-
అశాస్త్రీయ ఆచారాలు20
'నాకు 'వాస్తు' శాస్త్రం కాదని తెలుసు' అన్నాను నవ్వుతూ.
'అదేమిటి? 'వాస్తు' శాస్త్ర గ్రంథాన్ని చదువుతూ 'వాస్తు'ను శాస్త్రం కాదంటావేమిటి?'
'అవును చంద్రమౌళీ! ఈ గ్రంథాన్నే కాదు. ఇంకా అనేక వాస్తు గ్రంథాలు చదివాను కాబట్టే 'వాస్తు'ను శాస్త్రం కాదంటున్నాను'.
'ఎలా చెప్పగలవు? కొంచెం వివరించు' అన్నాడు చంద్రమౌళి ఆసక్తిగా.
'చంద్రమౌళీ! నీకు నాలుగు రాళ్ళిస్తాను. ఆ నాలుగూ, నాలుగు కులాలకు చెందినవంటాను. అంగీకరిస్తావా?' ప్రశ్నించాను చంద్రమౌళిని.
'టెక్నాలజీలో ఒక డిగ్రీని సంపాదించి ఇంజనీరుగా అనేకేళ్లు పనిచేసిన నేను దీన్ని ఎలా అంగీకరిస్తాను? ఎదురుప్రశ్న వేశాడు చంద్రమౌళి.
'వెరీగుడ్. వాస్తువాదుల ప్రకారం ఈ భూమి నాలుగువర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందినదిగా వర్ణించబడింది. దానిని వివరిస్తా విను. రంగు, వాసన, రుచి, ఆకారం, దానిలో పెరిగే చెట్లు, ఎత్తుపల్లాలను బట్టి భూమి ఏ వర్ణానికి చెందినదో చెప్పవచ్చట! ముందు రంగుపరీక్షను గూర్చి విను. 'వాస్తు కల్పద్రుమం'లో ఇలా ఉంది.
శ్లో|| శుక్లమృత్స్నాచ యా భూమిర్బ్రాహ్మణా సా ప్రకీర్తితా
క్షత్రియా రక్తమృత్స్నాచ హరిద్వైశ్యా ఉదాహృతా
కృష్ణా భూమిర్భవేచ్ఛూద్రా చతుర్థాపరికీర్తితా||
అనగా, గృహము నిర్మించనున్న స్థలమందలి మృత్తిక లేక మన్ను తెల్లగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎరుపురంగుగానున్న యెడల 'క్షత్రియ భూమి' అనియు, పసుపు వర్ణముగా ఉన్న యెడల 'వైశ్య భూమి' అనియు, నలుపు వర్ణముగా ఉన్నచో 'శూద్ర భూమి' అనీ నిర్ణయించాలని ఆ శ్లోకం యొక్క అర్థం.
'ఇక వాసన పరీక్షకు సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(ఆ కొనసాగింపు వచ్చేవారం తెలుసుకుందాం..)
ఇక వాసన పరీక్ష విను. భూమి అందలి మట్టిని తీసుకొని వాసన చూచినప్పుడు ఆ వాసనను బట్టి ఆ భూమి ఏ కులానిదో చెప్పవచ్చట. 'విశ్వకర్మ ప్రకాశిక'లోని ఈ శ్లోకాన్ని విను.
శ్లో|| సుగంధా బ్రాహ్మణీ భూమిః రక్త గంధాతు క్షత్రియా |
మధుగంధా భవేద్వైశ్యా మద్యగంధాచ శూద్రిణీ ||
అంటే భూమి వాసన జాజి, మల్లె వంటి పుష్పముల సువాసన కలిగి వుంటే 'బ్రాహ్మణ భూమి' అని, రక్తము యొక్క వాసన కలిగి వుంటే 'క్షత్రియ భూమి' అని, తేనె వాసన కల్గినది 'వైశ్య భూమి' అనియు, కల్లు వాసన కల్గిన భూమి అయితే 'శూద్ర భూమి' అనియు నిర్ణయించాలట!
ఇక, రుచిని బట్టి భూమి వర్ణాన్ని నిర్ణయించడాన్ని తెలుసుకుందాం.
శ్లో|| మధురా బ్రాహ్మణీ భూమిః కషాయా క్షత్రియా మతా
ఆమ్లా ద్వైశ్యాభవేద్భూమి స్తిక్తాశూద్రా ప్రకీర్తితా|| (విశ్వకర్మ ప్రకాశిక)
'భూమియందలి మట్టి తీపిగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, వగరుగా ఉన్నచో 'క్షత్రియ భూమి' అనియు, పులుపుగా ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, చేదుగా ఉన్న యెడల 'శూద్ర భూమి' అనియు గుర్తించవలెను' అని అర్థం.
ఇక భూమి ఆకారాన్ని బట్టి దాని వర్ణాన్ని ఎలా నిర్ణయిస్తారో చెబుతాను విను.
శ్లో|| గంభీరా బ్రాహ్మణీ భూమిః నృపాణాం తుంగమాశ్రితా
వైశ్యాసా సమ భూమిశ్చ, శూద్రిణీ వికటాస్మృతా|| (విశ్వకర్మ ప్రకాశిక)
అనగా, గృహము నిర్మించనున్న స్థలము యొక్క ఆకారము గంభీరముగా ఉన్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎత్తుగానున్నచో 'క్షత్రియ భూమి' అనియు, ఎత్తు పల్లములు లేకుండా సమతలం ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, ఎత్తు పల్లముతో ఉన్నచో 'శూద్ర భూమి' అనియు తెలుసుకోవలయును.
భూమియందు పెరిగే చెట్లను బట్టి కూడా ఆ భూమి యొక్క వర్ణాన్ని నిర్ణయించవచ్చట. ఎలాగో విను.
శ్లో|| బ్రాహ్మణీ భూః కుశోపేతా, క్షత్రియాస్యాచ్ఛరాకులా
కుశకాశాకులా వైశ్యా శూద్రా సర్వ తృణాకులా| (విశ్వకర్మ ప్రకాశిక)
అనగా భూమియందు దర్భలు పెరుగుచున్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, కాకి వెదురు పెరుగుచున్నచో 'క్షత్రియ భూమి' అనియు, రెల్లు పెరుగుచున్న యెడల 'వైశ్య భూమి' అనియు, వివిధ గడ్డి రకాలున్న యెడల 'శూద్ర భూమి' అనియు తెలియవలెను.
అంతేకాదు. భూమియందలి పల్లములను అనుసరించి ఆ స్థలము యొక్క వర్ణమును తెలుసుకోగలమని 'వాస్తు సర్వస్వం' చెబుతోంది. దాన్ని విను.
శ్లో|| ఉదక్ ప్లవా బ్రాహ్మణీ స్యా త్ప్రాక్లవా క్షత్రియామతా
అవాక్ ప్లవాచ వైశ్యాస్యా చ్ఛూద్రిణీ పశ్చిమప్లవా||
అంటే ఉత్తరమున పల్లముగా ఉన్న భూమి 'బ్రాహ్మణ భూమి' అనియు, తూర్పున పల్లముగా ఉన్న భూమి 'క్షత్రియ భూమి' అనియు, దక్షిణము పల్లముగా ఉన్న భూమి 'వైశ్య భూమి' అనియు; పశ్చిమము పల్లముగా ఉన్న భూమి 'శూద్ర భూమి'.
భూమి వర్ణాన్ని గూర్చి చివరగా ఇలా 'వాస్తు సర్వస్వం'లో చెప్పబడింది.
శ్లో|| బ్రాహ్మణీ సర్వసుఖదా, క్షత్రియా రాజ్యదా భవేత్
ధన ధాన్యకరీ వైశ్యా శూద్రాతు నిందితా స్మృతా||
అనగా 'బ్రాహ్మణ భూమి' సమస్త సుఖములను ఇస్తుంది. 'క్షత్రియ భూమి' రాజ్య ప్రసాదముగా ఉండును. 'వైశ్య భూమి' ధనధాన్యాలను ఇచ్చును. 'శూద్ర భూమి' నింద్యమైనది, అనగా ఇల్లు కట్టగూడనిది.
ఇప్పుడు చెప్పు చంద్రమౌళీ! రాళ్ళు రప్పలతో వున్న భూమికి కూడా కులాలను ఆపాదించడం, అందులోనూ భూమిలోని ఒక్కో స్థలం ఒక్కో వర్ణానికి చెందిన భూమిగా అనడం అశాస్త్రీయం కాదా? భూమి వివిధ వాసనలతోనూ, అనేకరకాలైన రుచులూ కల్గి ఉంటుందనడం శాస్త్రీయమా? అందులోనూ మంచి వాసన, తీపి రుచీ ఉంటే అది 'బ్రాహ్మణ భూమి' అట! కల్లు లేక సారావాసన, చేదు రుచీ ఉంటే 'శూద్ర భూమి' అట! ఇది శూద్రులను అవమానించడం కాదా? భూమి గంభీరంగా ఉంటే బ్రాహ్మణ భూమి అట! ఎత్తు పల్లములుగా ఉన్న భూమి శూద్రభూమి అట! భూమి గంభీరంగా ఉండటమంటే ఏమిటి? ఏ వాస్తు పండితుడైనా వివరించగలడా? నల్లటి భూమి 'శూద్ర భూమి' అని ముందు చెప్పి ''కృష్ణ వర్ణో ధమాధ¸మం'' అంటే నల్లటి భూమి చెడ్డవాటిలో చెడ్డది అని తర్వాత చెప్పబడింది. ఇది కూడా శూద్రులను అవమానించడం కాదా? అంతేకాదు, పడమర పల్లంగా ఉన్న భూమి 'శూద్ర భూమి' అనీ, అది 'అధమాథమ భూమి' అనీ, అలాంటి భూమిలో ఇల్లు కట్టుకుంటే కష్టనష్టాలు కలుగుతాయనీ చెప్పబడింది. మనదేశంలో ముంబయి, కొచ్చిన్, మంగళూరులాంటి పట్టణాలూ, గోవా రాష్ట్రం పశ్చిమతీర ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రదేశాలలో భూమి పశ్చిమం పల్లంగా ఉంటోంది. మనదేశంలోని అత్యంత సంపన్నులు ఆ ప్రదేశాలలోనే ఉంటున్నారు. ఇది వాస్తు విరుద్ధమైన విషయం కాదా? అంతేకాదు. మరో ముఖ్య విషయాన్ని ''వాస్తు ప్రదీపం'' ఇలా తెలియజేస్తోంది.
శ్లో|| స్వవర్ణ గంధ సురసా ధన ధాన్య సుఖా వహా|
వ్యత్యయే వ్యత్యయ ఫల మతః కార్యం పరీక్షణం||
అనగా 'తన వర్ణమునకు సరైన వర్ణము, వాసన, రుచి గల భూమి ధనధాన్య సుఖములనిచ్చును. అట్లుగాక తన వర్ణమునకు వ్యతిరేకమైన వర్ణము, వాసన, రుచిగల భూమి నష్టమును కలుగజేయును'' అని తెలియజేస్తోంది. అంటే శూద్రులు ఏదైతే వాస్తువాదులు అధమాధమ భూమిగా ప్రత్యేకించి పేర్కొన్నారో దానిపైనే నివసించాలనీ, అలా ఉంటేనే వారికి సుఖములు కలుగుతాయనీ పేర్కొనడం అమానుషం కాదా?
'ఇలా అత్యంత అశాస్త్రీయంగా, అమానుషంగా భూమిని విభజించిన 'వాస్తు' శాస్త్రం ఎలా అవుతుంది?' అన్నాను.
చంద్రమౌళి మౌనంగా ఉండిపోయాడు.
'వాస్తు గ్రంథాలలో, ఇల్లు కట్టవలసిన భూమికి సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(మరికొన్ని అంశాలు వచ్చేవారం)
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment