Wednesday, 10 October 2012

మానవ మనుగడ కోసం జీవ వైవిధ్యం


మానవ జోక్యం, ప్రమేయం ప్రకృతి స్వభావాన్ని కొంత మేరకు మార్చే అవకాశం ఉన్నప్పటికీ, మానవులు తమ అవసరాల కోసం విడదీయలేనంతగా ఇప్పటికీ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. ఈ వైరుధ్యం గరిష్ట స్ధాయికి చేరితే అది వైవిధ్యం తిరుగులేని విధంగా అంతం కావడానికి దారితీయడమే కాకుండా మానవ నాగరికత ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. మనం వేగంగా ఆ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు సిబిడి గుర్తించింది.

ప్రపంచంలోని దేశాలను పేద, ధనిక దేశాలుగా మాత్రమే కాకుండా మరో రకంగా కూడా వర్గీకరించవచ్చు. జన్యుపరంగా లేదా జీవ వైవిధ్యపరంగా సుసంపన్నమైన దేశాలు, పేటెంట్‌పరంగా సంపన్న దేశాలుగా వాటిని వర్గీకరించ వచ్చు. భూమికి సంబంధించిన జీవ వైవిధ్యం వివిధ రకాలైన సహజసిద్ధమైన మొక్కలు, జంతువులు, సూక్ష్మ ప్రాణుల విషయాల్లో వ్యక్తమవుతుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాల్లో ఈ జీవ వైవిధ్యం ఎక్కువగా ద్యోతకమవుతుంది. యూరప్‌, ఉత్తర అమెరికా దేశాలు ఈ విషయంలో వెనకబడి ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న వివిధ జంతు, మొక్కల వనరులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
జీవ వైవిధ్యంపై ఒప్పందం
జీవ వైవిధ్యం విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఉన్న అంతరం జీవ వైవిధ్య ఒప్పంద(సిబిడి) చరిత్రను చాటిచెబుతోంది. ఈ ఒప్పందం 1992లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కుదిరి 1993లో అమలులోకి వచ్చింది. 193 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ తరువాత ధృవీకరించని బహుకొద్ది దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అంటే ఈ తీర్మానానికి అమెరికా కట్టుబడి ఉండదని అర్థం. దీన్ని ధృవీకరించక పోవడానికి అమెరికా తెలిపిన కారణాల్లో మేధోసంపత్తి హక్కుల్లో ఈ ఒప్పందం జోక్యం చేసుకునే అవకాశం ఉందనేది ఒకటి. తమ దేశ పౌరులు, సంస్థల హక్కుల్లో ఈ ఒప్పందం జోక్యం చేసుకుంటుందని అమెరికా వ్యాఖ్యానించింది. సిబిడిలో ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలున్నాయి. (ఎ) జీవ వనరుల పరిరక్షణ (బి) ఈ భూమిపై గల జీవ వనరులను స్థిరంగా, నిలకడగా ఉపయోగించుకోవడం, (సి) జీవ వనరులను సాంకేతికంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకోవడంలో సమానత్వం.
ఈ భూమి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా భావించారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఒక ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి కావడం ఈ ఒప్పందానికి ఉన్న మరో విశిష్టత. జీవ వైవిధ్యం ప్రపంచ దేశాల ఉమ్మడి సహజ సంపదగా గుర్తించారు. దానిని పరిరక్షించడం మానవాళి ఉమ్మడి బాధ్యత, సమస్యగా కూడా పరిగణించారు. ఈ భూమిపై జీవ వనరులు పరిమితంగా మాత్రమే ఉంటాయని, అవి వేగంగా అంతరించి పోతున్నాయనే అవగాహన ప్రాతిపదికగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. మొక్కలు, జంతువుల్లో వేగంగా అంతరించిపోతున్న ప్రతి ఒక్క రకం లక్షలాది సంవత్సరాల పరిణామ చరిత్రను కాలరాస్తుంది. మనం మన చుట్టూ ఉన్న విభిన్న రకాల మొక్కలు, జంతువులు ఈ భూమి మీద మొత్తం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి. మొక్కలు, జంతువులు మరణించిన కొద్దీ ఈ భూమి మీద పర్యావరణం మరింతగా దెబ్బతింటుంది. మొత్తం పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎంతగా సాంకేతికపరంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చెందినప్పటికీ కృత్రిమ మార్గాల ద్వారా జీవ వైవిధ్యాన్ని వృద్ధి చేసుకునే మార్గాలు అందుబాటులో లేవు. ఒక జాతి అంతరించిపోతే అది అంతరించిపోయినట్లే. దానిని పునరుజ్జీవింపజేసే అవకాశాలు లేవు.
మానవుడు, ప్రకృతి వైరుధ్యం
ఇతర మొక్కలు, జంతువుల మాదిరిగా మానవులు అందుబాటులోని వనరులను ఉపయోగించుకుని తమ అవసరాలను తీర్చుకోగలరు. ఈ భూమిపై ఉన్న ఇతర ప్రాణుల మాదిరిగా కాకుండా మానవులు ప్రకృతి నుంచి వనరులను సేకరించడంతోపాటు స్వభావాన్ని మార్చగల సామర్ధ్యం కలవారు. అందువల్ల ప్రకృతి, మానవుల మధ్య వైరుధ్యం చెలరేగుతోంది. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ ఈ ఘర్షణ ధోరణి కొనసాగుతూవస్తోంది. మానవ నాగరికత ఆవిర్భవించిన తొలి రోజుల్లో ఈ వైరుధ్యం ప్రభావం పరిమితంగానే ఉండేది. మానవ జోక్యాన్ని తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ఆ సమయంలో ప్రకృతి ఉండేది. అది జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించుకునే సామర్ధ్యాన్ని ప్రదర్శించేది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ హయాంలో సాధించిన అభివృద్ధి, వృద్ధితో ప్రకృతికున్న తన విస్తృత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోగల సామర్ధ్యం ప్రమాదంలో పడింది.
మానవ జోక్యం, ప్రమేయం ప్రకృతి స్వభావాన్ని కొంత మేరకు మార్చే అవకాశం ఉన్నప్పటికీ, మానవులు తమ అవసరాల కోసం విడదీయలేనంతగా ఇప్పటికీ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. ఈ వైరుధ్యం గరిష్ట స్ధాయికి చేరితే అది వైవిధ్యం తిరుగులేని విధంగా అంతం కావడానికి దారితీయడమే కాకుండా మానవ నాగరికత ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. మనం వేగంగా ఆ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు సిబిడి గుర్తించింది. మన ముందు ముప్పు పొంచి ఉన్నదనే విషయాన్ని మానవాళి ఇటీవలనే గుర్తించడం మాత్రమే కాదు, జీవ వైవిధ్యం అనే పదాన్ని ఇటీవలే కొత్తగా రూపొందించింది. 1980 దశకంలో ఇది వాడుకలోకి వచ్చింది. మనం ఎంత మేరకు జీవ వైవిధ్యాన్ని కోల్పోయామనే విషయమై మనకు పరిమితమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. గతంలో కూడా అనేకసార్లు పెద్ద ఎత్తున జాతులు అంతరించిపోయాయనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో జీవ పరిణామంలో భాగంగా కొన్ని జాతులు అంతరించి పోవడం సహజమే. దీనిని 'బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌' అదృశ్యం అని పిలుస్తారు. ఈ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో జాతులు అంతరించిపోతూ ఉంటే దానిని మూకుమ్మడిగా అంతరించి పోవడంగా వ్యవహ రిస్తారు. గత 60 కోట్ల సంవత్సరాల్లో మూకుమ్మడిగా జాతులు అంతరించిపోయే ప్రక్రియ కనీసం ఐదుసార్లు జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సహజసిద్ధంగా ప్రకృతిలో సంభవించే మార్పులు భూ పర్యావరణంలో సమూలమైన మార్పుకు దోహదం చేశాయి. ఉదాహరణకు, రాక్షస బల్లులు (డైనోసార్స్‌) ఈ విధంగానే మూకుమ్మడిగా అంతరించిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. మానవుల ఉనికి లక్ష సంవత్సరాల కంటే తక్కువ కాలం నుంచే కొనసాగుతుండగా ఈ డైనోసార్స్‌ అనేక లక్షల సంవత్సరాలపాటు ఈ భూమిపై మసలాయనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తీవ్ర విధ్వంసం సంభవించిన కారణంగానే ఇవి అంతరించిపోయాయని భావిస్తున్నారు. అతి పెద్ద గ్రహ శకలంతో భూమి ఢకొీనడంతో ఈ విధ్వంసం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోసారి మనం మరో పెద్ద విపత్తు దిశగా సాగుతున్నామనే ఆందోళన తలెత్తుతోంది. ప్రకృతి వనరులను మానవులు అడ్డూఅదుపూలేని రీతిలో దోచుకోవడం వల్ల ఈ పరిణామం సంభవించ వచ్చునన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజూ వందల కొద్దీ జాతులు అంతరించి పోయే పరిస్థితిని మనం చూడవచ్చునని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది పైన పేర్కొన్న బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌ కంటే లక్షలాది రెట్లు ఎక్కువగా జరుగుతుందని అంచనా.
జీవ వైవిధ్యం అంతరించడానికి, భూగోళ ఉష్ణోగ్రతల పెరుగుదల ఫలితంగా చోటుచేసుకునే వాతావరణ మార్పుకు మధ్య సంబంధం ఉంది. ఉదాహరణకు ఉష్ణ మండల వర్షపాత అడవులు(రెయిన్‌ ఫారెస్ట్‌లు) అంతరించిపోతే వేలాది తెగల జీవరాసులు అంతమవుతాయి. అంతేకాకుండా వాతావరణంలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను హరించి వేడిని తగ్గించే సింక్‌లు కూడా హరించుకుపోతాయి. మరోవైపు భూమి త్వరితగతిన వేడెక్కడం అనేక జంతు జాతుల ఉనికికి ముప్పుగా పరిణమిస్తోంది. తద్వారా అవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రకృతి వనరుల దోపిడీ
మానవులు నిరంతరం భూమికి చెందిన జీవ వనరులపై ఆధారపడతారనే సిద్ధాంతాన్ని జీవ వైవిధ్య ఒప్పందం ప్రాతిపదికగా తీసుకుంటుంది. అందుకోసం నిలకడైన పద్ధతులను అనుసరించాలని వాదిస్తుంది. మానవ అవసరాలు, జీవ వైవిధ్యాన్ని స్థిరంగా పరిరక్షించుకోవాల్సిన అవసరాల మధ్య సమతుల్యత సాధించాలని అది పిలుపు నిచ్చింది. ఇటువంటి సమతుల్యత హేతుబద్ధమైనదే అయినప్పటికీ దానిని అమలు చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. ధనిక దేశాలు ఎక్కువ మొత్తాన్ని వినియోగిస్తుంటాయి. పేద దేశాలు జీవ వైవిధ్యానికి ప్రధాన నెలవులుగా ఉంటాయి. వాతావరణ మార్పుపై ప్రజల చర్చ కేంద్రీకృతమవుతున్న తరుణంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విషయంలో ధనిక, పేద దేశాల మధ్య పోరాటం జరుగుతోంది. ధనిక దేశాలు తమ వినియోగం తగ్గించుకోవడానికి సుముఖత చూపవు. పైపెచ్చు పరిరక్షణ భారాన్ని పేద దేశాలపై మోపాలని కోరుకుంటాయి. అటువంటి పరిరక్షణకుగాను తమకు ప్రతిఫలం చెల్లించాలని పేద దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తమకు ఆర్థికంగా మద్దతు అందించాలని, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ధనిక దేశాలు అందించాలని కోరుతున్నాయి.
ప్రయోజనాన్ని సమానంగా పంచుకోవడం-నగోయా ప్రొటోకాల్‌
అంతర్జాతీయ సంబంధాల్లో పేద, ధనిక దేశాల మధ్య అంతరం సిబిడిలో స్పష్టమవుతుంది. ఇది ప్రయోజనాలను సమంగా పంచుకోవాలని నిర్దేశిస్తోంది. పైన పేర్కొన్నట్లు ప్రపంచ జీవ వైవిధ్య వనరులు అధిక భాగం పేద దేశాల్లో ఉంటాయి. తమ విస్తరణ కోసం, లాభాలను పెంచుకునేందుకు ధనిక దేశాలు, వాటికి చెందిన బహుళ జాతి సంస్థలకు ఈ వనరులు అందుబాటులో ఉండటం అవసరం. కొత్త మందులకు అవసరమైన ముడిసరుకులను ఈ జీవ వనరులు అందిస్తాయి. అలాగే మెరుగైన వ్యవసాయోత్పత్తులను సాధించేందుకు, ఇంజనీరింగ్‌కు సంబంధించిన అనేక అప్లికేషన్స్‌కు ఇవి అవసరం. పేద దేశాల్లోని జీవ వనరులను దోపిడీ చెయ్యాలని ధనిక దేశాలకు చెందిన కార్పొరేట్లు నిరంతరం ప్రయత్నిస్తాయి. కొత్త ఉత్పత్తులను తయారుచేసేందుకు వీటిపైనే ఆ సంస్థలు ఎక్కువగా ఆధారపడతాయి. ఈ ఉత్పత్తులను గరిష్ట లాభాలకు అవి అమ్ముకుంటాయి. కోట్లాది డాలర్ల లాభాలను అవి సంపాదిస్తాయి. ఏ దేశాల నుంచి ఈ వనరులను సేకరిస్తున్నాయో వాటితో లాభాలు పంచుకునేందుకు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించవు. జీవ వనరుల చౌర్యం కేవలం వృక్ష, జంతు జాతులకు మాత్రమే పరిమితం కావు. స్థానిక ప్రజల పరిజ్ఞానానికి కూడా ఇది విస్తరిస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని అక్కడి ప్రజలు వేలాది సంవత్సరాలు కృషి చేసి సంపాదించుకున్నారు. అయితే దీనిని ధనిక దేశాలకు చెందిన సంస్థలు తమ ప్రయోజనాల కోసం, లాభాల కోసం దోపిడీ చేస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే సిబిడి లాభదాయకమైన పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక దేశంలో జీవ వనరుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను మరో దేశం లేదా సమాజంతో పంచుకోవాలని ఈ సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ఇది మొక్కలు, జంతువులకు మాత్రమే కాకుండా సూక్ష్మ జీవులకు (బాక్టీరియా, వైరస్‌లు) కూడా వర్తిస్తుంది. 2006లో అవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను ఇతర దేశాలతో పంచుకునేందుకు నిరాకరించడం ద్వారా ఇండోనేషియా అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో సంచలనం సృష్టించింది. తమ వైరస్‌ను ఉపయోగించుకునే వాక్సిన్‌ను తయారుచేసే సంస్థలు అందువల్ల వచ్చే లాభాల్లో తమకు వాటా ఇవ్వాలని ఇండోనేషియా డిమాండ్‌ చేసింది. ఇండోనేషియా వైఖరి దీర్ఘకాల ప్రతిష్టంభనకు దారితీసింది. ఆ తరువాత వైరస్‌ను పంచుకునే ఒప్పందం సూత్రప్రాయంగా కుదిరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఈ ఒప్పందం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జన్యు వనరుల అందుబాటు, వాటిని ఉపయోగించడంవల్ల కలిగే ప్రయోజనాన్ని సమాన ప్రాతిపదికన పంచుకునేందుకు నగోయా ప్రొటోకాల్‌ను ఉద్దేశించారు. సంబంధిత టెక్నాలజీల బదిలీకి కూడా ఈ ఒప్పందాన్ని నిర్దేశించారు. ఈ వనరులు, టెక్నాలజీలపై గల హక్కులను, నిధుల కేటాయింపును, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు దోహదం చేసే చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ ఒప్పందాన్ని రూపొందించారు. 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. కనీసం 50 దేశాలు ఆమోదించాల్సి ఉన్నందున ఈ ప్రొటోకాల్‌ ఇంకా అమలులోకి రాలేదు. ఇప్పటి వరకూ స్పల్ప సంఖ్యలో మాత్రమే దేశాలు ఈ ప్రొటోకాల్‌ను ఆమోదించాయి.
హైదరాబాద్‌లో జీవ వైవిధ్య సదస్సు
జీవ వైవిధ్య సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలను కొన్నింటిని స్థూలంగా ప్రస్తావించాం. జీవ వైవిధ్య ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల ప్రభుత్వాలతో (ప్రాంతీయ, ఆర్థిక సమన్వయ సంస్థల) కూడిన పాలక మండలి సమావేశం అనేక కీలకాంశాలను చర్చిస్తోంది. తీర్మానం అమలులో సాధించిన పురోగతిని సమీక్షించి కొత్త ప్రాధాన్యతలను గుర్తించి సభ్య దేశాలకు కొత్త కార్యాచరణను ఈ సమావేశం రూపొందిస్తుంది. జీవ భద్రతపై కార్టాజెనా ప్రొటోకాల్‌పై ఆరో రౌండ్‌ కాప్‌-మాప్‌-6 చర్చలు అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు జరగ్గా, కాప్‌-11 (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ పదకొండవ రౌండ్‌ చర్చలు) అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు జరుగుతున్నాయి.
-డాక్టర్‌ అమిత్‌ సేన్‌గుప్తా

No comments:

Post a Comment