాతం ఏర్పడింది. ఫ్లోరైడ్‌ పెరిగిపోతోంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కలిపి మహా నిర్లక్ష్యంగా అవతరించడం వల్ల జీవవైవిధ్యం పెను ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ సదస్సు మన హైదరాబాద్‌లో జరిగితే మనకేంటి? మన తూర్పు కనుమలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కల్పిస్తుందా? మన దక్కన్‌ పరిరక్షించబడుతుందా? ఈ సదస్సు మన పర్యావరణాన్ని రక్షిస్తుందా లేక మన వనరులపై అగ్రరాజ్యాలు, బహుళజాతి కంపెనీల 'ఆకలి'కి ఆహారం అవుతాయా? ప్రతి అభివృద్ధి వెనుక ఒక విధ్వంసం ఉంటుంది. వాటి మధ్య సమతుల్యత దెబ్బతిని అభివృద్ధిపై విధ్వంసం పైచేయి సాధిస్తే జీవవైవిధ్యానికి, ప్రాణికోటికి ముప్పు తప్పదు.
మన ప్రత్యేకత
మన దేశంలో అత్యద్భుతమైన జీవవైవిధ్యం ఉంది. ప్రపంచంలోని అత్యధిక జీవవైవిధ్యం ఉన్న 17 దేశాల్లో భారత్‌ ఒకటి. అందుకే అతిపెద్ద బయోడైవర్శిటీ దేశంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని మొత్తం జీవ జాతుల్లో ఎనిమిది శాతం ప్రాణులకు మనదేశం పుట్టినిల్లు. దేశంలో 18 వేలకుపైగా వృక్ష జాతులు, 390 రకాల క్షీరదాలు, 458 జాతుల పక్షులు, 521 జాతుల సరీసృపాలు, 238 రకాల ఉభయచర జీవులు మనుగడ సాగిస్తున్నాయి. దాదాపు ఆరు వేల రకాల చేపల జీవవైవిధ్యంతో ప్రపంచంలో భారత్‌ అగ్ర స్థానంలో ఉంది. దేశంలో 668 రక్షిత ప్రాంతాలున్నాయి. పదహారు లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా, మొత్తం భూ భాగంలో సుమారు ఐదు శాతం జీవవైవిధ్య ప్రత్యేకతల రీత్యా రక్షిత ప్రాంతంగా గుర్తింపబడింది. 102 జాతీయ పార్కులు, 515 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, పులులు 40 కేంద్రాల్లో, ఏనుగులు 28 కేంద్రాల్లో విశాలమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నాయి. 'ఫ్లోరా అండ్‌ ఫౌనా' ప్రత్యేకతల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో గుర్తించిన హెరిటేజ్‌ సెంటర్లలో రెండు... తూర్పు హిమాలయాలు, పడమటి కనుమలు మన దేశంలో ఉన్నాయి. ఫలపుష్ప జాతులు, ఇతర జీవ జాతుల ప్రత్యేకతల దృష్ట్యా ఇరుగు పొరుగు దేశాలు సంయుక్తంగా పని చేసేందుకు యునెస్కో తగు ఏర్పాట్లు చేసింది. జాతులు, ప్రజాతుల పరంగా రికార్డు చేసిన 45 వేల వృక్ష జాతులు, 91 వేల జంతు జాతులతో మన దేశం ప్రపంచ జీవవైవిధ్య సంరక్షణా రంగంలో కృషి చేస్తున్న వారికి ప్రముఖ సందర్శనీయ స్థలంగా యునెస్కో అభివర్ణించింది. పంటల వైవిధ్యం రీత్యా ప్రపంచంలో ఎనిమిది ప్రధాన దేశాల్లో మన దేశం ఒకటి. వరి, తృణ ధాన్యాలు, కూరగాయలు తదితర 375 వైవిధ్య పూరిత రకాలు, 140 రకాల పెంపుడు జంతువులు మన నిత్య జీవితంతో పెనవేసుకున్నాయి.
లాభాపేక్ష
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు. ఆ తర్వాత 20 కోట్ల సంవత్సరాలకు అంటే 440 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తొలి పుష్పం వికసించింది. ఎనిమిది కోట్ల సంవత్సరాల కింద క్షీరదాలు పుట్టాయి. కోతి నుండి మనిషిగా పరిణామం చెంది నాలుగు లక్షల ఏళ్లవుతోంది. మనిషి పుట్టక ముందే ప్రకృతి ఉంది. మొక్కలున్నాయి. సమస్త జీవరాశులు ఉన్నాయి. విశేష మేథాసంపన్నుడైన మోర్గాన్‌ మానవ జాతి ఆదిమ చరిత్రను మొట్ట మొదటి సారిగా ఒక క్రమ పద్ధతిలో పెట్టాడు. ఆదిమ చరిత్రను మూడు యుగాలుగా వర్గీకరించాడు. ఆటవిక యుగం, అనాగరిక యుగం, ఆధునిక యుగం. ఆటవిక యుగంలో మనిషి కాయలు, పళ్లు, దుంపలు తిని బతికాడు. జంతు సముదాయం నుండి క్రమంగా పరిణామం పొందాక నిప్పు కనుక్కున్నాడు. మానవుడు తొలిసారిగా కనిపెట్టిన ఆయుధాలు గద, ఈటె. వాటి సహాయంతో జంతువులను వేటాడేవాడు. అప్పుడప్పుడు జంతువులు తిండికి దొరికేవి. అంతే తప్ప కేవలం వేట మీదనే మానవులు జీవించలేదు. వేటతో తిండి సంపాదన ఎప్పుడూ అనిశ్చితే. వ్యవసాయం కనిపెట్టి ఆహారోత్పత్తి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలైంది. మనిషి పుట్టక ముందు భూమి మీద సంవత్సరానికి ఒక జీవ జాతి అంతరించింది. ఆటవిక యుగంలో వేటపై మానవులు ఆధారపడినప్పుడు కూడా జాతులు అంతగా అంతరించలేదు. కానీ పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే ప్రారంభమైందో రెండొందల సంవత్సరాల నుండి పర్యావరణానికి, జీవ జాతులకు ప్రమాదం ఏర్పడింది. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్ష వృద్ధి అయ్యాకనే ఓజోన్‌ పొరకు చిల్లు, గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో, సునామీ, భూకంపాల వంటి పెను ప్రమాదాలు విరుచుకు పడుతున్నాయి. ప్రతి ఇరవై నిమిషాలకో జీవ జాతి అంతమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల జీవజాతులున్నాయని అంచనా వేయగా ఇప్పటికి కనుగొన్నది 45 లక్షలు. ప్రకృతిలో తెలిసిన వాటి కంటే తెలియనివే ఎక్కువ. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినా ఒక జీవిని సృష్టించలేం. ప్రకృతి లేనిదే మానవుడు లేడు. ప్రకృతిని పరిరక్షించడమే మానవుల కర్తవ్యం.
