విజ్ఞాన వీచిక డెస్క్
జాతీయ పోషక పర్యవేక్షణ బ్యూరో సూచనల ప్రకారం చురుగ్గా ఉండే మనిషికి రోజుకు 400 గ్రాముల పిండిపదార్థాలు (బియ్యం, గోధుమలు, తదితరాలు), 80 గ్రాముల పప్పుధాన్యాలు (కందులు, మినుములు, పెసలు వంటివి), 300 గ్రాముల పాలు, 300 గ్రాముల కూరగాయలు, 30 గ్రాముల నూనె లేదా కొవ్వుపదార్థాలు అవసరం. కానీ, రోజుకు సగటున 345 గ్రాముల బియ్యం లేక గోధుమలు, 24 గ్రాముల పప్పుధాన్యాలు, 71 గ్రాముల పాలు, 43 గ్రాముల కూరగాయలు, 12 గ్రాముల నూనె / కొవ్వు పదార్థాలు మాత్రమే అందుతున్నాయని దీని తాజా నివేదిక తెలుపుతుంది. తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, పాలు, కూరగాయల లోటు తీవ్రంగా వుంది. ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 70 శాతం మేర రక్తహీనత ఉంది. దాదాపు 75 శాతం మంది మహిళలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గర్భిణీల్లో దాదాపు సగం మంది రక్తహీనతతో వుంటున్నారు. దీనివల్ల 20 శాతం పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. దీర్ఘకాల పోషకలోపాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం పురుషులు, 36 శాతం మహిళల్లో ఎదుగుదల సరిగ్గా లేదు. దాదాపు 16.7 కోట్ల మంది అయోడిన్ లోపంతో గొంతువాపు జబ్బులతో బాధపడుతున్నారు. ఏడాదికి దాదాపు 90 వేలమంది పిల్లలు పురిటిలోనే చనిపోతున్నారు. ఇక పోషకలోపాల వల్ల మధుమేహం, గుండెజబ్బులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. కాన్సరూ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో 16 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం మంది మధుమేహంతో బాధపడ్తున్నారు. ఇదేవిధంగా పట్టణాల్లో 7-5 శాతం, గ్రామాల్లో 3-5 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారు. కాన్సరూ క్రమంగా విస్తరిస్తోంది. లక్ష జనాభాకు 123 మంది స్త్రీలు, 113 మంది పురుషులు కాన్సరు బారిన పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన పోషకాహార లక్ష్యాల్ని నిర్దేశించింది. అవి..
* ఆకాంక్షలకనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడాలి.
* గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పోషకాల్ని అందించాలి.
* జన్యుపర అవకాశాల్ని పూర్తిగా వినియోగించుకునేలా పిల్లల్లో పుట్టుక బరువును మెరుగుపరుస్తూ, వారి ఎదుగుదలకు దోహదపడాలి. అలాగే కౌమారదశకు అవసరమయ్యేలా, వయస్సు మీరిన వారూ ఆరోగ్యంగా ఉండేందుకూ తోడ్పడాలి.
* సమతుల పోషకాహారాన్ని అందిస్తూ పోషకలోప రోగాలను నిరోధించేలా ఉండాలి.
* దీర్ఘకాల పోషక లోప జబ్బుల్ని నివారించేందుకు తోడ్పడాలి.
* పెద్దవారు ఆరోగ్యంగా ఉండేలా, వారి జీవితకాలాన్ని పెంచేలా ఉండాలి.
(జాతీయ పౌష్టికాహార సంస్థ, హైదరాబాద్ సమాచారం ఆధారంగా...)
No comments:
Post a Comment