Wednesday, 3 October 2012

జన్యుమార్పిడి పంటలు ... జీవవైవిధ్యం ....


ప్రకృతిలో సహజంగానే పరాగ సంపర్కం లేక పర్యావరణ ఒత్తిళ్ల వల్ల, జాతుల్లో అంతర్గతశక్తుల వల్ల జన్యుమార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు జాతుల వైవిధ్యానికి మూలం. ఇది సహజప్రక్రియ. దీనిని నివారించలేం. కానీ, ప్రయోగశాలల్లో జన్యుమార్పుల సాంకేతికంతో రూపొందే పంటలు అలాంటివి కావు. ఈ కొత్త సాంకేతికం భిన్నజాతుల మధ్య జన్యుమార్పిడికి వీలు కలిగిస్తుంది. ఇలా కొత్తగా ప్రవేశపెట్టే జన్యువుల ప్రభావం జీవవైవిధ్యం, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పటి విజ్ఞానశాస్త్రం ఎదుర్కొంటున్న సమస్య. పూర్తిగా నియంత్రించిన వాతావరణంలో జరిగే జన్యుమార్పుల ప్రభావాల్ని గుర్తించి, నివారించవచ్చు. కానీ, నియంత్రించలేని బహిరంగ పర్యావరణ పరిస్థితుల్లో జరిగే జన్యుమార్పిడి ప్రభావాల్ని ఊహించి, నియంత్రించలేం. ఒకవిధంగా చెప్పాలంటే తుపాకీ పేలి, బులెట్‌ విడుదలయ్యేంతవరకే బులెట్‌పై నియంత్రణశక్తి మన చేతిలో ఉంటుంది. కానీ, ఒకసారి తుపాకి పేలి, బులెట్‌ విడుదలైన తర్వాత అది కలిగించే నష్టంపై మనకు ఏ నియంత్రణా వుండదూ. ఇలాంటదే 'జన్యుమార్పిడి సాంకేతికంతో రూపొందే పంట'. ఈ నేపథ్యంలో, విస్తారంగా సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటలు జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. లేకపోతే, రాగల దుష్ప్రభావాలను ఎదుర్కోలేం. ఈ ప్రభావాల్ని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
విజ్ఞానశాస్త్రం ఎల్లప్పుడూ వాస్తవాల ఆధారంగా అనుభవాల ప్రభావంతో అభివృద్ధి చెందుతుంది తప్ప, ఎవరి ప్రచారం వల్లా కాదు. కానీ, వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు విజ్ఞానశాస్త్రాన్ని స్వాధీనం చేసుకుంటే ఇలాగే జరుగుతుందనీ చెప్పలేం. శాస్త్రజ్ఞులు కూడా నిస్వార్థంగా ఉంటారనీ చెప్పలేం. జన్యుమార్పిడి సాంకేతికాలతో రూపొందే పంటల ప్రభావాలను అంచనా వేయ డంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. తక్షణ లాభాల్ని, వాణిజ్య ప్రయోజనాల్ని సమర్థించే శాస్త్రజ్ఞులు ఒక వర్గంగా, దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే శాస్త్రజ్ఞులు మరో వర్గంగా విభజనకు గురయ్యారు. అన్ని వనరులపై ఆధిపత్యంగల వ్యాపార, వాణిజ్య వర్గాలను సమర్థిస్తున్న శాస్త్రజ్ఞులు (ఇటువంటి వారిని నిజమైన శాస్త్రజ్ఞులుగా భావించకూడదు) ప్రజల్ని పూర్తి వాస్తవాల్ని తెలుసుకోనీయకుండా అయోమయంలో పడేస్తున్నారు. ఇలాంటి వారిని 'శాస్త్ర వ్యాపారులు'గా భావించాలి.
జన్యు సాంకేతికాల నేటి స్థితి..
సాంప్రదాయ ప్రజననం ద్వారా కొత్త రకాల్ని రూపొందించ డానికి భిన్నజాతుల్లోని అభిలషించే గుణగణాలను కావాల్సిన పంటల్లో చొప్పించి, కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. ఇది సాధ్యంకానప్పుడు జన్యుమార్పిడి సాంకేతికాల్ని ఉపయోగించి, విజాతిలో కావల్సిన గుణగణాన్ని కలిగించే జన్యువును గుర్తించి, అభివృద్ధిపర్చాల్సిన వంగడంలో జొప్పించి కొత్తరకాన్ని రూపొందిస్తారు.