జీవవైవిధ్యం విశేషాలు
* ప్రపంచ వ్యాప్తంగా మనుషులు ఆహారంగా ఉపయోగించే జంతు జాతులు 12.
* ఆహారానికి ఉపయోగించే మొక్కల జాతులు 15
* ప్రపంచంలో 2/3 వంతు ఆహారం గోధుమలు, కార్న్‌, బియ్యమే.
* అంతరించే ముప్పు ఉన్న జీవ జాతుల రిజిస్టర్‌ను ఐయుసిఎన్‌ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తోంది
* హిమాలయాల్లో ఉండే రెడ్‌ పాండా అనే జంతువు దాదాపు అంతరించింది.
* ప్రపంచం గుర్తించిన జీవావరణ రిజర్వ్‌లు దేశంలో నాలుగు ఉండగా రాష్ట్రంలో ఒక్కటీ లేదు.
* ఇప్పటి వరకు దేశంలో ఉన్న అటవీ సంరక్షణ చట్టాలు: 1) 1927- భారత అటవీ చట్టం 2) 1972- వన్యప్రాణి (సంరక్షణ) చట్టం 3) 1980-ఎఐఆర్‌ చట్టం 4) 1986- పర్యావరణ (రక్షణ) చట్టం.
* దేశంలో అంతరించే ప్రమాదం ఉన్న జీవ జాతులు: ఆసియాటిక్‌ సింహం, కృష్ణ జింక (ఎపి), రెడ్‌ పాండా, పులి, పెద్ద పులి, ఏనుగు, కాశ్మీరీ మగ జింక, పిచ్చుక, సైబేరియన్‌ కొంగ, దేవాంగి పిల్లి.
* ప్రపంచంలో తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వంద జీవరాసుల జాబితాలో రాష్ట్రానికి చెందిన సాలె పురుగు (గూటీ టరంటులా), బట్టమేక పక్షి చేరాయి. వాటితో పాటు ఈశాన్య భారతంలోని తెల్లపొట్ట కొంగ, నాలుగు వేళ్ల తాబేళ్లు కూడా చేరాయి.
* 19వ శతాబ్దం మొదట్లోనే అంతరించి పోయిందనుకున్న కలివి కోడి కడప జిల్లాలో 1982లో కనిపించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది.
* నల్లమలలో లభించే ఔషధ మొక్క కలబంద (అలొవెరా)తో అమెరికాలో ఔషధాలు తయారు చేసే పెద్ద పరిశ్రమ వెలిసింది.
* నల్లమల, శేషాచలంలో లభించే ఎర్ర చందనం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పలు దేశాలు ఎర్ర చందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి.
* మన ఒంగోలు గిత్త బ్రెజిల్‌ దేశ ప్రధాన ఆర్థిక వనరు.
* నంద్యాల, మహానంది ప్రాంతంలో బిటి బాక్టీరియాను అమెరికా సంస్థ మోన్‌శాంటో తీసికెళ్లి, నంద్యాలలో మన వ్యవసాయ వర్శిటీ రూపొందించిన నర్సింహ హైబ్రిడ్‌ పత్తిలో చొప్పించి బిటి పత్తి విత్తనాల పరిజ్ఞానంపై పేటెంట్‌ పొందింది.
* అంతర్జాతీయ వాణిజ్యం ఫలితంగా ప్రపంచంలో మూడో వంతు జాతులకు ముప్పు వాటిల్లుతోంది.
* అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తులను తెగ వాడేస్తున్నాయి. తమ తమ దేశాల్లో కాలుష్య సమస్య తలెత్తకుండా పేద దేశాల్లో ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నాయి.
* దేశంలోని బయోడైవర్శిటీ సంస్థలు: బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, బొంబాయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ, వైల్డ్‌లైఫ్‌ ప్రొటక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా డెహ్రాడూన్‌, ఇక్రిశాట్‌ (ఎపి).
* ప్రకృతి నుండి మనిషి తీసుకునే దానిలో సమతూకం పాటించాలని 1992లో రియోలో జరిగిన తొలి ఎర్త్‌ సమ్మిట్‌ స్పష్టం చేసింది. ప్రకృతి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, విధి, విధానాలకు రూపొందించిన డాక్యుమెంట్‌పై భారత్‌ సహా 193 దేశాలు సంతకం పెట్టాయి. అగ్రరాజ్యం అమెరికా తప్ప.
* ఐక్యరాజ్య సమితి 2011-20 సంవత్సరాలను జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే అంతర్జాతీయ సదస్సులు ఇప్పటి వరకు పది జరగ్గా, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది పదకొండవది కాగా జీవవైవిధ్య దశాబ్దంలో మొదటిది. సదస్సుకయ్యే పూర్తి వ్యయాన్ని ఐక్యరాజ్య సమితి భరిస్తుంది.
- కె.ఎస్‌.వి. ప్రసాద్‌

ప్రగతి బాట ప్రయోగాల కోట ఇస్రో


స్థలం : శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం.
తేది : 9.9.2012
ఉదయం : 9.53 నిమిషాలు.
నిప్పులు చెరుగుతూ నింగివైపు దూసుకుపోయింది పిఎస్‌ఎల్‌వి - సి21.
క్షణాలు గడుస్తున్న కొద్దీ వాతావరణంలోని ఒక్కొక్క పొరను ఛేదించుకుంటూ భూమి పరిధిని దాటి రోదసిలోకి ప్రవేశించింది.
1047 సెకన్లు(దాదాపు 18 నిమిషాలు) ప్రయాణం చేసి 660 కి.మీ. ఎత్తుకు ఎగిరి ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్‌-6 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత మరో 54.6 సెకన్లలో 662 కి.మీ. పయనించి జపాన్‌ ఉపగ్రహం ప్రొయిటరీస్‌ను దాని కక్ష్యలో దింపింది. మరో 20.55 సెకన్లకే తనకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తి చేశానంటూ హైదరాబాద్‌లోని రాడార్‌ ఇమేజింగ్‌ సెంటర్‌కు సంకేత సందేశాలందించింది.
వందో ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన ఆ క్షణాలు భారత్‌కు తిరుగులేని ఘనత అందించినవిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తాము సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన ఆ క్షణాలే దేశవిదేశాల్లోని ప్రతి భారతీయుడి గుండెల్లోనూ అపురూపమైనవిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. మన ప్రగతి గమనంలో సువర్ణాధ్యాయం సృష్టించిన ఆ విజయమే అమెరికా వంటి దేశాలకు ధీటైన జవాబు కూడా చెప్పింది. 'ఆకలితో అలమటిస్తున్న దేశానికి అంతరిక్ష పరిశోధనలెందుకు.. నకనకలాడే కడుపులతో మీరు పరిశోధనలు చేస్తారా? ప్రయోగాలు చేయగలరా?' అంటూ వెక్కిరించిన అంకుల్‌శామ్‌ వంటి వారికి మన మేథాశక్తితో తిరుగులేని సమాధానం ఇచ్చింది. ఈ సంతోష సమయాన అగ్రరాజ్యాలను సైతం అబ్బురపరిచే స్థాయికి ఎదిగిన మన అంతరిక్ష ప్రయోగాల ప్రస్థానం గురించిన విశేషాలను ఈ వారం అట్టమీది కథలో తెలుసుకుందాం.
వలస పాలకుల నిర్వాకాల వల్ల దేశంలో చేతివృత్తులు దిగజారి పోయి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ కారణంగానే స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో, ముఖ్యంగా 1960వ దశకంలో భారత్‌ తీవ్ర కరువుకాటకాల బారిన పడింది. మరోవైపు సోషలిస్టు రష్యా శాస్త్ర విజ్ఞానం ఆసరాగా అది వేగంగా అభివృద్ధి చెందింది. మనలాంటి దేశాలకు స్నేహ హస్తం చాచి కోరిన సాయం అందించింది. రష్యా సహకారంతో కీలకరంగాల్లో పెద్ద పెద్ద అడుగులేయాలని ఆనాటి మన నేతలు భావించారు. అది అందించే ఫలాలతోనే అకలి తీర్చి అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయగలమని నిశ్చయించారు. సైన్సు బాట పట్టారు. ఈ క్రమంలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు విధానాలు రూపొందించారు. అంతరిక్ష రంగానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలు అమలు చేశారు.
గత శతాబ్దం ప్రారంభం నుంచే దేశంలో వాతావరణ, అంతరిక్ష సంబంధిత అంశాల్లో శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎస్‌కె మిత్ర వంటి శాస్త్రవేత్తలు 1920లోనే కొల్‌కతాలో వాతావరణ మండలాలపై ప్రత్యేక పరిశోధనలు చేశారు. సివి రామన్‌, మేఘనాథ్‌ సాహా వంటి వారి ఆవిష్కరణలు భారత్‌లో అంతరిక్ష శాస్త్ర ఆవిర్భావానికి దోహదం చేశాయి. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలను ఒకే వేదికపైకి తెచ్చి వాటిని దేశాభివృద్ధికి వినియోగించేలా చేయగలిగిన ఘనత మాత్రం విక్రమ్‌సారాభారు, హోమీబాబాకే దక్కుతుంది.
1950లో అణుశక్తి విభాగం ఏర్పాటైంది. దాని తొలి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన హోమీబాబా అంతరిక్ష పరిశోధనల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ రంగంలో విశేష ప్రగతి సాధించిన సోవియట్‌ రష్యా 1957లో స్ఫుత్నిక్‌ను ప్రయోగించింది. అంతేకాదు భారత్‌ వంటి దేశాలు ఈ రంగంలో పరిశోధనలు చేయడానికి ఎంతగానో చేయూతనిచ్చింది. సాంకేతిక సహకారాలందించింది. దానివల్లనే మరిన్ని పరిశోధనలు జరిపేందుకు 1962లో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సంస్థ (ఐఎన్‌సిఓఎస్‌పిఎఆర్‌) స్థాపితమైంది.
ఈ రంగంలో విశేషమైన పరిశోధనలు కొనసాగాయి. సంబంధిత సంస్థలు ఎన్నో ఏర్పాటైనాయి. వాటి కృషి ఫలితంగా లభించిన ప్రతీ ఫలితమూ, సాంకేతిక పరిజ్ఞానమూ భారత ప్రగతికి వినియోగించడం ప్రారంభమైంది. దానితో అభివృద్ధిలో అంతరిక్ష శాస్త్ర ప్రాధాన్యత ప్రభుత్వానికి స్పష్టంగా అవగతమైంది. నాటి ప్రధాని నెహ్రూ అంతరిక్ష శాస్త్ర అభివృద్ధి బాధ్యతలను విక్రమ్‌ సారాభారు, హోమీబాబా వంటి వారికి అప్పగించారు. దానితో విక్రమ్‌ సారాభారు అంతరిక్ష పరిశోధనలపై పూర్తి దృష్టిని సారించారు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీప తీరప్రాంతంలోని మత్స్యకారుల గ్రామమైన తుంబను తన ప్రయోగాలకు కేంద్రంగా ఎంచుకున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ ఊళ్లోని సెయింట్‌ మేరీ మేడలీన్‌ చర్చికి చెందిన పశువుల పాకలో అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
వివిధ దేశాలోని భారతీయ శాస్త్రవేత్తలను దేశాభివృద్ధి కోసం జరిగే ఈ ప్రయోగాల్లో భాగం పంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. తగు శాస్త్ర సౌకర్యాలు లేని కారణంగా ఆయన పిలుపునకు స్పందన రాలేదు. దానికి తోడు అమెరికా వారు మాత్రం 'కరువు కాటకాలతో సతమతమవుతూ అర్థాకలితో కడుపులు మాడి ఛస్తున్న దేశం అంతరిక్ష ప్రయోగాల గురించి ఆలోచించడమా?'అని హేళనగా మాట్లాడారు. 'కనీస సౌకర్యాలు కూడా లేని మీరు ప్రయోగాలు చేయగలరా?' అంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి దెప్పిపొడుపులకు ఏమాత్రమూ వెనుకంజ వేయని దృఢచిత్తుడు విక్రమ్‌ సారాభారు. కనుకనే భారత్‌కు రావడానికి ఇష్టంలేని వసంత్‌ గోవారికర్‌ వంటి సీనియర్‌ శాస్త్రవేత్తలనూ ఒప్పించి తీసుకు రాగలిగాడు. వీరందరినీ తుంబకు రప్పించి అక్కడి పశువుల కొట్టంలోనే పరిశోధనలు చేయించారు. 1963 నవంబర్‌ 21న అమెరికా తయారు చేసిన నైక్‌-అపాచే రాకెట్‌నే తొలిసారిగా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. తమ ప్రయత్నాలు, ప్రయోగాలను అవహేళన చేసిన ఆ దేశంతోనే 'ఔరా' అనిపించగలిగారు విక్రమ్‌ సారాభారు నేతృత్వంలోని మన శాస్త్రవేత్తలు.
