Friday, 21 September 2012

మేం మూఢనమ్మకాలకు వ్యతిరేకం.. ఏ మతానికి కాదు..


  • అశాస్త్రీయ ఆచారాలు19
'సుబ్బారావ్‌ రా..!' అని లోనికి వస్తున్న సుబ్బారావును ఆహ్వానించాను.
సుబ్బారావు వచ్చి కూర్చున్నాడు. మాటల్లో ఇలా అన్నాడు. 'కాంతారావ్‌! మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నువ్వు అనేక వ్యాసాలు రాస్తున్నావు. అవి చదువుతుంటే నాకొక అనుమానం వస్తుంది. ఆ సందేహాన్ని తీరుస్తావా?'
'ఏమిటా సందేహం?' నవ్వుతూ అడిగాను.
'నీవు రాసేదంతా హిందూమతానికి వ్యతిరేకమనిపిస్తోంది ఏమంటావ్‌?' అన్నాడు.
'మంచిప్రశ్న వేశావు సుబ్బారావు! సమాధానం చెబుతాను. అదేమిటంటే మూఢనమ్మకాలు వేరు, మతం వేరు. గొప్ప గొప్ప మత నాయకులు, మత ప్రచారకులు మతాన్ని గూర్చి ప్రచారం చేశారు; చేస్తున్నారు. కానీ వారు మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు; ఖండించారు; ఖండిస్తున్నారు. మూఢనమ్మకాలను వారు వ్యతిరేకించడం మత వ్యతిరేకం కానప్పుడు మేం జన విజ్ఞాన వేదిక వాళ్ళం ఖండించడం మత వ్యతిరేకమెలా అవుతుంది?'
'మూఢనమ్మకాల్ని మతపెద్దలే వ్యతిరేకించారా? ఎవరు? ఏమిటో? వివరించు' అడిగాడు సుబ్బారావు.
'చెబుతాను. జ్యోతిష్యాన్ని ఉదాహరణకు తీసుకో. జ్యోతిషమంటే హిందూ దేవతలైన సూర్యుడు, చంద్రుడు, శని మొదలైనవారి చలనాలకూ, వాటి పరిణామాలకూ సంబంధించిన విషయమనీ, అందువలన జ్యోతిష్యాన్ని విమర్శించడం అంటే హిందూమతాన్ని విమర్శించడమేననీ కొంతమంది జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. కానీ జ్యోతిష్యాన్ని ఒక గొప్ప హిందూమత నాయకుడైన స్వామివివేకానంద తీవ్రంగా ఖండించేవారు. జ్యోతిష్యాన్ని నమ్మవద్దంటూ ఆయన ఒక ఉపన్యాసాన్నే చేశారు. ఆయన రచనల సంకలనం (ఇంగ్లీషులో) ''ది సెలెక్టెడ్‌ వర్క్స్‌ ఆఫ్‌ స్వామీవివేకానంద, వాల్యూం 8''లో ''మాన్‌.. ది మేకర్‌ ఆఫ్‌ డెస్టినీ'' అనే ఉపన్యాసంలో జ్యోతిష్యం ఎంత అశాస్త్రీయమో వివరంగా తెలియజేశారు. వివేకానంద జ్యోతిష్యాన్ని విమ ర్శించితే, మత వ్యతిరేకత కానప్పుడు మేం విమర్శిస్తే, మత వ్యతిరేకమవు తుందా? అంతేకాదు సమాజంలోని అనేక మూఢనమ్మకాల్ని విమర్శిస్తూ, అత్యంత సరళమైన భాషలో వివేకానందుల వారు చేసిన ఈ ప్రకటనను చదువు..' అని నా వద్ద ఉన్న 21-7-2002 నాటి 'వార్త' అనే దినపత్రికను సుబ్బారావుకు అందించాను. దానిలో ఇలా ఉంది.
''ఒక బంగాళదుంప వంకాయకు తగిలితే విశ్వ ప్రళయం ఎన్నాళ్ళలో వస్తుంది? చేతులు శుద్ధి చేసుకోవడానికి పన్నెండుసార్లు మట్టితో తోముకొనకపోతే ఎన్నితరాల పితరులు నరకానికి పోతారు? జనాభాలో నాల్గవవంతు మంది తిండి లేక పస్తులుంటుండగా ఇలాంటి వ్యర్థ విషయాల గురించి రెండువేల సంవత్సరాలుగా చర్చిస్తున్నారు.''
