'లక్ష్మీకాంతం! ఇది చాలా ఘోరమైన దురాచారం. ఉడిపిలాంటి దేవాలయంలో బ్రాహ్మణులు తిని వదిలేసిన అరిటాకుల మీద బ్రాహ్మణేతరులు పొర్లుతున్నారట! అలా పొర్లితే వారికి చర్మవ్యాధులు పోతాయట! దీనిని వైద్యుడైన ఒక కర్నాటక ఉన్నత విద్యాశాఖా మంత్రి డా|| ఆచార్య స్వయంగా ప్రకటించడం అత్యంత దారుణం.'
'నిజమే సుబ్బారావు! కర్నాటకలోని మరో ప్రముఖ నాయకుడు శ్రీరామరెడ్డి ప్రశ్నించినట్లు, అలా పొర్లితే చర్మరోగాలు తగ్గేట్లయితే ఆ ఎంగిలి విస్తళ్ళలో బ్రాహ్మణులూ ఎందుకు పొర్లడం లేదు? ఎంగిలి విస్తళ్ళలో పొర్లితే చర్మరోగాలు పోతాయని ఏ వైద్య పరిశోధనలూ నిరూ పించలేదే? అలా రోగాలు పోతాయని డా|| ఆచార్య నమ్మితే, శ్రీరామరెడ్డి కోరినట్లు రాష్ట్రంలోని చర్మవ్యాధుల ఆస్పత్రులు మూసేసి, చర్మ వ్యాధిపీడితులను ఎంగిలి విస్తళ్ళలో పొర్లించే ప్రక్రియను చేపట్టవచ్చు గదా?' అని ప్రశ్నించాను.
'అవును లక్ష్మీకాంతం! ఉడిపి శ్రీకృష్ణ దేవాలయ నిర్వాహణాధి పతి అయిన స్వామి విశ్వేశతీర్థ రాష్ట్రమంతటా తిరుగుతూ, హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ప్రచారం చేస్తున్నాడట! కానీ, తన మఠంలో, తన దేవాలయంలో జరిగే ఈ అమానుష అచారాన్ని రూపుమాపే చర్యలేవీ ఆయన తీసుకోవడం లేదు. 'ఈ దురాచారం ఇలా కొనసాగవలసిందేనా? దీనిని ఆపేదెలా?' ఆవేదనతో ప్రశ్నించాడు సుబ్బారావు.
'ఈ దురాచారం ఆగిపోవాలంటే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో పెరగాలి. అప్పుడు ప్రజలే ఉవ్వెత్తున, ఉప్పెనలా లేచి ఈ దురాచారాన్ని మట్టుబెడతారు. ప్రజల్లో అవగాహన పెరగటానికి ఈ దురాచారానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలలో ప్రచారం జరగాలి' అన్నాను నేను.
'ప్రజల్లో అవగాహన పెరగటానికి, తగిన ప్రచారాన్ని, నా శాయశక్తులా చేస్తాను' దృఢంగా అన్నాడు సుబ్బారావు.
'మంచిది సుబ్బారావు' మెచ్చుకోలుగా అన్నాను నేను.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment