Wednesday, 6 June 2012

‘ఆగ్నే’యాస్త్రం


 
 
              భారతదేశం - అగ్ని 5 అనే క్షిపణిని రూపొందించి, విజయవంతంగా ప్రయోగించింది. ఇది 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే లక్ష్యాన్ని ఇట్టే ఛేదించగలదు. అంటే, ఇండియాలో ప్రయోగిస్తే అటు చైనాలో ఉండే లక్ష్యాన్ని గురిపెట్టి నశింపచేయవచ్చునన్న మాట. ఇందులో అణ్వస్త్రాయుధాలు వాడొచ్చు. దీన్నే ‘ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్’ అంటారు. ఇలాటివి ఇప్పటిదాకా ప్రపంచంలో కేవలం 5 దేశాల చెంత మాత్రమే ఉన్నాయి. తాజాగా వాటి సరసన భారతదేశం చేరింది. ఇంతకీ ఏమా మిస్సైల్ కత? ఒక్కసారి మన పురాణాలు తిరగేస్తే... అస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించని వారు లేరు. రామాయణంలో శ్రీరాముడు రావణాసురుని వధ కోసం బ్రహ్మాస్త్రం వాడాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపడానికి చక్రాయుధాన్ని వాడాడు.
               మహా భారత యుద్ధంలో ‘సైంధవుడి’ కథను ఒకసారి ప్రస్తావిద్దాం. నాటి సింధు దేశాధిపతియైన వృద్ధక్షత్రుని కుమారుడు జయద్రధుడు. ఇతడికి ‘ఏమరుపాటుగా ఉన్నపుడు ఇతని తల నరకబడుతుందన్న’ది శాపం. దాన్ని విన్న వృద్ధక్షత్రుడు ‘అలా ఇతని తల నేలపై ఎవరు పడవేస్తారో, వాని శిరస్సు నూరు ముక్కలగు గాక’ అని ప్రతి శపించాడు. ఈ జయద్రధుడే సైంధవుడు. దుర్యోధనుని చెల్లెలైన దుస్సలను పెళ్లాడాడు. మహాభారత యుద్ధంలో అభిమన్యునికి అర్జునుడు సహాయపడకుండా అడ్డం పడ్డాడు సైంధవుడు. దానికి కోపించి, అర్జునుడు మరునాడు సూర్యాస్తమయంలోగా తాను సైంధవుని చంపి తీరతానని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో, ద్రోణాదులు సైంధవుని కాపాడబోయారు. అపుడు శ్రీకృష్ణుడు తన మాయ చేత సూర్యాస్తమయం అయినట్లు భ్రమింపజేశాడు. దాంతో సైంధవుడు బయటకు వచ్చాడు. వెంఠనే అర్జునుడు అతని శిరస్సును తెగ వేశాడు. సైంధవునికి ఉన్న శాపము, దానికి అతని తండ్రి ప్రతిశాపమూ ‘అర్జునుడికి ముందే శ్రీకృష్ణుడు చెప్పి ఉండటంతో, ఆ తెగిన శిరస్సును నేల మీద పడకుండా బాణాలతో ఆకాశంలోనే ఉండేలా చూశాడు అర్జునుడు. వెనువెంటనే పాశుపతాస్త్రం వాడి ఆ తెగిన తల, ఎక్కడో మారుమూల అడవుల్లో తపస్సు చేసుకుంటున్న సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుని వొడిలో పడేలా చేశాడు అర్జునుడు. దాంతో, ఉలిక్కిపడిన వృద్ధక్షత్రుడా తెగిన తలను దభేలుమని నేలపాలు చేయడంతో తన శాపం వల్ల తానే మరణిస్తాడు. భక్త అంబరీషుని కథలో, అంబరీషుడు శ్రీమహావిష్ణువును శరణు వేడితే, చక్రాయుధం దుర్వాసుని తరిమిన సన్నివేశమూ మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది? ఇవన్నీ మనకేం చెబుతారు ూ? పురాణ కాల సమయానికే, అస్త్రాలూ, శస్త్రాలూ, అణ్వాయుధాలూ - అన్నీ ఉండేవనే. బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం - ఇలా ఎనె్నన్నో శక్తివంతమైన అస్త్రాలుండేవి. శస్త్రాలు అంటే, ఆయుధాలు (గద, ధనుర్భాణాలు, శంఖచక్రాలు, ఖడ్గం - ఇలా విష్ణువుకు పంచ ఆయుధాలున్నాయి) ఆయా ఆయుధాలకు మంత్రాలను సంధానం చేసినపుడు అవే అస్త్రాలుగా పనిచేస్తాయి. మహాభారత యుద్ధ చరిత్ర పుటలను తరచి చూస్తే, మనకు ఇలాటి అస్త్రాల, శస్త్రాల ప్రస్తావనా, యుద్ధ వ్యూహాలైన పద్మవ్యూహం, చక్రవ్యూహం, క్రౌంచ వ్యూహం - ఇలాటి వ్యూహాల ప్రస్తావనా, వాటిని ఇరుపక్షాలూ ఆచరణలో పెట్టిన తీరు, ఛేదించిన తీరూ అబ్బురపరుస్తాయి. అగ్ని పురాణం, విమాన శాస్త్రం - ఇవన్నీ ప్రాచీన కాలంనాటి విశేషాలు తెలియజేస్తాయి.

              కాలం మారింది. మంత్ర యుగాల నుంచి యంత్ర యుగంలోకి మానవుడు అడుగుపెట్టాడు. అలనాటి వేద పరిజ్ఞానం, దాదాపు లుప్తమై పోయింది. నాటి బ్రహ్మాస్త్ర, పాశుపతాస్త్రాల స్థానంలో శతఘు్నలు, తుపాకులు, రాకెట్లు, క్షిపణులు వచ్చాయి. మరీ 20వ శతాబ్దం ముగిసి 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టేసరికి అణ్యాయుధాలు వీటికి తోడయ్యాయి. రాకెట్లూ, క్షిపణులూ రాకెట్, క్షిపణుల వ్యవస్థపై ఆధునిక యుద్ధ వాతావరణంలో లక్ష్యాన్ని చేరడానికి వాడేందుకు వివిధ దేశాలు నేడు ఆధారపడుతున్నాయి. తమ దేశాలకు కావలసిన రీతిలో రాకెట్లను, క్షిపణులను రూపొందించుకుంటూ, దేశ భద్రత కోసం పాటుపడుతున్నాయి. ఈ క్షిపణులను ఏదో ప్రయోగించి వదిలేసే రకంగా కాకుండా, ప్రయోగించిన తర్వాత కూడా వాటిని నియంత్రించే రీతిలో రూపొందిస్తున్నారు. ఈ క్షిపణులను గైడెడ్ మిస్సైల్స్ అనీ, టాక్టికల్ గైడెడ్ మిస్సైల్స్ అనీ, స్ట్రేటజిక్ మిస్సైల్స్ అనీ, క్రూయిస్ మిస్సైల్స్ అనీ, బాలిస్టిక్ మిస్సైల్స్ అనీ రకరకాలుగా రూపొందిస్తారు. ఒక్కో రకం క్షిపణి ఒక్కో ప్రత్యేక సందర్భానికీ వాడతారు. ప్రయోగించిన తర్వాత, లక్ష్యం చేరడానికి దానిని నియంత్రించే రీతిలో గైడెడ్ మిస్సైల్స్ పనే్జస్తాయి. అదే టాక్టికల్ గైడెడ్ మిస్సైల్స్ అనేవి తక్కువ పరిధిలో, యుద్ధ క్షేత్రంలోనే వెనె్వంటనే ప్రయోగించడానికి పనికొస్తాయి. స్ట్రేటజిక్ గైడెడ్ మిస్సైల్స్ అనేవి (వీటినే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అనీ అంటారు) క్రూయిస్, బాలిస్టిక్ అని రెండు రకాలుగా ఉంటాయి. క్రూయిస్ మిస్సైల్ అనేవి గాలి పీల్చుకుని (ఎయిర్ బ్రీతింగ్) పనిచేసే ఇంజన్లతో రూపొందుతాయి. అదే బాలిస్టిక్ మిస్సైల్స్ అనేవి దశలవారీ పనిచేస్తాయి. తొలి దశకు మాత్రమే రాకెట్ ఇంజన్ వాడతారు. మలి దశల్లో గైడెన్స్ మెకానిజం పనే్జస్తుంది. ఈ స్ట్రేటజిక్ మిస్సైల్స్ (ఎత్తుగడతో పనే్జసే క్షిపణులందామా?) సాధారణంగా అణ్వాయుధాలనే తీసుకెళతాయి. రాకెట్ల తొలినాళ్లు.. మన పురాణ కాలంలోనే అస్త్ర శస్త్రాలుండేవని మనకు తెలుసు. అగ్ని పురాణంలో ఈ అస్త్ర శస్త్రాల ప్రస్తావన ఉండనే ఉంది. పోతే, ఆధునిక యుగంలో 1232 సం.లో చైనాలో రాకెట్లు తొలిసారి వాడినట్లు చరిత్రకారుల కథనం. బ్లాక్ పౌడర్‌ను కూడా చైనా వాళ్లే కనుగొన్నారని అంటారు. అదే శతాబ్దంలో యూరప్‌లో రాకెట్లు కన్పించాయి. లెగ్నికాయుద్ధంలో (1241 సం.లో) మంగోల్స్ తొలిసారిగా రాకెట్లు వాడారంటారు. 1379 సం.లో ఇటలీలోనూ, 1380 సం.లో వెనిస్‌లోనూ వాడారంటారు. 1248 సం.లో బ్రిటీష్ వైజ్ఞానికుడు రోజన్ బెకాన్ బ్లాక్ పౌడర్ ఫార్ములాలను తన ఎపిస్టోలా లో రాశాడు. అదే కాలంలో జర్మనీకి చెందిన అల్‌బెర్టస్ మాగ్నస్ తన ‘డి మిరాబిలిబస్ మండి’లో రాకెట్‌లలో వాడే బ్లాక్ పౌడర్ ఫార్ములాలను ప్రస్తావించాడు. 1325 సం.లో తొలి అగ్నాయుధాలు వచ్చాయి. ‘గన్ పౌడర్’ పేరు తొలిసారిగా వాడుకలోకొచ్చింది వీటితోనే. 1668 సం. నాటికి మిలిటరీ రాకెట్లు పరిణతి చెందాయి. వాటి పనితీరు ఆకారం కూడా మెరుగుపడ్డాయి. ఆ సంవత్సరంలోనే జర్మన్ కలొనెల్ ఒకడు 60 కిలోల రాకెట్‌ను చెక్కతో రూపొందించాడు. అది దాదాపు 7 కిలోల గన్ పౌడర్‌ను తీసుకెళ్లింది.

                18వ శతాబ్దం - దాని తర్వాత... 18వ శతాబ్దానికి ఇండియాలో ‘రాకెట్ల’ ప్రస్తావన వచ్చింది. అదీ మన దక్షిణాదిలో నాటి మైసూరు రాజ్యానికి చెందిన హైదరలీ లోహపు సిలిండర్లను వాడి రాకెట్లు రూపొందించాడు. 1780 ప్రాంతంలో జరిగిన రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో వాటిని వాడాడు. హైదరలీ రాకెట్లు బ్రిటిష్ వారి ఆయుధ భాండాగారాన్ని ధ్వంసం చేశాయి. దీని తర్వాత హైదరలీ కొడుకైన టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలపై వాడాడు. ఈ రాకెట్లకు ముందు వేపు కత్తులను కట్టి సుదూరంలో ఉన్న శత్రువులపై పడేలా రూపొందించారు. ఈ రాకెట్లే క్షిపణులుగా రూపు మార్చుకొన్నాయన్నమాట. వీటినే మైసూరు రాకెట్లు అన్నారు. వీటిని 2 కి.మీ. దూర పరిధి దాకా వాడారు. అంతకు ముందే యూరప్‌లో, అక్కడా రాకెట్లను మిలిటరీ వాళ్లు వాడినా, అవి చెక్కతో తయారైనవే. కానీ మైసూరు రాకెట్లు లోహపు నిర్మాణాన్ని కల్గి ఉండటం విశేషంగా ఆకర్షించింది (బ్రిటిష్ వారు సైతం అలాటి రాకెట్ల రూపకల్పనకు ఆ తర్వాతి కాలంలో శ్రీకారం చుట్టారు. అది వేరే సంగతి) 1792, 1799 సం.లో శ్రీరంగ పట్టణంలో జరిగిన యుద్ధాల్లో వీటిని విజయవంతంగా వాడి బ్రిటిష్ వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు టిప్పు సుల్తాన్. ఈ క్షిపణుల తయారీకి ‘తారామండల్ పేట’ అనే చోటును ఏర్పాటు చేయడమే గాక ‘ఫతుల్ ముజాహిదీన్’ అనే మిలిటరీ (మాన్యువల్) కరదీపికను కూడా టిప్పు సుల్తాన్ రూపొందించాడు. మైసూరు రాజ్యంలో 16 నించి 24 బ్రిగేడులనూ, ప్రతి బ్రిగేడుకూ 200 మంది రాకెట్ మనుష్యులను ఏర్పాటు చేశాడు. రాకెట్ లాంచర్స్‌ను పెద్ద చక్రాల మీద తీసికెళ్లేలా రూపొందించాడు. ఈ లాంచర్లను దాదాపు ఏక కాలంలో 5 నించి 10 రాకెట్లు ప్రయోగించేలా రూపొందించడం విశేషం. శ్రీరంగ పట్టణం బ్రిటిష్ వారి చేతికి చిక్కినపుడు వారు దాదాపు 600 లాంచర్లను, 700 సర్వీస్ చేసి వాడుకోగల రాకెట్లను, 9000 ఖాళీ రాకెట్లను కనుగొన్నారు. అనేక రాకెట్లను, రాకెట్ కేసులను సేకరించిన బ్రిటిష్ వారు వాటిని విశే్లషించడానికి బ్రిటన్‌కు పంపారు. దాని తర్వాత 1805 సం.లో బ్రిటిష్ వారు తొలి ‘సాలిడ్ ఫ్యూయెల్ రాకెట్’ను ప్రదర్శించారు. 1807 సం.లో విలియం కంగ్రీవ్ ‘ఎకన్సైస్ అకౌంట్ ఆఫ్ ద ఆరిజన్ కంగ్రీవ్ రాకెట్లు’గా రూపొందించారు. బ్రిటిష్ వారు 1812లో జరిగిన యుద్ధంలో వాడారు కూడా. ఈ రాకెట్ల రూపాంతరాలనే 1814 సం.లో బాల్టిమోర్ యుద్ధంలోనూ వాడారు. ఈ కంగ్రీవ్ రాకెట్ల లక్ష్య పరిధి 1.5 నించి 2 మైళ్ల దాకానే ఉండేది. దీని తర్వాత ఎక్కడికి బడితే అక్కడికి తీసుకెళ్లి వాడుకునేలా రాకెట్లను 19వ శతాబ్దంలో విలియమ్ హేల్ అనే బ్రిటిష్ ఇంజనీర్ రూపొందించాడు. దీన్ని ఆస్ట్రేలియా రాకెట్ కార్పొరేషన్ హంగేరీ, ఇటలీల్లో వాడింది. అలాగే డచ్, రష్యా, దేశాలు విజయవంతంగా వీటిని వాడాయి. హేల్ తన పేటెంట్ హక్కులను అమెరికాకు అమ్మేశాడు. ఫలితంగా అమెరికా దాదాపు 2 వేల రాకెట్లను రూపొందించి మెక్సికో యుద్ధం (1846-48)లో వాడింది. తొలి ప్రపంచ యుద్ధం - దాని తర్వాత అమెరికాలో రాబర్ట్ హచింగ్స్ గొడ్డార్డ్ స్టీల్ మోటార్ తదితర సామాగ్రి వాడి పలు పరిశోధనలు చేశాడు. రాకెట్‌ల రూపకల్పనలో గణనీయమైన సామర్థ్యాన్ని చూపాడు. తొలి ప్రపంచ యుద్ధంలో వాడటానికి గొడ్డార్డ్ పలు రకాల మిలిటరీ రాకెట్లను డిజైన్ చేశాడు. బ్లాక్ పౌడర్ స్థానంలో డబుల్ - బేస్ పౌడర్ (40% నైట్రోగ్లిజరిన్, 60% నైట్రోసెల్యులోస్) వాడారు. ఈ రాకెట్లను పరీక్షించి, సంతృప్తి పడ్డాక అమెరికన్ సైన్యం వాడటం జరిగింది. తొలి ప్రపంచ యుద్ధంలో నిజానికి రాకెట్ల వాడకం జరిగింది గానీ, తక్కువే. గొడ్డార్డ్ డిజైన్స్ రెండో ప్రపంచ యుద్ధంలో బాగా వాడారు. గొడ్డార్డ్ కాకుండా, ఛార్లెస్ ఎఫ్ కెట్టిరింగ్, వెర్న్‌హెర్ వోన్ బ్రాన్, వాల్టర్ ఆర్ డోర్న్‌బెర్గెర్ (జర్మనీ)లు కూడా రాకెట్ల రంగంలో విస్తృత పరిశోధనలు చేశారు. 1937 నాటికి డోర్న్ బెర్గెర్, బ్రాన్‌ల టీమ్ సంఖ్య వందల్లోకి పెరిగింది. బాలిస్టిక్ రాకెట్స్/ మిస్సైల్స్ రూపకల్పన జరిగి, పరీక్షించడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో రాకెట్లపై ఖర్చూ, రాకెట్ల వాడకమూ చాలా ఎక్కువగా జరిగింది. 5 అంగుళాల రాకెట్‌ను బ్రిటన్ రూపుదిద్దింది. దీనికి వార్‌హెడ్ ఎక్స్‌ప్లోజివ్‌ను జోడించింది. దీని సామర్థ్య పరిధి 2 నించి 3 మైళ్లే. అమెరికా సైన్యం 4.5 అంగుళాల రాకెట్‌ను తయారుచేసింది. వీటి సంఖ్య దాదాపు 4 లక్షలు. అదే సమయంలో సోవియట్ రష్యా కూడా కొన్ని రాకెట్లను తయారుచేసింది. కాట్యూషా పేరుతో 130 మి.మీ. రాకెట్లను పెద్దఎత్తున తయారుచేసింది రష్యా. 1940 సం. కాలంలో క్లారెన్స్ ఎన్ హిక్‌మాన్ (ఇతను గొడ్డార్డ్‌తో కలసి పని చేశాడు) చేతితో వదిలే రాకెట్ డిజైన్‌లను మెరుగుపరిచి 20 అంగుళాల పరిమాణపు రాకెట్‌లను తయారుచేశాడు. ఇది చాలా పాపులరైందా కాలంలో. దీనికే బజూకా అని పేరు. దీన్ని అమెరికా 1942లో వాడి జర్మన్లను ఆశ్చర్యపరచింది. దీనికి ప్రతిగా జర్మన్లు టాంక్ టెర్రర్ లేదా స్టవ్‌ప్రైప్ అనే పేరుతో రాకెట్లను రూపొందించారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యాంటీ ఏర్‌క్రాఫ్ట్ గన్స్ కన్నా ఉన్నత శ్రేణి హై ఆల్టిట్యూట్ బాంబింగ్ రావడంతో రాకెట్ పవర్డ్ గన్స్ రూపకల్పన ఆవశ్యకమైంది. బ్రిటన్ తొలిగా 3 అంగుళాల యాంటీ ఏర్‌క్రాఫ్ట్ గన్‌లను రూపొందించింది. దీని తర్వాత 3.7 అంగుళాల గన్‌లు వచ్చాయి. 20 వేల అడుగుల ఎత్తున ప్రయోగించే వీలుగా గన్‌లు రూపొందించారు.

                 రష్యా, బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలు ఏరియల్ రాకెట్ల రూపకల్పన చేశాయి కూడా. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పలు రకాల రాకెట్లను రూపొందించాయి ఈ దేశాలు. రష్యా, అమెరికా దేశాలు అన్‌గైడెడ్ బాలిస్టిక్ రాకెట్లను రూపొందించాయి. 1955లో అమెరికా సైన్యాలు ‘హానెస్ట్ జాన్’ అనే మిస్సైల్‌ను ప్రవేశపెట్టాయి. 1957 నుంచి సోవియట్ యూనియన్ పలు రకాల రాకెట్లను, మిస్సైల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ మిస్సైల్స్ 25 నించి 30 అడుగుల పొడవుండి 20 నుంచి 45 మైళ్ల లక్ష్య పరిధిని కల్గి ఉండేవి. 1973 అక్టోబర్‌లో జరిగిన అరబ్ - ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ రకం రాకెట్లను ఈజిప్ట్, సిరియా దేశాలు ప్రయోగించాయి. 1980లో ఇరాక్ యుద్ధంలో కూడా వాడారు. ఇంతకీ మిస్సైల్ అనే పదం ఎలా వచ్చింది? ఆధునిక ప్రపంచంలో క్షిపణి లేదా మిస్సైల్ అనేది యుద్ధానికి తప్పనిసరి ఆయుధంగా మారింది. ఇందులో నాలుగు భాగాలుంటాయి. టార్గెటింగ్ (గైడెన్స్‌తో లేదా గైడెన్స్ లేకుండా), ఫ్లయిట్ సిస్టం, ఇంజన్, వార్‌హెడ్. ఈ మిస్సైల్స్ పలు రకాలుగా రూపొందుతాయి. ఉపరితలం నించి ఉపరితలానికి వెళ్లేవి (సర్‌ఫేస్ టు సర్‌ఫేస్), గాలి నుంచి ఉపరితలానికి వెళ్లేవి (ఏర్ టు సర్‌ఫేస్), ఉపరితలం నుంచి గాలిలోకి వెళ్ళేవి (సర్‌ఫేస్ టు ఏర్), గాల్లోంచి గాల్లోకి వెళ్లేవి (ఏర్ టు ఏర్), ఉపగ్రహ నాశిని (యాంటీ శాటిలైట్) అనే పలు రకాల మిస్సైల్స్ నేడు వాడుకలో ఉన్నాయి. గాలిలోంచి ఉపరితలానికి వెళ్లే మిస్సైల్స్‌లో బాలిస్టిక్, క్రూయిస్, యాంటీ-షిప్, యాంటీ-టాంక్ అని పలు రకాలున్నాయి. ఉపరితలం లోంచి గాల్లోకి వాడే మిస్సైల్స్‌లో యాంటీ-ఏర్‌క్రాఫ్ట్, యాంటీ బాలిస్టిక్ అని రెండు రకాలున్నాయి. ఇంతకీ మిస్సైల్ అంటే అర్థం ఏమిటి? అనే సందేహం రావచ్చు. నిజానికి మిస్సైల్ అనేది లాటిన్ భాష నుంచి వచ్చిన పదం. మిస్సైల్ అంటే, ‘పంపడానికి’ అని అర్థం. ఒక శక్తివంతమైన, మార్గదర్శకత్వంతో కూడిన యుద్ధోపకరణం గాలిలోనో, ఉపరితలంలోనో వాడే వీలుగా రూపొందితే, దాన్ని క్షిపణి లేదా మిస్సైల్ లేదా గైడెడ్ మిస్సైల్ అని వ్యవహరిస్తారు. అదే ఒక శక్తివంతమైన యుద్ధోపకరణాన్ని ఎలాటి మార్గదర్శకత్వం లేకుండా ప్రయోగించే వీలుగా రూపొందితే, దాన్ని రాకెట్ అని వ్యవహరిస్తారు. ఇలాటి శక్తివంతమైన యుద్ధోపకరణాన్ని నీటిలో కూడా పనే్జసేలా రూపొందే వాటిని టార్పెడోస్ అంటారు. ఆధునిక కాలంలో టార్పెడోస్‌నే ‘మైన్స్’ అంటున్నారు. మిస్సైల్ టెక్నాలజీ రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ వాడిన మిస్సైల్స్ పరంపరనే తొలి మిస్సైల్స్‌గా చెబుతారు. వీటిలో వి-1 ఫ్లయింగ్ బాంబ్, వి-2 అనేవి బాగా పేరు పొందాయి. రెండింటిలోనూ సులభమైన మెకానికల్ ఆటో పైలెట్‌ను వాడి నిర్ణీత రూట్‌లో ఎగిరేలా రూపొందించారు. గైడెడ్ మిస్సైల్ రూపకల్పనలో నాలుగు విడి భాగాలు తప్పనిసరి. ముందే చెప్పుకున్నట్లు, టార్గెటింగ్, ఫ్లయిట్ సిస్టం, ఇంజన్, వార్‌హెడ్ అనేవి మిస్సైల్‌లోని 4 ముఖ్య విడిభాగాలు. టార్గెటింగ్ గైడెన్స్ వ్యవస్థలో ఇన్‌ఫ్రారెడ్, లేజర్ లేదా రేడియో తరంగాలను వాడి గైడ్ చేస్తారు. జిపిఎస్ వంటి సౌకర్యాలను వాడతారు. ఫ్లయిట్ వ్యవస్థలో వెక్టర్డ్ థ్రస్ట్, ఏరోడైనమిక్ మానోవరింగ్ వంటి సౌకర్యాలను వాడతారు. ఇక మిస్సైల్స్‌లో వాడే ఇంజన్ విషయానికి వస్తే వీటిల్లో రాకెట్ ఇంజన్‌గానీ, లేదా జెట్ ప్లేన్‌లలో వాడే ఇంజన్‌లను గానీ వాడతారు. వీటిల్లో ఘన ఇంధనాలని లేదా ద్రవ ఇంధనాలనీ వాడతారు. భూమిపై నించి వాడే మిస్సైల్స్‌లో ఇంజన్స్ వివిధ (మల్టిపుల్ ఇంజన్) స్టేజీలలో ఉంటాయి. వీటి తర్వాత యుద్ధంలో అత్యంత కీలకమైన వార్ హెడ్ నాలుగో భాగం. ఇందులో లక్ష్యాన్ని ఛేదించి, వినాశనాన్ని కల్గించే శక్తి ఉంటుంది. ఈ వార్‌హెడ్‌లలో వేరే యుద్ధ ఉపకరణాలను గానీ, తగలబెట్టే స్వభావంగల పదార్థాలను గానీ, రసాయన, జీవ రసాయన లేదా రేడియో ధార్మికత గల ఆయుధాలను గానీ వాడతారు. మరింత విధ్వంసక ఆయుధాలంటే, అణ్వాయుధాలను కూడా వాడతారు. వార్‌హెడ్ లేని క్షిపణులను సాధారణంగా టెస్టింగ్ కోసం, సైన్యంలో శిక్షణ నిమిత్తం వాడతారు. ప్రపంచ మిలిటరీ శక్తి ఎలా ఉంది? ఈ అణు యుగంలో ఒక దేశపు మిలిటరీ నాణ్యత, ఆధిక్యత, శక్తి - ఇవన్నీ ఆ దేశ సైన్యం వద్ద ఎలాటి అణ్వాయుధాలున్నాయనే అంశం మీదే ఆధారపడి ఉంది. అందువల్లే ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు తమదే పైచేయిగా ఉండాలనుకోవడం. అణుబాంబులు, ఆయుధాలు తయారుచేస్తే సరిపోదు. వాటిని వాడటానికి సరైన యుద్ధోపకరణాలూ కావాలి. ఒక శత్రు దేశం ప్రయోగించే ఆయుధాన్ని విధ్వంసం చేసి తనను తాను రక్షించుకోగల్గాలి. ఇదంతా ‘అణుబాంబులను ప్రయోగించే వ్యవస్థ’ మీదే ఆధారపడి ఉంటుంది. దీర్ఘ పరిధి బాలిస్టిక్ మిస్సైల్స్ వ్యవస్థ ఎంత శక్తివంతంగా వాడుకోగల్గితే, ఆ దేశం అంత సురక్షితంగా, శక్తివంతంగా ఉంటుందన్నమాట. నిన్న, మొన్నటిదాకా అణ్వాయుధాలతో కూడిన మిస్సైల్స్ రూపకర్తలుగా ప్రపంచంలో కేవలం ఐదే దేశాలుండేవి. అమెరికా, రష్యా, చైనా దేశాలు తమ ఆధిక్యతను చాటుకొంటూ వస్తున్నాయి. వీటితోబాటు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలూ ఉన్నాయి. బాలిస్టిక్ మిస్సైల్స్ వ్యవస్థ తక్కువ వ్యవధిలో పని ముగించగల సామర్థ్యంతో, కచ్చితమైన దారిలో ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగల మిస్సైల్స్‌ను రూపొందించేందుకు సాయపడ్తుంది.

                ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్, సబ్ మెరైన్స్ నుంచి లాంచ్ చేసే బాలిస్టిక్ మిస్సైల్స్ బాగా పాపులర్. అత్యంత సుదీర్ఘ పరిధిగల బాలిస్టిక్ మిస్సైల్స్‌ను చైనా, అమెరికా, రష్యా దేశాలు మాత్రమే కల్గి ఉన్నాయి. ప్రపంచంలో కేవలం మాస్కో నగరం ఒక్కటే నమ్మకమైన యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థను కల్గి ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇండియా అణు సామర్థ్యం కల్గి, మిస్సైల్ వ్యవస్థ రూపకల్పనలో మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మిస్సైల్ వ్యవస్థను రూపుదిద్దుకుంది. ఇటీవలే అగ్ని-5 అనే క్షిపణిని పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల లక్ష్య పరిధిని ఛేదించగల శక్తి దీనిది. దీంతో భారతదేశం శక్తివంత మిస్సైల్ గల ఆరో దేశంగా అవతరించింది. స్వల్ప సమయంలోనే, కనీసం రెండు నగరాలను రక్షించే వ్యవస్థలను మోహరించే క్షిపణి రక్షణ కవచాన్ని సైతం భారతదేశం అభివృద్ధి చెందింది. ఇలాటి రక్షణ కవచం అతి కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. దీన్ని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ - డిఆర్‌డిఓ రూపొందించింది. 2 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణులపై దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. 2016 నాటికి 5 వేల కిలోమీటర్ల పరిధిగల క్షిపణులను నాశనం చేసే స్థాయికి దీన్ని ఆధునీకరించబోతున్నారు కూడా. భారతీయ క్షిపణి కార్యక్రమం ఎలా ఉందంటే... భారతదేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం చాలా ఆశాజనకంగా ఉంది. మాజీ రాష్టప్రతి డా.అబ్దుల్ కలాం ఈ మిస్సైల్ కార్యక్రమానికి ఇతోధికంగా తోడ్పడ్డారని చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఐజిఎండిపి) కింద పలు రకాల మిస్సైల్స్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఉపరితలం నించి ఉపరితలానికి ప్రయోగించే ఇంటర్మీడియెట్ రేంజి అగ్ని మిస్సైల్, షార్ట్ రేంజి మిస్సైల్స్ అయిన పృథ్వీ బాలిస్టిక్ మిస్సైల్ ముఖ్యమైనవి. వీటితోబాటు ఉపరితలం నించి గాల్లోకి ప్రయోగించే ఆకాష్, త్రిశూల్ మిస్సైల్స్ కూడా తోడైనాయి. ‘నాగ్’ మిస్సైల్ అనేది టాంకులను ధ్వంసం చేసే యాంటీ టాంక్ మిస్సైల్. ఇవికాక ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా భారతదేశం ప్రారంభించింది. 2005 నాటికి యాంటీ బాలిస్టిక్ సామర్థ్యాన్ని సాధించి ప్రపంచంలో ‘నాలుగో దేశం’గా పేరు పొందింది. పృథ్వీ-1 అన్నది భారతీయ సాంకేతికతతో రూపొందింది. (పృథ్వి అంటే సంస్కృతంలో భూమి అని అర్థం) ఇది ఎలాటి వార్‌హెడ్స్ (యుద్ధ ఆయుధాలు)నైనా తీసికెళ్లగల సామర్థ్యం కల్గింది. దీన్ని 700 కి.మీ. దాకా ప్రయోగించవచ్చు. పృథ్వీ-2 అనేది పృథ్వీ-1కు మెరుగైన వెర్షన్. చెప్పాలంటే పృథ్వీ-1 అనేది సైన్యం కోసం, పృథ్వీ-2 అనేది వాయుసేన కోసం, పృథ్వీ-3 అనేది నౌకాదళం కోసం రూపొందించారు. ధనుష్ అనేది నౌకాదళం కోసం రూపొందిన పృథ్వీ క్షిపణి ( ్ధనుష్ అంటే సంస్కృతంలో ధనస్సు అని అర్థం) ఇది 250 కి.మీ. లేదా 350 కి.మీ. మిస్సైల్స్‌ను ప్రయోగించగలదు. కె-15 సాగరిక అనేది సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్. ఇది ధనుష్ మిస్సైల్‌కు మరో రూపాంతరం. ధనుష్‌ను 2000 సం.లో ప్రవేశపెట్టారు. సూర్య (అంటే సూర్యుడు) అనేది తొలిగా మన దేశం రూపొందించిన ఖండాంతర మిస్సైల్ పేరుగా చెబుతారు. 1994లోనే దీనికి శ్రీకారం చుట్టారంటారు. కానీ ఈ మిస్సైల్ గురించి మనకు పూర్తి సమాచారం లేదు. 2007లో దీనికి అగ్ని-5 అని పేరు మార్చారని మాత్రం తెలుస్తోంది. శౌర్య మిస్సైల్ అనేది షార్ట్‌రేంజి సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిది 600 కి.మీ. పరిధి. సాగరిక మిస్సైల్‌కు మరో రూపాంతరమే ఈ శౌర్య. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్‌లలో ‘శౌర్య’ నమ్మకమైందని డిఆర్‌డిఒ చెప్పింది. రాబోయే కాలంలో యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్స్ అయిన అడ్వాన్స్‌డ్ ఏర్ డిఫెన్స్ (ఎఎడి), పృథ్వీ ఏర్ డిఫెన్స్ (పిఎడి)లను పరీక్షించే సమయంలోనే ‘శౌర్య’కున్న సామర్థ్యాలనీ వెలికి తేబోతున్నారు శాస్తజ్ఞ్రులు. సాగరిక (సాగరం, సముద్రం నుంచి పుట్టిందని సంస్కృతార్థం) అనేది సబ్‌మెరైన్‌ల నుంచి లాంచ్ చేసే బాలిస్టిక్ మిస్సైల్. దీని లక్ష్య పరిధి 750 కి.మీ. 2010 నాటికి దీని పరీక్షలు పూర్తయ్యాయి. నిర్భయ్ అనేది (్భయం లేనిది అని సంస్కృతార్థం) లాంగ్ రేంజి సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇది 1000 కి.మీ. లక్ష్య పరిధిని కల్గి ఉంది. భూమీద, గాలిలో, నీటి మీద పనే్జసేలా సైన్యానికి, వాయు సేనకీ, నౌకాదళానికీ సహాయకారిగా ఉండబోతోంది. ఇది 24 రకాల వార్‌హెడ్స్‌ను లాంచ్ చేయగలదు. పి-70 అమెథిస్ట్ అనేది సబ్ మెరైన్ క్రూయిజ్ మిస్సైల్. ఇది ’90 దశకంలో మన దేశం సమకూర్చుకుంది. పి-270 మోస్‌కిట్ అనేది మన సైన్యంలో వాడుతున్న సూపర్ సానిక్ రామ్‌జెట్ శక్తిగల క్రూయిజ్ మిస్సైల్. దీన్ని రష్యా నిర్మించింది. బ్రహ్మాస్ అనేది సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైల్. దీన్ని భూమీద నుంచి గానీ, ఓడల మీద నించి గానీ, జలాంతర్గాముల నుంచి గానీ ప్రయోగించే వీలుంది. దీని రూపకల్పనలో డిఆర్‌డిఓ, రష్యాకు చెందిన NPO Mashinostroeyenia కంపెనీ సాయం తీసుకుంది. దీని కోసం బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. బ్రహ్మాస్ అనే పేరును బ్రహ్మపుత్ర (్భరతదేశం), మోస్‌కవా (రష్యా) అనే రెండు నదుల పేర్లను కలిపి పెట్టారు. బ్రహ్మాస్ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా పయనించే క్రూయిజ్ మిస్సైల్‌గా రూపొందించారు.

              భూమీద నుంచి గాలిలోకి ప్రయోగించే మిస్సైల్స్‌లో ‘ఆకాష్’ అనేది భారతీయ మీడియం రేంజి మిస్సైల్. ఇది 30 కి.మీ. లక్ష్య పరిధిని ఛేదించగలదు. 18000 మీటర్ల ఎత్తుకు వెళ్లగలదు. దీనికి అణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. భారతీయ బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ కార్యక్రమం అనేది బహుస్థాయిల బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ. భారతదేశాన్ని వివిధ బాలిస్టిక్ మిస్సైల్ అటాక్‌ల నించి రక్షించేందుకు రూపొందిన కార్యక్రమం. ఇది రెండు అంచెల రక్షణ కార్యక్రమం. పృథ్వీ ఏర్ డిఫెన్స్ (పిఎడి), అడ్వాన్స్‌డ్ ఏర్ డిఫెన్స్ (ఎఎడి) - ఈ రెండూ దీని కిందకే వస్తాయి. పృథ్వీ ఏర్ డిఫెన్స్‌ని 2006లో, అడ్వాన్స్‌డ్ ఏర్ డిఫెన్స్‌ని 2007లో పరీక్షించారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ దేశాల తర్వాత ఇలాటి రక్షణ కార్యక్రమం చేపట్టి సాఫల్యాన్ని పొందిన నాలుగో దేశంగా భారతదేశం పేరుగాంచింది. అగ్ని మిస్సైల్ వ్యవస్థ అనేది భారతదేశ మిస్సైల్ చరిత్రలో ఒక ప్రత్యేకతను కల్గి ఉంది. ఈ మిస్సైల్ వ్యవస్థలో ఆరు రకాల మిస్సైల్స్‌ను రూపొందించారు. ఒక్కో మిస్సైల్ ఒక్కో ప్రత్యేకతను కల్గి ఉంది. వీటి వెనుక భారతదేశపు డిఆర్‌డిఓ సంస్థ శాస్తవ్రేత్తల కృషీ, శ్రమా ఎంతో ఉంది. అగ్ని-5ను 19 ఏప్రిల్ 2012 నాడు విజయవంతంగా పరీక్షించారు. అగ్ని-5 అగ్ని-5 అనేది 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని ఛేదించడానికి రూపొందించిన క్షిపణి. దీనే్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM - Inter continental Ballestic Missile) అంటారు. అణ్వస్త్ర సామర్థ్యం కల్గిన ఈ అగ్ని-5ని విజయవంతంగా ప్రయోగించి, భారతదేశం కయ్యానికి కాలుదువ్వే దేశాలకు హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చింది. దీని పొడవు 17.5 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో దీని బరువెంతో తెల్సా? కేవలం 50 టన్నులు. దీని రూపకల్పనలో 80 శాతం భాగాలు భారత్‌లోనే తయారైనవే. దీన్ని ఏ ప్రాంతం నుంచైనా ప్రయోగించడానికి వీలుగా మొబైల్ లాంచర్ ఉంది. ఇతర అగ్ని రకం క్షిపణులకు భిన్నంగా దీనికి నేవిగేషన్, డైరెక్షన్, వార్‌హెడ్, ఇంజన్ వంటి విభాగాల్లో ఆధునికతను జోడించారు. సొంతంగా రూపొందిన కాంపోజిట్ రాకెట్ మోటార్లు చక్కగా పని చేశాయి. కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు తప్ప మిగిలిన అన్ని భాగాలకీ స్వదేశీ పరిజ్ఞానానే్న వాడారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకి దాదాపు 3 ఏళ్లు పట్టింది. గత ఏడాది అగ్ని-4 ను ప్రయోగించారు. అది 3.5 కి.మీ. పరిధిని కల్గింది. అగ్ని-5 5 కి.మీ. పైబడిన దూరాల్లోని లక్ష్యాలను ఇట్టే ఛేదించగల క్షిపణిగా రూపొందింది. ఈ అత్యాధునిక క్షిపణి ప్రయోగంతో తొలిసారిగా చైనా భూభాగం మొత్తం దీని పరిధిలోకి వచ్చినట్లవడంతో దీన్ని రక్షణ శాఖ పరంగా ‘అత్యంత కీలక అస్త్రం’గా అందరూ పేర్కొంటున్నారు. ఇది తూర్పు ఐరోపా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాలనూ తాకగలదు. గత 15 ఏళ్లలో తయారైన మధ్య, దీర్ఘశ్రేణి క్షిపణుల్లో వరుసగా ఇది ఐదవది. 2014 నాటికి దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట రూపొందించిన అగ్ని-1 పరిధి 700 మీటర్లే. అదే అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 ల పరిధి వరుసగా 2.5 కి.మీ. 3 కి.మీ. 3.5 కి.మీ.లు ఉండగా అగ్ని-5 పరిధి 5 కి.మీ.లకు పెరగడం గమనార్హం. 2014 నాటికి సైన్యంలో ప్రవేశపెట్టేలోగా మరో రెండు పరీక్షలు జరపనున్నారు శాస్తవ్రేత్తలు. అగ్ని-1 పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకొని (కార్గిల్ యుద్ధం తర్వాత) కేవలం 18 నెలల రికార్డు సమయంలో రూపొందించారు. దాని తర్వాతనే మిగిలిన (2,3,4) క్షిపణుల రూపకల్పన జరిగింది. తాజాగా ఈ ఏడాది అగ్ని-5 విజయవంతం కావడంతో, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులున్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాల సరసన భారత్ పేరు ఆరవ దేశంగా పేర్కొనబడటం మనకందరికీ గర్వకారణం! * భారతీయ అణ్వాయుధ క్షిపణులివే! మిస్సైల్ శ్రేణి పరిధి పేలోడ్ స్థితి అగ్ని-1 SRBM 700 కి.మీ. 1000 కిలోలు వాడుకలో ఉంది అగ్ని-2 MRBM 2-3 కి.మీ. 500-1000 కిలోలు వాడుకలో ఉంది అగ్ని-3 IRBM 5 కి.మీ. 2490 కిలోలు వాడుకలో ఉంది అగ్ని-4 MRBM 3-3.8 కి.మీ. 500 - 1500 కిలోలు 2014-15కెల్లా వస్తుంది అగ్ని-5 ICBM 5-6 కి.మీ. 3000 కిలోలు + 2014-15 కెల్లా వస్తుంది అగ్ని-6 ICBM 5.2 - 10 కి.మీ.700-1400 కిలోలు అభివృద్ధి దశలో ఉంది ధనుష్ SRBM 350 కి.మీ. 500 కిలోలు రెడీ, వాడటం లేదు నిర్భయ్ SBCM 1000 కి.మీ. ? అభివృద్ధి దశలో ఉంది బ్రహ్మాస్-1 SCM 290 కి.మీ. 300 కిలోలు వాడుకలో ఉంది బ్రహ్మాస్-2 HCM 290 కి.మీ. 300 కిలోలు అభివృద్ధి దశలో ఉంది పి-70 అమెథిస్ట్ ASM 65 కి.మీ. 530 కిలోలు వాడుకలో ఉంది పి-270 మోఫ్కిట్SCM 120 కి.మీ. 320 కిలోలు వాడుకలో ఉంది పోపియా ASM 78 కి.మీ. 340 కిలోలు వాడుకలో ఉంది పృథ్వీ-1 SRBM 150 కి.మీ. 1000 కిలోలు వాడుకలో ఉంది పృథ్వీ-2 SRBM 350 కి.మీ. 500 కిలోలు వాడుకలో ఉంది పృథ్వీ-3 SRBM 350 కి.మీ. 500 కిలోలు వాడుకలో ఉంది సాగరిక (కె-15)SLBM 700 - 2.2 కి.మీ.150-1000 కిలోలు వేచి ఉంది కె-4 SLBM 3.5 కి.మీ. 150-1000 కిలోలు టెస్టింగ్ శౌర్య TBM 700 - 2.2 కి.మీ.150-1000 కిలోలు వాడుకలో ఉంది ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍============= మిస్సైల్ రకాలు SRBM -షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ MRBM -మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ SBCM -సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ IRBM -ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ICBM -ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ SCM -సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ HCM -హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ASM -యాంటీ షిప్పింగ్ మిస్సైల్ SLBM -సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ TBM -టార్పెడో బాలిస్టిక్ మిస్సైల్

శుక్ర గ్రహం....


 
 
 
                 రాత్రి సమయంలో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? చంద్రుని తర్వాత ప్రకాశవంతంగా కనిపించే ఒక పెద్ద నక్షత్రంలాంటిదాన్ని చూశారా? అదే 'శుక్ర గ్రహం'. ఇది సౌర కుటుంబంలో సూర్యునికి దగ్గరగా ఉన్న రెండో గ్రహం. ఇది నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూగోళంలాగే కనిపించే గ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి. ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 224.7 భూగోళ దినాలు పడుతుంది. ఇంగ్లీషులో ఈ గ్రహాన్ని 'వీనస్‌'గా పిలుస్తారు. అందాల దేవత, రోమన్‌ ప్రేమమూర్తికి ప్రతీకగా దీన్ని ఈ పేరుతో పిలుస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 6వ తేదీన సూర్యునికి భూమికి మధ్య ఒకే రేఖపైకి ఇది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది సూర్యగ్రహణంలా భూమి మీద సూర్యుడిలోని కొంతభాగాన్ని కప్పేస్తుంది. ఈ కప్పేసిన భాగం ఒక చివరి నుండి మరో చివరకు వెళుతుంది. దీనినే 'శుక్రగ్రహ అంతర్యానం (ట్రాన్సిట్‌ ఆఫ్‌ వీనస్‌)' అంటున్నాం. ఈ సందర్భంగా 'శుక్ర గ్రహం' గురించిన విజ్ఞానాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
భూగోళంలా సూర్యుని చుట్టూ తిరుగుతున్న నాలుగు గ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి. ఇది రాళ్లతో నిండి ఉంది. పరిమాణంలో, బరువులో కూడా భూగోళానికి దాదాపు దగ్గరగా ఉంటుంది. అందుకనే ఈ గ్రహా న్ని భూమి యొక్క 'సోదర గ్రహం లేదా జంట గ్రహం' అని పిలుస్తారు.
శుక్ర గ్రహం వ్యాసం 12,092 కిలోమీటర్లు. భూగోళం కన్నా ఇది 6,50 కిలోమీటర్లే తక్కువ. భూగోళంలో దీని బరువు 81.5 శాతం. అయితే, శుక్ర గ్రహ ఉపరితల వాతావరణం భూగోళంతో పోల్చినప్పుడు చాలా తేడా వుంది. శుక్రగ్రహ వాతావరణంలో దాదాపు 96.5 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాయువు ఉంది. మిగతాది (3.5%) నత్రజని. దీనికి విరుద్ధంగా భూగోళ వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ కేవలం 0.039 శాతం మాత్రమే ఉంది. నత్రజని దాదాపు 78.1 శాతం.



              శుక్రగ్రహ ఉపరితలంలో దాదాపు 80 శాతం చదునైన అగ్నిపర్వత మైదాన ప్రాంతం ఉంది. ఇది 70 శాతం ముడతలు, ఎత్తుపల్లాలతో కూడి ఉంది. కేవలం 10 శాతం మాత్రమే చదనంగా ఉంటుంది. మిగిలిన 20 శాతం రెండు ఎత్తయిన ఖండాలుగా ఉంది. ఉత్తరార్ధ గోళంలో మొదటిభాగం ఉండగా, మధ్యరేఖకు దిగువున దక్షిణార్థగోళంలో రెండోభాగం ఉంది. ఎత్తయిన పర్వతం (11 కి.మీ. ఎత్తు) 'ఇస్టార్‌ టెర్రా' ఉత్తరాన ఉండే మాక్సివెల్‌ పర్వతాల్లో ఇదొక భాగం. ఇది ఆస్ట్రేలియా ఖండమంత పరిమాణంలో ఉంటుంది. దక్షిణార్థ భాగాన్ని 'అఫ్రోడైట్‌ టెర్రా'గా పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా అంత పరిమాణంలో ఉంటుంది.

            శుక్రగ్రహ ఉపరితలాన అగ్నిపర్వతాల ప్రభావం అధికంగా ఉంది. భూగోళంలో కన్నా ఇది చాలా ఎక్కువ. 100 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 167 పెద్ద అగ్ని పర్వతాలు శుక్ర గ్రహంపై ఉన్నాయి. దీనితో పోల్చగల అగ్నిపర్వతం భూగోళం మీద హవాయి ద్వీపకల్పంలోని పెద్ద దీవిలో ఉంది. భూగోళ నిర్మాణంలో ప్రధానంగా కనపడే టెక్టానిక్‌ ప్లేట్లు (వీటి కదలికలతోనే భూకంపాలు వస్తాయి) శుక్ర గ్రహంలో కనిపించవు. దీనికి ఒక కారణం శుక్ర గ్రహ ఉపరితలం (300-600 మిలియన్‌ సంవత్సరాలు) భూగోళ ఉపరితలం (100 మిలియన్‌ సంవత్సరాలు) కన్నా పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.

              శుక్రగ్రహ అంతర్గత, రసాయనిక నిర్మాణం గురించి కచ్ఛితమైన సమాచారం లేదు. కానీ, భూగోళ నిర్మాణంతో పోల్చినప్పుడు సారూప్యత ఉంది. దీన్నిబట్టి శుక్రగ్రహంలో కూడా అంతర్భాగం (కోర్‌), మధ్య భాగం (మాంట్రిల్‌), ఉపరితల భాగం (క్రస్ట్‌) ఉన్నాయని అంటున్నారు. భూగోళంలాగా శుక్రగ్రహ అంతర్భాగంలో పాక్షికంగా ద్రవం ఉంటుందని భావిస్తున్నారు. సౌర కుటుంబ పరిణామక్రమంలో ఈ రెండు గ్రహాలు ఒకే విధంగా చల్లబడటం వల్ల ఇలా పరిణమించాయని అంటున్నారు. కానీ, భూగోళం కన్నా శుక్రగ్రహ పరిమాణం తక్కువ. దీంతో దీని అంతర్భాగ పీడనం భూగోళం కన్నా తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. శుక్రగ్రహ ఉపరితలం గట్టిగా ఉండటం కూడా మరొక కారణం. ఫలితంగా, శుక్ర గ్రహం నెమ్మదిగా చల్లబడుతుంది.


ఉపరితల వాతావరణం...

               శుక్రగ్రహ ఉపరితల వాతావరణ పీడనం భూగోళ పీడనంకన్నా 92 రెట్లు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సముద్రంలో ఒక కిలోమీటరు లోతు పీడనానికి సమానం. శుక్రగ్రహ వాతావరణంతో పాటు చిక్కని సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ మేఘాలు కూడా ఉన్నాయి. ఇది సౌర కుటుంబంలో బలమైన హరిత వాయువుల్లాంటి (వాతావరణాన్ని వేడిక్కించడం) ప్రభావాల్ని కలిగిస్తుంది. ఫలితంగా, ఉపరితల ఉష్ణోగ్రతలు 460 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉంటాయి. అయితే, కొన్ని వందల సంవత్సరాల క్రితం శుక్రగ్రహంపై భూగోళ వాతావరణంలాగే ఉండేదని అంటున్నారు. ఆ సమయంలో నీరు కూడా పెద్ద పరిమాణంలో దీనిపై ఉండేదని భావిస్తున్నారు. కానీ, నియంత్రణలేని హరిత వాయువుల ప్రభావంతో ఆ సహజనీరు ఆవిరై పోయింటుందని అంటున్నారు. అందువల్ల, ఇప్పటి శుక్రగ్రహ ఉపరితల పరిస్థితులు భూగోళంలోలాగా జీవం మనుగడకు దోహదపడవు. కానీ, దీనికి ముందు శుక్రగ్రహం మీద జీవం ఉన్నట్లు వీరు అనుమానిస్తున్నారు.
               శుక్రగ్రహం మీద ఉష్ణోగ్రత అంతగా మారదు. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ఉండవు. గాలులు గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతోనే వీస్తాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌ పొర మీద ఉన్న సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌ బిందువులతో కూడిన చిక్కటి మబ్బులు ఉంటాయి. ఇవి తమపై పడుతున్న సూర్యరశ్మిలో 90 శాతాన్ని పరావర్తనం చెందిస్తాయి. దీనితో శుక్రగ్రహ ఉపరితలాన్ని కంటితో చూడలేము, పరిశీలించలేము. శుక్ర గ్రహంపై శాశ్వతంగా ఉంటున్న ఈ చిక్కని మబ్బుల పొర వల్ల ఉపరితలం మీద వెలుగుండదు. శుక్రగ్రహంపై వీచే గాలులు దాని పరిభ్రమణ వేగంకన్నా 60 రెట్లు అధికంగా ఉంటాయి. కానీ, భూగోళంపై వీచే గాలులు దీని పరిభ్రమణం వేగంలో 10-20 శాతం వరకు మాత్రమే ఉంటాయి.
               శుక్రగ్రహ వాతావరణంలో ఓజోన్‌ పొర ఉన్నట్లు 2011లో కనుగొన్నారు. ఇది భూగోళ వాతావరణంతో సారూప్యత కలిగి ఉంది. అయితే దీనిపై అయస్కాంత ఆకర్షణ శక్తి చాలా చాలా తక్కువ. దాదాపు ఉండదు.

పరిభ్రమణం..
             సూర్యుని చుట్టూ 108 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో శుక్రగ్రహం పరిభ్రమిస్తుంది. ఈ భ్రమణ వివరాలు కింది ఇచ్చిన 'శుక్రగ్రహ అంతర్యానం' ఐటంలో వివరంగా తెలుపబడ్డాయి.

ఎగిరే పళ్లాలుగా భ్రమపడొద్దు..
             సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో శుక్రగ్రహం భూగోళాన్ని ప్రతి 585 రోజులకొకసారి దాటి వెళుతుంది. ఈ సమయంలో ఇది సాయంత్రపు నక్షత్రం నుండి ఉదయం నక్షత్రంగా కనిపిస్తుంది. మంచి వెలుతురు సమయంలో కూడా శుక్రగ్రహాన్ని గమనించకుండా ఉండలేం. గరిష్టస్థాయిలో సాగినట్లు కనపడడం అంటే నల్లటి ఆకాశంలోనూ సూర్యుడు అస్తమించాక చాలాసేపు కనిపిస్తుంది. ఈ సమయంలో శుక్రగ్రహాన్ని 'ఎగిరే పళ్లాలు'గా భావిస్తుంటారు. ఇలా భావించినవారిలో 1969లో అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ ఒకరట.

అమానుషం..( అశాస్త్రీయ ఆచారాలు )




                  'ఏమిటి లక్ష్మీకాంతం! నీరసంగా ఉన్నావు?' ఇంట్లోకి ప్రవేశిస్తూనే నన్ను గమనించి అడిగాడు సుబ్బారావు. 'అవును సుబ్బారావు! కర్నాటక రాష్ట్రంలో అమలులో ఉన్న ఈ దురాచారాన్ని చదివితే చాలా బాధ వేసింది. ఆ విషయమే ఆలోచిస్తున్నా' అంటూ చేతిలోని 'పీపుల్స్‌ డెమోక్రసీ' వారపత్రిక ఫిబ్రవరి 13, 2012 నాటి సంచికను అతని చేతికందించాను. అతను చదివి దీర్ఘంగా నిట్టూరుస్తూ ఇలా అన్నాడు.
'లక్ష్మీకాంతం! ఇది చాలా ఘోరమైన దురాచారం. ఉడిపిలాంటి దేవాలయంలో బ్రాహ్మణులు తిని వదిలేసిన అరిటాకుల మీద బ్రాహ్మణేతరులు పొర్లుతున్నారట! అలా పొర్లితే వారికి చర్మవ్యాధులు పోతాయట! దీనిని వైద్యుడైన ఒక కర్నాటక ఉన్నత విద్యాశాఖా మంత్రి డా|| ఆచార్య స్వయంగా ప్రకటించడం అత్యంత దారుణం.'
'నిజమే సుబ్బారావు! కర్నాటకలోని మరో ప్రముఖ నాయకుడు శ్రీరామరెడ్డి ప్రశ్నించినట్లు, అలా పొర్లితే చర్మరోగాలు తగ్గేట్లయితే ఆ ఎంగిలి విస్తళ్ళలో బ్రాహ్మణులూ ఎందుకు పొర్లడం లేదు? ఎంగిలి విస్తళ్ళలో పొర్లితే చర్మరోగాలు పోతాయని ఏ వైద్య పరిశోధనలూ నిరూ పించలేదే? అలా రోగాలు పోతాయని డా|| ఆచార్య నమ్మితే, శ్రీరామరెడ్డి కోరినట్లు రాష్ట్రంలోని చర్మవ్యాధుల ఆస్పత్రులు మూసేసి, చర్మ వ్యాధిపీడితులను ఎంగిలి విస్తళ్ళలో పొర్లించే ప్రక్రియను చేపట్టవచ్చు గదా?' అని ప్రశ్నించాను.
'అవును లక్ష్మీకాంతం! ఉడిపి శ్రీకృష్ణ దేవాలయ నిర్వాహణాధి పతి అయిన స్వామి విశ్వేశతీర్థ రాష్ట్రమంతటా తిరుగుతూ, హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ప్రచారం చేస్తున్నాడట! కానీ, తన మఠంలో, తన దేవాలయంలో జరిగే ఈ అమానుష అచారాన్ని రూపుమాపే చర్యలేవీ ఆయన తీసుకోవడం లేదు. 'ఈ దురాచారం ఇలా కొనసాగవలసిందేనా? దీనిని ఆపేదెలా?' ఆవేదనతో ప్రశ్నించాడు సుబ్బారావు.
'ఈ దురాచారం ఆగిపోవాలంటే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో పెరగాలి. అప్పుడు ప్రజలే ఉవ్వెత్తున, ఉప్పెనలా లేచి ఈ దురాచారాన్ని మట్టుబెడతారు. ప్రజల్లో అవగాహన పెరగటానికి ఈ దురాచారానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలలో ప్రచారం జరగాలి' అన్నాను నేను.
'ప్రజల్లో అవగాహన పెరగటానికి, తగిన ప్రచారాన్ని, నా శాయశక్తులా చేస్తాను' దృఢంగా అన్నాడు సుబ్బారావు.
'మంచిది సుబ్బారావు' మెచ్చుకోలుగా అన్నాను నేను.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

ఇంకా ఎండలు ఎందుకు తీవ్రంగా ఉన్నాయి?


ప్రస్తుతం ఈపాటికి వర్షాలు కురియాలి. కానీ ఇంకా ఎండలు తీవ్రంగా కాస్తున్నాయెందుకు? - ఎ.సాయికుమార్‌, 10వ తరగతి, వరంగల్‌
ఈ జవాబు రాసే సమయంలో వార్తాపత్రికల ద్వారా మరో వారంలో నైరుతీ ఋతుపవనాలు వస్తాయనీ ఈ పాటికే కేరళ తీరాలను తాకాయనీ వార్తలు వింటున్నాం. వాటికిదే మన సుస్వాగతం.
అయినా మీరన్నట్లు ఈసారి ఎండాకాలం కొంత వర్షాకాలంలోకి చొరబడింది. వర్షాకాలం ఆరంభం కొంత ఆలస్యమైంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి సిద్ధం. ఇందులో మొదటిది వర్షాకాలం ఆలస్యానికి 80 శాతం కారణం. రెండోదాని ప్రభావం ఇంకా తీవ్రంగా లేదు. దాని ప్రభావం చాలా వందల సంవత్సరాల పాటు కొంచెం కొంచమే ఉంటుంది.
మానవ తప్పిదం అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరి తప్పిదం కాదు. కేవలం ప్రకృతి వనరుల్ని తమ లాభాపేక్షతో దండుకొంటున్న పెట్టుబడిదారీవర్గం, దేశాలను కొల్లగొడుతున్న బహుళజాతి సంస్థల ధనదాహం, పర్యావరణానికి ఏమైనా తమ ఆధిపత్యమే నెరవేరాలన్న సామ్రాజ్యవాదపు ఆర్థిక రాజకీయ ప్రణాళికలే ఆ మానవ 'అమానవ తప్పిదాలు'.

భవన సముదాయాలకు, లాభార్జనలు వేగం కావడానికి, రోడ్ల నిర్మాణాలకు పంట పొలాల్ని మంటకలుపుతున్నారు. తద్వారా కొన్నినెలల పాటు పచ్చని పైర్లతో కళకళలాడుతూ సూర్యరశ్మిని ఆహారంగా మలచే కిరణజన్య సంయోగక్రియ జరిపే హరిత తెర మటుమాయమైంది. దరిమిలా సూర్యుని ప్రచండతాపం సరాసరి బీడుభూముల్ని తాకి కొంతభాగం భూమిచేత శోషణం (absorption) చెందుతోంది. మరికొంతభాగం పరావర్తనం చెంది వాతావరణాన్ని వేడిచేస్తోంది. భూమి పొరల్లో శోషణం చెందిన కొంతభాగం భూమి పొరల్లో ఉన్న నీటిమట్టాల్ని చేరి అక్కడున్న నీటిని ఆవిరి చేస్తోంది. కాబట్టి భూగర్భ నీటిమట్టాలు పడిపోతున్నాయి. భూగర్భ నీటిమట్టాలు తగ్గిపోతే మరింత తీవ్రరూపంలో సూర్యరశ్మి పరావర్తనం చెంది, వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. అదే భూమి మీద పైర్లు, పంటపొలాలు, చెట్లు, అరణ్యాలు, గుబురు పొదలు, చెరువులు, నదులు, వాగులు ఉన్నట్లయితే అవి సూర్యరశ్మిని ఉపయోగించుకొని పిండిపదార్థాలు, పళ్లు, కాయగూరల తయారీలో ఉపకరించేవి. అదే సమయంలో నీటిని వ్యాపారంచేసే సంస్థలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. అందరికీ చెందిన భూగర్భ జలాల్ని తమ తమ లోగిళ్లలో వేలాది అడుగుల లోతుల్లోంచి తోడేసి విపరీతమైన విద్యుచ్ఛక్తి వినిమయంతో రివర్స్‌ ఆస్మాసిస్‌ చేస్తూ అవి నీటిని అమ్ముకుంటున్నాయి.

భూగర్భ నీటిమట్టం (ground water table) ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. మరోవైపు పర్యావరణ కాలుష్యాల్ని వాతావరణంలోకి నెట్టడం వల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి, మీథేన్‌ తదితర హరిత గృహ వాయువుల (green house gases) పరిమితి మితిమీరుతోంది. ఫలితంగా వాతావరణం వేడెక్కి దానిలోని నీటిస్థాయిని వాయురూపంలోనే ఉంచేందుకు, ద్రవీభవించి వర్షంగా కురవకుండా చేసేందుకు పరిస్థితులు వేగవంతమవుతున్నాయి. మరోవైపు తీరప్రాంతాల్లో సెజ్‌ల పేరిట మోసగాళ్లకు వేలాది ఎకరాల్ని అంటగట్టి ప్రజాసంక్షేమం, ప్రకృతివనరుల పరిరక్షణను పక్కనపెట్టే విధానాలు అమలవుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుదత్పత్తిలో అధిక మోతాదు పట్టణవాసుల సుఖాలకు ఉపకరిస్తోంది. గ్రామీణవాసుల గుడిసెల్లోకి, పంట పొలాలకు నీళ్లిచ్చేందుకు కాదు. విద్యుదుత్పత్తిలో సింహభాగం పట్టణ ప్రయోజనా లకు వాడబడుతున్నా అందులో మళ్లీ సుమారు 80 శాతం పైగా ఎయిర్‌ కండిషనర్లకు, ఎయిర్‌ కూలర్లకు, రిఫ్రిజిరేటర్లకు, శీతల గిడ్డంగులకు, తదితర శీతలీకరణ సాధనాలకు ఖర్చవుతోంది.

ఇక్కడ శాస్త్రీయంగా రెండు విషయాలను మనం గమనించాలి. ఒక పదార్థాన్ని కొన్ని సెంటీగ్రేడు డిగ్రీల మేర వేడిచేయడం కన్నా అదే వస్తువును అన్నే సెంటీగ్రేడు డిగ్రీల మేర చల్లబర్చడానికి అయ్యే శక్తి ఎక్కువ. ఉదాహరణకు: A, B అనే ఒకే రూపం, నిర్మాణం, పదార్థ స్వభావం ఉన్న వస్తువులు ఉన్నాయనుకుందాం. A అనే వస్తువు ప్రస్తుతం 500C వద్ద ఉందనుకొందాం. B అనే వస్తువు200C వద్ద ఉందనుకొందాం. A ని పట్టుకొంటే మనకు వేడిగా అనిపిస్తుంది. B ని పట్టుకొంటే మనకు చల్లగా అనిపిస్తుంది. మనం B అనేె వస్తువును 200జ నుంచి 500C వరకు వేడిచేసి A లాగానే ఉష్ణోగ్రత ఉండేలా చేయాలని నిర్ణయించామనుకొందాం. అందుకోసం మనం వెచ్చించే ఉష్ణీకరణ శక్తి (Heating Energy) విలువ 100 కెలోరీలు అనుకుందాం. అంటే B మీద మనం 100 కెలోరీల శక్తిని ఖర్చుచేస్తే A స్థితి పొందగలమన్న మాట. కానీ అలాకాకుండా A నే B లాగా చేయాలని ప్రయత్నించాలనుకొందాం. అంటే 500C వద్ద ఉన్న A ని 200C వద్దకు తీసుకురావాలన్నది మన ప్రయత్నం.

అందుకోసం మనం వెచ్చించాల్సిన శక్తి 100 కెలోరీలు సరిపోదు. సుమారు 150 కెలోరీలు అవసరం. అంటే అర్థమేమిటి? 200C నుంచి 500జ (300C మేర) వేడిచేయడానికయ్యే ఖర్చుకన్నా 500C నుంచి 200C కి (300C మేర) చల్లబర్చడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఇది మన శక్తి నిత్యత్వ సూత్రానికి (law of conservation of energy) వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఆ సూత్రానికి అడ్డంకి రాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ చల్లబరిచే క్రమంలో చాలా వేడి వాతావరణంలోకి వెళ్తుంది. అలా వాతావరణంలోకి వెళ్లిన వేడిని కూడా లెక్కిస్తే శక్తి నిత్యత్వం అమలైనట్లే. ఇలా వేడి చేయడంకన్నా చల్లబర్చడానికి అధికశక్తి అవసరమన్న సూత్రాన్ని ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం (second law of thermodynamics) అంటారు.

అంటే ఎండాకాలంలో మనం వాడే ఎయిర్‌ కండిషనర్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల గిడ్డంగులు అంతర్గతంగా చల్లబరుస్తున్నా అంతకన్నా అధికంగా వాతావరణాన్ని వేడిచేస్తున్నట్లు అర్థం. ఇలా ఎన్నో విధాలుగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షాల రాకడ మందగిస్తోంది. ఒకవేళ మేఘాలు వచ్చినా అవి వర్షించే స్థితి కూడా సన్నగిల్లుతోంది. ఇక రెండో కారణం ప్రకృతి సిద్ధమన్నాం కదా. అది భూమి ఆత్మభ్రమణ అక్షం (axis of spin) దిశ మారడం (precession). ప్రతి 20 వేల సంవత్సరాలకు ఒకసారి భూమి ఆత్మభ్రమణాక్షం తిరుగుతుంది. తిరిగే బొంగరం వయ్యారం (wobbling) చేస్తున్నట్టు భూమి, భ్రమణాక్షం కూడా వయ్యారం చేస్తుంది. దీనర్థం ఏమిటంటే ప్రతి 10 వేల సంవత్సరాలకి ఒకసారి ఋతువుల్లో మార్పులు వస్తాయి. మరో ఐదు వేల సంవత్సరాల కాలంలో డిసెంబరులో వేసవి, మే నెలలో చలి ఏర్పడే స్థితి వస్తుంది. ఆ పరిస్థితికి జరిగే ప్రయాణం కూడా ఈ వేసవి విస్తారానికి ఓ చిరు కారణం.

పాలపుంతతో మరో గేలాక్సీ ఢీ..!


 
 
 
                 మన సౌర కుటుంబం ఉంటున్న ఒక గేలాక్సీ పాలపుంత, మరో భారీ గేలాక్సీ 'అన్ద్రోమెడ' రెండూ ఢీ కొట్టుకునే అవకాశం ఉందని అంతరిక్ష పరిశోధకులు అంటున్నారు. అన్ద్రోమెడలో 2002, 2010లో ఒకే నక్షత్రాన్ని కనుగొన్న బాల్టిమోర్‌లోని పరిశోధకులు ఆ గేలాక్సీ పాలపుంత మీదికి వస్తున్నట్టుగా కనిపెట్టారు. అన్ద్రోమెడ ప్రస్తుతం 2.5 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరాన ఉంది. అది పాలపుంత మీదకు గంటకు 2,50,000 మైళ్ల వేగంతో వస్తోంది. ఈ రెండు గేలాక్సీలూ ఏకమైతే మన సూర్యుడు స్థానభ్రంశం చెంది మొత్తం సౌర కుటుంబం విచిత్రంగా విడిపోతుందని కొంతమంది లెక్కలు కట్టారు. అయితే, ఈ మహాకూటమి జరగడానికి మరో నాలుగు బిలియన్‌ సంవత్సరాల కాలం పడుతుందట!

ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం

ఈ దినోత్సవాన్ని మొదట 1992, బ్రెజిల్‌లో జరిగిన 'అత్యున్నత స్థాయి భూగోళ సమావేశం (ఎర్త్‌ సమ్మిట్‌)'లో కెనడా ప్రతిపాదించింది. దీనిని ఐక్యరాజ్య సమితి 2008లో అధికారికంగా గుర్తించింది. మహాసముద్రాల రక్షణ ఒక జీవన విధానంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘమైన, శాశ్వతమార్పులు తీసుకురావడానికి 2011-12లో దీన్ని 'యువకులు - మార్పుకోసం వచ్చే కొత్త అలలు' అనే లక్ష్యంతో నిర్వహించాలని ప్రకటించింది. పర్యావరణ సమస్యలపై వీరికి గల ఆసక్తి, అవగాహన ఈ సమయంలో దృష్టిలో ఉంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యారాజ్యసమితి ప్రధానకార్యదర్శి సందేశమిస్తూ 'సముద్రాల పర్యావరణ పరిరక్షణ బాధ్యత' మనందరిపై ఉందని, ఈ వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. మానవ సంక్షేమంలో సురిక్షతమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తినివ్వగల మహా సముద్రాలు, సముద్రాలు మన ఆర్థిక భద్రతకు, సుస్థిరాభివృద్ధిలో అంతర్గత భాగమని ఆయన నొక్కి చెప్పారు.

సముద్రాలు... మహా సముద్రాలు...

భూగోళ, జీవ పరిణామక్రమంలో కీలకపాత్ర పోషించినవి ప్రధానంగా రెండు శక్తులు. సౌరశక్తి మొదటిది కాగా, రెండోది నీరు. భూగోళ ఉపరితలంలో ఉన్న మొత్తం నీటిలో 97 శాతం సముద్రాలు, మహా సముద్రాలలో ఒకేచోట ఉన్నది. భూగోళ వాతావరణం, ఋతుపవనాలు, వర్షం రాకపోకలను, ఉష్ణోగ్రతలను నియంత్రించటంలో సముద్రాలు, మహా సముద్రాలే కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య రవాణాలో 90 శాతం సముద్రం, మహా సముద్ర మార్గాల ద్వారానే ఇప్పటికీ జరుగుతుంది. సముద్ర ఉత్పత్తులు (చేపలు, పీతలు, రొయ్యలు తదితరాలు) మానవ ఆహారంలో ఒక ముఖ్యభాగంగా కూడా కొనసాగుతున్నాయి. వీటి సేకరణ వాటి పునరుజ్జీవశక్తిని మించడంతో ఈ వనరులు క్రమంగా క్షీణిస్తున్నాయి. మానవ నాగరికత, సంస్కృతి వీటితో మమేకమై ఉన్నాయి. ఇంత ప్రాముఖ్యత కలిగిన సముద్రాలను, మహా సముద్రాలను కలుషితం చేసే చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. వివిధ పరిశ్రమల కాలుష్యాలకు అంతిమ గమ్యంగా సముద్రం మారిపోయింది. సహజవాయువు, ముడిచమురు వెలికితీతలో, వీటి రవాణాలో జరుగుతున్న ప్రమా దాలు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. ఇవి జలచరాల సుస్థిరతను దెబ్బతీస్తాయి. మానవ జీవితం లో మహా సముద్రాల ప్రాధాన్యతను గుర్తుచేసి, ఆలోచింపజేసి, పరిరక్షించేందుకు వీలుగా 2008 నుండి జూన్‌ 8వ తేదీని 'ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం'గా జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 2011-12లో దీన్ని 'యువకులు - మార్పుకోసం వచ్చే కొత్త అలలు' అనే లక్ష్యంతో నిర్వహించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సముద్రాలు, మహా సముద్రాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

           భూగోళంపై అతి భారీగా నీరు ఒకేచోట ఉండటం ద్వారా మహాసముద్రాలు ఏర్పడతాయి. ప్రపంచంలో ప్రధానంగా ఐదు మహా సముద్రాలున్నాయి. ఇవి: ఫసిఫిక్‌, అట్లాంటిక్‌, హిందూ, ఆర్కిటిక్‌, దక్షిణ మహా సముద్రాలు. ఇవికాక, 12కు పైగా సముద్రాలున్నాయి. వీటిలో మధ్యదరా సముద్రం అతి పెద్దది. మహా సముద్రాలు, సముద్రాలు వివిధ ఖండాల్ని వేరు చేస్తున్నాయి. మహా సముద్రాల మధ్య సరిహద్దు లంటూ ఏమీలేవు. కానీ, వీటిమధ్య నీరు అంతర్గతంగా, బహిర్గతంగా ఎప్పుడూ ప్రవహిస్తూ (కరెంట్స్‌) కలుస్తూ ఉంటుంది. మహా సముద్రాలు, సముద్రాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. సముద్రాలు, మహా సముద్రాలకన్నా చాలా చిన్నవి. సముద్రభాగం ఏదోమేర భూభాగంతో కలిసి ఉంటుంది. సముద్రం, భూమి కలిసే ప్రాంతాన్ని సముద్రతీరంగా వ్యవహరిస్తున్నాం. దీనికి విరుద్ధంగా మహా సముద్రం మరొక మహా సముద్రం లేక సముద్రంతో కలిసి ఉంటుంది.
లవణాలు..
సముద్రంలోని నీరు ఎప్పుడూ లవణాలతో కూడి ఉంటుంది. వీటిలో సోడియం లవణమే ఎక్కువగా ఉంటుంది. మిగతా వివరాలను 'లవణాల పరిమాణం' ఐటంలో చూడండి. భూమిపై వర్షాలు పడటం ప్రారంభమైనప్పటి నుండీ నీరు ఎత్తు ప్రాంతం నుండి పల్లపు ప్రాంతాలకు నదుల ద్వారా ప్రవహిస్తూ సముద్రాలుగా ఏర్పడ్డాయి. సముద్రాలలోని నీరు ఆవిరై తిరిగి వర్షంగా భూమీపై పడి, భూమిలోని లవణాలను కరిగించుకుని, మోసుకుంటూ నదుల ద్వారా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. ఇలా సముద్రంలో లవణాలు నిరంతరం చేరుతుంటాయి. వీటి నుండి నీరు మాత్రమే ఆవిరవుతుండటంతో సముద్రా లలో లవణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
లవణాల పరిమాణం..
సముద్రపునీటిలో లవణాలు కరిగి ఉంటాయి. వీటి పరిమాణం (శాతంలో) కొద్దిగానే మారుతుంటుంది. నీరు ఆవిరిగా మారడంపై, వర్షం మీద ఇది ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లవణ పరిణామాలు సహజంగా తగ్గిపో తాయి. అదేనీరు వేగంగా ఆవిరయ్యేకాలంలో లవణ పరిమాణం కొద్దిగా పెరుగు తుంది. వర్షాకాలంలో వరదనీరు పెద్దఎత్తున వచ్చి కలిసినప్పుడు కొంతమేర లవణ శాతం తగ్గుతుంది. నీరు గడ్డకట్టడం, కరగడమూ లవణ పరిమాణాల్ని ప్రభావితం చేస్తాయి. నీరు గడ్డకట్టినప్పుడు తాత్కాలికంగా లవణ పరిమాణం పెరుగుతుంది. కరి గినప్పుడు తగ్గుతుంది. సముద్రపునీటిలో సగటున 3.5% లవణాలున్నాయి. ఈ లవ ణాల్లో 55% క్లోరైడ్‌ రకానికి చెందినవి. 7.7 % సల్ఫేట్స్‌, 0.4% బై కార్బొనేట్స్‌, 0.2% బ్రోమైడ్‌రకాలు. 0.003% ఫ్లోరైడ్‌, 30.6% సోడియం, ఆ తర్వాత మెగ్నీషియం 3.68%, కాల్షియం 1.18%, పొటాషియం1.11% మేర లవణాలు ఉన్నాయి. లవణ పరిమాణమార్పులు జలచరాలను ప్రభావితం చేస్తాయి.
నీటి కదలిక..
సముద్రాలలో నీరు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నిరంతరం కదులుతూ ఉంటుంది. అలలు, ఆటుపోట్లు, అంతర్గత ప్రవాహం ద్వారా నీరు కదులుతుంది. గాలి వేగంగా వీయడం వల్ల అలలు ఏర్పడతాయి. అయితే, వీటి వల్ల భారీగా నీరు కదలదు. సముద్రతీర ప్రాంతాలలోనే ఈ అలల తాకిడి గరిష్టంగా ఉంటుంది. మహాసముద్రాలలో అలల ప్రభావం కనపడదు.
ఆటూపోట్లు..
చంద్రుని కదలికల్ని బట్టి (చంద్రోదయం, అస్తమ యం, పౌర్ణమి, అమావాస్య) నీరు ఆటూపోట్ల ద్వారా స్థానభ్రంశం చెందుతుంది. ఈ సమయంలో భూభాగం పైకి నీరు కొన్ని అడుగుల నుండి కిలోమీటర్ల వరకూ విస్తరించి, వెనుదిరుగుతుంది. అంతర్గత ప్రవాహాలు సముద్రాలలో ప్రధానంగా ఉష్ణోగ్రతల తేడాల వల్ల కలుగుతాయి. ఈ కదలిక సముద్రాల మధ్య ఉంటుంది. ఉపరితల, అంతర్గత ప్రవాహాలు మహా సముద్రాలలో మెల్లగా ఉంటాయి. ఉత్తరార్ధ గోళంలో గడియారపు ముల్లు దిశలో, దక్షిణార్ధ గోళంలో గడియారపు ముల్లుకు వ్యతిరేకదిశలో ఈ ప్రవాహాలు ఉంటాయి. ఉష్ణోగ్రతల్లోని తేడాలు, గాలి కదలికలు కలిసి భూ ఉపరితల వాతావరణంలో ఆవిరి రూపంలో నీటి కదలికల్ని సృష్టిస్తాయి. ఈ కదలికలు మేఘాల ఏర్పాటుకు దారితీస్తాయి. ఆ తర్వాత, ఋతుపవనాలు సృష్టించబడి, వాటి కదలికలకు తోడ్పడతాయి. ఇవి వర్షాల్ని కురిపిస్తాయి.
లోతు..
సముద్రపు సగటు లోతు సుమారు 4000 మీటర్లు. కానీ, కందకాల్లో 11 వేల మీటర్ల (11 కి.మీ.) వరకూ ఉండవచ్చు. లోతును బట్టి సముద్రాన్ని మూడు మండలాలుగా గుర్తించారు.
కిరణజన్య సంయోగక్రియ మండలం: సముద్రం పై నుండి 200 మీటర్ల లోతు వరకూ ఇది విస్తరించి ఉంటుంది. చూడటానికి దీనిలోని నీరు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీనిలో సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, నక్షత్ర చేపలు, ఆల్చిప్పలు, ష్రింప్స్‌, తాబేళ్లు, తదితరాలు సూక్ష్మదర్శినితోనే చూడగల కోట్లాది వృక్షజాతి ప్లాంక్టన్‌లు అనే సూక్ష్మజీవులు దీనిలో ఉంటాయి. వృక్షజాతికి చెందిన ఈ ప్లాంక్టన్‌లు సూర్మరశ్మిని ఉపయోగించుకుని, స్వయంగా ఆహారం తయారుచేసుకొని, వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవుల్ని చేపలు, ఇతర జలచరాలు ఆహారంగా తీసుకొంటూ వృద్ధి చెందుతాయి.
మసక వెలుతురు (ట్విలైట్‌) మండలం: ఇది 200 మీటర్ల నుండి 1000 మీటర్ల మధ్య ఉంటుంది. దీనిలో ఉష్ణోగ్రత దాదాపు నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌ ప్రాంతంలో ఉంటుంది. కాకపోతే లోతుకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల వరకూ తగ్గుతుంది. ఈ మండలంలో డాల్ఫిన్స్‌, వేర్స్‌ తదితర జలచరాలు ఉంటాయి.
చీకటి (డార్క్‌) మండలం: దీనిలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. దీంట్లో కూడా పెద్ద పెద్ద జలచరాలు ఉంటాయి. అన్నింటికన్నా అడుగుభాగాన గుమ్మడికాయ ఆకారంలో సముద్రజీవాలు ఉంటాయి.
అడుగుభాగం..
ఇది ఎత్తుపల్లాలతో కూడి ఉంటుంది. ఎక్కువభాగం చదునుగా ఉంటుంది. మధ్యలో 'రిడ్జ్‌'భాగాలూ, అడుగున పర్వతాలూ ఉంటాయి. దీన్ని పర్వతభాగం అంటాం. ఒంపులు, కందకాలు (లోతైన పెద్దగుంటలు), అగ్నిపర్వతాలూ ఉంటాయి. ఈ అగ్నిపర్వ తాలు పేలుతుంటాయి. ఈ పేలుళ్లతో వెలువడిన లావా చల్లబడి పర్వతాలు, ఎత్తు పల్లాలు ఏర్పడతాయి. (సముద్రపు అడుగుభాగం బొమ్మలో చూడండి.)
అసలు నీరే లేకపోతే..?
భూమిపై అతి భారీగా ఉన్న నీరు ఉష్ణోగ్రతల్ని అదుపులో ఉంచుతుంది. త్వరగా వేడెక్కకుండా, చల్లారకుండా నిలువరిస్తుంది. తద్వారా జల, భూ చరాల మనుగడకి, అభివృద్ధికి దోహదపడుతుంది. వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. భూగోళం మీద ఈ నీరే కనుక లేకపోతే ఎలాంటి పరిమాణాలు వస్తాయో తెలుసుకోవాలంటే శుక్ర గ్రహంపై ఉన్న వాతావరణస్థితిని, అక్కడ పూర్తిగా అంతరించిన జీవరాశిని అర్థంచేసుకోవాలి. శుక్రగ్రహ వాతావరణ పరిస్థితుల గురించి ఇదే పేజీలో గతవారమే వివరంగా ఇవ్వడం జరిగింది. క్లుప్తంగా శుక్ర గ్రహ ఉపరితల వాతావరణం 460 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉంటుంది. రాత్రి, పగలూ ఈ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదు. ఆక్సిజన్‌ ఉండదు. కాబట్టి దీనిపై ఏ జీవం కొనసాగడానికీ అవకాశం లేదు. ఒకప్పుడు శుక్ర గ్రహం మీద భూమిపైలాగే సముద్రాలున్నాయని భావిస్తున్నారు. అక్కడ నియంత్రణ లేని హరిత వాయువుల ప్రభావం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు విడుదలై నీరంతా ఆవిరైపోయిందట! అయితే, ఆ శుక్ర గ్రహంలో 'ఆకర్షణ శక్తి' దాదాపు లేకపోవడంతో వెలువడిన వాయువులు గ్రహ అంతర్భాగంలోకి వెళ్లాయి. అప్పుడున్న జీవాలు నశించిపోయాయి. అక్కడి వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ మాత్రం ప్రస్తుతం 96.5% ఉంది. వాతావరణం లో నత్రజని 3.5% మాత్రమే ఉంది. సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌ ఎక్కువగా మేఘాల రూపంలో ఉంది. భూగోళంపై జీవానికి అనుకూలంగా లేని అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సముద్రాల్ని కాపాడుకుంటూ హరిత వాయువుల్ని నియంత్రించాలి. ఇది శుక్ర గ్రహం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం.

Saturday, 26 May 2012

ప్రాణాయామం


యోగాలో ప్రాణాయామానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని శరీరమంతా వ్యాపింపజేయడం. శ్వాసకు ప్రాణానికి, శ్వాసకు మనస్సుకు చాలా దగ్గర సంబంధముంది. శ్వాసను స్వాధీనపరచుకుంటే మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ప్రాణాయామాన్ని పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం, అర్ధపద్మాసనాలలో ఏదో ఒక ఆసనంలో ఉండి చెయ్యాలి. వెన్నుముక, తల నిటారుగా ఉండాలి. ఖాళీ కడుపుతో చెయ్యాలి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట, ఛాతి బాగాలు ముందుకు రావాలి. వదలినప్పుడు లోపలికి వెళ్లాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చెయ్యాలి. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు విశాలమై ఆక్సిజను శరీరంలోకి ఎక్కువగా చేరుతుంది. ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ ఆక్సిజన్‌ సరఫరా జరిగి బాగా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రాణాయామం చేయడానికి పద్మాసనం, వజ్రాసనం అత్యంత అనుకూలమైనవి. ఈ ఆసనాలలో ఎంత సేపు కదలకుండా కూర్చున్నా శరీరంలో ఎలాంటి నొప్పులూ రావు.
పద్మాసనం : కింద కూర్చుని రెండు కాళ్లను చాపాలి. మొదట కుడికాలును ఎడమ తొడపైన, ఆపై రెండవ కాలును చేతులతో పట్టుకుని కుడితొడపైన ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చిన్‌ముద్రలో ఉంచుకోవాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు జాగ్రత్తగా వెయ్యాలి. లేదా వారు అర్ధ పద్మాసనంలో వేయొచ్చు.
వజ్రాసనం : రెండు కాళ్లను వెనకకు ముడిచి, రెండు మడిమలు పిక్కలకు అంటి ఉండేటట్లు ఉంచి, కాలి బొటన వేళ్లు ఒకదానికొకటి దగ్గరగా కలిపి ఉంచాలి. తల, వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులు చిన్‌ముద్రలో ఉంచాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువగా ఉన్న వారు కొన్ని రోజుల వరకు వజ్రాసనం వెయ్యకూడదు.
- డాక్టర్‌ రాచమల్ల రంగనాథ్‌రెడ్డి
మిత్ర యోగ సెంటర్‌, కడప.
సెల్‌ : 9440074773

Wednesday, 23 May 2012

అబ్బా! వడదెబ్బ!

వేసవిలో తరచుగా వడదెబ్బ కారణంగా చనిపోయారనే వార్తలు వార్తాపత్రికల్లో ఎక్కువగా చదువుతుంటాం. వడదెబ్బ ప్రతి ఒక్కరినీ నిస్సత్తువకు గురిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీనిబారిన పడినపుడు కోలుకోవడానికి సమయం పడుతుంది. దీనంతటికీ వేసవిలో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతే కారణం. వాతావరణంలో ఉష్ణోగ్రత మన శరీరంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఈ మధ్య నలుగురు పిల్లలు కారెక్కి సరదాగా ఆడుకుంటూ తలుపులు మూసుకున్నారు. తరువాత వాటినెలా తెరవాలో అర్థంకాక, ఆ సమయంలో వారినెవరూ చూడకపోవడంతో మరణించారు. దీనికి కారణం వాహనంలో ఉండే అతి వేడి. ఆటోమొబైల్స్‌ వెహికల్స్‌లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి మన శరీరంలో ఉండే కణాలు దెబ్బతింటాయి. మన శరీరానికి లవణాలు, నీరు ఆ సమయంలో అందదు. ఇవి ప్రాణాంతకం. దీన్నిబట్టే తెలుసుకోవచ్చు వేడి ఎంత ప్రమాదకరమో!
ప్రపంచంలో అధిక మరణాలకు కారణం గుండెజబ్బులు. ఎక్కువ ఉష్ణోగ్రతలవల్ల కలిగే మరణాలు రెండో కారణం. అంటే, అధిక ఉష్ణోగ్రతవల్ల కలిగే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అందువల్ల ఈకాలంలో ఎండబారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసుంటే ప్రమాదాలను చాలావరకు నివారించొచ్చు. నీరు తరచుగా తీసుకోవడం, ప్రయాణాలు చేస్తున్నపుడు ఇంటినుండి నీరు తీసుకెళ్లడం చాలా ఉపయోగపడుతుంది.
కాలానికి తగ్గట్లు నూలు దుస్తులు వేసుకోకపోవడం వడదెబ్బకు మరో కారణం. నైలాన్‌, పాలిస్టర్‌ దుస్తులు ఎండాకాలంలో గాలి సోకనివ్వవు. శరీరానికి చెమట పట్టనివ్వవు. ఆ కారణంగా ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
వేసవిలో వ్యక్తిగత శుభ్రత లోపించినపుడు చెమటకాయలు, దురదలు రావచ్చు. మామూలుగా ఎండ ఎక్కువగా ఉన్నపుడు 'ఇబ్బంది'గా , అసౌకర్యంగా అందరికీ అనిపిస్తుంది. అంతేకాకుండా చికాకు, చెమట, నోరు ఎండిపోవడం, తల తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది. సరైన సమయంలో నీళ్లు తాగనపుడు పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. ఒక్కోసారి తల తిరగడం, స్పృహ తప్పడం, కిందపడిపోవడం వంటివి ఆ వ్యక్తికి అపాయకరంగా మారతాయి. అలాంటి సమయంలో వైద్యుని వద్ద చికిత్స అవసరం.
పెద్దవాళ్లకంటే పిల్లలకు చెమటలు తక్కువ. ఇదికాక వాతావరణంలోని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆటల మూలంగా పిల్లల శరీరంలో వేడి ఎక్కువగా పుడుతుంది. అలాగే పొలంపనులు చేసేవారికి, వంటగదిలో ఎక్కువసేపు ఉండే మహిళలకు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుంది.
డా. శ్యామలాంబ, శిశు వైద్య నిపుణులు (వచ్చేవారం తరువాయి భాగం...)

మన జీర్ణాశయం కూడా మాంసమే కదా! మరి అది జీర్ణమైపోదా?


ఇతర మాంసాహార జంతువుల్లాగే మనలో మాంసాహారులు మాంసాన్ని తింటారు. అది మన జీర్ణాశయంలో జీర్ణమవుతుంది. మరి మన జీర్ణాశయం కూడా మాంస పదార్థమే కదా! అదెందుకు జీర్ణం కాదు? - టి.అజరుకుమార్‌, 10వ తరగతి, మెదక్‌
మన జీర్ణవ్యవస్థ (Digestive System) అనే రహదారిలో నోరు, ఆహారవాహిక (oesophagus), జీర్ణా శయం (stomach) , ఉత్తరాంత్రం (duodenum), చిన్న ప్రేవులు (small intestine), పెద్దప్రేవులు (large intestine),మలద్వారం (anus) ప్రధానమైన మైలురాళ్లు. మనం బతకాలంటే శక్తికావాలి. యంత్రాలను విద్యుచ్ఛక్తి, ఇంధనాలు నడిపించినట్లే మనల్ని, ఇతర జీవజాతులన్నింటిని జీవంతో ఉండేలా నడిపించేది మనం తిన్న ఆహారం ద్వారా ఉత్పన్నమయిన జీవరసాయనాలలోని రసాయనికశక్తే (chemical energy). కేవలం సుమారు నాలుగు కేజీల బరువుతో శిశువుగా జన్మించిన మనల్ని వయస్సు పెరిగే కొద్దీ మన దేహాన్ని కండరాలతోను, ఎముకలతోను, ఇతర వివిధరకాల దేహ నిర్మాణాలతోను మన బరువును 50 కి.గ్రా. పైగా పెంచేది కేవలం మనం తిన్న ఆహార పదార్థాలలోని పాదార్థికాలే. మన శరీరంలో వివిధ పనులు నెరవేర్చడానికి హార్మోనులు, ఎంజైములు కావాలి. ఇంటి కట్టడంలో స్తంభాలు (pillers), శ్లాబులు ఎలాగో మన శరీరంలో అస్తిపంజరం (skeletal system) అలాంటిది. అయితే ఇంటిని చూడగానే మనకు శ్లాబులు, స్తంభాలు కనిపించవు. వాటిని ఆచ్ఛాదన చేస్తూ గోడలు, కిటికీలు, అందాలు సొబగిన ఎలివేషన్లు, ఆకర్షణీయమైన పైకప్పులు, నేలలు (flooring) తదితర నిర్మాణాలే. ఇవే మన శరీరంలో ప్రధాన కండర నిర్మాణాలు. కండరాలు, ఎంజైములు, చాలా హార్మోనులు ప్రోటీను నిర్మితాలు. ఈ ప్రోటీన్లు మనకు మనం తిన్న ఆహారంలో మాంసకృత్తుల ద్వారా లభ్యమవుతాయి. వ్యక్తులు మాంసాహారులైనా, శాకాహారులైన (vegetarians) తమ ఆహారంలో మాంసకృత్తులు (proteins) ఉండాల్సిందే! మాంసాహారులకు అది మాంసం, చేపలు, గ్రుడ్లు, పప్పుదినుసుల ద్వారా లభ్యంకాగా శాకాహారులకు పప్పుదినుసులు, గ్రుడ్లు (నేటి ఫారం గుడ్లలో జీవం ఉండదు కాబట్టి అవి కూడా శాకాహారమేనన్న దృక్పథంలో సేవించేవారి విషయంలో) సమకూర్తాయి. మనం నోటి ద్వారా ముద్దలుగా లేక చిన్న చిన్న శకలాలు (pices) గా ఆహారం భుజించే క్రమంలో ఆహారపు ముద్దల్లోని పిండిపదార్థాలు మన లాలాజలం (saliva) లో ఉండే టయలిన్‌ అనే ఎంజైము సమక్షంలో పాక్షికంగా జీర్ణమవుతాయి. అదే సమయంలో లాలాజలంలోని మ్యూకస్‌ వంటి జిగురు పదార్థం వల్ల ఆహారపు ముద్దలు సులభంగా ఆహారవాహిక ద్వారా మన జీర్ణాశయాన్ని చేరుతుంది. జీర్ణాశయం మన వంటింట్లో మిక్సీ లేదా రోలు-రోకలిలాంటిదన్న మాట. పదార్థాల్ని కలగాపులగంగా పిండి చేసి జీర్ణవ్యవస్థలో తర్వాతి భాగమైన ఉత్తరాంత్రానికి పంపడమే కాకుండా మాంసకృత్తుల్ని జీర్ణం చేస్తుంది. మాంసకృత్తులంటే అమైనో ఆమ్లాలనబడే పూసల దండ. అమైనో ఆమ్లమంటే ఓ చివర అమీన్‌ (-NH2) అనబడే క్షారధర్మ (basic character) భాగం, మరో చివర ఆమ్లధర్మ (acidic character) మున్న కార్బాక్సి(-COOH) అణువన్నమాట. ఉదా: గ్లైసీన్‌ అనే అమైనో ఆమ్లాన్నే తీసుకొందాం. దాని నిర్మాణం H2N-CH2-COOHగా ఉంటుంది. ఇలాంటి పూసలు రెండు కలిస్తే NH2 లోని H భాగం, -COOH లోని -OH భాగం కలిసి నీటి అణువుగా బయటికి వెళ్లి H2N-CH2-CO-NH-CH2-COOH లాంటి ద్విఅమైనో ఆమ్లపు ముక్కగా ఏర్పడింది. అంటే రెండు ఇనుపముక్కల్ని వెల్డింగ్‌ చేసినట్లుగా వేలాదిగా CO-NH అనే అమైడు బంధాలతో అమైనో ఆమ్లాలే విడివిడి పూసల్లాగా ప్రోటీను అనబడే దండ ఏర్పడుతుంది. జీర్ణప్రక్రియలో తిరిగి H2O అనే నీటి అణువును -OH,-H లాగా చీల్చి-CO-NH- లో CO- uó²>±“¿ì -OHను, -NH- భాగానికి H అతికించాలి. ఈ ప్రక్రియనే ప్రోటీన్ల జీర్ణక్రియ అంటాము. లేదా రసాయనికంగా ప్రోటీన్ల జల విశ్లేషణం (Protein Hydrolysis) అంటారు. కానీ సాధారణ రసాయనిక ప్రయోగశాలల్లో ఈ అమైడు బంధాల జల విశ్లేషణ జరగాలంటే మితిమీరిన ఉష్ణోగ్రత కావాలి. అమ్ల పరిస్థితులు కావాలి. మన శరీరంలో అలాంటి ఉష్ణోగ్రత ఉండదు. కాబట్టి ఎంజైములనబడే ఉత్ప్రేరకాల (catalysts) సమక్షంలో దేహ ఉష్ణోగ్రత వద్దే ఈ చర్య జరుగుతుంది. ఈ పని మన పొట్టలో జరుగుతుంది. పొట్ట గోడల్లో ఉదజహరికామ్లాన్ని (Hydrochloric acid-HCl) స్రవించే గ్రంథులెన్నో ఉంటాయి. అదే గోడల్లో మరోచోట పెప్సిన్‌ అనే ఎంజైము కూడా ఊరుతుంది. మన జీర్ణవ్యవస్థలోను, ఇతర జంతువుల జీర్ణవ్యవస్థలోను పొట్ట (దీన్నే తెలుగు అకాడమీ వారు జఠరకోశం అంటారు) నిర్మాణం చాలా పకడ్బందీగా ఉండడంవల్ల పొట్ట గోడల్లోని గ్రంథుల్లో ఉద్భవించిన HCL ఆమ్లము, పెప్సిన్‌ ఎంజైముల మిశ్రమం (జఠరరసం లేదా gastric juice) పొట్టలోని సంచి (sac) భాగంలోకి వస్తుంది తప్ప పొట్టగోడల వైపునకు కలిసి మిశ్ర మంగా వెళ్లదు. పైగా పొట్టగోడలి లోపలివైపున రసాయని కంగా జడత్వం కలిగిన పలుచటి పింగాణీ (ceramic పొరలాగా కవచ నిర్మాణం ఉంటుంది. అందువల్ల జీర్ణప్రక్రియలో పొట్ట జీర్ణం కాదు. జీర్ణప్రక్రియలో ప్రోటీన్ల దండ నుంచి పూసలు, పూసలుగా విడిపడ్డ అమైనో ఆమ్లాలు, ఉత్తరాంత్రం దాటుకొని, చిన్నప్రేవుల గోడల్లో ఉన్న విల్లై (villi) అనే చూషకాల (suckers) ద్వారా జల్లెడ పట్టినట్లుగా రక్తంలో కలుస్తాయి. జీర్ణంకాని చెత్తాచెదారం పెద్దపేవుల దగ్గర గట్టిపడి మలం (faeces) రూపంలో విసర్జించబడుతుంది. రక్తంలో చేరిన అమైనో ఆమ్లాల పూసల్ని మన శరీరధర్మశాస్త్రం (Physiology) వివిధ నిర్మాణాలకు ఉపకరించుకొంటుంది. పొట్ట గోడలకున్న పింగాణీ నిర్మాణం వల్ల పొట్టలో ఉన్న జఠర రసం పొట్టను జీర్ణం చేయలేదు. అడపా దడపా ఈ పింగాణీ పొరలో నెర్రెలు (gaps) ఏర్పడితే అపుడు ఆమ్లపు ప్రభావానికి మన పొట్టలో పుండ్లు (ulcers) వస్తాయి. వైద్యులను సంప్రదించి, చికిత్స చేసుకోవాలి.

ముద్రణ చెరిపేసే టెక్నిక్‌..!


ముద్రించిన కాగితాలపై నుండి ఇంకుని చెరిపివేసే ప్రక్రియను కనుగొన్నామని పరిశోధకులు అంటున్నారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలోని పరిశోధక బృందం కాగితంపై ముద్రించిన అక్షరాలను, బొమ్మలను లేజర్‌ కాంతితో తుడిపేసే పద్ధతిని కనుగొందట! లేజర్‌ కిరణాలు కాగితానికి నష్టం వాటిల్లకుండా టోనర్‌ ఇంకును ఆవిరి చేస్తుంది. అందువల్ల ఒక కాగితాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకునే వీలు కలుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి ఎనలేని లాభం కలుగుతుందని అంటున్నారు. ఇంతటి ఉపయుక్తమైన ఉపకరణం ప్రస్తుతం సుమారు 19,000 పౌండ్లు ఖర్చవుతుందట! కానీ, రాను రాను దీని ఖరీదు తగ్గిపోవచ్చట! మామూలు కంప్యూటర్‌ ప్రింటర్‌లలో, ఫొటో కాపీయర్‌లలో 'అన్ప్రింట్‌' అనే సౌకర్యం కూడా ఏర్పాటు చేసే వీలుంది. భలే బాగుంది కదా!
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

జ్ఞాపకశక్తిని తగ్గించే చక్కెర..!


అధికంగా స్వీట్లూ, కూల్‌డ్రింకులు తాగేవారికి హెచ్చరిక. అధిక ఫ్రక్టోజ్‌ ఉన్న ఆహారం తింటే కేవలం ఆరువారాలలో మెదడు పనితనం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తి గణనీయంగా తగ్గిపోతాయట. గతంలో అధిక ఫ్రక్టోజ్‌ వల్ల డయాబెటిస్‌, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిసిందే. కానీ, ఈ ప్రత్యేక చక్కెర పదార్థం మెదడు పనితనాన్నీ దెబ్బతీస్తుందని ఇప్పుడే తెలిసింది. సాఫ్ట్‌డ్రింకులు, స్వీట్లు, పసిపాపల ఆహారపదార్థాలలో కార్న్‌ సిరప్‌ అనే దాన్ని వాడతారు. అది మామూలు చెరుకు చక్కెర కన్నా ఆరు రెట్లు తీయదనం గలది. ఇవేకాక సహజంగా పండ్లలో కూడా ఫ్రక్టోజ్‌ ఉంటుంది. కానీ, అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ అతి తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం ఎన్నో విధాల శ్రేయస్కరం అని అంటున్నారు. మరిక తీపి అలవాట్లు కాస్తంత నియంత్రించుకోవల్సిందేనండోరు..!

అందరికీ ఆరోగ్యం ఎలా?


అందరికీ కావలసింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్ధతతో, ఉల్లాసంగా పనిచేయగలుగుతాం. అభివృద్ధికి దోహదపడతాం. ఆరోగ్యం మందులతో వచ్చేది కాదు. అనారోగ్యంగా మారిన తర్వాత మాత్రమే వైద్య చికిత్స అవసరమవుతుంది. అప్పుడే వైద్యులు కావాలి. అందువల్ల ఏ సమాజమైనా తన పౌరులను ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప అనారోగ్యులయ్యాక మందులతో చికత్స చేయడానికి ప్రాధాన్యత ఇవ్వదు. అందువల్ల ఆరోగ్యాభివృద్ధికి 'సామాజిక ఆరోగ్య చిహ్నాలు (సోషల్‌ పారామీటర్స్‌)' ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ 'అందరికీ ఆరోగ్యం' సమస్యగానే కొనసాగుతుంది. పేదరికం, భౌతిక పర్యావరణ పరిస్థితులు అనారోగ్యానికి ప్రధానకారణం. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు జీవన ప్రమాణాలను పెంచినప్పటికీ 'అందరికీ ఆరోగ్యం' ఎండమావిగానే మిగిలిపోయింది. సంస్కరణల తర్వాత ఆరోగ్యంగా ఉంచడమంటే 'అందరికీ వైద్య సేవలను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అందించే కార్యక్రమం'గా మార్చబడింది. దీనికి ఇతర ప్రభుత్వ విధానాలు తోడై 'అందరికీ ఆరోగ్యం' అసంభవంగా మార్చి వేసింది. వైద్యం రోజురోజుకూ ప్రజలకు దూరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని 'డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి' నేతృత్వంలో ఏర్పరిచింది. ఈ కమిటీ 'అందరికీ వైద్యమే కాకుండా, అందరికీ ఆరోగ్యం అవసరమని వక్కాణించింది. దీన్ని ఎలా సుసాధ్యం చేయవచ్చో తెలుపుతూ పలు సూచనలు చేసింది. వీటిని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
అందరికీ ఆరోగ్యం 2000 సంవత్సరం నాటికి సాధించాలని 1978లోనే 'ఆల్మా అటా' సూచించింది. దీనిలో మన దేశం కూడా భాగస్వామి. తదనుగుణంగా 1983లోనే 'జాతీయ ఆరోగ్య విధానం' రూపొందింది. 2002 నాటికి ప్రజారోగ్య విషయంలో కొంత పురోగతి సాధించినా, చేయవలసింది చాలా మిగిలే ఉంది.
'అందరికీ ఆరోగ్యం' 2000 సంవత్సరంలో కూడా కలగానే మిగిలిపోయింది. ఆ తరువాత దశాబ్ధకాలానికి, అంటే 2010 నాటికి, 'అందరికీ ఆరోగ్యం' నుంచి ఒకడుగు వెనక్కి వేసి 'అందరికీ వైద్యసేవలు' అందించే సాధనంగా ప్రజారోగ్యం మార్చబడింది. 'వైద్యం' భరించలేనిదిగా, పేదరికం పెంచేదిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 'అందరికీ వైద్యం' అందించే విధి విధానాలను సూచించవలసిందిగా ప్రణాళికా సంఘం 'ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని (హై లెవల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూపు)' నియమించింది. దీనికి ప్రముఖ హృద్రోగ నిపుణులు, 'పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా' వ్యవస్థాపక అధ్యక్షులు డా|| శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ బృందం ప్రజారోగ్యంలో వివిధ దేశాల అనుభవాలను, మన దేశంలో వివిధ రాష్ట్రాల అనుభవాలను, నిపుణుల అభిప్రాయాలను పరిశీలించింది. 2011 నవంబరులో తన సూచనలను ప్రణాళికా సంఘానికి అందించింది. ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ప్రైవేటీకరణ వైపు శరవేగంగా పయనిస్తున్న మన ఆరోగ్యవ్యవస్థను ఈ నివేదిక ఒక్క కుదుపు కుదిపింది. జబ్బున పడిన మన దేశ ఆరోగ్యవ్యవస్థను, ప్రపంచబ్యాంకు శిక్షణ పొందిన నిపుణులు సూచించిన 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు', 'రాజీవ్‌ ఆరోగ్యశ్రీ' వంటి ఇన్సూరెన్సు పథకాలలోని లొసుగులను, బలహీనతలను ఈ నివేదిక ఎత్తి చూపింది. ప్రజల ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, వారిపై ఆర్థికభారం మోపకుండా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వమే అందరికీ ఆరోగ్యాన్ని, వైద్య సేవల్ని అందించాలని ఈ కమిటీ సూచించింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్య సూచనలు.
1. నిధుల కేటాయింపు..
ఆరోగ్యరంగంలో నిధుల కేటాయింపు 3 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని జరగాలి.ఇవి:
* అందరికీ అవసరమైన ఆరోగ్యసేవలు అందించడానికి తగినన్ని నిధుల కేటాయింపు.
* వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవకుండా, పేదరికంలోకి దిగజారకుండా ప్రజలకు ఆర్థిక రక్షణ ఏర్పాటు.
* ప్రజలందరికీ వైద్యసేవల లభ్యతకు హామీ ఇస్తూనే, దీర్ఘకాలం ఆరోగ్యఖర్చులు విపరీతంగా పెరిగిపోకుండా అదుపులో ఉండేలా తగిన ఆర్థిక విధానాలను రూపొందించాలి.
పై లక్ష్యాల సాధన కోసం ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 2017 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో 2.5 శాతానికి, 2022 నాటికి 3.0 శాతానికి పెంచాలి. ప్రస్తుతం ఇది 1.2 శాతంగానే ఉంది. దీనివల్ల వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమ జేబులో నుంచి ఖర్చు చేయవలసిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది.
రాజీవ్‌ ఆరోగ్యశ్రీలాంటి స్కీములు దీర్ఘకాలంలో సత్ఫలితాలను సాధించలేవు. అవి వైద్య ఖర్చులను విపరీతంగా పెంచి, ప్రభుత్వ ఖజానాపై అనవసర భారాలను మోపుతాయి. వైద్యవ్యవస్థల నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచే కేటాయించాలి. బ్రిటన్‌లో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుంది.
''ప్రజలకు అవసరమైన వైద్యసేవల పట్టిక''ను రూపొందించి, అందులో ఉన్న సేవలన్నింటినీ పేద, ధనిక వివక్ష లేకుండా అందరికీ పూర్తిగా, ఉచితంగా అందించాలి. ఆరోగ్యాన్ని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించి 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు'ను పౌరులందరికీ అందించాలి. దానిద్వారా ఎవరైనా తమకు కావలసిన ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం కల్పించాలి. ప్రజల వద్ద నుంచి యూజర్‌ఛార్జీలను వసూలు చేయరాదు. ఇవి వసూలు చేసిన చోట వైద్యసేవలు మెరగవలేదని దీర్ఘకాలిక అనుభవాలు తెలుపుతున్నాయి. కేంద్రం నిధులను విడుదల చేసిన సందర్భంలో ఆ నిధులను తమ స్థానిక అవసరాలకు అనువుగా ఖర్చు చేసుకొనే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలి. వైద్యంపై ప్రభుత్వం చేసే వ్యయంలో 'ప్రాథమిక ఆరోగ్య రక్షణ'కు 70% కేటాయించాలి. వ్యాధి నివారణ, సత్వర వ్యాధి నిర్ధారణ - చికిత్సల ద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యాధులను అరికడితే, ఖరీదైన వైద్య సేవల అవసరం క్రమేపీ తగ్గుతుంది. వివిధ పథకాల ద్వారా వివిధ మంత్రిత్వశాఖల ఆధీనంలో ఉన్న అన్నిరకాల వైద్య సేవలను 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు' ద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధీనంలోనికి బదలాయించాలి. దీనిద్వారా నిధుల కేటాయింపు, వ్యయాలను హేతుబద్ధంగా నియంత్రించవచ్చు.
2. ఔషధాలు.. టీకాలు..
'అవసరమైన మందుల జాబితా'ను హేతుబద్ధం చేసి, ఆ జాబితాలో ఉన్న మందులను ప్రజలందరికీ ఉచితంగా అందేలా చూడాలి. ఇపుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కలిపి జి.డి.పి.లో 0.1% నిధులను వెచ్చిస్తున్నది. దీనిని 0.5 శాతానికి పెంచినట్లైతే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలందరికీ అవరమైన మందులను ఉచితంగా ఇవ్వవచ్చు. మందుల రేట్లను ప్రైవేటు కంపెనీల ఇష్టానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. ఔషధాల నాణ్యతను పర్యవేక్షించే యంత్రాంగాన్ని పటిష్టం చేసి, నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించే కంపెనీలపై కఠినచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వరంగ మందుల మరియు టీకాల తయారీసంస్థలను పునరుద్ధరించి, బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రమే మన దేశ అవసరాలకు అనుగుణంగా ఎల్లవేళలా మందులు, టీకాలను గ్యారంటీ చేయవచ్చు. అంతర్జాతీయ పేటెంట్‌ చట్టాలు మన ప్రజలకు ఔషధాలు, టీకాలు అందించడానికి అడ్డురాకుండా ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాలి.
3. వైద్యులు, ఇతర సిబ్బంది..
మన దేశం అవసరాలకు తగినంత వైద్య సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు మొదలైనవారు.) లేరు. ఉన్న సిబ్బంది కూడా అసమానంగా పంపిణీ చేయబడి ఉన్నారు. మరికొన్ని రాష్ట్రాలు అవసరానికి మించి వైద్యులను ఉత్పత్తి చేస్తుంటే, కొన్ని రాష్ట్రాలలో వీరి కొరత తీవ్రంగా ఉంది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది ప్రజలకు 23 మంది వైద్య సిబ్బంది (కేవలం డాక్టర్లే కాదు) కావాలి.
* ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు ఎంబిబిఎస్‌ వైద్యులు, ఒక ఆయుష్‌ వైద్యుడు, ఒక దంత వైద్యుడు ఉండాలి. అక్కడ వైద్యులు పనిచేయడానికి అనువైన పరిస్థితులు కల్పించాలి. పరిపాలనా విధుల నుండి వైద్యులను తప్పించి, అందుకు అవసరమైన సిబ్బందిని వేరే నియమించాలి.
* గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ వాడల్లో వైద్యసేవలు అందించడానికి పూర్తిగా వైద్యులపై ఆధారపడడం అశాస్త్రీయం. అందుకు అవసరమైన ఇతర సిబ్బందిని శిక్షణ ఇచ్చి, నియమించి వారిని వైద్యుల పర్యవేక్షణలో పనిచేయించాలి.
* ఆరోగ్య ఉప కేంద్రాలలో (ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకంటే దిగువస్థాయిలో ఉంటాయి. ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ఉపకేంద్రం ఉండాలి.) వైద్యసేవలు అందించడానికి 'బ్యాచిలర్‌ ఆఫ్‌ రూరల్‌ హెల్త్‌ కేర్‌' అనే మూడేళ్ల కోర్సును ప్రవేశపెట్టి, నియమించాలి.
* గ్రామాలలో ఇపుడు ప్రతి వెయ్యి జనాభాకు ఒక స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త (ఆశా) ఉండాలి. కానీ, ప్రతి వెయ్యిమందికీ ఇద్దరు ఆశాలను నియమించి, వారికి ఫస్ట్‌ ఎయిడ్‌, ఆరోగ్య విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం వంటి అంశాలలో శిక్షణ ఇచ్చి, అంగన్‌వాడీలతో సమన్వయం చేసి విధులను కేటాయించాలి. వీరికి తగిన వేతనం నిర్ణయించి, సక్రమంగా చెల్లించాలి.
* పట్టణాలలో ప్రతి వెయ్యిమందికి ఒక పట్టణ ఆరోగ్యకార్యకర్తను నియమించాలి.
* నర్సింగ్‌ సిబ్బంది సంఖ్యను మన దేశ వైద్య అవసరాలకు అనువుగా పెంచాలి. సాధారణ నర్సింగ్‌ సేవలకు సరిపడా నర్సులను నియమించడం ద్వారా వైద్యులను క్లిష్లమైన వైద్య ప్రక్రియలపై కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. దేశంలో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది నర్సులు ఉన్నారని అంచనా. వీరి సంఖ్యను 2017 నాటికి 17 లక్షలకు, 2022 నాటికి 27 లక్షలకు పెంచాలి.
* దేశ ఆరోగ్య అవసరాలకు అనువుగా వైద్య విద్యా బోధనను సంస్కరించాలి. కొత్త వైద్య కళాశాలలు అవసరమైన ప్రాంతాలలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను టీచింగ్‌ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. వైద్య విద్యలో వ్యాపారధోరణిని నియంత్రించాలి.
* వైద్య సిబ్బంది తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకొనేలా నిరంతర వైద్యవిద్యను అందించాలి. సిబ్బంది పదోన్నతులలో దీనినీ పరిగణించాలి.
4. ఆరోగ్య సేవల విధి విధానాలు..
* గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వివిధ స్థాయిలలో ప్రజలకు ఉచితంగా అందించే అవసర వైద్యసేవల జాబితా రూపొందించి 'జాతీయ ఆరోగ్య హక్కు కార్డు' ద్వారా ఆ సేవలు అందుకొనే హక్కును ప్రజలందరికీ కల్పించాలి.
* ఈ జాబితాలో లేని ఐచ్ఛిక సేవలను (ఉదా: కాస్మెటిక్‌ సర్జరీ, ఊబకాయం తగ్గించుకొనే బేరియాట్రిక్‌ సర్జరీ మొదలైనవి) ప్రజలు డబ్బు చెల్లించి పొందవలసి ఉంటుంది.
* ప్రజలందరికీ చికిత్స అందించడం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో సాధ్యం కాదు, కనుక అవసరమైన సందర్భాలలో, ప్రభుత్వ సేవలకు అనుబంధంగా ప్రైవేటురంగం నుంచి సేవలను 'కాంట్రాక్ట్‌ ఇన్‌ పద్ధతి' ద్వారా వినియోగించుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగం పాత్ర ప్రభుత్వరంగ వైద్య సేవలకు అనుబంధంగా ఉండాలే తప్ప సమాంతర వ్యవస్థగా ఉండరాదు. ఈ సందర్భాలలో చేసుకొనే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పి.పి.పి.) ఒప్పందాలన్నీ పారదర్శకంగా, సమాచార హక్కు చట్టానికి లోబడి ఉండాలి.
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ కోసం వైద్య సేవలు అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తగిన ప్రమాణాలు పాటించేలా అక్రిడిటేషన్‌ బోర్డు పర్యవేక్షించాలి.
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ సేవలు ప్రధానంగా వైద్యంపై కేంద్రీకరించాలి.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేద ప్రజలందరికి కావలసిన చికిత్సలు లభించేలా పటిష్టమైన పాలనా చర్యలు చేపట్టాలి.
5. ప్రజారోగ్యంలో ప్రజల భాగస్వామ్యం..
* ఆరోగ్య సేవల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో అన్నిస్థాయిలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్య అసమానతలను తగ్గిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేస్తుంది.
* ప్రజారోగ్య మండళ్లను ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయి నుండి వీటిని మండలాలు, పట్టణాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఏర్పాటు చేయాలి. వీటిలో ఎన్‌జివోలు, ప్రజాసంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, వైద్య సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించాలి.
* ఈ మండళ్లు తమ పరిధిలోని ఆరోగ్య కార్యక్రమాల రూపకల్పనను, సేవల లభ్యతను, ప్రమాణాల పర్యవేక్షణను, నిధుల వినియోగాన్ని, ఆరోగ్య సూచీలలో మెరుగుదల వంటి అంశాలను పర్యవేక్షించాలి.
* ఈ మండళ్లు సమర్థవంతంగా పనిచేయడానికి కావలసిన నిధులను ప్రభుత్వమే కేటాయించాలి.
* ఈ మండళ్లు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వార్షిక ఆరోగ్య అసెంబ్లీలను నిర్వహించి అన్ని ఆరోగ్య సంబంధ అంశాలను చర్చించి, ప్రభుత్వానికి తగిన సూచనలు అందించాలి.
* స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ మండళ్లలో భాగస్వాములుగా ఉండాలి. స్థానిక సంస్థలకు ఇవి జవాబుదారీగా ఉండాలి.
* ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తగిన యంత్రాంగాన్ని నియమించాలి.
6. యాజమాన్య, వ్యవస్థాగత సంస్కరణలు..
* సార్వత్రిక ఆరోగ్య రక్షణ సేవలు సమర్థవంతంగా అందించేలా ప్రభుత్వ అసుపత్రులను సంసిద్ధం చేయడానికి అవసరమైన యాజమాన్య, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి.
* జాతీయ మరియు రాష్ట్రాల స్థాయిలో 'పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కాడర్‌'ను ప్రవేశపెట్టాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన బహుళరంగ నైపుణ్యంతో ఆరోగ్య రక్షణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించేందుకు ఈ తరహా సిబ్బంది అవసరం.
* తగిన శిక్షణ పొందిన హాస్పిటల్‌ మేనేజర్స్‌ను ఆసుపత్రులలో నియమించి, పరిపాలనా బాధ్యతలను వారికి అప్పజెప్పాలి.
*ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి సహేతుకమైన వేతనాలను, ఇతర అలవెన్సులను అందిస్తూ, వారికి తగిన పారితోషకాలు, పదోన్నతులు కల్పించాలి. బాగా పనిచేసేవారిని గుర్తించి, ప్రోత్సహించాలి. విధులను నిర్లక్ష్యం చేసే వారిపై పాలనాపరమైన చర్యలు తీసుకోవాలి.
'ప్రజారోగ్యం'.. నిర్వచనం..,
''ఆర్థిక, సామాజిక, లింగ, కుల, మత వివక్ష / విచక్షణ లేకుండా దేశంలోని పౌరులందరికీ నాణ్యమైన, వారి అవసరాలకు తగిన విధంగా, వారికి జవాబుదారీగా ఉండే సమగ్రమైన ఆరోగ్య సేవలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. విస్తృతస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 'ప్రజారోగ్య సంబంధమైన సేవలకు హామీ ఇస్తుంది. ఈ సేవలన్నింటినీ ప్రభుత్వమే స్వయంగా అందించకపోయినా, అవి అందరికీ అందేలా హామీ ఇచ్చి అమలుచేస్తుంది.'' అని ప్రజారోగ్యం, వైద్యం ఎలా వుండాలో దిశా నిర్దేశంగా కమిటీ నిర్వచించింది.
సార్వత్రిక ఆరోగ్య రక్షణ అంటే..
* ఆరోగ్య సేవలలో సమన్యాయం.
* వైద్య ఖర్చుల నుంచి ప్రజలందరికీ రక్షణ.
* ఆరోగ్యవంతమైన ప్రజలు.
* 40 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు.
* పారదర్శకమైన, సమర్థవంతంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ వైద్యవ్యవస్థ.
* ప్రజల ఉత్పాదక సామర్థ్యంలో పెరుగుదల.
* పేదరికం తగ్గుదల.

ఆస్ప్రిన్‌ మాత్ర సురక్షితం


 
 
ఆస్ప్రిన్‌, వార్‌ఫరిన్‌ మాత్రలు గుండెపోటును నివారించడంలో సమర్థవంతగా పనిచేస్తాయని కొత్త అధ్యయనం తెలిపింది. ఆస్ప్రిన్‌ సురక్షితమైంది ఎందుకంటే కొద్ది మంది రోగులు మాత్రమే రక్తస్రావంతో బాధపడతారు. వీరిలో అధిక రక్తం పలుచన అయ్యే దుష్ఫ్రభావం ఉంటుంది. ఈ అధ్యయనాన్ని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ సమన్వయం చేసింది. చాలా మంది హార్ట్‌ ఫెయిల్యూర్‌ (గుండె సోలిపోవడం) రోగుల్లో క్రమరహితంగా గుండె కొట్టుకోవడం లేదా ధమనులు సన్నబడటం వంటి సమస్యలు లేనివారిలో ఆస్ప్రిన్‌ మాత్ర తీసుకోవడం ఉత్తమ ఎంపిక అని పేర్కొన్నది. వార్‌ఫరిన్‌ తీసుకోవడం కష్టం ఎందుకంటే, ఇది ఇతర మందులతో, కొన్ని ఆహారపదార్థాలతో పరస్పర చర్య జరుపుతుంది. దీన్ని వాడే వాళ్లు రక్తం సన్నబడుతుందా? చిక్కగా ఉందా? అని క్రమం తప్పకుండా రోగులు పరీక్షించుకుంటూ ఉండాలి. 60 ఏళ్ల వయసున్న 2305 మందిపై అధ్యయనం చేశారు. యాదృశ్ఛికంగా వార్‌ఫరిన్‌ లేదా 325 ఎంజి ఆస్ప్రిన్‌ను రోజూ తీసుకోవాలని సూచించారు. ఆరేళ్ల తర్వాత వీరిని అనుసరించారు. స్ట్రోక్‌, మెదడులో రక్తస్రావం, మరణించే రేటులో ఎలాంటి తేడా లేదని పరిశోధకులు కనుగొన్నారు.
అనారోగ్య సమస్యలా ...?
అయితే మాకు రాసి పంపండి. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో సమాధానాలిప్పిస్తాం. ప్రశ్నలు పంపే వారు వయస్సు, బరువు, జబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలి.
చిరునామా :
సంపాదకులు, రక్ష, ప్రజాశక్తి దినపత్రిక, ప్లాట్‌ నెం. 21/1,
ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర,
ఆజామాబాద్‌ ఇండిస్టియల్‌ ఏరియా, ముషీరాబాద్‌, హైదరాబాద్‌-20
గ మ ని క
    వైద్యులిచ్చే సలహాలు, సమాచారం కేవలం వ్యాధుల పట్ల మీ అవగాహన కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

ఆస్తమా పిల్లల్ని ఇబ్బందిపెట్టే పాసివ్‌ స్మోకింగ్‌


పాసివ్‌ స్మోకింగ్‌ (ధూమపానం చేసేవారు వదిలిన పొగను ఇంకొకరు పీల్చడం) ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడుతుందని కొత్త అధ్యయనం తెలిపింది. 53 శాతం మంది పిల్లలు పాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావానికి గురవుతున్నారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వీరు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వైద్యున్ని కలుస్తున్నారు లేదా గత ఏడాది పిల్లికూతలతో అత్యవసర విభాగంలో చేరుతున్నారు. ఒకటి లేదా వారంలో చాలా రాత్రులు పిల్లికూతల వల్ల నిద్రభంగంతో బాధపడ్డారు. 'ఆస్తమా రోగులు పాసివ్‌స్మోకింగ్‌ బారినపడకూడదని జాతీయ ఆస్తమా మార్గదర్శకాలు సలహా ఇస్తున్నాయి. కానీ వీటిని పాటిస్తున్నారనే దానిపై అస్పష్టత నెలకొన్నది' అని సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌ వైద్యాధికారి లారా జె. అకిన్‌బమి తెలిపారు. 53 శాతం మంది ఆస్తమా పిల్లలు పాసివ్‌ స్మోకింగ్‌ బారినపడ్డారని 2005 నుంచి 2010 వరకు జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

Saturday, 19 May 2012

దరిద్రులు ఎలా పెరుగుతున్నారు?-2


  • అశాస్త్రీయ ఆచారాలు8
'పిల్లలూ! దరిద్రం ఎలా పోతుందో ఒక ప్రఖ్యాత వైద్యుని జీవితం నుండి వివరిస్తాననని గత వారం చెప్పాను కదా!
ఆయన పేరు నార్మన్‌ బెత్యూన్‌. ఆయన కెనాడాలో పెద్ద డాక్టరు. బాగా డబ్బు సంపాదించాడు. ఇక మిగిలిన జీవితాన్ని పేదల సేవలో వినియోగిద్దామనుకొన్నాడు. ఒక పేదల కాలనీని ఎన్నుకున్నాడు. అక్కడ ఆసుపత్రి పెట్టాడు. ఆ కాలనీవాసులకు ఉచిత వైద్యం, వీలైనంత వరకూ ఉచిత మందులు ఇవ్వడం మొదలుపెట్టాడు. రెండేళ్లలో ఆ కాలనీలో రోగి అనేవాడు లేకుండా చేయాలని ఆయన ఆశయం. మూడునెలలు గడిచాయి. ఆరునెలలు; సంవత్సరం గడిచింది. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉందిగానీ తరగటం లేదు. ఇంకొక సంవత్సరంలో ఆ కాలనీలో రోగి అనేవాడు లేకుండా చేయాలనే డాక్టరుగారి ఆశయం నెరవేరేటట్లులేదు. ఆయన ఆ కాలనీలో రోగాలెందుకు తగ్గటం లేదో, పైపెచ్చు ఎందుకు పెరుగుతున్నారో కారణాలను తెలుసుకోదలచాడు. రోగులను ఇంటర్వ్యూ చేయసాగాడు.
ఒక రోగితో ఆయన ఇంటర్వ్యూ ఇలా సాగింది.
బెత్యూన్‌: నీకు రోగం తగ్గలేదు. నీవు నేను చెప్పిన మందులు వాడుతున్నావా?
రోగి: వాడుతున్నానండీ!
బెత్యూన్‌: నాలుగురోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాను. తీసుకున్నావా?
రోగి: మౌనం..
బెత్యూన్‌: పనిలోకి వెళ్లావా? సెలవుపెట్టి ఇంట్లో ఉండలేకపోయావా?
రోగి: మాకు సెలవులెక్కడివి సారూ! పనిలోకి వెళ్తేనే జీతం; జీతం వస్తేనే ఇంట్లో పిల్లలకు తిండి. అందుకని పనిలోకి వెళ్లాను సారూ!
బెత్యూన్‌: మీ యజమాని సెలవు ఇవ్వరా?
రోగి: ఇవ్వరు సారూ!
మరో రోగితో ఆయన సంభాషణ ఇలా జరిగింది....
బెత్యూన్‌: నీకు రోగం తగ్గలేదు. మందులు క్రమం తప్పకుండా వేసుకుంటున్నావా?
రోగి: వేసుకుంటున్నానండీ.
బెత్యూన్‌: పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నావా?
రోగి: తీసుకుంటున్నానండి.
బెత్యూన్‌: బలమైన ఆహారం అంటే పాలు, గుడ్లు, మాంసం తీసుకుంటున్నావా?
రోగి: మౌనం...
బెత్యూన్‌: ఎందుకు తీసుకోవడం లేదు? నీ రోగానికి బలమైన ఆహారం అవసరం అని చెప్పానుగదా?
రోగి: ఏం చెయ్యమంటారు డాక్టరుగారూ! నేను పనికిపోకపోతే నా భార్య తెచ్చే కూలీడబ్బుల్తో ఇల్లంతా తినాలి. ఇంకా నాకోసం పాలు, గుడ్లు ఎక్కడి నుండి తేగలదు?
డాక్టర్‌ బెత్యూన్‌ ఆలోచించసాగాడు. ఆ కాలనీలోని మనుషులందరూ బాగా కష్టపడి పనిచేస్తారు. కానీ వాళ్ళకు రోగమొస్తే విశ్రాంతిగానీ, మంచి ఆహారంగానీ దొరకదు. కానీ, వాళ్ళు పనిచేసే మిల్లు యజమాని కోట్లు కూడబెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్య కాలనీ ప్రజలు ఒళ్లొంచి పనిచేయకపోవడం కాదు. వాళ్ళ శ్రమశక్తి విలువ వాళ్ళకు కాకుండా యజమానికి దక్కడం. యజమాని వారి శ్రమకు తగిన ఫలితాన్ని వారికి ఇవ్వకపోవడం వలననే వారు దరిద్రులౌతున్నారు.
డాక్టరు బెత్యూన్‌కి ప్రజల దరిద్రానికి కారణం అర్థమైంది. వాళ్ళ దరిద్రం పోవాలంటే వాళ్ళ శ్రమకు తగిన ఫలితం వాళ్ళు పొందాలి. అలా పొందాలంటే శ్రామిక రాజ్యమే రావాలి. ఆ విషయం అర్థంచేసుకున్న ఆయన ఆ కాలనీవాసులందరినీ అలాంటి రాజ్యం ఏర్పాటు దిశగా సమీకరించి, అలా శ్రామిక రాజ్యాన్ని కోరే ఇతరులతో కలిసి ముందడుగు వేశాడు, వేయించాడు. చైనాలో శ్రామికరాజ్య స్థాపనలో ఉడతాభక్తిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి, అమరుడయ్యాడు.
'పిల్లలూ! ఇప్పుడర్థమైందా? దరిద్రానికి కారణమేంటో? దానికి పరిష్కారమేంటో?'
'అర్థమైంది మాష్టారూ! దరిద్రానికి కారణం పాపులూ, పాపాలూ కానేకాదు. కోట్లాదిమంది కష్టజీవుల శ్రమను కొద్దిమంది దోచుకోవటమే కారణం. ఇక దరిద్రానికి పరిష్కారం కష్టజీవుల రాజ్యస్థాపనయే' దృఢంగా అన్నాడు శ్రీను.
'మంచిది. మీరందరూ దరిద్రుల నిర్మూలనకు సరైన మార్గంలో ప్రయాణిస్తారని ఆశిస్తాను' అన్నాను.
'తప్పకుండా దరిద్రుల నిర్మూలన కోసం, కష్టజీవుల రాజ్యం కోసం ప్రయత్నిస్తాం మాష్టారూ!' అన్నారు పిల్లలంతా.
'సంతోషం' అన్నాను నేను.. నిజంగా చాలా సంతోషంగా.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

నూనెందుకు వంపుగా ప్రవహిస్తుంది?


డబ్బాల్లోంచి నూనెను, గ్లాసుల్లోంచి పళ్లరసాల్ని, కప్పుల్లోంచి టీని వంపేప్పుడు ఆయా ద్రవాలు నిలువుగా కాకుండా వంపుగా పాత్రల గోడ అంచుల మీద ప్రవహిస్తూ ఇబ్బంది పెడతాయెందుకు? - విద్యార్థులు, జనవిజ్ఞానవేదిక సృజనోత్సవ క్యాంపు, విజ్ఞాన్‌ హైస్కూల్‌, వరంగల్‌
వాయువులను, ద్రవాలను ప్రవాహకాలు(fluids) అంటారు. ద్రవాలకున్న ప్రవాహ లక్షణాల్లో ప్రవాహ వేగానికీ, ప్రవాహకాల అంతరంగిక పీడనాని(pressure) కి ఉన్న సంబంధం చాలా ముఖ్యమైంది. ప్రవాహవేగం పెరిగితే ఆ ప్రవాహకాల్లో పీడనం తగ్గుతుంది. ప్రవాహకాల వేగం తక్కువయితే ఆ ప్రవాహకాల్లో పీడనం ఎక్కువ ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ప్రవాహకాల వేగానికీ, ప్రవాహకాలు కలిగించే పీడనానికీ విలోమ (inverse) సంబంధముందన్న మాట. ఈ నియమాన్నే 'బెర్నౌలీ సూత్రం (Bernauli’s principle)µ అంటారు. ఇది వాయువులకు ద్రవాలకు రెంటికీ వర్తిస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే విమానాలు, పక్షులు, కీటకాలు, గాలిపటాలు గాల్లో ఎగరగలుగుతున్నాయి. ఈ సూత్రం ఆధారంగానే పీడనాన్ని తగ్గించేందుకు ఓవర్‌హెడ్డు నీటి ట్యాంకు నుంచి పైపుల ద్వారా నీటిని కిందికి పంపే పైపుల వ్యాసార్థాన్ని (radius of cross section) తగ్గించుకుంటూ వెళతారు. ఈ సూత్రం ఆధారంగానే లోతుగా ఉన్న సముద్రభాగంలో కన్నా తీరప్రాంతాల్లోనే అలల ఉధృతి ఎక్కువ ఉంటుంది.

ఇక ద్రవాల విషయానికొస్తే పైన పేర్కొన్న ' బెర్నౌలీ సూత్రం'తోపాటు వీటికి తలతన్యత (surface tension), స్నిగ్ధత (viscosity) అనే లక్షణాలు కూడా ఉంటాయి. స్నిగ్థతా గుణం వల్ల పాత్రలకు అంటుకున్న భాగాల కన్నా పాత్రల గోడల కు దూరంగా ఉన్న ద్రవ భాగాల వేగం ఎక్కువ ఉంటుంది. తలతన్యత గుణం వల్ల ద్రవాలు తమ ఆకృతిని గోళాకారం (spherical shape) లోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకే వాన చినుకులు, ఇతర ద్రవాల బిందువులు (droplets)ర) గుండ్రంగా ఉంటాయి. స్నిగ్ధతా గుణం, తలతన్యత, బెర్నౌలీ సూత్రం సంయుక్తంగా పనిచేయడం వల్లే కుళాయి తిప్పినప్పుడు ధారగా కిందపడే నీటిధార కుళాయి మూతి దగ్గర విస్తారంగాను, కిందికి వెళ్లే కొద్దీ సన్నబడుతూ ఆ తర్వాత బిందువులు (చుక్కలు) గా మారుతుంది. ఇపుడిక అసలు విషయానికి వద్దాము..

గ్లాసుల్లోనూ, మీరన్న ఇతర పాత్రల్లోను ఉన్న ద్రవాలు, ఆయా పాత్రలను వంచినపుడు న్యూటన్‌ గురుత్వాకర్షక బలసూత్రాల ప్రకారం నిట్టనిలువుగా కిందపడాలి. కానీ అవి పాత్రల అంచుల మీదగా ప్రవహిస్తూ మనం ఒక దగ్గర పోయాలనుకుంటే అవి మరోచోట పడి ఇబ్బంది, విసుగు కలిగిస్తాయి. ఇందుకు కారణం ద్రవాలకున్న తలతన్యత, స్నిగద్ధత, బెర్నౌలీ సూత్రాలే. మనం పాత్రను వంచినపుడు ఆ ద్రవం పాత్రల అంచునకు లోపలివైపు పొర అంటుకున్నందున అక్కడ వేగం ఎక్కువ ఉండదు. పైగా ఆ ద్రవం అంచుల వల్ల తలతన్యత గుణం వల్ల వంపు తిరుగుతుంది. అంటే పడుతున్న ద్రవపు పైపొర ఎక్కువదూరం ప్రయాణించేలా, లోతట్టు పొర తక్కువ దూరం ప్రవహించేలా రూపం ఏర్పడుతుంది. పర్యవసానంగా పాత్ర గోడలకు, ద్రవపు లోపలి అంచుకు మధ్య ఉన్న గాలిపొర పలుచగా అవుతుంది. అంటే అక్కడ గాలి పీడనం బాగా తక్కువ అవుతుంది. కానీ ధార ఆవలభాగంలో ఉన్న గాలి పీడనం యథారీతిలో ఉంటుంది.

మరోమాటలో చెప్పాలంటే ధారకు బయటివైపు గాలి పీడనం ఎక్కువగాను, లోపలి భాగం తక్కువగాను ఉంటుంది. అందువల్ల ధారమీద పాత్రవైపు నికరబలం (effective force from the pressure) పడుతుంది. అంటే ధారను పాత్రవైపున నెట్టేలా గాలి పీడనం పనిచేస్తుంది. అలా నెట్టబడ్డ ద్రవానికి, పాత్రగోడలకు మధ్య ఎంతోకొంత అనుబంధ బలాలు (వీటినే తెలుగు అకాడమీ వారు సంసంజన బలాలు లేదా (choesive forces అంటారు.) ఉండడం వల్ల పైన తెలిపిన పరిస్థితి పునరావృతం అవుతుంది. అందుకే ద్రవాలు పాత్రల గోడల మీదుగా వంపుగా ప్రయాణిస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టాలంటే ద్రవం మీద లోపల బయట వేర్వేరు వంపులు లేకుండా చూడాలి. అపుడు ద్రవం మీద పనిచేసే నికరబలం తక్కువ అవుతుంది. లేదా ద్రవానికి, పాత్ర గోడలకు అంచు (పాత్ర మూతి లేదా brim) దగ్గరే దూరం ఎక్కువ ఉండాలి. తర్వాత ఎంతో కొంత లోపలికి నెట్టబడుతున్నా పాత్ర గోడలకు అంటుకొనే అవకాశం ఉండదు. అందువల్లే పాత్రల మూతుల వద్ద పక్షి ముక్కులాగా వంపును రూపొందిస్తారు. ఇది ధార మందాన్ని తగ్గించి పీడన వ్యత్యాసాల్ని నివారించడమే కాకుండా ద్రవ ధారను, పాత్ర గోడకు దూరంగా ఉంచుతుంది.