Tuesday, 22 October 2013

హనికరం ప్యాకేజ్డ్ ఆహరం
 



    జీవితంలో తీరికలేనితనం కమ్ముకొన్నాక మనలో ఏ పనిచేయాలన్నా, చివరకు వంట చేయాలన్నా కూడా సహనం లోపిస్తుంది. దీంతో మనలో చాలా మందిమి బయట తిళ్లకి అలవాటుపడ్డాం. పిల్లల్ని స్కూళ్ల్లకి పంపి, పెద్దలు ఆఫీసులకి వెళ్లాల్సిన హడావిడిలో తయారుగా ఉన్న 'పాకేజ్డు ఫుడ్స్‌'పై ఆధారపడుతున్నాం. దీనివలన సమయం కలసి వస్తోందన్నది ఒకటే మన వాదన. కానీ జరిగే ఘోరం సంగతి తెలియదు మనకు. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ స్లో పాయిజన్‌లా పనిచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకొన్న తృణధాన్యాలపై ఇంత పాలు ఒంపి, సంపూర్ణ ఆహారం సిద్ధం చేశామనుకొంటాం. కానీ మనం సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చిన తృణధాన్యాలతో సహా ప్యాకేజ్డ్‌ ఆహారం ఆరోగ్యవంతమైనదే కానీ, వాటిని నిల్వ ఉంచేందుకు అనుసరించే పద్ధతుల వల్లనే ప్రమాదం అని వైద్యనిపుణులు అంటున్నారు. ఎప్పుడూ హడావిడిలో ఉండే తరానికి అవసరమవుతున్న 'క్విక్‌ ఫిక్స్‌ ఫుడ్‌' తోనే ఇబ్బందంతా అని వారు హెచ్చరిస్తున్నారు. అలా తొందరగా ఆహారం తయారీకి వేసే పదార్థాలలో రసాయనాలు ఉంటాయి. అంతేకాక , అసలుకే పోషకాలు లేని పదార్థాలు ఎక్కువ. అందువల్ల చాలా కాలంపాటు వాటిని తింటే శరీరానికి హాని చేయడం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ల మీద ఆరోగ్యపరమైన హామీని చూసే కొంటున్నామని మనం అంటాం సాధారణంగా. నిపుణులెవరూ ఆయా పదార్థాలలో దీర్ఘకాలంలో తీవ్ర హానిచేసేవి ఉంటాయని అసలు చెప్పరు. మనమే ఏయే ఆహారపదార్థాల్లో ఏమేమి ఉంటాయో, వాటి దుష్ప్రభావం ఏమిటో తెలుసుకుందాం..
   బిస్కెట్లలో ప్రాణాంతక మూలకాలు..
    రిఫైన్డ్‌ వీట్‌ఫ్లోర్‌ (శుద్ధి చేసిన గోధుమపిండి), చక్కెర, కూరగాయలతో తయారైన వంటనూనె, పాలలోని ఘన పదార్థాలు, ఇన్వర్ట్‌ సిరప్‌ (గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ మిశ్రమం) కలవి కొన్నింటిని కలపడానికి వాడే ఎమల్సిఫయర్లు, లవణాలు, విటమిన్లు, పిండిని ముద్ద చేయడానికి వాడే ద్రవాలు.
   శుద్ధిచేసిన గోధుమపిండిలోని హానికర గుణాల గురించి మనం విని ఉన్నాం. ఈ బేక్డ్‌ కుకీలలో హెచ్చు స్థాయిలో వెజిటబుల్‌ ఆయిల్‌ను వాడతారన్నది ఆందోళన కలిగించే అసలు విషయం అని చెప్పారు పోషక నిపుణులు షోనాలీ సబర్వాల్‌. వంటనూనె (వెజిటబుల్‌) లో పోషకాలన్నీ పోతాయి. కేవలం కొవ్వు మాత్రమే మిగులుతుంది. ఇది పొట్టను ఉబ్బిపోయేలా చేస్తుంది. శరీరంలో క్రమబద్ధీకరణ కుదరని కొవ్వు చేరితే, ఉదరం విరుద్ధంగా స్పందిస్తుంది. ఫలితంగా శరీరం నెమ్మదిస్తుంది. ఇన్వర్ట్‌ సిరప్‌ వలన కడుపు నిండినట్టు అనిపిస్తుంది. చక్కెర తీసుకొన్న కొద్దీ మనం మరింతగా దాన్నే కోరుకొంటాం. చాలా ఉత్పత్తులు చక్కెర లేనేలేదని చాటుతాయి కానీ వారు చెప్పేది తెల్ల చక్కెర. ఐనా దానిలో గ్లూకోజ్‌, క్ట్రోజ్‌, ప్వాట్నర్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వాటికి దీర్ఘకాల దుష్ఫలితాలు ఎక్కువ. పాలలోని ఘనపదార్థాలు స్కిజో ఫ్రెనియా, ఆటిజం, డిప్రెషన్‌, మల్టిపుల్‌ స్లెరోసిస్‌ కలగజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకేజ్డ్‌ సూప్స్‌లో..
  మొక్కజొన్న పిండి, వంటనూనె (వెజిటబుల్‌), చిక్కబరిచే పదార్థం, మెత్తగా చేసే ఎజెంట్‌, చక్కెర, ఉప్పు, ఎండబెట్టిన కూరగాయలు, ఆరబెట్టిన గ్లూకోజ్‌ సిరప్‌, ఆహారంగా తీసుకొనే కూరగాయల కొవ్వు, ఈస్ట్‌ నుంచి తీసిన పొడి, హైడ్రోలైజ్డ్‌ వెజిటబుల్‌ ప్రొటీన్‌, ఎసిడిటీని నియంత్రించే రెగ్యులేటర్‌, సువాసన పెంచే పదార్థాలు.
టమాటా సూప్‌ను తాజా టమాటాలతో తయారు చేయండి. రెండురోజులకు సరిసడేలా దీన్ని చేయండి. రంగు మారుతోందా! ప్యాకెట్‌ సూప్‌ల వాళ్లు ఎన్ని రోజులైనా రంగుపోని విధంగా ఎలా చేస్తున్నారో ఆలోచించండి. అందుకు కారణం వారు కలరింగ్‌ ఏజెంట్లు వాడతారు. కలరింగ్‌ ఏజెంట్లు విషపూరితమని డాక్టర్‌ హేమంత్‌ థక్కర్‌ అంటారు. అవి మూత్రపిండాలను, ఉద రాన్ని చాలా శ్రమించేలా చేస్తాయి. శారీరక వ్యవస్థ నుండి రసాయనాలను కడిగేయడానికి లివర్‌, కిడ్నీలు ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. ఆ సరికే అధికంగా పనిచేసి ఉన్న ఉదరకోశం, కిడ్నీలు చేయాల్సిన కష్టాన్ని చేయలేక పోతాయి. ఫలితంగా ఆహారం నుంచి జీర్ణవ్యవస్థ ద్వారా శరీరం ఇముడ్చుకొన్న పోషకాల శుద్ధి ప్రక్రియ ఆగి పోతుంది. రక్తం నుంచి విషపూరితాలను తొలగించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అల్బూమిన్‌ వంటి పోషకాల నిల్వ ప్రక్రియ నిలిచిపోతుంది. రక్త ప్రసరణ లో అడ్డంకులను తొలగించే క్రమం కూడా దెబ్బ తింటుంది. కాలకృత్యాలను కూడా క్రమం తప్పకుండా చేయడం నిలిచిపోవచ్చు. హైడ్రోనైజ్డ్‌ వెజిటబుల్‌ ప్రొటీన్‌లో తలనొప్పిని, వేగంగా గుండె స్పందననీ, ఛాతీ నొప్పినీ, వికారాన్నీ కలిగించే ఎంఎస్‌జి 30 శాతం ఉంటుంది. ఈస్ట్‌ ఎక్‌స్ట్రాక్ట్‌ పౌడర్‌ చెడ్డ బాక్టీరియా అయిన ఈస్ట్‌ను కలగజేస్తుంది. దీనివలన రక్తంలో యాసిడ్‌ ఉనికి ఎక్కువవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే సూప్‌లు తాగేటప్పుడు జాగ్రత్త సుమా!
తయారు భోజనంలో..
ఎండబెట్టిన కూరగాయలు, నీరు, వంట నూనె (వెజిటబుల్‌), జీడిపప్పులు, ఉప్పు, చక్కెర, వెన్న, అల్లం గుజ్జు.
ప్రముఖ వైద్య నిపుణులు హేమంత థక్కర్‌ ఏమంటున్నా రంటే, తినడానికి తయారుగా ఉన్న భోజనంలో ఎండి పోయిన పొడికూరలు ఎక్కువగా ఉంటాయని. వా టిలో పోషకాలు శూన్యం. పీచు, కేలరీలు తప్ప ఇంకేమీ వాటిలో ఉండవు. ఆహారం తయారు గా ఉందంటే చల్లారిందని అర్థం. మళ్లీ వేడి చేస్తారు. అప్పుడు అందులో మిగిలిన సూక్ష్మ పోషకాలు ఏమైనా ఉంటే ఆవిరై పోతాయి. ఎటువంటి రసాయనాలు, పదార్థాలు కలపకుండా ఆహార పదార్థాలను ఏడాది పాటు భద్రపరచడం కుదరనే కుదరదని హేమంత్‌ చెప్పారు. షాపుల్లో తాజా ప్యాకెట్లు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. ఎంత ఆహారానికి ఎంత పదార్థం కలపాలన్నది కూడా లెక్కే. పరిమితులను దాటితే ఆహారం పాడైపోతుంది. అటువంటి ఆహారాన్ని అడ్డూ అదుపూ లేకుండా తీసుకొంటే ఉదరం, మూత్రపిండాలూ చెడిపోవడం ఖాయం.
మ్యూజ్లీలో..
ఇన్వర్ట్‌ సిరప్‌ (గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌ మిశ్రమం), స్ట్రాబెర్రీ క్రష్‌ (చక్కెర, నీరు, స్ట్రాబెర్రీ గుజ్జు), స్ట్రాబెర్రీ సిరప్‌, అనాస గుజ్జు, మామిడిపండు గుజ్జు, ఆపిల్‌
రసం, గ్లూకోజ్‌ ద్రవం, కొవ్వు అదనంగా చక్కెర కలపలేదని లేబుల్‌ చెబుతుంది. ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ తయారీలో వాడిన సిరప్‌ల ద్వారా ఎంతో చక్కెర వచ్చి చేరి ఉంటుంది. అది తిన్నాక మీరు అధిక చురుకు దనంతో ఉన్నారంటే చక్కెర పెరిగిందని గుర్తు. రక్తంలో చక్కెర స్థాయి అదుపుతప్పుతుంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌ ధాన్యాలను నిందించాలి తప్ప మరోటికాదు.
చక్కెర ఎక్కువవడంతో బాటు సోయాబీన్‌ ఆయిల్‌ తయారీలో పుట్టే సోరు లెసిథిన్‌ అనేది కూడా ఆందోళన కలిగించేదే. దీనికి చాలా దుష్ఫలితాలు ఉంటాయి. ఇది అనేక మూలకాలను అనుసంధానం చేయడం వలన ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసపడడం జరగవచ్చు. అప్పుడప్పుడు వికారం కలగవచ్చు. వాంతి అయ్యేలా తల తిరగవచ్చు. సోయాబీన్‌ తినవద్దని డాక్టర్లు సలహా ఇస్తుంటే బ్రెడ్‌ సైతం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Courtesy with: Praja Sekthi daily

No comments:

Post a Comment