ఈ కుర్రోడు మన తెలుగోడే....పేరు ఫణీంద్ర సామ...స్వస్థలం నిజామాబాద్ జిల్లా...ఇతను అంతర్జాతీయ వార్తలకెక్కాడు...కారణం అతను ప్రారంభించిన రెడ్‌బస్.ఇన్ అన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ సంస్థే. ఓ చిన్న సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలో పుట్టిన ఒక చిన్న ఆలోచన అతని జీవితాన్నే మార్చుసింది. ఆరేళ్ల క్రితం మామూలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగయిన ఫణీంద్ర ఇప్పుడు వందల కోట్ల టర్నోవర్ గల సంస్థకు సీఈవో. అంతర్జాతీయ అవార్డు అందుకున్న సృతనాత్మక వ్యాపారవేత్త. ఇంతకీ అతనికొచ్చిన సమస్యేమిటి, అతను చేసిన ఆలోచనేమిటి, అతని జీవితం ఎలా మలుపుతిరిగింది....ఇదే నేటి స్ఫూర్తి కథనం...
ఆరేడేళ్లు..వెనక్కి వెళ్లండి...ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి బస్సు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేసేవాళ్లం...కాళ్లు ఈడ్చుకుంటూ ఆర్టీసీ బస్టాండుకో, ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్ ఆఫీసుకో వెళ్లేవాళ్లం...టికెట్ బుక్ చేసుకునేవాళ్లం. ఒక ఏజెంట్ వద్ద టికెట్ దొరక్కపోతే మరో ఏజెంట్ వద్దకు పరిగెత్తేవాళ్లం...అదో పెద్ద ప్రయాసగా ఉండేది. ఇప్పుడా శ్రమ లేదు. ఆర్టీసీ సహా ప్రైవేట్ బస్ సంస్థలూ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సర్వీసును అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరు, ఇంటర్నెట్ ఉంటే ఇంట్లో నుంచే ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్టు బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనకు 2006లోనే శ్రీకారం చుట్టిన మన తెలుగు యువకుడు ఓ సంస్థను స్థాపించి ఇప్పడు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. అతనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫణీంద్ర సామ. ఆ సంస్థే 'రెడ్‌బస్ డాట్ ఇన్'.
ఆ దీపావళి రోజు...
బిట్స్, పిలానీలో ఈఈఈ చదివిన సామ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. ఓ దీపావళి పండగకు ఇంటికి రావాలనుకున్నారు. బెంగళూరులో ఓ ప్రైవేట్ బస్సు ఏజెంట్ వద్దకు వెళ్లారు. అతను రెండు మూడు బస్ ఆపరేటర్లకు ఫోన్‌చేసి ఆఖరికి టికెట్లు లేవని చెప్పారు. అలా నాలుగైదు ఏజెన్సీలను సంప్రదించినా అదే సమాధానం వచ్చింది. ఇంకా చాలా మంది బస్సు ఏజెంట్లు ఉన్నా, వారందరి వద్దకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో మిత్రులంతా పండక్కి స్వస్థలాలకు వెళ్లిపోయినా ఫణీంద్ర మాత్రం తన గదిలో ఒంటరిగా ఉండిపోయారు. ఒక దీపావళికి ఇంటికి వెళ్లలేకపోయినా...జీవితం చిచ్చుబుడ్డీలా వెలిగే ఆలోచన ఆ సమయంలో అతనికి వచ్చింది. అన్ని బస్సుల్లో సీట్ల ఖాళీల వివరాలు ఒకేచోట లభిస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందిగదా అనిపించింది. అంతే మిత్రులు వచ్చాక తన ఆలోచనను వారితో పంచుకున్నారు. అంతా కలసి ఓ సాఫ్ట్‌వేర్ తయారు చేశారు.
ఎర్రబస్సే గుర్తొచ్చింది...
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేయడానికి అవకాశమున్న ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని బస్సు సర్వీసులను అనుసంధానం చేస్తే ప్రయాణికులు ఇంట్లో నుంచిగానీ, ఏజెంట్ వద్ద నుంచిగానీ ఏ బస్సుకైనా, ఏ రూట్లోనైనా ఇట్టే టికెట్టు బుక్ చేసుకోవచ్చు. చాలా మంది బస్సు ఆపరేటర్లను కలిసి ఇదే విషయాన్ని వివరించారు సాఫ్ట్‌వేర్ తయారు చేసిన ముగ్గురు మిత్రులు. ఉచితంగా ఇస్తామన్నా ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకోడానికి ఎవరూ అంగీకరించలేదు. అయినా వారు నిరుత్సాహపడలేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహాలు ఇచ్చే ఓ సంస్థ కలిశారు. ఆ సంస్థ సలహాతో తామే ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ఏజెన్సీని ప్రారంభించాలనుకున్నారు. అప్పుడు, చిన్నప్పుడు ఎక్కిన ఎర్రబస్సు గుర్తొచ్చింది. వెంటనే 'రెడ్‌బస్ డాట్ ఇన్' అనే పేరుతో సంస్థను ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు వదిలేశారు. ఓ బస్సు ఆపరేటర్‌ను ఒప్పించి వారంలో ఐదు సీట్లు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ టికెట్లు ఎలా విక్రయించాలన్నది ప్రశ్న...రెడ్‌బస్ డాట్ ఇన్ గురించి వివరిస్తూ ముద్రించిన కార్డులను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వెళ్లి ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఏమాత్రం నామూషాగా భావించకుండా ప్రహరీ బయట నిలబడి ఈ ప్రచారం చేశారు.
ఏడాదికేడాది విస్తరణ
తిరుపతికి చెందిన ఓ యువతి 2006 ఆగస్టు 22న మొదటి టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ రోజు ఆమెను ఇప్పుడు సీఈవోగా ఉన్న ఫణీంద్ర సామనే స్వయంగా బస్సు ఎక్కించారు. ఐదు టికెట్లను ఐదు రోజుల్లోనే అమ్మేశారు. ఇక తిరిగి చూసుకోలేదు. తొలుత బెంగళూరు నగరంలో ఎంతమంది బస్ ఆపరేటర్లు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఎన్ని బస్సులున్నాయి, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలు సేకరించారు. ఆ తరువాత తమ రెడ్ బస్ డాట్ ఇన్‌లో ఎక్కువ మంది బస్ ఆపరేటర్లను చేర్పించేందుకు కృషి చేశారు. అదేసమయంలో అత్యంత సృజనాత్మక ఆలోచనతో కూడిన ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకొచ్చారు. ఏడాదికేడాది సంస్థ విస్తరించింది. మొదటి ఏడాది ఐదు లక్షల వ్యాపారం చేశారు. రెండో ఏడాది రూ.5 కోట్లు, మూడో ఏడాది రూ.30 కోట్లు, నాలుగో ఏడాది రూ.60 కోట్లు..ఇలా పెరుగుతోంది ఆ సంస్థ టర్నోవర్. వెయ్యి కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది రెడ్‌బస్ సీఈవో ఫణీంద్ర సామ లక్ష్యం.
10 వేల బస్సుల్లో సీట్ల బుకింగ్
ఐదు సీట్లతో 2006 ఆగస్టులో మొదలైన సంస్థ ఇప్పుడు 10 వేలకుపైగా బస్సుల్లోని సీట్లు విక్రయిస్తోంది. ఆ సంస్థ 15 రాష్ట్రాల్లో 2,500 పట్టణాలు, నగరాల్లో సేవలిందిస్తోంది. రెడ్‌బస్.ఇన్‌లో 1300 మంది బస్ ఆపరేటర్లు, ఏజెంట్లు, 10 వేలకుపైగా బస్సులు నమోదయివున్నాయి. రోజుకు 5 లక్షల టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. రోజుకు ఐదు వేల టికెట్లు విక్రయిస్తోంది. దేశ వ్యాప్తంగా 10 ఆఫీసులున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, పూణే, ఢిల్లీ, విశాఖపట్నం, అహ్మదాబాద్, ముంబయి, విజయవాడల్లో రెడ్‌బస్ ఆఫీసున్నాయి. 250 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ రోజుదాకా 90 లక్షల టికెట్లు విక్రయించింది. సెల్‌ఫోన్ ద్వారా టికెట్ బుకింగ్, ఈ-టికెటింగ్ వంటివీ ప్రవేశపెట్టింది. టికెట్లు ఇంటికే తెచ్చిచ్చే ఏర్పాట్లూ కొన్ని పట్టణాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ అవార్డు
సృజనాత్మక ఆలోచనతో ప్రారంభించిన రెడ్‌బస్ డాట్ ఇన్ సంస్థకు ఇటీవల అంతర్జాతీయ అవార్డు లభించింది. అత్యంత సృజనాత్మక ఆలోచనతో వ్యాపారం ప్రారంభించే సంస్థలకు అమెరికాలోని ఓ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డును రెడ్‌బస్ డాట్ ఇన్ దక్కించుకుంది. చిన్న సమస్యను పరిష్కరించే లక్ష్యంతో మొదలైన ఆలోచన పెద్ద వ్యాపార సామ్రాజ్యంలా విస్తరించడమే ఈ అవార్డు రావడానికి కారణమయింది. ఏమైనా మన తెలుగు యువకుడు ఒక అద్భుతమైన ఆలోచనతో కేవలం ఆరేళ్లలో వందల కోట్ల వ్యాపారవేత్తగా ఎదగడం అరుదైన, స్ఫూర్తిదాయకమైన విజయమేగదా!
No comments:
Post a Comment