Tuesday, 18 September 2012

చినుకుల వేళ దోమలతో నరకమే..




‘‘ఇందుగలవందు లేవని సందేహము వలదు. దోమలెందెందు వెదకి చూసినా అందందే కలవు.. !’’
‘‘దోమలెక్కడున్నవీ.. దోమలెక్కడున్నవీ.. నీ చుట్టూనే తిరుగుతున్నవీ...’’- ఇవి ఎక్కడో చదివిన పేరడీలు.
చూడటానికి అవి చిన్న జీవులే అయినా ప్రాణాంతకమైన పెద్ద పెద్ద వ్యాధులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోయ దోమలు వృద్ధి చెంది, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులకు కారణమవుతున్నాయ. పలు ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి తమవంతు కృషిని వేగవంతంగా సాగిస్తున్నాయి. రక్తం లేకుండా మనుగడ సాగించలేని ఆడదోమలు ఈ వ్యాధుల విజృంభణకు కారణం. మగ దోమలవల్ల పచ్చటి పైర్లు నాశనమైతే, ఆడదోమలవల్ల మానవులు వ్యాధుల బారిన పడి కొందరు ఖరీదైన వైద్యంతో బతికి బట్ట కడితే.. పేదలు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు.
దోమల బారి నుండి మనలను మనం రక్షించుకోవాలి. జాలిపడి అవి మనల్ని వదిలేయటం జరగదు. వీటి కారణంగా చిన్న పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
దోమల నివారణకు నేడు రసాయనిక పదార్థాలతో తయారైన మస్కిటో కాయిల్స్, లిక్వడ్ వాడటం చూస్తున్నాం. తాత్కాలికంగా దోమల బెడద నుంచి తప్పించుకోవటానికి వీటిని వాడుతున్నాం. కానీ, దీర్ఘకాలంలో రసాయనాల వల్ల అనారోగ్యం కలిగే పరిస్థితి వుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే వీలుంది.
కొన్ని సాంప్రదాయక పద్ధతులను పాటిస్తే దోమల బారి నుంచి మనం బయటపడే అవకాశాలున్నాయ.
-ఒక పళ్లెంలో నీటిని పోసి అందులో కర్పూరం బిళ్లలను వేయండి. కర్పూరం వాసనకు దోమలు దూరంగా వెళతాయి.
-పలుచటి గుడ్డలో కర్పూరం కట్టి దానిని చిన్న పిల్లలకు మొలలో కట్టినా ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు. స్వశక్తితో దోమలు తరమలేని పిల్లలకు ఈ విధంగా మేలవుతుంది.
-దోమతెరలను వాడటం మరీ మంచిది. దీనివలన ఎలాంటి అనారోగ్యం కలిగే అవకాశం లేదు. శిశువులకు గొడుగు మోడల్‌లో ఉండే దోమతెరలు వాడటం మంచిది.
-కరెంట్ చార్జింగ్‌తో పనిచేసే దోమల బ్యాట్స్ ప్రస్తుతం వాడుకలోకి వచ్చాయి. వాటి ద్వారా దోమలను దగ్గరకు రాకుండా నిరోధించడంతోపాటు పూర్తిగా నివారించే వీలుంది.
-దోమలు దగ్గరకు రాకుండా తీసుకునే జాగ్రత్తలతోపాటు వాటి అభివృద్ధిని నిరోధించే చర్యలు కూడా అవసరం. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయ్యే దోమల నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వీలయినంత వరకూ దోమల బారినుండి బయటపడటానికి కృషి చేయడం కంటే, వాటి ఉత్పత్తి నివారణకు అవసరమైన మార్గాలను ఎచుకోవడం మంచిది.
- నీటి గుంటలు, మురికి కాలువలు నివాస ప్రాంతాలకు దగ్గరగా లేకుండా చూసుకోవాలి.
-ఇళ్ళల్లో మంచినీటి తొట్టెలను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- మురుగు కాలవల్లో నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా వుండాలి.
-మురికి నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం వలన దోమల లార్వాలను చంపవచ్చు. తద్వారా దోమల ఉత్పత్తిని నిరోధించవచ్చు
- వ్యాధులకు గురయ్యాక వైద్యం కోసం వెంపర్లాడటం కంటే- ముందు జాగ్రత్తల ద్వారా దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి.

No comments:

Post a Comment