ఆనాడు అలా ఆకలి, అవమానాల మధ్య మొదలైన మన అంతరిక్ష ప్రయోగాలు నేడు 'సెంచరీ' కొట్టి అగ్రదేశాల సరసన నిలిచి ప్రపంచంతోనే జేజేలు కొట్టించుకునే స్థాయికి చేరుకున్నాయి.
ఆనాటి పరిస్థితులను ఓ సందర్భంలో గుర్తుకు తెచ్చుకున్న వసంత్‌గోవారికర్‌ 'అప్పట్లో ఎటువంటి సౌకర్యాలూ లేవు. మాకు నివాసాలు కూడా సరిగ్గా ఉండేవికావు. చర్చి బిల్డింగ్‌లో ఆఫీసు ఉండేది. పశువుల పాకలో ప్రయోగాలు చేసేవాళ్లం. వాహనాలు కూడా పెద్దగా లేవు. సైకిళ్లపైనే ప్రయాణిస్తూ, వాటిపైనే సాంకేతిక పరికరాలు తరలించేవాళ్లం' అని చెప్పారు. అంటే మన అంతరిక్ష ప్రయోగాలు ఎటువంటి పరిస్థితుల్లో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతోనే 1963లో సారాభారు నేతృత్వంలోనే ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) స్థాపితమైంది. కొన్ని ప్రయోగాలు విఫలమయ్యాయి. దానితో ఇస్రో నీరసపడలేదు. అపజయాల నుండి గుణపాఠాలు నేర్చుకుని విజయాలు సాధించింది. క్రమంగా అది దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పరిశోధనాలయాలు, పలు ఏజెన్సీలు, లేబొరేటరీలను ఏర్పాటు చేసుకోగలిగింది.
'అంతరిక్ష పరిశోధన అంటే జాతి సామర్థ్యం ప్రదర్శించడమే, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే. పేదరికం, నిరక్షరాస్యత రాజ్యమేలుతున్న భారత్‌ వంటి దేశాల్లో ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. దానికోసం వారికి నిరంతరం సమాచారమందిస్తుండాలి. ఇది అంతరిక్ష రంగంలో మనం సాధించే ఫలితాలపైనే ఆధారపడింది. వాటితోనే మన సోదర భారతీయులను అభివృద్ధి క్రమంలో భాగస్వాములను చేయగలం' అంటూ సారాభారు తోటి శాస్త్రవేత్తలకు స్ఫూర్తినందిస్తూ వారిని ముందుకు నడిపించేవారు. ఆయన చెప్పినట్లుగానే స్పేస్‌ సైన్స్‌ అందించిన ఫలాలతోనే మనమంతా సుఖవంతమైన, చైతన్యవంతమైన, ఫలవంతమైన జీవనం కొనసాగించగలుగుతున్నాం.
ఆయన తరువాత ఇస్రో రెండవ ఛైర్మన్‌గా సతీష్‌ధావన్‌ బాధ్యతలను అందిపుచ్చుకున్నారు. ఈయన కాలంలోనే 1975లో భారత్‌ తన తొలి ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను తయారు చేసి సోవియట్‌ రష్యా సహకారంతో ప్రయోగించాం. ఆ పరంపరలోనే భాస్కర, రోహిణి, ఆపిల్‌ తదితర 10 ఉపగ్రహాలనూ ప్రయోగించి ఇస్రో కీర్తిని ఇనుమడింపచేశారు ధావన్‌. ఆయనే బెంగళూరు, హసన్‌లలో అంతరిక్ష పరిశోధనా కేంద్రాలను నెలకొల్పారు. ఈయన అనంతరం 1984లో ఇస్రో ఛైర్మన్‌గా భాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్‌ యుఆర్‌ రావు కాలంలో స్రాస్‌, ఐఆర్‌ఎస్‌, ఇన్‌శాట్‌ వంటి 10 ఉపగ్రహాలనూ విజయవంతంగా ప్రయోగించింది భారత్‌. ఈయన తరువాత ఆ స్థానంలోకొచ్చిన కస్తూరి రంగన్‌ హయాంలో ఇస్రో రికార్డు స్థాయిలో 17 ఉపగ్రహాలను ప్రయోగించింది. అటు తరువాత 2003లో ఛైర్మన్‌గా నియమితులైన మాధవన్‌ నాయర్‌ నేతృత్వంలో పిఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి అభివృద్ధితో పాటు, చంద్రయాన్‌-1 వంటి 17 ప్రయోగాలు జరిగాయి. 2009 నుంచీ ఇస్రో ఛైర్మన్‌గా పని చేస్తున్న రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ప్రస్తుత వందో ప్రయోగంతో కలిపి మొత్తం 11 ప్రయోగాలు జరిగాయి.
అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొంటున్న సంస్థలు
జీరోనుండి ప్రారంభమైన మన అంతరిక్ష పరిశోధనలు సెంచరీ విజయాల స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది కార్యదక్షతకు తోడు ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల కృషి ఉంది. మొత్తం వ్యవస్థకు కేంద్రస్థానంలో ఉన్న ఇస్రో ఆరు ప్రధాన కేంద్రాలున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో లేబొరేటరీలు, యూనిట్లు, ఏజెన్సీలతో తన కార్యకలాపాలు నిర్వహించుకుంటుంది ఇస్రో. ఇవి అత్యధికంగా బెంగళూరులో ఉన్నాయి కాబట్టే దాన్ని 'అంతరిక్ష నగరం'గా పిలుస్తారు.
అంధ్రప్రదేశ్‌ భాగస్వామ్యం
కీర్తి బావుటా ఎగురవేసిన పరిశోధనలకు తెలుగువారు కూడా ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్నాం. రాకెట్‌లో వినియోగించే ద్రవరూప ఇంధనాన్ని తణుకు షుగర్‌ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌ ఉంది. ఇలా ఎన్నో ఉన్నా అన్నిటినీ మించి శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉండడం మనందరికీ గర్వకారణం.
అతి విశిష్టమైనది సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం
అంతరిక్ష ప్రయోగాలకు అనువైన ప్రదేశం కొరకు గాలిస్తూ 1968 ఆగస్టులో తూర్పు తీరప్రాంతంలో ఏరియల్‌ సర్వే జరుపుతున్న విక్రమ్‌ సారాభారుని చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న శ్రీహరికోట ద్వీపం బాగా ఆకర్షించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో పులికాట్‌ సరస్సునావరించి ఉన్న ఈ 170 చదరపు కిలో మీటర్ల భూభాగం నెల్లూరు, చెన్నై మధ్య అయిదో నెంబరు జాతీయ రహదారిపై తడ గ్రామానికి 30 కి.మీ.దూరంలో ఉంది. సారాభారు కోరిక మేరకు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ స్థలాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దానితో సారాభారు నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సూళ్లూరుపేట నుంచి నాటుపడవల ద్వారా శ్రీహరికోట ద్వీపం చేరుకుని తమ కార్యకలాపాలను ఆరంభించారు. ద్వీపంలోని యానాదులకు కాలనీ నిర్మించారు. ప్రయోగ కేంద్రంలో వారికి ఉద్యోగాలిచ్చారు. 1971 అక్టోబర్‌ 9న ఇక్కడ నుంచి రోహిణి సౌండ్‌ రాకెట్‌ను తొలిసారిగా ప్రయోగించారు.
షార్‌కు విశిష్ట గుర్తింపు
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ సతీష్‌ ధావన్‌ పేరిట షార్‌ పేరు 2002లో సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రంగా మారింది. దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలెన్నిటినో ప్రయోగించిన ఈ కేంద్రం నుంచి చేసే ప్రయోగాలు తప్పనిసరిగా విజయవంతమవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం కూడా పేరుకుపోయిందంటే దీనికి గల పేరు ప్రఖ్యాతులెలాంటివో అర్థం చేసుకోవచ్చు.
సతీష్‌ ధావన్‌
'ప్రయోగాత్మక ద్రవ పదార్థాల పరిశోధక పిత'గా కీర్తిపొందిన సతీష్‌ ధావన్‌ వృత్తిరీత్యా ఏరోస్పేస్‌ ఇంజనీర్‌. శ్రీనగర్‌లో 1920 సెప్టెంబర్‌ 25న జన్మించిన ఈయన విద్యాభ్యాసం భారత్‌లోనూ, అమెరికాలోనూ కొనసాగింది. భారతీయ అంతరిక్ష రంగాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన పరిశోధనను నిర్వహించారు. దీనికి గౌరవంగానే ఈయనను భారత ప్రభుత్వం 1972లో ఇస్రో రెండవ ఛైర్మన్‌గా నియమించింది. సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఈయన మేథమేటిక్స్‌లోనూ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎం.ఏ.కూడా చేశారు. 1947లో అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో ఎం.టెక్‌ పూర్తి చేశారు. ఇదయ్యాక అక్కడే మేథమేటిక్స్‌లోనూ, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లోనూ డబుల్‌ పిహెచ్‌.డి. పూర్తి చేశారు. అనంతరం భారత్‌కు వచ్చిన ఆయన స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గానూ, భారత ప్రభుత్వ అంతరిక్ష రంగ శాఖ కార్యదర్శిగానూ నియమితులయ్యారు. ఇస్రోకు రెండవ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. దేశంలో అంతరిక్ష కార్యక్రమానికి బీజం వేసింది సారాభారు అయితే దాన్ని విశిష్టంగా విస్తరింపజేసిన వారు సతీష్‌ ధావన్‌. అందుకే వీరిద్దరినీ 'భారత అంతరిక్ష ద్వయం'గా కీర్తిస్తారు. గ్రామీణ విద్య, రిమోట్‌ సెన్సింగ్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ అంశాల్లో ధావన్‌ అగ్రగామి ప్రయోగాలు చేశారు. వీటి ఫలితంగానే ఇన్శాట్‌, ఐఆర్‌ఎస్‌, పిఎస్‌ఎల్‌వి రూపొందాయి. వీటి వల్లనే భారత్‌ అంతరిక్ష రంగంలో అగ్రగామి దేశాల స్థాయికి ఎదిగింది. 2002లో ఈయన కృషికి గుర్తుగానే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఈయన పేరుతో సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా మార్చారు.

ఇస్రో ఛైర్మన్‌ డా|| కె. రాధాకృష్ణన్‌
ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌ డా|| కె. రాధాకృష్ణన్‌ భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం కార్యదర్శిగా, స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతరిక్ష రంగంలో ఉత్తమ నిపుణుడుగా, నిర్వాహకుడుగా పేరుపొందారు. కేరళలో 1949 ఆగస్టు 29న జన్మించిన ఈయన కేరళ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌, బెంగళూరు ఐఐఎంలో పిజిడిఎం, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పిహెచ్‌డి చేశారు. త్రివేండ్రంలోని విక్రమ్‌సారాభారు స్పేస్‌ సెంటర్‌లో ఏవియోనిక్స్‌ ఇంజనీర్‌గా చేయడం ద్వారా 1971లో ఈ రంగంలో కెరీర్‌ ప్రారంభించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణా సామర్థ్యం కూడా ఉన్న ఈయన అంతరిక్ష సంస్థల్లో వివిధ మేనేజ్‌మెంట్‌ హోదాల్లో పని చేశారు. ఇండియన్‌ సునామీ వార్నింగ్‌ ఇనిస్టిట్యూట్‌, ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ వంటి సంస్థలు ఈయన నేతృత్వంలోనే ప్రారంభమైనాయి. ఇంటర్‌గవర్నమెంటల్‌ ఓషనోగ్రఫిక్‌ కమిషన్‌, ఐక్యరాజ్యసమితికి సంబంధించిన శాస్త్రసాంకేతిక సంస్థల్లోనూ రాధాకృష్ణన్‌ వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన హయాంలో ఇప్పటివరకూ 11 ప్రయోగాలు జరిగాయి.

అంతరిక్ష ప్రయోగ వైతాళికుడు

అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన అన్ని విజయాలకూ, అద్భుత ప్రగతికీ కారకుడు డాక్టర్‌ విక్రమ్‌ సారాభారు. అందుకే ఈయనను 'ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రాం' అని గౌరవిస్తారు. ప్రతి అంశమూ రాజకీయమయ్యే దేశంలో ఈ రంగంలో రాజకీయాలకు తావు లేకుండా చేయడం వల్లనే ఆయన ఇంతటి అభివృద్ధి సాధించాడని కొందరు వ్యాఖ్యానిస్తారు. అంటే దీన్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చాడో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్‌ కేటాయింపులు తప్ప ఈ రంగంలో ప్రభుత్వంకానీ, రాజకీయ నాయకులు కానీ జోక్యం చేసుకోకపోవడానికి సారాభారు వ్యక్తిత్వమే కారణం. సారాభారు శాస్త్రసాంకేతిక రంగాల బాధ్యతలతోపాటు వంశపారంపర్యంగా లభించిన వ్యాపారాలు కూడా చూసేవారట. కళలు, సాహిత్యాలంటే ఇష్టపడేవారు. అందుకే ఆయన వెంట ఎప్పుడూ విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులుండేవారట. ఆయన పనితీరు చాలా భిన్నంగా ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని కొన్ని ఉదాహరణలు చెబుతారు ఆయనదగ్గర పని చేసిన వారు. అలాంటివాటిలో ఒకటి...ఒక సైంటిస్టును ఒక 'పని' నిమిత్తం విదేశాలకు పంపాలని అర్థరాత్రి నిర్ణయించినా సరే అవతలి వారింటిలో వెంటనే ఫోన్‌ మోగేదట. నిద్రమత్తులో ఉన్న అవతలి వారు ఫోన్‌ ఎత్తి 'హలో' అనగానే 'నువ్వు ఫలానా పనికోసం ఫలానా దేశానికి వెళ్లాలి. ఉదయం పది గంటలకి ఫ్లైట్‌ ఉంది' అని చెప్పేవాడట. ఈ నాలుగైదు గంటల్లో వీసా అదీ రావడం కుదరదులే అనుకుని వారు హాయిగా నిద్రపోయి లేచే లోపలే విమానం టిక్కెట్‌తో పాటు చేయవలసిన పనులు వివరించే పేపర్‌ పట్టుకుని సారాభారు వాళ్ల గుమ్మంలో రెడీగా ఉండేవారట. దానితో అవతలి వారు కిక్కురుమనకుండా విమానమెక్కేవారట. ఆయనకు అంతటి కార్యశూరత ఉండేది కాబట్టే తాము అన్ని ఘన కార్యాలు సాధించగలిగామంటారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. దేశీయులనే కాదు విదేశీయులను సైతం ఆకట్టుకునే వారు. ఇందువల్లే భారత్‌ తొలినాళ్లలో రూపొందించిన ఉపగ్రహాలను విదేశాల నుంచి ఉచితంగా ప్రయోగించగలిగారు. ఇతర దేశాల నుంచి కోట్లాది రూపాయిలు వసూలు చేసే దేశాలు ఆయన వ్యక్తిత్వాన్ని చూసే మన ప్రయోగాలకు ఎలాంటి రుసుములూ తీసుకోలేదని చెప్పుకుంటారు.

అంతరిక్ష ప్రయోగాల్లో అబ్దుల్‌ కలామ్‌

'మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా'గా పేరు పొందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌కు కూడా అంతరిక్ష ప్రయోగాల్లో కొద్దిమేర భాగమయ్యారు. ప్రయోగ వాహనాల రూపకల్పన, అభివృద్ధి ప్రయోగాల్లో పాల్గొన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యులైన విక్రమ్‌ సారాభారు, ప్రొఫెసర్‌ సతీష్‌ ధావన్‌, డాక్టర్‌ బ్రహ్మప్రకాశ్‌ శిష్యరికం కారణంగా కలామ్‌ ఈరంగంలో ప్రవేశించారు. డి.ఆర్‌.డి.ఓ.లో చీఫ్‌ సైంటిస్ట్‌గా పని చేస్తుండగానే ఆయన సారాభారు నేతృత్వంలోని 'ఐఎన్‌సిఓఎస్‌పిఏఆర్‌' (ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఆఫ్‌ స్పేస్‌ రీసెర్చ్‌) కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 1969లో ఇస్రోలో చేరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ వాహనం(శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌, ఎస్‌ఎల్‌వి-3) ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ వాహనం ద్వారానే 1980లో రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. రాకెట్‌ అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ, అదేవిధంగా పోలార్‌ శాటిలైట్‌ వాహన ప్రాజెక్టులోనూ పాలుపంచుకున్నారు.

ఆంత్రిక్స్‌ కార్పొరేషన్‌ ఎస్‌ బ్యాండ్‌ కుంభకోణం

ఆంత్రిక్స్‌ అనేది ఇస్రో వాణిజ్య కార్యకలాపాల విభాగం. 1992 సెప్టెంబర్‌లో ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీగా ప్రారంభమైన ఇది ప్రభుత్వ సంస్థగా మారింది. అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలో బెంగళూరు కేంద్రంగా పని చేస్తూ అంతరిక్ష పరిజ్ఞానం మొదలుకుని, పరికరాల అమ్మకంతో పాటు సిబ్బంది శిక్షణ, ఉపగ్రహాల ప్రయోగం, ఆ తరువాత లభించే డేటా అమ్మకం దాకా వివిధ రకాల సేవలనందిస్తుంది ఆంత్రిక్స్‌. అంతరిక్ష సంబంధిత పరిశ్రమల సామర్థ్యాలను పెంచడం కూడా దీని లక్ష్యాల్లో భాగంగా ఉంది. 2008లో 'మినీరత్న' హోదాను పొందింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎదిగింది. అయితే గత ఏడాది 'ఆంత్రిక్స్‌-దేవాస్‌ కుంభకోణం'గా పేరు పడ్డ అవినీతి బాగోతం బయటపడడంతో ఇస్రో ఇన్నేళ్ల, ఇందరి కృషితో సంపాదించుకున్న పేరుప్రతిష్టలు ఒక్కదెబ్బకే మసిబారి పోయాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలు ప్రభుత్వ రంగంతో పాటు అన్ని విలువలను నాశనం చేస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఇస్రోలోకి కూడా అవినీతి రాకెట్లు దూసుకొచ్చాయి. బెంగళూరుకు చెందిన దేవాస్‌ మల్టీమీడియా సంస్థకు ఎస్‌-బ్యాండ్‌ కేటాయింపుల కోసం అంత్రిక్స్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అవకతవకతలకు పాల్పడి ఆ సంస్థకు అతి తక్కువ ధరకే స్పెక్ట్రమ్‌ కేటాయించారని తేలింది. 2జి స్కాం కంటే ఇది పెద్దదనీ, దీనివల్ల ఖజానాకు రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టమని వార్తలొచ్చాయి. కుంభకోణంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ పాత్ర ఉందని తేలింది. అంతేకాదు ప్రధాని, ప్రధానమంత్రి కార్యాలయం పాత్ర కూడా వివాదాస్పదమైంది. విచారణ కమిటీలు కూడా నాయర్‌ పాత్ర ఉందని తేల్చి చెప్పడంతో ఆయనతో పాటు ఈ అవినీతి బాగోతంలో పాలుపంచుకున్న మరో ముగ్గురు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ బాధ్యతలూ చేపట్టకుండా నిషేధం విధించింది. ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. అయినా దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప ఇస్రోపై పడిన మచ్చ ఇప్పట్లో చెదిరిపోయేలా లేదు.

మూఢ నమ్మకాల్లో మునిగిపోతున్న సైంటిస్టులు

పూజలుపునస్కారాలు, జపతపాలు, శాంతిహోమాలు సమస్యలను తీర్చలేవు. మొక్కుబడులు చెల్లింపులు ఆకలిని తీర్చలేవు, అభివృద్ధిని సాధించలేవు అన్న సత్యం అర్థమైంది కాబట్టే ఆనాటి మన నేతలు సైన్సుబాట పట్టారు. శాస్త్రీయ పంథాలో సాగి దేశాభివృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నారు. శాస్త్రీయ సాధనమైనందునే అంతరిక్ష విజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధి పథంలో పయనించడం ఆరంభించారు. 'ఏ మతమూ, ఏ ఇజమూ సాధించలేనిది సైన్సు సాధిస్తుంది. అందుకే మనం శాస్త్రీయ మార్గంలో ముందుకు సాగుదాం'అని ప్రకటించాడు అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యుడైన విక్రమ్‌ సారాబారు.
ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నామని సగర్వంగా ప్రకటించుకుంటున్న కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మూఢనమ్మకాల్లో మునిగిపోతున్నారు. సైన్సుకే మచ్చ తెస్తున్నారు. వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలు ఉంటే ఉండొచ్చు కానీ వాటిని వృత్తిలోనూ ప్రదర్శించడమే వివాదాలు రేపుతున్నాయి. అంతరిక్ష పరిశోధనాశాలలు, ప్రయోగ కేంద్రాల్లో గుళ్లు గోపురాలు నిర్మిస్తున్నారు. ప్రతి పనీ ప్రారంభించే ముందు ఆయా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉపగ్రహ ప్రయోగాలు చేసేటప్పుడైతే సామూహికంగా పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు శాంతి హోమాలు, పూజలు చేయిస్తున్నారు.కస్తూరిరంగన్‌ వంటి వారైతే ఏకంగా బాబాల వద్దకు కూడా వెళ్లారు. 'ఇదేమని' ప్రశ్నిస్తే సెంటిమెంటు అంటున్నారు. అది సెంటిమెంటు కాదు సూపర్‌స్టిషన్స్‌(మూఢనమ్మకాలు) అని విమర్శిస్తున్నారు సైన్సు కార్యకర్తలు. నాయకత్వ స్థానాల్లో ఉన్న వీరిని ఇతరులూ అనుసరిస్తూండడంతో ఈ మూఢనమ్మకాలు వ్యాపిస్తున్నాయి. విజ్ఞానంతో అంతరిక్షాన్ని సాధించగలిగిన శాస్త్రవేత్తలు వీటిని వదిలించుకోగలరా? శాస్త్రం గురించి చెప్పడం కాకుండా దాన్ని ఆచరిస్తూ ఏనాటికైనా ఆదర్శవంతంగా మారగలరా? అనేది ప్రస్తుతానికైతే సమాధానం లేని ప్రశ్నే!!

ఇస్రో గమనంలో ప్రధాన అడుగులు
* 1962 : భారత అంతరిక్ష పరిశోధనల కమిటీ(ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌) ఏర్పాటు
* 1963 : తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు
* ఇదే ఏడాది నవంబర్‌ 21న ప్రప్రథమ రాకెట్‌ ప్రయోగం
* 1965 : తుంబలో అంతరిక్ష విజ్ఞాన సాంకేతిక కేంద్రం ఏర్పాటు
* 1972 : ఇస్రో స్థాపన
* 1975 : ఏప్రిల్‌ 19న దేశపు తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
* 1979 : రెండవ ఉపగ్రహం భాస్కర-1 జూన్‌7న రష్యా నుంచి ప్రయోగం
* ఆగస్టు 10న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వి-3) ప్రయోగం
* 1980 : శ్రీహరికోటలోని షార్‌ నుంచి రోహిణి ఉపగ్రహ ప్రయోగం
* 1981 : మే 31న రోహిణి-2 ప్రయోగం, జూన్‌ 19న ఆపిల్‌ శాటిలైట్‌ ప్రయోగం, నవంబర్‌ 20న భాస్కర-2 ప్రయోగం
* 1982 : ఇన్శాట్‌ ప్రయోగం
* 1984 : తొలిభారతీయుడు రాకేష్‌ శర్మ అంతరిక్ష యానం
* 1992 : ఏఎస్‌ఎల్‌వి ప్రయోగం
* 1994 : పిఎస్‌ఎల్‌వి ప్రయోగం
* 1995 : అంతరిక్ష డేటా మార్కెటింగ్‌ కోసం వివిధ దేశాలతో ఒప్పందం
* 2001 : జిఎస్‌ఎల్‌వి ప్రయోగం
* 2005 : శ్రీహరికోటలో రెండో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటు
* 2007 : తొలిసారి వాణిజ్య ప్రాతిపదికన ఇటలీకి చెందిన అగిలి ఉపగ్రహ ప్రయోగం
* 2008 : చంద్రయాన్‌ - 1 ప్రారంభం
* 2012 : వందో ప్రయోగం ద్వారా స్పాట్‌, ప్రొయిటెరిస్‌ ఉపగ్రహాల ప్రయోగం
1 నుంచీ 100 వరకు
1975లో సోవియట్‌ రష్యా రాకెట్‌ ఇంటర్‌కాస్మోస్‌ ద్వారా ఆర్యభట్ట ప్రయోగంతో అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టిన భారత్‌ ప్రస్తుతం విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో మొత్తం 62 ఉపగ్రహాలు, 37 రాకెట్లు, ఒక స్పేస్‌ మాడ్యూల్‌తో కలిపి 'సెంచరీ' పూర్తి చేసింది. ఇస్రో ప్రయోగ సేవలు తక్కువ ధరకే లభించడంతో ఎన్నో దేశాలు తమ శాటిలైట్స్‌ను ఇక్కడ నుంచి ప్రయోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి.
వందో ప్రయోగంతో వంద కోట్లు...
పిఎస్‌ఎల్‌వి-సి21 ద్వారా తమ స్పాట్‌-6 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినందుకుగాను ఇస్రోకు ఫ్రాన్స్‌ రూ.100 కోట్లు చెల్లిస్తుంది. అదే విధంగా ప్రొయిటెరిస్‌ ప్రయోగానికి జపాన్‌ కూడా కొన్ని కోట్లు ఇస్తుంది. అయితే విదేశీ ఉపగ్రహ ప్రయోగాల వల్ల కొన్ని సార్లు దౌత్యపరమైన ఇబ్బందులూ ఎదురవుతాయి. ఉదాహరణకు 2008 జనవరిలో షార్‌ ఇజ్రాయిల్‌కు చెందిన పొలారిస్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది తమతమ దేశాల్లో గూఢచర్యం కోసమేనని పాకిస్తాన్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాలు, భారత్‌ను కూడా విమర్శించాయి. దానితో దేశం కొన్ని దౌత్య చిక్కులను ఎదుర్కోవలసి వచ్చింది.
అంతరిక్ష ప్రయోగాల వల్ల ప్రయోజనాలు
మనం సాధిస్తున్న అభివృద్ధిలో అంతరిక్ష పరిశోధనల పాత్ర ప్రధానమైనది. ఇవి సాధించిన ఫలితాలు ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తూ వాటి అభివృద్ధికి కూడా దోహదం చేస్తున్నాయి. ప్రధానమైన కొన్ని ఉపయోగాలు...
* పంటల స్థితిగతులపై అధ్యయనం * భూగర్భ జలాల ఆచూకీ * కరువు కాటకాల వంటి దుర్భిక్షాల అంచనా * తుపాను, సునామీ తదితర ప్రకృతి వైపరీత్యాలు పసిగట్టడం * ఖనిజ నిక్షేపాల గుర్తింపు * కమ్యూనికేషన్‌ * బోధన * టెలిమెడిసిన్‌ * ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు * విదేశీ మారక ద్రవ్యం ఆర్జన
'భారత్‌ లాంటి పేద దేశంలో భిన్న రంగాల అభివృద్ధి అంతరిక్ష ప్రయోగాలపై ఆధారపడి ఉంది' అని వందో ప్రయోగం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ అన్నారంటే ఈ రంగం ప్రయోజనాలేమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇస్రో భవిష్యత్‌ కార్యక్రమాలు
సాధించిన దానితోనే సంతృప్తి చెందని ఇస్రో మున్ముందు చంద్రయాన్‌-2, మంగళ్‌యాన్‌, ఆదిత్యతో పాటు మరెన్నో అద్భుత ప్రయోగాలను నిర్వహించనుంది.
చంద్రాయన్‌ - 2
చంద్రునిపై జీవం ఉనికి కోసం పరిశోధన చేయడంలో భాగంగా ఇప్పటికే భారత్‌ చంద్రయాన్‌-1ను నిర్వహిస్తోంది. ఇది చంద్రునిపై నీటి గురించి కచ్చితమైన ఆధారాలందించింది. ఈ ప్రోత్సాహంతో భారత్‌ రెండో చంద్రయానానికి సిద్ధమైంది. ప్రారంభం నుంచీ తన అంతరిక్ష పరిశోధనల కోసం చేయూతనందిస్తున్న రష్యాతో కలిసి 2014లో చంద్రయాన్‌- 2 నిర్వహించనుంది. దీనిలో భాగంగానే రష్యా నిర్మించిన రోవర్‌ను షార్‌ నుంచి ప్రయోగిస్తారు.
మంగళ్‌యాన్‌
2013లో అంగారక గ్రహయాత్రకు ఉద్దేశించిన మంగళయాన్‌ను ప్రారంభిస్తుంది ఇస్రో. దీనిలో భాగంగా అంగారక గ్రహంపైకి మానవ రహిత యాత్ర నిర్వహిస్తుంది.
ఆదిత్య
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో నిర్వహించే మరో అద్భుత ప్రయోగం ఆదిత్య. సూర్యుడి బాహ్యవలయం కరోనా అధ్యయనం కోసం సాగించే ఈ ప్రయోగంతో భారత కీర్తి సూర్యుడిని చేరుతుంది.
తన 101వ ప్రయోగంగా ఇస్రో డిసెంబర్‌లో 13 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. అదేవిధంగా 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం 58 ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రయోజెనిక్‌ పరిజ్ఞానం భారత్‌కు అందకుండా అమెరికా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ క్రయోజెనిక్‌ ఇంజన్‌ సొంతంగానే నిర్మించి అమెరికాకు బుద్ధి చెబుతానని ధీమా వ్యక్తం చేసింది.