ఈ రంగంలో పరిశోధనలు అత్యధికంగా ప్రైవేటు, బహుళజాతి కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అమెరికన్‌ బహుళజాతి కంపెనీలు మోన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇవి కేవలం, తక్షణ లాభాల కోసమే పనిచేస్తున్నాయి. వచ్చే దీర్ఘకాల నష్టాల్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి కంపెనీ (బయోటెక్‌ పరిశ్రమ) లు ఈ పంటలు కలిగించే పర్యావరణం, ఇతర ప్రభావాల్ని నిర్ద్వంద్వంగా నిరూపణ చేసుకోకుండానే వీటి సేద్యాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నాయి. దూరదృష్టిగల శాస్త్రజ్ఞుల పరిశోధనలకు ఎన్నో ఆటంకాల్ని కలిగిస్తున్నాయి. మనదేశంతో సహా, అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్న దిదే. ఈ కంపెనీ శక్తులు ఆయా ప్రభు త్వ శాస్త్ర, సాంకేతిక విధానాలను ప్రభావితం చేస్తూ జన్యుమార్పిడి పం టల రూపకల్పన, ఇతర అంశాలపై పరిశోధనలు జరగకుండా ఆటంకపరు స్తున్నాయి. మన దేశంలో ప్రభుత్వ సం స్థల పత్తి పరిశోధనలకు ఎదురవుతు న్న ఆటంకాలే దీనికి తాజాఉదాహరణ.
చైనాలాంటి దేశాలలో జన్యు మార్పిడి సాంకేతికాల్ని వినియోగిస్తూ అధికదిగుబడి వంగడాల్ని రూపొంది స్తుండగా, మనదేశంలో కేవలం హైబ్రిడ్‌ రకాలకే ఈ సాంకేతికాలు పరిమితం చేయబడుతున్నాయి. ఫలితంగా, రైతులు తమ సొంత విత్తనం వాడుకునే స్వేచ్ఛను కోల్పోయి, కంపెనీల నుండి అధికధరలకు కొనాల్సి వస్తుంది. పైగా, విత్తనోత్పత్తిలో వినియోగిస్తున్న సాంకేతికానికి విలువకట్టే అధికారం తమకే కలదనీ, ప్రభుత్వానికి లేదనీ ఈ కంపె నీలు కోర్టులో వాదిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు బిటి సాంకేతికంతో రూపొందిస్తున్న 'నర్సింV్‌ా, బికనేరి నర్మా' వంటి అధిక దిగుబడి వంగడాలు రైతులకందకుండా అడ్డుపడ్తు న్నాయి. కీలకస్థానంలోని కొంతమంది రాజకీయవేత్తలు, అధికారులు ఈ కంపెనీలకు సహాయపడుతున్నారు. ఈ విషయాల్ని బయో టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ గుర్తించి, తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్యంపై జన్యుమార్పిడి పంటలు చూపగల ప్రభావాల్ని అర్థంచేసుకోవాల్సి వుంటుంది.
జన్యుమార్పిడి పంటల స్థితి..
జన్యుమార్పిడి పంటల్ని 2011 నాటికి ప్రపంచంలో 395 మిలియన్‌ ఎకరాలలో సేద్యం చేస్తున్నారు. వీటిని 29 దేశాల్లో 17.7 మిలియన్‌ రైతులు సేద్యం చేస్తున్నారు. వీరిలో 90% మంది వనరులు పరిమితంగా గల చిన్నరైతులు.
సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటల్లో కలుపుమందును తట్టుకునే రకాలే గరిష్టంగా 78 % మేర వున్నాయి. వీటిలో కలుపు నియంత్రణకు అత్యంత శక్తివంతమైన గ్లైఫోసేట్‌ అనే మందును అధికంగా వాడుతున్నారు. ఇది పర్యావరణంపై, జీవవైవిధ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. దీని తర్వాత అంతర్గతంగా విషం తయారుచేస్తున్న (బిటి) పంటలు 17-18 % మేర సేద్యమవుతున్నాయి. ఇతర అన్ని ఉపయోగాలకు కలిపి 5 % కన్నా తక్కువ విస్తీర్ణంలో సేద్యమవుతున్నాయి.
సోయాబీన్‌, పత్తి, మొక్కజొన్న, కెనోలా (నూనె ఆవగింజల) నాలుగు బిటి రకాల పంటలు ప్రధానంగా సేద్యమవుతున్నాయి. ప్రపంచ సేద్య విస్తీర్ణంలో 75 శాతం సోయాబీన్‌లో, 82 శాతం పత్తిలో, 32 శాతం మొక్కజొన్నలో, 26 శాతం కెనోలాలో బిటి రకాలు సేద్యమవుతున్నాయి.
జీవవైవిధ్యంపై ప్రభావాలు...
ఒక్కమాటలో చెప్పాలంటే జన్యుమార్పిడి పంటలు పర్యావరణం, జీవవైవిధ్యంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల ద్వారా జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
బ్రిటన్‌లో కలుపుమందుల నిరోధకశక్తిగల పంటల వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతున్నట్లు గుర్తించారు. మామూలుగా పక్షులు కలుపు మొక్కల గింజల్ని తింటాయి. జన్యుమార్పిడి రకాలైన బీట్‌రూట్‌, నూనె ఆవగింజల సేద్యంలో కలుపు మొక్కల విత్తనాల ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. దీంతో పక్షులకు ఆహారం దొరకక వాటి సంఖ్య తగ్గిపోయింది.
ముఖ్యంగా జన్యుపంటల పుప్పొడి పక్కనే సేద్యమవుతున్న సాంప్రదాయ పంట మొక్కలపై పడినప్పుడు జన్యు కలుషితమవుతుంది. ఇలా ఈ పుప్పొడి ఎంతదూరం విస్తరిస్తుందనేది ఆయా పంటలు, చుట్టూ వున్న వాతావరణపరిస్థితులపై ఆధారపడి వుంటుంది. ఇలా ఒకే జాతి మొక్కల్లో జరిగే మార్పును 'సమాంతర జన్యు మార్పిడి (హారిజాంటల్‌ జీన్‌ ట్రాన్సఫర్‌)'గా వ్యవహరిస్తున్నారు. ఇతర జాతులకూ ఇలా బిటి రకాల పుప్పొడి విస్తరించవచ్చు. ఇలా విస్తరించడాన్ని 'భిన్నజాతుల జన్యుమార్పిడి (వర్టికల్‌ జీన్‌ ట్రాన్సఫర్‌)' గా వ్యవహరిస్తున్నారు. ఈ జన్యుమార్పిడి ఇలా జరగవచ్చు.
* పరాయి జన్యువు (ప్రొటీన్‌ అణువు)ను బాక్టీరియా నేరుగా తీసుకోవచ్చు.
* ప్రొటీన్‌ జీర్ణకోశంలోకి వెళ్లినప్పుడు అది ఆ జీవి కణజాలాల్లోకి ప్రవేశించవచ్చు.
* అగ్రో బ్యాక్టీరియం అనే బాక్టీరియా ద్వారా కూడా ఇతర జీవాల్లోకి ఈ జన్యువు వ్యాపించవచ్చు. ఈ బాక్టీరియాను కణతుల ద్వారా గుర్తించవచ్చు. జన్యుమార్పిడి పంటల తయారీలో జన్యుమార్పిడి కోసం ఈ బాక్టీరియాను వినియోగిస్తారు. ఈ బాక్టీరియా సహజంగా కూడా పర్యావరణంలో వుంటుంది.
* వైరస్‌ల ద్వారా కూడా జీవాల మధ్య జన్యువు మారవచ్చు.
అంతర్గత విష రకాల ప్రభావం..
విషానికి ఉద్దేశించిన కీటకాల్లో నిరోధకశక్తి పెరుగుతుంది. విష ప్రభావం వల్ల ఉద్దేశించిన కీటకాల సంఖ్య తగ్గినప్పటికీ, ఇతర కీటకాలు పుంజుకుంటాయి. ఉదా: బిటి పత్తిలో కాయతొలుచు పురుగు 90 రోజుల వరకూ తగ్గినప్పటికీ, రసంపీల్చు పురుగులు, ఇతర కీటకాలు ఉధృతమవుతున్నాయి. కొత్తరకం వైరస్‌ జబ్బులు (ముడత రోగం) వస్తున్నాయి. భూమిలో వుండే సూక్ష్మజీవులు (బాక్టీరియా, ఫంజి - బూజు) కూడా ప్రభావితమవుతున్నాయి. ఫలితంగా, నేలల్లో సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుంది.
పార్లమెంటుకమిటీ నిర్ధారణ..
జన్యుమార్పిడి పంట (బిటి పత్తి) ప్రవేశం, అపుడు చేపట్టిన అతి ప్రచారం రైతుల్ని సాంప్రదాయ రకాల నుండి మళ్లించింది. ఫలితంగా ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. సేద్యంలో లేవు. ఈ విత్తనాల్నీ ఎవరూ ఉత్పత్తి చేయడం లేదు. విదర్భ (మహారాష్ట్ర) పత్తి రైతుల్లో కొనసాగుతున్న దుస్థితి, ఆత్మహత్యల నేపథ్యంలో బిటి రకాల సేద్యాన్ని మానుకొని అనుకూలమైన సాంప్రదాయ అధికదిగుబడి రకాలను తిరిగి సేద్యం చేయడానికి ఎంత ప్రయత్నించినా విత్తనాలు దొరకలేదని బయో టెక్నాలజీపై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ స్వయంగా మార్చి, 2012లో గమనించింది. ఏకపంట (బిటి పత్తి) సేద్య దుష్ఫలితాలను ఈ కమిటీ స్వయంగా నిర్ధారించింది. జీవవైవిధ్యాన్ని సురక్షితంగా జన్యు బ్యాంకుల్లో పరిరక్షిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను పార్లమెంటు కమిటీ తప్పుపట్టింది. ఇది ప్రభుత్వానికి పురావస్తు భాండగారం (మ్యూజియం)లో ఉంచిన సంతోషాన్ని కలిగిస్తుందని కమిటీ విమర్శించింది. మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతితో సహజంగానే మరింత జీవవైవిధ్యం అవసరమని, ఇది ఆవిర్భవించడానికి జన్యుబ్యాంకులు తోడ్పడవని కమిటీ అభిప్రాయపడింది. 'నగోయా' ఒప్పందం ద్వారా పొందగలిగే ప్రయోజనాల్లో మనదేశ ప్రయోజనాలు పెద్దఎత్తున ఇమిడి వున్నందున ఎంతో సుసంపన్నమైన మన జీవ వైవిధ్యాన్ని నష్టపోకుండా కొనసాగించాలని కమిటీ నొక్కి చెప్పింది. అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని, భద్రతను సుస్థిరంగా కొనసాగించడానికి ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని, అస్థిరత్వంతో కూడిన జీవసాంకేతికాలపై ఆధారపడకూడదని కమిటీ నొక్కి చెప్పింది.
(జీవ సాంకేతికాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రిపోర్టు నివేదిక పేరాలు 8.114 నుండి 8.118 వరకు)
బిటిలో తేడా..!
మనదేశంలో బిటి పత్తి సేద్యం ప్రారంభమైనప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా, బిటి సేద్యా న్ని సమర్థిస్తూ విస్తరించడానికి మోన్‌శాంటో, దాని సమర్ధకులు ''ఇప్పుడు పెరుగు తున్న వ్యవసాయోత్పత్తి అవసరాలను తీర్చుకోడానికి బిటి ('బయో టెక్నాలజీ') తప్ప మరొకటి లేదని, ఇది అనివార్యమని, ప్రతి కొత్త సాంకేతికంలో ఏదో ఒక రిస్క్‌ వుం టుందని, వాటిని ఎదుర్కొనక తప్పదని'' ప్రచారం చేస్తున్నారు. తద్వారా బిటి పత్తి లోపాల్ని కప్పిపుచ్చుతున్నారు. పైగా, బలవంతంగా అమ్మే అగ్రిసివ్‌ సేల్స్‌ మెన్‌షిప్‌ను చేపట్టారు. ఈ సందర్భంలో 'బిటి' అనే పదాన్ని 'పత్తి' పంటకు, జీవ సాంకేతిక విజ్ఞానానికి ఒకే విధంగా స్ఫురించేలా వాడుతున్నారు. ఇంగ్లీషులో అయితే బిటి పత్తికి ద్‌ీని, జీవ సాంకేతిక విజ్ఞానానికి దీుని సంక్షిప్తంగా వాడతారు. అయోమయమేమీ ఉండదు. కానీ, తెలుగులో ఈ సౌలభ్యం లేదు. బిటి పత్తి అంటే 'బాసిల్లస్‌ తురింజినిసిస్‌' బ్యాక్టీరియా జన్యువును చొప్పించిన సాంకేతికం. దీనిలో బిటి విషం అంతర్గతంగా నిరంతరం చెట్టు పెరిగే కాలంలో తయారవుతుంది. అన్ని భాగాలకూ విస్తరిస్తుంది. ఈ సాంకేతికాన్ని 'అంతర్గత విష' సాంకేతికం (ఎండో టాక్సిన్‌ టెక్నాలజీ) గా వ్యవహరిస్తే ఇబ్బంది ఉండదు. 'బయో టెక్నాలజీ' అంటే జీవుల్లో మార్పులకు సంబంధించిన సాంకేతికం. ఆధునిక జీవ సాంకేతికాల్ని జన్యు మార్పిడి సాంకేతికాలకు సూచికగా వ్యవహరిస్తున్నాం. ద్‌ీ, దీులను తెలుగులో ఒకే పదం 'బిటి'గా వాడుతూ ఉద్దేశ్య పూర్వకంగా ఎందరినో అయోమయంలో పడేస్తున్నారు. దీన్ని నివారించాలంటే ద్‌ీ పత్తిని అంతర్గత విష పంటగా చెప్పాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment