- - కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ rohiniprasadk@gmail.com
మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఎన్నో రకాలుగా యోచించి, అన్నిటినీ సిద్ధం చేసుకుంటాం. ఎంత దూరానికి ఎంతకాలంపాటు వెళుతున్నామనేదాన్ని బట్టి తీసుకెళ్ళవలసిన దుస్తులూ, వస్తువులూ, సామాన్లూ అన్నిటినీ సర్దుకుంటాం. మన దేశం కాకుండా విదేశానికి ప్రయాణమవటానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణానికి అవసరమైన వస్తువులు ఎక్కువే అనిపించినప్పటికీ విమానంలో తీసుకెళ్ళగలిగిన బరువు ఒక స్థాయికి మించకూడదనే నిబంధన ఉంటుంది. దూరదేశాల్లో మనకు కావలసిన పచ్చళ్ళూ, ఊరగాయలూ దొరకవేమోనని అనిపించినా ఎక్కువ సామాను ప్రతిబంధకం అవుతుందని కొన్నిటిని వదులుకుంటాం. ఈ సమస్యలన్నీ గ్రహాంతర యానంలో కూడా ఉంటాయి.
కుజగ్రహం మీద తినడానికి ఆవకాయ కాదుగదా, పీల్చడానికి ఆక్సిజన్ కూడా దొరకదు కనక అన్నీ మన వెంట తీసుకెళ్ళవలసిందే. అటువంటి ప్రదేశంలో ఏవి లభించవో ఇక్కడుండగానే ఊహించి, ఆ ప్రకారంగా ప్రయాణ సన్నాహాలు చేసుకోవాలన్నమాట. అలాగని పనికొచ్చేవీ, పనికిరానివీ లెక్కలేనన్ని వస్తువులు మోసుకెళ్ళడమూ వీలుకాని పనే. ఎందుకంటే వీటన్నిటినీ మోస్తూ, భూమి గురుత్వాకర్షణను అధిగమించి భూమిని వీడవలసిన రాకెట్ ఎంతో ఇంధనాన్ని ఖర్చుపెట్టవలసి వస్తుంది. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.
కుజ గ్రహానికి రాకెట్..
యూరప్ రోదసీ సంస్థతోబాటుగా రష్యా ప్రతిపాదించిన ఒక ప్రయోగంలో కుజగ్రహానికి రెండు రాకెట్లను పంపవచ్చని సూచించారు. ఒకదాంట్లో ఆరుగురు రోదసీనావికులనూ, రెండోదాంట్లో వారి సామగ్రినీ పంపవచ్చని అన్నారు. అమెరికా కూడా రెండో, మూడో రాకెట్లు ప్రయోగించాలనే ప్రతిపాదన చేసింది (పటం). దీన్నిబట్టి ఇటువంటి ప్రయాణంలో ఎన్ని చిక్కులున్నాయో అర్థమవుతుంది. ఏ రాకెట్ అయినా దాని శక్తిలోని అధిక భాగాన్ని భూమ్యాకర్షణ శక్తిని అధిగమించటానికే ఉపయోగిస్తుంది. అందువల్లనే అన్నిటికన్నా పెద్దదిగా కనిపించే రాకెట్ కింది భాగపు గొట్టం ఇంధనాన్ని కలిగినదై, పని పూర్తవగానే విసర్జించబడుతుంది. కుజగ్రహానికి చేరవలసిన భాగం చిన్నదిగా, ముందు భాగంలో అమర్చబడి ఉంటుంది. దాని ఆకార స్వరూపాలూ, నిర్మాణ విశేషాలూ అన్నీ కూడా నిర్వర్తించవలసిన పనులనుబట్టి ఏర్పాటవుతాయి. (చిత్రం) అమెరికా రూపకల్పన చేసిన రాకెట్
No comments:
Post a Comment