Wednesday, 7 November 2012

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (5)


  • అశాస్త్రీయ ఆచారాలు 22
మధ్యలో మెరకగా ఉండి అన్ని దిక్కుల అంచుల్లో పల్లంగా ఉన్న భూమిని 'కూర్మపృష్ట భూమి'' అని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాంటి భూమిలో ఇల్లు కట్టుకుంటే వచ్చే ఫలితాన్ని రెండు గ్రంథాలు రెండు రకాలుగా పేర్కొంటున్నాయి.
శ్లో|| కూర్మపృష్టే భవేద్వాసో నిత్సోత్సాహ సుఖప్రదః
ధనధాన్యం భవేత్తస్య నిశ్చితం విపులం ధనం || అని జ్యోతిర్నిబంధనం'' పేర్కొంటోంది. అంటే ''కూర్మపృష్ట భూమిలో నివాసము ఉత్సాహాన్నీ, సుఖాన్నీ, ధనధాన్య సంపదనూ కలిగిస్తుంది'' అని అర్థం.
అయితే కూర్మపృష్ట నివాసాన్ని గూర్చి ''మయమతం'' ఇలా పేర్కొంటోంది.
శ్లో|| మధ్యోచ్చం వర్జయేద్వాసః పీడాచవధ బంధనే ||
అంటే, మధ్యభాగమున మెరకగా ఉండే భూమిలో అంటే కూర్మపృష్ట భూమిలో నివాసము విడువదగినది. అటువంటిచోట నివాసము పీడను, మరణాన్ని, బంధనాన్ని కలిగిస్తుంది'' అని అర్థం.
అలాగే స్థలంలో ఏ దిశలో మెరక లేక పల్లం ఉంటే ఏ ఫలితం వస్తుంది? దీనిని గూర్చి రెండు ప్రాచీన గ్రంథాలు రెండురకాలుగా పేర్కొంటున్నాయి.
''వాస్తు విద్య'' ప్రకారం తూర్పు మెరక, పడమర పల్లం ఉంటే శుభప్రదమట. కానీ ''శిల్పరత్నం''లో అలాంటి స్థలంలో నివసిస్తే పుత్రులు చనిపోతారని చెప్పబడింది. అలాగే, పశ్చిమం మెరక, ఆగేయం పల్లం ఉంటే విరోధాలు వస్తాయని ''వాస్తు విద్య'' చెబుతుంటే, ''శిల్పరత్నం'' పుత్ర లాభం కలుగుతుందని పేర్కొంటోంది.
మరొక్క విషయం - వర్షపు నీరు, ఇంటిలోని వాడుక నీరు గృహావరణపు వాయువ్య దిశ నుండి బైటికి వస్తే సుఖములు కల్గుతాయని ''వాస్తుసార సంగ్రహం'' పేర్కొంటుంటే, ఇంటి కన్యలకు హానియని ''కాలామృతం'' తెలియజేస్తుంది.
ఇక నవీన వాస్తువాదులలో మేల్పాడి రాఘవా చారి తన ''వాస్తు రాఘవీయం''లో ఇలా పేర్కొంటు న్నారు. ''తండ్రి కుమారునకు ఇవ్వలేని సంపదను, భార్యభర్తకు ఇవ్వలేని సుఖాన్ని, ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేని రక్షణను, మిత్రుడు మిత్రునకు చేయలేని సాయాన్ని వాస్తుశాస్త్రము ఒక గృహస్తునికి చేస్తుంది.''
అయితే ''వాస్తుశాస్త్ర వివేకము'' అనే గ్రంథంలో మధురా కృష్ణమూర్తి శాస్త్రి మరోవిధంగా చెబుతు న్నారు. ''ఇంట్లో ఏదో మార్పు చేసినంత మాత్రాన ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, మిత్ర, కళత్రాదులందరూ సుఖముగా ఉంటారనే ప్రచారం నూటికి నూరుపాళ్ళు అపప్రచారం''.
ఇక ఒకే గ్రంథంలో పేర్కొనబడిన పరస్పర విరుద్ధ విషయాన్ని వివరిస్తాను విను.
''వాస్తు రాజవల్లభం''లో ఒకచోట
''శస్తే చంపక పాటలేచకదళీ జాతీతధాకేతకీ''
అని ఉంది. అంటే ''సంపెంగ, కలిగొట్టు, అరటి, జాజి, మొగలి వృక్షములున్న యెడల శ్రేయము'' అని అర్థం. అదే గ్రంథంలో మరోచోట
''దుష్టోభూత సమాశ్రితా పివిటపే
నోచ్చిత్యతే శక్తితః
తద్వద్బిల్వ శమీత్వశోక వకుళౌ పున్నాగసశ్చంపకౌ...''
అని ఉంది. అంటే ''మారేడు, జమ్మి, అశోక, పొగడ, సురపొన్న, సంపెంగ మొదలైన చెట్లు స్థలములో ఉన్న యెడల వాటిని పూర్తిగా వేళ్ళతో కూడ తీసివేయవలెను'' అని అర్థం.
ఇలా వాస్తువాదులు అనేకులు అనేకరకాలుగా చెప్పే అంశాలను, ఒకే వాస్తువాది రెండురకాలుగా చెప్పే అంశాలను కలిగిన విషయాన్ని 'శాస్త్రం' అని అంటామా? చెప్పు చంద్రమౌళీ?'' అని ప్రశ్నించాను.
''శాస్త్రం అనలేము కాంతారావు!'' అన్నాడు చంద్రమౌళి.
వాస్తు, శాస్త్రం కాదనేందుకు మరో ముఖ్యమైన రుజువు ఇస్తాను. విను.
''శ్లో|| పక్షేణ మాసేన ఋతుత్రయేణ సంవత్సరేణాపి ఫలం
విధత్తే ||''
అని విశ్వకర్మ ప్రకాశిక పేర్కొంటోంది. అంటే.. ''వాస్తు ఫలితము పదిహేనురోజులలోగాని, ఒక నెలలోగాని, ఆరునెలల్లోగాని, సంవత్సరంలోగాని సంభవిస్తుంది'' అని అర్థం. అలా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని చెప్పడాన్ని శాస్త్రం అంటామా? ఉదాహరణకు ''నీరు వంద డిగ్రీల దగ్గర పూర్తిగా ఆవిరిగా మారుతుంది'' అని సైన్సు వివరిస్తోంది. అంతేకాని పది డిగ్రీల దగ్గరో, 20 డిగ్రీల దగ్గరో, 90 డిగ్రీల దగ్గరో నీరు ఆవిరవుతుందని ఎవరైనా అంటే శాస్త్ర ప్రపంచం దాన్ని సైన్సుగా అంగీకరిస్తుందా?''
''అంగీకరించదు.''
''మరి ఎప్పుడో ఒకప్పుడు ఫలితం లభిస్తుందని వాస్తువాదులు చెబితే, దాన్ని శాస్త్రం అని అంగీకరిద్దామా?''
''అంగీకరించం కాంతారావ్‌! అయితే నీవు చెప్పి నవన్నీ విన్న తర్వాత నాకొక విషయం తోస్తోంది'' అన్నాడు చంద్రమౌళి.
(ఆ వివరాలు
వచ్చేవారం)
''ఏమిటది?'' అడిగాను నేను.
''అసంబద్ధమైన అంశాలున్నాయనో, పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయనో, రుజువుకు అందని అంశాలున్నాయనో వివరించి వాస్తును శాస్త్రం కాదని మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రజలలో వాస్తు పిచ్చిని వదిలించవచ్చు. కానీ వాళ్లల్లో వాస్తుపై నమ్మకం ఎందుకు కల్గింది? ఇంటి స్థలానికి ఈశాన్య మూల కొంచెం పెరగటానికీ, ఇంటి యజమాని సుఖాలకీ సంబంధం ఉంటుందంటే ఎందుకు నమ్ముతున్నారు? సుఖాలకీ, కష్టాలకీ కారణం తమ చుట్టూ ఉండే ప్రజల ఆలోచనలూ, తమను పాలించే ప్రభువుల విధానాలూ అని ఎందుకు విశ్వసించడం లేదు? ఎందుకంటే వారిలో కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రీయ ఆలోచనా విధానం నశించింది. జ్ఞానవంతులనబడే వాళ్ళు అలాంటి ఆలోచనా విధానాన్ని నశింపజేశారు. ఈ పరిస్థితినే నూరేళ్ళ నాటి సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఇలా వివరించారు. ఇదిగో ప్రస్తుతం ఆయన ఉపన్యాసాల గ్రంథాన్నే చదువుతున్నాను'' అంటూ తను తెచ్చుకున్న పుస్తకాన్ని తీసి చదవసాగాడు చంద్రమౌళి....
''స్వప్రయోజనపరులైన కొందరు సర్వజనులను మూఢత్వమున ముంచినారు. సత్య విద్యలన్నియు మూలబడినవి. అందుచేత పర్వతములకు, నదులకు బిడ్డలు పుట్టుట వారికి గొప్ప సత్యం. కల్లు సముద్రములు, నేతి సముద్రములు వారి భూగోళశాస్త్రం. సూర్యచంద్రులను 'పెద్దపాము' మింగుట వారి ఖగోళశాస్త్రం. స్వకాయ కష్టము విడిచి, ఇట్టి 'సత్యము'లను బోధించి, జీవించుట వారి కులవృత్తి. ఇట్టి జ్ఞానవంతులు తామే సర్వజ్ఞులమనుకొని, ఉన్న నాలుగు శాస్త్రములను తామే అభ్యసించి, ఇతరులను చదువనీయకపోవుట చేత, వారికి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుటకుగానీ, వృద్ధి పొందించుటకుగానీ, జనులలో వ్యాపింపజేయుటకుగానీ అవకాశము లేకపోయినది'' (1894లో రాజమండ్రిలో చేసిన ఉపన్యాసము నుండి). ఇది చదివి చంద్రమౌళి చెప్పడం కొనసాగించాడు. ''కాబట్టి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేయవలసినది, ప్రజలకు ఒక్కో అంశంలోని అశాస్త్రీయతను వివరిస్తూనే, వారిలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం. అదీ ముఖ్యంగా చిన్నపిల్లల మనస్సులలో. ఎందుకంటే వారు మొక్కలలాంటివారు, భావిభారత పౌరులు. ''మొక్కైవంగుతుందిగాని మానై వంగుతుందా?'' అనే సామెత నీకు తెలుసుగదా?'' అన్నాడు చంద్రమౌళి.
''నిజమే చంద్రమౌళీ! ఒక్కో మూఢనమ్మకం వెనుక ఉన్న అశాస్త్రీయతను వివరిస్తూనే, ''రుజువుపర్చలేని విషయాలను నమ్మకూడదు; ప్రతి సమస్య వెనుక ఉన్న వాస్తవిక కారణాల్ని గ్రహించాలి'' అనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. అదే బాధ్యతగల ప్రతి పౌరుడి ముఖ్యకర్తవ్యం. ఈ విషయంలో నీవు చెప్పిన దానిని అంగీకరిస్తూనే ఒక చిన్న సవరణ చేస్తున్నాను'' అన్నాను.
''ఏమిటా సవరణ?'' ఆసక్తిగా అడిగాడు చంద్రమౌళి.
''నీవు మీ జన విజ్ఞానవేదిక వాళ్లు చేయవలసినది ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం'' అన్నావు. 'మీ' కి బదులు 'మనం' అను. అర్థమైందా? 'నీవు', 'మేము' కలిసి 'మనం' ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిద్దాం. సరేనా?'' అన్నాను నవ్వుతూ.
''చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను'' అన్నాడు చంద్రమౌళి నవ్వుతూ.
''చాలా చాలా సంతోషం'' అన్నాను నేను కూడా నవ్వుతూ.
- కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక

పచ్చి 'శాకాలు' మనకి కావు..!

పచ్చి ఆకుకూరలూ, కూరగాయలూ తింటే బోలెడు ఆరోగ్యం అని చాలా మంది అంటుంటారు. ఇంకొందరు ఇంకాస్త ముందుకెళ్ళి అసలు పచ్చిపాలు, పచ్చి గింజలూ తినమని సలహా ఇస్తుంటారు. పైగా, ఇలా చేస్తే మన జీర్ణవ్యవస్థతో పాటు మన మెదడుకు కూడా మేలు జరుగుతుందని చెబుతారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మనిషి పచ్చి ఆహారం తింటే రోజుకు తొమ్మిది గంటలు ఆహారం తింటూనే ఉండాలట. ఎందుకంటే అంతసేపు తింటేగానీ మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవట. మనకి ముందుగా వచ్చిన మహా వాన రాలు- గొరిల్లాలు, చింపాంజీలూ ఎక్కువగా పచ్చి ఆహారంపైనే ఆధారపడతాయి. వాటి తరువాత వచ్చిన మన పూర్వీకులు వాటికంటే మూడింతలు ఎక్కువ మెదడులో నాడులు కలిగి వుండేవాళ్ళు. అందుకు కారణం వాళ్ళు ఆహారాన్ని ఉడకబెట్టడం (నిప్పుల మీద) నేర్చుకున్నారు. ఈ విషయాలు ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. వట్టి పచ్చి కూరలే తింటే మెదడు పెరుగుదలకు తోడ్పడేంత కాలరీలు అందవని, పెరిగిన మెదడుకు ఉడికించిన ఆహారమే కారణమని ఈ పరిశోధకులు గమనించారు.

వర్ణం మారే స్వర్ణం..!


బంగారానికి దాని రంగు బట్టే విలువ అనుకునే రోజులు పోనున్నాయి. అందరూ 'చౌక లోహాల'కి రంగు కోసం బంగారంతో తాపడం చేయిస్తుంటే, సౌతాంప్టన్‌ యూనివర్శిటీలో బంగారానికే వేరే రంగు తాపడం వేయించే ప్రక్రియ కను గొన్నారు. బంగారపు ఉపరితలంపై చిన్న చిన్న బొడిపలను ఏర్పాటు చేయడం ద్వారా అది కాంతిని పరా వర్తనం చేసే విధానం మారి కొత్తరంగులో కనిపిస్తుందని అక్కడి పరిశోధకులు నిరూపించారు. కేవలం బంగారినికేకాక, వెండి, అల్యూమినియం వంటి ఇతర లోహాలకు కూడా ఈ ప్రక్రియ వర్తింపచేయవచ్చట. అప్పుడు రసాయనాల పూతలు అవసరం లేకుండా, లోహం విలువ తగ్గకుండా రంగు మార్చుకోవచ్చు.

ఎరుపే కాదు.. చెరుపు కూడా!


తాంబూలం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని ఒక నమ్మకం. పైగా మనం కొన్ని వందల రకాల పాన్‌ (కిళ్లీ) లను నమిలి పారేస్తాం. ఇప్పుడు జీర్ణశక్తి సంగతేమోగానీ, పాన్‌ వల్ల ఏకంగా నోటి కాన్సర్‌ వచ్చే ప్రమా దం మెండుగా ఉందని భావిస్తు న్నారు. పాన్‌లో పచ్చి వక్కలు, ఇతర సుగంధద్రవ్యాలు విరివిగా వాడతాం. అటువంటి వక్కలోనే మన జన్యు పదార్థాన్ని మార్చేసే గుణం ఉందని తెలిసింది. తద్వారా, క్యాన్సర్‌ రావచ్చు. వక్క పలుకలు మన డిఎన్‌ఎను ఆల్కలైట్‌ చేయడం ద్వారా ప్రమాదం కలిగిస్తాయని ఒక రసాయన పరిశోధకపత్రంలో ప్రచురించారు. ఆసియాలో ముఖ్యంగా చైనా, భారత్‌, పాకిస్తాన్‌లలో పాన్‌ తినే అలవాటు ఎక్కువ. అందువల్ల, వారు నోటి క్యాన్సర్‌ కలిగించే ఈ పాన్‌ని మితంగా వాడితే మంచిది.

నడకే పరమౌషధం..!

నడిచి వెళ్ళే దూరాలకి కూడా కార్లు, బైకులు వాడటం భారతీయులకు బాగా అలవాటు అని ఒక అధ్యయనంలో తేలింది. పదమూడు దేశాల ప్రజల్లో జరిపిన ఈ అధ్యయనంలో మనవాళ్లు కాస్త దూరాలకి కూడా వాహనాలు వాడుతున్నారని తేలింది. మనదేశంలోనే కాదుగానీ ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో నడక అలవాటు తగ్గింది. చైనాలో నడక తగ్గడం వలన ఊబకాయం పెరిగిందని పరిశోధకులు గమనించారు. రోజూ కేవలం 15 నిమిషాలపాటు నడిస్తే రెండు, మూడేళ్ళ ఆయుష్షు పెరుగుతుందని అంచనా వేశారు. ఆయుష్షు పెరిగినా పెరగకపోయినా, ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం కదా! అందుకని, ఎలాగోలా కనీసం ఓ పావుగంట పాటన్నా చురుగ్గా నడిస్తే జీవితం చలాకీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడిస్తే, ఊబకాయం రాకుండా ఉండటమే కాదు. ఇబ్బంది పెట్టే షుగర్‌ వంటి సమస్యలు కూడా దరికి రావంటున్నారు.

చేపల.. రొయ్యల పెంపకం.. ప్రయోజనాలు.. ప్రతిబంధకాలు



చేపలు, రొయ్యల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ముఖ్యమైంది. దీని వార్షిక సగటు అభివృద్ధి 10 శాతం పైగా వుంది. 1950-51లో కేవలం 7.5 లక్షల టన్నులుగా వున్న చేపల ఉత్పత్తి 2010-11 నాటికి 85 లక్షల టన్నులకు పైగా పెరిగింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 5.7%, ఎగుమతుల్లో 5.3% ఈ రంగం నుండే సమకూరుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల్లో వీటి విలువ 18 శాతం. జాతీయ వినియోగం వేగంగా పెరుగుతుంది. ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఎఓ), ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఈ శతాబ్ధంలో చేపల, రొయ్యల కొరత పెరుగుతుంది. చేపల పెంపకాన్ని వరిసేద్య సమన్వయంతో చేపట్టే పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఫలితాలు అనుకున్నట్లుగా అందుబాటులోకి తేగలిగితే మన ఆహారంలో చేపల వినియోగం ఎంతో మారిపోతుంది. అందువల్ల, ఈ రంగం పెరుగుదలకు మరెన్నో అవకాశాలు వున్నాయి. ఈ నెల 5-7 మధ్య విశాఖపట్టణంలో జరిగిన జాతీయ మత్స్యకారుల మహాసభల నేపథ్యంలో చేపల, రొయ్యల పెంపకంలో ఇమిడి వున్న కీలకాంశాలను మీ ముందుకు తెస్తుంది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.

చేపల, రొయ్యల పెంపకం విస్తరించడానికి మన దేశంలో ఎన్నో అవకాశాలు వున్నాయి. తీర ప్రాంతం 8,129 కి.మీ. పొడవునా వుంది. ఆక్వా కల్చర్‌కు నదుల సముద్ర సంగమ ప్రాంతం (ఎచ్యూరీస్‌) 39 లక్షల హెక్టార్లు, ఉప్పు భూములు 25.4 లక్షల హెక్టార్లు, మడ అడవులు ఐదు లక్షల హెక్టార్లు అనుకూలం. ఇదేకాక భూభాగం లో మరో 80 లక్షల హెక్టార్ల మేర ఆక్వా కల్చర్‌కు అనుకూలమైన ఉప్పు భూములు న్నాయి. వీటిలో జీవవైవిధ్యం ఎక్కువగా వుంది. ఇంత విస్తారంగా సముద్ర తీరప్రాం తం వున్నప్పటికీ మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల వేట నుండి లభించేది 41% మాత్రమే. మిగతా చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచబడుతున్నాయి.
మన దేశంలో చేపల్ని ఆహారంగా తీసుకునేవారు 56% మాత్రమే. వీరి తలసరి వార్షిక వినియోగం తొమ్మిది కిలోలు. ప్రపంచ జనాభా వార్షిక తలసరి వినియోగం 12 కిలోలు. దేశ జనాభా తలసరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ అంతర్గతంగా చేపల గిరాకీ కూడా క్రమంగా పెరుగుతుంది. అందువల్ల వ్యవసాయోత్పత్తిలో చేపల రంగం ప్రాధాన్యత క్రమంగా పెరుగుతుంది.
గరిష్ట చేపల వేట..
సాంప్రదాయ పద్ధతిలో మత్స్యకారులు సముద్రంలో వేటాడిన కొద్దీ దొరికే చేపలు పెరిగేవి. ఈ దశలో సముద్రంలో వేటాడే చేపల కన్నా చేపల పునరుత్పత్తి చెందే సంఖ్య అధికంగా వుండేది. దీనివల్ల మత్స్యకార్మికులు చేపల సేకరణలో ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. ఈ చేపల సేకరణను పెంచేందుకు యాంత్రిక బోట్లను ప్రవేశపెట్టడంతో ప్రారంభంలో వీటి సేకరణ పెరిగింది. కానీ ఈ బోట్ల సంఖ్య బాగా పెరగడంతో చేపల పునరుత్పత్తిశక్తి సేకరణశక్తి కన్నా తక్కువస్థాయిలో ఉండటంవల్ల చేపల సేకరణ తగ్గింది. దీంతో సముద్ర చేపల ఉత్పత్తి అస్థిరంగా మారింది. ఇది భవిష్యత్తుకు ఒక ప్రమాద ఘంటిక.
సముద్ర చేపల పునరుత్పత్తి పెరుగుదలను సముద్రనీటి ప్రవాహం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ పొరలు, జీవావరణం, పర్యావరణాల తుల్యత ప్రభావితం చేస్తున్నాయి. అత్యంత సమర్ధవంతమైన సాంకేతికాలతో మానవుడు జోక్యం చేసుకోవడంతో (యాం త్రిక బోట్లు, ఇతర సాంకేతికాలు) చేపల సేకరణ సుస్థిర స్థాయికన్నా బాగా పడిపో యింది. కానీ, చేపల, ఇతర సముద్ర ఉత్పత్తులకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో సముద్ర కాలుష్యం చేపల పునరుత్పత్తిని దెబ్బతీస్తుంది. దీనికి ప్రధా నంగా పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య విషపదార్థాలు, మలమూత్రాల విడుదల కారకా లుగా వున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్రంలో జీవవైవి ధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ లోటును పూడ్చుకొని, పెరుగుతున్న గిరాకీని తీర్చడానికి చేపల, రొయ్యల పెంపకానికి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పెంపుకు మన దేశంలో విస్తారమైన అవకాశాలున్నాయి. దీనికోసం మామూలుగా సేద్యానికి పనికిరాని భూముల్నే వినియోగిస్తున్నాం. చేపల పెంపకానికి అనువైన భూముల్లో కేవలం 15% వరకూ మాత్రమే ఇప్పుడు ఆక్వా కల్చర్‌కు ఉపయోగిస్తున్నాం. అంటే, ఆక్వా కల్చర్‌ను ఇంకా విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయి.
పెరుగుతున్న అవసరాలు..
ఇప్పటికన్నా (2010-11) రొయ్యల తలసరి వినియోగం 2020 నాటికి 0.3 కిలోలు, అధిక విలువగల చేపల తలసరి వినియోగం 1.2 కిలోల మేర పెరుగుతుం దని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఇవి వరుసగా 0.5 నుండి 0.6 కిలోల వరకూ 1.5 కిలోల స్థాయికి పెరగవచ్చంటున్నారు. చేపల వినియోగం సంవత్సరం పొడుగుతూ ఒకే స్థాయిలో వుంటుంది. కానీ, లభ్యత ఒకే విధంగా వుండదు. హెచ్చు తగ్గులలో వుంటుంది. ముఖ్యంగా, సముద్రంలో వేట నిషేధకాలంలో చేపల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఉత్పత్తి, డిమాండ్‌ మధ్య తేడా ల్ని తట్టుకోడానికి బఫర్‌ నిల్వలు, వీటికి అవసరమైన కోల్డ్‌ స్టోరేజి గోడౌన్లు అవసరం.
ఆటంకాలు..
రొయ్యల ఉత్పత్తి పరిమాణంలో తక్కువగా వున్నప్పుటికీ ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఎగుమతుల్లో వీటి పరిమాణం కేవలం 20 శాతమే అయినప్పటికీ వీటివల్ల వచ్చే ఆదాయం 40 శాతం. దీనికి విరుద్ధంగా చేపల ఎగుమతి 40 శాతం వున్న ప్పటికీ వచ్చే ఆదాయం 20 శాతం మాత్రమే. కానీ, రొయ్యలకు వస్తున్న జబ్బులు, ముఖ్యంగా 'వైట్‌స్పాట్‌ సిండ్రోమ్‌ (తెల్లమచ్చల వైరస్‌)' రొయ్యల పెంపకాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి రాగల అవకాశం 49 శాతం మేర వుంది. ''లూమినియస్‌ బ్యాక్టీరియల్‌'' వ్యాధుల వల్ల కూడా నష్టాలు అధికంగా వున్నాయి. ఇదే సమయంలో తగ్గిపోతున్న ధరలు 'టైగర్‌ రొయ్యల' పెంపకందార్లను నష్టపరిచాయి. ఫలితంగా వీటి పెంపకం మన రాష్ట్రంలో 60 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిలిపేయడం జరిగింది. దీనికి బదులుగా కొత్తరకం 'వెన్నామి' రొయ్యల్ని ప్రవేశపెట్టారు. ఇపుడు ఈ రకం రొయ్యలను దాదాపు 34 వేల హెక్టార్లలో పెంచుతున్నారు.
రొయ్యల పెంపకంలో మేత ఖర్చు అధికంగా వుంటుంది. దీనిలో 'ఫిష్‌మీల్‌ (చేపల తో తయారయ్యే రొయ్యల మేత)' ఖరీదైంది. ఫిష్‌మీల్‌కు బదులు వృక్ష సంబంధమైన మాంసకృత్తులు వాడి ఆమేర ఖర్చును తగ్గిస్తున్నారు. చేపల, రొయ్యల ఎగుమతి కోసం ఒక రకం మీదే ఆధార పడకుండా కొత్తరకాల్ని ప్రవేశపెడుతూ ఇబ్బందుల్ని అధిగమిస్తున్నారు. ఇలా వచ్చిందే 'వెన్నామి' రొయ్య రకం. దీనితో పాటు పీతల్నీ, 'ఫిన్‌ఫిష్‌', 'సీబాస్‌'లను పెంచుతున్నారు. వీటి గుడ్లను, పిల్లలను నియంత్రిత వాతావరణంలో తేలిగ్గా ఉత్పత్తి చేయవచ్చు.
మానవ వనరులు.. ఆదాయం..
ఆక్వా కల్చర్‌ 90% చిన్నకమతాల్లోనే అవుతోంది. దీనిమీదే దాదాపు మూడుకోట్ల మంది జీవిస్తున్నారు. వీరు పేదలు. వీరు పెట్టుబడి, ఉత్పత్తికి, మార్కెటింగ్‌కి ఇబ్బం దులుపడుతున్నారు. వీటిని అధిగమించడానికి సామూహిక పెంపకాన్ని (గ్రూపు ఫామింగ్‌) ప్రోత్సహిస్తున్నారు. వీళ్లకు అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు, ఉత్పత్తి అమ్మకాలకు సమిష్టి సౌకర్యాల్ని కలగజేస్తున్నారు. ఈ విధమైన పెంపకాన్ని తమిళ నాడు, కేరళ, మన రాష్ట్రంలోనూ ఎన్‌బిడిఎఫ్‌ (నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఫిషరీ డెవలప్‌ మెంట్‌) సమన్వయం చేస్తుంది. ఉత్పత్తిని శుద్ధి చేయడానికి, అమ్మకానికి, కావల్సిన మౌలిక సౌకర్యాల్ని ఏర్పర్చడానికి ఈ బోర్డు సహాయం చేస్తుంది. ఇటీవల వినిమయ దారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారుల వాటా క్రమంగా పెరుగుతుంది. ఇది సానుకూలాంశం.
చేపల ఉత్పత్తిలో కంటే శుద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. కేవలం రొయ్యల పెంపకంలో 14 లక్షల కుటుంబాలకి ఉపాధి లభిస్తుంది. ఈ చేపల, రొయ్యల పెంపకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ, మత్స్యకారుల జీవన స్థాయిలో మాత్రం ఎటువంటి మార్పూ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ మత్స్యకారుల దగ్గర నైపుణ్యం పెరగకపోవడమే. పైగా వీరి వద్ద అవసరమైన వనరులు, ఉత్పత్తి సాధనాలు కూడా లేవు. మత్స్యకార సంఘాలు ఏర్పర్చినప్పటికీ ఇవి స్వార్థపరశక్తుల ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. ఫలితంగా, చేపల వల్ల వచ్చే ఆదాయంలో మత్స్యకారులకు రావాల్సిన న్యాయమైన వాటా రావడం లేదు.

పోషక విలువలు..
చేపలు ఉత్తమపోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనో యాసిడ్లు లభిస్తాయి.
చేపల రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి.
సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు, ఎముకల పెరుగుదలకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, విని యోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా వినియోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌లు అధికంగా లభిస్తున్నాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.

ఆంధ్రప్రదేశ్‌లో..
మన రాష్ట్రం చేపల ఉత్పత్తిలో ప్రథమ లేక ద్వితీయ స్థాయిలో కొనసాగుతుంది. 2010-11లో దాదాపు 14.5 లక్షల టన్నుల చేపలు-రొయ్యల ఉత్పత్తి అయిందని అంచనా. డెల్టా ప్రాంతంలో సాంద్ర చేపల పెంపకం ఈ అధికోత్పత్తికి తోడ్పడింది. దాదాపు 20 లక్షల మంది మత్స్యకారులకు, కార్మికులకు చేపల పెంపకమే జీవనాధారం.
మంచినీటి చేపలు, రొయ్యలు పెంచడానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 2010 అంతానికి 64,545 ఎకరాల్లో చేపల పెంపకానికి రిజిష్టర్‌ చేయబడింది. చేపల సహకార సంఘాలకు సబ్సిడీతో చేప పిల్లల సరఫరా, ఇతర ప్రోత్సాహకాల ద్వారా అధికోత్పత్తి సాధ్యమైంది.
ఏప్రిల్‌-మే మాసాలలో సముద్ర చేపల పట్టడానికి నిషేధించిన సమయంలో ఉచిత ఆహార ధాన్యాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మహిళా మత్స్య మిత్ర గ్రూపుల్లో దాదాపు 18వేల మత్స్యకార్మిక మహిళలు సభ్యులుగా ఉన్నారు.

మీకు తెలుసా..?
- అతి తక్కువ ఆహారాన్ని వినియోగిస్తూ చేపలు పెరుగుతాయి. మురుగునీరు, బురదలో కూడా పెరుగుతాయి.
- ప్రతి కిలో బరువు పెరుగుదలకు చేప కేవలం 1.1 కిలోల ఆహారాన్ని తీసుకుంటుంది. ఇదే మాంసం ఉత్పత్తికి కోడి 2.5 కిలోల ఆహారం అవసరం.
- నీటిలో నిలిచి వుంటూ నీటి ఉష్ణోగ్రతకు దగ్గరగా శరీర ఉష్ణోగ్రత ఉండడంతో చేపలు తక్కువ ఆహారంతోటే పెరుగుతాయి. ఇదే కోళ్ల విషయంలో అవి నిలుచుని, తిరుగుతూ శరీర ఉష్ణోగ్రతను పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెరుగుదలకు ఎక్కువ ఆహారాన్ని కోళ్లు తీసుకుంటాయి.
- తీర ప్రాంత అభివృద్ధి మండళ్ల పేరుతో పరిశ్రమలకు, ఓడరేవుల నిర్మాణానికి అనుమతులిస్తున్నారు. ఇది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది. వీరు మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నెల్లూరు ప్రాంతంలో ఒకేచోట 27 థర్మల్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతిచ్చారు. వీటివలన ఈ ప్రాంత జీవావరణం దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిశ్రమలు వ్యర్థాలను, వేడి నీటిని సముద్రంలోకి వదులుతాయి. దీనివల్ల సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అంతిమంగా ఇవన్నీ కూడా చేపల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
- 'కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ'- ఇది తీరప్రాంతంలో చేపల పెంపకాన్ని నియంత్రిస్తుంది.
- 'ఎంపెడా'- సాధికార సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ).
- 'సీబా'- ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపక పరిశోధనా సంస్థ (సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ బ్రాకిష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌).

Thursday, 1 November 2012

ఈ మెమరీ చిప్‌ శాశ్వతం...


భయంకరమైన ప్రళయం సంభవించినా... ప్రపంచమంతా నాశనమైపోయినా... ఈ మెమరీ చిప్‌లో స్టోర్‌ చేసిన డేటా మాత్రం సురక్షితం. 1000 డిగ్రీల వేడిని సైతం ఈ చిప్‌ తట్టుకుంటుంది. నీటిలో పడినా ఇట్టే పైకి తేలుతుంది. రేడియేషన్‌, ఇతర హానికర రసాయనాలు ఈ డేటా సేవర్‌ను ఏమాత్రం మట్టికరిపించలేవు. ఈ డేటాకార్డ్‌లో స్టోర్‌ చేసే సమాచారం 10కోట్ల సంవత్సరాల దాకా నిక్షిప్తంగా ఉండేటటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్లాస్‌తో డిజైన్‌ కాబడిన ఈ డేటా కార్డును జపాన్‌కు చెందిన హిటాచీ సంస్థ రూపొందించినట్లు డైలీ మెయిల్‌ పత్రిక వెల్లడించింది. ఈ డేటాకార్డులోని సమాచారం ఎప్పటీకీ భద్రంగా ఉంటుందని సంస్థ పరిశోధకుడు కుజుయోషి టోరి తెలిపారు. నాలుగు పొరలున్న ఈ కార్డులో ఒక చదరపు అంగుళానికి సుమారు 40 మెగాబైట్ల సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తం చేసుకోవచ్చు.

జీవవైవిధ్యం.. సంరక్షణ.. కార్యక్రమాలు ..



'జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి' ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సులను నిర్వహించింది. ఇవి అక్టోబర్‌ 19వ తేదీన ముగిశాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూ సుస్థిరాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్ని ఈ సదస్సులు రూపొందిస్తాయని సహజంగా అందరూ ఆశించారు. రెండేళ్ల క్రితమే ''వ్యూహాత్మక జీవవైవిధ్య ప్రణాళిక''లో భాగంగా 'ఐచి' జీవవైవిధ్య లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందుతాయనీ ఆకాంక్షించారు. కానీ, దీనికి విరుద్ధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వున్న జీవవైవిధ్యాన్ని వాణిజ్య అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కేంద్రీకరించడంతో అసలు జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమ రూపకల్పనకు ప్రాధాన్యత లభించలేదు. జీవవైవిధ్య పరిరక్షణలో ఇమిడి వున్న సామాజిక, ఆర్థికాంశాలపై నిర్దిష్టమైన నిర్ణయాలూ తీసుకోలేదు. కానీ, 2015 నాటికి ఇప్పటికే ఇస్తున్న గ్రాంట్లను రెట్టింపు చేసి, ఆ తర్వాత కనీసం అదే స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇది ఆహ్వానించదగ్గది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య సంరక్షణకు, సుస్థిర వినియోగానికి ఇప్పటికే రూపొందించిన లక్ష్యాలను, మన దేశంలో అమలవుతున్న విధానాల్ని సంక్షిప్తంగా తెలుపుతూ 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో మీ ముందుకొచ్చింది
ఈ వారం 'విజ్ఞానవీచిక'.

భూగోళంలో ప్రకృతి ప్రసాదించిన అపారమైన సంపద జీవవైవిధ్యం. ఇది వెల కట్టలేనిది. భూగోళంలో వున్న జీవాలన్నీ పరస్పరం ఆధారపడుతూ సుస్థిరతను ఆపాదిస్తున్నాయి. కానీ, మానవ కార్యక్రమాల వల్ల ఈ స్థిరత్వం దెబ్బతింటుంది. కోల్పోయిన జీవవైవిధ్యాన్ని వీలున్న మేర పునరుద్ధరించి, సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1992లోనే కృషి ప్రారంభమైంది. వున్న వైవిధ్యాన్ని సుస్థిరంగా వినియోగించడం, వచ్చిన ఫలితాల్లో సంబంధితులకు సమ భాగస్వామ్యం కల్పించడం దీని లక్ష్యం. రెండేళ్ల క్రితం జపాన్‌లోని 'నగోయా' పట్టణంలో జన్యువనరుల అందుబాటుకు, వచ్చిన ఫలితాల్లో సమభాగస్వామ్యం అందించడానికి నిర్వహణ నియమాల్ని (ప్రొటోకాల్‌) రూపొందించింది. దీనికోసం వ్యూహాత్మక ప్రణాళికను తయారుచేసింది. దీనిలో ఐదు గమ్యాలతో కూడిన 20 లక్ష్యాలను పొందుపరిచింది. వీటన్నింటినీ సంయుక్తంగా 'ఐచి జీవవైవిధ్య లక్ష్యాలు'గా వ్యవహరిస్తున్నారు.
''ఐచి'' లక్ష్యాలు..
ఈ లక్ష్యాలన్నీ 2020 సంవత్సరంలోపల సాధించడానికి ఉద్దేశించినవి.
గమ్యం ఎ: కోల్పోయిన జీవవైవిధ్యాలకుగల కారణాల్ని గుర్తించి, పునరుద్ధరించే ప్రయత్నాలు :
జీవవైవిధ్య విలువల్ని అందరిచే గుర్తింపజేస్తూ పరిరక్షించి, వినియోగించడానికి కావల్సిన చర్యల్ని గుర్తింపజేయడం. జాతీయ, స్థానిక అభివృద్ధి కార్యక్రమంలో, పేదరిక నిర్మూలన వ్యూహంలో, ప్రణాళికలో భాగంగా జీవవైవిధ్య విలువల్ని చేర్చడం మరో లక్ష్యం. జీవవైవిధ్య స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం ఇంకో లక్ష్యం. జీవవైవిధ్యాన్ని నష్టపరిచే కార్యక్రమాలకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని ఎత్తివేయడం లేదా సంరక్షణ, సుస్థిర వినియోగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఈ కోవ కిందకు వస్తాయి. ప్రకృతి వనరులను సురక్షితమైన పర్యావరణ పరిధిలో వినియోగించడం కూడా దీనిలో భాగమే.
గమ్యం బి: జీవవైవిధ్యంపై నేరుగా వున్న వత్తిళ్లను తగ్గిస్తూ, సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడం:
జీవవైవిధ్యానికి అవసరమైన నివాస స్థలాల నష్టాల్ని 2020 నాటికి కనీసం సగానికి తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం. చేపలు, ఇతర అకశేరుకాలు, జంతువులు, జల, వృక్ష సంపదను సుస్థిరంగా లభ్యమయ్యే రీతిలో వినియోగించడం. అస్థిర వినియోగాన్ని నివారించడం. వ్యవసాయంలో ప్రకృతిని పరిరక్షిస్తూ సుస్థిరాభివృద్ధికి దోహదపడడం వంటివన్నీ ఈ కోవ కిందకు వస్తాయి.
గమ్యం సి: పర్యావరణ వ్యవస్థలను, జాతులను, జన్యువైవిధ్యాలను పరిరక్షిస్తూ జీవవైవిధ్య స్థాయిని మెరుగుపరచడం:
కనీసం 15 శాతం భూభాగాన్ని, భూమిపై నీటిని, సముద్రతీర ప్రాంతాల జీవావరణాల్ని, వాటిలోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం వంటివి ఈ కోవ కిందకు వస్తాయి. సేద్యమవుతున్న పంటల రకాల్ని, వీటికి సంబంధించిన అటవీ (వైల్డ్‌) రకాల్ని పరిరక్షించడం కూడా ఇందులో భాగమే.
గమ్యం డి: జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ సేవల వల్ల కలిగే లాభాలను అందరికీ పెంచడం:
స్థానికులు, పేదలతో సహా అందరి అవసరాలను పరిరక్షించే విధంగా జీవవైవిధ్య వ్యవస్థను, పర్యావరణ సేవలను నిర్వహించడం. సంరక్షణ, పునరుజ్జీవన కార్యక్రమాల ద్వారా కార్బన్‌ నిల్వలను పెంచుతూ జీవవైవిధ్య పరిరక్షణకు, పర్యావరణ మార్పులను తట్టుకొనే శక్తిని కలిగించడం ఈ లక్ష్యాల కిందకే వస్తాయి.
గమ్యం ఇ: భాగస్వామ్య ప్రణాళిక, విజ్ఞాన యాజమాన్యం, సాంకేతిక సామర్థ్యాలను పెంచుతూ జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమాల్ని పెంచడం:
భాగస్వామ్యంతో పెంపొందించిన జాతీయ, జీవవైవిధ్య వ్యూహానికి తోడ్పడే విధా నాలతో అభివృద్ధిని ప్రారంభించడం. సాంప్రదాయవిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆచారాలు జీవవైవిధ్య పరిరక్షణకు, సుస్థిర వినియోగానికి తోడ్పడేలా చేయడం దీని కిందకే వస్తుంది. దీనికి సంబంధించిన విజ్ఞానాన్ని అందరితో పంచుకోవడమూ, వినియోగిం చడమూ దీనిలో భాగమే. 2011-20 కాలానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళిక అమలుకు కావాల్సిన వనరులను సేకరించి, వినియోగించడం దీని కిందకే వస్తాయి.
ఇప్పుడేం జరిగింది..?
ఒక్కమాటలో చెప్పాలంటే జీవవైవిధ్య సుస్థిర వినియోగానికి, దీనిలో ఇమిడి వున్న సామాజిక, ఆర్థిక సంబంధాలకు, ముఖ్యంగా దీనిపైనే జీవిస్తున్న పేదలకు సంబంధించి ఏ నిర్దిష్ట కార్యక్రమాన్ని నిర్ణయించలేదు. జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగంపై కేంద్రీకరించి, చర్చించేబదులు వున్న వైవిధ్యాన్ని వ్యాపార అవసరాల కోసం వినియోగించుకునే కృషిపైనే కేంద్రీకరించబడింది. ఫలితంగా, అసలు 'ఐచి లక్ష్యాల' సాధనకు ఆచరణాత్మక కార్యక్రమం రూపొందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు 'ఐచి లక్ష్యాల' సాధనకు అవసరమైన నిధుల్ని అందించడానికి ఆసక్తిని చూపలేదు. భారతదేశం, కొన్ని ఆఫ్రికా దేశాలు చొరవచూపి నిధుల్ని ప్రకటించిన తర్వాత మాత్ర మే అభివృద్ధి చెందిన దేశాలు తమ నిధుల కేటాయింపుపై ఒక అంగీకారానికి వచ్చా యి. 2015 నాటికి ఇప్పుడు అందిస్తున్న నిధులను రెట్టింపు చేయడానికి, ఆ తర్వాత కనీసం అదే స్థాయిలో కొనసాగించడానికి అంగీకరించాయి. జీవవైవిధ్య వినియోగంలో ఇమిడి వున్న సామాజిక, ఆర్థిక అంశాలను చర్చించడాన్ని వాయిదా వేశాయి.

కేరళలో..
జీవవైవిధ్య సంరక్షణలో మొదటిస్థానాన ఉంది. దీనికి ప్రక్రియలు 2009లోనే ప్రారంభమైనాయి. రాష్ట్రంలోని మొత్తం 978 గ్రామ పంచాయతీలు, 60 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పడ్డాయి.
ఇప్పటివరకూ 500 జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు 'ప్రజా జీవవైవిధ్య రిజిష్టర్ల'ను తయారుచేశారు. వీటిలో స్థానిక జీవవనరులు, వాటి వైవిధ్యం, సాంప్రదాయ విజ్ఞానానికి సంబంధించిన సమాచారం పేర్కొనబడింది. స్థానిక సంస్థలు ఎంతో బలంగా వున్నప్పటికీ ఈ రిజిష్టర్ల తయారీ అంత తేలిగ్గా జరగలేదు. వీటిని పూర్తి చేయడానికి ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది.
గ్రామపంచాయతీ అధ్యక్షులే గ్రామ జీవవైవిధ్య కమిటీ అధ్యక్షులు. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ స్థాయిలో.. సంబంధిత ఛైర్మన్‌ లేక మేయర్లు ఆయా జీవవైవిధ్య కమిటీ లకు అధ్యక్షత వహిస్తున్నారు. స్థానిక సంస్థల కార్యదర్శి జీవవైవిధ్య యాజమాన్య కమిటీకి సభ్య కార్యదర్శి. ఈ వ్యవస్థలో స్థానిక సంస్థలకు, జీవవైవిధ్య యాజమాన్య కమిటీలకు మధ్య రాగల వైరుధ్యాల్ని నివారించేందుకు ఈ ఏర్పాటు చేయబడింది.
కమిటీల విధులు..
ప్రజా జీవవైవిధ్య రిజిష్టర్లలో నిక్షిప్తం చేయబడిన విజ్ఞానాన్ని పరిరక్షించడం. ముఖ్యంగా బయట సంస్థలు, వ్యక్తుల నుండి రక్షించడం.
స్థానిక కార్యక్రమాలకు నిధుల సేకరణ, వినియోగం.
స్థానిక జీవవైవిధ్య వారసత్వ కేంద్రాలను గుర్తించే ప్రక్రియలను ప్రారంభించడం. జన్యు సంపద బ్యాంకులను, సాంప్రదాయక విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అనువుగా విత్తన కేంద్రాలను నిర్వహించడం.
అన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి సమన్వయకర్త నియమించబడ్డాడు. అన్ని జిల్లాల్లో ఐదుగురు జూనియర్‌ పరిశోధకులతో కూడిన బృందం నియమించబడింది. వీరు వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణ విజ్ఞానంలో నైపుణ్యంగల వారు. ప్రతి పరిశోధకుడు కనీసం 15 గ్రామ పంచాయతీలకు బాధ్యత వహిస్తాడు.
అన్ని స్థానిక సంస్థల్లో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను నిర్వహించడానికి ఒక సమన్వయకర్త వున్నాడు.
ప్రతి వార్డు నుండి ఐదారుగురు సభ్యులను జీవవైవిధ్య సమాచారాన్ని సేకరించడానికి ఎంపిక చేశారు. వీరికి శిక్షణ ఇవ్వబడింది. వీరికోసం ఇంతవరకూ 33 కార్యశాలలు నిర్వహించారు.
ప్రతి ప్రజా జీవవైవిధ్య రిజిష్టర్లను తయారుచేయడానికి స్థానిక సంస్థ రూ. 70 వేలు కేటాయించింది. కొన్ని పంచాయతీలు రూ. లక్ష వరకూ కేటాయించాయి.
గడ్డల (ట్యూమర్స్‌) సమాచారాన్ని వైనాడ్‌లోని ఎడవాకల, ఆక్వా కల్చర్‌, మడ అడవుల జీవవైవిధ్య సమచారాన్ని 'అతోలి' వద్ద, నదీ జీవవైవిధ్యం ఫెన్సింగ్‌పై 'పెరుమన్నా' వద్ద సేకరించబడ్డాయి. ఈ రెండూ కోజికోడ్‌ జిల్లాలో వున్నాయి.

మన రాష్ట్రంలో..
రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు 2006లో ప్రారంభించ బడింది. ఇప్పటివరకూ దాదాపు 150 జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పడ్డాయి. ఐదు జీవవారసత్వ కేంద్రాలు గుర్తించబడ్డాయి. ఇవి తిమ్మమ్మ, మర్రిమాను, వీరాపురం, తిరుమల, శ్రీశైలం, తలపోను, ఔషధ, వృక్ష ప్రాంతాలు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ వద్ద వ్యవసాయ జీవవైవిధ్య వారసత్వ కేంద్రం ప్రకటన ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే పూర్తవుతుంది.
రెడ్‌ సాండర్స్‌, డి కాలిపర్స్‌, సైకాస్‌, గ్లోరియాజా తదితర వృక్షాలు; పులి, చిరుత, ఏనుగు, పునుగు పిల్లి, రాబందులు, గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్స్‌ తదితరాలు అధికంగా వుండే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. వ్యవసాయ ప్రాధాన్యత గల పత్తి, జొన్న, సజ్జ, వరి, ఒంగోలు జాతి గిత్తలు (ఎద్దులు), పుంగనూరు ఆవులు, పొలస చేపలు, బంగినపల్లి మామిడి తదితర ఎన్నో రకాలు రాష్ట్రంలో వున్నాయి.
విధానం..
వాణిజ్య వినియోగానికి అనువైన చెట్లను, జంతువులను, చేపలను గుర్తించడం (బయో ప్రాస్పెక్టింగ్‌). ఉదా: ఒంగోలు జాతి ఎద్దులు, పొలస చేపలు, పుంగనూరు ఆవులు, ఔషధ చెట్లు, అటవీ జాతులు.
మండల, జిల్లా, కార్పొరేషన్ల స్థాయిలో స్థానిక జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పర్చి, వాటిపై సర్వహక్కుల్నీ ఇవ్వడం. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజల జీవనానికి అనువుగా వనరులను అందించడం.
ఆహారం, ఆరోగ్య భద్రతకు జీవవైవిధ్యాల్ని ఉపయోగించడం.
అంతరించిపోయే ప్రమాదంగల జాతుల్ని, గుర్తించి పరిరక్షించడం.
సేంద్రీయ వ్యవసాయం.
వాననీటి సేకరణ, పరిరక్షణ.
ప్రధాన పట్టణాల జీవవైవిధ్య వివరాల్ని సేకరించి, నిర్వహించడం.
లాభాల్ని పంచుకునేందుకు వీలుగా విలువైన వనరులకు భౌగోళిక సూచికలను రూపొందించడం.

మనదేశంలో..
అంతర్జాతీయ వేదికల మీద చేస్తున్న ప్రసంగా లకు, దేశంలో అమలుచేస్తున్న విధానాలకు పొంతన వుండడం లేదు. దేశంలో అనుసరిస్తున్న వ్యవసాయ విధానం, విచక్షణారహిత ప్రకృతి వనరుల వినియోగం జీవవైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. జీవైవిధ్యాన్ని సుస్థిరంగా వినియోగించడానికి దోహదపడే చిన్నకమతాల సేద్యానికి బదులు పెద్దపెద్ద యం త్రాలతో, పెద్ద మొత్తంలో రసాయనాలను వినియోగించి సాగుచేసే కార్పొరేట్‌ సేద్యాన్ని ప్రభుత్వ ప్రోత్సహిస్తుంది. జీవవైవిధ్యాన్ని పూర్తిగా హరించే జన్యు మార్పిడి సాంకేతికాల్ని, ముఖ్యంగా బిటి సాంకేతికాన్ని ప్రోత్సహిస్తోంది. విచక్షణా రహితంగా అడవుల్ని కొల్లగొడుతూ, ఖనిజ వనరుల సేకరణకు అనుమతిస్తోంది. ప్రకృతి వన రుల్ని అక్రమంగా కొల్లగొట్టేవారిపై నామమాత్రపు చర్యల్ని తీసుకుంటుంది. సముద్ర తీరంవెంబడి కాలుష్యాన్ని పెంచుతూ వేడిని విడుదల చేసే థర్మల్‌, అణు విద్యుత్‌ కేంద్రాలకు అనుమతిస్తుంది. సముద్రంలో వేగంగా, లోతుగా వెళ్లి, చేపలను వేటాడే పెద్ద పెద్ద యాంత్రిక పడవలకు అనుమతిస్తుంది. తీరంలో ఓడరేవుల్ని నిర్మిస్తూ మత్స్యకారుల జీవనాన్ని ఛిద్రంచేసే విధానాల్ని అనుసరిస్తుంది. అంతర్జాతీయ వేదిక లపై చేస్తున్న ప్రసంగాలు, అంగీకరించే నిర్ణయాలకు అనుగుణంగా స్థానిక విధానా లను, చట్టాలను మార్చడం లేదు./ ఫలితంగా, జీవవైవిధ్యం వేగంగా క్షీణిస్తుంది. వున్న వైవిధ్యాన్ని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించాలన్న దానిపైనే కేంద్రీకరిస్తుంది.

