Thursday, 27 September 2012

మేం మూఢనమ్మకాలకు వ్యతిరేకం.. ఏ మతానికి కాదు..2


  • అశాస్త్రీయ ఆచారాలు - 19
'సుబ్బారావ్‌! మతనాయకులూ, మత ప్రచారకులూ మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. హిందూ మతనాయకులేగాదు, ముస్లిం, క్రిష్టియన్‌ మత నాయకులు కూడ మూఢనమ్మకాలను ఖండిస్తూనే ఉన్నారు. వాటిని వివరిస్తాను'' అని 24-8-2012 నాటి ''ది హిందూ'' పత్రికను సుబ్బారావుకిచ్చాను.
దానిలో ''వదంతులు చిక్కగా, వేగంగా వ్యాపిస్తాయి'' అనే వార్త సారాంశమిది. ''షహీనానగర్‌ ఏరియా (హైదరాబాద్‌)లో ఒక బాలిక జన్మించిందనీ, ఆ అమ్మాయి జన్మించిన 22-8-12 రాత్రి ఎవరైనా పిల్లలు నిద్రపోతే వారు చనిపోతారని చెప్పిందనే వదంతి హైదరాబాద్‌ పాతబస్తీలో ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ వదంతిని సెల్‌ఫోన్లు చాలా వేగంగా వ్యాప్తి చేశాయి. అంతే! పాతబస్తీలోని అనేక ప్రాంతాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రలేపి, వాళ్ళు మరల నిద్రపోకుండా ఉండేందుకు నానా తంటాలు పడ్డారు. కొంతమంది పిల్లలతో ఆటలాడించారు. కొంతమంది మోటారు సైకిళ్ళ మీదా, ఆటోలలోనూ వారిని తిప్పారు. అయితే, ముఖ్యమైన విషయమేమిటంటే, మత నాయకులు స్థానిక మసీదులలో ఏర్పాటు చేయబడిన లౌడ్‌స్పీకర్లలో ఈ వదంతులను నమ్మవద్దనీ, పిల్లలు నిద్రపోయినా ఏమీకాదనీ చెప్పడం జరిగింది. అయినా ప్రజలపై లౌడ్‌స్పీకర్ల ప్రచారం ఏమీ ప్రభావం కలిగించలేదు.'' కాబట్టి సుబ్బారావ్‌! అనేక సందర్భాలలో మతనాయకులు, మత ప్రచారకులు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం మనం గమనించవలసిన విషయం.
ఇక క్రిష్టియన్‌ మతనాయకులు కూడా మూఢనమ్మకాలను ఖండిస్తున్నారు. ఉదాహరణకు 17-9-1998 నాటి ఈనాడు పత్రికలోని ఒక వార్తను వినిపిస్తాను విను'' అని ఆ వార్తను చదివి వినిపించాను. ఆ వార్తలో ఇలా ఉంది. ''జ్యోతిష్యాన్ని గూర్చి పోప్‌ జాన్‌పాల్‌ ఇలా ప్రకటించారు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ధారించుకొనేందుకు, జాతకాలను తిరగేయాల్సిన పనిలేదు. రాశి ఫలాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హస్త సాముద్రికుల దగ్గరకు వెళ్ళవలసిన పనిలేదు. గ్రహబలాన్ని నమ్ముకోరాదు.''
కాబట్టి సుబ్బారావ్‌! మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తే, మతాన్ని విమర్శించినట్లు కాదు. ఎందుకంటే వాటిని తమకు తెలిసిన మేర మత నాయకులు ఖండిస్తున్నారు. మత ప్రచారకులు వాటిని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం మోసగాళ్ళూ, అవకాశవాదులే మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారాన్ని మత వ్యతిరేక ప్రచారంగా ప్రకటించి, మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేం ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు. కానీ, అన్ని మతాలవారూ మూఢనమ్మకాలను తరిమికొట్టాలి. శాస్త్రీయాలోచనా విధానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనదేశం శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగమిస్తుంది. ఆ రంగంలోని విజయాలు అన్ని రంగాలకూ విస్తరించి, మన దేశం ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏమంటావ్‌?'' అన్నాను.
''నీవు చెప్పింది ఆమోదయోగ్యం అంటాను'' అన్నాడు దృఢంగా సుబ్బారావు.
''సంతోషం'' అంటూ ముగించాను.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

వంధ్యత్వానికి కారణం..!


మానవులలో సంతాన లేమికి అనేకానేక కారణాలున్నాయి. తాజాగా మరో కారణం గుర్తింపు పొందింది. శుక్రకణం అండంతో కలిశాక 'పిఎల్‌సి' జీటా అనే ఒక ప్రొటీన్‌ను విడుదల చేస్తుందట. ఆ ప్రొటీన్‌ ఫలదీకరణం చెందిన అండాన్ని పిండంగా మార్చే ప్రక్రియకు దోహదపడుతుందట. ఒకవేళ ఆ ప్రొటీన్‌ సక్రమంగా లేకపోయినా లేక సరిగ్గా విడుదల కాకపోయినా పురుష ఇన్‌ఫర్టిలిటీ (వంధ్యత్వం) వస్తుందట! అంటే శుక్రకణాలు అండాన్ని ప్రేరేపించవు. ఇప్పుడు ఆ ప్రొటీన్‌ను గనక ఏదోవిధంగా శరీరంలో ప్రవేశపెట్టగలిగితే సంతానలేమితో బాధపడే వారిలో సత్ఫలితాలు పొందవచ్చని ఇపుడు భావిస్తున్నారు.

స్మార్ట్‌ బల్బ్‌...!


ఆటోమేటిక్‌గా కాంతి తగ్గించి, రంగు మార్చి, ఆరిపోయి, వెలిగే బల్బును ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఈ బల్బులను మొబైల్‌ ఫోన్‌తో కంట్రోల్‌ చేయవచ్చు. మామూలు హోల్డర్‌లో ఫిట్‌ అయ్యే ఈ బల్బులు వద్దనుకుంటే మామూలు బల్బులాగే పనిచేస్తాయి. ఫిలమెంటు బల్బులు ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఫ్లోర్‌సెంట్‌ బల్బులు తెల్లకాంతిని ఇస్తాయి. కానీ, ఈ స్మార్ట్‌ బల్బులు కావలసిన రంగు కాంతిని ఇస్తాయి. అయితే ప్రస్తుతానికి ఇవి చాలా ఖరీదువి. రాను రాను వీటి ఖరీదు ఎలాగూ తగ్గుతుందని వీరు భావిస్తున్నారు. కొన్ని దేశాలలో ఫిలమెంటు బల్బులను సంపూర్తిగా వాడకం నిలిపేస్తే ఇంకొన్ని దేశాలలో క్రమంగా వీటిని తగ్గిస్తున్నారు. మనలాంటి వాళ్ళు వాటినీ, వీటినీ వాడేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఫోన్తో పనిచేసే బల్బులు అంత అవసరమా?

అతి పల్చని లెన్స్‌..!


మన వెంట్రుక మందంలో పదిహేను వందల లెన్సులు (కటకం) సులభంగా అమరిపోతే, అద్భుతం కదూ! ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు నిజం చేసి చూపించారు. ప్రస్తుతం కెమెరాలలో, సూక్ష్మదర్శిని, దూరదర్శిని, సెల్‌ఫోన్‌ వంటి వాటిలో వాడే లెన్సులు ఎప్పుడో 13వ శతాబ్ధంలో వాడిన టెక్నాలజీతోనే తయారుచేస్తున్నారు. వాటిలో ఉండే ఉబ్బెత్తు తలం వలన కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఇప్పుడు 'సూపర్‌ (అతి) పల్చని, బల్లపరుపు లెన్సు'లను రూపొందించారు. వీటిలో కాంతి ఎటువంటి మసకతనమూ లేకుండా చాలా స్పష్టంగా ప్రసరిస్తుందట! పైగా, ఇవి పల్చగా ఉండటం వలన మరెన్నో లాభాలు కలగనున్నాయి. భవిష్యత్తులో క్రెడిట్‌కార్డు మందంలో స్మార్ట్‌ఫోన్లు ఈ టెక్నాలజీ వల్ల సాధ్యపడవచ్చట!

పెరుగుతో రక్తపోటు మాయం..!


చాలామందికి పెరుగుతో భోజనం ముగించందే భోజనం చేసినట్లు భావించరు. వారికి ఇప్పుడొక శుభవార్త. పెరుగును అధికంగా తింటే రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని పరిశోధనల్లో గమనించారు. దీర్ఘకాలంగా పెరుగు తినే అలవాటున్న వారిలో రక్తపోటు తక్కువగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. పదిహేనేళ్ల అధ్యయనంలో సుమారు రెండువేల మంది స్వచ్ఛందంగా వచ్చినవారిని పరీక్షించారు. వారందరూ తొలుత అసలు రక్తపోటు లేని వారే. కనీసం మూడురోజులకోసారి తక్కువ కొవ్వుగల పెరుగు తిన్నవారిలో 31% తక్కువ రక్తపోటు వచ్చిందని గమనించారు. అయితే, కేవలం పెరుగు తిని ఊరుకుంటే బీపీ సమస్య ఉండదని భావించరాదు. ఈ సమస్య వచ్చే అవకాశాలు తక్కువేకానీ, వీరు ఇతరత్రా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందట!

వెన్నునొప్పి జన్యువులు..!


జన్యువులు అనేక వ్యాధులకు కారణం. కానీ, నొప్పులకు కూడా జన్యువులే కారణమని ఇటీవలే తెలిసింది. దీర్ఘకాలం వుండే వెన్నునొప్పికి జన్యువులు కారణమని లండన్‌ పరిశోధకులు గుర్తించారు. 'పార్క్‌ 2'గా పేరుగల ఒక జన్యువు వల్ల నడుము నొప్పి పుడుతుందని వీరు తెలిపారు. ఇంతవరకూ మనం చేసే పనుల వల్ల, కూర్చునే భంగిమ వల్ల, ఇతర కారణాల వల్ల నడుము నొప్పి వస్తుందని భావిస్తున్నాం. కానీ, సుమారు ఐదువేల మందిలో నడుమునొప్పి అధ్యయనం చేసిన తర్వాత అందుకు కారణం బాహ్య విషయాలు కాదనీ, 'జన్యువు' అనీ పరిశోధకులు నిర్ధారించారు.

మనిషి కళ్లు చీకట్లో మెరవవు ఎందుకు?


  • ఎందుకని? - ఇందుకని!
రాత్రిళ్లు పిల్లి, ఎద్దు, గేదెల వంటి కొన్ని జంతువుల కళ్లు మెరుస్తాయి. ఎందుకు? మనిషి కళ్లు అలా మెరవవు ఎందువల్ల?
- ఎ.భారతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జగన్నాయకపుర, తూర్పుగోదావరి జిల్లా
మనిషి సకలజీవుల్లోకెల్లా అత్యున్నతంగా పరిణ మించిన జీవి. పంచేంద్రియాలన్నీ బాగా అభివృద్ధి చెంది ఉండడం వల్ల ప్రకృతి గురించిన పరిజ్ఞానం, తదనుగుణంగా ప్రకృతి చేసే అడ్డంకుల్ని అధిగమించగల నేర్పు, కూర్పు మనిషికే ఎక్కువ. మనుషులు సూర్యుని వెలుతురు ఉన్నప్పుడు (పగలు) తమ జీవన కార్యకలాపాలు చేసుకునే క్రమంలోనే ఆహార సముపార్జన, వినిమయం వంటి ప్రధాన విషయాలు పగలే పూర్తిచేసుకుంటాడు. తిరిగి మరుసటిరోజుకు అదే ఉత్సాహంతో తయారుకావాలంటే తగిన విశ్రాంతి కావాలి కాబట్టి సూర్యుని వెలుతురు లేనపుడు (రాత్రుళ్లు) నిద్రపోతాడు. కాబట్టి మనిషి నిశాచరి (nocturnal) కాదు. చుట్టుపక్కల కాంతి అంతగాలేని రాత్రిళ్లు సంచారం చేయవలసిన అవసరంగానీ, తనక్కావలసిన వస్తువుల్ని, ఆహారపదార్థాల్ని, జీవుల్ని అంత చిమ్మచీకట్లో, గుడ్డి వెలుగులో పరికించి చూడాల్సిన అగత్యంగానీ మనిషికి లేదు. అందువల్ల కంటి నిర్మాణం దేహ నిర్మాణం (anatomically) లో అంతర్భా గంగానే సాధారణ పగటి వెలుగుకు అను వుగా తీర్చిదిద్దుకుంది. రంగుల్ని అన్ని జంతు వులకంటే బాగా చూడగలగడం, సుమారు 1800 కోణ విస్తారంలో ముందున్న దృశ్య చట్రాన్ని (visual frame) ద్విదృశ్య త్రిమితీయ దృష్టి (binocular stereoscopic vision) సామర్థ్యంతో పరికించ గలగడం కేవలం మనిషికే వీలైంది. కానీ పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కుక్కలు, గబ్బిలాలు, గుడ్లగూబలు, కొన్నిరకాల చతుష్పాద క్షీరదాలు (tetrapodic mammals) నిశాచరులు. పగలు అవి అంతో యింతో విశ్రాంతి తీసుకుని రాత్రిళ్లు సంచరి స్తాయి. కాబట్టి, వాటి కంటి నిర్మాణం అతి తక్కువ వెలుగును కూడా చూసేలా రూపు దిద్దుకుంది. పిల్లికి మనిషిలాగే చాలా విషయాల్లో కంటి నిర్మాణంలో సామీప్యత ఉంది. కనురెప్పలు ఇద్దరికీ ఉన్నాయి. అయితే పిల్లికి అదనంగా మరో పాక్షిక పారదర్శక (semi transparent) కంటిరెప్ప ఉంటుంది. ఇరువురికీ కంటిపాప (pupil) ఉంది. అయితే మనిషి కన్నులోని కంటిపాప కెమెరాలోని ఐరిస్‌ (iris) లాగా ఎల్లప్పు డూ వృత్తాకారంలోనే పెద్దగా చిన్నగా వ్యాకోచ, సంకోచాలు (అక్కడున్న ప్రత్యేక కండ రాల అమరిక ద్వారా) చేయగలదు. మనకు ఇప్పుడు ప్రభుత్వం వారు ఇస్తున్న ఆధార్‌ కార్డ్స్‌లో కంటి ఫొటో తీయడం అంటే ప్రధానంగా ఈ కంటిపాప చుట్టూ ఉన్న ఐరిస్‌ కండర పొందికలోని గజిబిజి కండరపోగుల విన్యాసాన్ని (fabric of muscle fibres) ఫొటో తీయడమే. చేతిలోని వేలిముద్రల కన్నా విశిష్టమైనవి ఈ ఐరిస్‌ కండ రపోగుల విన్యాసం. ఏ ఇద్దరి మనుషులకూ ఇది ఒకే తీరుగా ఉండదు. అయితే పిల్లికి ఈ కంటిపాప గుండ్రంగా ఎక్కువ, తక్కువ సందుయిచ్చే వ్యాకోచ సంకోచాలు చేయ దు. కేవలం నిలువుగా గోధుమగింజలాగా లేదా బాదంపప్పు రూపంలో సన్నగా లేదా విస్తారంగా మారుతుంటుంది. మనిషిలాగే పిల్లికి కూడా కంటి కటకం (eye lens) ఉంది. మనిషిలాగే పిల్లికీ రెటీనా ఉంది. అయితే ఈ రెటీనాలో మనిషికున్నన్ని రాడ్లు, కోన్లు (rods and cones) ఉండవు. ఎదుట ఉన్న వస్తువు నుంచి పరావర్తనం చెందిన కాంతి తీవ్రత (light intensity) ను యిదమిద్ధంగా గుర్తించి, వస్తువులోని ఉపరితల రూపురేఖల్ని (topology), వెలుగునీడల్ని (visual contours) సరిగా అంచనా వేయడానికి రాడ్లు ఉపకరిస్తాయి. వస్తువుకున్న రంగుల్ని ఆరాతీయడానికి అద్భుతమైన ప్రకృతిలోని సకల రంగుల్ని ఆస్వాదించడానికి మనిషికి ఉపకరించేవి కోన్లు. ఇవి పిల్లుల్లో చాలా తక్కువ. అందుకే పిల్లికి రెండుమూడు రంగుల్ని మినహాయించి సప్తవర్ణాల్ని, వాటి సంశ్లేషణ (combination) ద్వారా సఫలమయ్యే వేలాది వర్ణవైవిధ్యాల్ని (colour combinations) పిల్లి చూడలేదు. రాత్రిళ్లు కాంతి చాలా తక్కువ కావడం వల్ల వస్తువు మీద పడే కాంతే తక్కువైతే, అది పరావర్తనం చెంది కంటికి చేరే కాంతి ఇంకా తక్కువ ఉంటుంది కదా! అందువల్లే చిమ్మచీకట్లో మనం (మనిషి) వస్తువుల్ని చూడలేము. కానీ పిల్లి చీకట్లోనే ఆహార సంపాదన, ఎలుకల వేట, దొంగతనంగా పాలు, పెరుగు తాగేయడం వంటి ఘనకార్యాలు చేయాలి కాబట్టి ఎలా? అందుకే ప్రకృతి సిద్ధంగా పిల్లి కంట్లో ఓ నిర్మాణం ఉంది. అది రెటీనా వెనుక ఓ అదనపు పొరలాగా, పుటాకార దర్పణం (concave mirror) లాగా రెటీనాకు వెనువెంటనే ఉంటుంది. దానిపేరు టేపిటమ్‌ ల్యూసిడమ్‌ (tapetum lucidum) . ఇది అద్దంలాగా కాంతిని పరావర్తనం చేయగలదు. అంటే మనకులా గానే చిమ్మచీకట్లో బాగా విప్పారిన కంటిపాప గుండా కాంతి కంటి కటకం మీద పడి అక్కడ్నుంచి ఆ కాంతి వక్రీభవనం (refraction) ద్వారా సంపుటీకరణం (collective) చెంది రెటీనా తెరపై కేంద్రీకరించుకుంటుంది (convergence) . అయితే ఆ కాంతి తీవ్రత అంత ఎక్కువగా అందకపోవడం వల్ల మనలాగే పిల్లికీ దృశ్యం ఏమీ కానరాని గడ్డు పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడే మనకు లేనిది, పిల్లి వంటి నిశాచర జంతువులకున్నది అయిన టేపిటమ్‌ ల్యూసిడమ్‌ ఈ తోడ్పాటు నందిస్తుంది. రెటీనా మీద పడ్డ కాంతి చాలామటుకు దూసుకెళ్లి ఈ టేపిటమ్‌ ల్యూసిడమ్‌ పొరపై పడుతుంది. ఇది అద్దంలా ఉండడం వల్ల చాలా కాంతి తిరిగి రెటీనా మీద పడుతుంది. తద్వారా ఉన్నది తక్కువ కాంతే అయినా అది రెటీనాకు, టేపిటమ్‌ ల్యూసిడమ్‌కి మధ్య పదే పదే అంతర పరావర్తనం చెందడం వల్ల పిల్లికి వస్తువు దృశ్యం బాగానే కనిపిస్తుంది. పిల్లి కళ్ళు రాత్రిళ్లు మెరవడానికి కారణం ఈ టేపిటమ్‌ ల్యూసిడమ్‌ పొర అద్దంలాగా పనిచేయడమే. మనం టార్చిలైటు వేసినపుడు ఆ కాంతి ఈ పొరమీద పడి పరావర్తనం చెందడం వల్ల పిల్లికళ్లు మెరుస్తున్నట్లు అనిపిస్తుంది. ఎద్దులు తదితర జంతువుల విషయంలో కంటిపాప రాత్రుళ్లు బాగా విస్తరించు కోవడం వల్ల రెటీనానే అద్దంలాగా పనిచేసి, కాంతి పరావర్తనం చెంది మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.

వ్యవసాయం... జీవవైవిధ్యం..!


మన ప్రాథమికావసరాలైన ఆహారం, దుస్తుల్ని, వ్యవసాయ పరిశ్రమల ముడిపదార్థాల్ని అందిస్తూ మూడింట రెండొంతుల మందికి జీవనాధారంగా వ్యవసాయం కొనసాగుతోంది. వ్యవసాయమంటే కేవలం పంటల్ని పండించడమే కాదు. పశుపోషణ, చేపలపెంపకం, ఇతర జీవాల పెంపకం కూడా దీనిలో ఇమిడి వున్నాయి. ఇట్టి వ్యవ సాయం జీవవైవిధ్యంతో ముడిపడి వున్నది. వ్యవసాయ వైవిధ్యం మొత్తం జీవవైవిధ్యంలో ఒక భాగం. సేద్యం చేసే పంటలు, వాటి మూల (వైల్డ్‌) రకాలు, నీటిలో పెరిగే వృక్ష, జంతుజాలాలన్నీ వ్యవసాయ జీవ వైవిధ్యం పరిధిలోకి వస్తున్నాయి. ఇటీవల వ్యవసాయోత్పత్తిలో వస్తున్న ఆటుపోట్లు, ముఖ్యంగా, మారు తున్న వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న ఉత్పత్తి ఒడుదుడుకులు తరిగిపోతున్న జీవవైవిధ్య ఫలితమే. ఇలా తరిగిపోతున్న వైవిధ్యం సుస్థిర వ్యవసాయోత్పత్తిని, ఆహార భద్రతను దెబ్బతీస్తుంది. సేద్యంలో రిస్క్‌ను పెంచుతుంది. ప్రపంచ జీవవైవిధ్య సదస్సు హైదరాబాద్‌లో అక్టోబర్‌ 1 నుండి 19 తేదీల మధ్య జరుగు తుంది. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవ సాయోత్పత్తికి వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యతను ప్రొ|| అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
వ్యవసాయానికి మూలాధారం దాదాపు 27 వేల ఉన్నత వృక్షజాతుల్లో వున్న వైవిధ్యమే. వీటిలో 7 వేల జాతులు సేద్యంలో ఉండేవి. ఇప్పుడు కేవలం 30రకాల పంటలు సేద్యమవుతున్నాయి. వీటిలో కూడా కేవలం గోధుమలు, వరి, మొక్కజొన్న - ఈ మూడు పంటలు సగంపైగా ప్రపంచ ఆహార అవసరాల్ని తీరుస్తున్నాయని 'ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ)' అంచనా వేసింది. తరిగిపోతున్న ఈ జాతులు వ్యవసాయంలో క్షీణిస్తున్న వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. పర్యావరణ వ్యవస్థలో ఇలా తరిగిపోతున్న జాతు లకు ఏదీ ప్రత్యామ్నాయం కాదు. ఈ నేపథ్యంలో, వ్యవసాయ వైవిధ్య పరిరక్షణ కీలకంగా మారుతుంది. మారుతున్న భూ వాతా వరణం నేపథ్యంలో వైవిధ్యం వున్నచోటే (ఇన్‌సిటు) పరిరక్షించడం కీలకం. ఇది వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి తోడ్పడుతుంది. ప్రత్యామ్నాయంగా వైవిధ్య గుణగణాలు గల రకాల్ని సేకరించి, క్షేత్రాలలో వేరేచోట బహిరంగంగా పరిరక్షించవచ్చు. పూర్తిగా నియంత్రించగల వాతావరణంలో జన్యు పరిరక్షణ జరుగుతున్న ప్పటికీ వాతావరణ ఒడుదుడుకుల్ని తట్టుకోగల రకాల్ని గుర్తించడానికి 'బహిరంగ' పునరుత్పత్తి తోడ్పడుతుంది.
నేలల వైవిధ్యం..
వ్యవసాయంలో ప్రాథమిక అవసరం భూమి (నేల). భూగో ళంలో అన్ని జీవులకు ఇది అతిపెద్ద వైవిధ్యం గల నివాస స్థలం. దీనిలో ఎన్నో బ్యాక్టీరియాలు, బూజులు (ఫంజీ), ఇతర కీటకాలు, సూక్ష్మజీవులు, వానపాములు, చీమలు, సాలీడుల్లాంటి జీవాలూ వున్నాయి. వీటి పరిరక్షణ సుస్థిర ఉత్పత్తికి అవసరం.
వ్యవసాయ వైవిధ్య వ్యవస్థను నేలలో వుండే సూక్ష్మజీవులు, పరపరాగ సంపర్కంలో తోడ్పడే కీటకాలు, వాతావరణ, పర్యావరణ పరిస్థితులు, పంటలు, అడవులు, గడ్డి, జలచరాలు ఇవన్నీ కలిసి ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ వ్యవసాయ వైవిధ్యంలో ముఖ్య భాగాలే. స్థానిక జలవనరులు, ముఖ్యంగా నీటికుంటలు, చెరువులు, నదులు, సముద్ర తీరప్రాంతాలు కూడా ఈ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వృత్తిదారులు, మత్స్యకారులు, చిన్నకమతాల రైతులు వైవిధ్య పరిరక్షణకు, వీటి సుస్థిర వినియోగంలో ఎంతో పాత్రను కలిగి వున్నారు. ఉత్పత్తవుతున్న చేపలు, రొయ్యలు, పీతలు తదితర జలచరాలు మన ఆహారంలో ముఖ్యభాగంగా కొనసాగుతున్నాయి. వీటి వినియోగంలో మత్స్యకారుల, ఇతర వృత్తిదారుల, చిన్నకమతాల రైతుల ఆదాయం, జీవనం వీటిమీదే ఆధారపడి వున్నాయి. దీనితో వీరందరూ మన వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ ఆహార సరఫరాలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్నారు.
సేద్య వాతావరణం, సేద్య పద్ధతులు, సేద్యంలో వినియోగించే ఇతర ఉపకరణాలు భూమి లోపల వుండే జీవుల వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీర్ఘకాలం రసాయన ఎరువులతో సేద్యం చేసినప్పుడు భూమిలో వీటి వైవిధ్యం క్షీణిస్తుంది. కానీ, సేంద్రియ ఎరువులతో, సేంద్రియ పద్ధతులతో సేద్యం చేసినప్పుడు భూమిలోని జీవ వైవిధ్యం పరిరక్షింపబడుతుంది. పెరుగుతుంది కూడా.
సేద్యమవుతున్న రకాలు..
సేద్యమవుతున్న రకాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: ఆధునిక, సాంప్రదాయ రకాలు. వ్యవస్థీ కరించిన ప్రజననం ద్వారా రూపొందించినవి ఆధునిక రకాలు. ఈ రకాలు అధిక దిగుబడినివ్వగలవిగా గుర్తింపు పొందాయి. కానీ, సాంప్రదాయ రకాలను రైతులే స్వయంగా తరతరాలుగా ఎంపిక చేస్తూ, రూపొందించారు. రైతుల రకాలుగా లేదా స్థానిక రకాలుగా కూడా ఇవి పేరొందాయి. సాంప్రదాయ లేదా రైతు రకాలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని, వాతావరణ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగలవిగా గుర్తింపు పొందాయి. జన్యు వైవిధ్య పరిరక్షణలో సాంప్రదాయ రకాలు ప్రతీకలుగా కొనసాగుతున్నాయి. అందువల్ల, జన్యు వైవిధ్య పరిరక్షణకు ఈ రకాలపైనే కేంద్రీకరిస్తున్నారు.

'హైబ్రిడ్‌ వరి' ఎవరికోసం..?
మనదేశ వరిలో ఎంతో వైవిధ్యం వుంది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని ముఖ్యంగా బెట్టను, వరదల్ని, చీడపీడల్ని తట్టుకొనే రకాలున్నాయి. ఒరిస్సాలోని కటక్‌ దగ్గరగల 'జాతీయ వరి పరిశోధనా సంస్థ'లో దాదాపు 42వేల రకాలు సేకరించి, పరిరక్షించబడుతున్నాయి. సేద్యమవుతున్న అధికదిగుబడి వంగడాలు వరి వైవిధ్యాన్ని నష్టపరిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎంతో వైవిధ్యం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఫలితంగా రైతులు కంపెనీల మీద ఆధారపడకుండా తమ విత్తనాల్ని తామే సేకరించుకుని, వినియోగించుకోగలుగుతున్నారు. ప్రజలు కూడా తమకు నచ్చిన రకాలను తినగలుగుతున్నారు. ఇటువంటి రకాలకు బదులు హైబ్రిడ్‌ వరిని ప్రోత్సహించ డానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రయివేటు కంపెనీలు ప్రపంచ మార్కెట్‌శక్తుల ప్రమేయంతో తీవ్ర కృషి చేస్తున్నాయి. మొదటి హైబ్రిడ్‌ వరి రకం ఆంధ్రప్రదేశ్‌లోనే రూపొందించినప్పటికీ, వీటిని రైతులు, వినియోగదారులు ఆదరించ లేదు. దేశంలో వినియోగమయ్యే మొత్తం హైబ్రిడ్‌ వరి విత్తనాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉత్పత్తవుతున్నప్పటికీ, ఈ రాష్ట్రంలో 'హైబ్రిడ్‌ వరి' సేద్యం కొన్ని వేల ఎకరాలకే పరిమితమైంది. అయినా, రాష్ట్రంలో హైబ్రిడ్‌ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఇలా వచ్చే హైబ్రిడ్‌ రకాలు ఇప్పటికే సేద్యంలో వున్న అధికదిగుబడి వంగడాలకన్నా ఏ కోణంలోనూ మేలైనవి కాదు. దిగుబడిలో కూడా పోటీకి రాలేకపోతున్నాయి. హైబ్రిడ్‌ రకం వరి జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుందని తెలిసినా, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికే కంకణం కట్టుకున్న ప్రభుత్వం హైబ్రిడ్‌ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఎందుకిస్తున్నట్లు? కేవలం హైబ్రిడ్‌ విత్తనం ద్వారా వరి సేద్యాన్ని కంపెనీలకి అప్పగించేందుకే. తద్వారా దేశ ఆహారోత్పత్తిపై బహుళజాతి కంపెనీల నియంత్రణకు అవకాశం కల్పించేందుకే..!
గిరిజనుల సేద్యం..
గిరిజనులు ప్రధానంగా వుండే అటవీ ప్రాంతాలలో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో పంటల్ని పండిస్తున్నారు. వీరి సేద్యంలో ఎంతో వైవిధ్యం వుంది. పంటలతో బాటు పశువుల్ని, కోళ్లను, ఇతర జీవాలను పెంచుతున్నారు. రసాయన ఎరువుల్ని దాదాపు వాడరు. సేంద్రీయపు పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా వీరి సేద్యంలో వైవిధ్యం నేటికీ కొనసాగుతుంది. వీరి ఆచారాలు, కట్టుబాట్లు, సాంస్కృ తిక అలవాట్లు ఇక్కడి జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ప్రాంతాల్ని గుర్తించి, అక్కడున్న సాంప్రదాయ పంటల్ని, విజ్ఞానాన్ని పరిరక్షించాలి. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరగాలి. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ దగ్గర 'దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ' ఆధ్వర్యంలో వ్యవసాయ వైవిధ్య కేంద్రం గుర్తింపుకు కృషి కొనసాగుతుంది.

కొత్తజాతుల ప్రవేశం..
కొత్తజాతులు బయటి నుండి ప్రవేశించినప్పుడు పోటీని తట్టుకోలేని స్థానిక జాతులు నష్టపోతాయి. ఉద్దేశ్యపూర్వకంగా కొత్త రకాల్ని లేదా జాతుల్ని ప్రవేశపెడతారు. ఇప్పటికే పండిస్తున్న ఎన్నో పంటలు ఇలా ప్రవేశపెట్టబడినవే. వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ఈ కోవ కిందకే వస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వు, సోయాచిక్కుడు ఇటీవల కాలంలో వంటనూనెకు ప్రవేశపెట్టబడ్డాయి. వీటివల్ల స్థానిక వైవిధ్యం కోల్పోవాల్సి వస్తుంది. వేగంగా విస్తరించిన సోయాచిక్కుడు మధ్యప్రదేశ్‌లో దాదాపు సగంపైగా సేద్య విస్తీర్ణాన్ని ఆక్రమించింది. అంతకుముందు సేద్యంలో వున్న పంటలన్నీ అంతరించిపోయాయి. మరికొన్ని సందర్భాలలో అనుకోకుండా ఇవి రావచ్చు. ఇవి దిగుమతులతో కలిసిరావచ్చు. వేగంగా విస్తరిస్తున్న 'పార్థీనియం' కలుపు విత్తనాలు దిగుమతైన గోధుమల ద్వారా వచ్చిందే. దీనిని 'వయ్యారిభామ' లేక 'కాంగ్రెస్‌ కలుపు'గా కూడా పిలుస్తున్నారు. ఒకో చెట్టులో మిలియన్ల గింజలుంటాయి. ఒకసారి ఈ చెట్టు వచ్చిన తర్వాత దానంతటదే వ్యాప్తి చెందుతూ స్థానిక రకాల్ని పెరగనివ్వదు. అణచి వేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. వీటి నియంత్రణ ఇపుడు మన వ్యవసాయంలో పెద్ద సమస్యగా కొనసాగుతుంది. 'లాంటెనా' అనే మరో కలుపు జాతి మొక్క కూడా ఇలానే వచ్చింది. కానీ, పార్థీనియం అంత ఉధృతంగా విస్తరించడం లేదు.

వృక్షజాతుల్లో...
మనదేశం అతి విశాలమైనది. వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో వైవిధ్యం వుంది. దీనితో సేద్య విలువ కలిగిన వృక్షజాతుల్లో ఎంతో వైవిధ్యం ఏర్పడింది. జాతీయ వృక్షజాతు ల జన్యు వనరుల సంస్థ (నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జనటిక్‌ రీసోర్సెస్‌) సమాచారం ప్రకారం ఆహారధాన్యాల్లో 1,12,278 రకాలు మనదేశంలో వున్నాయి. వీటిలో చిరు ధాన్యాలు, గడ్డి జాతుల్లో 30,488 రకాలున్నాయి. గింజలను ఇవ్వగల లెగ్యూమ్‌ (పప్పు) జాతి 40,604 రకాలున్నాయి. నూనెగింజల్లో 30,170 రకాలు, నూలు ఇవ్వగల రకాలు 8,387, కూరగాయలు 15,671 రకాలున్నాయి. పండ్లు 172 రకాలుంటే, ఔషధ, సుగంధ మొక్కలు 15,051 రకాలు మన దేశంలో సేద్యానికి పనికొస్తున్నాయి.
జంతువుల్లో..
సాధుజంతు జాతుల వైవిధ్యంలో మనదేశం ప్రపంచంలో 7వ స్థానంలో వుంది. మన దేశంలో 255 జంతుజాతులు పెంపకంలో వున్నాయి. వీటిలో 64 రకాల పశువులు. 23 రకాల బర్రెలు, 63 రకాల గొర్రెలు, 34 రకాల మేకలు, ఇతర జంతువులు 72 రకాలున్నాయి. ప్రపంచబర్రెల్లో 26.5 శాతం రకాలు మనదేశంలోనే వున్నాయి. మేకల్లో 8.6 శాతం, పశువుల్లో 7.75 శాతం వైవిధ్యం మనదేశంలోనే వుంది.


క్షీణిస్తున్న వ్యవసాయ, పశువుల వైవిధ్యం..
సేద్యం చేస్తున్న రకాల్ని మార్చడం. దున్నడం. అతిగా పంటల్ని పండించడం, పెరుగుతున్న జనాభా వత్తిడి, పర్యావరణ క్షీణత, పచ్చిక బయళ్లలో అతిగా మేపడం, ప్రభుత్వ విధానాల మార్పులు, వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న వ్యవస్థాగత మార్పులు (చిన్న కమతాల సేద్యానికి బదులు కార్పొరేట్‌ సేద్యం) తదితరాలు కొనసాగుతున్న జీవ వైవిధ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. అయితే, స్థానిక రకాలను అధిక దిగుబడినిచ్చే రకాలతో మార్చడం వల్ల లేదా బయటి నుంచి కొత్తరకాల్ని తెచ్చి, పెంచడం వల్ల వ్యవసాయ వైవిధ్యం బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా, సాంప్రదాయ సేద్యంలో జన్యుమార్పిడి పంటల్ని ఇటీవల ప్రవేశపెట్టడం వల్ల వ్యవసాయ వైవిధ్యం బాగా క్షీణించింది. ఆధునిక సేద్యం పెరుగుతున్న కొద్దీ ఎంపిక చేసిన పంటల జన్యువులు, పర్యావరణ పరిస్థితుల్లో జీవ వైవిధ్యం హరించిపోతుంది. మిశ్రమ సేద్య పద్ధతులకు బదులు ఏకపంట సేద్యపద్ధతుల్ని పవేశపెట్టడంతో జీవ వైవిధ్యం బాగా తగ్గుతుంది. సుస్థిర ఉత్పత్తి దెబ్బతింటుంది. రిస్క్‌ పెరుగుతుంది. రైతు కమతాల సేద్యానికి బదులు పెద్దకమతాల్లో భారీ యంత్రాలతో చేపట్టే వ్యవసాయరంగ కార్పొరేటీకరణ జీవవైవిధ్యాన్ని బాగా కుదిస్తుంది. ఇదేవిధంగా, విస్తరిస్తున్న ఆహార పరిశ్రమ, యాంత్రికీ కరణ, ఒకే విధమైన సేద్య పద్ధతుల్ని అనుసరింపజేస్తూ జీవ వైవిధ్యాన్ని హరింపజేస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం రసాయనాల అధిక వినియోగంపై ఆధారపడుతూ జీవ వైవిధ్యాన్ని హరింపజేస్తాయి.

పారిశ్రామిక, సేంద్రియ సేద్యపద్ధతులు..
ఆధునిక, పారిశ్రామిక సేద్యపద్ధతులు వ్యవసాయంలో వైవిధ్యాన్ని హరించి వేస్తుండగా సేంద్రియ పద్ధతులు జాతుల వైవిధ్యాన్ని పెంచుతున్నాయి. సేంద్రియ సేద్యంలో కనీసం 30 శాతం అధికంగా వైవిధ్యం వున్నట్లు అంచనా వేయబడుతుంది. ముఖ్యంగా రసాయనిక ఎరువులను, సస్యరక్షణ మందులను అతిగా పెంచే సేద్యంలో మిత్ర పురుగులు, పరపరాగ సంపర్కం దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. అదే రసాయనాల్ని నియంత్రిస్తూ, సహజ పద్ధతుల్లో సేద్యం చేసినప్పుడు మిత్ర పురుగులు, పరపరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు ఉధృతంగా జీవిస్తూ దిగుబడులను పెంచగలుగుతున్నాయి. మొత్తం మీద, సేంద్రీయ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు తోడ్పడుతోంది. ఇది జన్యు, జాతుల స్థాయిల్లో, పర్యావరణ వ్యవస్థ స్థాయిలో కొనసాగుతుంది.
(జన్యుమార్పిడి పంటల ప్రభావం వచ్చే సంచికలో తెలుసుకుందాం..!)

గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Friday, 21 September 2012

మేం మూఢనమ్మకాలకు వ్యతిరేకం.. ఏ మతానికి కాదు..


  • అశాస్త్రీయ ఆచారాలు19
'సుబ్బారావ్‌ రా..!' అని లోనికి వస్తున్న సుబ్బారావును ఆహ్వానించాను.
సుబ్బారావు వచ్చి కూర్చున్నాడు. మాటల్లో ఇలా అన్నాడు. 'కాంతారావ్‌! మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నువ్వు అనేక వ్యాసాలు రాస్తున్నావు. అవి చదువుతుంటే నాకొక అనుమానం వస్తుంది. ఆ సందేహాన్ని తీరుస్తావా?'
'ఏమిటా సందేహం?' నవ్వుతూ అడిగాను.
'నీవు రాసేదంతా హిందూమతానికి వ్యతిరేకమనిపిస్తోంది ఏమంటావ్‌?' అన్నాడు.
'మంచిప్రశ్న వేశావు సుబ్బారావు! సమాధానం చెబుతాను. అదేమిటంటే మూఢనమ్మకాలు వేరు, మతం వేరు. గొప్ప గొప్ప మత నాయకులు, మత ప్రచారకులు మతాన్ని గూర్చి ప్రచారం చేశారు; చేస్తున్నారు. కానీ వారు మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు; ఖండించారు; ఖండిస్తున్నారు. మూఢనమ్మకాలను వారు వ్యతిరేకించడం మత వ్యతిరేకం కానప్పుడు మేం జన విజ్ఞాన వేదిక వాళ్ళం ఖండించడం మత వ్యతిరేకమెలా అవుతుంది?'
'మూఢనమ్మకాల్ని మతపెద్దలే వ్యతిరేకించారా? ఎవరు? ఏమిటో? వివరించు' అడిగాడు సుబ్బారావు.
'చెబుతాను. జ్యోతిష్యాన్ని ఉదాహరణకు తీసుకో. జ్యోతిషమంటే హిందూ దేవతలైన సూర్యుడు, చంద్రుడు, శని మొదలైనవారి చలనాలకూ, వాటి పరిణామాలకూ సంబంధించిన విషయమనీ, అందువలన జ్యోతిష్యాన్ని విమర్శించడం అంటే హిందూమతాన్ని విమర్శించడమేననీ కొంతమంది జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. కానీ జ్యోతిష్యాన్ని ఒక గొప్ప హిందూమత నాయకుడైన స్వామివివేకానంద తీవ్రంగా ఖండించేవారు. జ్యోతిష్యాన్ని నమ్మవద్దంటూ ఆయన ఒక ఉపన్యాసాన్నే చేశారు. ఆయన రచనల సంకలనం (ఇంగ్లీషులో) ''ది సెలెక్టెడ్‌ వర్క్స్‌ ఆఫ్‌ స్వామీవివేకానంద, వాల్యూం 8''లో ''మాన్‌.. ది మేకర్‌ ఆఫ్‌ డెస్టినీ'' అనే ఉపన్యాసంలో జ్యోతిష్యం ఎంత అశాస్త్రీయమో వివరంగా తెలియజేశారు. వివేకానంద జ్యోతిష్యాన్ని విమ ర్శించితే, మత వ్యతిరేకత కానప్పుడు మేం విమర్శిస్తే, మత వ్యతిరేకమవు తుందా? అంతేకాదు సమాజంలోని అనేక మూఢనమ్మకాల్ని విమర్శిస్తూ, అత్యంత సరళమైన భాషలో వివేకానందుల వారు చేసిన ఈ ప్రకటనను చదువు..' అని నా వద్ద ఉన్న 21-7-2002 నాటి 'వార్త' అనే దినపత్రికను సుబ్బారావుకు అందించాను. దానిలో ఇలా ఉంది.
''ఒక బంగాళదుంప వంకాయకు తగిలితే విశ్వ ప్రళయం ఎన్నాళ్ళలో వస్తుంది? చేతులు శుద్ధి చేసుకోవడానికి పన్నెండుసార్లు మట్టితో తోముకొనకపోతే ఎన్నితరాల పితరులు నరకానికి పోతారు? జనాభాలో నాల్గవవంతు మంది తిండి లేక పస్తులుంటుండగా ఇలాంటి వ్యర్థ విషయాల గురించి రెండువేల సంవత్సరాలుగా చర్చిస్తున్నారు.''
అది సుబ్బారావు చదివిన తర్వాత ఇలా అన్నాను. ''సుబ్బారావ్‌! మూఢనమ్మ కాలను ఖండించిన మరో మతనాయకుని గూర్చి వివరిస్తాను. ఆయనే అరుణాచల నివాసి రమణమహర్షి. ఆయన చెప్పిన అంశాలను గూర్చి చాగంటి కోటేశ్వరరావు 10-9-2012న 'మాగోల్డ్‌' టి.వి. ఛానల్‌లో ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో వివరించారు. దాని సారాంశం ఇది. 'రమణ మహర్షిని కొంతమంది భక్తులు మూఢంగా ఆరాధించేవారు. ఆ మూఢారాధన ఎంతవరకు పోయిందంటే రమణమహర్షి స్నానం చేసిన నీటిని వారు తాగినా, ఆయన భోజనం చేసిన తర్వాత చెయ్యి కడిగిన నీటిని తాగినా తమ పాపాలు అన్నీ కడిగినట్లు పోతాయని భావించి, తూముల గుండా వస్తున్న ఆ నీటిని గ్లాసుల్లో పట్టుకొని తాగుతుండేవారు. ఇది రమణమహర్షి దృష్టికి వచ్చి వారిని తీవ్రంగా మందలించారు. ఇంకెప్పుడూ అలా చేయవద్దని హెచ్చరించారు.
(ఇతర మతాల నాయకుల ఖండనలు వచ్చేవారం..)
ఇలా మతనాయకులూ, మత ప్రచారకులూ మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. హిందూ మతనాయకులేగాదు, ముస్లిం, క్రిష్టియన్‌ మత నాయకులు కూడ మూఢనమ్మకాలను ఖండిస్తూనే ఉన్నారు. వాటిని వివరిస్తాను'' అని 24-8-2012 నాటి ''ది హిందూ'' పత్రికను సుబ్బారావుకిచ్చాను. దానిలో ''వదంతులు చిక్కగా, వేగంగా వ్యాపిస్తాయి'' అనే వార్త సారాంశమిది. ''షహీనానగర్‌ ఏరియా (హైదరాబాద్‌)లో ఒక బాలిక జన్మించిందనీ, ఆ అమ్మాయి 22-8-12 నాటి రాత్రి ఎవరైనా పిల్లలు నిద్రపోతే వారు చనిపోతారని చెప్పిందనే వదంతి హైదరాబాద్‌ పాతబస్తీలో ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ వదంతిని సెల్‌ఫోన్లు చాలా వేగంగా వ్యాప్తి చేశాయి. అంతే! పాతబస్తీలోని అనేక ప్రాంతాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రలేపి, వాళ్ళు మరల నిద్రపోకుండా ఉండేందుకు నానా తంటాలుపడ్డారు. కొంతమంది పిల్లలతో ఆటలాడించారు. కొంతమంది మోటారు సైకిళ్ళ మీదా, ఆటోలలోనూ వారిని తిప్పారు. అయితే, ముఖ్యమైన విషయమేమిటంటే, మత నాయకులు స్థానిక మసీదులలో ఏర్పాటు చేయబడిన లౌడ్‌స్పీకర్లలో వదంతులను నమ్మవద్దనీ, పిల్లలు నిద్రపోయినా ఏమీకాదనీ చెప్పడం జరిగింది. అయినా ప్రజలపై లౌడ్‌స్పీకర్ల ప్రచారం ఏమీ ప్రభావం కలిగించలేదు.'' కాబట్టి సుబ్బారావ్‌! అనేక సందర్భాలలో మతనాయకులు, మత ప్రచారకులు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం మనం గమనించవలసిన విషయం.
ఇక క్రిష్టియన్‌ మతనాయకులు కూడా మూఢనమ్మకాలను ఖండిస్తున్నారు. ఉదాహరణకు 17-9-1998 నాటి ఈనాడు పత్రికలోని ఒక వార్తను వినిపిస్తాను విను'' అని ఆ వార్తను చదివి వినిపించాను. ఆ వార్తలో ఇలా ఉంది. జ్యోతిష్యాన్ని గూర్చి పోప్‌ జాన్‌పాల్‌ ఇలా ప్రకటించారు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ధారించుకొనేందుకు, జాతకాలను తిరగేయాల్సిన పనిలేదు. రాశి ఫలాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హస్త సాముద్రికుల దగ్గరకు వెళ్ళవలసిన పనిలేదు. గ్రహబలాన్ని నమ్ముకోరాదు.''
కాబట్టి సుబ్బారావ్‌! మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తే, మతాన్ని విమర్శించినట్లు కాదు. ఎందుకంటే వాటిని తనకు తెలిసిన మేర మత నాయకులు ఖండిస్తున్నారు. మత ప్రచారకులు వాటిని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం మోసగాళ్ళూ, అవకాశవాదులే మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారాన్ని మత వ్యతిరేక ప్రచారంగా ప్రకటించి, మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేం ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు. కానీ, అన్ని మతాలవారూ మూఢనమ్మకాలను తరిమికొట్టాలి. శాస్త్రీయాలోచనా విధానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనదేశం శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగమిస్తుంది. ఆ రంగంలోని విజయాలు అన్ని రంగాలకూ విస్తరించి, మన దేశం ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏమంటావ్‌?'' అన్నాను.
''నీవు చెప్పింది ఆమోదయోగ్యం అంటాను'' అన్నాడు దృఢంగా సుబ్బారావు.
''సంతోషం'' అంటూ ముగించాను.
- కె.ఎల్‌.కాంతారావు జనవిజ్ఞాన వేదిక.

పాములు గుడ్లు తింటాయా?


పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. పాములు గుడ్లు తింటాయా? నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా? అదెలా? పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి? పాములు ఎందుకు బుసకొడ్తాయి? పాములు ఎలా చూస్తాయి? ఎలా వింటాయి? ఎలా వాసన చూస్తాయి?
- జి. సింధూ (7), హైదరాబాద్‌
గతవారం పాము పగపడుతుందా అన్న ప్రశ్నకు జవాబుగా పాముల్లో ఉన్న విషసర్పాల గురించి, విషరహిత సర్పాల గురించి సూక్ష్మంగా తెలుసు కున్నాం. ఈ వారం ప్రశ్నలు చాలానే ఉన్నాయి కాబట్టి అన్నింటికీ వివరంగా జవాబు చెప్పాలంటే అనకొండలాగా పెద్ద చేంతాడంత జవాబు వచ్చే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రశ్నలకు టూకీగానే జవాబు ఇస్తాను.
పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. అవి గుడ్లు తింటాయా?
పుట్టలు పాములవి కాదు. 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కెరవైనట్లు..' మనం సుమతీ శతకంలోనే చదువుకున్నాం కదా! కొన్ని నెలలపాటు చాలా శ్రామిక చీమలు ఒక్కొక్క మట్టి రేణువును పోగేసి ఐకమత్యంతో కట్టుకున్న పుట్ట బొరియల్లోకి అనువుగా పాములు భూకబ్జా చేసి పుట్టల్లో ఉంటాయి. ఎండ్రకాయ బొరియల్లోనూ, చీమల పుట్టల్లోను, చెట్ల బొరియల్లోను పాములు నివసిస్తాయి. సాధారణంగా పాములన్నీ మాంసాహారులు (carnivores). ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2700 రకాల పాములున్నా వాటిలో కేవలం ఆరు రకాలు మాత్రమే గుడ్లను తింటాయి. అందులో ఐదు రకాలు ఆఫ్రికాలో ఉంటాయి. కేవలం ఒక రకం మాత్రం భారతదేశంలో ఉన్నట్లు కనుగొన్నారు. దానిపేరు 'ఎలకిస్టోడన్‌ వెస్టర్‌మని(Elachistodon westermanni). ఈ ఆరింటిలో ఏదీ విషసర్పం కాదు. ఎలకిస్టోడన్‌ వెస్టర్‌ మని 1969లోనే దాదాపు అంతరించిపోయింది. కానీ ఈ మధ్య అరుదుగా మహారాష్ట్ర, గుజరాత్‌ అడవుల్లో ఓ పరిశోధకుడు చూసినట్లు వార్తలు వచ్చాయి. అసలు విషయమేమిటంటే మనం నిత్యం చూసే పాములేవీ గుడ్లు తినవు.
నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా! అదెలా?
నాగుపాముకు అస్తిపంజరం దృఢంగా ఉండడం వల్ల తలను బాగా నిక్కజాపి పడగ విప్పుతుంది. ఇతర పాములు కూడా కొద్దిగా తల పైకెత్తి నిటారుగా ఉంచగలవు కానీ, పడగవిప్పవు. నాగుపాముకు ఉన్న రూపం, భయానక వివరణ, పుక్కిటి పురాణ వర్ణన, విష ఫణిగుణం వల్ల కొందరు దాన్ని బుట్టలో పెట్టుకొని వచ్చి పిల్లలకి, పామరులకు, సకల శాస్త్రాలు చదివినా తల, తోక అనక నిలువెల్లా అశాస్త్రీయతను నింపుకొన్న కల్ల మేధావులకు నాగనాట్యం చూపుతారు. నీటిపాము, వానపాము, పసిరిక పాము, ఏలిక పాములకు ఆ ఘనత లేదు. వాటిపైనా ఏ పురాణ పురుషుడూ శయనుడు కాదు. కాబట్టి వాటిని బుట్టలో పెట్టుకొని ఏ గారడీవాడు ఊరి కూడలి వద్ద ప్రదర్శనలు చేయడు. నిజానికి నోట్లో వేలుపెట్టినా పెద్దగా కొరకలేని నీటిపామును బుట్టలో పెట్టి మూత తీసి నాగస్వరం పాముల గారడీవాడు ఊదినట్లుగా ఊదితే ఆ పాము కూడా తల ఆడిస్తుంది. కాబట్టి నాగస్వరానికి అలాగ ఊదితే ఊగడం నాగుపాము అబ్బ సొమ్ము కాదు. పూడుపాము కూడా ఆడగలదు. ఇక్కడ అండర్‌లైన్‌ చేయడానికి కారణం ఉంది. గతవారమే చెప్పుకొన్నట్లు ఏ పామూకూ చెవులు ఉండవు. కళ్లు ఉంటాయి. నాగుపాము గారడీవాడు నాగస్వరం ఊదేప్పుడు గమనించండి. ఆ బూరను అటూ ఇటూ పాముకన్నా జోరుగా ఊపుతూ ఊదుతాడు. పైగా, తల కూడా అటూ యిటూ ఊపుతాడు. దానికితోడు తన కాలి తొడ, మోకాలు దగ్గర కూడా అటూ ఇటూ కదులుతాడు. విడ్డూరంగాను, వింతగాను అతడు తల, బూర ఊపుతుంటే పాము ఆశ్చర్యంగా వాడి బూరను చూస్తూ అటూయిటూ తల ఊపుతుందేగానీ.. 'గానరసం.. ఫణిః' అన్నట్లు నాగస్వరపు మాధుర్యాన్ని గ్రోలుతూ కాదు.
పాములు వాసన చూస్తాయా?
పాములు వాసనను చూడ్డానికి కొద్ది మోతాదులోనే తమ ముక్కుల్ని వాడతాయి. ప్రధానంగా పాములు తమ నాలుక (చీలిక ఉన్న) ద్వారా వాసన చూస్తాయి. అందుకే పదే పదే అవి నాలుకను బయటికి చాచి ఆడిస్తాయి. అపుడు వాతావరణంలో ఉన్న రసాయనిక ద్రవ్యాల్ని ఆస్వాదించి జాకబ్సన్స్‌ అవయవాలు (Jacobson’s organs) అనే నోటిలో ఉన్న శరీరభాగాల ద్వారా మెదడుకు సంకేతాల్ని పంపి వాసనను గ్రహిస్తాయి. పాములు రుచి చూడలేవు. అందుకే అపుడపుడూ అవి తమకేమాత్రం ఉపయోగపడని మెత్తని వృథా పదార్థాల్ని కూడా 'గుడ్డిగా' భోంచేస్తాయి.
పాములెందుకు బుసకొడ్తాయి?
అన్ని పాములూ బుసకొట్టవు. చాలావరకు పాములు చురుకైన (active) జంతువులు. అంటే వాటికి శ్వాసక్రియ చాలా అవసరం. కానీ ముక్కు రంధ్రాలు సన్నగా ఉండడం వల్ల సాధారణ శ్వాసక్రియే (మనలో కొందరిలో గురక - snoring - లాగా) కొంత బుసలాగా అనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నపుడు‘fight or flight (పోరాడు లేదా పారిపో)్ణ అనే అసంకల్పిత ప్రతీకార చర్య (involuntary reaction) కారణంగా మరింత వేగంగా చేసే శ్వాసక్రియే మనకు బుసలాగా తోస్తుంది.
పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి?
పాములే కాదు పొలుసులు (scales) గట్టి ఫలకాలు (plates) ఉన్న చాలా జంతువులు కుబుసం (moulting) విడుస్తాయి. శరీరం పెరుగుతున్న క్రమంలో మనలాంటి జంతువులకు సాగే లక్షణం చర్మానికి ఉండడం వల్ల దేహం పెద్దదవుతున్నా చర్మానికేమీ కాదు. కానీ బొద్దింకలు, పాములు, మొసళ్లు, తొండలు, కొన్ని తాబేళ్లు, కొన్నిరకాల ఎండ్రకాయలు, రొయ్యలు వంటివాటికి చర్మం సహజ కవచ కుండలాల్లా బిగుతుగా ఉంటుంది. తమ శారీరక ఎదుగుదలకు ఆ చర్మం ప్రతిబంధకంగా ఉన్నపుడు మనం బిగుతుగా ఉన్న పాత చొక్కాలను వదిలేసి, కొత్త చొక్కా వేసుకున్నట్టు అవి పాత చర్మాన్ని విసర్జిస్తాయి. పెరిగే క్రమంలో మెత్తని కొత్త చర్మాన్ని అంతరంగంలో సంత రించుకొంటాయి. ఇలా తమ ఎదుగుదల ఆగే వరకూ అడపాదడపా కుబుసం విడుస్తూ ఎదుగుతాయి.

బుడగలు రాకుండా మరగడం..!


నీరు మరగడం అంటే విపరీతంగా బుడగలు రావడం అని మనకు బండ గుర్తు. యూనివర్శిటీ ఆఫ్‌ మెల్బోర్న్‌. మెక్‌ కార్మిక్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, అమెరికాకు చెందిన పరిశోధకులు కింగ్‌ అబ్దుల్లా ఒక కొత్తరకం ఉపరితలాన్ని రూపొందిం చారు. ఈ ఉపరితలంపై నీటిని వేడి చేస్తే బుడగలు రావు. కానీ, నీరు మరుగుతుంది. వేడి అయ్యేటప్పుడు వేడి ద్రవానికి, వేడి ఉపరితలానికి మధ్య ఒక స్థిర ఆవిరి పొర ఏర్పడటం ఈ కొత్త ఉపరితల విశేషం. ఈ కొత్త పరిశోధన వల్ల వేడి చేసే ఉపకరణాల నుండి యాంటిఫ్రాస్ట్‌ టెక్నాలజీ వరకూ మేలు జరుగుతుందని అంటున్నారు.
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

కరుగుతున్న హిమాలయాలు..!


మధ్య, తూర్పు హిమాలయాలు ఆందోళనకర రీతిలో కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలలో తెలిసింది. అయితే, పశ్చిమ హిమాలయాలు స్థిరంగా ఉన్నట్టు తెలిసింది. హిందూ కుష్‌ హిమాలయ ప్రాంతం ఎనిమిది దేశాలకు విస్తరించింది. ఈ కొత్త అధ్యయనం ప్రకారం కరుగుతున్న హిమాలయాలు ఆ ఎనిమిది దేశాల నదీ వ్యవస్థా జనాభాపై దాని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంత వాతావరణం మొత్తం మారుతోంది. కానీ, ఆ మార్పు తాలూకు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో అంచనాకి అందటం లేదు. టిబెట్‌ ప్రాంతంలో హిమాలయాలు వేడిగా మారుతున్నాయి. కానీ, ఇతర ప్రాంతాలలో అటువంటి వేడి కనిపించడం లేదు. ఏదేమైనా, ఇటువంటి మార్పుల వల్ల భవిష్యత్తులో హిమాలయ పర్వతాల దిగువనున్న నదులు, భూగర్భజలాల్లో పెనుమార్పులు జరగడం ఖాయం అని ఈ అధ్యయనం సూచిస్తుంది.

సూర్యుడిని మించిన నక్షత్రం..!


విశ్వంలో సూర్యుడి కన్నా అతి పెద్ద నక్షత్రాన్ని గుర్తించారు శాస్త్రజ్ఞులు. భూమికి 60 వేల కాంతి సంవత్సరాల దూరాన వున్న ఈ భారీ నక్షత్రం ఎన్‌జిసి 1624-2. ఈ నక్షత్రం సూర్యునికన్నా 35 రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగి వుంది. దీనిచుట్టూ బలమైన అయస్కాంతశక్తితో పాటు అధిక ఇంధనం, కాంతి, ఉష్ణం ఉన్నాయట! ఈ రకంగా ఉండటం చాలా అరుదైన విషయం అని పరిశోధకులు అంటున్నారు. ఈ కొత్త నక్షత్ర ఉనికితో నక్షత్రాల అయస్కాంత శక్తి, వాటి పరిణామక్రియలో ఏ విధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకునే వీలు కలిగే అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు.

మానవ వ్యర్థాలతో నడిచే వాహనాలు!


రానున్న మూడేళ్లలో మానవ వ్యర్థాలతో నడిచే వాహనాలు రావచ్చని పరిశోధకుల అంచనా! జపాన్‌లో ఈ విషయమై పరిశోధన జరుగుతోంది. మానవ విసర్జకాల నుండి హైడ్రోజన్‌ వాయువు ఉత్పత్తి చేసి, దానిని వాహనాలకు వాడొచ్చనేది ఇప్పటి సూచన. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ద్రవ రూప సహజ వాయువుల నుండి హైడ్రోజన్‌ను వెలికి తీయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికంటే మానవ విసర్జకాల నుండి ఉదజనని ఉత్పత్తి చేయడం తేలికని పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రక్రియ వల్ల కర్బన ఉద్గారాలు 75% తగ్గుతాయి. ఈ పద్ధతిలో ముందుగా మీథేన్‌ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువును వేడి చేస్తే అధిక మోతాదులో ఉదజని లభిస్తుంది. ఈ ప్రక్రియను 2015 కల్లా వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని పరిశోధకులు కృషి చేస్తున్నారు.

పెయిన్‌కిల్లర్స్‌తో వినికిడి సమస్య..!


ఎటువంటి నొప్పి వచ్చినా వెంటనే ఒక పెయిన్‌ కిల్లర్‌ను మింగడం చాలామందికి అలవాటు. అయితే ఈ మందులు, ప్రత్యేకించి ఇబుప్రోఫెన్‌, పారాసిటామాల్‌ వంటివి మహిళల్లో వినికిడి శక్తిని తగ్గిస్తాయని ఇటీవల తేలింది. వారానికి కేవలం రెండుసార్లు ఇటువంటి మందులు తీసుకున్న మహిళల్లో 13 శాతం వినికిడి శక్తి తగ్గే ప్రమాదముందని తేలింది. పారాసిటామాల్‌ని వారానికి ఐదురోజులు వాడిన వారిలో 21 శాతం వినికిడి సమస్యలు వచ్చాయి. అయితే, ఆస్పిరిన్‌ వాడుతున్న స్త్రీలల్లో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. ఈ వినికిడి సమస్య తాత్కాలికమా కాదా అన్న విషయం ఇంకా తేలాలి.

అంతరిస్తోన్న కోరల్‌ రీఫ్‌..


కోరల్‌ రీఫ్‌ (ఒక విధమైన సముద్రపు అడుగు భాగంలో పెరిగే జాతి) వేగం గా అంతరిస్తోంది. దీనివల్ల కోట్లాది జీవాలకి ఆహారం లభిస్తుంది. 2000 నాటికే ప్రపంచ కోరల్‌ రీఫ్‌ పర్యా వరణ వ్యవస్థలో 20 శాతం క్షీణించింది. ముఖ్యంగా, 1998లో అకస్మాత్తుగా ఇది తెల్లగా (బ్లీచింగ్‌) మారి పోయింది. 16 శాతం మేర ఇలా నష్టపోయింది. వేగంగా జరిగిన పర్యావరణ మార్పులు, సముద్ర ఉష్ణో గ్రత, ఆమ్లతత్వం పెరుగుదల వల్ల ఆల్గేలు పెరిగి, కోరల్‌ రీఫ్‌లు చనిపోయాయి. గత పదేళ్లలో దీని వైవిధ్యం బాగా పడిపోయింది. వచ్చే శతాబ్ధకాలంలో ఇవి పూర్తిగా అంతరించే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Thursday, 20 September 2012

జీవవైవిధ్యం.. జాతుల పరిరక్షణ..


భూగోళంలో తప్ప మరెక్కడా జీవం వున్న ఆధారాలు విశ్వంలో ఇంతవరకూ లభించలేదు. అందువల్ల, జీవవైవిధ్యాన్ని, జాతుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత మానవాళిపైనే వుంది. ఇది ఏ ఒక్కరో లేదా ఏ ఒక్క దేశమో చేయగలిగిందీ కాదు. కేవలం లాభాపేక్షతో పనిచేసే కార్పొరేట్‌ సంస్థలు ఈ కర్తవ్యాన్ని ఏమాత్రం నిర్వర్తించలేవు. పైగా, ఇవి ప్రకృతివనరుల్ని విచక్షణా రహితంగా పునరుత్పత్తి కాలేని స్థాయిలో విధ్వంసం చేస్తూ జీవవైవిధ్యాన్ని హరింపజేస్తున్నాయి. అందువల్ల, భూగోళంలో మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐక్యరాజ్యసమితికి వివిధ దేశాల సమన్వయంతోనే జీవవైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుంది. విలసిల్లుతూ కొనసాగుతున్న భిన్నజాతుల వైవిధ్యం ఆరోగ్యకర ప్రకృతి, పర్యావరణాలకు చిహ్నాలు. సుస్థిరాభివృద్ధికి జీవవైవిధ్య పరిరక్షణ కీలకావసరం. 'ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ కన్జర్వింగ్‌ నేచర్‌)' ప్రకారం అన్నివిధాలుగా అధ్యయనం చేసి, గుర్తించిన జంతుజాలాల్లో వెన్నెముకగల జీవుల్లో (వర్ట్బెబ్రేట్స్‌) 25 శాతం, ఉభయచరాల్లో (ఆంఫీబియన్స్‌) 5 శాతం, సేద్యమవుతున్న వృక్ష జాతుల్లో 70 శాతం మేర జీవవైవిధ్యం తగ్గిపోయింది. అభివృద్ధి పేరుతో అడవుల నరకివేత, ప్రకృతి విధ్వంసం ఈ నష్టాలకి మూలకారణాలు. ఆలస్యంగానైనా ఈ విధ్వంసం వల్ల రాగల దుష్పరిణామాల్ని పసిగట్టిన మన సమాజం 'జీవవైవిధ్యం.. జాతుల పరిరక్షణ..' కు సంబంధించి పలు కార్యక్రమాల్ని చేపట్టింది. వీటిని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
'పక్రృతి, జీవవైవిధ్య పరిరక్షణ' మన సంస్కృతి, ఆచారాల్లో భాగంగా పురాతన కాలం నుండీ కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, ఖనిజాల సేకరణ పేరుతో జరిగిన, జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, పెద్దపెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, పునరుత్పత్తి శక్తికి మించి అడవుల వినియోగం జీవవైవిధ్య విధ్వంసానికి దారితీస్తుంది. ముఖ్యంగా వలసకాలంలో, ప్రపంచీకరణలో ఈ విధ్వంసం ఎన్నోరెట్లు పెరిగింది.
పరిరక్షించే పద్ధతులు..
జీవవైవిధ్యం.. జాతుల పరిరక్షణ.. ప్రధానంగా రెండు పద్ధతుల్లో కొనసాగుతోంది. వివిధ జాతుల నివాస స్థలంలోనే పరిరక్షించడం (ఇన్‌సిటు కన్జర్వేషన్‌్‌) మొదటి పద్ధతి. సహజ నివాస స్థలాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయడం రెండో పద్ధతి.
జాతీయ పార్కులు, జీవరక్షిత కేంద్రాలు, ప్రకృతి వనరుల రక్షణ కేంద్రాలు, రక్షిత అడవులు, భద్రతనిచ్చే నివేశిత స్థలాలు నివాస స్థలంలోనే పరిరక్షించే (మొదటి) పద్ధతి కిందకు వస్తాయి. దీనిలో భాగంగా 1936లో '(జిమ్‌) కార్బెట్‌ జాతీయ పార్కు' ఏర్పాటు చేయబడింది. ఇటువంటి కేంద్రాలలో ఎటువంటి మానవ కార్యక్రమాలనూ అనుమతించరు. అయితే, రక్షిత ప్రాంతాల్లో మాత్రం కొన్ని పరిమితమైన కార్యక్రమాలను అనుమతిస్తారు. జీవ రక్షిత కేంద్రాలలో వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తారు. అయితే, ఈ ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఉండవచ్చు. ఇలా మన దేశంలో ఏడు జాతీయ జీవ రక్షిత కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రత్యేక అటవీ రక్షిత కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో (జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజిమెంట్‌ స్కీం) పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. వీటిలో పర్యావరణ, ఆర్థిక కార్యక్రమాల్ని సమన్వయంతో కొనసాగిస్తారు. మన దేశంలో దాదాపు 4.2 శాతం భూభాగంలో స్థానిక జీవ పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్దేశించబడింది. దీనిలో 85 జాతీయ పార్కులు, 448 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
జంతు ప్రదర్శనశాలలు, వృక్ష సంరక్షిత కేంద్రాలు (బొటానికల్‌ గార్డెన్స్‌), అటవీ సంస్థలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా నిర్వహించడం 'వేరే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కేంద్రాల ఏర్పాటు' (రెండో) పద్ధతి కిందకు వస్తాయి. వీటిలో సాధ్యమైనన్ని పంటలు, జంతువులు, పక్షులు, చేపల రకాలను సేకరించి, స్వేచ్ఛగా పెరుగుతూ జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే లక్ష్యంతో జాతీయ, వృక్ష జన్యు వనరుల బ్యూరో (నేషనలన్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జెనిటిక్‌ రీసోర్సెస్‌), జంతు జన్యు వనరుల జాతీయ బ్యూరో (నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎనిమల్‌ జనటిక్‌ రీసోర్సెస్‌) తదితర సంస్థలు మన దేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో లక్షలాది జాతుల జన్యువులు భద్రపరచ బడ్డాయి. ఇతర ప్రాంతాల నుండి తెచ్చి, పునరుత్పత్తి చేసి పూర్తిగా అంతరించిన నివాస స్థలాల్లో విడుదల చేసి, మళ్లీ పెరిగేలా దోహదపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విధంగా ప్రత్యేక మొసలి జాతి (గంగానదిలోని ఘర్‌వాల్‌ రకం) ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో విడుదల చేయబడినాయి. విత్తన బ్యాంకులు, వృక్ష, ఫల సంరక్షిత (బొటానికల్‌, హార్టికల్చరల్‌ రిక్రియేషన్‌) తోటలు కూడా ఇలా వృక్షజాతుల్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. స్థానిక పరిరక్షణా కార్యక్రమాలకు తోడు బయట పరిరక్షణా కార్యక్రమాలు అదనంగా తోడ్పడుతున్నాయి.
జన్యు బ్యాంకులు..
ఇది అత్యంత ఆధునిక పద్ధతి. పునరుత్పత్తి కాగల రూపంలో ప్రత్యేకంగా ఏర్పర్చిన జన్యు బ్యాంకుల్లో వివిధ జంతుజాలాల 'జన్యువులను' సేకరించి, నిల్వ వుంచుతారు. ముఖ్యంగా సేద్యమయ్యే వృక్ష జాతుల వైవిధ్యాన్ని (విత్తన రూపం) పరిరక్షించడానికి ఈ బ్యాంకులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అంతరించే ప్రమాదంలో వున్న జంతువుల ఆడ, మగ జన్యు కణాల్ని కూడా నిల్వ వుంచడానికి ఈ బ్యాంకులు ఉపయోగపడు తున్నాయి. విత్తన బ్యాంకులు, 'కణజాల (టిష్యూ)' బ్యాంకులు, మొగ్గలు, ఇతర వృక్షభాగాల కణజాలాల్ని నిల్వ వుంచుతున్నారు. 'అతి శీతల' బ్యాంకుల్లో విత్తనం లేక అండాన్ని ద్రవ నత్రజనిలో -196 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ వుంచుతారు. అంతరించే ప్రమాదంగల జీవుల్ని పరిరక్షించడానికి ఇవి తోడ్పడతాయి. 'పుప్పొడి' బ్యాంకుల్లో నిల్వ వుంచిన పుప్పొడి నుండి అంతరించే ప్రమాదంగల మొక్కల్ని ప్రత్యేక సాంకేతికంతో పునరుద్ధరించవచ్చు.
క్షేత్రస్థాయి జన్యు బ్యాంకులు
జన్యువుల పరిరక్షణ కోసం క్షేత్రాల్లో వైవిధ్యభరితమైన మొక్కల్ని పెంచుతూ పరిరక్షించవచ్చు. తద్వార అన్ని మొక్కల లక్షణాలనూ, వైవిధ్యాల్ని గుర్తించి, రికార్డుల్లో నిక్షిప్తం చేయవచ్చు. అయితే, దీనికి ఎక్కువ భూమి, వనరులూ అవసరమవుతాయి. ఈ విధంగా కేంద్ర వరి పరిశోధనా సంస్థ కటక్‌లో 42 వేల వరి రకాల్ని దాచిపెట్టింది. ఇలా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఇఆర్‌) మన దేశంలో దాదాపు అన్ని పంటల్లోని రకాల్ని సేకరించి, పరిరక్షిస్తుంది. ఫిలిఫైన్స్‌లోని మనీలా వద్దగల అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రంలో లక్షకు పైగా వరి రకాలు పరిరక్షింపబడు తున్నాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
అంతర్జాతీయ కృషి...
జీవవైవిధ్య సదస్సు (కన్వెన్షన్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ) 1993 డిసెంబరులో ప్రారంభమైంది. ఇదేవిధంగా ఆహారం, వ్యవసాయం కోసం వృక్ష, జంతు వనరుల అంతర్జాతీయ ఒప్పందం 2004 నుండి ప్రారంభమైంది. ఈ రెండు సంస్థలూ ప్రపంచంలో దొరికే అన్ని జీవజాతుల పరిరక్షణా కార్యక్రమాలను సమన్వయపరు స్తున్నాయి. జన్యువును అందించిన దేశం యొక్క హక్కుల్ని పరిరక్షిస్తూనే ఇతర దేశాలకు అవసరమైనప్పుడు వారు కోరిన గుణగణాలు కలిగిన రకాల్ని అందించడానికి ఈ సంస్థలు తోడ్పడుతున్నాయి. పరస్పర అంగీకారంతో ఇది జరుగుతుంది. ఇలా సేకరించే దేశాలు తమ తమ చట్టాలకు లోబడి 'క్వారంటీన్‌' నిబంధనల్ని పాటిస్తున్నాయి.
ప్రాధాన్యత.. హాట్‌-కోల్డ్‌ స్పాట్స్‌..
ప్రపంచస్థాయిలో పరిరక్షించాల్సిన జీవజాతుల్ని ప్రాధాన్యతతో గుర్తించి, ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ రెడ్‌ లిస్టును ప్రకటిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం 'హాట్‌ స్పాట్స్‌'గా గుర్తించడానికి ఒకేచోట 1500లకు పైగా జాతులు ఉండాలి. ఈ జాతుల్లో 70 శాతం వైవిధ్యం తరిగిపోవాలి. జీవవైవిధ్యం గల ఈ హాట్‌ స్పాట్‌లను గుర్తించి, అంతరించే జాతుల్ని పరిరక్షించాలి. కానీ, వీటిని గుర్తించడం ఖర్చుతో కూడికున్న ప్రక్రియ. ఒకే ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని తెలపడాన్ని 'కోల్డ్‌ స్పాట్స్‌'గా గుర్తిస్తున్నారు. 'హాట్‌-కోల్డ్‌ స్పాట్‌'ల గుర్తింపు పరోక్షంగా జీవవైవిధ్య వ్యాప్తిలో కొన్నిచోట్ల కేంద్రీకరణ చూపుతుంది. ఉదాహరణకు కేవలం 25 హాట్‌ స్పాట్‌లు భూభాగంలో కేవలం 1.4 శాతం మాత్రమే ఆక్రమిస్తున్నాయి. వీటిలో అన్ని ఉన్నత వృక్ష జాతుల్లో 44 శాతం, వెన్నెముకగల నాలుగు గ్రూపుల్లో 35 శాతం జాతుల్ని గుర్తించారు. ఈ హాట్‌ స్పాట్‌లలో కేంద్రీకరించి, కొద్ది ఖర్చుతో ఎక్కువ జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. ఈ కోల్డ్‌ స్పాట్‌లలో జీవవైవిధ్యం హాట్‌ స్పాట్‌ల కన్నా 10 రెట్లు వేగంగా అంతరిస్తుంది. ఒకవేళ హాట్‌ స్పాట్‌ల పరిరక్షణకే పరిమితమైతే స్టెఫీలు (ఒక విధమైన గడ్డిజాతి పెరిగే ప్రాంతం), సెరింగేటీ, అర్కెటిక్‌ లేదా టైగా ప్రాంతాలు జీవవైవిధ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కమ్యూనిటీ విత్తన బ్యాంకు..
మన రాష్ట్రంలో మెదక్‌ జిల్లాలో జహీరాబాద్‌ మండలంలో ప్యాలవరం గ్రామంలో 34 మంది మహిళా రైతులు కమ్యూనిటీ జన్యు (విత్తన) బ్యాంకులను నిర్వహిస్తున్నారు. బెట్టను తట్టుకోగల చిరుధాన్యాల (రాగి, కొర్రలు తదితర) పంటల్లో స్థానికంగా దొరికే రకాలను పరిరక్షిస్తున్నారు. వీరంతా 'మనుగడ సేద్యం' చేస్తున్నారు. వీరు పరిరక్షించే రకాలన్నీ బెట్ట పరిస్థితుల్ని తట్టుకోడానికి దోహదపడుతున్నాయి. పెరుగుదలకు అవసరమైన పోషకాల్ని అందించగలుగుతున్నాయి. ఇంత సంక్షోభ సమయంలో కూడా వీరు తమ పంటల వైవిధ్యాన్ని కాపాడుకొంటూ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొని, జీవించ గలుగుతున్నారు. వీరిలో ఆత్మహత్యలు లేవు. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన జన్యుపర వైవిధ్య పరిరక్షణ అవసరాన్ని నిర్ధారించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇలా మరెన్నో కమ్యూనిటీ జన్యు (విత్తన) బ్యాంకులు కావాలి.
ఇక్రిశాట్‌ కార్యక్రమాలు..
హైదరాబాద్‌లోని ఈ అంతర్జాతీయ సంస్థ జొన్న, సజ్జ, మంచి శనగ, కంది, వేరుశనగ, చిరుధాన్యాలు (రాగి, కొర్ర తదితరాలు) పంటలపై పరిశోధనల్ని కొనసాగిస్తోంది. ఈ పైర్లన్నింటిలో ప్రపంచంలో వున్న వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా అన్నిరకాల విత్తనాల్ని సేకరించి, పరిరక్షిస్తోంది. పునరుత్పత్తిని పరిరక్షించ డానికి విత్తనాల్ని నియంత్రిత ఉష్ణోగ్రత, తేమల వద్ద నిల్వ చేస్తోంది. దీనివల్ల పునరుత్పత్తి చేయవలసిన అవసరం తగ్గిపోతుంది. పునరుత్పత్తి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా, పునరుత్పత్తి సమయంలో ఒకోసారి జన్యుమార్పులు జరిగే ప్రమాదమూ వుంది. వీటికి తోడు వేరుశనగ, మంచిశనగల మూల రకాలు (వైల్డ్‌ వెరైటీస్‌) అవసరమైన పరిమాణంలో గింజల్ని ఇవ్వవు. వీటిని గ్రీన్‌హౌసుల్లో మామూలు చెట్లమాదిరి పెంచుతారు. అయితే, కంది, జొన్న, సజ్జ మూల రకాల్ని మామూలుగా క్షేత్ర జన్యు బ్యాంకుల్లో పెంచుతారు.
ఈ సంస్థ హైదరాబాద్‌లో మూడు స్థాయిల్లో జన్యు బ్యాంకుల్ని నిర్వహిస్తుంది. స్వల్పకాలంలో నిల్వ వుంచడానికి 18-20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత, గాలిలో 30-40 శాతం తేమ వద్ద విత్తనాల్ని నిల్వ వుంచుతుంది. మధ్యకాలిక జన్యు బ్యాంకుల్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత, గాలిలో 20-30 శాతం తేమ వద్ద విత్తనాల్ని నిల్వ వుంచుతుంది. దీర్ఘకాలం జన్యువుల్ని -20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ వుంచుతుంది. దీనికి బాధ్యతగల అన్ని పంటల్లో ప్రపంచంలో దొరికే వేలరకాల్ని సేకరించి, నిల్వ చేస్తుంది. వీటన్నింటినీ ఇలా నిల్వ చేయడంవల్ల పరిరక్షిస్తుంది. వీటిలో అభిలషించే లక్షణాలు గల ఆడ, మగ రకాల్ని తీసుకుని ప్రజననం ద్వారా కొత్తరకాల్ని రూపొందిస్తారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అవసరమైన దేశాలకు ఉచితంగా విత్తనాల్ని అందిస్తారు. అయితే, ఇలా విత్తనాల్ని పొందే దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధనలకు లోబడి వినియోగించాలి.

Tuesday, 18 September 2012

చినుకుల వేళ దోమలతో నరకమే..




‘‘ఇందుగలవందు లేవని సందేహము వలదు. దోమలెందెందు వెదకి చూసినా అందందే కలవు.. !’’
‘‘దోమలెక్కడున్నవీ.. దోమలెక్కడున్నవీ.. నీ చుట్టూనే తిరుగుతున్నవీ...’’- ఇవి ఎక్కడో చదివిన పేరడీలు.
చూడటానికి అవి చిన్న జీవులే అయినా ప్రాణాంతకమైన పెద్ద పెద్ద వ్యాధులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోయ దోమలు వృద్ధి చెంది, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులకు కారణమవుతున్నాయ. పలు ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి తమవంతు కృషిని వేగవంతంగా సాగిస్తున్నాయి. రక్తం లేకుండా మనుగడ సాగించలేని ఆడదోమలు ఈ వ్యాధుల విజృంభణకు కారణం. మగ దోమలవల్ల పచ్చటి పైర్లు నాశనమైతే, ఆడదోమలవల్ల మానవులు వ్యాధుల బారిన పడి కొందరు ఖరీదైన వైద్యంతో బతికి బట్ట కడితే.. పేదలు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు.
దోమల బారి నుండి మనలను మనం రక్షించుకోవాలి. జాలిపడి అవి మనల్ని వదిలేయటం జరగదు. వీటి కారణంగా చిన్న పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
దోమల నివారణకు నేడు రసాయనిక పదార్థాలతో తయారైన మస్కిటో కాయిల్స్, లిక్వడ్ వాడటం చూస్తున్నాం. తాత్కాలికంగా దోమల బెడద నుంచి తప్పించుకోవటానికి వీటిని వాడుతున్నాం. కానీ, దీర్ఘకాలంలో రసాయనాల వల్ల అనారోగ్యం కలిగే పరిస్థితి వుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే వీలుంది.
కొన్ని సాంప్రదాయక పద్ధతులను పాటిస్తే దోమల బారి నుంచి మనం బయటపడే అవకాశాలున్నాయ.
-ఒక పళ్లెంలో నీటిని పోసి అందులో కర్పూరం బిళ్లలను వేయండి. కర్పూరం వాసనకు దోమలు దూరంగా వెళతాయి.
-పలుచటి గుడ్డలో కర్పూరం కట్టి దానిని చిన్న పిల్లలకు మొలలో కట్టినా ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు. స్వశక్తితో దోమలు తరమలేని పిల్లలకు ఈ విధంగా మేలవుతుంది.
-దోమతెరలను వాడటం మరీ మంచిది. దీనివలన ఎలాంటి అనారోగ్యం కలిగే అవకాశం లేదు. శిశువులకు గొడుగు మోడల్‌లో ఉండే దోమతెరలు వాడటం మంచిది.
-కరెంట్ చార్జింగ్‌తో పనిచేసే దోమల బ్యాట్స్ ప్రస్తుతం వాడుకలోకి వచ్చాయి. వాటి ద్వారా దోమలను దగ్గరకు రాకుండా నిరోధించడంతోపాటు పూర్తిగా నివారించే వీలుంది.
-దోమలు దగ్గరకు రాకుండా తీసుకునే జాగ్రత్తలతోపాటు వాటి అభివృద్ధిని నిరోధించే చర్యలు కూడా అవసరం. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయ్యే దోమల నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వీలయినంత వరకూ దోమల బారినుండి బయటపడటానికి కృషి చేయడం కంటే, వాటి ఉత్పత్తి నివారణకు అవసరమైన మార్గాలను ఎచుకోవడం మంచిది.
- నీటి గుంటలు, మురికి కాలువలు నివాస ప్రాంతాలకు దగ్గరగా లేకుండా చూసుకోవాలి.
-ఇళ్ళల్లో మంచినీటి తొట్టెలను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- మురుగు కాలవల్లో నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా వుండాలి.
-మురికి నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం వలన దోమల లార్వాలను చంపవచ్చు. తద్వారా దోమల ఉత్పత్తిని నిరోధించవచ్చు
- వ్యాధులకు గురయ్యాక వైద్యం కోసం వెంపర్లాడటం కంటే- ముందు జాగ్రత్తల ద్వారా దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి.

Sunday, 16 September 2012

ఆహారం .. ఆరోగ్యం..


ఆహారం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కలిసి మానవాభివృద్ధిని నిర్ధారిస్తాయి. వీటి ప్రాధాన్యతలను అందరి దృష్టికీ తీసుకురావడానికే ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 1 నుండి 7వ తేదీ మధ్య మన దేశంలో 'జాతీయ పోషక వారాన్ని (నేషనల్‌ న్యూట్రిషన్‌ వీక్‌)' జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 'జాతీయ ఆరోగ్యంలో తీసుకునే పోషకాలపై అవగాహన కీలకం' అనే ప్రధానాంశంపై కేంద్రీకరించి, ఈ వారోత్సవం జరుగుతుంది. ఆహార కొరత, అశాస్త్రీయ ఆహార అలవాట్లు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. దాదాపు 70 శాతం కుటుంబాలు పోషకాహార లోపాల్ని ఎదుర్కొంటున్నాయి. అవసరమైనన్ని మాంసకృత్తులు 27 శాతం కుటుంబాలకు అందటం లేదు. ఆరోగ్యకర ఎదుగుదలకు, కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన పోషకాహారాలను తీసుకోవడంలో అవగాహన లోపాలున్నాయని 'తాజా జాతీయ పోషకసర్వే నివేదిక' పేర్కొంది. తద్వారా తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కూడా ఇది తెలుపుతుంది. అనారోగ్యకర జీవనశైలి, ముఖ్యంగా శారీరకశ్రమ లేనప్పుడు కూడా పోషక అసమతుల్యతలను పెంచుతుంది. ఫలితంగా, ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు తదితరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, 'ఆరోగ్యకర ఎదుగుదల, కార్యకలాపాల నిర్వహణకు తోడ్పడే పోషకాహార అంశాల్ని' సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
జాతీయ పోషక పర్యవేక్షణ బ్యూరో సూచనల ప్రకారం చురుగ్గా ఉండే మనిషికి రోజుకు 400 గ్రాముల పిండిపదార్థాలు (బియ్యం, గోధుమలు, తదితరాలు), 80 గ్రాముల పప్పుధాన్యాలు (కందులు, మినుములు, పెసలు వంటివి), 300 గ్రాముల పాలు, 300 గ్రాముల కూరగాయలు, 30 గ్రాముల నూనె లేదా కొవ్వుపదార్థాలు అవసరం. కానీ, రోజుకు సగటున 345 గ్రాముల బియ్యం లేక గోధుమలు, 24 గ్రాముల పప్పుధాన్యాలు, 71 గ్రాముల పాలు, 43 గ్రాముల కూరగాయలు, 12 గ్రాముల నూనె / కొవ్వు పదార్థాలు మాత్రమే అందుతున్నాయని దీని తాజా నివేదిక తెలుపుతుంది. తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, పాలు, కూరగాయల లోటు తీవ్రంగా వుంది. ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 70 శాతం మేర రక్తహీనత ఉంది. దాదాపు 75 శాతం మంది మహిళలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గర్భిణీల్లో దాదాపు సగం మంది రక్తహీనతతో వుంటున్నారు. దీనివల్ల 20 శాతం పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. దీర్ఘకాల పోషకలోపాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం పురుషులు, 36 శాతం మహిళల్లో ఎదుగుదల సరిగ్గా లేదు. దాదాపు 16.7 కోట్ల మంది అయోడిన్‌ లోపంతో గొంతువాపు జబ్బులతో బాధపడుతున్నారు. ఏడాదికి దాదాపు 90 వేలమంది పిల్లలు పురిటిలోనే చనిపోతున్నారు. ఇక పోషకలోపాల వల్ల మధుమేహం, గుండెజబ్బులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. కాన్సరూ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో 16 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం మంది మధుమేహంతో బాధపడ్తున్నారు. ఇదేవిధంగా పట్టణాల్లో 7-5 శాతం, గ్రామాల్లో 3-5 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారు. కాన్సరూ క్రమంగా విస్తరిస్తోంది. లక్ష జనాభాకు 123 మంది స్త్రీలు, 113 మంది పురుషులు కాన్సరు బారిన పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన పోషకాహార లక్ష్యాల్ని నిర్దేశించింది. అవి..
* ఆకాంక్షలకనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడాలి.
* గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పోషకాల్ని అందించాలి.
* జన్యుపర అవకాశాల్ని పూర్తిగా వినియోగించుకునేలా పిల్లల్లో పుట్టుక బరువును మెరుగుపరుస్తూ, వారి ఎదుగుదలకు దోహదపడాలి. అలాగే కౌమారదశకు అవసరమయ్యేలా, వయస్సు మీరిన వారూ ఆరోగ్యంగా ఉండేందుకూ తోడ్పడాలి.
* సమతుల పోషకాహారాన్ని అందిస్తూ పోషకలోప రోగాలను నిరోధించేలా ఉండాలి.
* దీర్ఘకాల పోషక లోప జబ్బుల్ని నివారించేందుకు తోడ్పడాలి.
* పెద్దవారు ఆరోగ్యంగా ఉండేలా, వారి జీవితకాలాన్ని పెంచేలా ఉండాలి.
(జాతీయ పౌష్టికాహార సంస్థ, హైదరాబాద్‌ సమాచారం ఆధారంగా...)

బ్రెస్ట్‌ క్యాన్సర్‌కి మందు పనే..!


చురుగ్గా పనిచేస్తూ, రోజంతా చలాకీగా ఉంటూ, ఇంటిపనులూ, తోటపనులూ చేసుకునే మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. ఇటువంటి వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం 13% తక్కువగా ఉందట! అలాగే ఓ మోస్తరు వ్యాయామం చేసే స్త్రీలలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 8% తక్కువని తెలిసింది. శరీరశ్రమకీ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌కీ గల సంబంధంపై అనేక పరిశోధనలు జరుగుతున్నా ఈ తాజా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ పరిశోధన చేసిన యుకె శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

నొప్పుల్ని తగ్గించే కాఫీ..!


అల్పాహారంతోబాటు కాఫీ సేవించి కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ కూర్చుని పనిచేసుకుంటే వచ్చే నొప్పులు తగ్గుతాయని ఓస్లో యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. వేళ్లు, మణికట్టు, భుజాలు, మెడ ప్రాంతాలలో నొప్పులు కంప్యూటర్‌ వాడేవాళ్లకు మామూలుగా వచ్చేవే. కప్పు కాఫీ తాగిన తర్వాత గంటన్నరపాటు ఎటువంటి విశ్రాంతి లేకుండా పనిచేసినవారినీ, కాఫీ తాగకుండా అదేవిధంగా పనిచేసిన వారినీ అధ్యయనం చేశారు. రెండు బృందాలకూ నొప్పులు కలిగాయి. కానీ, కాఫీ తాగిన వారిలో ఇవి పెద్ద ఇబ్బంది కలగించలేదట! అంటే కాఫీ ఇలాంటి వారికి మంచిదే కదా..!

ఇంజెక్షన్‌తో బానపొట్ట మాయం!


ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే గుళికలున్న ఒక్క ఇంజెక్షన్‌ ఇచ్చి ఎంతటి బానపొట్టనైనా తగ్గించవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇటువంటి ఇంజెక్షన్‌ను ఎలుకలకి ఇస్తే ఒక్కసారికే పొట్టలోని కొవ్వు 20% తగ్గిపోయిందట! వేడిని ఉత్పత్తి చేసే కొవ్వు కణాలను మామూలు కణాలతో కలిపి కొత్తగా రూపొందించిన కణాలతో ఇది సాధ్యమైందని అంటున్నారు. కొవ్వు వెంటనే తగ్గినా, ఎలుకలు మళ్లీ బరువు పెరిగాయి. అయితే, ఆ కొవ్వు పొట్టలో మాత్రం చేరలేదట!

'మందుబాబు'ల్ని పట్టించే కెమెరా!


డింకెన్‌ డ్రైవింగ్‌ వీరుల్ని పట్టుకునేందుకు మన ట్రాఫిక్‌ పోలీసులు అష్టకష్టాలూ పడుతుంటారు. ఇప్పుడు 'మందు' మీదున్న వారిని కెమెరాలో చూస్తూ పసిగట్టవచ్చు. శరీరంలో ఉష్ణోగ్రతా మార్పులను బట్టి మందు ఎక్కువైందో లేదో చెప్పే సాఫ్ట్‌వేర్‌ని గ్రీసు పరిశోధకులు రూపొందించారు. దీనిని కెమెరాలో ఎక్కించి, తద్వారా ఒక మనిషివైపు ఫోకస్‌ చేస్తే ఆ వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలుసుకోవచ్చట! ఇటువంటి కెమెరాల వల్ల గుంపుల్లో, రద్దీ ప్రదేశాల్లో కూడా దూరం నుండే ఎవరు 'అదుపు'లో లేరో గమనించవచ్చు. మన దేశంలో ఈ సాంకేతికాన్ని ప్రవేశపెడితే మందుబాబులు కాస్త ఒళ్ళు దగ్గరలో పెట్టుకునే బయటకు వెళ్లాల్సి వస్తుంది! ముందుచూపుతో మందును మానేస్తే మంచిదేమో..!! మందుబాబులూ

కాంటాక్ట్‌ లెన్స్‌తో అంధత్వం!


కంటి అద్దాలు పెట్టుకోవడం ఇష్టంలేనివాళ్లు కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడటం పరిపాటి. కానీ అవే కాంటాక్ట్‌ లెన్స్‌లు ఏకంగా కంటిచూపునే దెబ్బతీసి అంధత్వానికి కారణం కావచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 'అకాంతమీబా' అనే ఏకకణ పరాన్నజీవి కాంటాక్ట్‌ లెన్స్‌పై ఉండే బాక్టీరియాని భక్షిస్తుందట! కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకున్న తరువాత ఈ పరాన్నజీవి కంటిపై ఉన్న కార్నియాను భక్షిస్తూ కంటిలోపలకు వెళ్తుందని తెలిసింది. ఈ ఏకకణజీవి దుమ్మూ, ధూళి, స్విమ్మింగ్‌పూల్‌లలోని నీటిలో కూడా ఉంటుంది. ఈ పరాన్నజీవితో ఇన్‌ఫెక్షన్‌ అరుదే కానీ, సోకిందంటే మాత్రం ఒక వారంలోనే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయట!

ప్రధానిగా కొనసాగించలేని వాస్తు శాస్త్రం



  • అశాస్త్రీయ ఆచారాలు - 18
దేవెగౌడ 1-6-1996లో భారత ప్రధాని అయ్యారు. ఆయన నివసించడానికి అధికారులు ఒక భవనాన్ని చూసి, దానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసి, ఆయనకూ, ఆయన కుటుంబసభ్యులకూ చూపించారు. ఆయన తన వాస్తు పండితుణ్ణి సంప్రదించారు. ఆ పండితుడు, ఆ భవనం దేవెగౌడ కుటుంబానికి అశుభం కలిగిస్తుందని చెప్పాడు. అంతే! దేవెగౌడ మరో భవనాన్ని చూడమని అధికారులను ఆదేశించారు. వారు మరో భవనాన్ని చూశారు. దేవెగౌడ వాస్తు పండితుడు ఆ భవనాన్ని సందర్శించి, అనేక వాస్తు మార్పులు సూచించారు. మొదటిది ఆ ఇంటి ముందు ఉన్న రెండు మెట్ల స్థానంలో మూడు మెట్లు ఉండాలన్నాడు. అప్పటివరకు ఉన్న మెట్ల ఎత్తు ఒక్కొక్కటీ ఆరంగుళాలు. వాటిని తీసి మూడు మెట్లు కడితే ఒక్కో మెట్టు ఎత్తు నాలుగంగుళాలే అవుతుంది. అది ఎక్కి దిగేవారికి ఇబ్బందికరం అవుతుంది. అందుకని అధికారులు రెండోమెట్టు కిందిభాగంలో నేలమీద ఒక రాయిని పరిచి 'అది మూడోమెట్టు' అన్నారు. రెండో వాస్తు మార్పుగా ఇంటిముందు తులసికోట ఉండాలనీ, దాని చుట్టూ వినాయకుడు, లక్ష్మి, రాధాకృష్ణుల చిత్రాలు టైల్స్‌ మీద చిత్రీకరించి ఉండాలనీ ఆ వాస్తువాది చెప్పాడు. కష్టపడి తులసి కోటను అధికారులు సంపాదించారు. గణేశుడు, లక్ష్మీ విగ్రహాలు కూడా దొరికాయి. కానీ రాధాకృష్ణుల బొమ్మ దొరకలేదు. గణేశ, లక్ష్మీ బొమ్మలతో పాటు వేరే దేవుని బొమ్మ ఉన్న సిరామిక్‌ టైలు అతికించబోయారు. కానీ, వాస్తు పండితుడు వేరే బొమ్మను అతికించడానికి అంగీకరించలేదు. చివరకు వారం, పదిరోజులు ఢిల్లీ అంతా గాలించి రాధాకృష్ణులున్న టైల్‌ను సంపాదించారు. వెంటనే తులసికోటకు చుట్టూ వినాయకుడు, లక్ష్మి, రాధాకృష్ణుల బొమ్మలున్న సిరామిక్‌ టైల్స్‌ను అతికించారు. వాస్తువాది సంతృప్తి చెందాడు. దేవెగౌడ కుటుంబం ఆ భవనంలోకి గృహ ప్రవేశం చేసింది. ఫలితం! ప్రధాని పదవిని చేపట్టిన 11 నెలలలోపే అంటే 13-4-1997న దేవెగౌడ ప్రధాని పదవి నుండి దిగిపోవలసి వచ్చింది! ఇదీ వాస్తు బండారం..!!

పాము పగ పడుతుందా?


  • ఎందుకని? - ఇందుకని!
పాము పగపడుతుందా?
-పి. కార్తీక్‌, నాన్నెబాలుర ఉన్నత పాఠశాల, 8వ తరగతి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా

పాము సరీసృపాలు (reptiles) అనే సకశేరుక (vertebrate) జంతు వర్గానికి చెందిన జీవి. పాముల్లో చాలా రకాలున్నాయి. ఎడారులు, సముద్రాలు కాకుండా మామూలు నేలభాగాల్లో, పొలాల్లో, ఇళ్ల దగ్గర, పొదల్లో, బావుల్లో, చెరువుల్లో, చెట్లమీద కనిపించే చాలా పాములు విషరహితం (non-poisonous). అవి కరిస్తే మనిషి చనిపోడు. ఏదైనా పదునైన ఇనుపతీగలు ఓ సెంటీమీటరు లోపలికి చర్మంలో గుచ్చుకొంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అంతకుమించిన సమస్యలు ఏవీ ఈ పామల కాటు వల్ల రావు. చాలామంది పాము అంటేనే భయం అనిపించడం వల్ల విషరహిత సర్పాలు కాటేసినా విషసర్పాలేమోనని, ఇక మరణం తథ్యం అనుకుంటూ బెంబేలుపడుతూ చాలామంది లేనిపోని సమస్యల్ని కొనితెచ్చుకుంటారు. కొందరు ఆ భయంతోనే గుండె ఆగి చనిపోతారు కూడా. పైన చెప్పినచోట్ల కనిపించే ఎన్నోరకాల పాముల్లో కేవలం మూడుపాములు మాత్రమే విషపూరితమైనవి (1) త్రాచుపాము లేదా నాగుపాము (cobra), 2. కట్లపాము (krait), 3. రక్తపింజెర (viper). వీటిని సులభంగా గుర్తించగలం. నాగుపాము పడగ ద్వారాను, పడగమీద ఉండే గుర్తు ద్వారాను దీనిని గుర్తించవచ్చును. కట్లపాము వీపు మీద నల్లని అడ్డగీతలు ఉంటాయి. ఇది చాలా పొట్టిగా ఉంటుంది. ఒక మీటరుకన్నా తక్కువే ఉంటుంది. నాగుపాము సైజు ఓ మోస్తరు నుంచి రెండు మీటర్ల వరకూ ఉంటుంది. రక్తపింజెర వీపుమీద '8' గుర్తుల్ని అడ్డంగా రాసి, చైనులాగా కలిపినట్లు మచ్చలు ఉంటాయి. రక్తపింజెరి కూడా రెండు మీటర్ల వరకూ పెరుగుతుంది. చెట్లపై కనిపించే పసిరిక పాము, చెరువుల్లో, బావుల్లో ఉండే నీటిపాము లేదా పూడుపాము, జెర్రిపోతు అనబడే పెద్దపాములు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవేవీ విషసర్పాలు కావు.
పాములు విషం కలిగినవైనా, విషం కానివైనా వాటికి చెవులు ఉండవు. కాబట్టి అవి మనిషి చేసే శబ్ధాల్ని, పాటల్ని, నాగస్వరాల్ని ఏమాత్రం వినలేవు. చెవిటివాని ముందు శంఖం ఊదినా వినిపిస్తుందేమోగానీ నాగుపాము, మరే పాము ముందర ఎంత గొప్ప నాగస్వరంతో 'నాగదేవతా రావా!' అనో 'నోము, పండించవా స్వామీ!' అనో అరిచి గీ పెట్టినా వినిపించుకోవు. ఎందుకంటే వాటికి చెవులే ఉండవు. పరిణామక్రమంలో పాముల చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి. పాములు కేవలం పొట్ట అడుగున ఉన్న చర్మం ద్వారా భూమి మీద మన కాలి అడుగుల వల్లో, కప్ప గెంతుల వల్లో కలిగే కంపనాలను మాత్రమే గుర్తించగలవు. పాము కళ్లు కూడా అంత గొప్పవేమీ కావు. పాములు రంగుల్ని చూడలేవు. పైగా వాటికి ద్విమితీయ దృష్టి (binocular vision) లేదు. అంటే వస్తువును నలుపు, తెలుపులోనే కాకుండా స్పష్టంగా కూడా చూడలేవన్న మాట. పాముల మెదడు చాలా చిన్నది. ఆ చిన్న బుర్రతో తన సంతానాన్ని కూడా తాను గుర్తించుకొనే శక్తి దానికుండదు. తన స్థావరమేదో కూడా కనుగొనడానికి నానా యాతన పడుతుంది. అలాంటి పాములు మనుషుల్ని గుర్తించి, పగ పడతాయనడం, అలా అనుకోవడం మూఢనమ్మకం అనే కన్నా అధిక అజ్ఞానం అనాలి. 'వాడివి పాము చెవుల్రా!' అని బాగా వినేవారిని అంటాం. కానీ మాట వినిపించుకోని చెవిటిమేళం కోసం అనాలి.
విషపాములు కరిచినా భయం లేకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడేందుకు 90 శాతం అవకాశం ఉంది. పాము కాటేస్తే మంత్రాలు ఏవీ పనిచేయవు. చికిత్సతోనే పాము కాటు నుంచి బతికి బయటపడతాం. పాముల పుట్టలో పాలుపోస్తే వాటికి చాలా అయిష్టం. ఎందుకంటే పాములు పాలు తాగవు. 'పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది?' అన్న ప్రశ్నను కృతఘ్నతకు చిహ్నంగా వాడతారు. పాముకు పాలుపోస్తే చస్తుంది కాబట్టి, అన్యాయానికి (పాలు పోసి పెంచేవారి దుర్భిద్ధికి) గుర్తుగా ఆ సామెత వాడాలి.
వచ్చేవారం మనం పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. అవి తింటాయా? నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా? అదెలా? పాములు కుబుసం విడవడం, బుస కొట్టడం చేస్తాయి? దానివల్ల ఏమీ ప్రమాదం లేదా? వాసన తెలుస్తుందా? వంటి వివరాలు తెలుసుకుందాం..!

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి..


భూగోళం వేడెక్కుతూ వాతావరణం మారుతున్న నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి ఒక ప్రధాన సమస్యగా మన ముందుకొచ్చింది. ఈ ఒడిదుడుకుల్ని తట్టుకోడానికి, అభివృద్ధిని కొనసాగించుకోడానికి కీలకమైంది జీవవైవిధ్యం. ఇప్పటి పరిస్థితుల్లో ఈ జీవవైవిధ్య పరిరక్షణ అతి ముఖ్యమైంది. సుస్థిరాభివృద్ధికీ, జీవవైవిధ్యానికీ గల అంతర సంబంధాల్ని నిశితంగా గుర్తించాల్సిన అవసరమూ ఉంది. ఈ లక్ష్యాలతోనే హైదరాబాద్‌లో అక్టోబర్‌లో 'జీవవైవిధ్యం-సుస్థిరాభి వృద్ధి' అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది. ఈ నేపథ్యంలో 'జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి..'లపై ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
భూగోళంలో వున్న భిన్న వృక్ష, జంతుజాతులు, ఆ జాతుల్లో వున్న మొత్తం తేడాలన్నింటినీ కలిపి జీవవైవిధ్యంగా పరిగణిస్తున్నాం. జీవావిర్భావం తర్వాత గత 3,500 కోట్ల సంవత్సరాలకుపైగా జరిగిన పరిణామక్రమంలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. నిపుణుల అంచనా ప్రకారం భూగోళంలో భిన్నమైన, గుర్తించగల 100 నుండి 300 లక్షల వృక్ష, జంతుజాలాలు వున్నాయి. కానీ, వీటిలో ఇప్పటి వరకు అధ్యయనం చేసి, గుర్తించగలిగింది సుమారు 14.35లక్షల రకాలు మాత్రమే. వీటిలో అత్యధికంగా 7.51లక్షల రకాలు కీటకజాతి కి చెందినవి. ఆతర్వాత 2.81లక్షల జంతుజాతికి చెందినవి. ఉన్నత వృక్షజాతికి చెందినవి 2.48లక్షల రకాలు గుర్తించబడినవి. ఇక మిగ తావి ప్రోటోజోవా, ఆల్గేలు, ఫంజీ, బ్యాక్టీరియా తదితరాలు. అడవుల్లో కొత్తగా అధ్యయనం చేస్తున్న కీటకజాతుల్లో ఆరింటిలో ఐదు కొత్తరకా లుగానే గుర్తించబడుతున్నాయి. తద్వారా మనం గుర్తించిన జంతు జాలాల కన్నా ఇంకా గుర్తించాల్సినవే చాలా ఎక్కువగా వున్నాయని ఈ ధోరణి తెలుపుతుంది. ఇలా గుర్తించిన రకాలలో కూడా అంతర్గతంగా ఎంతో వైవిధ్యం గుర్తించబడింది. ఉదా: వరి శాస్త్రీయపరంగా ఒకే ఒక మొక్క. కానీ దీనిలో మన దేశంలోనే వేల రకాలు గుర్తించబడ్డాయి. ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనే జీవప్రక్రియలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. ఇప్పుడు మారుతున్న వాతా వరణ, పర్యావరణ ధోరణిని తట్టుకోవడానికి ఈ వైవిధ్యం ఎంతో ఉప యోగపడుతుంది. ఈ వైవిధ్యమే లేకుంటే భూగోళంలో ఏ చిన్న దుష్ప రిణామం వచ్చినా ఈ రకాలు అంతరించి, మానవ ఆహారలభ్యత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఎదురవుతున్న సవాళ్లు..
పరిణామక్రమంలో, ముఖ్యంగా మారుతున్న వాతావరణ, పర్యావరణ పరిస్థితులవల్ల, ఇతర కారణాల వల్ల కొన్ని జాతులు కొత్తగా పుట్టడం, మరికొన్ని అంతరించిపోవడం మామూలుగా జరిగేవే. గత 20 కోట్ల సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒకటిరెండు కొత్త రకాలు ఏర్పడుతున్నాయి. ప్రతి 10 లక్షల సంవత్సరాల్లో సుమారుగా 3, 4 కొత్త కుటుంబాలు రూపుదిద్దుకున్నాయి. సగటున ఒకోరకం జీవి 20 లక్షల నుండి కోటి సంవత్సరాలు ఉంటుందని అంచనా. అయితే, పెద్దఎత్తున జాతులు అంతరించిపోయిన సందర్భాలూ వున్నాయి. ఉదా: డైనోసార్‌. అతి పెద్ద జంతువు. 60 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఇలానే అంతరించిపోయింది. ఆధునిక కాలంలో మానవ కార్యక్రమాలు భిన్న జీవజాతుల కొనసాగింపును ప్రమాదంలో పడేస్తున్నాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. పెద్దఎత్తున అంతరించిపోతున్న ఈ జంతుజాలాలకు ప్రధానకారణాలు..
. పెరుగుతున్న జనాభా..
మానవ జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రకృతి మీద ఆధారపడ టమూ పెరుగుతోంది. దీనికనుగుణంగా పెరుగుతున్న అవసరాల కోసం ఇతర జంతుజాలాల మీద దాడీ పెరుగుతోంది. గత 600 కోట్ల సంవత్సరాల్లో మానవాభివృద్ధిలో భాగంగా ఎన్నో అడవుల్ని నరికారు. పర్యావరణ పరిస్థితులూ మారాయి. దీంతో స్థానిక వాతా వరణ పరిస్థితులూ మారాయి. ఈ విధమైన కార్యక్రమాలు జీవ వైవిధ్యానికి పెద్ద ప్రమాదంగా కొనసాగుతున్నాయి.
. అధిక వేట..
దీని ఫలితంగా ఎన్నో వందలాది జంతువులు నశించిపోయాయి. మరెన్నో ఆ దిశలో వున్నాయి. ఆహారం, అలంకరణ, సరదా, లాభాల కోసం ఇలా ఎన్నో జంతుజాలాలు నశించిపోయాయి. ఇప్పుడు ఇలాంటి ఎన్నో జంతువుల్ని సంరక్షితశాలల్లో, ముఖ్యంగా జంతు ప్రదర్శనశాల, కృత్రిమంగా పెంచే అడవుల్లోనే చూడగలుగుతున్నాం.
. కనుమరుగు చేయబడుతున్న నివాసస్థలాలు..
అడవుల నరికివేత, గ్రామాల నిర్మాణం, వ్యవసాయభూములుగా మార్పు, మెట్ట భూముల్ని మాగాణీగా మార్చడం జీవవైవిధ్యాన్ని పెద్దఎత్తున దెబ్బతీస్తున్నాయి. ఉష్ణమండల అడవుల్లో 50 శాతం పైగా జీవవైవిధ్యం వుంది. అడవుల నరికివేత జీవవైవిధ్యాన్ని వేగంగా తగిస్తోంది.
. వలస తెచ్చిన జంతుజాలాలు..
మన అవసరాల కోసం ఎన్నో కొత్తరకాల్ని తీసుకొచ్చి స్థానికంగా పెంచుతున్నాం. ఇవి స్థానిక జంతుజాలాల్ని అంతరింపజేస్తున్నాయి. ఇలా ద్వీపకల్పాల్లో పెద్దఎత్తున జీవవైవిధ్యం అంతరించిపోయింది.
. కాలుష్యం.. వాతావరణమార్పులు..
కాలుష్యం, వాతావరణమార్పులు కూడా జీవవైవిధ్యాన్ని అంతరింపజేస్తున్నాయి.
. ఆధునిక ప్రజననం (బ్రీడింగ్‌) పద్ధతులు..
ఈ పద్ధతుల ద్వారా అధిక దిగుబడినివ్వగల కొత్తరకాల్ని రూపొం దించి, సేద్యం చేయడంతో పంటల్లో జీవవైవిధ్యం బాగా తగ్గిపోతుంది. వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి తదితర ఆహారధాన్యాలు, నూనెగిం జలు, పప్పుధాన్యాలు తదితరాల్లో మనదేశంలోనే ఎంతో వైవిధ్యం వుం డేది. కానీ, ప్రజననం ద్వారా అధిక దిగుబడి వంగడాలు సేద్యంలోకి తెచ్చిన తర్వాత, వీటి జీవవైవిధ్యం బాగా కుదించుకుపోతున్నాయి. ఇప్పుడు పత్తి పైరులో కొన్ని వందల రకాలు మాత్రమే సేద్యం చేయ బడుతున్నాయి. గతంలో వేలాదిరకాలు సేద్యమయ్యేవి. తాజాగా, బిటి పత్తి ప్రవేశపెట్టిన తర్వాత సేద్యమయ్యేవి వందకుపైగా రకాలకే పరి మితమయ్యాయి. ఈ కొత్త రకాలు ఏ కొద్దిపాటి ఒడుదుడుకుల్ని తట్టు కోలేక అంతరించే ప్రమాదమూ ఉంది. ఈ విధంగా జీవవైవిధ్యాన్ని కోల్పోవడం మానవ మనుగడకు, సుస్థిరాభివృద్ధికి ప్రమాదకరం.
జీవవైవిధ్య కేంద్రాలు (బయోడైవర్సిటీ హాట్‌ స్పాట్స్‌)..
ఈ కేంద్రాలు జీవవైవిధ్యానికి నిలయాలు. కేవలం అదే ప్రాంతా నికి చెందిన జాతులతో నిండి, వాటి ఉనికి మానవ కార్యకలాపాల వలన ప్రమాదానికి లోనైతే అటువంటి ప్రాంతాన్ని 'జీవవైవిధ్య కేంద్రాలు'గా పేర్కొంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం ఈ ప్రాంతాల్లో నివసించడం వీటి విశిష్టత. భూ ఉపరితలంపై దాదాపు 12 శాతం మేర ఈ కేంద్రాలున్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు (అమెజాన్‌ అడవులు, మలేషియా దీవులు) జీవుల మధ్య వైవిధ్యానికి నిలయాలు. 'నార్మన్‌ మేయర్స్‌' అనే బ్రిటిష్‌ ఆవరణ శాస్త్రవేత్త తొలిసారిగా 1988లో 'హాట్‌స్పాట్స్‌' అనే పదాన్ని వాడాడు. 'వావిలోవ్‌' అనే రష్యన్‌ శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా పలు జీవవైవిధ్య కేంద్రాలను గుర్తించారు. కనీసం 1500 పుష్పించే మొక్క ల జాతులు ఒక జీవవైవిధ్య కేంద్రంలో ఉండాలని కన్సర్వేషన్‌ ఇంట ర్నేషనల్‌ పేర్కొంది. ఇలా 25 కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. మనదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రాధాన్యత..

మానవ మనుగడకు, అభివృద్ధికి ఎన్నో జంతుజాలాలను వినియోగించుకుంటున్నాం. ఈ జంతుజాలాల మనుగడ, కొనసాగింపు ఇతర జంతుజాలాలు, పర్యావరణం మీద ఆధారపడి వున్నాయి. ఈ గొలుసులో ఎక్కడ బంధం తెగినా మానవ మనుగడ ప్రమాదంలో పడవచ్చు. ఉదా: పెరుగుతున్న వృక్షజాతి సంతతి తమకవసరమైన నత్రజనిని నేరుగా సేకరించి, వినియోగించుకోలేదు. ప్రకృతిలో ఒకరకం బ్యాక్టీరియా (ఉదా: అజిటో బ్యాక్టర్‌) నత్రజనిని మొక్క వినియోగించుకోగల రూపంలోకి మారుస్తుంది. ఇదేవిధంగా మనం వేసే సేంద్రీయపు ఎరువుల్లోని నత్రజనిని నేరుగా మొక్కలు స్వీకరించలేవు. ఈ ఎరువులు చివికి దానిలోని సేంద్రీయ నత్రజని నైట్రేట్‌ రూపంలోకి మారిన తర్వాతనే మొక్కలు స్వీకరిస్తాయి. ఇదే విధంగా రసాయనిక ఎరువుల్లోని అమైడ్‌ లేక అమ్మోనియా రూపంలోని నత్రజని నేరుగా మొక్కలు వినియోగించుకోలేవు. వీటిని నైట్రేట్‌ రూపంలోకి మారిన తర్వాతనే మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ మార్పులో కూడా బ్యాక్టీరియాలు ఇమిడి వున్నాయి. ఈ బ్యాక్టీరియా నేలలో లేకపోతే చెట్లు పెరగడం అసాధ్యం. ఫలితంగా, మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. నేలల్లో నత్రజనిని చెట్లకు ఉపయుక్తంగా మార్చే బ్యాక్టీరియాల మనుగడ నేలలోని వాతావరణం మీద, ఇతర సూక్ష్మజీవుల మీద ఆధారపడి వుంది. ఇదేవిధంగా, పరపరాగ సంపర్కంలో పుష్పించి, ఫలాల్నిచ్చే ప్రక్రియలో ఎన్నోరకాల కీటకాలు కీలకపాత్ర వహిస్తాయి. ఈ కీటకాలు అంతరించిపోతే మనకు 'ఫలాలు' అందవు. ఆ మొక్కలు కూడా అంతరించిపోతాయి. అంతిమంగా మానవ మనుగుడ ప్రమాదంలో పడుతుంది. అందువల్ల, మానవ మనుగడ కొనసాగింపుకు భూగోళంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం, బాధ్యత నేడు మన ముందున్నది.
మనదేశంలో...
సుసంపన్నమైన జీవవైవిధ్యానికి, తరగని జీవ సంపదకు భారతదేశం నిలయం. పలురకాల ఆవాసాలకు, ఆవరణ వ్యవస్థలకు, వాటి వైవిధ్యానికి మనదేశం పెట్టింది పేరు. ఉష్ణమండల వర్షారణ్యాల నుండి, ఆల్పైన్‌, సమశీతోష్ణ అడవులు, తీరప్రాంత చిత్తడి అడవులు, మడ అడవులు ఇలా ఎంతో వైవిధ్యభరిత జీవావరణ వ్యవస్థల్ని ఇక్కడ చూడవచ్చు. దేశంలో ప్రధానంగా రెండు జీవవైవిధ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వైశాల్యంలో కేవలం 2.4 శాతం ఉన్న మనదేశంలో 7.3 శాతం జీవజాతులు (సుమారుగా 89,451 జాతులు) ఉండటం విశేషం. జీవ భూగోళ ప్రాంతాలు పది ఉన్నాయి. వీటిలో ఎడా రులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఉష్ణ, సమశీతోష్ణ అరణ్యాలు, గడ్డి మైదానాలు, నదీపరీవాహక ప్రాం తాలు, అర్చిపెలాగో ద్వీపాలు, మడ (మాంగ్రూస్‌) అడవులు ఇందుకు నిదర్శనాలు. ప్రపంచపు 18 స్థూల వైవిధ్యం ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. క్షీరదాల్లో 7.6 %, పక్షుల్లో 12.6%, సరీసృపాలు 6.2%, ఉభయచరాల్లో 4.4%, చేపల్లో 11.7%, పుష్పించే మొక్కల్లో 11.7% మనదేశంలోనే ఉన్నా యంటే జీవవైవిధ్యపరంగా మనదేశ ప్రాధాన్యతను అంచనా వేయవచ్చు. ఆసియా ఏనుగు, బెంగాల్‌ పులి, ఆసియా సింహం, చిరుత, రైనాసెరాస్‌ వంటి ఎన్నోరకాల ప్రత్యేక జాతులకు మనదేశం ప్రసిద్ధి. ఈ జీవ వైవిధ్య కేంద్రాల్లోనే మనం పండించే అనేకరకాల మొక్కలు ఉద్భవించాయి. రకరకాల పంట మొక్కల ఉద్భవానికి నిలయమైన 12 కేంద్రాల్లో మనదేశం ఒకటి. ఇంతటి గొప్ప జీవవైవిధ్య వనరులు క్రమంగా అదృశ్యం అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అందుకే ముఖ్య వనరుగా, సంపదగా ఉన్న మనదేశ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు ఈ జరగబోయే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు' స్ఫూర్తినిచ్చి, కార్మోన్ముఖులను చేస్తాయని ఆశిద్దాం.
సుస్థిరాభివృద్ధి..
పక్రృతి వనరుల వినియోగంలో భవిష్యత్తుతరాల అభివృద్ధి అవకాశాలను దెబ్బతీయకుండా ఇప్పటి అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరాభివృద్ధి. దీనిలో పునరుత్పత్తి పొందలేని వనరుల (ఉదా: ఖనిజాలు) వినియోగం. పునరుత్పత్తి కాగల జీవవైవిధ్య వినియోగం, అనుకూల వాతావరణ పరిస్థితుల కొనసాగింపు ముఖ్యమైనవి.
విజ్ఞానం శాస్త్ర, సాంకేతికాలు అభివృద్ధి ద్వారా వచ్చిన పారిశ్రామిక విప్లవం తర్వాత అభివృద్ధి పేరుతో లేదా యుద్ధాలలో ప్రకృతివనరుల విధ్వంసం పెద్దఎత్తున కొనసాగుతుంది. దీనిని తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇచ్చే కార్పొరేట్‌ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వేగవంతం చేస్తుంది. ఫలితంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి కొనసాగింపు ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది.
ఉత్పత్తిలో వినియోగించే సాంకేతికాలు అభివృద్ధి స్వభావాన్ని నిర్ధారిస్తాయి. పునర్వినియోగం (ఖనిజ మూలకం), పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడే సాంకేతికాలను హరిత సాంకేతికాలుగా వ్యవహరిస్తున్నాం. ఇవన్నీ సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. అందువల్ల, సుస్థిరాభివృద్ధిలో జీవవైవిధ్య పరిరక్షణ కీలకపాత్ర వహిస్తుంది. దీనికోసం పర్యావరణ పరిరక్షణ, ముఖ్యంగా భూగోళం వేడెక్కడాన్ని నిలవరించడం, పునరుత్పత్తి కాగల ఇంధనాల వినియోగ పెంపు, కాలుష్యాన్ని నివారించగల సాంకేతికాలు, ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచే అన్ని సాంకేతికాలు అవసరమవుతాయి.

గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

గురజాడ జయంత్యుత్సవాలు 2లక్షల కరపత్రాలు.. లక్ష పోస్టర్లు


  • ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం
'దేశమంటే మట్టికాదోరు.. దేశమంటే మనుషులోరు..' గేయ రచయిత గురజాడ 150వ జయంతి ఉత్సవాల ప్రచారానికి జనవిజ్ఞాన వేదిక ఆధ్వరంలో రెండు లక్షల కరప్రతాలు, లక్షల పోస్టర్లు వేయనున్నట్లు ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం తెలిపారు. గురజాడ 150వ జయంతి సందర్భంగా దేశభక్తి పోస్టర్‌ను ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన వైతాళికుడని అన్నారు. అభివృద్ధి అంటే మనిషికి కూడు, గూడు ఉండాలనీ, సాటి మనిషిని ప్రేమించడం దేశభక్తి అనీ చాటిచెప్పారన్నారు. జెవివి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్‌ కె.సత్యప్రసాద్‌, ఎన్‌.శంకరయ్య మాట్లాడుతూ మనిషి కేంద్రంగా దేశభక్తి గేయాన్ని రచించిన ఘనత గురజాడకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి విద్యా విభాగం కన్వీనర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు, కోశాధికారి సి. మోహన్‌, నాయకులు రాజా, శ్రీనాథ్‌, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.