జన్యువులు, జాతులు, జీవావరణ వ్యవస్థల మొత్తం మార్పులను సంయుక్తంగా 'జీవవైవిధ్యం'గా భావిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే, జీవవ్యవస్థల్లోని అన్నిస్థాయి జీవాల్లో ఉన్న మొత్తం మార్పులను సంయుక్తంగా 'జీవవైవిధ్యం'గా భావిస్తారు.
పర్యావరణ ఆరోగ్యపటిష్టతకు జీవవైవిధ్యం చిహ్నం. ఇది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగానూ, ధృవప్రాంతాల్లో కనీసస్థాయిలో జీవవైవిధ్యం ఉంటుంది. మైనస్ (-) ఉష్ణోగ్రత గల ధృవప్రాంతాల్లో కొన్ని జీవాలు మాత్రమే నివసించగలుగుతున్నాయి.
వేగంగా వచ్చే పర్యావరణ మార్పులు పెద్దఎత్తున జీవజాతుల్ని అంతరింప జేస్తున్నాయి. భూగోళం మీద ఉన్న జంతుజాలాల్లో దాదాపు ఒక శాతం ఇలా అంతరించిపోయాయి. భూగోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో వైవిధ్యం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే మానవులు విస్తారంగా ఉంటున్నారు. వీటిని జీవవైవిధ్యం ఉధృతంగా గల ప్రాంతాలు (హాట్స్‌పాట్స్) గా గుర్తిస్తున్నారు.
ఇప్పటివరకు మేధావులకే పరిమితమైన ఈ అంశాలు నేటి వాతావరణమార్పులు, ఫలితంగా దెబ్బతింటున్న సుస్థిరత నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీనిని అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
మానవ ప్రయోజనాలు..
జీవావరణ వ్యవస్థ సేవలను జీవవైవిధ్యం ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వాయు నాణ్యత, వాతావరణం (కార్బన్ డై ఆక్సైడు మదింపు), నీటి పరిశుభ్రత, సంపర్కం (వృక్షజాతుల్లో), నేలకోత నివారణలు జీవవైవిధ్యం మీద ఆధారపడి ఉంటాయి.
వ్యవసాయంలో..
పంటల సేద్యం, వాతావరణం, సస్యరక్షణ, ఇతర వడిదుడుకుల్ని తట్టుకోడానికి జీవవైవిధ్యం తోడ్పడుతుంది. సాంప్రదాయ మెట్ట సేద్యంలో ఇది విస్తారంగా ఉపయోగపడేది. కానీ, 'ఏక పంట' సేద్యంతో వడుదుడుకుల భారం ఎన్నోరెట్లు పెరిగింది. దీనివల్ల సేద్యంలో రిస్క్ బాగా పెరిగింది. రిస్క్‌ను తట్టుకోడానికి ప్రత్యామ్నాయవ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదు. బిటి సాంకేతికం వైవిధ్యాన్ని తగ్గించి, రిస్క్‌ను ఎన్నోరెట్లు పెంచింది. ఫలితంగా బిటి పత్తి సగటు దిగుబడులు గత ఆరేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక చరిత్రలోకిపోతే, 1970 దశకంలో ఇండోనేషియా నుండి మనదేశానికి 'రైస్ గ్రాసి స్టంట్ వైరస్' వచ్చింది. దీనిని తట్టుకోగల రకం ఒకటి మనదేశంలోనే గుర్తించారు. దీనితో ఈ వైరస్‌ను తట్టుకొనేరకాలు రూపొందించ బడ్డాయి. వరిలో జీవవైవిధ్యం మనదేశంలో విస్తారంగా ఉండటంవల్లనే ఇది సాధ్యమైంది.
ఇదేవిధంగా 1970లో శ్రీలంక, బ్రెజిల్, మధ్య అమెరికాలోని కాఫీ తోటలు 'రస్ట్ (తుప్పు రోగం)' వచ్చింది. దీన్ని తట్టుకొనేరకం ఇథియోపియాలో గుర్తించబడింది. ఫలితంగా దీన్ని తట్టుకొనేరకం రూపొందించడం వీలైంది. 1846లో ఐర్లాండ్‌లో 'పొటాటో (ఆలుగడ్డ) బ్లైట్' వల్ల దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. మరో 10 లక్షలమంది ఆ ప్రాంతాన్నే వదిలిపోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రెండురకాల్నే సేద్యం చేయడం దీనికి ముఖ్యకారణం.
'ఏక పంట' సేద్యం ఎన్నో వ్యవసాయ సంక్షోభాలకి కారణమైంది. దీనివల్లే 19వ శతాబ్ధంలో యూరప్‌లో వైన్ పరిశ్రమ పూర్తిగా నాశనమైంది. మనం తినే 80 శాతం ఆహారం కేవలం 20 రకాల మొక్కల నుండి వస్తున్నప్పటికీ వీటిలో దాదాపు 40 వేల జాతులు సేద్యం చేయబడుతున్నాయి. ఈ జాతుల మీద ఆహారానికి, రక్షణకు, దుస్తులకు ఆధారపడుతున్నాం. ఇప్పటికీ భూగోళంలో సజీవంగా ఉన్న జీవవైవిధ్యం ఆహారోత్పత్తిని పెంచడానికి, మన వైవిధ్యభరితమైన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. అయితే, క్షీణిస్తున్న జీవవైవిధ్యం ఈ ఎంపిక అవకాశాలని తగ్గిస్తుంది.
ఆరోగ్యంలో..
మన ఆరోగ్యంలో కూడా జీవవైవిధ్యం కీలకపాత్ర కలిగి ఉంది. అయితే, ఇది వాతావరణమార్పులతో దగ్గర సంబంధాలు కలిగి ఉంది. ముఖ్యంగా అనారోగ్యాల్ని వ్యాప్తిచేసే కీటకాల నియంత్రణలో, నాణ్యమైన తాగునీటి కొరత, సేద్య జీవవైవిధ్యాలను ప్రభావితం చేస్తున్నాయి. జీవవైవిధ్యం తరిగేటప్పుడు మొదట అంతరించేది అంటురోగాలు రాకుండా నిలువరించే బ్యాక్టీరియాలే. బతుకుండేవి జబ్బుల్ని వేగంగా వ్యాప్తిజేసే జీవాలే. అలాగే మన ఆహారపు అలవాట్లు, పోషకభద్రత, సామాజిక, మానసిక ఆరోగ్యాలు కూడా జీవివైవిధ్యం వల్ల ప్రభావితమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో, ఆ తర్వాత కోలుకోవడంలో జీవవైవిధ్యం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.
కొత్త మందుల గుర్తింపు తయారీలో జీవవైవిధ్యం ఎంతో తోడ్పడుతుంది. జీవ మూలాల నుంచే ఎక్కువభాగం కొత్త మందులు రూపొందుతున్నాయి. దాదాపు 80 శాతం మేర మందుల అవసరాలు ప్రకృతి సహజంగా ఉండే జీవాలే సమకూరుస్తున్నాయి.
No comments:
Post a Comment