చికిత్సలో ఉపయోగపడే పదార్థాన్ని 'మందు'గా వ్యవహరిస్తున్నాం. నొప్పిని మరిపించి లేదా తగ్గించేందుకు తోడ్పడే మందుల్ని 'మత్తు మందులు'గా వ్యవహరిస్తున్నారు. వీటిని కనిపెట్టిన తర్వాత, శస్త్రచికిత్స ఎంతో సులువైంది. తద్వారా ఈ పదార్థాలు మానవాళికి ఎనలేని సేవను చేస్తున్నాయి. వైద్యుల సలహాతో సంబంధం లేకుండా ఈ మందును తీసుకోవడాన్ని కొనసాగిస్తే మొదట చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ, త్వరలోనే దీని దుష్ప్రభావాలు బయటపడతాయి. ముఖ్యంగా ఈ మందుల్ని తీసుకోకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా, ఇదొక వ్యసనంగా మారుతుంది.
మత్తు మందులు తీసుకోవడం వ్యసనంగా మారిన స్థితిలో బాధితులు చైతన్య రహితులుగా, నిర్వీర్యులుగా మారిపోతారు. విచక్షణను కోల్పోతారు. ఇది వారి ఆరోగ్యాన్ని, సామాజిక, ఆర్థిక సంబంధాలపై చాలా దుష్ప్రభావం కలిగిస్తుంది. వ్యసనపరులు తమలో తాము కుంచించుకుపోయి, పరిస రాల్ని విస్మరిస్తారు. అంతిమంగా, ఆత్మనూన్యతకు లోనవుతారు.ఇది కుటుంబసభ్యుల, స్నేహితుల మీదా దుష్ప్రభావం కలిగి ఉంటుంది. అయితే, వీటి వ్యాపారం నిఘూ ఢంగా, పెద్దఎత్తున కొనసాగుతుంది. దీని కట్టడి నేడు అంతర్జాతీయంగా పెద్దసవాల్.
బాధితులు...
ధనవంతుల కుటుంబాలలో.. కౌమారదశలో వున్న పిల్లలు. వీరి స్నేహితులు వీటికి ఎక్కువగా బానిసలవుతున్నారు. ఫలితంగా వీరు చైతన్య, బాధ్యతా రహితు లుగా మారిపోతున్నారు. ఒకోసారి ఈ మందుల కోసం ఎంతటి ఘోరానికి పాల్పడ టానికీ వెనుకాడటం లేదు. ఇది సామాజిక సమస్యగా మారిపోతుంది. ఇటీవల ఈ బాధితుల సంఖ్య పెరుగుతున్నదనే సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దీని వైఫల్యానికి ప్రభుత్వం, సమాజం, తల్లిదండ్రులూ అందరూ బాధ్యులే. ఈ సమస్య తీవ్రమవడానికి పెరుగుతున్న ఆర్థిక తారతమ్యాలు, జీవిత లక్ష్యం లేకపోవడం. సంబంధిత యంత్రాంగ వైఫల్యం ప్రత్యక్ష కారణాలుగా కొనసాగుతున్నాయి.
రకాలు..
* కోకాపేస్ట్ (కోకాబేస్) : కోకా చెట్ల ఆకుల నుండి దీన్ని సేకరిస్తారు. దీన్ని శుభ్ర పరిచి కోకెయిన్‌ను తయారుచేస్తారు.
* క్రాక్ (కోకెయిన్) : కోకెయిన్ హైడ్రో క్లోరైడ్.
* హీరోయిన్ (హీరోయిన్ హైడ్రో క్లోరైడ్) : దీన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. దీన్ని హీరోయిన్ నెం.4 అని కూడా అంటారు.
* హీరోయిన్ నెం.3 : పొగపీల్చడానికి వాడతారు. ఇది తక్కువ నాణ్యతతో ఉంటుంది.
* పాపీ స్ట్రా : విత్తనాలు తీసిన తర్వాత ఓపియమ్ పాపి (గసగసాలు) చెట్లకు సంబంధించిన అన్ని భాగాలు.
* కెన్నాబిస్ : గంజాయి - దీని ఉత్పత్తి, వినియోగం స్థానికంగానే ఉంటుంది. ఇదే ఎక్కువగా వినియోగంలో ఉంది.
* ఎటిఎస్ : యంఫÛటామైన్ రక ఉత్ప్రేరకాలు. ఇవి కృత్రిమంగా తయారుచేసినవి. వీటిని తయారుచేసే పదార్థాలు స్థానికంగా దొరుకుతాయి. అందువల్ల, దీని తయారీ, వినియోగం స్థానికంగానే ఉంటుంది.
2008 నుండి పదేళ్ల కాలంలో, అంటే 2018 నాటికి మత్తుమందుల దొంగ ఉత్పత్తి రవాణా దురుపయోగాన్ని పూర్తిగా నివారించాలని లేదా నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నిర్ణయించింది. ఈ లక్ష్యాలతోనే ఇది పనిచేస్తుంది.
అసలు కారకులు..
నల్లమందు వ్యాపారంలో అత్యధిక లాభాలుండటంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 19వ శతాబ్ధంలో చైనాలో నల్లమందు వ్యాపార హక్కుల కోసం ఏకంగా రెండుసార్లు యుద్ధాల్ని చేసి, విజయం పొందింది. అప్పటి చైనా రాజు దిగుమతి సుంకాన్ని అధికంగా వేయడంతో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ మందు టర్కీ, ఇండియాలో ఉత్పత్తయ్యేది. స్థానిక ప్రజలు నల్లమందును తీసుకొని, నిర్వీర్యులుగా మారుతుండటంతో 1800లోనే దీని దిగుమతిని చైనా రాజు నిషేధించాడు. అయినప్పటికీ, దొంగరవాణా, వ్యాపారం ఆగలేదు, కొనసాగింది. ఈ నియంత్రణ ప్రయత్నాలే అంతిమంగా నల్లమందు యుద్ధాలకు దారితీశాయి. ఈ యుద్ధాల్లో ఓడిపోవడంతో బ్రిటిష్ వారికి నల్లమందు ఎగుమతికి, అమ్ముకోడానికి ఎన్నో హక్కుల్ని చైనా ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత, ఫ్రెంచి అమెరికన్ కంపెనీలు కూడా ఇలాంటి హక్కుల్నే పొందాయి. ఇక వర్తమానకాలానికి వస్తే ఐక్యరాజ్యసమితి మత్తుమందుల నియంత్రణ కార్యక్రమం అంచనా ప్రకారం 2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో 185 టన్నుల ముడి నల్లమందు ఉత్పత్తి అయింది. 2000లలో దీని ఉత్పత్తి 3,276 టన్నులుండేది. అంటే, ఒకేఒక్క సంవత్సరం 2001లోనే దాదాపు 94 శాతం ఉత్పత్తి తగ్గింది. ఇది తాలిబాన్ల కృషి ఫలితం. కానీ, 2002లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత నల్లమందు ఉత్పత్తి తిరిగి 2000 సంవత్సరం స్థాయికి పెరిగింది. 2006 నాటికి ప్రపంచంలో 92 శాతం నల్లమందు ఆఫ్ఘనిస్తాన్ నుండే వచ్చిందని ఐక్యరాజ్యసమితి నివేదిక-2010లో పేర్కొంది. అంటే, మత్తుమందుల ఉత్పత్తి, దొంగ రవాణా వెనుక ఏ శక్తులు బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు కదా?
మన దేశంలో..
* 'హీరోయిన్' అనే మత్తుమందు వాడకందార్లు 2006లో 7.71 లక్షల మంది.
* నల్లమందు వినియోగదారులు 6.74 లక్షల మందితో రెండోస్థానంలో ఉన్నారు.
* 'హీరోయిన్' రకం వినియోగం 17 టన్నులు. ప్రపంచ వినియోగంలో ఇది దాదాపు ఐదు శాతం.
* నల్లమందు వినియోగం 67 టన్నులు. ప్రపంచ వినియోగంలో ఇది ఆరు శాతం.
* మొత్తం నల్లమందు పదార్థాల వినియోగం 239.8 టన్నులు నల్లమందుతో సమానం.
* నల్లమందు మొక్కలు (ఓపియమ్ పాపి) 1500-2000 హెక్టార్లలో సేద్యం చేయబడుతున్నాయి. ఇదేగాక, 2009లో ఆరు వేల హెక్టార్లలో దీని సేద్యం అనుమతించబడింది.
* స్వాధీనం చేసుకున్న 'హీరోయిన్' 1.1 టన్నులు.
* పట్టుకున్న నల్లమందు ఉత్పత్తులు 13 టన్నులు. కాగా, దీనిలో నల్లమందు రెండు టన్నులు.
(ప్రపంచ మత్తుమందుల 2010 నివేదిక ఆధారంగా...)
మీకు తెలుసా..?
* మందుల వినియోగం: వైద్యుల సలహా మేరకు చికిత్సకు మత్తు మందుల వాడకం.
* దుర్వినియోగం : వైద్యుల తప్పుడు సలహాతో మత్తు మందు వినియోగం.
* దురుపయోగం : సొంత నిర్ణయంతో మత్తుమందును సేవించడం.
* ప్రపంచంలో 15.5 నుండి 29.0 కోట్ల మంది ప్రజలు మత్తు మందుల్ని వినియోగిస్తారని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
* సామాజికంగా 1.6-3.8 కోట్ల మంది (మత్తు మందులు దురుపయోగం చేసే వారిలో మొత్తం 10-15 శాతం) సమస్యాత్మకంగా మారారు.
* సమస్యాత్మకంగా మారిన వారిలో 12-30 శాతం చికిత్స పొందుతున్నారు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
No comments:
Post a Comment