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (4)

  • అశాస్త్రీయ ఆచారాలు
బొమ్మ చూశావుగా...! దీనిలో చూపి నట్లు..''ప్రతి గృహానికీ సంబంధించిన స్థలములో వాస్తు పురుషుడు, ఈశాన్యంవైపు తలపెట్టి, నైరుతివైపు రెండుకాళ్ళూ ఆనించి ఉంటాడట. ఇక గృహ నిర్మాత వాస్తువాదిని ప్రశ్నించే టప్పుడు ఏ అవయవాన్ని తాకితే, ఏ లోహం లభిస్తుందో చెబుతాను విను.
''................ శిరసి స్పర్శనేయది |
శిరస్థానే హేమ శల్యం నాసిక స్పర్శనే యది||
నాశికాయాం చైవ హస్తాచ్చందనం సప్తతాలకే|
గళే స్పర్శే హస్తిశల్యం స్యాత్‌ షట్తాల ప్రమాణతః||
అని 'వశిష్ట సంహిత' పేర్కొంటోంది. అంటే''గృహ నిర్మాత శిరస్సును స్పృశించి ప్రశ్నించినచో, అతని స్థలములో వాస్తు పురుషుని తల ఉన్న ప్రదేశంలో బంగారు కడ్డీ దొరుకును. ముక్కును తాకుచూ ప్రశ్నించిన ఎడల వాస్తు పురుషుని ముక్కు ఉన్న ప్రదేశమున ఏడు తాళముల ప్రమాణము లోతున చందనపు కట్టె ఉండును. కంఠమును స్పృశించుచూ ప్రశ్నించిన ఎడల వాస్తు పురుషుని గొంతు స్థానమున, స్థలములో ఆరు తాళముల లోతున ఏనుగు ఎముక లుండును అని అర్థం. ఇలాగే మిగిలిన అవయవాలను వేటిని తాకితే ఏ లోహం, లేక ఎముకలు దొరుకునో చెప్పబడింది'' అన్నాను.
''తాళము అంటే ఎంత?'' అని ప్రశ్నించాడు చంద్రమౌళి.
''తాళము అనగా 12 అంగుళములని భావము అని శ్రీదొగిపర్తి స్వామి గుప్త సిద్ధాంతి తన గుప్తవాస్తు గ్రంథంలో పేర్కొన్నారు'' అని సమాధానమిచ్చారు.
''అదిసరే! దురదకీ, గృహ నిర్మాత స్థలంలో ఉంటే ఎముకలకూ ఏదో సంబంధముందన్నావు. అది వివరించు'' అన్నాడు చంద్రమౌళి.
'దానిని గూర్చి విశ్వకర్మ ప్రకాశిక' ఇలా తెలియ జేస్తోంది.
శ్లో|| యదంగం సంస్పృతేత్కర్తా మస్తకంశల్య ముద్దరేత్‌|
అష్టతాళా దధస్తస్మిన్‌ తత్రశల్యం న సంశయః||
అంటే గృహనిర్మాత ఏ అవయవమును తాకునో, దానినిబట్టి కూడా శల్యములున్న స్థానమును నిర్ణయింపవలెను. గృహ నిర్మాత యొక్క శిరస్సున దురద కల్గినను, స్పృశించినను ఎనిమిది తాళముల లోతున ఎముకలుండును. అంతేకాదు..
శ్లో|| నాసికా స్పర్శనే కర్తు ర్వాస్తోశల్యం తదల్పకం|
స్థితం వినిశ్చతంబ్రూయాత్తల్లక్షణ మధోచ్యతే||
అంటే ''ముక్కునందు దురద కల్గినను, స్పృశించినను వాస్తు పురుషుని నాసికా స్థానమున్న ప్రదేశమున చిన్న ఎముక ఉండును' అని అర్థం. ఈ శల్యోద్ధార ప్రకరణంలో చివరగా 'విశ్వకర్మ ప్రకాశిక'లో ఇలా చెప్పబడింది.
'ఆసక్తోదృశ్యతే యస్మాద్దిశం శల్యం సమాదిసేత్‌''|
అంటే ''గృహ నిర్మాత ఆసక్తితో ఏవైపునకు చూచునో ఆ దిక్కునందు ఎముకలున్నవని తెలుసుకొనవలెను.''
''ఇది మరీ విచిత్రంగా ఉంది కాంతారావ్‌! 'ఓడు ఓడంటే కంచమంతా ఓడు' అనే సామెతలాగా, చేతితో తాకినా, గోక్కున్నా, చివరికి కంటితో ఒకవైపు చూసినా ఆ వైపున గృహ నిర్మాత స్థలంలో ఎముకలుంటాయని చెప్పడం అశాస్త్రీయతకు పరాకాష్ట. అందులోనూ ఎన్నో పరస్పర విరుద్ధ విషయాలున్నాయి. శిరస్సును తాకి ప్రశ్నించితే ఆ గృహ నిర్మాతకు బంగారుకడ్డీ దొరుకుతుందని వశిష్ఠుడు, ఎముకలు దొరుకుతాయని విశ్వకర్మ సెలవిచ్చారు. ఇలాంటి అసంబద్ధ, పరస్పర విరుద్ధ, అశాస్త్రీయ అంశాల మీద ఆధారపడిన విషయాన్ని 'శాస్త్రం' అని అంగీకరించలేకపోతున్నాను' చికాకుపడుతూ అన్నాడు చంద్రమౌళి.
''ఇంకా మరికొన్ని విశేషాలున్నాయి చంద్రమౌళీ! ఒకే గ్రంథంలో పరస్పర విరుద్ధఫలితాలు, రెండు గ్రంథాల్లో పరస్పర విరుద్ధఫలితాలు చెప్పబడినవి అనేకమున్నాయి. వాటినీ వివరిస్తా విను'' అన్నా.
''వివరించు'' అన్నాడు ఆసక్తిగా చంద్రమౌళి.
(ఆ వివరాలు వచ్చేవారం)

చెట్ల మందులతో లింగ మార్పిడి సాధ్యమా?


ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
నాకు తెలిసిన ఒక రిటైర్డ్‌ ఉపాధ్యాయుని కుమార్తె ప్రభుత్వ డాక్టరు. ఆమెకు ఆడపిల్లలే సంతానంగా ఉన్న కారణంగా భర్త విడాకులిస్తానని బెదిరించాడు. తప్పక 'మగ సంతానం' కావాలని వేధించాడు. ఆమె డాక్టరైనా, ప్రచారంలో వున్న చెట్ల మందులు వాడి (గర్భిణీగా వున్న సమయంలో) నందున మగ సంతానం పొందినట్లు నా స్నేహితుడు చెప్పాడు. అక్కడక్కడ ఇలాంటి ప్రచారమే ఉంది. శాస్త్రీయంగా పురుష క్రోమోజోములే ఆడ లేక మగ శిశువు జననానికి కారణమైతే.. చెట్ల మందుల వాడకంతో వైద్యపరంగా శిశువు లైంగికతను ఇష్టమైనరీతిలో మార్చే అవకాశం ఉంటుందా? దయచేసి వివరించండి.
- కృష్ణయ్య, కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌జిల్లా
ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలంటే వైజ్ఞానికపుటంశాలతో పాటు సామాజికపుటంశాల్ని స్పృశించాలి.
మొదటి విషయం:
ఆడవాళ్లకు ఆశించినంతమేరకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం వల్ల ప్రతి పురుష దురంహంకారీ తన భార్యను విడాకుల పేరుతో చీటికీ మాటికీ బెదిరిస్తుంటాడు. ఏమాత్రం ఎదురుతిరిగినా భౌతికదాడులు చేస్తారు. సామాజిక మార్పును కోరే శక్తులతో జతకలిసి పనిచేసిననాడే ఈ దురవస్థకు మనం చరమగీతం పాడగలం. అందుకోసం మహిళలు ఐక్యం కావాలి.
రెండో విషయం:
ఆమె డాక్టరైనా ఆమెకు శాస్త్రీయ దృక్పథం కొరవడడం వల్ల, కొంతమేరకు మూఢనమ్మకంలో ఉండడం వల్ల ఆవిధంగా చెట్లమందులు వాడితే తనకు మగసంతానం కలుగుతుందని నమ్మి, వాటిని సేవించింది. ఇలాంటి మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్న జన విజ్ఞానవేదిక వంటి సంస్థల్లో పనిచేయడమే ఈ సమస్యకు పరిష్కారం.
ఇక మూడవది:
ఓ శిశువు, ఆడనా లేక మగనా నిర్దేశించేది కేవలం పురుషుడు మాత్రమే. ఆడైనా మగైనా ప్రతి మనిషి కణంలోని కేంద్రకంలో 23 జతల (pairs)క్రోమోజోములుంటాయి. అందులో ఓ జత ఆ వ్యక్తి లైంగికత (sex) ను నిర్ధారిస్తుంది. అందులో ఉన్న జత రెండూ ఒకేవిధమైనవి అయితే ఆడ అనీ, వేర్వేరు అయితే మగ అనీ అంటారు. ఆడవారిలో ఉన్న సెక్స్‌ నిర్దేశిత క్రోమో జోము పేలికను X అనడం వల్ల ఆడవారిలో XX తరహా సెక్స్‌ క్రోమోజోము ఉంది. మగవారిలో ఉన్న జతను XY అంటాము. ఆ ఆడమనిషి యుక్త వయస్సులో ఉన్నపుడు తన అండకోశం (overies) లోని మామూలు XXకణం రెండు వేర్వేరు విడివిడి‘X’ లుగా ఉన్న బీజకణాల్ని ఇస్తుంది. ఇందులో ఒకటి మాత్రమే నిలుస్తుంది. అది ఆడవారి గర్భకోశానికి అంటుకొని ఉన్న అండనాళం (fallopian tube) లోకి జారుకుంటుంది. అదేవిధంగా మగ వారిలో వృషణం (testis) XY జీవకణం X ఉన్న బీజకణంగాను,Yఉన్న బీజకణంగానూ విడుదలవుతాయి. వీటినే శుక్రణాలు (sperm) అంటారు. అది సజీవంగా ఉన్న సమయంలో ఆమె తన భర్తతో కలిసినపుడు భర్త నుంచి విడుదలైన లక్షలాది X శుక్రకణాలు,Y శుక్రకణాలు ఆమో యోని (vagina) ద్వారా గర్భకోశం దాటు కొని అండనాళాల్లో ఎదురుచూస్తున్న (X క్రోమోజో ములు గల) అండాన్ని ఆశ్రయిస్తాయి. అందులో ఒకటి మాత్రమే అండంలోనికి వెళ్‘X’శ్ణతో కలిసి జతకూడిన సంయుక్తకణాన్ని (Zygote) ఇస్తుంది. శుక్రంలో X బీజకణాలు,Y బీజకణాలు లక్షలాది గాను, సమానంగాను, దాదాపు ఒకేవిధమైన చలాకీ గాను ఉండడం వల్ల స్త్రీ బీజకణంలోకి వెళ్లే శుక్రకణం‘X’ కావచ్చు లేదా‘Y’కూడా కావచ్చు. ఈ రెంటికీ సమాన సంభావ్యత (Probability) ఉంది. వీటి కలయికే శిశువు లింగనిర్ధారణను చేస్తుంది. X X తరహా సంయుక్తకణం స్త్రీశిశువుగాను, XY తరహా సంయుక్త కణం పురుషశిశువుగాను అభివృద్ధి చెందుతారు. ఓ నాణేన్ని పైకి గిరాటేసి నపుడు అది 'బొమ్మ' పడ్డానికి, లేదా 'బొరుసు' పడ్డానికి సమాన అవకాశం ఉంది. ఇలా అప్రక్రటితంగా, కాకతాళీ యంగా జరిగే సంఘటనలను స్వతంత్ర మైన అనియంత్రిత ఘటనలు (independent and discrete acts)అంటారు. కాబట్టి X తో పురుష X శుక్ర కణం లేదాY శుక్రకణం ఏదైనా సమా న స్వతంత్రతో కలుస్తాయి. అయితే ఒకటే కలుస్తుంది. ఫలితంగా లైంగికత ఆవిధంగా నిర్దేశించబడుతుంది. అయితే ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. తన X కలుస్తుందా లేదా Y కలుస్తుందా అన్న నియంత్రణ పురుషుడు తన ఇష్టానుసారం నిర్ణయించడు.
ఇక నాల్గవది అతి ముఖ్యమైనది..
ఆడపిల్లలే సంతానంగా ఉంటే ఏమిటి బాధ? వారెందుకు సంతానంగా ఉండకూడదు. మా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడికి ముగ్గురు ఆడపిల్లలు. మరో ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులకూ ఇద్దరేసి ఆడపిల్లలు. కొందరికి ఉన్నది ఒక బిడ్డే అయినా ఆమె ఆడబిడ్డ. ఆడపిల్లలు దేశానికి గర్వకారణం. మా ఆడపిల్లలు మాకు గర్వకారణం. ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి చెప్పే పుక్కిటి నినాదాలు కావు. సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, ఆర్థికవేత్తలు సశాస్త్రీయంగా ఓ విషయం తేటతెల్లం చేశారు. ఈ సజీవ ఆధునిక ప్రపంచం లో జరుగుతున్న అభివృద్ధిలోను, చైతన్య అస్తిత్వంలోను ఇమిడి వున్న మానవ శ్రమలో 70 శాతం పైచిలుకు ఆడవారిదేనని వారు ఋజువు చేశారు. కాబట్టి ప్రపంచ రథచక్రాల్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నడిపిస్తున్న ఆడవారికే మన మానవజాతి సమస్తం ఋణపడి ఉంది. అర్థంలేని చెట్ల మందులతో చేట్లు, తలపోట్లు.. అర్థం వున్న చెట్ల మందులతో సింగారింపులు, నిగారింపు లు రావచ్చేమోగానీ ఆడవారు తిన్నా మగవారు తిన్నా బిడ్డల లైంగికతను ఏ చెట్లూ నిర్దేశించవు. అలా భావించడం మీ స్నేహితుడికున్న అశాస్త్రీయం. ఆయనకు మీరు స్నే.....హితుడిగా హితవు చెప్పండి.

సగం నెల మెలకువలోనే డాల్ఫిన్లు..!

సగం నిద్ర అంటే ఏమిటో తెలీదుగానీ డాల్ఫిన్లు మాత్రం ఒక కంటితోనే నిద్రపోతాయట! అయితే ఈ సమయంలో కన్ను ఒకటే కాదు తమ సగం మెదడునే విశ్రమింపజేస్తాయట! మిగతా సగం మెలకువగా ఉంటుంది. అయితే, డాల్ఫిన్లు ఏకంగా సగం నెలపాటు మెలకువగా ఉండగలవని తాజాగా తెలిసింది. బ్రయాన్‌ బ్రాన్సేట్టార్‌ అనే పరిశోధక బృంద నాయకుడు డాల్ఫిన్లపై విస్తృతంగా పరిశోధన నిర్వహించాడు. ఈ డాల్ఫిన్‌లు రెండువారాల పాటు తమ ఆహారాన్ని గుర్తించడమూ, తమ పరిసరాలను గమనించడమూ చురుకుగా చేసేవని అధ్యయనంలో నిర్ధారించారు. మానవులు సగం జీవితం నిద్రలోనే గడుపుతుంటే డాల్ఫిన్‌లు మాత్రం అసలు పూర్తినిద్ర కూడా లేకుండానే ఉంటున్నాయి! విచిత్రంగా లేదూ!?
జీవితకాలాన్ని తగ్గించే టీవీ..!
నిత్యం టీవీ ముందు కూర్చుంటే కళ్ళ నుండి ఒళ్ళు వరకూ ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు తాజాగా టీవీ చూడటం వలన కలిగే మరొక హాని బయటపడింది. ఆస్ట్రేలియా పరిశోధకుల ప్రకారం టీవీ చూసిన ప్రతి గంటలో సుమారు ఇరవై నిమిషాల మేర మన జీవితం హరించుకుపోతుందట! అస్సలు టీవీ చూడని వారికంటే ఎక్కువగా టీవీ చూసేవారిలో ఈ వ్యత్యాసం అధికంగా ఉందని అంటున్నారు. ఈ లెక్క ప్రకారం నిత్యం టీవీ చూసేవారిలో సగటు జీవితకాలం దాదాపు ఐదేళ్ళు తగ్గుతుందట! ఇందుకు అసలు కారణం టీవీ చూస్తూ మనం కనీసం కాళ్ళు కూడా కదపనంత బద్ధకంగా ఉండటమేనట!

గాలి నుండి పెట్రోల్‌..!
ఇదేదో మాయా మంత్రం కాదుగానీ, ఒక బ్రిటిష్‌ కంపెనీ మాత్రం కేవలం గాలి, విద్యుత్‌ని ఉపయోగించి పెట్రోల్‌ని తయారుచేయవచ్చని చెబుతుంది. వాతావరణంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ని తొలగించడం ద్వారా ఈ తాజా టెక్నాలజీ పనిచేస్తుందట! సోడియం హైడ్రాక్సైడ్‌ని కార్బన్‌ డై ఆక్సైడ్‌తో కలిపి ఎలక్ట్రాలిసిస్‌ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్‌, కర్బన వాయువుతో కలిసి మిథనాల్‌ ఏర్పడుతుంది. దాన్ని గాసోలిన్‌ ఫ్యూయెల్‌ రియాక్టర్‌లోకి పంపి కృత్రిమ పెట్రోల్‌ని తయారుచేస్తారు. ఇదంతా అద్భుతంలాగే అనిపించినా వాస్తవమే. రానున్న రోజుల్లో ఈ విధంగా గాలి ఉపయోగపడనుందండోరు..!

మీగడతో హెచ్‌ఐవి నుండి రక్షణ!
పాల మీగడ వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని తెలుసు. ఇప్పుడు అదే మీగడ ప్రాణాంతక హెచ్‌ఐవి బారి నుండి రక్షణ కలిగిస్తుందని పరిశోధకులు గమనించారు. గర్భంతో వున్న ఆవులకు హెచ్‌ఐవి ప్రొటీన్‌ని ఇంజెక్ట్‌ చేసి, ఆ ఆవు పిల్లకు జన్మనిచ్చాక జున్నుపాలను పరీక్షించారు. దానిలో అధికమోతాదులో హెచ్‌ఐవి వ్యతిరేక యాంటీబాడీలు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ పాల నుండి మీగడను తీసి హెచ్‌ఐవి సోకకుండా అరికట్టవచ్చని ఆలోచిస్తున్నారు. అయితే మీగడే ఎందుకంటే... స్త్రీలు సంభోగ సమయంలో ఆ క్రీంని వాడితే కచ్ఛితంగా హెచ్‌ఐవి నుండి రక్షణ లభిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

బాంబుల్ని పసిగట్టే ఎలుకలు..!
ఎలుకలకి ఘ్రాణశక్తి అధికం. గతంలో జరిగిన యుద్ధాలు విషాదంతోబాటు లాండ్‌మైన్‌లనూ మిగిల్చాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం తలకు మించిన భారం అవుతోంది. ఇప్పటివరకూ ''హీరో రాట్స్‌'' అనే భారీ ఎలుకలని ట్రైన్‌ చేసి లాండ్‌ మైన్స్‌ని పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి రెండు గంటల్లో సుమారు 300 చదరపు మీటర్ల నేలను జల్లెడ పట్టేస్తాయి. అదే పనిని మనుషులు చేయాలంటే రెండురోజులు పడుతుందట. కానీ ఈ హీరో ఎలుకలు ఆ నైపుణ్యాన్ని పొందాలంటే తొమ్మిది నెలల శిక్షణ అవసరం. ఇప్పుడు జన్యు మార్పిడి సాంకేతికంతో కొత్తరకం ఎలుకలని రూపొందించారు. ఇవి విస్ఫోటన పదార్థాలను సమర్థవంతంగా పసిగడతాయట! ఒకసారి ఇవి పసిగట్టి ఆ లాండ్‌మైన్‌ ఎక్కడ వుందో చూపెడితే నిపుణులు వెళ్లి దానిని నిర్వీర్యం చేస్తారు. ఇంకా ఈ జన్యుమార్పిడి ఎలుకలను క్షేత్రస్థాయి పరీక్షలకి పంపలేదు.

Tuesday, 23 October 2012

చీకటి రోజులు

 
 
కరెంట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అన్న ఆలోచనే భయానకం. మనిషి జీవితం అంతగా విద్యుత్‌తో పెనవేసుకుపోయింది. మనిషి బతుకు ఇప్పుడు కేవలం ప్రాణ
వాయువు ఒక్కటే ఆధారం కాదు, కరెంటు కూడా అంటే గొప్పగా ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. ఇంటి కాలింగ్ బెల్ నుంచి, బాత్‌రూమ్‌లో గీజర్ వరకు, వంటిల్లు, పడకిల్లు అని లేకుండా అన్నీ విద్యుత్ అవసరాలకు మూలమే. అమెరికాలో కొన్ని నిమిషాలు కరెంట్ పోతే సమస్త జన జీవనం స్తంభించిపోయిందట! అని చాన్నాళ్ల క్రితం జనం ఆశ్చర్యంగా చెప్పుకున్న సంగతి ఇప్పుడు మన దేశానికి వర్తిస్తోంది. కరెంట్ అవసరాలు ఎంతగా
పెరిగాయో, కోతలూ అంతకంతకూ పెరుగుతున్నాయి.
అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రతి పల్లెకు,
పరిశ్రమకు ఇరవై నాలుగు గంటలు ఎడతెగకుండా విద్యుత్
సరఫరా చేయలేకపోతున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా పేరొందిన
రాష్ట్రం ఇప్పుడు అంధేరాప్రదేశ్‌గా పేరు తెచ్చుకుంటోంది.
భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం సేద్యానికి కావలసినంత విద్యుత్‌ను రైతులకు అందించలేకపోతోంది. ముందు
చూపుతో ప్రణాళికలు రూపొందించే పాలకుల కొరత, అధికారుల అలక్ష్యం వెరశి అటు పట్నాలు, ఇటు పల్లెలు చీకటి రాజ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తిమిరంతో సమరం చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరూ కరెంట్‌గత జీవులైపోయారు. ఏ పని చేయాలన్నా కరెంట్ అవసరం. అది సమయానికి ఉండదు. ఉంటే లోఓల్టేజీ. కరెంట్ ఉంది కదా అని పని మొదలుపెడితే అంతలోనే పోతుంది. ప్రాణం పోకడ గురించి వైద్యులైనా చెప్పగలరేమోగాని కరెంట్ నిలకడ గురించి చెప్పగలవారెవరూ లేరు. ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏవీ కూడా కరెంట్ ఉత్పత్తికి తోడ్పడని పరిస్థితి. బొగ్గు కొరత, అనావృష్టి, గ్యాస్ కోత ఇవన్నీ కలసి అగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టాయి. ప్రభుత్వాల అధినేతలు, అధికారులు కరెంట్‌తో పరాచికాలు ఆడిన ఫలితం ఇప్పుడు జనానికి ‘కోతల’ రూపంలో షాక్ కొడుతోంది. సకాలంలో వర్షాలు లేకపోవడం తదితర కారణాల వల్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమీ బాగాలేదు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు కూడా వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. బొగ్గు ధరలు పెరుగుతుండడంతో ఆ మేరకు వినియోగదారునిపై భారం వేయాల్సి వస్తోంది. మరోపక్క రావాల్సిన మేరకు బొగ్గు రావడం లేదు. గత ఏడాది, ఈ ఏడాది కూడా మహానది బొగ్గు గనుల నుంచి రావాల్సిన దాంట్లో సగం బొగ్గు కూడా రాలేదు. దానా దీనా వివిధ మార్గాల ద్వారా అందే విద్యుత్ తొమ్మిది వేల మెగావాట్లకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. కానీ వేసవి లాంటి కీలక సీజన్‌లో కావాల్సిన విద్యుత్ కనీసం 12వేల మెగావాట్ల నుంచి 13వేల మెగావాట్ల వరకు ఉంటుంది. అంటే దీన్నిబట్టి లోటు అంచనా వేసుకోవచ్చు. కెజి బేసిన్‌లో ఆశించిన మేర ఉత్పత్తి జరగకపోవడం, వివిధ రాష్ట్రాలకు తరలింపుల వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ నామమాత్రంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో సగటు విద్యుత్ లోటు 45 మిలియన్ యూనిట్లు. ఈ మాత్రానికే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఫిబ్రవరి నుంచి మే మధ్య కాలంలో ఉండే 100-120 మిలియన్ యూనిట్ల లోటును భర్తీ చేయడం ఎలా?
మామూలుగా వేసవిలో కోతలు సర్వసాధారణం. గత రెండేళ్లుగా ‘్భరీ’ పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమలకు పవర్ హాలీడే అమలవుతోంది. దాంతో కొన్ని పరిశ్రమలు పాక్షికంగా, ఇంకా కొన్ని పూర్తిగా మూతపడుతున్నాయి. దానివల్ల దినసరి ఉత్పత్తి నష్టం రూ.248 కోట్లు. భారీ పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల నెలలో సగం అంటే 16 రోజులు కోత విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమలే కాదు ఒకటి, రెండు పవర్‌లూమ్‌లు నిర్వహిస్తున్న నేత కార్మికులపై కూడా దాని ప్రభావం పడింది. దానికి తోడు విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల పవర్‌లూమ్‌లు కుంటుపడ్డాయి. గడచిన దశాబ్దకాలంగా రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్ వినియోగం బాగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్భ్రావృద్ధికి పరిశ్రమలు కీలకం. ఈ రంగంలో విద్యుత్ వినియోగం ప్రయోజనకరమే. పదేళ్ల కిందట ఏడువేల మిలియన్ యూనిట్లున్న వినియోగం ఇప్పుడు 20వేల మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయినప్పటికీ మొత్తం విద్యుత్ వినియోగంలో పరిశ్రమల వాటా ముప్పై శాతానికి మించడం లేదు. అదే పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగే గుజరాత్ పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం 40 శాతం వరకు ఉంది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అంతే. పరిశ్రమలతో పాటు రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లకు వారానికి మూడు రోజులు లేదా నెలకు ఎనిమిది రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక పౌల్ట్రీ, రైస్‌మిల్లులు, కోల్డ్‌స్టోరేజీలకు 40శాతం విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. వ్యవసాయం, సింగరేణి, తాగునీరు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే ట్రాక్షన్, డిఫెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే అధికారికంగా కోతలు విధించిన సమయాల్లోనూ కొన్ని ప్రాంతాలలో కిందిస్థాయి సిబ్బంది సహాయ సహకారాలతో విద్యుత్ చౌర్యం జరుగుతోంది. ఇది విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది.
రాష్ట్రప్రజలు అటు కరెంటు కోతలకు, ఇటు ప్రభుత్వాల వాతలకు అలవాటు పడ్డారు. డిస్కంలు తరచుగా పెంచుతున్న విద్యుత్ చార్జీలను భరిస్తూనే మరొకవైపు వినియోగదారులు ప్రతి సంవత్సరం కరెంట్ కోతలు తప్పవని గ్రహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా చాలామంది వినియోగదారులు ఇప్పటికే ఇన్వర్టర్లను కొనుగోలుచేసి బిగించేసుకున్నారు. గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో ‘బీహార్ తరహా పద్ధతి’లో సిటీ జనరేటర్ వ్యవస్థ జోరుగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు సొంతంగా డీజిల్ జనరేటర్లు పెట్టుకుని, వాటి ద్వారా ఇళ్లు, దుకాణాలకు కేబుల్ టీవీ కనెక్షన్లు ఇచ్చినట్లు కరెంట్ కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. బీహార్‌లోని చాలా గ్రామాల్లో కరెంట్ సరఫరా సరిగా ఉండదు. వీధిలో ఎవరైన ఓ మోతుబరి జనరేటర్ ఏర్పాటు చేసుకుని వీధిలోని వారందరికీ కరెంట్ ఇస్తుంటాడు. అందుకు వారు నెలకు ఇంత అని ఇస్తుంటారు. ఇప్పుడు గోదావరి జిల్లావాసులు ఆ పద్ధతికి అలవాటు పడుతున్నారు. ఈ రకంగా ప్రైవేట్ ఆపరేటర్లు , తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వాహకులు జనరేటర్లను నడపడం కోసం పెద్ద మొత్తంలో డీజిల్ కొని దేశంలో డీజిల్ వినియోగాన్ని పెంచుతున్నారు.
అధికారం ఉన్నవారిది లేదా అధికారంలో ఉన్నవారిని మెప్పించి పనులు చేయించుకోగలవారిదే రాజ్యం. రాష్ట్రానికి కేంద్రంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులు చేతులు ముడుచుకు కూర్చోవడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల మంత్రులు ఆయా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు. మన మంత్రులు మాత్రం అదేదో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ఇతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు తమ సొంత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. కేంద్రం వద్ద గ్రిడ్ పరిధిలో ఉండే విద్యుత్ నుంచి రాష్ట్రానికి వచ్చే విద్యుత్తుకు కోతపెట్టిన కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి వేణుగోపాల్ 100 మెగావాట్లు తన సొంతరాష్ట్రం కేరళకు తరలించుకుపోతున్నారు. గత సంవత్సరం కేంద్ర గ్రిడ్ నుంచి దక్షిణాదికి ఇచ్చే విద్యుత్‌లో రాష్ట్రం 150 మెగావాట్లు పొందగా ఈ సారి అది బాగా తగ్గిపోయింది. ఈ విధంగా గ్రిడ్ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా మొన్నీమధ్య జరిగినట్లు దేశమంతా చీకటిమయం అవుతుంది. గ్రిడ్ పరిధిలోని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ను వాడుకోవడం వల్ల వ్యవస్థ విఫలమైంది. గ్రిడ్ పరిధిలో ఎనిమిది రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నా ప్రధానంగా మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ను ఉపయోగించుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.
రాష్ట్రంలో బొగ్గుతో పాటు గ్యాస్ నిల్వలుండటం సానుకూలాంశం. ప్రస్తుతం 2760 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. వీటికి 12.97 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అవసరం కాగా కేంద్రం 9.75 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ మాత్రమే కేటాయించింది. కానీ ఇప్పుడు కేటాయించిన గ్యాస్‌లో కేవలం 32శాతం మాత్రమే సరఫరా అవుతోంది. ఫలితంగా 1,200 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కొత్తగా ప్రైవేటురంగంలో 3,300 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. వీటితో కలిపి మొత్తం 8,185 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం 2,900 మెగావాట్ల ప్రాజెక్టులకు సిఫార్సు చేసింది. కరీంనగర్, శంకర్‌పల్లి ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. అన్నీ కలిపితే 70 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అవసరం. ఇందులో సగం వాస్తవరూపంలోకి వచ్చినా రాష్ట్రం మిగులు విద్యుత్ సాధిస్తుంది. రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన సంస్థ ఎపిజెన్‌కో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు ఏళ్లతరబడి వెలుగుచూడటం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉందని స్వయంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో జరిగిన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2770 మెగావాట్లు ఉన్నా గ్యాస్ కొరత కారణంగా 1600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం వృథా అవుతోందని, గ్యాస్ సరఫరా లేక 4వేల మెగావాట్ల విద్యుత్ ఆగిపోయిందని చెప్పారు. దాదాపు 22వేల కోట్ల పెట్టుబడి వృథా అయ్యింది. ఢిల్లీ సమావేశంలో మంత్రి ఏకరువు పెట్టిన సమస్యల, కోర్కెల చిట్టా పరిశీలిస్తే పరిస్థితికి కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేటాయింపుల్లో అవకతవకలు, విద్యుత్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రుల పక్షపాత ధోరణి అని అర్థమవుతోంది.
హర్యానాలోని ఎన్‌టిపిసి జజ్జర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న 131 మెగావాట్ల విద్యుత్‌కు తోడుగా కేరళకు తరలివెళ్తున్న 100 మెగావాట్ల విద్యుత్ కూడా మనకి వచ్చినట్లయితే కొరత కొంతవరకు తీరుతుంది. ప్రస్తుతం కొన్ని ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కంటే విద్యుత్ లోటు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత 13 నుంచి 15శాతం మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌లోటు సగటున 13.6 శాతం నమోదు కాగా తమిళనాడులో 14.9శాతం, ఉత్తరప్రదేశ్‌లో 14.3శాతం, బీహార్‌లో 14.1శాతం లోటు నమోదైంది. విద్యుత్ పంపిణీలో నష్టాలు కూడా ఈ లోటుకు కారణం. జాతీయ స్థాయిలో విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు 26-27శాతం ఉన్నాయని ఈ నెల మొదటివారంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీరప్ప మొయిలీ అన్నారు. విద్యుత్ వినియోగం క్రమశిక్షణతో కూడుకున్న వ్యవహారం. ఏ ఒక్కరు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినా అందరూ ఇబ్బంది పడాల్సిందే. విద్యుత్ ఉత్పాదనను పెంచుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు - అవసరాలకోసం పరిమితికి మించి ఇష్టానుసారం విద్యుత్తును ఉపయోగించుకుంటున్న ఫలితమే ఇటీవల విద్యుత్ గ్రిడ్‌లు విఫలం కావడం.
ప్రధాని జోక్యం
విద్యుత్ శాఖ నుంచి హోం శాఖకు బదిలీ అయివెళ్తున్న సుశీల్‌కుమార్ షిండే గ్యాస్ కోతతో రాష్ట్రానికి పెట్టిన వాతనుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తాత్కాలికంగా ఉపశమనం కలిగించారు. 2008లో కెజి బేసిన్‌లో పూర్తిస్థాయిలో గ్యాస్ ఉత్పత్తి అవుతున్న సమయంలో కేంద్ర గ్యాస్ మంత్రిత్వ శాఖ నియమించిన మంత్రివర్గ సాధికారిక కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డంపెట్టుకుని షిండే ఈ ఆదేశాలు జారీచేసినట్లు చెప్తున్నారు. 2012-13 నాటికి కెజి బేసిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుందని అప్పట్లో చేసిన అంచనా ఆధారంగా రత్నగిరి ప్రాజెక్టుకు కొంత గ్యాస్ కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసింది. కానీ పరిస్థితిలో మార్పు వచ్చింది. కెజి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి పడిపోయింది. రాష్ట్రానికి ఇస్తున్న గ్యాస్‌ను మళ్లించారు. ఈ విషయం ముందుగా తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిర్ణయం అమలులోకి వచ్చాక ప్రధానమంత్రిని కలిసి మంత్రి జారీచేసిన ఉత్తర్వులను తక్షణం నిలుపుచేసేలా చేశారు. రత్నగిరికి మన రాష్ట్రం వాటా నుంచి గ్యాస్ మళ్లించడం తాత్కాలికంగా నిలిపివేసినా ఆ ప్లాంట్‌కు ఇచ్చిన రసాయన ఎరువుల కంపెనీ హోదా వల్ల మనకు భవిష్యత్‌లో ముప్పు వచ్చే అవకాశం ఉందన్నది విద్యుత్‌రంగ నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఇస్తున్న 3.48 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌తో నెలలో తొమ్మిది రోజులు గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు పనిచేయగలవు. ఆ కేటాయింపును 6 యూనిట్లకు పెంచితేనే రాష్ట్రానికి విద్యుత్ కొరత నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ధరల భారం
గత ఏడాదిలో మన రాష్ట్రంతో పాటు 19 రాష్ట్రాలు విద్యుత్ చార్జీలను భారీగా పెంచాయి. చార్జీల పెంపుదల సుమారు 37 శాతం ఉంది. అలాఅని విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా అంటే అదీ లేదు. విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు సుశీల్‌కుమార్ షిండే సూచించిన విధంగా ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచేందుకు వేచి ఉండకుండా ఇంధన వ్యయ సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఎ) పేరిట అదనపు చార్జీలను వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి. దానివల్ల వినియోగదారులపైన 5వేల కోట్ల మేర భారం పడుతోంది. అయితే విద్యుత్ సంస్థలకు ఆదాయ లోటు 11వేల కోట్లు ఉండగా దానిలో రూ.6వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో చిన్నతరహా పరిశ్రమలు రెండు నెలలకు గాను రూ.200 కోట్లు చెల్లించలేమంటే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించిందని ఆయన అన్నారు. అసలు చార్జీలతో పోలిస్తే సర్‌చార్జీలు ఎక్కువని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో బొగ్గు, గ్యాస్ ధరలో పెరుగుదల కేవలం 10 నుంచి 15శాతం మాత్రమే ఉంటే సర్‌చార్జి భారం 50 నుంచి 80 శాతం ఎలా ఉంటుందని నిపుణులు విద్యుత్ నియంత్రణ కమిషన్ ఎదుట డిస్కంలను నిలదీశారు. ఒకేసారి మూడేళ్ల సర్‌చార్జ్‌లు వసూలు చేస్తే అసలు చార్జీలను మించిపోతాయన్నారు. సర్‌చార్జ్‌లను ప్రభుత్వమే భరించాలని నిపుణులు సూచించారు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా పట్నవాసుల్ని, పల్లెప్రజల్ని ఒకగాటన కట్టి సర్‌చార్జి వసూలు చేస్తున్నారు. వ్యవసాయానికి వాడుకున్న విద్యుత్‌పై పడుతున్న సర్‌చార్జీలను సాధారణ వినియోగదారులపై వేయడాన్ని వారు తప్పుపట్టారు. ‘నెలకు 10 యూనిట్లు మాత్రమే వాడుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి వినియోగదారులు కనీస చార్జీ కింద రూ.50 చెల్లిస్తారు. అంటే యూనిట్‌కి రూ.5 చొప్పున పడుతోంది. సాధారణంగా మొదటి 50లోపు యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 మాత్రమే చార్జీ అంటే యూనిట్‌కు రూ.3.55 అదనంగా చెల్లించారు. అది చాలదన్నట్లు సర్‌చార్జ్ వేయడం ఏం న్యాయం?’ అని విద్యుత్ నియంత్రణ కమిషన్ బహిరంగ విచారణకు హాజరైన వారు ప్రశ్నించారు.
పెరుగుతున్న డిమాండ్
జనం అవసరాలకు ప్రతి ఏటా విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఏటా పది శాతం వంతున డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2005-06లో రాష్ట్ర అవసరాలకోసం వినియోగానికి 8,239 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 2011-12 నాటికి 13,663 మెగావాట్లకు పెరిగింది. డిమాండ్‌కు తగిన విధంగా ప్రతియేటా సరఫరాను పెంచుకుంటూ పోయినప్పటికీ 2012 మార్చిలో పీక్ డిమాండ్ ఉన్నప్పుడు జరిగిన సరఫరా డిమాండ్ కన్నా 2300 మెగావాట్లు తక్కువగా ఉంది. అంటే గడచిన ఆరేళ్ల కాలంలో అధికారంలో ఉన్న పాలకులు, అధికారులు కాస్త ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ సరఫరా లోటును అధిగమించడం అసాధ్యంగా మారేది కాదు. జెన్‌కో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టుల్లో కొన్నింటింని టెండరు దశలోనే నిలిపివేశారు. మరికొన్ని వనరుల కొరత వల్ల, ఇంకా కొన్ని బొగ్గు, నీరు లభ్యత లేదని పక్కనపెట్టారు. దాంతో అవి ప్రభుత్వం వారి దస్తాల్లోనే మూలుగుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే తోక జాడిస్తున్నాయి. గ్యాస్ ధరను పెంచాలని రిలయెన్స్ గత కొంతకాలంగా కేంద్రంపై వత్తిడి తెస్తోంది. అందువల్ల సమీప భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచకతప్పదని నిపుణులు చెప్తున్నారు. అప్పుడు విద్యుదుత్పత్తి వ్యయం, యూనిట్ ధర పెరగక తప్పదు. ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులకు సరైన నిర్మాణ కంపెనీలను ఎంపిక చేసుకోకపోవడం కూడా జాప్యానికి దారితీస్తోంది. నిర్మాణ కంపెనీల నిర్లక్ష్యానికి తోడు జెన్‌కో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణం.
గడచిన ఐదేళ్లలో విద్యుత్ లోటు 1494మిలియన్ యూనిట్ల నుంచి 5795 యూనిట్లకు పెరిగింది. విద్యుత్ డిమాండ్ 44శాతం పెరగడం దానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ రంగంలో లోటుపాట్లను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం మంచి పరిణామం. అయితే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రభుత్వం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు చేయాలి. విద్యుత్ గ్రిడ్‌లను పటిష్టం చేయడంతో పాటు సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. అన్నింటికన్నా ముందు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు విద్యుత్‌ను ఆదాచేసేందుకు కలసికట్టుగా కృషిచేయాలి. విద్యుత్ ఉత్పత్తిలో, పంపిణీలో, వినియోగంలో సమూల మార్పులు రానంతవరకు పరిస్థితిలో మార్పును ఆశించలేం.
*
రత్నగిరి గొప్పేమిటి?
రత్నగిరి ప్రాజెక్టు కేటాయింపులకు 2008లో బీజం పడింది. 2008లో ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల సాధికారక కమిటీ గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యతలను నిర్ణయించింది. అందులో భాగంగానే రత్నగిరి పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయించడంలో పెట్టిన మెలికవల్లే ఇప్పుడు సమస్య ఉత్పన్నమైంది. గ్యాస్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఎరువుల తయారీ యూనిట్లకు, రెండో ప్రాధాన్యత వంటగ్యాస్‌కు, మూడో ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఇచ్చారు. రత్నగిరి నిజానికి విద్యుత్ ప్లాంట్ అయినా ఎరువుల ప్లాంట్ హోదా కల్పించి గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. రత్నగిరి ప్లాంట్‌కు ఎరువుల ప్లాంట్‌తో సమానంగా ప్రాధాన్యత ఇచ్చి గ్యాస్ సరఫరా చేయాలని అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. కానీ ఇప్పుడది అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. కెజి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో మన వాటాకింద రావాల్సిన గ్యాస్ వాటా తగ్గింది. 80 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాల్సిన రిలయెన్స్ కేవలం 51మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రత్నగిరి నుంచి వత్తిడి పెరిగినా గత 11 నెలలుగా కేంద్రం దానిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు 3.48 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి బాగా తగ్గి వత్తిడి ఎక్కువ కావడంతో కేటాయింపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెంటుకన్నా కరెంటు చార్జీ ఎక్కువ
రాజధాని నగరంలోని కొన్ని ప్రాంతాలలో సర్‌చార్జీలతో కలిపి అద్దెకన్నా కరెంటు చార్జీ ఎక్కువవుతోంది. అసలే అరకొర ఉపాధితో బతుకీడుస్తున్న బడుగుజీవులు ఈ భారాన్ని మోయలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి రాజధాని చుట్టుపక్కల నివసించే వారు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన డిస్కంలకు ప్రభుత్వం పదివేల కోట్లకు పైగా బకాయి పడింది. దీనిలో దాదాపు రూ.6400కోట్లు 2009 ఎన్నికల సందర్భంగా అదనంగా కొనుగోలు చేసిన విద్యుత్‌కే ఇవ్వాలి. ఆ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గాని, ఆయన తరువాత గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు గాని పట్టించుకోలేదు. లెక్కకు రాని విద్యుత్ అంతా సేద్యానికి వాడుతున్నారనే వాదన ఉంది. అంటే తెలంగాణకు చెందిన ఒక జిల్లాలో బిల్లుల లెక్కకు వస్తున్న విద్యుత్ 35శాతం, 15శాతం పంపిణీ నష్టాలను కలిపినట్లయితే అది దాదాపు 50శాతం అవుతుంది. అంటే మిగిలిన సగం సేద్యానికి వాడుతున్నారని అనుకోవాలి. వాస్తవంగా చూస్తే పరిస్థితి అలా లేదు. కావలసినంత విద్యుత్ సరఫరా కావడం లేదని, రాత్రుళ్లు పొలంవద్ద ఉండి సేద్యానికి నీరు పంప్ చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక చోట్ల సబ్ స్టేషన్లను ముట్టడించినట్లు , అధికారులను నిర్బంధించినట్లు వార్తలు వస్తున్నాయి.

Sunday, 21 October 2012

విశ్వానికి అంతం లేదా?


  • ఎందుకని? ఇందుకని!
దేనికైనా అంతం ఉంది. మరి విశ్వానికీ అంతం ఉండాలి కదా?
- బి.శ్రీనివాస్‌, పరదేశమపేట, జగన్నాయక్‌పుర, కాకినాడ, తూ.గో.జిల్లా
పదార్థాల రూపానికి శాశ్వతత్వం లేదు. ఎందుకంటే పదార్థాల్లో మార్పు సహజం. అది అనివార్యం. అంటే పదార్థాల గుణగణా లకే అంతం ఉందిగానీ పదార్థానికే అంతం ఉంది అనుకోకూడదు. పదార్థానికి అంతం ఎపుడూ లేదు. శక్తి కూడా పదార్థ రూపమే. విశ్వం మొత్తం పదార్థ రూపమే. కాబట్టి విశ్వానికి ఆది, అంతం రెండూ ఉండవు. అది ఎపుడూ ఉంది. ఎల్లపుడూ ఉంటుంది. కానీ అనునిత్యం, అనుక్షణం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆకాశంలో రెండు మేఘా లున్నాయి. అందులో మొత్తం 10 లీటర్ల నీరు, రెండు గ్రాముల దుమ్మూ ధూళి ఉన్నాయనుకొందాం. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఆ రెండు మేఘాలు, వర్షంలా కురిశాయి. అంటే మేఘాలు ఇపుడు లేవు. కాబట్టి మీరన్న అర్థంలో మేఘాలు అంతరించాయి. కానీ మేఘాల్లో ఉన్న 10 లీటర్ల నీరు, రెండుగ్రాముల ధూళి మేఘ రూపంలో నుంచి మురికి వర్షపునీరుగా భూమ్మీద పడ్డాయి. ఆ మురికినీటిలో 10 లీటర్ల నీరు, అందులో ఆ రెండు గ్రాముల ధూళి కలిసే ఉన్నాయి. కాబట్టి మేఘాలలో ఉన్న పదార్థాలు నాశనం కాలేదు కదా? ప్రధానంగా జీవులు పుట్టడాన్ని, మరణించడాన్ని 'పుట్టిన ప్రతిదీ గతించక మానదు. గతించిన ప్రతిదీ తిరిగి పుట్టక మానదు' అన్న తాత్విక దృష్టిలో మీరు విశ్వాన్ని ప్రశ్నించినట్లున్నారు. నా ఉదాహరణనే తీసుకుందాం. నేను 1956, జులై 2వ తేదీన పుట్టాను. కానీ అది సమాజానికి ఓ పుట్టినతేదీగా గుర్తించడానికి తల్లి గర్భం నుంచి బయటపడ్డ ఓ ఘట్టాన్ని (incidence of delivery) పుట్టిన తేదీ, సమయంగా భావిస్తున్నారు. కానీ నారూపం ఆరోజుకు ముందు కూడా ఉంది. అయితే నా తల్లి గర్భంలో ఉంది. అంటే 1956 జూన్‌ 2వ తేదీకి ముందే నేను లేనా? ఎందుకు లేను? నా తల్లి గర్భంలో అరకేజీ తక్కువ బరువులో ఉన్నాను. అంతకుముందు 9 నెలల క్రితం ఎక్కడ ఉన్నాను? ఇంకా సూక్ష్మ రూపంలో సంయుక్త జీవకణం (zygote) రూపంలో ఉన్నాను. అపుడే 'నేను' అన్న భావానికి అర్థం, రూపం నిర్దేశించబడ్డాయి. కానీ అర్థాన్ని, ఆ రూపాన్ని శాసించే చిహ్నాలు (code) నా తల్లి అండం (egg), నా తండ్రి శుక్ర కణం (sperm) లలో ముందే దాగున్నాయి. ఆ చిహ్నాలకు, జన్యుస్మృతికి విరుద్ధంగా నా సూక్ష్మరూప సంయుక్తకణం ఉండదు. మరి ఆ అండానికి, శుక్రకణానికీ ఆధారం ఎవరు? ఇలా వెనక్కి వెళ్లితే ఈ భూమ్మీద జీవావిర్భావం వరకూ వెళ్లవచ్చును. కాబట్టి నా జన్మ తేదీ కేవలం సాపేక్షమే (relative) గానీ ఓ పదార్థ నూతన ఆరంభం కాదు. నా శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి కణంలోని ప్రతి అణువు, ప్రతి అణువులోని ప్రతి పరమాణువు, ప్రతి పరమాణువులో ఉన్న ప్రతి ప్రాథమిక కణం ఈ విశ్వంలో నుంచే నా రూపంలోని ఓ సందర్భంలో ఓ చిరు గుణాత్మక మార్పు ద్వారా రామచంద్రయ్య అనే సంయుక్త జీవకణం ఏర్పడింది. అది నా తల్లి నుంచి వచ్చిన పోషక పదార్థాల్ని వాడుకుంటూ కణవిభజన చెంది, జన్యుస్మృతి (genetic code) ప్రకారం 4 కేజీల బరువున్న మగపిల్లాడిగా ఆ రోజు జన్మిం చింది. పుట్టిన తర్వాత భూవాతావరణంలో ఉన్న గాలిని, తల్లిపాలను, ఆ తర్వాత రైతుల శ్రమతో పండిన వరిగింజ ల్లోని ఆహారపదార్థాలు, పప్పుదినుసులు, నూనెలు, మాం సం, చేపలు, నీరు సేవిస్తూ 4 కేజీల నుంచి 80 కేజీల య్యాను. సమాజంలో తిరగడం వల్ల భాష, ప్రకృతి జ్ఞానం, ప్రజాశక్తికి వ్యాసం రాయగల కనీసపు ఆలోచనలు సిద్ధించాయి. మరికొన్నేళ్ల తర్వాత ఈ శరీరంలో ఇప్పటి లాగే సజావుగా జీవప్రక్రియలు (physiological processes) కొనసాగలేవు. అందులో కొన్ని మొరా యిస్తాయి. లేదా ఎప్పుడూ మనకన్నా ముందే ఈ భూమ్మీ ద పుట్టిన సూక్ష్మజీవులు నా మీద దాడిచేసి లేనిపోని మాయరోగాలు నాకు వచ్చేలా చేస్తాయి. లేదా ఏదైనా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల నామీద కాల్పులు జరగ వచ్చును లేదా నా జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ దొంగ లించడం కోసం అమెరికా సంస్కృతిని వంటబట్టించు కొన్న ఓ మందుబాబు నన్ను తుపాకీతో పేల్చ వచ్చును. మొత్తం మీద మరణం ఏదోవిధంగా వస్తుంది. ఈ మరణం రామచంద్రయ్యలోని పదా ర్థానికి కాదు. అది ఏదైనా వైద్యకళాశాలలో విద్యార్థుల ప్రయోగాలకు సమకూరే మృతదేహంగా ఉపయోగ పడుతూ ఉంటుంది. శస్త్రచికిత్స ప్రయోగాల్లో ముక్కలైన దేహభాగాల్ని వైద్యకళాశాల వారు దహనం చేస్తే అది మంట (combustion) అనే రసాయనిక ప్రక్రియ ద్వారా CO2, H2O, NO2, P2O5, Ca3 (PO4)2, CaSO4, NaCl,….వంటి పలురకాల ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా మారి భూ పదార్థాల సంచయంలోకి శోషించుకుంటుంది. కాబట్టి పుట్టినపుడున్న పదార్థాలు, మరణానంతర పదార్థాలు, పెరుగు తున్న క్రమంలో వాడుకున్న పదార్థాలు, పెరుగుతున్న క్రమంలో మల మూత్రాదులు, చెమట, నిశ్వాసాలు తదితర ప్రక్రియల్లో విసర్జించిన పదా ర్థాలు అన్నీ ఈ విశాల విశ్వంలో అటూయిటూ గుణాత్మకంగా ఓ నియమా నుసారం మారే ప్రక్రియల్లో అంతర్భాగాలే అన్న విషయం మనం గుర్తుం చుకోవాలి. ఇదే ఉదాహరణ మీకు, అందరికి, ప్రతి చెట్టుకు, ప్రతి వస్తువు కు మనం ఆపాదించాలి. ఉన్నట్టుండి శూన్యం నుంచి భూమి పుట్టలేదు. కొందరు ఛాందసవాదులు, మతతత్వవాదులు శూన్యం నుంచి దేవుడనే ఓ పెద్ద సృష్టికర్త ఆదేశం నుంచి విశ్వం పుట్టిందంటారు. ఆ వాదన శాస్త్ర పరీక్షకు నిల్వదు. అలాగే ఈ సృష్టికి విలయం (annihilation) ఉంటుం దనీ, ఏదో ఒకరోజు ఆ లోకనాటకుడు, చిద్విలాసుడు, జగన్నాటక సూత్ర ధారి సరదాగా మనం కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేసినట్లుగా ఈ విశ్వాన్ని తన లోకి గుటకాయ స్వాహా చేస్తాడనీ అదే విశ్వానికి అంతమనీ, అది మరెంతో దూరంలో లేదనీ లేనిపోని ఆందోళనను ఇతరులకు కలిగిస్తారు. అదీ జరిగేదేమీ కాదు. ఈ విశ్వం ఎపుడూ ఉంది, ఎల్లపుడూ ఉంటుంది. ఈ విశ్వం లో ఉన్న పదార్థం పలురూపాల్లో ఉంది. గతితార్కికంగా రూపాలు, గుణాలు మార్చుకుంటూ పదార్థ, ప్రదేశ, కాలాల్ని (matter, space, time) తనలో మమేకం చేసుకుంటుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

సముద్ర.. తీర.. జీవవైవిధ్యం.. పరిరక్షణ..


భూగోళ ఉపరితలంలో 70% పైగా విస్తీర్ణాన్ని సముద్రాలే ఆక్రమిస్తున్నాయి. నాలుగు కిలోమీటర్ల లోతు వరకూ జీవులు జీవించగలుగుతున్నాయి. సముద్రాలు ఇంత విస్తృతంగా వున్నప్పటికీ భూగోళంలో వుండే జీవవైవిధ్యంలో దాదాపు 20% మాత్రమే వీటిలో వుంటుంది. కానీ, భూభాగంలోని జీవవైవిధ్యం, దాని కొనసాగింపులో సముద్రాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా మనం పీల్చుకునే ఆక్సిజన్‌లో దాదాపు మూడోవంతు సముద్రజీవుల నుండే లభిస్తుంది. భూ భాగంలోని అన్ని వృక్ష, జంతు జీవులకన్నా 15 రెట్లు అధిక కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు నిక్షిప్తం చేస్తున్నాయి. సముద్రజీవులు (చేపలు, పీతలు, రొయ్యలు తదితరాలు) మనకు ఆహారంగా ఉపయోగపడుతూ ప్రొటీన్లను సరఫరా చేస్తున్నాయి. భూగోళంపై వాతా వరణమార్పుల హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తూ ఒకమేర మాత్రమే మారేలా చేస్తున్నాయి. ఇంత ప్రాముఖ్యతగల జీవావరణ వ్యవస్థలో 34 అకశేరుకాల వర్గాల్లో 32 సముద్ర, తీర జీవావరణంలోనే నివసిస్తున్నాయి. ఈ జీవావరణంలో ఐదు లక్షల నుండి కోటి సముద్రజాతులు వున్నట్లు అంచనా. సముద్రంలో అతిగా చేపల్ని పట్టడం, కాలుష్యం సముద్ర జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భూగోళ జీవవైవిధ్యం కూడా అస్థిరత్వానికి గురవుతుంది. వీటి పరిరక్షణపై ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కార్యక్రమాలను రూపొందిస్తుంది. వీటిని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

సముద్రగర్భంలో, తీరాల్లో కొన్ని జీవులు వుంటుండగా, తీరప్రాంతంలో మరి కొన్ని వుంటున్నాయి. మడ (తీరప్రాంత) అడవులు, పగడపు దిబ్బలు (కోరల్‌రీఫ్స్‌), సముద్రగడ్డి దొంతరలు (బెడ్స్‌), నదులు సముద్రంలో కలిసేచోట ఏర్పడే దీవులు (ఎస్చ్యూరీస్‌), ఉష్ణజలీకరణ ప్రాంతాల వద్ద, సముద్ర పర్వతాలు, సముద్ర అడుగు భాగంలో జమకూడే మెత్తని అవక్షేపాలు (సాఫ్ట్‌ సెడిమెంట్స్‌) ఇవన్నీ... సముద్ర జీవవైవిధ్యానికి నిలయాలు. సముద్ర జీవావరణంలో వైవిధ్య, నివాస ప్రాంతాలు వున్నాయి. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా గుర్తిస్తున్నారు. వీటిలో నీరు ఒకటి కాగా, సముద్ర అడుగుభాగం రెండోది. నీటి జీవావరణాన్ని 'పెలాజిక్‌ హాబిటాట్‌'గా వ్యవహరిస్తున్నారు. సముద్రం అడుగుభాగాన వున్న జీవావరణాన్ని 'బెంతిన్‌ హాబిటాట్‌'గా వ్యవహరిస్తున్నారు.
నీటి జీవావరణం..
నీటిలోని నివాసస్థలాన్ని లోతు ఆధారంగా మూడు మండలాలుగా గుర్తించారు. అవి: సూర్యరశ్మి ప్రసరణ జరిగే 100 మీటర్ల లోతు వరకూ ఒకటో మండలం. అయితే, బురద ఎక్కువగా వుండే సముద్రాల్లో ఈ మండలం మీటరు లోతుకే పరిమితమవుతుంది. ఈ పలచని మండలంలో మొక్కజాతులు కిరణజన్య సంయోగక్రియతో తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారుచేసుకుం టాయి. ఈ మండల న్ని 'యు ఫోటిక్‌ మండలం'గా పిలుస్తారు. ఈ మండలం కింద 2000 మీటర్ల లోతు వరకూ సూర్యరశ్మి ప్రసరించదు. దీనిలో జంతువులే ప్రధానంగా వుంటాయి. ఇది రెండోది. దీన్ని 'బాతైల్‌ మండలం'గా పిలుస్తారు. దీనికింద ఆరువేల మీటర్ల వరకూ చిమ్మచీకటితో కూడి వుండేది మూడోది. దీన్ని 'ఎబిస్సిమల్‌ మండలం'గా పిలుస్తారు. వీటన్నింటికీ అడుగుభాగంలో రసాయనాల మడ్డి, వృక్ష, జంతు అవశేషాలు తదితరాలు వుంటాయి. వీటిలో పదింట తొమ్మిది వంతుల సముద్ర జీవరాశులు నివసిస్తాయి. సముద్ర, తీర జీవవైవిధ్య పరిరక్షణకు తీరప్రాం తాల్లో నివసించే ప్రజల భాగస్వామ్యం ఎంతైనా వుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన పరిరక్షణ కార్యక్రమాల్ని అమలుచేయాల్సి వుంటుంది.
ప్లాంక్‌టన్‌ (పాచి)..
అన్ని సముద్రజీవుల ఆహారానికి మూలం ఈ పాచి. వృక్షజాతికి సంబంధించిన (ఫైటో ప్లాంక్‌టన్‌) 'డై ఆటం ముఖ్యమైనది. ఇది చిన్న చిన్న జంతువులకు (జూ ప్లాంక్‌టన్‌) ఆహారం. లార్వా, ష్రింప్స్‌ (రొయ్య పిల్లలు), క్రాబ్స్‌ (పీతలు)
జూ ప్లాంక్‌టన్‌ కిందకు వస్తాయి. సంయుక్తంగా ఇవి ఎన్నో చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ చిన్న చేపలు పెద్ద చేపలకు, సముద్ర క్షీరదాలకు ఆహారం.
అస్థిరత్వం ఎక్కడ నుండి..?
భూభాగం నుండి సముద్రానికి చేరుతున్న కాలుష్యం అస్థిరత్వానికి దోహదపడుతుంది. ప్రధానంగా ముడి చమురు, ఓడల్లో నుండి వచ్చే మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కాలుష్య కారకాలు. సముద్రంలోకి చేరుతున్న వృక్ష పోషకాలు ప్లాంక్‌టన్‌, ఇతర జీవుల పెరుగుదలకు దోహదపడతాయి. పెరిగిన వృక్ష, జంతుజీవాలతో ఇది చిక్కగా కనిపిస్తుంది. దీన్నే 'యూట్రిఫికేషన్‌'గా పిలుస్తున్నారు.
* అతిగా చేపలు పట్టడం. నాశనం కలిగించే విధంగా చేపల్ని పట్టడం, చట్ట వ్యతిరేకంగా దొంగతనంగా చేపల్ని పట్టడం, నియంత్రణ లేని చేపలు వేట.ఇవన్నీ చేపల పెరుగుదలకు ఆటంకం. ఇపుడు 60 కిలోమీటర్ల వరకూ విస్తరించే వలలు వచ్చాయి. మామూలుగా ఏ చేపా ఈ వలల నుండి తప్పించుకోలేదు. దీనివల్ల కొన్ని దేశాల్లో ఈ వలలకు రంధ్రాల్ని ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు. ఫలితంగా చిన్న చేపలు, ఇతర జంతువులు తప్పించుకుని, కేవలం పెద్ద చేపలే వలకు చిక్కుతాయి. తప్పించుకొన్న చిన్న చేపలు పెద్దవై అధిక ఆహారాన్ని అందిస్తాయి.
* సముద్రంలో వుండే చేపలు, వేల్స్‌, ఇతర సముద్రజీవుల వేట ప్రమాదకరంగా మారుతుంది.
* భౌతిక నివాస స్థలమార్పులు చేయడం.
* బయటి జాతుల దాడి.
* భూగోళ వాతావరణమార్పులు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ చేపల నిల్వలో 70 శాతం ఇప్పటికే పట్టేశారు. ఫలితంగా చేపల సంఖ్య తగ్గిపోతుంది.
* పగడపు దిబ్బల (కోరల్‌ రీఫ్స్‌)లో 20 శాతం ఇప్పటికే అంతరించిపోయాయి. సమీపకాలంలో ఇవి పునరుజ్జీవం పొందే, పెరిగే అవకాశం కూడా లేవు. 1998లో సంభవించిన పగడపుదిబ్బలు బ్లీచింగ్‌ (రంగు కోల్పోవడం) వల్ల 16 శాతం అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత తీసుకున్న పరిరక్షణ చర్యల వల్ల 40 శాతం పునరుద్ధరించబడ్డాయి. కానీ, మానవ కార్యక్రమాల వల్ల 20 శాతం నశించిపోతున్నాయి.
పునరుద్ధరణ కృషి..
దీని లక్ష్యం సముద్రజీవుల్ని పరిరక్షిస్తూ సుస్థిర వినియోగానికి తోడ్పడడం. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించబడ్డాయి. ఈ సందర్భంలో తీర ప్రాంతంలో నివసించే ప్రజల సామాజిక అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకోబడుతున్నాయి. ముఖ్యంగా లోతైన సముద్రాల్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వం ఇపుడు అమలుచేస్తున్న జీవవైవిధ్య పరిరక్షణా కార్యక్రమాల్లో ముఖ్యాంశం. అతిగా చేపల్ని పట్టకుండా నియంత్రిస్తున్నారు. సముద్ర, తీర ప్రాంతాల సమన్వయ యాజమాన్యం మీద కేంద్రీకరిస్తూ తీసుకునే పరిరక్షణ చర్యలు వీటి వైవిధ్య పరిరక్షణకు దోహదపడతాయి. అయితే, నష్టపరిచే బయటిజాతులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చేపల పెరుగుదలకు ఆటంకం లేకుండా తీర ప్రాంతాల్లో ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 1 వరకూ వాటిని పట్టడం నిషేధించారు.
సముద్రతీరం..
సముద్రం భూభాగాన్ని కలిసేచోట ఇసుకతో కూడిన తీరాలు (బీచ్‌లు) ఏర్పడతాయి. అలల తాకిడికి రాళ్లూ రప్పలు పగిలి ఇసుక ఏర్పడుతుంది. ఈ తీర ప్రాంతంలో పోషకాలు అధికంగా వుం టాయి. నది నీటి ద్వారా కొట్టుకొచ్చిన పోషకాలు, అలలతో తీరానికి చేరి, పోషకాలు చేరతాయి. తీరం వెంబడి జీవించగలిగే జంతువులు, వృక్షాలు వీటిపై ఆధారపడతాయి. నిరంతరం ఎగిసిపడుతున్న అలలు, ఫలితంగా వస్తూ పోతున్న నీరు, ఇసుక, చిన్న చిన్న రాళ్లు పర్యావరణ పరిస్థితుల్ని నిత్యం మారుస్తుంటాయి. దీనికి ఆటుపోట్లు తోడుంటాయి. తీరం వెంబడి ఇసుక కింద వర్మ్స్‌, గవ్వ కలిగిన జీవాలు అధికంగా వుంటాయి. పైన వున్న ఇసుక సముద్రఆలల తాకిడి నుండి వీటిని రక్షిస్తుంది. మానవ దినచర్యలో భాగంగా ఇవి కూడా ప్రమాదంలో పడుతున్నాయి. కట్టడాల నిర్మాణం, చెత్తాచెదారాల్ని విసిరేయడం, ముడిచమురు పోయడం, పనికిరాని చమురుని కలిపేయడం, మురుగు వంటివి సముద్రంలో వదులుతున్నారు. ఫలితంగా ఈ తీరంవెంబడి జీవిస్తున్న పక్షులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఒక విధమైన సముద్ర తాబేళ్లు ఈ ఇసుకలో గుడ్లు పెడతాయి. కాలుష్యం, మానవ జీవనం వల్ల వీటి సంఖ్య బాగా తగ్గిపోతుంది.
మనదేశంలో..
మనదేశం దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి వుంది. దీని చుట్టూ సముద్రంలోకి 200 కిలోమీటర్ల దూరం వరకూ 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సము ద్రపు వనరుల్ని మనమే వినియోగించుకునే హక్కును కలిగి వున్నాం. అదనంగా అండమాన్‌, నికోబార్‌ దీవుల సమూహం చుట్టూ మరో 60 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని వినియోగించుకునే హక్కు కలిగి వున్నాం. చేపల ఉత్పత్తి మనకు గరిష్టంగా జూన్‌ నెలలో లభిస్తుంది. పశ్చిమ తీరప్రాంతంలో ఉత్పత్తి ఎక్కువ గా వుంటుంది. తూర్పుతీరంలో తక్కువగా వుంటుంది. కానీ, మడ అడవుల ప్రాంతం లో ఉత్పత్తి ఎక్కువగానే వుంటుంది. దక్షిణ తీరం కొనప్రాంతంలో చేపల ఉత్పత్తి అధి కంగా వుంటుంది. బంగాళాఖాతంలో కూడా చేపల ఉత్పత్తి ఎక్కువగా వుంటుంది.
పగడపు దిబ్బలు (కోరల్‌ రీఫ్స్‌)
సముద్ర జీవావరణ ప్రత్యేకత. వీటిని వెంటనే గుర్తించవచ్చు. ఇవి చేపలకు, జీవవ్యవస్థ కొనసాగింపుకూ కీలకం. అందువల్ల వీటి పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. సముద్ర అడుగుభాగంలో గల ఎత్తుపల్లాలు జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి.
తీరంలోని చిత్తడినేలలు..
మడ అడవులు ఉప్పునీరు కలిగిన ఉష్ణ తీర ప్రాంతాల్లో వుంటాయి. వీటి వేళ్లల్లో గాలిని పీల్చుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు వుంది. కొన్ని వేళ్లు గాల్లోకి పైకి పెరిగి, గాలిని పీల్చుకుంటాయి. ఇవి తీర ప్రాంతాల్ని తుపానులు, అలల నుండి రక్షిస్తాయి.
మీకు తెలుసా..?
* భారత ఫసిఫిక్‌ మహాసముద్రం గరిష్ట జీవవైవిధ్యం కలిగి వుంది. ఒక చదరపు మీటరులో వెయ్యిరకాల జాతులు వున్నట్లు గుర్తించారు.
* వేల్‌: భూగోళంలో అతి పెద్ద క్షీరదం. అందువల్ల ఇవి నీటిలో దీర్ఘకాలం వుండలేదు. మధ్య మధ్య పైకి వచ్చి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంది. ముక్కు ద్వారా గాలిని వదులుతుంది. ఆ సమయంలో నీరు ఉవ్వెత్తున పైకి లేస్తుంది.
* సముద్రంలో కందకాలూ వుంటాయి. అతి లోతైన కందకం ఫసిఫిక్‌ మహాసముద్రంలో 'మేరియానా ట్రెంచ్‌'. దీనిలోతు 11,034 మీటర్లు.

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (3)


'ఇక భూమి రకరకాల ధ్వనులు చేస్తుందట. వాటిలో ''హయేభ, వేణు వీణాబ్ది దుందుభి ధ్వని సంయుతా'' అని 'మయమతం' పేర్కొంటోంది. అంటే గుర్రము, ఏనుగు, వెదురు, వీణ, సముద్రము, భేరి ఈ ధ్వను చేసే భూమి శ్రేష్టమైందట. భూమి, గుర్రం ధ్వని, ఏనుగుల ధ్వని ఎలా చేస్తుందో నీకేమైనా అర్థమైందా?'' అని అడిగాను.
''అలాంటి ధ్వనులు చేసే భూమి ఎలా ఉంటుందో నాకర్థంకావడం లేదు'' అన్నాడు చంద్రమౌళి.
''భూమి ఆకారంతో ఎలా మంచి, చెడు కలుగుతుందో విను.''
''వ్యజనేవిత్తనాశస్యాత్‌'' అని 'రాజమార్తాండం' చెబుతోంది. అంటే 'విసనకర్ర ఆకారంగల భూమి ధననాశనమును కలగజేస్తుంద'ట. అలాగే 'విశ్వకర్మ ప్రకాశిక' ఏం చెబుతోందంటే 'సింహాభా సుగుణాన్‌ పుత్రాన్‌, వృషాభా పశువృద్ధిదా||' అంటే 'సింహాకారముగానున్న భూమి సుగుణవంతులగు పుత్రుల్ని కలిగిస్తుందట! ఎద్దు ఆకారముగా వున్న భూమి పశువృద్ధిని కల్గించును'' అని అర్థం. అలాగే
శ్లో|| సూకరోష్ట్రాజ సదృశీ ధనుః పరశురూపిణీ
కుచేలాన్మలిన్మార్భాన్‌ బ్రహ్మఘ్నాన్జనయేత్సుతాన్‌''
అని కూడ విశ్వకర్మ ప్రకాశిక చెబుతోంది. అంటే
''గృహము నిర్మించనున్న భూమి పంది, ఒంటె, మేక, బాణము, గండ్రగొడ్డలి ఆకారములలో ఏ ఆకారముగా వున్నా దరిద్రులు, మలినమైనవారు, మూర్ఖులు, బ్రహ్మహత్యాతత్పరులైన పుత్రులు కలుగుతారు'' అని అర్థం. భూమి సింహం, ఎద్దు, పంది, మేక.. వంటి ఆకారాలలో ఎలా ఉంటుంది? వీటిలో సింహం, ఎద్దు ఆకారాలు మంచివట. పంది, మేక ఆకారాలు చెడ్డవట! ఒక స్థలం ఎద్దు ఆకారంలో ఉందా? మేక ఆకారంలో ఉందా? అని తేడా ఎలా తెలుసుకుంటారు?' అని ప్రశ్నించాను.
చంద్రమౌళి సమాధానం మౌనమే.
''ఇంకో విషయం. వాస్తువాదులు గృహము నిర్మించనున్న స్థలములో ఏ దిక్కున, ఏ జంతువు ఎముకలుండేదీ, ఆ స్థలము దగ్గరకు పోకుండానే చెబుతారు తెలుసా?''
''అదెలా చెప్పగలరు?''
''అదే విచిత్రం! ఒక వ్యక్తి వాస్తువాది దగ్గరకు వెళ్ళి, తూర్పు దిక్కుగా కూర్చొని, 'అయ్యా! నేను ఇల్లు కట్టుకోబోతున్నాను. శంకుస్థాపనకు ముహూర్తం పెట్టండి!' అని అడిగాడనుకో. అతను అడిగిన ప్రశ్న ఏ అక్షరంతో ప్రారంభమయింది?''
''అ అనే అక్షరంతో'' అన్నాడు చంద్రమౌళి.
''దానిని గూర్చి'' జ్యోతిస్సంహితార్ణవం'' ఏంచెబుతోందో తెలుసా?
శ్లో|| అవర్గోచ్చారితే ప్రశ్నే ప్రాచ్యాందిశి సమాదిశేత్‌|
గోశల్యం వృషశల్యం స్యాద్ద్విహస్తాచ్చ ప్రమాణతః||
అంటే ''ప్రశ్న యొక్క మొదటి అక్షరం 'అ నుండి ఔ' అక్షరములలో ఒక అక్షరం అయితే ప్రశ్న వేసిన వ్యక్తి స్థలంలో తూర్పుదిక్కులో రెండు హస్తములలోతున ఆవు ఎముకలుగానీ, ఎద్దు ఎముకలుగానీ ఉంటాయి అని అర్థం.''
''అదేమిటి? గృహ నిర్మాత వేసే ప్రశ్న యొక్క మొదటి అక్షరం సహాయంతో అతని స్థలంలో రెండు అడుగుల లోతున ఉండే ఎముకలను కనుగొనడం ఎలా సాధ్యం? ఇది శాస్త్రీయంగా రుజువుపర్చలేని విషయం కదా?'' ఆశ్చర్యంతో అన్నాడు చంద్రమౌళి.
''అప్పుడే ఆశ్చర్యపోకు. ఇంకా విను. ''జ్యోతిస్సంహితార్ణవం'' ప్రకా రం ప్రశ్న మొదటి అక్షరం క, ఖ, గ, ఘ లలో ఒకటైతే, స్థలంలో ఆగేయ దిశలో ఒక హస్తం లోతున పిల్లి ఎముకలుగానీ, మేక ఎముకలుగానీ ఉంటాయట! అలాగే ఇతర అక్షరాలకీ వివిధ జంతువుల ఎముకలు ఉండటానికి సంబంధం ఉంటుందట! ఈ అధ్యాయం చివరలో ఏం చెప్పబడిందంటే.. ''బ్రహ్మోక్తత్వాన్న సంశయః'' అని. అంటే ఈశల్యోద్ధార ప్రకరణము ''బ్రహ్మదేవునిచే చెప్పబడినందున సంశ యములేదు' అని అర్థం. ఆ ప్రకారంగా తాముచెప్పే అనేక అసంబద్ధ విషయాలను దేవుళ్ళ పేర్లతో ముడి పెట్టడం తరచుగా జరుగుతోంది. ఇదీ మనం, సైన్సు వాదులం గమనించవలసిన విషయం.''
మరో విచిత్ర విషయం విను. ఇల్లు కట్టే వ్యక్తి వాస్తు వాదిని ప్రశ్నించేటప్పుడు తన శరీరంలో ఏ అవయ వాన్ని తాకితే లేక ఏ అవయవంలో దురదపుట్టి గోకితే ఏం లభిస్తుందో వాస్తు గ్రంథాలలో చెప్ప బడింది. ఆ విషయాలు విను. దానికంటే ముందు గృహం నిర్మించే స్థలంలో వాస్తు పురుషుడు ఎలా ఉంటాడో ఆ వివరం చెప్పబడింది. అది ముందుగా వివరిస్తాను.'' అని ఒక బొమ్మ చూపించాను.
(ఆ వివరాలు వచ్చేవారం)

స్మార్ట్‌ఫోన్‌ క్రెడిట్‌ కార్డ్‌..!


స్మార్ట్‌ఫోన్‌ని క్రెడిట్‌కార్డ్‌లా వాడగలిగే వీలు కలిగిస్తోంది కొత్త టెక్నాలజీ. మొబైల్‌ వాలెట్‌ అప్లికేషన్‌ అనేది ఇప్పుడు తాజాగా అభివృద్ధి చేసిన అప్లికేషన్‌. మాస్టర్‌కార్డ్‌, పే పాల్‌ వంటి దిగ్గజాలు ఈ తరహా అప్లికేషన్‌ను మొబైల్‌ఫోన్‌లపై అందిస్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న కార్డ్‌ స్వైపింగ్‌ పద్ధతి కాలహరణ చేస్తుందన్న ఉద్దేశం వ్యక్తమవుతోంది. అసలు ఎటువంటి మానవ సంబంధం లేకుండా భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు జరిగే దిశలో ఫోన్‌ క్రెడిట్‌కార్డ్‌లు అభివృద్ధి చెందనున్నాయి. రిటైల్‌ వర్తకులు ఫోన్‌పై వున్న బార్‌కోడ్‌ని స్కాన్‌ చేస్తే చాలు.. ఫోన్‌ అనుసంధానం జరిగి లావాదేవీ జరిగిపోతుంది. ఇది వినియోగదారులకి సౌకర్యమేగానీ అందరు వర్తకులకీ ఇది వర్తించకపోవచ్చు.

భూమి కంటే పెద్ద 'వజ్రం'..!


అంతరిక్షంలో మన భూమికంటే భారీ పరిమాణంలో మరో గ్రహం కనిపించింది. నిజానికి అది భూమికంటే రెండింతలు పెద్దది. విశేషమేమిటంటే, ఆ గ్రహం అధికశాతం వజ్రంతో నిర్మితమై ఉండటం. ఆ శిలా గ్రహం ఒక నక్షత్రం చుట్టూ అతి వేగంగా పరిభ్రమిస్తోంది. ఎంత వేగంగా అంటే, మన 18 గంటలు దానిపై ఒక సంవత్సరం అట! ఆ గ్రహానికి '55 షaఅషతీఱ వ' అని పేరు పెట్టారు. దానిపై ఉష్ణోగ్రతలు 1,648 సెల్సియస్‌ డిగ్రీల ప్రాంతంలో ఉంటాయి. ఆ గ్రహంలో అధికశాతం గ్రాఫైట్‌, వజ్రాలు వున్నాయి. మామూలుగా అయితే నీరు, గ్రానైట్స్‌ ఉంటాయి. ఇంతకు మునుపు కూడా కొన్ని వజ్ర గ్రహాలను గుర్తించారుగానీ ప్రస్తుత గ్రహమంత వివరాలు లభించలేదు.

పాటలు పాడే మూషికాలు..!


మగ ఎలుకలు ఆడ ఎలుకలను ఆకర్షించడానికి మానవుల్లా పాటలు పాడగలవని తెలిసింది. పైగా, పోటీ గనక వస్తే, పాటలో మార్పులు కూడా చేస్తాయట! కొన్ని దశాబ్దాల క్రితం ఎలుకలకి అసలు గాత్ర వెసులుబాటు ఉండదని భావించేవారు. కానీ ఇప్పుడు వాటికి గాత్రం ఉండటమే కాదు, దాన్ని మార్పు చేయడం, కొత్త బాణీలు నేర్చుకోవడం కూడా తెలుసునని నిరూపించబడింది. ఎలుకల మెదడులో ఉండే స్వర సంబంధిత మార్గాలు మానవులలో మాదిరే ఉంటాయని తెలిసింది.

చిక్కుడులో కాన్సర్‌ నిరోధకాలు..!


ఫాబా బీన్స్‌ అనే రకం చిక్కుడులో అధికమోతాదుల్లో యాంటీ ఆక్సీడెంట్‌ పదార్థాలు ఉన్నాయనీ, అవి అనేకరకాల కాన్సర్‌లను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయనీ పరిశోధకులు తెలిపారు. ఫాబా బీన్స్‌తో కాన్సర్‌ వంటి మహమ్మారి వ్యాధులేకాక అధిక రక్తపోటుని నియంత్రించడంలో కూడా బాగా పనిచేస్తాయని అంటున్నారు. ఆస్ట్రేలియాలో ఈ తరహా బీన్స్‌ విరివిగా పండుతాయి. వీటి నుండి వెలికితీసిన ఫీనోలిక్‌ సమ్మేళనాలు కొన్నిరకాల కాన్సర్‌ కణాలను నాశనం చేశాయి. అయితే ఈ బీన్స్‌ని ఆహారంగా తీసుకుంటే అవి కాన్సర్‌ కణాలపై ఏవిధంగా పనిచేస్తాయో ఇంకా తెలియవలసి వుంది.

అంతరించే దిశలో మన జీవులు..!

అతి ప్రమాదకరస్థితిలో ఉన్న వంద జాతుల జాబితాలో నాలుగు మన దేశానివే. అయితే ఈ నాలుగు జాతులూ ప్రత్యేకంగా పెద్ద ఉపయోగం లేనివి కావడంతో ప్రభుత్వం దృష్టిలో అంతగా పడలేదు. గతవారం ప్రకటించిన జాబితాలో గ్రేట్‌ ఇండియన్‌ బస్తార్డ్‌ అనే భారీ పక్షీ, గూటీ తరంతులా అనే విషపు సాలెపురుగూ, బతగుర్‌బుస్కా అనే తాబేలూ, వైట్‌ బెల్లీద్‌ హెరాన్‌ అనే కొంగ ఉన్నాయి. ఇవన్నీ అంతరించే దశలో ఉన్నాయి. ఇవన్నీ మానవులకు ప్రత్యక్షంగా ఏవిధంగానూ ఉపయోగం కావు; అంతగా ఆకట్టుకోవు కూడా. అందువల్ల ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. మన దేశంలో ఇవి నాలుగే అయినా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నిర్లక్ష్యానికి గురైనవి 8 వేల జాతులు ఉన్నాయి. వీటికి పులులకు ఉన్నటువంటి 'గ్లామర్‌' లేకపోయినా ఒకప్పుడు ఇవీ అధిక సంఖ్యలలో జీవించినవే! గ్రేట్‌ ఇండియన్‌ బస్తార్డ్‌ పక్షి మూడు దశకాల క్రితం సుమారు రెండువేల వరకూ ఉంటే, ఇప్పుడవి రెండొందలకు పడిపోయాయి.

Thursday, 11 October 2012

మైక్రోవేవ్‌లతో సౌరశక్తి..!



ఆవేశపడి మైక్రోవేవ్‌ ఒవెన్‌ కొని, చివరికి మిగిలిపోయిన ఆహారాన్ని వేడిచేసుకోడానికే దాన్ని వాడటం చాలాచోట్ల చూస్తుంటాము. కానీ ఇప్పుడు మైక్రోవేవ్‌లతో మరో ఉపయోగం వుందని తెలిసింది. మైక్రోవేవ్‌ని ఉపయోగించే ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌తో తక్కువ ఖర్చులో కొన్ని పదార్థాలను తయారుచేయవచ్చని తెలిసింది. ఒరిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ఇంజనీర్లు మైక్రోవేవ్‌ని వాడి రాగి, జింక్‌ సల్ఫైడ్‌ తయారు చేశారు. ఆ పదార్థం తక్కువ విషపూరిత మైనదీ, తక్కువ ఖర్చుతో కూడుకు న్నదీ, మెరుగైనదీ అని వారు అంటు న్నారు. మైక్రోవేవ్‌ను వాడటం వల్ల తయారీ సమయం కేవలం సెకన్లలో ఉంటుంది. పైగా తయారీపద్ధతిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ పరిశో ధన సౌరశక్తి రంగానికి కొత్త ఊతం ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. మొత్తానికి మైక్రోవేవ్‌ ఒవెన్‌కు మరొక మంచిపని దొరికింది.

Wednesday, 10 October 2012

చెట్లకేం కాస్తాయి?

  • చురక సంహిత
మిత్రుడు సురేష్‌, నేను ఓ నర్సరీకి వెళ్లాం. పూల చెట్లు, పళ్ళ చెట్లు, అందమైన క్రోటన్సు, ఇలా రకరకాల మొక్కలు అక్కడ దొరుకుతాయి.
'ఇదేమి మొక్క' మావాడి ప్రశ్న.
'దానిమ్మ' నర్సరీ అతని జవాబు.
'దీనికి ఏం కాయలు కాస్తాయి?'
'దానిమ్మ కాయలు.'
'ఇదేమి మొక్క, ఆకులు బాగా ఉన్నాయి.'
'నిమ్మ'.
'దీనికి ఏ కాయలు కాస్తాయి.'
'నిమ్మ కాయలు, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తాయి.'
'ఇదేమి మొక్క?'
'మామిడి మొక్క, ఇది పెద్దయ్యాక మామిడి కాయలు కాస్తాయి, అది చీనీ మొక్క. దానికి చీనీ కాయలు కాస్తాయి, అది ....'
మధ్యలో ఆపేసి మావాడు 'ఏమి చదువుకున్నావు?' అని అడిగాడు.
'అయిదుకే ఆపేశాను. అందుకే ఏ మొక్కకు ఏ కాయలు కాస్తాయో తెలుసు. తలా తోకా లేని ప్రశ్నలు వేసేంత చదువుకోలేదు. చదువులేదని ఇన్ని రోజులూ బాధపడ్డాను. ఇక నుంచి ఆనందంగా ఉండవచ్చు. లేదంటే నా మెదడు కూడా ఇలా చెడిపోయి ఉండేదేమో' అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.
నాక్కొంచెం కోపమొచ్చింది. 'ఏరా, కష్టపడే వారితో జోకులా?'
'జోకులు కాదురా. అయిదవ తరగతి చదివిన వారికీ లేదా ఏమీ చదవని వారిక్కూడా ఏ చెట్టుకు ఏ కాయలు కాస్తాయో తెలుసు కదా, మరి మన ప్రధానికి తెలియదా, డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలని. ఆయన జోక్‌ వేయగా లేనిది నేను తమాషా చేయకూడదా? ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు కూడా. ఇందాక చదువుకున్న వాడినని నాపై నర్సరీ అతను కోప్పడ్డాడు కదా, మరి నా కోపం ఎవరి మీద చూపాలి?'
'ఆ లైన్లో వచ్చావా! అదీ ప్రజలందరూ వింటున్న టీవీ కార్యక్రమంలో, ఓ కామెడీ షోలా ఉందని మా ఆఫీసులో కూడా అనుకున్నారు.'
'సినిమాలో కామెడీ ఆర్టిస్టులుంటారు, మనల్ని నవ్విస్తారు. దాంట్లో వారు స్పెషలిస్టులు. అలాగని హీరో సీరియస్‌గా కథ నడిపినా, తానూ మధ్యలో కామెడీ చేయవచ్చు కొన్ని సీన్లలో. అంతేకానీ మొత్తం కమెడియన్లలా చేయడు కదా!'
'సరేలే ఎవరి సినిమా కష్టాలు వారివి.'
్య్య్య
'నాన్నా, మా బడిలో కథల పోటీలు జరుగుతున్నాయి. నాకేదైనా నాటకం రాసివ్వవా.'
'సాంఘికమా, జానపదమా, పౌరాణికమా?'
'ఏదైనా సరే.'
'సరేలే.'
్య్య్య
పూర్వం మోహనాసురుడనే రాక్షసుడు మనుషులపైనా, ఋషులపైనా దాడి చేసి గాయపరచి వారిని భక్షించేవాడు. ఎందరు ప్రయత్నించినా వాడిని ప్రతిఘటించే శక్తి లేక ఊరుకోవలసి వచ్చేది. అందరూ తప్పించుకుని తిరగసాగారు.
ఒకనాడు ఓ ముని బక్కపలచగా ఉన్నా ధైర్యస్తుడు ఆ అడవిగుండా వెళుతుంటాడు. మోహనాసురుడు ఎదురవుతాడు. వీడిని తిని ప్రయోజనం ఉంటుందా అనుకుని, సరేలే ఓ ఆట ఆడించి వదిలేద్దాం అనుకుని 'ఏరా పుల్లయ్యా, ఎక్కడికి ప్రయాణం?'
'ఓ రాక్షసాధమా, నీ గురించి విన్నాను, నీవూ బుద్ధిగా తపస్సు చేసుకుని దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏదైనా వరం పొంది జీవితాంతమూ ఏ శ్రమా లేకుండా హాయిగా ఉండవచ్చు కదా!'
'అవురా, నాకు ఈ విధంగా జ్ఞానబోధ చేసినవారు ఇంతవరకూ తారసపడలేదురా, ఇంతకీ ఏ దేవుడి కోసం తపస్సు చేయమంటావు.'
'పిచ్చివాడా, శివుణ్ణి ప్రార్థించు.'
'ఏ వరం కోరమంటావు?'
'అన్నింటికీ ముఖ్యమైనది డబ్బు అది సంపాదించే మార్గం అడుగు. అదీ ఎలాంటి కష్టం లేకుండా.'
్య్య్య
''ఓం నమః శివాయ, ఓం నమః శివాయ .....' ఘోరమైన తపస్సు (సముద్రాలు పొంగటం, భూకంపాలు రావడం- ఇవన్నీ బ్యాక్‌ గ్రౌండ్‌లో)
'మోహనాసురా వచ్చాను. నేను శివుణ్ణి. ఏదైనా వరం కోరుకో...'
'దేవ దేవా! నా శ్రమను గుర్తించి నాకు ప్రత్యక్షమైనావా?'
'అవును మోహనాసురా'
'పరమ శివా, నీకు తెలుసు ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నదని. అందుకే నాకు ...'
'నీకు?'
'నాకు డబ్బులు కాసే చెట్టును ఇవ్వు.'
'ఇదేమి కోరిక మోహనాసురా! ప్రకృతి విరుద్ధంగా చెట్లకు కాయలు, పండ్లు కాకుండా డబ్బులా?'
'ఏం కల్పవృక్షమూ, కామథేనువు గురించి మునులు మాట్లాడుకుంటుండగా వినలేదనుకున్నావా?'
'సరే మోహనాసురా. అయితే ఒక షరతు, నీవు కోరినట్లు చెట్లకు డబ్బులు కాస్తాయి కానీ అవి చెట్లని ఎవ్వరికీ తెలియదు. నీకు మాత్రం తెలిసినా నీవు తెలియనట్లు నాటకమాడతావు. కోరరాని కోరిక కోరినందుకు నీకు సుఖం లేకపోగా, నీవు ఆ డబ్బును అనుభవించలేవు.'
'అయితే ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో ఈ వరం ప్రసాదించు స్వామీ'
'అలాగే' (పెద్ద శబ్దం, శివుడి అంతర్థానం)
్య్య్య
'డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలి ...' ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగం.
కానీ ఎవ్వరికీ తెలియకుండా బ్యాంకులు, బీమా కంపెనీలు, భవిష్య నిధులూ, పెన్షన్లూ, ప్రభుత్వ రంగ కంపెనీలు, నదులూ, సముద్రాలూ, కొండలూ, ఆకాశాలూ, గనులూ, అన్నీ చెట్లే. అన్నింటికీ డబ్బులే డబ్బులు ... విరగకాస్తున్నాయి. వాటిని కోసుకునేందుకు దేశంలోని బడా బాబులకు, విదేశీ బాబులకు నిచ్చెనలేస్తున్న నాయకులు ... ఆ నిచ్చెనల కింద నలిగిపోతూ సామాన్య జనం ...
ఎవరు చెప్పింది డబ్బులు కాయవని ...
్య్య్య
పరదా పడుతుంది, చప్పట్లు ...