Thursday, 10 October 2013

 గుండెపోటు నివారణలో 'యాంజియోప్లాస్టి' 

 
 
                 సమాజంలో ప్రతిదీ నిరంతరం మారుతూ ఉన్నట్లే వైద్యంలోనూ, వైద్య విధానంలోనూ, వైద్య చికిత్సల్లోనూ కొంగొత్త మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. ఆయా జబ్బుల పట్లా, వ్యాధుల పట్లా పరిశీలనలూ పరిశోధనలూ పెరుగుతున్నాయి. వాటికి సంబంధించిన అవగాహన పెరిగేకొద్దీ వాటి నివారణకు అవసరమైన ఆధునిక పరిజ్ఞానమూ విస్తరిస్తోంది. అలాంటి అధునాతన గుండెపోటు నివారణ చికిత్సలో 'యాంజియోప్లాస్టీ' ఒకటి. దీనివల్ల గుండెపోటును సులువైన పద్ధతిలో నివారించవచ్చు.
గుండె... మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. అందుకే దానిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం తప్పనిసరి. మారుతున్న పరిస్థితుల్లో గుండెపోటు అనేది సమాజాన్ని కుంగ దీస్తున్న సమస్య. దీనిని నివారించాలంటే గుండెపోటుకు కారణాలనూ, దాని నివారణకు అవసరమైన ఆధునిక చికిత్సా విధానాన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

యాంజియోప్లాస్టి అంటే?

గుండె పదిలంగా ఉండాలంటే శరీర భాగాల నుంచి దానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి. దానికేమాత్రం ఆటంకం కలిగినా గుండెపోటు రావచ్చు. గుండె ఆగిపోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. గుండెకు నిరంతర రక్తం సరఫరా చేసే నాళాల్లో కొవ్వు పేరుకుంటే గనుక అది గుండెపోటుకు దారితీస్తుంది. దానిని నివారించడానికి అనువైన ఆధునిక మార్గాలు రెండున్నాయి. అవే శస్త్ర చికిత్స, యాంజియోప్లాస్టి. ఈ రెండింటితో గుండె పోటును చాలావరకూ నివారించవచ్చు. శస్త్రచికిత్సలో అయితే ఛాతీని తెరిచి, చేయాల్సి ఉంటుంది. కానీ యాంజియోప్లాస్టీలో మాత్రం రక్తనాళం ద్వారా బెలూన్‌ పంపిస్తే చాలు. గతంలో తొడ నుంచి పంపే ఈ ప్రక్రియ ఇటీవల మరింత సులువైంది. మునుపటి కంటే మెరుగైన అధునాతన ప్రక్రియల్లో ఇదెంతో ముఖ్యమైనది.
ఎలా చేస్తారు?
ఒక సూక్ష్మనాళం ద్వారా శరీరంలోని రక్తనాళాల్లోకి బెలూన్‌ అనే పరికరాన్ని పంపుతారు. కొవ్వుతో పూడుకుపోయిన ఆ రక్త నాళాలను విచ్చుకుపోయేలా చేస్తారు. ఇదే యాంజియోప్లాస్టి ప్రక్రియ. గుండె పోటును నివారించడానికి ఇప్పుడు లక్షలాది మంది హృద్రోగులు ఈ మార్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు బైపాస్‌ కన్నా, అధిక సంఖ్యలో ఈ యాంజియోప్లాస్టి చికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కేథటర్‌), మూసుకు పోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సన్నటి తీగను రక్తనాళం వద్దకు జొప్పించి, లోపలికి ఒక బెలూన్‌ను పంపుతారు. ఆ బెలూన్‌ని ఉబ్బేలా చేయడం ద్వారా రక్తనాళం పూడుకుపోయిన ప్రాంతాన్ని, విచ్చుకునేలా చేస్తారు. ఫలితంగా రక్త నాళంలోని అడ్డంకి తొలగిపోవడంవల్ల రక్త ప్రసరణ మునుపటిలాగే జరగడానికి ఆస్కారం ఉంటుంది.
గుండెకు సరఫరా చేసే రక్తనాళాల ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడటంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడంతో ఈ అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వీటిని బైపాస్‌ సర్జరీవల్ల గానీ, యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారాగానీ తొలగించవచ్చు. బైపాస్‌ సర్జరీ అంటే, ఛాతీ భాగాన్ని శస్త్ర చికిత్స ద్వారా తెరచి, గుండెకు జరిగే రక్త ప్రవాహాన్ని యథాతథంగా జరిపేందుకు మరో మార్గాన్ని ఏర్పర్చడం. ఇందుకోసం పూడుకుపోయిన రక్త నాళాలకు ప్రత్యామ్నాయంగా ఇతర రక్త నాళాలను కలుపుతారు. అయితే ఇది మేజర్‌ శస్త్ర చికిత్స. ఆపరేషన్‌ అయిన తర్వాత కూడా, రోగి కనీసం వారంరోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలలు సమయం పడుతుంది. ఈ శ్రమ, ఆందోళన లేకుండా రక్తనాళాల్లో అడ్డంకులను సులువుగా తొలగించడానికి ఇప్పటి మేలైన పద్ధతే యాంజియోప్లాస్టి.

'స్టెంట్‌' ఎప్పుడు అవసరం ?

రక్త నాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి శస్త్ర చికిత్స లేకుండానే చేసే ఈ చికిత్సలో ఎలాంటి కోతా ఉండదు. తొడ, లేదా చేతిలోని రక్త నాళం ద్వారా, గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి సన్నని బెలూన్‌ను పంపుతారు. రక్త నాళం పూడుకుపోయిన స్థానాన్ని చేరగానే ఆ బెలూన్‌ను ఉబ్బేలా చేస్తారు. అలా రక్తనాళంలోని అడ్డంకులను తొలగిస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో పూడిక ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి చాలా సందర్భాల్లో స్టెంట్‌ అనే లోహపు గొట్టాన్ని అమర్చుతారు. దీనివల్ల రోగి ఒకటీ రెండు రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి, తన రోజు వారీ పనులను సాధారణంగా చేసుకోవచ్చు. ఫలితాలూ, ప్రయోజనాలూ భేషుగ్గా ఉండటంవల్ల బైపాస్‌ సర్జరీ కన్నా, చాలా మంది రోగులూ, డాక్టర్లూ ప్రస్తుతం యాంజియో ప్లాస్టి వైపు మొగ్గు చూపుతున్నారు.

అత్యాధునికం ట్రాన్స్‌ రేడియల్‌ విధానం

ట్రాన్స్‌రేడియల్‌ విధానం అనేది యాంజియో ప్లాస్టిలో అధునాతనమైనదిగా చెప్పవచ్చు. ఇది రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో సంప్రదాయ యాంజియోగ్రామ్‌, లేదా యాంజియోప్లాస్టీని తొడలోని రక్తనాళం ద్వారా చేసేవారు దాంతో యాంజియోగ్రామ్‌ తర్వాత 5 నుంచి 7 గంటల పాటు, యాంజియోప్లాస్టీ తర్వాత 10-14 గంటలపాటు మంచం మీద కదలకుండా పడుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ట్రాన్స్‌రేడియల్‌ పద్ధతిలో చేతిలోని రక్తనాళం ద్వారా యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీ చేయడంవల్ల రోగి వెంటనే నడవవచ్చు. హాస్పిటల్‌లో ఉండే సమయం, రక్తస్రావం జరిగే అవకాశం చాలావరకూ తగ్గిపోతాయి.
యాంజియోప్లాస్టీ... అందులోనూ చేతిద్వారా చేసే ట్రాన్స్‌రేడియల్‌ యాంజియోప్లాస్టీ ఇటీవల అందుబాటులోకి రావడంతో హృద్రోగ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనితో గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలావరకూ నివారించడానికి వీలవుతోంది.

Courtesy with : PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment