చెట్లకేం కాస్తాయి?
- జంధ్యాల రఘుబాబు
Wed, 10 Oct 2012, IST
-
చురక సంహిత
'ఇదేమి మొక్క' మావాడి ప్రశ్న.
'దానిమ్మ' నర్సరీ అతని జవాబు.
'దీనికి ఏం కాయలు కాస్తాయి?'
'దానిమ్మ కాయలు.'
'ఇదేమి మొక్క, ఆకులు బాగా ఉన్నాయి.'
'నిమ్మ'.
'దీనికి ఏ కాయలు కాస్తాయి.'
'నిమ్మ కాయలు, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తాయి.'
'ఇదేమి మొక్క?'
'మామిడి మొక్క, ఇది పెద్దయ్యాక మామిడి కాయలు కాస్తాయి, అది చీనీ మొక్క. దానికి చీనీ కాయలు కాస్తాయి, అది ....'
మధ్యలో ఆపేసి మావాడు 'ఏమి చదువుకున్నావు?' అని అడిగాడు.
'అయిదుకే ఆపేశాను. అందుకే ఏ మొక్కకు ఏ కాయలు కాస్తాయో తెలుసు. తలా తోకా లేని ప్రశ్నలు వేసేంత చదువుకోలేదు. చదువులేదని ఇన్ని రోజులూ బాధపడ్డాను. ఇక నుంచి ఆనందంగా ఉండవచ్చు. లేదంటే నా మెదడు కూడా ఇలా చెడిపోయి ఉండేదేమో' అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.
నాక్కొంచెం కోపమొచ్చింది. 'ఏరా, కష్టపడే వారితో జోకులా?'
'జోకులు కాదురా. అయిదవ తరగతి చదివిన వారికీ లేదా ఏమీ చదవని వారిక్కూడా ఏ చెట్టుకు ఏ కాయలు కాస్తాయో తెలుసు కదా, మరి మన ప్రధానికి తెలియదా, డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలని. ఆయన జోక్ వేయగా లేనిది నేను తమాషా చేయకూడదా? ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు కూడా. ఇందాక చదువుకున్న వాడినని నాపై నర్సరీ అతను కోప్పడ్డాడు కదా, మరి నా కోపం ఎవరి మీద చూపాలి?'
'ఆ లైన్లో వచ్చావా! అదీ ప్రజలందరూ వింటున్న టీవీ కార్యక్రమంలో, ఓ కామెడీ షోలా ఉందని మా ఆఫీసులో కూడా అనుకున్నారు.'
'సినిమాలో కామెడీ ఆర్టిస్టులుంటారు, మనల్ని నవ్విస్తారు. దాంట్లో వారు స్పెషలిస్టులు. అలాగని హీరో సీరియస్‌గా కథ నడిపినా, తానూ మధ్యలో కామెడీ చేయవచ్చు కొన్ని సీన్లలో. అంతేకానీ మొత్తం కమెడియన్లలా చేయడు కదా!'
'సరేలే ఎవరి సినిమా కష్టాలు వారివి.'
్య్య్య
'నాన్నా, మా బడిలో కథల పోటీలు జరుగుతున్నాయి. నాకేదైనా నాటకం రాసివ్వవా.'
'సాంఘికమా, జానపదమా, పౌరాణికమా?'
'ఏదైనా సరే.'
'సరేలే.'
్య్య్య
పూర్వం మోహనాసురుడనే రాక్షసుడు మనుషులపైనా, ఋషులపైనా దాడి చేసి గాయపరచి వారిని భక్షించేవాడు. ఎందరు ప్రయత్నించినా వాడిని ప్రతిఘటించే శక్తి లేక ఊరుకోవలసి వచ్చేది. అందరూ తప్పించుకుని తిరగసాగారు.
ఒకనాడు ఓ ముని బక్కపలచగా ఉన్నా ధైర్యస్తుడు ఆ అడవిగుండా వెళుతుంటాడు. మోహనాసురుడు ఎదురవుతాడు. వీడిని తిని ప్రయోజనం ఉంటుందా అనుకుని, సరేలే ఓ ఆట ఆడించి వదిలేద్దాం అనుకుని 'ఏరా పుల్లయ్యా, ఎక్కడికి ప్రయాణం?'
'ఓ రాక్షసాధమా, నీ గురించి విన్నాను, నీవూ బుద్ధిగా తపస్సు చేసుకుని దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏదైనా వరం పొంది జీవితాంతమూ ఏ శ్రమా లేకుండా హాయిగా ఉండవచ్చు కదా!'
'అవురా, నాకు ఈ విధంగా జ్ఞానబోధ చేసినవారు ఇంతవరకూ తారసపడలేదురా, ఇంతకీ ఏ దేవుడి కోసం తపస్సు చేయమంటావు.'
'పిచ్చివాడా, శివుణ్ణి ప్రార్థించు.'
'ఏ వరం కోరమంటావు?'
'అన్నింటికీ ముఖ్యమైనది డబ్బు అది సంపాదించే మార్గం అడుగు. అదీ ఎలాంటి కష్టం లేకుండా.'
్య్య్య
''ఓం నమః శివాయ, ఓం నమః శివాయ .....' ఘోరమైన తపస్సు (సముద్రాలు పొంగటం, భూకంపాలు రావడం- ఇవన్నీ బ్యాక్ గ్రౌండ్‌లో)
'మోహనాసురా వచ్చాను. నేను శివుణ్ణి. ఏదైనా వరం కోరుకో...'
'దేవ దేవా! నా శ్రమను గుర్తించి నాకు ప్రత్యక్షమైనావా?'
'అవును మోహనాసురా'
'పరమ శివా, నీకు తెలుసు ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నదని. అందుకే నాకు ...'
'నీకు?'
'నాకు డబ్బులు కాసే చెట్టును ఇవ్వు.'
'ఇదేమి కోరిక మోహనాసురా! ప్రకృతి విరుద్ధంగా చెట్లకు కాయలు, పండ్లు కాకుండా డబ్బులా?'
'ఏం కల్పవృక్షమూ, కామథేనువు గురించి మునులు మాట్లాడుకుంటుండగా వినలేదనుకున్నావా?'
'సరే మోహనాసురా. అయితే ఒక షరతు, నీవు కోరినట్లు చెట్లకు డబ్బులు కాస్తాయి కానీ అవి చెట్లని ఎవ్వరికీ తెలియదు. నీకు మాత్రం తెలిసినా నీవు తెలియనట్లు నాటకమాడతావు. కోరరాని కోరిక కోరినందుకు నీకు సుఖం లేకపోగా, నీవు ఆ డబ్బును అనుభవించలేవు.'
'అయితే ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో ఈ వరం ప్రసాదించు స్వామీ'
'అలాగే' (పెద్ద శబ్దం, శివుడి అంతర్థానం)
్య్య్య
'డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలి ...' ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగం.
కానీ ఎవ్వరికీ తెలియకుండా బ్యాంకులు, బీమా కంపెనీలు, భవిష్య నిధులూ, పెన్షన్లూ, ప్రభుత్వ రంగ కంపెనీలు, నదులూ, సముద్రాలూ, కొండలూ, ఆకాశాలూ, గనులూ, అన్నీ చెట్లే. అన్నింటికీ డబ్బులే డబ్బులు ... విరగకాస్తున్నాయి. వాటిని కోసుకునేందుకు దేశంలోని బడా బాబులకు, విదేశీ బాబులకు నిచ్చెనలేస్తున్న నాయకులు ... ఆ నిచ్చెనల కింద నలిగిపోతూ సామాన్య జనం ...
ఎవరు చెప్పింది డబ్బులు కాయవని ...
్య్య్య
పరదా పడుతుంది, చప్పట్లు ...
No comments:
Post a Comment