Wednesday, 6 June 2012

శుక్ర గ్రహం....


 
 
 
                 రాత్రి సమయంలో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? చంద్రుని తర్వాత ప్రకాశవంతంగా కనిపించే ఒక పెద్ద నక్షత్రంలాంటిదాన్ని చూశారా? అదే 'శుక్ర గ్రహం'. ఇది సౌర కుటుంబంలో సూర్యునికి దగ్గరగా ఉన్న రెండో గ్రహం. ఇది నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూగోళంలాగే కనిపించే గ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి. ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 224.7 భూగోళ దినాలు పడుతుంది. ఇంగ్లీషులో ఈ గ్రహాన్ని 'వీనస్‌'గా పిలుస్తారు. అందాల దేవత, రోమన్‌ ప్రేమమూర్తికి ప్రతీకగా దీన్ని ఈ పేరుతో పిలుస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 6వ తేదీన సూర్యునికి భూమికి మధ్య ఒకే రేఖపైకి ఇది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది సూర్యగ్రహణంలా భూమి మీద సూర్యుడిలోని కొంతభాగాన్ని కప్పేస్తుంది. ఈ కప్పేసిన భాగం ఒక చివరి నుండి మరో చివరకు వెళుతుంది. దీనినే 'శుక్రగ్రహ అంతర్యానం (ట్రాన్సిట్‌ ఆఫ్‌ వీనస్‌)' అంటున్నాం. ఈ సందర్భంగా 'శుక్ర గ్రహం' గురించిన విజ్ఞానాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
భూగోళంలా సూర్యుని చుట్టూ తిరుగుతున్న నాలుగు గ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి. ఇది రాళ్లతో నిండి ఉంది. పరిమాణంలో, బరువులో కూడా భూగోళానికి దాదాపు దగ్గరగా ఉంటుంది. అందుకనే ఈ గ్రహా న్ని భూమి యొక్క 'సోదర గ్రహం లేదా జంట గ్రహం' అని పిలుస్తారు.
శుక్ర గ్రహం వ్యాసం 12,092 కిలోమీటర్లు. భూగోళం కన్నా ఇది 6,50 కిలోమీటర్లే తక్కువ. భూగోళంలో దీని బరువు 81.5 శాతం. అయితే, శుక్ర గ్రహ ఉపరితల వాతావరణం భూగోళంతో పోల్చినప్పుడు చాలా తేడా వుంది. శుక్రగ్రహ వాతావరణంలో దాదాపు 96.5 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాయువు ఉంది. మిగతాది (3.5%) నత్రజని. దీనికి విరుద్ధంగా భూగోళ వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ కేవలం 0.039 శాతం మాత్రమే ఉంది. నత్రజని దాదాపు 78.1 శాతం.



              శుక్రగ్రహ ఉపరితలంలో దాదాపు 80 శాతం చదునైన అగ్నిపర్వత మైదాన ప్రాంతం ఉంది. ఇది 70 శాతం ముడతలు, ఎత్తుపల్లాలతో కూడి ఉంది. కేవలం 10 శాతం మాత్రమే చదనంగా ఉంటుంది. మిగిలిన 20 శాతం రెండు ఎత్తయిన ఖండాలుగా ఉంది. ఉత్తరార్ధ గోళంలో మొదటిభాగం ఉండగా, మధ్యరేఖకు దిగువున దక్షిణార్థగోళంలో రెండోభాగం ఉంది. ఎత్తయిన పర్వతం (11 కి.మీ. ఎత్తు) 'ఇస్టార్‌ టెర్రా' ఉత్తరాన ఉండే మాక్సివెల్‌ పర్వతాల్లో ఇదొక భాగం. ఇది ఆస్ట్రేలియా ఖండమంత పరిమాణంలో ఉంటుంది. దక్షిణార్థ భాగాన్ని 'అఫ్రోడైట్‌ టెర్రా'గా పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా అంత పరిమాణంలో ఉంటుంది.

            శుక్రగ్రహ ఉపరితలాన అగ్నిపర్వతాల ప్రభావం అధికంగా ఉంది. భూగోళంలో కన్నా ఇది చాలా ఎక్కువ. 100 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 167 పెద్ద అగ్ని పర్వతాలు శుక్ర గ్రహంపై ఉన్నాయి. దీనితో పోల్చగల అగ్నిపర్వతం భూగోళం మీద హవాయి ద్వీపకల్పంలోని పెద్ద దీవిలో ఉంది. భూగోళ నిర్మాణంలో ప్రధానంగా కనపడే టెక్టానిక్‌ ప్లేట్లు (వీటి కదలికలతోనే భూకంపాలు వస్తాయి) శుక్ర గ్రహంలో కనిపించవు. దీనికి ఒక కారణం శుక్ర గ్రహ ఉపరితలం (300-600 మిలియన్‌ సంవత్సరాలు) భూగోళ ఉపరితలం (100 మిలియన్‌ సంవత్సరాలు) కన్నా పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.

              శుక్రగ్రహ అంతర్గత, రసాయనిక నిర్మాణం గురించి కచ్ఛితమైన సమాచారం లేదు. కానీ, భూగోళ నిర్మాణంతో పోల్చినప్పుడు సారూప్యత ఉంది. దీన్నిబట్టి శుక్రగ్రహంలో కూడా అంతర్భాగం (కోర్‌), మధ్య భాగం (మాంట్రిల్‌), ఉపరితల భాగం (క్రస్ట్‌) ఉన్నాయని అంటున్నారు. భూగోళంలాగా శుక్రగ్రహ అంతర్భాగంలో పాక్షికంగా ద్రవం ఉంటుందని భావిస్తున్నారు. సౌర కుటుంబ పరిణామక్రమంలో ఈ రెండు గ్రహాలు ఒకే విధంగా చల్లబడటం వల్ల ఇలా పరిణమించాయని అంటున్నారు. కానీ, భూగోళం కన్నా శుక్రగ్రహ పరిమాణం తక్కువ. దీంతో దీని అంతర్భాగ పీడనం భూగోళం కన్నా తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. శుక్రగ్రహ ఉపరితలం గట్టిగా ఉండటం కూడా మరొక కారణం. ఫలితంగా, శుక్ర గ్రహం నెమ్మదిగా చల్లబడుతుంది.


ఉపరితల వాతావరణం...

               శుక్రగ్రహ ఉపరితల వాతావరణ పీడనం భూగోళ పీడనంకన్నా 92 రెట్లు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సముద్రంలో ఒక కిలోమీటరు లోతు పీడనానికి సమానం. శుక్రగ్రహ వాతావరణంతో పాటు చిక్కని సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ మేఘాలు కూడా ఉన్నాయి. ఇది సౌర కుటుంబంలో బలమైన హరిత వాయువుల్లాంటి (వాతావరణాన్ని వేడిక్కించడం) ప్రభావాల్ని కలిగిస్తుంది. ఫలితంగా, ఉపరితల ఉష్ణోగ్రతలు 460 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉంటాయి. అయితే, కొన్ని వందల సంవత్సరాల క్రితం శుక్రగ్రహంపై భూగోళ వాతావరణంలాగే ఉండేదని అంటున్నారు. ఆ సమయంలో నీరు కూడా పెద్ద పరిమాణంలో దీనిపై ఉండేదని భావిస్తున్నారు. కానీ, నియంత్రణలేని హరిత వాయువుల ప్రభావంతో ఆ సహజనీరు ఆవిరై పోయింటుందని అంటున్నారు. అందువల్ల, ఇప్పటి శుక్రగ్రహ ఉపరితల పరిస్థితులు భూగోళంలోలాగా జీవం మనుగడకు దోహదపడవు. కానీ, దీనికి ముందు శుక్రగ్రహం మీద జీవం ఉన్నట్లు వీరు అనుమానిస్తున్నారు.
               శుక్రగ్రహం మీద ఉష్ణోగ్రత అంతగా మారదు. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ఉండవు. గాలులు గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతోనే వీస్తాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌ పొర మీద ఉన్న సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌ బిందువులతో కూడిన చిక్కటి మబ్బులు ఉంటాయి. ఇవి తమపై పడుతున్న సూర్యరశ్మిలో 90 శాతాన్ని పరావర్తనం చెందిస్తాయి. దీనితో శుక్రగ్రహ ఉపరితలాన్ని కంటితో చూడలేము, పరిశీలించలేము. శుక్ర గ్రహంపై శాశ్వతంగా ఉంటున్న ఈ చిక్కని మబ్బుల పొర వల్ల ఉపరితలం మీద వెలుగుండదు. శుక్రగ్రహంపై వీచే గాలులు దాని పరిభ్రమణ వేగంకన్నా 60 రెట్లు అధికంగా ఉంటాయి. కానీ, భూగోళంపై వీచే గాలులు దీని పరిభ్రమణం వేగంలో 10-20 శాతం వరకు మాత్రమే ఉంటాయి.
               శుక్రగ్రహ వాతావరణంలో ఓజోన్‌ పొర ఉన్నట్లు 2011లో కనుగొన్నారు. ఇది భూగోళ వాతావరణంతో సారూప్యత కలిగి ఉంది. అయితే దీనిపై అయస్కాంత ఆకర్షణ శక్తి చాలా చాలా తక్కువ. దాదాపు ఉండదు.

పరిభ్రమణం..
             సూర్యుని చుట్టూ 108 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో శుక్రగ్రహం పరిభ్రమిస్తుంది. ఈ భ్రమణ వివరాలు కింది ఇచ్చిన 'శుక్రగ్రహ అంతర్యానం' ఐటంలో వివరంగా తెలుపబడ్డాయి.

ఎగిరే పళ్లాలుగా భ్రమపడొద్దు..
             సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో శుక్రగ్రహం భూగోళాన్ని ప్రతి 585 రోజులకొకసారి దాటి వెళుతుంది. ఈ సమయంలో ఇది సాయంత్రపు నక్షత్రం నుండి ఉదయం నక్షత్రంగా కనిపిస్తుంది. మంచి వెలుతురు సమయంలో కూడా శుక్రగ్రహాన్ని గమనించకుండా ఉండలేం. గరిష్టస్థాయిలో సాగినట్లు కనపడడం అంటే నల్లటి ఆకాశంలోనూ సూర్యుడు అస్తమించాక చాలాసేపు కనిపిస్తుంది. ఈ సమయంలో శుక్రగ్రహాన్ని 'ఎగిరే పళ్లాలు'గా భావిస్తుంటారు. ఇలా భావించినవారిలో 1969లో అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ ఒకరట.

No comments:

Post a Comment