Posted on: Sun 06 Oct 23:18:40.855203 2013
గ్రీన్ టీ ఎలా చేయాలంటే...
ఓ కప్పు మంచినీళ్ళను మరగపెట్టండి. దానిలో ఓ టీ స్పూన్ తేయాకు వేయండి. అలా వేసిన తరువాత ఆ నీళ్ళను ఓ రెండు నిమిషాలు తెర్ల నివ్వండి. ఆ పైన దాన్ని వడ్డకట్టేయండి. వడపోయగా వచ్చిన తేనీటిని తాగేయండి. అందులో పంచదార కానీ, పాలు కానీ కలపకండి. అంతే! మీ ఆరోగ్యానికి అదే శ్రీరామరక్ష
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటీ 30 లక్షల మంది గుండె సంబంధమైన జబ్బులతో ఏటా ప్రాణాలు కోల్పోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఒక్క మన దేశం సంగతే తీసుకున్నా, దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అయిదో వంతు భాగం గుండె జబ్బుల వల్ల జరుగుతున్నవే! సాక్షాత్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) ఈ సంగతి తెలిపింది. అయితే, ఆరోగ్యవంతమైన జీవనశైలి ద్వారా, రోజూ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చంటున్నారు నిపుణులు. కాగా, రోజూ గ్రీన్ టీ తాగడం కూడా గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది.
గ్రీన్ టీ గొప్పదనం ఏమిటంటారా? ఆ సంగతికే వస్తున్నాం. గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, సాధారణంగా మామూలు టీలో ఏ మేరకు చక్కెర వాడుతున్నామనే స్పృహ మనకు ఉండదు. అదే గ్రీన్ టీలో అలా కాదు. అందుకే, తీసుకొనే చక్కెర మొత్తాన్ని తగ్గించాలన్నా, లావెక్కే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా అందుకు చక్కటి మార్గం - గ్రీన్ టీ.
ఆ మధ్య ఏథెన్స్ మెడికల్ స్కూల్ ఓ అధ్యయనం జరిపింది. మామూలు కాఫీ, టీ, వేడి నీళ్ళు తాగే వారి కన్నా గ్రీన్ టీ తాగేవారిలో గుండెకు రక్తం తీసుకుపోయే నాళాలు బిగుసుకుపోకుండా ఉంటాయనీ, రక్త ప్రసారం సాఫీగా సాగుతుందనీ ఆ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా, గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్లు శరీరంలోని టిస్యూ వాపునకు గురికానివ్వవు. రక్తనాళాల్లోని గోడల మీద ఈ గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. రక్తనాళాలు సాంత్వన పొందడానికి వీలుగా కణజాలాలు కొన్ని స్రావాలను వెలువరిస్తాయి. ఫలితంగా, రక్త ప్రసారం సులభమవుతుంది, పెరుగుతుంది.
గుండెపోటుకు ప్రధాన కారణం నాళాల్లో రక్తం గడ్డ కట్టడం! అలా గడ్డ కట్టడాన్ని కూడా గ్రీన్ టీ నివారిస్తుంది. జపాన్‌లో జరిగిన మరో అధ్యయనం కూడా గ్రీన్ టీలోని ఈ సుగుణాలను నిర్ధారించింది. రోజూ అయిదు కప్పుల కన్నా ఎక్కువ గ్రీన్ టీ తాగినవారిలో గుండెపోటు ద్వారా మరణించే రిస్కు దాదాపు 26 శాతం తగ్గినట్లు వారి అధ్యయనం తెలిపింది.
ఇవాళ పట్టణీకరణ శరవేగంతో సాగుతోంది. జీవనశైలులు అంతకన్నా వేగంగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతీయుల్లో గుండె జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న ఒత్తిడి, సరైన వ్యాయామం లేని జీవనశైలి, శారీరక శ్రమ బాగా తగ్గిపోవడం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు మన భారతీయుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం, మన చైనా సోదరుల నుంచి ఈ గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే, ఇంటికీ, ఒంటికీ కూడా మంచిది కదూ!
Courtesy with: PRAJA SEKTHI DAILY
No comments:
Post a Comment