అది సుబ్బారావు చదివిన తర్వాత ఇలా అన్నాను. ''సుబ్బారావ్‌! మూఢనమ్మ కాలను ఖండించిన మరో మతనాయకుని గూర్చి వివరిస్తాను. ఆయనే అరుణాచల నివాసి రమణమహర్షి. ఆయన చెప్పిన అంశాలను గూర్చి చాగంటి కోటేశ్వరరావు 10-9-2012న 'మాగోల్డ్‌' టి.వి. ఛానల్‌లో ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో వివరించారు. దాని సారాంశం ఇది. 'రమణ మహర్షిని కొంతమంది భక్తులు మూఢంగా ఆరాధించేవారు. ఆ మూఢారాధన ఎంతవరకు పోయిందంటే రమణమహర్షి స్నానం చేసిన నీటిని వారు తాగినా, ఆయన భోజనం చేసిన తర్వాత చెయ్యి కడిగిన నీటిని తాగినా తమ పాపాలు అన్నీ కడిగినట్లు పోతాయని భావించి, తూముల గుండా వస్తున్న ఆ నీటిని గ్లాసుల్లో పట్టుకొని తాగుతుండేవారు. ఇది రమణమహర్షి దృష్టికి వచ్చి వారిని తీవ్రంగా మందలించారు. ఇంకెప్పుడూ అలా చేయవద్దని హెచ్చరించారు.
(ఇతర మతాల నాయకుల ఖండనలు వచ్చేవారం..)
ఇలా మతనాయకులూ, మత ప్రచారకులూ మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. హిందూ మతనాయకులేగాదు, ముస్లిం, క్రిష్టియన్‌ మత నాయకులు కూడ మూఢనమ్మకాలను ఖండిస్తూనే ఉన్నారు. వాటిని వివరిస్తాను'' అని 24-8-2012 నాటి ''ది హిందూ'' పత్రికను సుబ్బారావుకిచ్చాను. దానిలో ''వదంతులు చిక్కగా, వేగంగా వ్యాపిస్తాయి'' అనే వార్త సారాంశమిది. ''షహీనానగర్‌ ఏరియా (హైదరాబాద్‌)లో ఒక బాలిక జన్మించిందనీ, ఆ అమ్మాయి 22-8-12 నాటి రాత్రి ఎవరైనా పిల్లలు నిద్రపోతే వారు చనిపోతారని చెప్పిందనే వదంతి హైదరాబాద్‌ పాతబస్తీలో ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ వదంతిని సెల్‌ఫోన్లు చాలా వేగంగా వ్యాప్తి చేశాయి. అంతే! పాతబస్తీలోని అనేక ప్రాంతాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రలేపి, వాళ్ళు మరల నిద్రపోకుండా ఉండేందుకు నానా తంటాలుపడ్డారు. కొంతమంది పిల్లలతో ఆటలాడించారు. కొంతమంది మోటారు సైకిళ్ళ మీదా, ఆటోలలోనూ వారిని తిప్పారు. అయితే, ముఖ్యమైన విషయమేమిటంటే, మత నాయకులు స్థానిక మసీదులలో ఏర్పాటు చేయబడిన లౌడ్‌స్పీకర్లలో వదంతులను నమ్మవద్దనీ, పిల్లలు నిద్రపోయినా ఏమీకాదనీ చెప్పడం జరిగింది. అయినా ప్రజలపై లౌడ్‌స్పీకర్ల ప్రచారం ఏమీ ప్రభావం కలిగించలేదు.'' కాబట్టి సుబ్బారావ్‌! అనేక సందర్భాలలో మతనాయకులు, మత ప్రచారకులు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం మనం గమనించవలసిన విషయం.
ఇక క్రిష్టియన్‌ మతనాయకులు కూడా మూఢనమ్మకాలను ఖండిస్తున్నారు. ఉదాహరణకు 17-9-1998 నాటి ఈనాడు పత్రికలోని ఒక వార్తను వినిపిస్తాను విను'' అని ఆ వార్తను చదివి వినిపించాను. ఆ వార్తలో ఇలా ఉంది. జ్యోతిష్యాన్ని గూర్చి పోప్‌ జాన్‌పాల్‌ ఇలా ప్రకటించారు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ధారించుకొనేందుకు, జాతకాలను తిరగేయాల్సిన పనిలేదు. రాశి ఫలాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హస్త సాముద్రికుల దగ్గరకు వెళ్ళవలసిన పనిలేదు. గ్రహబలాన్ని నమ్ముకోరాదు.''
కాబట్టి సుబ్బారావ్‌! మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తే, మతాన్ని విమర్శించినట్లు కాదు. ఎందుకంటే వాటిని తనకు తెలిసిన మేర మత నాయకులు ఖండిస్తున్నారు. మత ప్రచారకులు వాటిని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం మోసగాళ్ళూ, అవకాశవాదులే మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారాన్ని మత వ్యతిరేక ప్రచారంగా ప్రకటించి, మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేం ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు. కానీ, అన్ని మతాలవారూ మూఢనమ్మకాలను తరిమికొట్టాలి. శాస్త్రీయాలోచనా విధానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనదేశం శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగమిస్తుంది. ఆ రంగంలోని విజయాలు అన్ని రంగాలకూ విస్తరించి, మన దేశం ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏమంటావ్‌?'' అన్నాను.
''నీవు చెప్పింది ఆమోదయోగ్యం అంటాను'' అన్నాడు దృఢంగా సుబ్బారావు.
''సంతోషం'' అంటూ ముగించాను.
- కె.ఎల్‌.కాంతారావు జనవిజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment